ఇతిహాసములు మొల్ల రామాయణము యుద్ధ కాండము - తృతీయాశ్వాసము
అయోధ్యా నగర ప్రవేశము
వ. అట భరద్వాజాశ్రమంబున మజ్జనభోజనాదులాచరించి నాఁటి రాత్రి
నిలిచి మఱునాఁ డమ్మునీంద్రుని వీడ్కొని శ్రీరామచంద్రుండు
పుష్పకారూఢుండై చనుదెంచుచున్న యప్పుడన్నకు భరతుండు సకలసేనా
సమేతుండై తల్లులుందమ్ముండును నెదురేఁగి రాఘవేశ్వరు పాదారవిందంబులకు
వందనం బాచరించిన నతం డనుజన్ములఁ గౌగిలించుకొని లక్ష్మణసహితుండై
జనకరాజనందనం గూడి తల్లులు మువ్వురకుం బ్రణమిల్లి వార లతిస్నేహంబున
నిండుకౌఁగిళ్ళ నొత్తుచు దీవింపఁ దమలోఁదాము పెద్దపిన్న యంతరువుల
వందనంబులు సేసికొని మరలి నందిగ్రామంబున కేఁగి యచ్చటఁ బుష్పకంబు
డిగ్గి దాని కర్చన లిచ్చి కుబేరుని వీటికిఁ బొమ్మని యనిపి
భరతుమందిరంబు ప్రవేశించె నట్టి శుభసమయంబున.
130
క. దానంబు లిచ్చి భద్ర
స్నానంబులు సేసి భూషణంబులు పూఁతల్‌
చీనాంబరములుఁ బరిమళ
సూనంబులుఁ దాల్చి రధికశోభనలీలన్‌.
131
వ. ఇట్లు రామాది సోదరచతుష్టయంబును భూమినందనయును దపోవేషంబు
లుజ్జగించి రాజచిహ్నంబులు గైకొని దానవ వానరబలంబులం గూడుకొని
షడ్రసోపేతంబులైన భోజనంబులం బరితృప్తులై యారాత్రి గడపి
మఱునాఁడు గజతురగస్యందనాది వాహనంబు లెక్కి ఛత్రచామరాదులు
మెఱయ శంఖభేరీభాంకారంబు లుల్లసిల్ల వందిమాగధుల
బిరుదుకైవారంబులు సెలంగ నయోధ్యాపురంబుఁ బ్రవేశించి
నగరులోనికిఁ జొత్తెంచి వసిష్ఠానుమతంబున శుభముహూర్తంబున
భద్రసింహాసనంబునఁ బట్టభద్రుండై రామచంద్రుండు భూసురులకు
దానంబు లొసంగి యర్థార్థుల కిష్టార్థంబు లిచ్చి విభీషణసుగ్రీవాంగద
జాంబవద్ధనుమదాదులఁ బ్రియవచనంబులం దనిపి వారివారికిం
దగినపగిదిని గట్నంబులిచ్చి వీడ్కొలిపిన వారు నిజస్థానంబులకుం
జని రంత మహానందంబున.
132
ఆ. అశ్వమేధయాగ మన నొప్పు జన్నంబు
నెలమిఁ జేసి దివిజు లెల్ల మెచ్చ
లీలఁ బదునొకండు వేలేండ్లు ధరయేలెఁ
బరమధర్మమహిమఁ బ్రజలు వొగడ.
133
AndhraBharati AMdhra bhArati - molla rAmAyaNamu - yuddha kAMDamu - tR^itIyAshvAsamu ( telugu andhra )