ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - తృతీయాశ్వాసము
సీతా లక్ష్మణ సుగ్రీ వాదులతోఁ బుష్పక విమానమున శ్రీరాముని పయనము
వ. ఇట్లు పుష్పకారూఢుండై చనుచుండి రామభూకాంతుండు కాంతా
రత్నంబునకుఁ జేయెత్తి చూపుచు సంగ్రామస్థలంబిదె రావణ
కుంభకర్ణాదులైన రాక్షసబలంబును మర్దించిన తా విదె సువేలాచలం
బిదె సముద్రంబునన్‌ బంధించిన సేతుబంధనం బిదె విభీషణుఁడు
మమ్ము శరణుచొచ్చిన ప్రదేశం బిదె సుగ్రీవుని కిష్కింధానగరం
బిదె ఋశ్యమూకాచలం బిదె వాయుతనూభవుండు మమ్ము బొడగన్న తా విదె
పంపాసరోవరంబునిదె కబంధుండను దానవుని వధించిన ప్రదేశం బిదె
జటాయు వనుపక్షీంద్రుండు నిన్ను గొనిపోవునప్పుడు రావణాసురుని తోడంబోరి
మడిసినస్థానం బిదె జనస్థానం బిదె దశవదనుండు నిన్నుఁ జెఱఁ గొని
పోయిన చోటిదె మాయామృగంబును బడనేసిన చోటిదె ఖర దూషణాదులు
నాతోడఁ బోరి పొలసిన తావిదె శూర్పణఖ యనుదాని ముక్కు సెవులుం
జెక్కిన యిక్క యిదె సుతీక్ష్ణుండను మునీంద్రుండు వర్తించు నాశ్రమం బిదె
యగస్త్యాశ్రమం బిదె యత్రి మహామునీంద్రుని పత్ని యనసూయాదేవి
యంగరాగంబులు నీకిచ్చిన చక్కియిదె విరాధుం డనురాక్షసుండు నిన్నుఁ
బట్టుకొనిపోవుచుండ విడిపించిన చోటిదె చిత్ర కూటాచలం బిదె
భరతుండు మనల నొడంబఱచి మరలఁ గొనిపోవ వచ్చినచోటిదె
గంగానది యల్లదే కనుంగొను మనిచెప్పుచు భరద్వాజాశ్రమంబుఁ
జేరం జని యచ్చటఁ బుష్పకంబుడిగ్గి యమ్మునీంద్రునకు నమస్కరించిన
నతండు రాముని దీవించిన మహానందంబు నొంది యనిలసంభవా! వేవేగ
నీవేఁగి నందిగ్రామమ్మున నున్న భరతునకు మారాక యెఱింగించి
రమ్మని యనిపిన.
125
క. అరుదెంచి చూచెఁ బావని
సురుచిరసౌభాగ్యభరతు శోభనచరితున్‌
విరచితపుణ్యస్ఫురితున్‌
నిరుపమసత్కీర్తి నిత్యనిరతున్‌ భరతున్‌.
126
వ. కనుంగొని వందనంబు సేసి కరంబులు మోడ్చి వినయంబున. 127
ఆ. భరతునకు రామభద్రుఁ డేతెంచిన
వార్తఁ జెప్ప వినుచు వాయుసుతుని
గారవించి నిండు కౌఁగిట జేర్చుడు
నగ్రజన్ముసేమ మడిగి యడిగి.
128
క. తల్లులు మువ్వురకును రఘు
వల్లభుఁ డేతెంచినట్టి వార్తలు దెలుపన్‌
బల్లిదుఁ డగు తనతమ్ముని
నల్లన సాకేతపురికి ననిపెన్‌ వేడ్కన్‌.
129
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - tR^itIyAshvAsamu ( telugu andhra )