కావ్యములు ఆంధ్ర పురాణము చాళుక్య పర్వము

ఆంధ్ర పురాణము
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి

శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితిమావహంత్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్
తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా స్సంపూజితా వ స్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజభవశ్రీకంధరా శ్శ్రేయసే.
    ‘నన్నయభట్టారకులు’

చాళుక్య పర్వము
క.శ్రీరాణ్మహేంద్ర నగరీ
సారస్వత మూలపురుష చరణాంబుజ సే
వారస జాగరితృ కుమా
రారూఢ కృపావిపాక! యస్మజ్జనకా!
1
మ.అమిత ప్రాభవ వైభవోదయము మెండై పండఁ జాళుక్యవం
శమునం బూచిన రాచపుట్టువులు ‘బీజాపూరు’ చేవాటు ప్రాం
తము “వాతాపి”ని వీడు చేసికొనియుండన్, నాఁడు బొంబాయిరా
జ్యమునం దొక్కెడ మోసులెత్తెను గుబేరారామ రోచీరమల్.
2
మ.తనశక్తిన్ సకలోత్తరక్షితి విభుత్వం బూను శ్రీహర్ష వ
ర్ధన భూనేత వరూథినీ వితతి నుత్సాహించి తోడ్తోడ “ద
క్కను” ముట్టన్, బులకేశి భూపుఁ డలవోకన్ వాని నోడించి పం
పెను; జాళుక్యుల లావుపెంపునకు నిల్పెన్ గెల్పుఁగంబమ్ములన్.
3
గీ.వరలుఁ బులకేశికిన్ విష్ణువర్ధనుండు
పొరయుఁ బొచ్చెములేని సోదరుఁడు; వార
లన్నదమ్ములు దిగ్విజయాభిలాష
మూని మ్రోఁగించి రపుడు ప్రస్థానభేరి.
4
మ.పులకేశి ప్రభుమౌళి విక్రమమునం బూర్వాంధ్రదేశమ్ము, నా
నల సర్వాంధ్ర మహాపయోధిఁ జుళుకింపన్ - వేంగి చాళుక్య రా
జులు చేసేఁత వరాహ చిహ్నముల మెచ్చుల్వోవు కేతూచ్చయం
బులతోఁ దెల్గుజగమ్ముఁ గ్రమ్మి రొక తెంపుం బెంపు మున్నాడఁగన్.
5
గీ.వేంగినేలఁ బాలించిన ‘విష్ణుకుండి’
నృపతుల జయించి పులకేశి నిలిపె నచట
విష్ణువర్ధనుఁ; జాళుక్యవిభుత నిండి
నాఁటినుండియు నీ తెన్గునాఁడు మెఱసె.
6
వ.విష్ణువర్ధనుని సంతానమువారెల్లఁ బూర్వచాళుక్యులు, వేంగీచాళుక్యులు నా విలసిల్లిరి; విష్ణువర్ధనుండు నిజాగ్రజుండగు సత్యాశ్రయ పులకేశికిం బ్రతినిధియై కొంతకాలముండి, పదంపడి స్వతంత్రుం డయ్యె.7
చ.తెలుఁగునఁ దూర్పుహద్దులకుఁ దీర్పరులైన చళుక్యభూమినే
తల సమకాలమందుఁ దెగుదారులు ‘కంచి’ పురమ్ము నేలువా
రలు నగు పల్లవాధిపులు ఱంపిలి యొక్కెడఁ బశ్చిమాంధ్ర భూ
తలమును ముట్టి రుజ్జ్వలవిధా పరిణద్ధ బలప్రతాపులై.
8
మ.బలవద్గుప్తి నెసంగినన్ బెనుపగన్ బాదామి చాళుక్య రా
జుల రాజ్యమ్మును సర్వముం దిగిచి కొంచున్ రాష్ట్రకూటాన్వయ
స్థులు పాలించిరి మాల్యఖేట పురమందు న్నిల్చి - యా ఱేండ్ల చూ
పులు రారాపిడివెట్టె వేంగిధర పెంపుల్‌నింపు చాళుక్యులన్.
9
క.తైలపుఁ డనియెడి పశ్చిమ
చాళుక్య ప్రభుని దీమసముతో నభితో
హాలహలాగ్నిజ్వాలా
జాలమ్మగు రాష్ట్రకూట శక మసిఁబోయెన్.
10
గీ.తైలప నృపాల మౌళి సంతానభవులు
పశ్చిమ చళుక్య విఖ్యాతిఁ బడసి రపుడు;
హైదరాబాదు పొరుగు కల్యాణి నగర
మా చళుక్యుల రాచవీడై చిగిర్చె.
11
మ.నిజబాహా స్పృహణీయ విక్రమకళా నిష్కాసితారాతులై
ప్రజలం బువ్వులబాటవెంట నడపింపంగల్గి వేంగీపతుల్‌
విజయాదిత్యులు విష్ణువర్ధనులు నాఁ బేరందుచున్ గొంద ఱ
క్కజులై యేలిరి తూర్పుఁదె ల్గరుణరేఖాశ్రీలఁ దేలించుచున్.
12
గీ.నాలుగవ విజయాదిత్యుచూలి, “అమ్మ
రాజరాజమహేంద్ర” భూరమణమౌళి
యుగయుగమ్ములు తనకీర్తి మిగులుకొనఁగ
నిరవుకొలిపెను “రాజమహేంద్రవరము”
13
మ.ద్రవిడక్ష్మాతల మాక్రమించుకొని యుద్దండించి పాలించు ప్రా
భవ సంపన్నులు చోళ భూపతులు సంబంధమ్ము బాంధవ్య గౌ
రవముం జూపుచుఁ గేలుఁగేల్గలిపి పూర్వప్రాంత చాళుక్య భూ
ధవులం గూడిరి స్వీయపక్ష బల సంధా సంప దుత్కంఠులై.
14
రాజరాజోదయము
మ.అమృతాకాంక్షలు వీచి, సప్తమ శతాబ్దారంభ కాలోప్తమై
కమనీయాకృతి లేచి ప్రాక్తన చళుక్యక్ష్మాప సంతాన సా
లము నిండార్చిన కొన్ని మేల్‌రకపుఁబండ్లన్ మాధురీ సారవం
తముగా మంతునకెక్కె నొండొకటి యుద్యద్రాజరాజాంకమై.
15
శా.బాలారిష్టము లారవంగెఁ; బెజ యిబ్బందుల్ తొలంగెన్ శతా
బ్దీ లోలాలకకుం బదేండ్ల వయసబ్బెన్; నిర్భరానందుఁడై
చాళుక్యాధిప విష్ణువర్ధనుఁడు రాజ్యంబేలఁగాఁ దూఁగు టూ
యాలన్ లీలగ నూఁగె దేశరమ భాగ్యం బెల్ల రగ్గింపఁగన్.
16
చ.రణధరణిన్ మహాబలపరాక్రమదక్షులు వీరపాళి కా
రణముగ మెల్లఁగా సుఖకరంబగు సుస్థితి వచ్చె; నుత్తరా
యణ మరుదెంచి యేలుబడి నడ్డిన మబ్బులు విచ్చె; బద్ధకం
కణుఁడు చళుక్యభానుని చొకారపుఁ దేజము హెచ్చె నెల్లెడన్.
17
వ.విమలాదిత్యుం డటులు వేంగి రాజ్యమును భరించి యేడేండ్లు మాత్రము పాలించినవాఁడయ్యును నా కొలందికాలమున సర్వలోకాశ్రయుండనియు, ముమ్మిడి భీముండనియు బిరుదమ్ములం బడసి పెద్ద పేరందె.18
గీ.ఆచళుక్యేంద్రునకుఁ గుండవాంబయందుఁ
గలిగె నొకబిడ్డ; యాతఁడే తెలుఁగువారి
రాజరా జయి కృతిగ భారతముఁ గొన్న
సాధుమూర్తి కుమార విద్యాధరుండు.
19
మ.అతఁడే నాఁడును నేఁడు ముందుఁ దిరమై యాంధ్రావనిన్ వెల్గు శా
శ్వతుఁ; డాతండె తెలుంగునేల నెపుడో జాతీయ చైతన్య సం
గతిఁ బొంగించిన ధన్యమూర్తి; యతఁడే కళ్యాణచాళుక్య భూ
పతియై రాజమహేంద్ర లక్ష్మి పులకింపం బెంచె వేంగీధరన్.
20
ఆ.వె.కుండవాంబ కడుపుఁ బండించి, పండిత
కవుల కోరికలను గారవించి
తొడరు కరుణఁ బ్రజల దోసిళ్ళు నిండించి
పేర్మినందె రాజ వీర సుతుఁడు.
21
చ.తెలుఁగులనిగ్గు, కన్నడపుఁ దీరులు, వేలుపు బాస కబ్బపుం
బలుకుల తీయమున్, దమిళ వాఙ్మయి తోయము లాకళించి, వె
న్నెల వెలుఁగుల్ వెలార్చి కమనీయతఁ బేర్చు తెలుంగుభారతిన్
వలగొనియెం జళుక్య నరపాలక బాలుఁ డుదారశీలుఁడై.
22
ఆ.వె.రసభరంబు రాజరాజు నెడందను
దీర్చి దిద్ది యాంధ్రి తివిచి నటులు
కడఁగి యించుకేనిఁ గరఁగింప లేదయ్యెఁ
దల్లివంకవారి తమిళ వాణి.
23
మ.చిననాఁటం దన తెన్గునాటి బుధు లాశీరాశి వర్షింపఁ బె
త్తన మారంగొని విష్ణువర్ధనుఁడు శ్రద్ధాధుర్యుఁడై కన్నత
ల్లినిఁ దండ్రిన్ ముదమందఁ జేయుచును నాలించెన్ సమస్తంబుఁ; బెం
చెను విజ్ఞానము; మించె వాఙ్మయ రసశ్రీ సాహితీ ప్రౌఢిమన్.
24
వ.తెనుంగు వాణిపై హృదయమ్ము నిలిపి చళుక్యకులోదయ మిహిరుం డవ్విష్ణువర్ధనుండు దేశీయకవి పండితులం గానిపించుకొని యాదరించుచుఁ దండ్రింజూచి రాజ్యతంత్రమ్ములు మనమ్మునకుఁ బట్టించుకొనుచుఁ దరుణమ్ము నచ్చినపు డేటి కెదురీఁదఁగల దిటవు సంపాదించి జగజాణయై యభిషిచ్యమానంబగు నీడున నుండె; నంత విమలాదిత్యుండు దురతిక్రమ నియత్యధీనుం డగుటయు -25
ఉ.మోసులుదేఱి మీసములు మొల్చెడి మవ్వపు జవ్వనానఁ గై
సేసెఁ జిరత్న రత్నముల చెక్కడపుంబని గల్గు స్వర్ణ సిం
హాసన; మాంధ్రరాజుల జయధ్వనులం బులకించి కుండవాం
బాసుతుఁ డా చళుక్యకుల వర్ధనుఁ డవ్యయ కీర్తి కాముఁడై.
26
సీ.శాలివాహన శక సంవత్సరములఁ దొ । మ్మిది నూర్లమీఁద నల్వదియు నాల్గు
జరుగుచు నుండఁగా శ్రావణ కృష్ణ ప । క్షద్వితీయా బృహస్పతి దినమున
నుత్తరాభాద్ర తారోదయమ్మున వణి । గ్లగ్నంబునన్ సుమాంగళ్య మడర
రవి సింహరాశి వర్తనమున నుండంగ । గ్రహసంచయము లుచ్చగతి మెలంగి
 
గీ.కడలుకొనఁ గుండవాంబిక కడుపు పంట । తెలుఁగుఁబుడమి దయాసుధ చిలుకుదంట
రాణ్మహేంద్ర మహాంధ్రసామ్రాజ్యపీఠిఁ । జెలువు తులకింపఁ బట్టాభిషిక్తుఁడయ్యె.
27
మ.అభిషిక్తుండగు రాణ్మహేంద్రుని సుధర్మాస్థానిలోఁ బండిత
ప్రభుఁడై యాదికవీంద్రుఁడై సుకృతియై వాఙ్నేతయై యుజ్జ్వల
ప్రభ నిండారెడి దివ్యతారఁ గనులారం జూడరే? యమ్మహా
సభలోనన్ గల నన్నిభట్టులు సురాచార్యత్వ లీలానటుల్.
28
సీ.తొలుకారు మెఱపుసందులు చీల్చి వచ్చు నా । కనుచూపు భావశీఘ్రతకు దాపు
హరి సుదర్శనము రమ్యత నాకళించు నా । మోము గభీరతాముద్ర గీము
గంధాక్షతలకుఁ జక్కనివాసి నిచ్చు నా । నుదురు మేధా సుసంపదకుఁ గుదురు
తిలతండులశ్రీనిఁ దలఁపించి మొలచు నా । బవిరిగడ్డము వయఃపటుత కెడము
 
గీ.నవిరళ ధ్యాన జప మహితాగ్నిహోత్ర
సంభవంబైన బ్రహ్మవర్చసము తొలఁకు
నా కుల బ్రాహ్మణుండె నన్నయ్య విబుధుఁ
డాంధ్రభారత కృతికిఁ గన్నయ్య యతఁడు.
29
సీ.భట్టారకులకుఁ జెప్పక క్రొత్తపుట్టముల్ । రవణముల్ తాల్పఁడు రాజరాజు
గురువుల యనుమతిఁగొని కాని వేసిన । తములమ్ము నమలఁడు ధరణిజాని
కవిమౌళి చిఱునవ్వు కనిపట్టి మఱి తాను । భాషించు శ్రీవిష్ణువర్ధనుండు
నన్నిపండితుల యానతిఁ దీసికొని కాని । మాటాడఁడు చళుక్య మన్మథుండు
 
గీ.తన కుల బ్రాహ్మణుఁడు, గురు, వనుఁగుమంత్రి । కావలయువాఁడు, నెచ్చెలి, దైవ, మఖిల
మా మహాత్ముఁడె యన నన్నపార్యు నరసి । మఱచుఁ బెఱజగ మమ్మహీపరివృఢుండు.
30
సీ.తనమీఁద నిండుపెత్తన ముంచి వచియించు । నధిపుఁ డేవేవొ రహస్యములను;
మరియాదమై నంతిపురముగాథలు కూడఁ । జెవిలోన నూఁదు భూధవుఁడు చేరి;
నమ్మిన మంత్రికైనను జెప్పని చళుక్య । పతి - పిల్చి లక్షసంగతులు నొడువుఁ;
దనకు బొత్తిగ దూరమున నున్న ‘రాజకీ । యము’ లెందులకొ చెప్పు నవనినేత
 
గీ.మతి బృహస్పతి నన్నిపండితుఁడు వినియు
మఱవవలె నని యివియెల్ల మఱచిపోవు;
నెప్పు డెవ్వని ముంగల నే ప్రసక్తి
నోరు జాఱని పరమగంభీరుఁ డతఁడు.
31
ఉ.చేసెడి చేఁతలందుఁ గవిసింహుని దీవన లూఁత మీయఁగా
వ్రాసెడి వ్రాఁతలందు నృపవల్లభు నాదృతి మూదలింపఁగాఁ
జేసెను నన్నిభట్టు రససింధు మహాంధ్ర కవిత్వరాజ్యమున్
వ్రాసెను రాజరాజు గుణవత్పరిపాలన కావ్యబంధమున్.
32
చ.తొడికొనియున్న క్రొమ్మడుఁగు దోవతిలో వెలిడాలుపెంపు వె
ల్వడ, బెడఁగారు నాబయిరవాసములో నిజసాత్త్వికత్వ మొ
క్కఁడు తొలఁకాడ బంగరువు గంటము నూని తెనుంగువాణికిం
దొడవులు దిద్దు నన్నయబుధుండు చళుక్యుల నిండు కొల్వునన్.
33
సీ.సంస్కృత ప్రాకృత సాహితీరసవేత్త । యాంధ్ర కర్ణాట వాగంబురాశి
జగదుపస్కృత కళాసన్మూర్తి యష్టాద । శావధారణ మహాచక్రవర్తి
సామెకాంబాగర్భ సర్వస్వ సస్యంబు । నకలంకశంకను నంకభూష
నన్నయార్జునుని వెన్నడియున్న కృష్ణుండు । తెనుఁగు భారతము మెచ్చిన వలంతి
 
గీ.యమృత మధురము నాంధ్రనాయకు నెడంద । నాకళించి నందమపూఁడి యగ్రహార
మందుకొన్నట్టి నన్ని నారాయణుండు । వాఙ్మయ ధురంధరుఁడు తత్సభాబుధుండు.
34
ఉ.నేయముఁ దీయమున్ మదుల నిండఁగ నేలినవాని భావి సు
శ్రేయము పెంపుగా నభిలషించిన పుణ్యులు- నన్నిభట్ట నా
రాయణభట్టు లిర్వురును రంగులు దిద్దఁ జళుక్యరాజు దే
శీయుల మెచ్చు లందుకొని చేసె స్వరాజ్యము ధర్మధోరణిన్.
35
మ.నీలువ న్నీడ యొకింత లేమి నెడ నెంతే వాడి తారాడు నీ
తెలుఁగు న్నిల్పి చళుక్య వంశ సుయశోదీపంబు నిత్య ప్రభో
జ్జ్వలముం జల్పిన రాజరాజునకుఁ బూర్వం బాంధ్రి కన్నీటి చా
ఱలు చాలై కదలింపలే దకట! యేరాజన్యు చిత్తాబ్జమున్.
36
చ.పరిణతమైన సంస్కృతముపైఁ గల ప్రేముడి యెంత చేసినం
దిరపడ దాంధ్రవాణియెడఁ దిన్నని తెన్ను్నఁ; దల్లిచాటుదై
పెరిఁగిన కారణమ్మొ, నడపింప వలంతుల మన్నవార లె
వ్వరు కనరామినో! తెలుఁగు బాసకుఁ జీకటు లాశతాబ్దముల్.
37
రాజరాజు సంభావనము
చ.తడిసిన కన్నులం దొక వ్యథాభర మూటలు వాఱ, వాతెఱన్
వడఁకులు మీఱ, భావమున నల్లనిమబ్బులు మూయ నేదియో
నొడువఁగ రాని శోకమున నోవుచునున్న తెనుంగువాణి మేల్
తొడవులు లేనిదాని వగతోఁ గని రాజనరేంద్రుఁ డాయెడన్.
38
గీ.తెరువుఁ దీరులు లేని యాంధ్రీయ వాణి
యఱగొఱల్ కని కడుఁ గనికరము నూని
తరఁగ తంపఱ వడువునఁ దలఁపు లిటులు
పఱపె లోలోన భావనాంబరము విరియ.
39
గీ.‘తీపు లొలికించి నేఁ డుండి రేపు పోవు
రాజ్యమును నమ్ముకొని, యక్షరమ్ములోని
శాశ్వతత్వము మఱచి భాషాసవిత్రి
నామతింపని యెకిమీని కేది యశము!
40
మ.మతము న్నీతియు సచ్చరిత్ర గుణసంపల్లబ్ధి విజ్ఞాన జీ
వితమున్ సర్వము వాఙ్మయాభ్యుదయగుప్తిం బెంపుదీపించు; భా
రతి కన్నీటికిఁ గాలువల్ వొడుచు నారంభంబు లీ నేలలో
శ్రుతిమించెన్; మఱి వీనిఁ ద్రుంచఁగల నేర్పుందీర్పు లొప్పారుతన్!
41
మ.నతు లర్పింతుము బిడ్డలందు నభిమానం బుంచుమమ్మా, కృత
జ్ఞతఁ జూపింతు మభిజ్ఞ శేఖరుల కాశాస్యంబు లిమ్మా, నిరా
కృతిఁ జూపించితి మిన్నినాళు లిది సైరింపంగదమ్మా, సర
స్వతి! దేశస్థులకుం గృపామతిని బ్రజ్ఞాభైక్షముం బంచుమా!
42
మ.అమృత ప్రాయము నీ కటాక్షరుచి కమ్మా! దోయిలిం బట్టినా
రము; రారమ్ము జ్వలత్కృశానుశిఖలార్ప న్నేర్పుమై మాప్రభు
త్వముఁ బండింపుము నీ దయాతిశయమున్ వర్షింపు మాశాంత దే
శము నీ కోసర మఱ్ఱు సాఁచికొనె విశ్వాసంబు నిండారఁగన్.
43
శా.ఛందస్సుందరమైన పద్యకవితా సారస్వతం బన్న, మా
డెందం బూరి సముద్రమై పొరలి గొండ్లిం జేయు నానంద ని
ష్యందంబై; ససిలేని కైతలకు లోనైయున్న నేఁడామహ
స్సౌందర్యం బెటుగూరు! భారతి భవిష్యంబింకఁ బొల్పారుతన్!
44
చ.నవకవితార్థగానము వినన్ సకుతూహలులై కళాపిపా
సువు లిట వేచియుండిరి; విశుద్ధతర స్వరరీతి గీతికా
రవము విపంచికం జొనిపి రాగరసప్రచురంబుగాఁగఁ బా
డవె విధిరాజ్ఞి! మాయెదలు డక్కఁగొనం గరుణార్ద్రచిత్తవై.
45
చ.సొగసులు మీఱి భావరసశోభితమై తగు నాదికావ్యపుం
జిగిబిగికూర్పులోన నిలిచెన్ రవివంశయశో విశాలతా
ప్రగుణత నేఁటిదాఁక నికరంబుగ; నెన్నొ గతించె నబ్దముల్;
యుగయుగముల్ గతించినవియున్; మఱిమాసెనె నాఁటి వెన్నెలల్?
46
గీ.వేదములు వేఱువేఱుగ వింగడించి
చూపిన మహర్షి వరుఁడు వ్యాసుండు లేక
కాలగర్భపుఁ గారుచీకటులు సోఁక
నీరసిలిపోదె, మన పురాభారతంబు.
47
మ.అని చింతించి తెలుంగుఱేఁడు హృదయం బార్ద్రంబుగా, వేఁడిగాఁ
గను నిట్టూరిచి శారదా చరణ సాక్షాత్కారముం గాంచెనో
యన నొక్కించుకసేపు మ్రానువడి సద్యస్సంభవంబైన భా
వన యేదో చపలాసదృక్ష మయి రేఁపన్‌ లేచె నొక్కుమ్మడిన్.
48
గీ.లేచి, యానాఁటి కేదొ యాలోచనమున
సుడివడుచు నన్యకార్యంబుఁ జూడ రోసి
తెల్లవాఱిన వెనుక నా తెలుఁగురాజు
కొలువునం జేరి నెఱిక్రొత్త వెలుఁగు విరియ.
49
వ.మంత్రి పురోహిత దండనాయక దౌవారిక మహాప్రధానానంత సామంత విలాసినీ పరివృతుండయి యపార శబ్దశాస్త్ర పారగులైన వైయాకరణులును భారత రామాయణా ద్యనేక పురాణ ప్రవీణులైన పౌరాణికులును మృదుమధుర రసభావ భాసుర నవార్థవచనరచనా విశారదులైన మహాకవులును వివిధతర్క విగాహిత సమస్త శాస్త్ర సాగర సార గరీయః ప్రతిభులైన తార్కికులును వైణిక గాయకులు నాదిగాఁ గలుగు విద్వజ్జనంబులు పరివేష్టించి కొలువ విద్యావిలాసగోష్ఠి సుఖోపవిష్టుం డయి యుండె, నంత-50
ఉ.పాయక కొల్యులో నుభయపార్శ్వములం గల నన్నిభట్ట నా
రాయణభట్ట శైలముల యంతరవీథిని రాజరాజు మో
దాయతి వెల్లియై తరఁగలాడి దిశాంచలముల్ కలంచుచున్
పాయలు పాయలై తిరిగి వచ్చి సభాంబుధిఁ జొచ్చె నేకమై.
51
ఉ.ప్రాణము ప్రాణమై తన ధరాపతికిం బ్రతిసత్కృతిన్ గురు
స్థానము నన్నిభట్ట కవితాదయితుండు - చళుక్యరాజు క
న్గోనలలోఁ గనుల్‌ కలిపికొంచు నెదో కవితార్థ భావనా
గానములో నెడంద దొలఁకం గొలువుం గయిసేసె మెచ్చుగన్.
52
శా.ఆనాఁడేవొ యపూర్వముల్ తలఁపు లూఁగాడం దటిద్వల్లికా
నూన శ్రేణులతోడ స్వీయహృదయం బూటాడి యుద్రిక్తమై
శ్రీనారాయణ నన్నిభట్ట మధురాశీశ్శ్లోక పాఠోల్లసద్
గానానంతర మిట్టె నిశ్చలము కాఁగా, వేఁగి భూపాలుఁడున్.
53
గీ.కన్నుఁగల్వలు కొఱనవ్వు వెన్నెలలకు
నడుమ నఱమూఁతవడ నాంధ్రనాయకతయు
వినయమును రాచపొలుపు కన్పింపఁ బలికెఁ
బరమ కవిగురు నన్నిభట్టరునిఁ గాంచి.
54
వ.“భట్టారకులవారి యాశీస్సువలన వేంగిరాజ్యశ్రీ మహోదయమునం జెంది యందగించెఁ; బరమేశ్వరానుగ్రహమ్మున నెందును మాకొక్క కొఱంత లే; దింక మా హృదయంబున సాహితీ రస పిపాసయు శ్రుతిమతోద్ధరణాశయుంగాక వేఱొకటి చొరఁబడదు.55
గీ.ఆంధ్రధారుణిఁ బెఱదారియందు నడచు
ప్రజల బాధ్యత యెల్ల మాపయిని గలదు;
తీవ నెటుత్రిప్ప నట్టులె తిరిగి పెరుఁగు;
బ్రజలమదు లెట్లు నడప నప్పగిది నరుగు.
56
క.కావున శ్రుతిమతధర్మపుఁ
దీవకుఁ జివురిచ్చి పూలఁ దేలించు వసం
తావిర్భావమునకు మీ
దీవన కావలయుఁ గవిసుధీమధుమూర్తీ!
57
వ.అదియు నక్షర రమణీయమై ప్రసన్న కథామధురంబై తెలుఁగు సారస్వతమునకు వెలుఁగునిచ్చు కొండొక కవితావాఙ్మయ బంధమై యుండి యాంధ్రావళి హృదయంబులను ధర్మనిష్ఠామేదురంబులుగఁ జేయునది కావలయు; విద్యాదయితులగు భట్టారకులవారిపై నీ బరువు మోపం దలంపు కలిగె-58
చ.“విమలమతిం బురాణములు వింటి ననేకము లర్థధర్మ శా
స్త్రముల తెఱం గెఱింగితి నుదాత్త రసాన్విత కావ్యనాటక
క్రమములు పెక్కు సూచితి జగత్పరిపూజ్యములైన యీశ్వరా
గమములయందు నిల్పితిఁ బ్రకాశముగా హృదయంబు భక్తితోన్”
59
వ.అయినను మన్మానసంబున శ్రీ మహాభారతంబునందలి యభిప్రాయము విన నభిలాష మగ్గలంబై యుండు.60
ఉ.భారతగాథ మా హృదయభాండమునన్ సురధేనువై పయో
ధారలు పిండు; దాని బహుధా పలుబాసల నాస్వదించియుం
గోరిక సన్నగిల్ల; దెదుగున్ మన తెల్గున విందమన్న వాం
ఛారతి నాఁడునాఁటికి; విశారద! యీ తలఁపుల్ ఫలించుతన్!
61
మ.మతమే మానవజీవితమ్ము చివురింపంగా వసంతంబు; భా
రతియే తన్మతసంస్థకుం బరిగతప్రాణంబు; వ్యాసోక్త భా
రతమే భారతికిన్ మతంబునకుఁ దీర్థప్రాయ; మట్లౌట నా
కృతి నాంధ్రీకృతిఁజేసి దేశహిత మర్థిన్ గూర్పు మో సత్కవీ!
62
మ.ఇఁక సారస్వతమందు నీ రచనతో నేనాఁడును న్మాసిపో
వక భాసిల్లెడి నిత్యనూత్న శక ముత్పాదిల్లుతన్! తెల్గునా
టికిఁ జల్లారని వెల్గు నాటి రసధాటిం గ్రొత్తకబ్బంబు లాం
ధ్రి కలంకారము లౌత! మా కులము కీర్తి జ్యోతి పెంపారుతన్!
63
శా.నీ గంటమ్మునఁ దెల్గువారి మనసుల్ నిండించు పాండిత్యమున్
బ్రాగల్భ్యమ్ము - కవిత్వ శక్తియును - ధారారక్తి - ప్రత్యక్షర
శ్రీగంభీరిమ రమ్యతారుచు లెలర్చెన్; మత్పురాపుణ్యసం
యోగంబియ్యది; యో మహాకవి! మదాయూరశ్మి మేల్కొల్పవే!”
64
గీ.అనుచు నమృతాంశు వంశ మండనుఁడు పలుకు
పలుకు లమృతంబు గురియ - వెన్నెలలు విరియ
నన్నిభట్టారు నెడఁద చంద్రమణి కరణి
కరఁగి పరవశ మగుచుఁ దత్క్షణమ తేఱె.
65
వ.అట్లు తేఱుకొనిన యమ్మఱుసటి ముహూర్తంబున భట్టారకుండు66
శా.ఆనందోదితభారసుందర మెదో యాయాసమున్ మోసిన
ట్టై నిట్టూరిచి - వెన్నుదీఱిచి సహాధ్యాయుండు ప్రాణంబు నౌ
శ్రీనారాయణభట్టపండితునిఁ జూచెన్; జూపులో నొక్క తే
జోనైశ్చల్యము దాఁపురింప, వెఱపున్‌ సొంపున్‌ గుబాళింపంగన్.
67
మ.వెనువెంటన్ సహపాఠికన్నుఁగవలో విప్పారి ధైర్యంపుఁ బెం
పును మేల్కొల్పెడితావి నిండుటెద నింపుల్ మీఱఁగాఁద్రావి, త
న్పున భట్టారకుఁ డిట్టు లుత్తరపు సొంపుల్ విప్పె నాస్థాన స
భ్య నికాయం బెనలారు నాత్మవినయం బగ్గించి యాలింపఁగన్.
68
ఉ.“పండిత మండలీ మహితభావ వనీ మధుమూర్తి! యో రసా
ఖండల! రాజరాజ! కలకండము పండిన నీదు వాక్కులం
దుండెను భావి భారత మహోదయ మాధురి; నేఁటిదాఁక బ్ర
హ్మాండమువంటి యింతహృదయంబును నెక్కడ దాఁచుకొంటివో!
69
ఉ.ఏలినవాని కిట్టి హితదృష్టియు - వాఙ్మయదృష్టి గూఢ రే
ఖా లలితంబుగాఁ బొలుచుకైవడి లోక మెఱుంగు నెన్నఁడో;
తేలుచుకొంటి నే నిపుడు దేవరకుం గల కావ్వ గౌరవో
ద్వేలత - భారతామర గవీ కమనీయ పయః పిపాసయున్.
70
చ.ఒడయని కీ తలంపు మది నుండుట తెల్గుజగంబు పున్నెపుం
దొడరిక గాదె? భారతముతోడ సదాతనమైన రాచవం
గడమున నీదుపుట్టుక యఖండ కృతజ్ఞత కాటపట్టు; నీ
కడఁ గొలువుండి యే నొకవికాసము మోసెదనేమొ భూవరా!
71
ఉ.కాని - చిరంబు కొల్వుకవిగాఁ, జెలిగా, సకలంబుగాఁగ, సం
స్థానములోననుండి మదిఁ జాలఁ దలం పిటు లుండికూడ నా
కానిక నీయలేనయితిఁ గబ్బము; నీ గతి రాజరాజుచే
నే నడిగించుకొంటి ననియే యొక సిగ్గును దగ్గు నొందెదన్‌.
72
మ.పరమార్థంబునఁ జూడ భారత మహాపాథోనిధానంబు నా
తరమా, పారముచేర బాహువుల నీఁదన్; సాదరంబైన నీ
యురు సంకల్పబలం బిదే కలముగా - నుద్యద్బుధాశీః పరం
పర చుక్కానుగ దాఁటెదం బయిని దైవంబుండి దాఁటించినన్.
73
క.నీతో నాంధ్రావని నొక
జాతివికాసమును గ్రొత్తశక ముదయించుం
గాత! మహాభారత కృతి
నేతృతఁ బడసెదవు జగము నినుఁ గొనియాడన్.
74
క.నీ యాజ్ఞనెంచి మా నా
రాయణభట్టారు సాయ మాసించి కృతిం
జేయుదు” నని పలికి సహా
ధ్యాయునిపై చూపు వఱపె నా కవివరుఁడున్.
75
ఉ.ఆయెడఁ గొల్వువారి కనులన్నియు డెందము లన్నియున్ మహా
ప్యాయముతోడ నొక్కపఱిఁ బండితబృంద పురందరుండు నా
రాయణభట్టుపై నిలువ, నాతఁడు తా నిలువెల్లఁ గన్నుగా
నేయరిఁ జూచి వెంట ధరణీపతి కిట్లనెఁ జారుధోరణిన్.
76
క.ఒకమనవి రాజరాజా!
సకలమ్మును వింటిఁ దనివి సన; దేవర కో
రికయును - మా భట్టారుల
ప్రకటనమును సంతసమ్ము వంతులు సేయన్.
77
ఉ.భారత పారిజాతమును బాసకుఁ దెచ్చుట కొక్క నన్నిభ
ట్టారుఁడె జిష్ణుఁడం చెపు డెడందఁ దలంచెదఁ; గాని, లోని యా
తీరు వెలార్చనైతి; నృపతీ! ‘కృతికన్యక రాజరాజుచేఁ
గోరఁగఁ జేసె’ నన్న ప్రథకుం దగె మా సహపాఠి యింతకున్.
78
ఉ.వేఱె వచింపనేల పృథివీవర! నీ మధురోహ లాంధ్ర భా
షా రమణీ గళాభరణ సంపదఁ దీరుచుఁగాత! మింక ‘నా
నారుచిరార్థ సూక్తి నిధి నన్నయభట్టు తెలుంగునన్ మహా
భారత సంహితా రచన బంధురుఁ డౌత జగద్ధితమ్ముగన్.’
79
వ.మా భట్టారకుండు మహాభారత కృతికర్త యగుటయుఁ, జళుక్య రాజరాజు తత్కృతిభర్త యగుటయుం దలంపఁ దెలుఁగుబాసకు ముందు మేలినాళ్లు రాఁగలయవి యని తోఁచు; నిందు సందియములే దని మధుర మంథర స్వరంబున -81
క.నారాయణ పండిత భ
ట్టారుఁడు సహపాఠి హృత్పుటమురేకులు వి
ప్పారఁగఁ జెలికారపు నొడి
కారము లీకరణి ఱేనిఁ గని పలుకుటయున్.
81
మ.కరతాళప్రతిరావ వీచికలఁ దోఁగన్‌ లేచి చాళుక్యభూ
వర పుంహంసము మందసుందరముగా భట్టారు పీఠస్థలిన్‌
దరియ న్వచ్చెడు నంతలో వినయ విద్యాప్రౌఢి పాఱాడఁగా
గురువుల్వాఱెడు వేడ్క నన్నయ యెదుర్కోలిచ్చె నాఱేనికిన్‌.
82
శా.రారాజుం గవిరాజు నొండొరులు చేరంజేరి యెవ్వారి కె
వ్వారై ముందరఁ జేతు లిచ్చిరొ తలంపన్‌ రాక, కౌఁగిళ్ల ము
మ్మా ఱేకత్వము నంది; రంత సకల క్ష్మాజానియాలింగన
స్వారస్యం బతిపారవశ్యమున ముంపన్ లోఁగె భట్టారుఁడున్.
83
వ.పదంపడి యయ్యాంధ్రమేదినీ కాంతుఁ డించుక భట్టారున కెడమై పరేంగితజ్ఞుండైన మహామాత్యుండు స్వయం బందియిచ్చుటయు-84
మ.ప్రభుఁ డర్పించిన వేలవిల్వగల యా బంగారుతాంబూలమున్‌
సభవారిం గని, యభ్యనుజ్ఞ వడయన్‌ నారాయణుంగాంచి ప్రీ
తిభరం బారఁగ దోయిటం గొనె వినీతిన్ వంగుచున్ నన్నయ
ప్రభుఁ; డాదృశ్యము సర్వ పండిత మనః ప్రహ్లాదనాపాది గన్.
85
గీ.అపుడు ప్రెగడల యేర్పాటు ననుసరించి
నెగడె మంగళవాద్యముల్; నింగి ముట్టె
విజయఘంటా విరావముల్; వెలసె నగర
నొగి వరాహాంక నృప పతాకోత్సవములు.
86
వ.అట్టి మేలి ముహూర్తమున -87
మ.జయ ఘంటారవముల్ త్రివారము శ్రవస్సారంబుగా విన్న న
న్నియ శ్రీభారత సంహితావ్రతమునన్ దీక్షిష్యమాణుండు వా
ఙ్మయ శిక్షా గురుమూర్తి యోగమున భ్రూమధ్యంబునం జూచె వి
స్మయ విస్ఫారిత సర్వనేత్రమయి సంస్థానంబు స్తంభింపఁగన్.
88
భారతావతరణము
గీ.అంత నొక్క క్షణంబున నమ్మహర్షి
మోముఁదామర విరితేనె పొరలినటులు
శ్లోక మీగతి దొరలె; వాల్మీకినోటఁ
దొల్లి వెలలినగాథ గుర్తునకు నాట.
89
 “శ్రీవాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాంగేషు యే
లోకానాం స్థితి మావహన్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవామ్
తే వేదత్రయ మూర్తయ స్త్రి పురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంబుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే”
 
వ.పదంపడి రాజమహేంద్రుండు మహానందభరితుఁడు నన్నిభట్టారుల నభినందించి, కొలువు సాలించుటయు నమ్మఱునాఁ డాంధ్ర మహాభారత రచనకుం దగిన లగ్నము తాన నిర్ణయించుకొని కొన్నాళ్ల నమ్ముహూర్తము దరిసిన దివసంబు వచ్చుటయు నంత-90
శా.ప్రాతర్వాయువు సౌఖశాయనికతం బాఱాడ నన్నయ్య బ్రా
హ్మీ తంత్రజ్ఞుఁడు లేచి కాల్యములు నెమ్మిందీర్చి శ్రీగౌతమీ
స్రోతఃపూరమునందు వార్చుకొని యచ్చో మంత్రపాఠాదిక
ప్రాతఃకృత్యము కొంత తేల్చుకొని చేరన్‌వచ్చి గేహంబునన్.
91
ఉ.ఆసలు ముందు ముందునకు నంగలుసాఁగ ముహూర్తవేళకున్
వీసర గానిరీతి సరవిన్ బరిశుద్ధత మించి - ప్రాతరౌ
పాసనమున్ యథావిధిగ నైనదటం చనిపించి గంటముం
దీసెను బంచమశ్రుతి కృతిక్రియ కోంకృతి చుట్టు కోరికన్.
92
చ.అణు వఖిలంబు శాంతతకు నాదరువౌ నల గౌతమీ సమీ
రణముల మేలితాఁకు లలరం, గవివాటికలోన నుత్తరా
యణ తరణింబలెన్ వెలుఁగులారఁగ దర్భపవిత్రపాణియై
గుణనిధి నన్నిభట్టరుఁడు క్రొత్త తెఱంగున నెత్తె గంటమున్.
93
చ.లలితములైన యక్షరముల న్విలసిల్లెడి ప్రాఁత తాటియా
కుల ప్రతి - మూలభారతము కొంత దిగంబడి మూఁడుపర్వముల్
కలిగినదానిఁ - గట్ట యెడగా విడఁగొట్టుచు వ్యాసపీఠిపై
నిలుపుటయందె యొక్క రమణీయత కన్పడఁ బట్టె గంటమున్.
94
ఉ.గంటముపట్టులో నొక యఖండ భవిష్యము తోఁచి పల్కువా
ల్గంటికి నాటపట్టు దొరకం గవితా దయితుండు భావనా
ఘంటలు ‘ఠంగు ఠంగు’ మనఁగా జయముం దెనిఁగింపఁబూనె వె
న్నంటి పురాజను స్సుకృతమైన సరస్వతి తొందరింపఁగన్.
95
ఉ.వ్రాసిన దానినిం జెఱిపి వైవనిబాసఁ ‘జకారకుక్షి’ యౌ
వ్యాసకవీశుఁ బోలక - మహాగిరి నిర్గత గాంగ నిర్ఝరీ
భాసురశయ్యలో వెనుక వంపులు సొంపులు దిద్దు కాళికా
దాసుని బోలి గంటమును దాలిచె నన్నయ మేలితెన్నునన్.
96
ఉ.అంచిత భక్తియుక్తి హృదయంబును జూచినయట్లు చూచి ప్రే
మించెడి విష్ణువర్ధనుని మేలు దలంచి దయారసైక ని
ర్వంచితుఁడైన నన్నయ నృపాలున కక్షయకీర్తిభైక్షముం
బంచఁగ భారతమ్ము నడపన్ నిడుపట్టునఁ దాల్చె గంటమున్.
97
శా.కాలంబెంత గతించిపోయినను నాకల్పాంత సంస్థాయిగా
నేల న్నిల్వఁగఁ జాలు వ్యాసకవితా నిర్మాణమున్ బాసలో
నాలాపింపఁగఁ బంచమశ్రుతి గరీయస్సాధు సన్మాధురీ
శ్రీలన్ నన్నయకోకిలంబు సవరించెన్ గంటపుం గంఠమున్.
98
ఉ.పంచమవేద మిట్లు పరివర్తనముం బొనరించు పూన్కి దీ
క్షించిన నన్నిభట్టు కృతికిం - బతికిం - దనకున్ శుభంబుఁ గాం
క్షించినవాఁడు శ్రద్ధమెయిఁ జేఁతకునై నియమాళిఁ జాలఁ గ
ల్పించుకొనెం గవీంద్రులకు వీడనిదారులు తీర్చువాఁడునై.
99
సీ.గడియ ప్రొద్దెక్కెడి కాలంబునకు స్నాన । సంధ్యాగ్నికార్యముల్ సంతరించుఁ;
బిదప నెత్తిన గంట మది దింపకుండఁగా । భారత రచనలోఁ గూరుచుండు;
భోజనానంతరంబున మఱి వ్రాయక । వ్రాసినదానికి వన్నె వెట్టు;
రేలు - దీపముకడఁ జాలసే పెవొ వ్వాస । కృతి ఘట్టములు వితర్కించుకొనును;
 
గీ.పౌర్ణిమా దర్శ పక్షతి ప్రభృతి తిథుల
వైదికానధ్యయనముల నేదొ చదువు
కొనుచు గంటము చేఁబుచ్చుకొనఁడు తాను
నన్నయ వరిష్ఠుఁ డామ్నాయ నైష్ఠికుండు.
100
మ.రచనారంభమునందు నంతమునఁ బారాశర్య పూజాకృతిం
బచరించున్ దశశాంతిపాఠములతోపా టా మహాత్ముండు వా
క్ప్రచయ ప్రాజ్ఞుఁడు నాఁడు నాఁడు; నది కావ్యంబున్ బురాణంబు రా
జచరిత్రంబును గాదు నన్నయకు సాక్షా దక్షర బ్రహ్మమే.
101
చ.కదలినగంట మాఁగఁ డొకఘట్టముఁ దీసికొనన్ సుఖాంతమై
యది తుద నెగ్గుదాఁకఁ; దనయాఁకటిప్రొద్దొకనాఁట దాఁటినన్
వదలఁడు ఘట్టమధ్యమున; నన్నయ - భారతసంప్రదాయ సం
పద సడిసన్నవాఁడు ధరపై నొకధర్మము నిల్పువాఁడునై.
102
ఉ.వ్రాసిన యక్షరాక్షరము భారతసార కవిత్వమున్ సహా
భ్యాసుని కర్ణశంఖములయందున ముందరఁ బోసి దీర్థముం
జేసికొనున్; బదంపడి రచించుటలో సహపాఠియూహలం
దీసికొనున్; సమస్తమును దెల్పును; దా నెఱుఁగు న్వినీతుఁడై.
103
చ.దినదిన మెవ్వరో తెలుఁగుదేశము దవ్వులనుండి చూడ వ
చ్చిన కవులున్ రసజ్ఞులు భజింపఁగ వారల వేఁడికోలు కా
దన మొగమోటమిం జదివి యచ్చట నచ్చట నొక్కఘట్టమున్
వినుచు మధుప్రవాహ పదవీ నదవిష్ఠ గళ స్వనంబునన్.
104
గీ.గడియ గడియకుఁ దొల్లింటికరణి నిపుడు
నన్నిభట్టారునకు దివాణమ్ము నుండి
వార్తలను బంప; రొకవేళఁ బంపిరేని
దీక్షలో నుండి గంటము దింపి పోఁడు.
105
చ.ఎడనెడ దర్శనేచ్ఛ యుదయింపఁగ నన్నయ కోట కేఁగినన్
గడుసరి రాజరా జొకవికాసము మోమునఁ జిందులాడఁగా
నడుగును బెక్కు పోకడల; నా నుడులం “గృతి తెల్గుసేఁత యే
కడఁ గల” దన్నమాటయె యొకప్పుడు నెత్తఁ డుదాత్త వైఖరిన్.
106
చ.హృదయము లోఁతెఱింగిన మనీషి వరుండగు నన్నిభట్టరుం
డిది కనిపట్టుచున్ ‘రచన యిక్కడ నున్న’ దటంచు ఱేనికిం
బదిలపుఁబల్కుల న్నొడివి భారముతో నొకయూర్పువుచ్చి, వ
చ్చెద నిఁక నేఁటి కాజ్ఞదయసేయుఁడనున్; మరలున్ మతిత్వరన్.
107
గీ.ఆ మహానిష్ఠలోన నన్నయతపస్వి
తిలక మాది సభా పర్వములు ముగించి
పిదప వనపర్వమునఁ గొంత కొదవపడిన
రచన కడ నుండె, నపుడు ఘోరకలి పండె.
108
శా.తీఁగల్ సాగి మహాప్రవాహగతి రీతిం బోవఁగాఁ, గాలదు
ర్యోగంపుం బెనుగొండ యడ్డపడి యాయుర్వేగ మాఁగింప, భా
షా గర్భంబునఁ జిచ్చునింపి కవిపక్షంబెల్లఁ గంపింపఁగా
నాఁగెన్ గంటము; కంట నీరిడె జళుక్యశ్రీ యశక్యంబుగన్.
109
ఉ.ఆఁగిన దల్ల నన్నయమహాఋషి గంటము కాదు; సాధువీ
చీగతి చాతురీ మధురుచి ప్రచురోత్తమ గౌతమీధునీ
వేగమె యాఁగిపోయె ననిపించి, రసజ్ఞుల డెందముల్ పిపా
సా గళితంబులై పరవశత్వము నందె నమందవేదనన్.
110
ఉ.పమ్మిన యుమ్మలంబుమెయి భారతభారతి య ట్లరణ్యమ
ధ్యమ్మున విహ్వలింపఁ గని యాంధ్రమహీపతి యాఁగరాని శో
కమ్మునఁ గుందె; నిందుకులకార్తిక కీర్తిపతాకికల్ కళం
కమ్మునఁ బొందె; డిందెఁ బరిగాఢ కవీశ్వర చిత్తధీరతల్.
111
ఉ.శారదరాత్రు లుజ్జ్వల లసత్తర తారకహార పంక్తులన్
జారుతరంబులై తనుపునన్ వెలుఁగందుచు నంతలో భయ
స్ఫార నిరీక్షణోద్భట పిశాచ నిశాచర హాస రేఖలన్
దారుణమై మహాంధభరితంబులు రాత్రులు వచ్చెఁ బెల్చనన్.
112
క.భట్టారుని యెడఁబాటునఁ
బుట్టిన వంతలు సమస్తమును దా నొకఁడే
కట్టుకొని మోసినాఁ డని
నట్టులు చాళుక్యపతి మహాదుఃఖపడెన్.
113
రాజరాజునిర్వేదము
గీ.కెరలి యంచులు ముంచి పొంగిన కరళ్ల
వఱద తీసిన వాహిని కరణి సడలి
యడలుకొను రాజరాజు రసార్ద్రహృదయ
మిట్లు గాంభీర్యమేది బహిర్గమించె.
114
శా.అన్నా! నన్నయ! మాకు దవ్వయితివయ్యా! లేదు, కాలేదు; నీ
వెన్నండే మము వీడి యుండెదవటోయీ! వేంగి సామ్రాజ్య సం
పన్నాస్థానికి సంగడీఁడవయి యస్మత్ప్రాణమై యుండి నీ
వెన్నండే మముఁ బాసియుండుదువటోయీ, యెగ్గు శాంతించుతన్!
115
ఉ.ప్రాణపు శోకరేఖ చెఱపన్ - బఱపైన మనోజ్ఞనందనో
ద్యాన తటీ పరీమళ విధా పరిణద్ధ సుమప్రతాన సం
తాన తరూత్కరాగత సుధామధుర ప్రియ వాతపోతముల్
కానుకవెట్ట స్వఃపుర సుఖంబుల నెంచి మముం దలంచెదే!
116
చ.హృదయము పంచి తండ్రివలె నెంచి యవంచిత భక్తిగౌరవా
భ్యుదయము తొల్కఁగాఁ గొలుచుచుండిన మావరివస్యపట్టునం
గొదవ లెవేని వచ్చె ననుకొందు; మటుల్ కనవచ్చెనేని యి
ట్లిది తగదంచుఁ దీర్పఁ దగదే, మొగమోడక శబ్దశాసనా!
117
శా.ఆరంభించితి వత్యుదాత్త కమనీయ శ్రీ రసస్ఫూర్తి నిం
డారన్ భారతసంహితారచనసేయన్; మత్పురాపుణ్య వి
స్తారం బిట్లు ఫలించెనంచు నెడ మోదం బందె; నాపొంగు చ
ల్లాఱెన్; మాఱె నొకింతలోనఁ దలక్రిందై బంధురాశారుచుల్.
118
ఉ.ఏయొక పర్వమో, పదియు నెన్మిది పర్వము లారు భారతా
మ్నాయము సారవత్తరము నా నదిరా! యొక చేతిమీఁదుగా
వ్రాయుట - యట్టిదానిఁ గృతిభర్తయు నొందుట - పుణ్యరేఖ గా
దా, యది మాయెడం గొదవయైనది సత్కవితా మహోదధీ!
119
గీ.నయన పర్వము నైజవిజ్ఞానమూర్తి
మూఁడుపర్వాల భారతంబునను దాఁచి
నాయెడఁద దోఁచుకొన్న నన్నయ్య విబుధ!
యందునో నీకు మాదు సహానుభూతి!
120
క.నా రసనకు సామ్రాజ్యపుఁ
దీరులుఁ దీపులు కషాయతిక్తములై చె
న్నాఱెడి; నిఁక భారత కృతి
పారాయణ మొకఁడె బ్రతుకుబాట తలంపన్.
121
శా.ఆశావృంతము సుంత పట్టు కలదై యాఁపున్ దురాపవ్యథా
రాశిం గాసిలు మన్మనస్సుమము నౌరా! నెమ్మి ముమ్మాఱు నీ
సౌశీల్యంబును వెల్లడించినటు తోఁచన్ మూఁడుపర్వాల వా
చా శోభన్ వెలిఁగించి యిచ్చితివి మా చాళుక్య కీర్తిప్రభన్.
122
క.నీ మేలు వేంగిరాజ్య
శ్రీమజ్జలజాక్షి నొసటఁ జెఱుగని బొట్టై
భూమి గలయంతకాలం
బోముత! మాంగళిక విధి మహో మధురముగన్.
123
వ.అని యిటులు పుటపాక సకాశంబగు వగపుమెయి రాజరాజు డెందంబున వందురి భట్టారుల యెడఁబాటున విరక్తుండయి పంచప్రధానులం దొకండై యుండి రాజ్యాంగ వ్యవహారమ్ముల పట్టునఁ దనకుఁ జేదోడై యందుకొనుచున్న రాజేంద్రచోళ యువరాజుపై రాజ్యభారము మోపి తా నొక నిమిత్తమాత్రుండై యుండె;124
ఆ.వె.రాజరాజువెన్క రాజేంద్రచోడుఁ డ
య్యఱవ మేనఱికపుటురులఁ జిక్కి
తెలుఁగుమీఁది వలపు దిగఁద్రోలె నొకకొంత
యంత వేంగిపెంపు లదరువడియె.
125
శా.శిక్షాదక్షతఁ గాఁకదేఱిన భటశ్రేణిన్ గులోత్తుంగ చో
డ క్షోణీపతి పంచి శాత్రవుల నూటాడించి - చాళుక్య చో
ళ క్షేమమ్ము లెఱుంగుచున్ రుచిరలీలన్ వేంగిపైఁ జూపులన్
విక్షేపించుచుఁ గాలుమోపె ద్రవిడోర్విన్ దాత పెన్మూటగన్.
126
గీ.ఇటులు చాళుక్య చోళ సంసృష్టి కతనఁ
గ్రమముగాఁ దెల్గుఁబుడమిపై ద్రవిడరుచులు
పర్వెఁ; బ్రతినిధి పాలన ప్రాభవముల
నాంధ్రమున రాచఱికపుఁదియ్యములు సెడియె.
127
సీ.పశ్చిమ చాళుక్య వంశ్యుండు - త్రిభువన । మల్ల విక్రమ నృప తల్లజుండు
‘కన్నడం’ బేల్బడిగొన్న మహీనేత - । నాఁడు కులోత్తుంగ చోడ విభుని
వేంగిరాజ్యము మ్రింగవేచిన తఱిఁ జూచి । వెరవెంచి కొడుకుల పెంపుఁ దలఁచి
నమ్మి కొల్చెడి భృత్యనాయకాన్వయులకుఁ । బంచి ‘మండల’ నేతృ పదవు లొసఁగె
 
గీ.నీకరణి వేఁగినాడును, బాకనాడు । మఱియు వెలనాడు మున్నగు మండలములు
వింగడించి పాలించిన వేళ వెలసెఁ । దెలుఁగునఁ జరిత్రకృతిని మాండలికయుగము.
128
ఉ.నింగికి నేలకున్ యశము నిండఁగ నేఁబది యేండ్లుగాఁ గులో
త్తుంగుఁడు వేంగిలోఁ బ్రతినిధుల్ తన పుత్రులు నిల్వ - ద్రావిడో
ర్విం గుదురై విభుత్వమునఁ బేరిచె; నాయెడ మెల్ల మెల్లఁగా
వేంగి ధరిత్రి య య్యఱవ వీవలి నెంగిలియయ్యె నెల్లెడన్.
129
సీ.అల కులోత్తుంగ రాజాస్తమయమ్ముతో । ముసరెఁ జీకటి తూర్పు పుడమిమీఁదఁ;
బశ్చిమ చాళుక్యపతి విక్రమార్కుండు । వొడిచె వింతగ వేంగిభూమి దెసను;
కర్ణాట విజయ శంఖధ్వానములు విని । తెలుఁగువారలకు గుండెలు తొణంకె;
గోదావరీ ప్రాగ్దిశాదేశ వీథులఁ । గన్నడీయుల పతాకములు నిలిచె
 
గీ.నహితవర్గ కృతాంతుఁ డనంతపాల
దండనాథుఁడు ద్రౌణియై తఱిమి యుఱిమె;
నాంధ్ర మండలపతులు కర్ణాట విభుని
కొలిచి యరిగాపులైరి యుజ్జ్వలత దక్కి.
130
గీ.విక్రమాదిత్యు నిధనమ్ము వెనుక నతని
కొడుకు భూలోక మల్లసోముఁ డను ఱేని
యేలుబడి వేఁడిమిని వేంగినేల కమరి -
కుమిలెఁ గొన్నేండ్లు దాస్యబంధమున దొరలి.
131
చ.పరువము దక్కి - కన్నడుల పట్టున బానిసలై యడంగు దు
ర్భరతకు స్రుక్కి ధైర్యగుణ వారిధియౌ వెలనాటి గొంక భూ
వరుఁడు పరాక్రమించి చొఱవం బరరాజుల వైజయంతికల్
పెఱికెను జందవోల్ పురము పేర్చెఁ ద్రిలింగ జయధ్వజోన్నతిన్.
132
శా.తానై వీరుల నుక్కడంచి, సముదాత్త స్వీయ వీరత్వ వి
ద్యా నైశిత్యము కల్మి మించియును జేతశ్శుద్ధిఁ బాటించి స్వ
ప్రాణప్రాణములౌ చళుక్యులకు సామ్రాజ్యం బిడెన్ భక్తి ము
ద్రా నిర్ణిద్రుఁడు ‘గొంకరా’; జతని యౌదార్యం బుదాహార్యమౌ.
133
క.వెలనాటి దుర్జయుల మం
డల పరిపాలన దశా విడంబనమున నీ
తెలుఁగుఁబుడమి శిల్పకళా
విలాస విన్యాసరుచిర విభ్రమ మయ్యెన్.
134
గీ.పూర్వ చాళుక్యరాజుల పొంత నిలిచి
వెలుఁగు వెలనాటి దుర్జయ వీరతార
లల్లవే! గొంక విభుని శౌర్యప్రతిష్ఠ
యల్లదే! ధ్రువమండలంబై వెలుంగు.
135
పర్వాంతము
క.అకఠోర కిరణ రేఖా
మకుట సుహృద్రామచంద్ర మసృణ పదయుగీ
ప్రకట మరంద నిపానో
త్సుక హృదయ మిళింద! ఋతవచోహితబంధా!
 
శా.ఈతీరైన చళుక్యపర్వమును దండ్రీ! నీకు విన్పించుచోఁ
బ్రీతిస్ఫీతము నాదుచేతమునఁ బర్వెన్ సర్వసారస్వత
జ్యోతీరూపము నన్నిభట్టరుఁడు; తద్యోగానుసంధాన లీ
లాతృప్తిం గడదాఁక నాయెడఁద నిల్వంజేసి దీవింపవే!
 
చాళుక్య పర్వము - ఆంధ్ర పురాణము - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి - ఆంధ్రభారతి - కావ్యములు - ఆంధ్రపురాణము - ఆంధ్రపురాణం - ఆంధ్ర పురాణం మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) Andhra Puranamu - AndhraPuranamu - Andhrapuranam - andhra puranam - Madhunapantula Satyanarayana Sastry- AndhraBharati AMdhra bhArati - kAvyamulu