| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| అంగదాదులచే దధిముఖ పరాభవము | ||
| చ. |
దధిముఖుఁ డల్గి మండిపడి, తాఁ దనవారలఁ గూడి వచ్చి, బల్ విధముల సంచరించు కపి వీరులఁ గోపముతోఁడ జూచి, యీ మధువన మెల్లఁ గొల్లగొన మర్కట వల్లభు నాజ్ఞఁ ద్రోయ, మ మ్మధములఁ జేయ, నెంత ఘనులంచును బాఱఁగ వారి నుద్ధతిన్. |
238 |
| వ. |
ఇట్లు దండింపుచున్న దధిముఖునిపై నంగదాది వనచరులు గదిసి యాగ్రహంబున, |
239 |
| క. |
కొందఱఁ గఱిచియుఁ బొడిచియుఁ, గొందఱఁ దలపట్టి యీడ్చి కొట్టియు, గోళ్ళన్ గొందఱ వ్రచ్చియుఁ దన్నియు, నందఱ నొప్పింప వార లాగ్రహ వృత్తిన్. |
240 |
| క. |
వ్రయ్యలు వాఱంగ వ్రచ్చినఁ గ్రయ్యఁగ రక్తములు గ్రమ్మఁగా వడితోడన్ గుయ్యో మొఱ్ఱో యని వా రయ్యెడ సుగ్రీవు కడకు నరిగిరి భీతిన్. |
241 |
| వ. |
అరిగి, రామ లక్ష్మణులం గూడియున్న మిహిర నందనుం గనుంగొని, నమస్కరించి, మధువనంబునందు జరిగిన వృత్తాంతం బంతయు విన్నవించిన, వారల నాదరించి సుగ్రీవుం డిట్లనియె. |
242 |