ఇతిహాసములు మొల్ల రామాయణము సుందర కాండము
కపి వీరుఁడు రాక్షస వీరులను గసిమసంగుట
వ. అని విన్నవించినంతనే క్రోధరక్తాంతలోచనుం డగుచు, న
వ్వింశతి లోచనుండు విచారించి, వాఁడు రాముని పంపున వచ్చిన
దూత కాఁబోలు, వానిం జంపుం డని పదివేల రాక్షసులం బంపిన
129
క. ఉగ్రాకారుం డగుచు ద
శగ్రీవుం డనుపఁ దనుజ సంఘంబులు దా
మాగ్రహమునఁ జనుచు బలో
దగ్ర క్రోధాత్ము లగుచుఁ దాఁకిరి జడిమిన్‌.
130
ఉ. తాఁకిన యంత, వాయుజుఁడు తా నదలించి కఠోర రేఖతో
వీఁక నెదిర్చి పేర్చి, రణవీథి నిశాచర సైన్య మెల్ల నొ
క్కూఁకున వెంటనంటి సమదోగ్ర బలంబునఁ బాఱఁ బాఁఱఁగా
దోఁకను జుట్టి మోఁదె, బలు దుర్దములం దునుమాడె నందఱిన్‌.
131
క. అందునఁ జావక మిగిలిన
కొందఱు పఱతెంచి, యసుర కొల్వున మొఱ్ఱో
యందఱ మ్రింగెను, దానవు
లందఱకును వీఁడు దారుణాంతకుఁ డగుచున్‌.
132
వ. అని విన్నవించిన రాక్షసేశ్వరుం డగు రావణుండు మండిపడి,
పింగళాక్షుని, దీర్ఘజిహ్వుని, నశ్మవక్షుని, శార్దూలముఖుని, వక్రనాసుని,
బనిచిన, వారును దమ తమ బలంబులం గూడికొని రథారూఢులై
వచ్చి, యార్చుచుం దాఁకి, శస్త్రాస్త్రంబు లడరించిన, నవియెల్ల
లెక్కగొనక, యక్కరువలి కొడుకు దర్పంబునం బేర్చి,
వాల మల్లార్చి, యెదిర్చిన బలంబును బలువిడిగాఁ దోలి, పింగళాక్షుని
ద్రుంచి, దీర్ఘ జిహ్వుని దీర్ఘనిద్ర పుచ్చి, వక్రనాసుని
బరాక్రమంబునం జూర్ణంబు సేసి, యశ్మవక్షుని భస్మంబుఁజేసి,
శార్దూలముఖుని మర్దించి, నిర్వక్రమ పరాక్రమంబున గర్వించి, మరలి
మకరతోరణంబు నారోహించి, యార్చుచున్న సమయంబున,
133
క. చావక మిగిలిన దైత్యులు
రావణు కడ కేఁగి రాహుత్తుల పా
ట్లా వాయుజు సాహసమును
వే విధములఁ జెప్ప నతఁడు విస్మయపడుచున్‌.
134
మ. కుటిల భ్రూకుటి దుర్నిరీక్షణములం గ్రోధానల జ్వాల లు
త్కటమై పర్వఁగ, మంత్రి సూనుల, మహా గర్వాంధులన్‌, గ్రూరులన్‌
బటు బాహాబలు రార్వురం బనిచె, శుంభద్విక్రమాటోప మ
ర్కట పారీంద్రముమీఁద నుద్దవిడి సంగ్రామంబు గావింపఁగన్‌.
135
వ. ఇట్లు పనిచిన నా యార్వురును, 136
సీ. శతకోటి విక్రమ ప్రతిమానుఁ డైనట్టి-శతజిహ్వుఁ డత్యంత సాహసుండు,
రోషానలాభీల శేషాహి యైనట్టి-రుధిరాక్షుఁ డత్యుగ్ర రూప యుతుఁడు,
పర సైన్య కానన పావకుం డైనట్టి-రక్తరోముఁడు మహా రణబలుండు,
కఠిన శాత్రవ లోక గజ సింహుఁ డైనట్టి-శూరదంష్ట్రుఁడు లయ కాల హరుఁడు,
 
తే. వ్యాఘ్ర కబళుండు పృథుతరాహవ జయుండు-స్తనితహస్తుండు సాహసోదార బలుఁడు,
వీర లార్వురు నత్యుగ్ర వేషములను-రూఢి వెడలిరి ఘన రథారూఢు లగుచు.
137
క. తమ తమ బిరుదులు నెఱపుచుఁ
దమకంబున వెడలి రధిక దలములు గొలువన్‌
ఘుమఘుమ భేరీ రవ సం
భ్రమములతో మంత్రి సుతులు పావనిమీఁదన్‌.
138
వ. ఇట్లు కదిసి సింహనాదంబు లంబరంబునం జెలంగ, గజ తురంగ
శతాంగ సుభట నికరంబుం గూడి శస్త్రాస్త్రంబులం బొదివిన.
139
తే. వాల మల్లార్చి, బ్రహ్మాండ గోళమెల్ల
పగుల నార్చుచు, భుజ యుగం బప్పళించి,
రణము చేయంగ మకరతోరణము డిగ్గి
మంతు కెక్కిన యా హనుమంతుఁ డంత.
140
సీ. ఒక్కొక్క రథముతో నొక్కొక్క రథమును-విటతాటనంబుగా విఱుగఁ గొట్టి,
యొక్కొక్క గజముతో నొక్కొక్క గజమును-జాఁపచుట్టగఁ బట్టి చావఁ గొట్టి,
యొక్కొక్క హయముతో నొక్కొక్క హయమును-వాల ముఖంబునఁ గూలఁగొట్టి,
యొక్కొక్క భటునితో నొక్కొక్క సుభటుని-వడిఁ ద్రిప్పి చెక్కలు వాఱఁ గొట్టి,
 
తే. బాహుబల గర్వమునఁ బేర్చి, ప్రథన సీమ-మంత్రి సూనుల నార్వుర మడియఁ గొట్టి,
మకరతోరణమున విక్రమమ్ము మెఱయ-భీకరాకారుఁడై యుండెఁ బెచ్చు పెరిఁగి
141
క. ఆ రణ వీథిని నిలువక
పాఱిన హతశేషు లెల్లఁ బర్విడి, రాజ
ద్వారమున బొబ్బ లిడి, రా
ఘోరాజిని మంత్రి సుతులు కూలి రటంచున్‌.
142
వ. వారి పాటు విని రావణాసురుం డదరిపడి, యాజ్యాహుతిం బ్రజ్వరిల్లు
హుతాశనుం బోలి మండిపడి, ప్రహస్త తనూజుండగు జంబుమాలిం
గని, నీ వా వానరాధముని వధించి శీఘ్రమ్ము రమ్మని యనిపిన.
143
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - suMdara kAMDamu ( telugu andhra )