| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| శ్రీరామ ముద్రికా ప్రదానము | ||
| క. |
అంగనఁ బొడఁగన నీ వి య్యంగను గడుఁ జాలువాఁడ వంచును, నాచే నుంగర మంపెను శ్రీ రఘు పుంగవుఁ, డిదె కొమ్మటంచు భూమిజ కిచ్చెన్. |
94 |
| ఉ. |
ఇచ్చినఁ జూచి, రామ ధరణీశ్వరు ముద్రికఁగా నెఱింగి, తా నిచ్చను మెచ్చి, యా కువలయేక్షణ యాత్మ గతంబునందు నీ వచ్చినదాని భావమును, వల్లభు చందము నేర్పడంగ, నేఁ జెచ్చెర నంతయుం దెలియఁ జెప్పుము నమ్మిక పుట్టునట్లుగన్. |
95 |
| వ. | అని విచారించి యిట్లనియె, | 96 |
| క. |
నిను విశ్వసింపఁ జాలను, వినుపింపుము నీ తెఱంగు, విభుని విధము నా కనవుడుఁ బావని తెలియఁగ వినయంబున విన్నవించె విస్ఫుట ఫణితిన్. |
97 |
| ఉ. |
రాముని డాఁగురించి, నిను రావణుఁ డెత్తుక వచ్చువేళ, నీ హేమ విభూషణావళుల నేర్పడ ఋష్య మహాద్రి వైచినన్ మే మవి తీసి దాఁచితిమి, మీపతి యచ్చటి కేఁగుదేరఁగాఁ దామరసాప్త నందనుఁడు తా నవి సూపినఁ జూచి మెచ్చుచున్. |
98 |
| సీ. |
అర్క సంభవునకు నభయంబు దయచేసి-దుందుభి కాయమ్ముఁ దూలఁ దన్ని, యేడు తాడుల సర్వ మేకమ్ముగాఁ ద్రుంచి-వాలి నద్భుతశక్తిఁ గూల నేసి, సుగ్రీవునకుఁ దార సుదతిగా నిప్పించి-యంగదు యువరా జనంగ నిలిపి, వారలతోడను వానర సైన్యంబు-లెన్నేని గొలువంగ నేఁగు దెంచి, |
|
| తే. |
మాల్యవంతంబునం దుండి, మనుజ విభుఁడు-నిన్ను వెదకంగ నందఱ నన్ని దిశలఁ బనుచునప్పుడు, దక్షిణ భాగ మరయ-నంగదునితోడఁ గొందఱ మరుగుదేర. |
99 |
| తే. |
వారి పంపున నవలీల వార్ధి దాఁటి వచ్చి సకలంబుఁ జూచి యీ వంకఁ గంటి రావణుఁడు వచ్చి నిన్ను నుగ్రంబుగాఁగఁ బలుకునప్పుడు నున్నాఁడఁ బాదపమున. |
100 |