| ఇతిహాసములు | మొల్ల రామాయణము | సుందర కాండము |
| దధివనమున వానర వీరుల యుత్సాహ క్రీడ | ||
| ఉ. |
వచ్చిన పావనిం గని, జవంబున నంగదుఁ డాదియౌ కపుల్ గ్రచ్చఱ భక్తితో నెదురుగాఁ జన, నందఱఁ గౌఁగిలించి, వా రచ్చటి కార్యమంతయుఁ బ్రియంబునఁ ద న్నడుగంగఁ, బోయి వే వచ్చిన చంద మేర్పడఁగ వారికిఁ జెప్పెను దప్పకుండఁగన్. |
227 |
| క. |
రఘువరుఁ డిచ్చిన ముద్రిక రఘువల్లభు దేవి కిచ్చి, రభసంబున నా రఘువరున కానవాలుగ రఘువల్లభు దేవిచేతి రత్నముఁ గొంటిన్. |
228 |
| మ. |
అని చెప్పన్ఁ విని, యంగదాదులు మహాహ్లాదంబునన్ బొంగి, పా వని బాహాబల సత్త్వముల్ వొగడుచున్, వర్ణింపుచున్, వే పునః పునరాలింగన మాచరింపుచు, వడిన్ భూషించుచున్ మ్రొక్కుచున్, ఘనతం బాడుచు నాడుచున్, బలువిడిన్ గర్వంబునన్ దాఁటుచున్. |
229 |
| శా. |
నేనే చాలుదు రావణాసురు తలల్ నేలం బడంగొట్టఁగా, నేనే చాలుదు వాని పట్టణము మున్నీటం బడం ద్రోయఁగా, నేనే చాలుదు దుష్ట దానవ తతిన్ నిర్భీతి దండింపఁగా, నేనే చాలుదు నంచుఁ బంతంబులు పూన్కిం బల్కుచున్ ద్రుళ్ళుచున్. |
230 |
| క. |
ఆ రాత్రి కీశు లందఱు మారుతితోఁ గూడి నిలిచి, మఱునాఁడచటన్ ధీరత దుర్ధర శైలము చేరం జని, నిద్రచేసి చిత్తము లలరన్. |
231 |
| వ. |
అమ్మఱునాఁ డుదయంబున మధువనంబులోఁ బ్రవేశింప నుద్యోగించి, యందఱకన్నను బెద్దవాఁడగు జాంబవంతునిం బిలిచి, నీవు శ్రీరామునకు హితుండవు, సుగ్రీవునకు మంత్రివి, కావున మాకు నొక బుద్ధి యానతిమ్ము. ఈ కపులు క్షుద్బాధావశంబునం బొరలి, మహాశ్రమంబును బొందియున్నవారు, గావున సుగ్రీవుని మధు వనంబున నుండెడు ఫలంబులం బరితృప్తులమై, రాముని సన్ని ధానంబున కేఁగుట లెస్స యని యంగద హనూమంతులు పల్క జాంబవంతుండును నత్యుత్సాహంబున నంగీకరించి, కపులం బురస్కరించుకొని, మధువనంబులో బ్రవేశించినంత. |
232 |
| సీ. |
ఒక్కఁ డాఁకొని కొమ్మ నూఁచినఁ బండ్లెల్లఁ-జేకొని తేర భక్షించు నొకఁడు, ఒక్కఁ డాఁకొని రేఁపు చున్నట్టి తేనియల్-తడయక కొల్లాడి త్రూగు నొకఁడు, ఒక్కఁ డాఁకొని కోయుచున్నట్టి కాయలు-మిన్నక యూటాడి మ్రింగు నొకఁడు, ఒక్కఁ డాఁకొని గోళ్ళ నొలిచినట్టి చివుళ్ళఁ-బుక్కిళ్ళ కొలఁదిగా బొక్కు నొకఁడు, |
|
| తే. |
తరువుపై నుండి తరువునకు దాఁటు నొకఁడు-పండ్ల కెటువంటి మ్రాఁకైన బ్రాకు నొకఁడు, దిగువఁ గూర్చుండి తరువున కెగురు నొకఁడు-పెద్ద పొడవున నుండి కుప్పించు నొకఁడు. |
233 |
| ఉ. |
కాయల వ్రేటు లాడుచును, గంతులు వైచుచుఁ, బూవు దీవలం దూయల లూగుచున్, దరువు లూఁపుచుఁ, బండ్లను బొట్టనిండఁగా మేయుచు, వెక్కిరింపుచును, మిన్నక దాఁటుచు, దోఁక లెత్తుచుం గూయుచు, నేల దూఁకుచును, గుంపులు గూడి కపీంద్రులెంతయున్. |
234 |
| క. |
వన మెల్ల గాసి చేయఁగ వన పాలకు లేఁగుదెంచి, వడిఁ గోపముతో డను నదలించిన, వారల హనుమంతుఁడు మొదలుగాఁగ నగ చరులెల్లన్, |
235 |
| క. |
మెడఁబట్టి వనములోపల వెడలఁగ నటు పాఱద్రొబ్బి, వెడలుం డన్నన్ దడయక దధిముఖుఁ డను తమ యొడయని కడ కేఁగి వార లుగ్రముగాఁగన్. |
236 |
| వ. | విన్నవించిన యంతనే. | 237 |