| ఇతిహాసములు | మొల్ల రామాయణము | యుద్ధ కాండము - ప్రథమాశ్వాసము |
| హనుమంతుఁడు తెచ్చిన సంజీవనిచే వానర వీరుల పునర్జీవనము | ||
| వ. |
వినుము వాయునందనా! యాలవణసముద్రంబున్ దాఁటి హిమవంతంబును నిషధాచలంబును గడచి మేరుశైలంబును వెండికొండయును శ్వేతపర్వతంబును నతిక్రమించి ఘృత సాగరంబు లంఘించి ద్రోణగిరి మధ్యంబునం దున్న యౌషధ శిఖరంబునం గల సంజీవిన్యాది దివ్యౌషధంబులు గొనివచ్చి రాఘవప్రీతిగా సైన్యంబుల ప్రాణంబులు నిలిపి కీర్తి వడయుమని ప్రార్థించిన నియ్యకొని వాయునందనుండు వాయువేగ మనోవేగంబునం జని జాంబవంతుడు చెప్పిన దివ్యౌషధాచలంబునె కొనివచ్చి సకల సైన్యంబుల ప్రాణంబులు గాచి నిమేష మాత్రంబున నక్కొండ తొల్లింటి యునికిపట్టుననె నెలకొల్పి వచ్చెనపుడు. |
65 |
| క. |
ఇనుఁ డుదయపర్వతంబునఁ గనుపట్టినఁ దెల్లవాఱఁ గపిసైన్యములున్ జననాథుఁ గాంచి మ్రొక్కిరి జనపతియును వాయుసుతుని సంశ్లాఘించెన్. |
66 |