| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము |
| ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రముచే వానరసైన్యమును హతమార్చుట | ||
| క. |
పరవీరులపై వైశ్వా నరుచేఁ గొన్నట్టి చాపనారాచములుం బరిఘయు బ్రహ్మాస్త్రముఁ గొని దుర మొనరింపంగ వచ్చె దోర్బలశక్తిన్. |
54 |
| వ. | తదనంతరంబున. | 55 |
| క. |
తండోపతండములుగాఁ జండాశుగసమితిఁ బఱపి శైలశరాళిన్ గాండమయంబుగఁ జేయుచు భండన మొనరించె దైత్యపతిపుత్త్రుండున్. |
56 |
| సీ. |
మిన్నక రామసౌమిత్త్రులమీఁదను-బ్లవగసేనలమీఁద బాహుశక్తి బ్రహ్మాస్త్ర మడరింపఁ బటునినాదంబునఁ-బఱతెంచి వానరప్రతతిమీఁద బ్రహ్మమంత్రజ్ఞానపరు లైనవారి ని-ర్భంధంబుగాఁ జుట్టి పట్టి కట్టి తక్కినవారల నుక్కడగించినఁ-గనుఁగొని యమరేంద్రకంటకుండు |
|
| తే. |
వైరమెల్లను నేఁటితోఁ దీఱె ననుచు-మించి కెరలుచు విల్లెక్కు డించి పొదలి శాంతతను బొంది రాక్షసచక్రవర్తి-కడకు నేఁగెను వడి ముద్దుఁ గొడుకుఁగుఱ్ఱ. |
57 |
| క. |
మునినాయక విను మంతట దనమనుమలపాటు దెలిసి తనలోఁ దానే కనుఁగొనఁ జాలక పోయెనొ యనఁగను నపరాబ్దిలోన నర్కుఁడు గ్రుంకెన్. |
58 |
| క. |
అరవిందభవుని కరుణను వర మందినవాయుసుతుఁడు వసుమతిమీఁదన్ మఱి బ్రహ్మమంత్రజపముం బిరుదై యున్నట్టి యలవిభీషణుఁ డొకఁడున్. |
59 |
| వ. |
తక్కఁ దక్కినవా రెల్లను మూర్ఛాగతులై చచ్చినయట్లు పడి యున్న సమయంబున వాయుసుతుండు విభీషణుండును దమలో నెవ్వరు సచ్చిరో నొచ్చినవారెవ్వరో విచారింపఁదగు నని మహోగ్రాంధకారంబునడుమ నింగలపుఁ గొఱవులు పట్టుకొని రణరంగంబుఁ గలయ శోధింపుచువచ్చి శరతల్పంబున నున్న జాంబవంతునిం గని విభీషణుం డిట్లనియె. |
60 |
| క. |
భల్లూకేశ్వర! వానరు లెల్లను నృపవరులతోడ నిలమీఁదను మూ ర్ఛిల్లియుఁ జచ్చియు నున్నా రొల్లంబోవుచును దీని కుపమ యె టన్ననన్. |
61 |
| ఆ. |
అపుడు జాంబవంతుఁ డసురేశ నీవంకఁ గన్ను విచ్చి చూడఁ గానరాదు వాయుసుతుని మేలువార్త నాకిప్పుడు చెవులు సోఁకునటు చెప్పుమయ్య. |
62 |
| వ. | అనిన విని హనుమంతుండు. | 63 |
| చ. |
పదములఁ జేరి మ్రొక్కుచును బాణియుగంబును మోడ్చి నీ కృపన్ బ్రదికినవాఁడ నన్న నతిప్రీతినిఁ జేరఁగ దీసి నీవిటన్ బ్రదికితిగాన నీకతనఁ బార్థివముఖ్యునిసేన లన్నియున్ బ్రదుకునిజంబుగా నిపుడుపావనియంచుఁ బ్రియంబు సేయుచున్. |
64 |