కావ్యములు ఆంధ్ర పురాణము కాకతీయ పర్వము

ఆంధ్ర పురాణము
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి

యైర్దేశస్త్రిభిరేష యాతి మహతీం ఖ్యాతిం త్రిలింగాఖ్యయా
యేషాం కాకతిరాజకీర్తివిభవైః కైలాసశైలః కృతః
తే దేవాః ప్రసరత్ప్రసాదమధురా శ్శ్రీశైల కాళేశ్వర
ద్రాక్షారామనివాసినః ప్రతిదినం త్వచ్ఛ్రేయసే జాగ్రతు!
    “విద్యానాథుఁడు.”

కాకతీయ పర్వము
క.శ్రీమత్పల్లియపాలె
గ్రామ లసద్వ్యాసలింగ రమ్యాలయధా
త్రీమండల ప్రతిష్ఠిత
కామదచండీశభక్తి కలిత! జనయితా!
1
ఉ.ఏకశిలాపురంబు దమ యేల్బడికిం దగు రాచవీడుగా
సాఁకిరి కాకతీయకులజాతు లరాతుల నుక్కడంచి ము
క్కాఁకలుదీరి తెల్గుల జగమ్ము సమస్తము; తత్ప్రభుత్వపుం
బోకడ మెల్లఁగా నడచిపోయె శతాబ్దులు మూఁడు ముచ్చటన్.
2
సీ.సమకట్టి సూత్రపాతమువేసె వీరవి । ఖ్యాతుండు కాకతి ‘బేతరాజు’
పెను పునాదులు తీసె ననిలోనఁ దానయై । భువనాళిఁ గదలించు ‘ప్రోలరాజు’
పొడవు మీఱిన కుడ్యములు తీర్చె సర్వతో । భద్రమ్ముగా ‘వీరరుద్ర విభుఁడు’
కడమ యంతస్తు చొప్పడఁగ సంధానించెఁ । దెగుదారి ‘గణపతి దేవరాజు’
 
గీ.చారు చూతకిసాలయ తోరణముల । ముసరఁ గైసేసె రుద్రాంబ; ముమ్మడాంబ
తొట్టతొలిచూలు సౌధమ్ము మెట్టి, చాయ । పసపు బాసికమునఁ బట్టభద్రుఁడయ్యె.
3
ఉ.పెంచిరి కూరిమిం దొలుత వీరులుగా; నటమీఁదఁ గొల్వునం
గాంచిరి గౌరవం; బదియుఁగాక చమూపతులై క్రమంబుగా
మించిరి మంత్రులౌచు; సుతిమించఁగఁ గప్పముఁ గొంతకొంత చె
ల్లించిరి; కాకతీశు లదలించిరి సర్వచళుక్య రాజ్యమున్.
4
గీ.పాయ పాయలుగా సుధఁ బంచియిచ్చు
నృపతు లరిగాపులుగఁ దెల్గునేల నేలు
రాజచాళుక్య రాజ్యచంద్రముఁడు మెల్ల
సన్నగిలఁ జొచ్చె బహుళపక్ష ప్రసక్తి.
5
వ.త్రిభువనమల్ల విక్రమాదిత్యుండు పశ్చిమ చాళుక్య చక్రవర్తిగాఁ బెంపొందె; నాఱేని కొదిగి కప్పముంగట్టు మండలాధికారియై కాకతి బేతరాజు పేరుమోసె.6
ఆ.వె.బేతరాజు బిడ్డ- పేరుఁ బెంపుగడించు
పుణ్యశాలి ప్రోలభూమినేత
యాకుమఱుఁగు పిందెయై కొంతకాలము
తండ్రి వెనుక రాజ్యతంత్ర మేలె.
7
చ.అతనికి ముప్పమాంబ యను నంగన పాణిగృహీతియై పతి
వ్రతయయి పేర్మినంది బలవంతుల శాంతుల భాగ్యవంతులన్
సుతులను గాంచె నైదుగురఁ; జొక్కుచు నాథుని ప్రేమసారపుం
గుతుకముఁ బుక్కిలించి సరికోడలి వంతులులేని కుంతియై.
8
వ.ముప్పమాంబా ప్రోల భూపతులు గన్న కుమార పంచకమ్మునఁ బ్రథముండు రుద్రదేవుం డనువాఁడు పరమ భక్తుండు -9
చ.సిరిమలకేఁగి, యీశు దరిసించి సమంచిత భక్తిమైఁ దులా
పురుషము తూఁగి, విప్రజనముం బరితుష్ట మొనర్చి మల్లికే
శ్వర కరుణా కటాక్ష రసవాహిని దోఁగిన వీరరుద్ర భూ
వరుఁడు మహేశభక్తులకు భక్తుఁడుగా నుతికెక్కె నెల్లెడన్.
10
సీ.అభిషేకములు సేయ నంపెఁ గాశీపుర । ప్రథమ సంసారి కీశ్వరున కెలమి
నిలిపించె నోరుఁగంటికి నైకటికభూమి । మైలారు దేవ మహాలయంబు
“ననుమకొండ”కుఁ జేరువగు “నొద్దిపల్లె”లో । వెలయించె నల గుజ్జువేల్పునెలవు
మొగలిచర్ల గ్రామమునయందుఁ గట్టించెఁ । దివిరి “మహాశక్తి” దేవళంబు
 
గీ.చాటఁబంచె నేఁటేఁట నుత్సవము లచట । నక్కజము గొల్పెడి “చతుర్ముఖాలయంబు”
“వేయికంబాల మంటపి” వెలయఁజేసె । నేకశిలయందు వీరరుద్రేశ్వరుండు.
11
సీ.పదిరెండవ శతాబ్ది తుదిభాగ మరుదెంచి । వీరరుద్రేశు జీవితపుఁ గృతికి
భరతవాక్యము జెప్పెఁ; దరువాత జ్యేష్ఠాను । పూర్వి మహాదేవ భూవరుండు
సింహాసనం బధిష్ఠించి, మూఁడేఁడుల । ముచ్చటగా భారమును వహించి
“జైత్రపాలుం” డను శౌణదేశ విభుండు । దండెత్తిరాఁ బోరి భండనమునఁ
 
గీ.గన్నుమూసెను; బిమ్మటఁ గాకతీయ । రాజరాజ కిరీట భరమ్ము మోసె
నమ్మహాదేవరాజు పెంపారఁ గన్న । ధీవిశాలుండు గణపతి దేవవిభుఁడు.
12
చ.తొణఁకని గట్టి పట్టుదలతోఁ దలపెట్టిన కర్జమెల్లఁ బ్ర
త్యణువున బీఱువోక ఫలితార్థము వైపున ముల్లుసూపఁగా
గణపతిదేవరాజు బలఁగంబు సహాయముగాఁగ - విక్రమో
ల్బణముగఁ దాను బాడినది పాటగ నేల్బడిచేసెఁ బోఁడిమిన్.
13
మ.తన ప్రాణమ్మగు ‘మన్మసిద్ధి’ దిగులందం గాంచి, తద్రాజ్య ర
క్షణ దీక్షంగొని తిక్కనాహ్వయుఁడు లోకజ్ఞుండు విజ్ఞానచిం
తనసంతానము తానయై ‘గణపతిన్’ దర్శించి మెప్పించె; మ
న్మ నృపశ్రీయెడ నంతరాయము లడంపంజేసె భక్త్యున్నతిన్.
14
గీ.అల ‘కవిబ్రహ్మ’ మాట లోఁతులబెడంగు
దెలిసికొనఁగల్గె గణపతి దేవరాజు;
రాజ్యతంత్రమ్ములం గవిరాజు లటులు
పలుకుబడిఁ గొంట యెంత సంబరముపంట!
15
మ.కవియుం బండితమౌళి లౌకిక కళా కౌటిల్య తుల్యుండు శ్రీ
‘శివదేవయ్య’ శరవ్యసాధకత సాచివ్యంబు సాగింప, శా
త్రవులం గిట్టి తెలుంగురాజ్యము సమస్తంబేలె దైవంబు వెం
ట వినోదింపఁగ; భూప్రజన్ గొడుగునీడన్ నిల్పి కాపాడుచున్.
16
క.గణపతిదేవుని పరిపా
లనమున వాణిజ్యమును జలధియానంబున్
బెనుపొందె; మెల్ల మెల్లఁగఁ
దనుపొందె స్వదేశజాతి ధర్మప్రకృతుల్.
17
గీ.పునుఁగు, జవ్వాది, కప్పురంబును; బవడము
ముత్తియమ్ములు, పన్నీరు మున్ను గలుగు
మేటిసరకులు వెదచల్లి “మోటుపల్లి”,
గణపతి ప్రభునాఁటఁ జక్కదము చాటె.
18
వ.అయ్యేలిక తెలుంగాణెమ్మునఁ గ్రొత్తవెలుంగు నించి షష్టి హాయనంబులకుఁ బయిగ జీవించి సామ్రాజ్యమ్ము మోసి కడకుఁ గన్నుమూసె.19
గీ.తనర - ‘గణపాంబ’ ‘రుద్రాంబ’ యన నిరువురు
కలరు తనయలు తన్మహీతల విభునకుఁ;
బురుషసంతతిఁ గనని భూవరుని వెలితి
యన్నిటం దీర్చె రుద్రాంబ యమృతగాథ.
20
తెనుఁగు రాణి
సీ.పసిఁడిపూఁత మెఱుంగుఁ బావకోళ్ళు ధ్వనింప । లయతాళభంగు లుల్లసిలు నడక
నడుము వంపక సిగ్గువడక కంబమువోలె । నిలువున నిలుచుండఁ గలుగు పొలుపు
నిలుచుండి యభినయంబులులేక గంభీర । పుంభావమునఁ బల్కు పొందికయును
కాలిపైఁ గాల్మోపి కేలివ్రేళులు గడ్డ । మున కాని కూర్చుండు పొదలికయును
 
గీ.సొగసు చిగురింప ముసిముసి నగవు తెరకు । వెనుకఁ దారాడు బలదర్ప విలసనంబు
నరసి కనిపట్టినన్ రుద్రమాంబ చదురు । పదికిఁ బదిపాళ్ళు వీరసంపదకుఁ గుదురు.
21
చ.తురగపు స్వారిలోఁ బలుగతుల్ నెఱి నేరిచి, యస్త్రవిద్యలో
మెఱవడి సూపఁగా నెఱిఁగి మేల్కొని వాల్గొని ముందుదూఁకి సం
బరమునఁ బోరుసేఁతఁ జొఱఁబాఱుటలో గడిదేఱి, రాణువన్
బరువడి నొడ్డుటల్ తెలిసి పండితురాలుగ మించె నన్నిటన్;
22
చ.వలపుఁదలంపులో విరులవాసనలో సెలయేటిపాటలోఁ
దొలకరిమబ్బులో మెఱపుఁదొయ్యలిలో నెలవంకజోతిలోఁ
గలసియెలర్చుఁగాక! నెఱగాణతనంబును నేర్చుఁగాక! య
వ్వెలఁదుక రుద్రమాంబ యెటు పేరిమి నందెనొ కత్తిసామునన్.
23
వ.సార్వభౌముండగు తండ్రి కఱపులం గఱచి, రాజ్యాంగ తంత్రమ్ముల నాఱితేఱి గణపతిప్రభునివెనుక రుద్రమాంబ కాకతీయసామ్రాజ్య సింహపీఠం బధిరోహించెఁ; బదంపడి -24
సీ.అరిగాఁపులైన భూవరులఁ బుట్టిన కొఱల్ । పరికించి మొదలంటఁ బట్టి త్రుంచుఁ;
గానివారికి గుట్టు చేనీక గట్టిగా । నమ్మినమంత్రి మంతనము సేయు;
నంతసైన్యముఁ దాన యరయుచు మరలఁ బూ । ర్ణాధికారం బిచ్చినటు నటించు;
దిగువలెంకలఁ జేర్చి తివుటలు దీర్చుచుఁ । జనవిచ్చి యీయని చాయ మెలఁగు;
 
గీ.నొక్కయెడ గోముఖవ్యాఘ్రి యోజనుండి । యొకటఁ బులిమోము పసరమైయుండి, యావ
దాంధ్ర భూమండలమ్ము రుద్రాంబ మోసె । మగలకు మగంటిమిని నేర్పు మగువవాసి.
25
సీ.ఓరుఁగల్లు పురంబు నొరసి చుట్టిన మేటి । వాటంబు గల కంపకోట యొకటి
దాని లోపలితట్టు దరిసి యంబర మంటి । కూల్పరానిది మట్టికోట యొకటి
యద్దానిఁ జుట్టి మహాపయోనిధిఁ బోని । కడులోఁతు మీఱు నగడ్త యొకటి
పుట్టకోటయు - ఱాతికట్టడపుంగోట - । తత్తత్ప్రదేశముల్ తాన యరసి
 
గీ.చీమ దోమయుఁ జొఱరాని చెలువు మెఱయు । నమరికలతోడఁ గట్టుదిట్టముగఁ జేసె
నాంధ్ర కాకతిరాజ్య పట్టాభిషేక । రుచిర భద్ర చరిత్ర - శ్రీరుద్రమాంబ.
26
ఉ.ఇట్టలమై యొరుల్ చొఱఁగ నేర్పడరానిది, ఱాతికోట లో
తట్టున మెట్టు లేర్పఱిచెఁ; దద్ద యలంగముమీఁదఁ గాపుగాఁ
బెట్టెను బోటుమానిసుల; వీరుల బంధువులన్ గడంకమై
నిట్టికకోట కాపుదల కేర్పఱిచెన్ బరిపాలనేచ్ఛమై.
27
చ.ఇరువురు వీరయోధుల రహింపఁగ నిల్పెను గొమ్మకొమ్మకున్;
బురుజున కేఁబదుండ్రు పెనుపోటరుల న్నిలఁబెట్టియుంచె; నూ
ర్వుర నియమించె దిడ్డికి; నిరూఢ పరాక్రము లైదునూర్లపో
టరుల బరాబరిన్ గవనుడగ్గఱఁ జేరిచె నుక్కణంబుగన్.
28
వ.ఈ తీరున నోరుఁగంటి దుర్గంబు పరదుర్గమంబుగా సంతరించుకొని యున్నంత నాంధ్రరాజ్ఞి దెస నసూయావశులై -29
గీ.“ఆఁడుదానికి రాజ్యపట్టాభిషేక
వైభవ ప్రాభవములె సెబాసు! మనకు
నింకముం దాంధ్రభూమిలో నింట నింటఁ
గొదవలేదంట పసుపుఁ గుంకుమల పంట.
30
చ.కొడుకులు లేమిఁ దండ్రి దనకు న్నగవేసము వేసి ముచ్చటల్
వడినఁ బడంగవచ్చుఁ; జొఱవం బురుషావళి కేలిదమ్ముగా
నడఁకువ మాలి నేఁ దగుదు నంచును రుద్రమ భద్రపీఠిపై
నడు గటు వెట్టునే! నృపతు లందఱు గాజులు వేసికొందురే!
31
చ.చలము బలంబు పెంపుగ, దిశాద్విపముల్ వెఱఁ గందు కందునం
దలపడి వేల్పుఱేని కయినం బుయిలోట ఘటించు మాకు ముం
గలఁ గల సింహపీఠమునఁ గాలిడఁగా గజయాన కెన్నిగుం
డెలు కలవో గదే”, యని కడిందిగ రేఁగిరి మండలేశ్వరుల్.
32
వ.కాకతీయసామ్రాజ్యమునందలి సామంతమహీకాంతులెల్ల నిటులు రుద్రమాంబ పట్టంబుగొంట కట్టుడికినయట్టు లుడికి, యామె నెదిరి చేయునది లేమిం గుమారిలుచు వెనుక వెనుక నణంగి గొణంగి కొనుచుండిరి కాని యెదుటఁ బడి పెదవులు కదల్చువారు లేకుండి; రట్టి యెడ -33
సీ.యాదవరాజు “మహాదేవుఁ”డను వాఁడు । దేవగిరి ప్రభుఁడై వెలసిన
మంచి తెంపరి, పెద్దమాటకారియు, బలో । న్నతుఁడు, వరూథినీవితతిగలఁడు
నతని చెంతకు నేఁగి యఖిల సామంతులు । కాకతీయ విభుత్వగతులు తెల్పి
యుసికొల్పి రతని నీరసము పొంపిరివోవ । రుద్రాంబవిభుత నార్పుటకుఁ జెప్పి;
 
గీ.రది మహాదేవ రాజేంద్రుఁ డాలకించి । పొంగి బాహులు మూఁడుగా సంగరంబు
సేఁత కభిరతిఁ జేసి చమూతతులను । నాయిత మొనర్ప నెంచె రుద్రాంబ నెదుర.
34
వ.రాచఱికంపు బింకముతో జవ్వనంపుంబొంకము వంతులువోవ నిండుకొల్వున నుండి మహాదేవరాజు దండనాయకులం గానిపించుకొని యోరుఁగల్లు ముట్టడి గొనం బలికె - నంత-35
సమరయాత్ర
ఆ.వె.జలధి పొంగినట్టు లిల యీనినట్టులు
పర్వతములు ప్రోగు వడిన యటులు
కోటిమెఱపు లొకటఁ గూడి నిల్చినయట్లు
పొలిచె యాదవేశు భూరిసేన.
36
ఉ.ఊఁదిరి శంఖముల్ సమరయోధులు ముందర కేఁగుదెంచి, ఢ
క్కాదులు మ్రోఁగె నంబరము నంటి ధ్వనింపఁగ, విక్రమక్రమో
న్మాదము లుబ్బి సింగముల నాదము మేదుర మయ్యె నయ్యెడన్
యాదవరాజ సైన్యనివహంబు దురంబున కేఁగుదేరఁగన్.
37
మ.అలఘుధ్వాన తరంగముల్ చెలఁగి బ్రహ్మాండోదరంబెల్ల మా
ఱులియం జేయుచుఁ బెల్లురేఁగి విలయోద్యోగంబున న్మూఁడుల
క్షలకు న్మించిన వాహినుల్ కలిసి రాఁగా నేఁగె న య్యాదవో
జ్జ్యలసేనాంబుధి యోరుఁగల్‌నగరి సర్వం బాజిఁ దేలాడఁగన్.
38
గీ.అంతులేక యగాధమై యడరుదెంచు
తచ్చమూసాగరమ్ము మధ్యమ్మునందు
యాదవేశుండు వార్వపుటగ్గివోలె
మెఱసి వారువమున మిడుంగుఱులు కురిసె.
39
ఉ.కొండలు నేఱులున్ గడచికొంచుఁ గ్రమంబుగ వచ్చి త చ్చమూ
తండము లోరుఁగల్లు దరిదాఁపు మహిన్ విడియంగ యాదవేం
ద్రుండును లౌకికుండగుట దూరము యోజనసేసె ముందు రా
నుండినదాన నించుక యెదో కొదతోఁపఁగ ధైర్య మూఁపఁగన్.
40
చ.పరువులువాఱుచున్ దురము బారెఁడుదూరములోన నుండె; సం
గర విజయం బనన్ సుఖసుఖంబులఁ బండునె? యందునన్ బలో
ద్ధురమగు నోరుఁగంటి పురదుర్గము - దైవకటాక్ష ముండి సా
గరమును నిస్తరింప నగుఁగాని యలంతుల యీఁత సెల్లునే ?
41
ఉ.రాణువ మూఁడులక్ష లని ఱంతులు వోవఁగరాదు; దుర్బల
ప్రాణముతోడి రాణి నెదుర న్మన కెం తనరాదు; రాజ్యక
ల్యాణము చేతఁ జిక్కెనని యాడఁగరాదు; జయించి వచ్చి యా
పై ననుకోవలెన్; సగము భారము దైవము పూనుకోవలెన్.
42
చ.మగువగఁ బుట్టెఁగాని మగమానిసికంటెను రుద్రమాంబ పెం
పగు బలసాహసంబులను నందియవేసిన దంట; దానికిం
దగినటు ‘కమ్మ’ వీరులును, ధైర్యపుగాదెలు ‘వెల్మ’ జోదులున్
దిగుదురు యుద్ధరంగమునఁ దెంపరులై విజయాభిలాషితన్.
43
ఉ.ఏమగునేని మాకుఁ గొద యేమిటఁ గల్గదుగాక! యింక సం
గ్రామముసేఁతయున్ గెలుపు గల్గుట మా దెస వ్రాసియుండె; ‘నీ
వేమయ, యాఁడుదానియెడ నేడ్తఱ సూపెదవే’ యటన్న - శ్రీ
రామునిఁ జెప్పెదన్; బరశురామునిఁ జెప్పెద; వాయి గప్పెదన్.
44
గీ.ఇత్తెఱంగున దేవగిరీంద్రు నెడఁద
చీకటియు వెల్గు, వెలుఁగును జీకటియును
గనుచు నూయెల లూఁగె నొక్క త్రుటికాల
మాఁగె నంతట నొక నిశ్చయమున కేఁగి.
45
వ.పదంపడి యమ్మహాదేవరాజు వ్యవహారవిదుండును, శమాది సుగుణ సంపన్నుండు నగు నొక విప్రు రావించుకొని కాకతీయచక్రవర్తిని రుద్రమదేవి కీవిధంబున రాయబారంబుగా వినిపించె.46
సీ.“ఓ చక్రవర్తినీ! నీ చరిత్రము శ్లాఘ్య; । మైనను గాకతీయాంధ్రరాజ్య
భూభరం బెల్ల నీబోఁటి బోటి వహింప । వలను గాదును; నగుఁబాటు కూడ;
నబలల చరణమ్ము లంటి యీడిగిలంగఁ । బ్రణయదాసులె మహీరమణమణులు!
మూఁడు లక్షల సైన్యమున దూఁటి నీ కోట । ముట్టడిగొన వచ్చునట్టి వారు
 
గీ.కాచుకొనుము; కా దేని నిష్కారణముగ । ‘నేకశిల’ యందచందముల్ నీకు మాకుఁ
గాక చీకాకుపడును; నీ గద్దె చెడును; । చెదరి రాజ్యంబు మా యఱచేతఁ బడును.
47
క.ఇది మర్యాదగదా యని
మొదలం దెల్పుదుము; రాజ్యమున్ మా కిడి నీ
మదిలో నఱమఱ విడి స
మ్మదమున సాచివ్య మందుమా మా చెంతన్.”
48
వ.ఇటులు చెప్పి యావిప్రు నంపుటయు నతండు నైకటికంబగు నేకశిలాపురంబున కరిగి దేవగిరిసంస్థానోద్యోగి నని లోనికిం ప్రవేశము నొదవించుకొని కొల్వుఁగూటమ్ము దరిసి-49
గీ.కోటి మన్మథమూర్తుల కూటమందుఁ
గనికరము తోఁచి మూఁడవకన్ను దాఁచి
యెదుటఁ గనవచ్చు నర్ధనారీశు రుద్రు
నరసెఁ- బరవశుఁ డయ్యె బ్రాహ్మణవరుండు.
50
చ.అరసినయంత రాచమరియాదలతీరున గౌరవంబులన్
జరిపిరి రుద్రదేవి యిడు సన్నల సేవకు లేఁగుదెంచి; భూ
సురుఁడును సింహపీఠి దరిఁ జొప్పడియున్న పసందుగద్దె ని
బ్బరమునఁ గూరుచుండి తనవచ్చినకార్యము ముచ్చటించుచున్.
51
వ.ఉచితజ్ఞుండు గావున నుపోద్ఘాతంబు పెంచక “చక్రవర్తినీ! దేవగిరిప్రభువు మహాదేవరాజు పంప నేతెంచినాఁడ; నతండు మూఁడు లక్షల రాణువ వెంట నిడుకొని యోరుఁగంటికోట ముట్ట నెంచి యుండె” నని వచించి, మహాదేవరాజు మాటలు తూచాలు తప్పక యొప్పఁబలికి యామె బదులుపల్కుల కంజలి వట్టె.52
ఉ.అంతట నాంధ్రరాజ్ఞి వదనాబ్జము మ్రింగిన కెంపునవ్వు క
ల్పాంత నట ద్ఘనాఘన విహార తటి ల్లతికా సహస్ర వి
క్రాంతికి స్వాగతం బిడెఁ; జకచ్చక దీప్తుల విచ్చుఁగత్తులన్
సంతనపెట్టె రాజపరిషత్తున కబ్బురపాటు గొల్పుచున్.
53
ఉ.“ఆలముసేయఁ జేయొడిసి యక్కఱమాలిన రాయబారపుం
బోలిక లేలొకో! బవరముంగొని ముప్పదిలక్షలేని సై
న్యాళిని సాగఁబెట్టుకొని యాగడముం బొనరించుఁగాక మీ
యేలిక! యోరుఁగంట నొక యీఁగకుఁ బ్రాణము సేగిఁ దెత్తుమే.
54
గీ.కొలువఁదగు బాఁపఁడైతి; మా పలుకులోని
చుఱుకుఁదనము మన్నింపుము - మఱియొకండు
తలఁపకుము - మీ మహాదేవు ధార్ష్ట్యమునకు
బదులుమాటగ నిటులు చెప్పఁదగుఁ; బొమ్ము.
55
గీ.వింటి నీ వార్త; సంతస మంటె నెదకు
స్వాగతము నీకు ననికి సుస్వాగతంబు!
సబల దుర్బలులకుఁ బరీక్షాసమయము
దరిసె; నీ వలెఁ బెద్ద వృత్తమును దడవ.”
56
వ.అని ప్రతి సందేశమ్ము నొసంగి యవ్విప్రు నంపిపుచ్చి దేవగిరరాజు దండు వెడలిరాక దుర్గరక్షకుల కెఱింగించి తెనుంగురాణి యేకాంతమున దండనాయకులం గానిపించుకొన నెంచి నంత -57
ఉ.పూనిక నొక్కఁడొక్కఁడె గుముల్‌గొని వచ్చెడి శత్రుసైన్యసం
తాన మహాబ్ధి గ్రుక్కిలిగొనంగ నగస్తు లనంగఁ - గమ్మసే
నానుల మేలిమానికము నాగమనాయఁ డొకండు - వెల్మసే
నానులపెద్ద రుద్రముఁ డనంగ నొకండును వచ్చి నిల్చినన్.
58
ఉ.“మీ యసమాన విక్రమము మీ బలసంపద పెంపు ఱంపిలం
జేయఁగ నింతకంటెఁ దఱి చిక్కునె వీరవరేణ్యులార! యీ
నాయకురాలివెంటఁ గదనంబునకున్ దిగి కాకతీయ జా
తీయ పతాక సోఁక నరుదెంచెడు క్రొవ్వడగాడ్పు లార్పుఁడీ!”
59
గీ.అని, పెనంకువ కుఱిమి ముందడుగు వెట్టి
యంగవించె నుప్పొంగి తెనుంగురాణి;
యామె స్వాంతము శాంతిఁ దోఁగాడఁజేసి
యాడి రీరీతి దండనాయకులు వారు.
60
గీ.“పసిమి నీరెండతాఁకున మిసిమిదక్కు
చారు సుకుమారమైన యీతీరుమేనుఁ
గవచధారణమునఁ గసుగంద నిచ్చి
తెచ్చినజయంబు మాకు సంతృప్తి యిడునె?
61
గీ.కడిమి నీనేల నొక్కటే గొడుగునీడ
నేలుకొను నీవు మిసిమింతురాలు గాక
యస్మ దార్జితమైన జయమ్మె జయము
కానిచో మాయెడలఁ బాల్యకత్వ మున్నె!
62
గీ.వలదు - మా కోర్కి మన్నించి కొలువు వీడి
లేఁతయని కని కాల్‌ కదలింప వలదు;
దీవనలు నింపి మమ్మంపి నీవు పిదప
నరుగుదె మ్మింక సర్వసంహారవేళ.
63
సీ.అమృతచిత్తుఁడు ‘పురుషార్థసార’ గ్రంథ । కారుండు శివదేవ కవివరుండు
దక్షిణ భూభార రక్షా కళా మహో । త్సాహుండు ‘గంగయ సాహణి’ యును
దండనాథుఁడు ధైర్య దర్పసనాథుఁడు । జన్నిగ శ్రీదేవ సాహిణియును
పశ్చిమాంధ్ర క్షితి ప్రభుత వాసింగన్న । గోన గన్నారెడ్డి మానితుండు
 
గీ.వీర వీరులు వీరెల్లఁ బెంచి - లోఁతు । వేరు పాఱింపఁజేసిన యోరుఁగంటి
దుర్గ వటపాదపమ్ము సత్తువఁ గదల్ప । జిఱుతకరువలి కెంత నిబ్బరము కలదొ!”
64
క.అని వాహినీశు లమృతము
చినుకఁగ - రుద్రాంబ క్రోధశిఖిసందడి య
ల్లనఁ గొంత సడలి తలయూఁ
పునఁ దన పరిశీలనమ్ముపొలు పిటు చూపెన్.
65
చ.“అవును, యథార్థమైన పలు కాడితి రౌచితి నామతించి, నే
బవరముసేఁతకుం జొఱమి పాడియగుం దొలి - తొందరింపఁగా
నవసర మున్న దే! యురు మహాభుజ పంజర యుగ్మ గుప్తికిం
దవిలిన దుర్గలక్ష్మి కడదాఁటినచో, నిఁక నెట్లు నున్నదే.
66
క.ఏమఱుపాటును వెనుబా
టేమెయి నెదఁ జేరనీక యెసఁగి కసిమెయిన్
మైమఱువు మార్పకుండఁగ
మా మర్యాదలకుఁ దగిన మాడ్కిఁ బెనఁగుఁడా!
67
గీ.అలరుమనమున నేకవీరాంబ మీకు
జయకటాక్షోపహార మొసంగుఁగాక!
యక్షయశ్రీలఁ దేలు పద్మాక్షి దేవి
కరుణ మన కోటకున్ వజ్రకవచ మగుత!
68
వ.శుభంబు - పోయిరం” డని యాహవ దోహలమ్ములగు పల్కు లాడుటయుఁ గమ్మసేనాని నాగమనాయఁడును, వెల్మదండనాథుఁడు రుద్రముండును పూర్ణచిత్తులై యాంధ్రరాజ్ఞి యాజ్ఞం గొని వెడలి రంత -69
ఉ.తూరుపుఁగొండ వేవెలుఁగు దోఁచి, యదాటుగ నోరుఁగంటిపై
బారలు సాఁచి దుర్గరమభాగ్యము దోఁచికొనంగఁ జూచి - యా
దారిని గుర్తువట్టి బలితంబుగ ముట్టడివైచె యాదవో
ర్వీరమణీ ప్రియుం డలవరించిన రాణువ మూఁడులక్షలున్.
70
చ.కడుకొని సైన్యముల్ నలుమొగమ్ముల ముందరికోటఁజుట్టి ము
ట్టడి గొని - పోరుసేఁతకు విడంబము సూపెడు దుర్గపాలు రె
ద్దడి వడ మోఁది యప్రతిహతస్థితి ముందర సాఁగి, పెద్ద సం
దడిగొన ఱాతికోట దరిదాఁపునఁ జేరిరి ధైర్యమేరులై.
71
మ.కొతుకుల్ కొందలముల్ జనింపక పరాకుల్ లేక - యారంభ శూ
రతగా సాఁగెను రెండునాళు లరివర్గప్రౌఢ సంచార సం
భృతి; సేనావళి చాల డీలువడి పోయెన్; ఱాతికోటన్ బలో
ద్ధతమౌ యుద్ధముసేయునయ్యరుల వార్తన్ డెంద మార్తింబడన్.
72
క.విని రుద్రాంబిక మనమున
వనట గదుర వెల్మ కమ్మ వజ్జీరులఁ బి
ల్వను బంచి, యెచ్చరిలు వె
చ్చని మాటలు నూఱిపోసి సాగంబంపెన్.
73
వ.అమ్మఱునాఁటి కోల్తల న్నరనారాయణుల నెంచుచు నెసరేఁగి రుద్రమ నాగమ దండనాయకులు శత్రువాహినితో సాటిలేని పోరాటమ్ము సాగింపం దొడరి -74
చ.కొనలిడి మీఁదికి న్నెగయు క్రోల్పులు లట్టులు - నాముదేఱి మిం
టి నెగసి మ్రింగఁ జూచెడి కడిందిగజంబుల యట్లు రేఁగి య
ప్పెనఁకువ నెల్లఁ దామ యయి భీకరభంగిఁ బెనంగి, మొగ్గవి
చ్చిన పరవాహినిం దఱిమి చెండిరి భండన పండితోత్తముల్.
75
శా.“ఏఁడీ మీ ప్రభు వేఁడి! దేవగిరియందే గద్దెపైఁ దీర్చి యు
న్నాఁడా! యాలము పెండ్లితొందరల నున్నాఁడా? మముంజూడఁగా
రాఁడేమీ!” యని గద్దరించి తనివారన్ వైరివారంబు వేఁ
టాడం జాగిరి రేఁగి వాహినులు పాయల్ పాయలై పాఱఁగన్;
76
వ.దేవగిరి ప్రభుం డయ్యెడఁ దాన వరూథినీ నాయకత వహించి చెదరిపోవు కూటువమూఁకకుం గుదురువోసి యాఁపి పురికొలిపి కొంతతఱి పోరుటయు-77
సీ.ఎదురైనచో నెట్టి మదగజ ప్రభునేని । యఱగొఱఁ దొఱఁగి తున్మాడుకొనుచుఁ
బ్రక్కదాఁటుల మీఁదఁ బడఁజూచి యేచిన । యశ్వరాజములఁ దూఁటాడుకొనుచు
గడిమీఱి వాటమ్ముగాఁ బర్వువాఱెడి । శకటమ్ములను నుగ్గుసలిపికొనుచు
కాఁకదేరిన బంటుగములను మునుమున । నలవోకఁ బట్టి మట్టాడికొనుచు
 
గీ.నుభయ పక్షము లిట్లు భయోల్బణముగ । విజయ మజయము తేలని విధము దోఁప
నద్భుతమ్ముగఁ జతురంగ మాడికొనుచు । నొకరికొక్కరు సమముచేసికొని రపుడు.
78
చ.ఇటు లొకనాఁడుకాదు - కడు నేడ్తెఱ మీఱఁగ ఱాతికోట ను
త్కటముగ మూఁడు నాళ్లు కొఱగల్గిన భారతయుద్ధమయ్యె; నం
తటఁ బెఱసైనికుల్ దిటవు దక్కుటఁ జిక్కుటఁ జూచి సమ్మదా
ర్భటి మొనలెత్త నుబ్బిరి కరంబును గమ్మలు వెల్మ జోదులున్.
79
చ.బలకొని రెండులక్షలకుఁ బైఁబడు రాణువ లెల్ల నిట్లు కొం
దలపడిపోకకున్ మదిని దైన్యము నందియు, శేషసైన్యముం
దలపడ రేఁపి దేవగిరినాథుఁడు వెండియుఁబూని భండన
స్థలికి దిగెన్ దెగించి “తుదిసారి దురం బిది” యంచు నార్చుచున్.
80
చ.కడచిననాళ్లఁ గోల్తల నొకండును జూపని తెంపు పెంపు - నె
న్నఁడు తనచేత నీగతిఁ గనంబడఁజేయని నేర్పుసొంపు వె
ల్లడిపడఁ జూపుచున్ బల విలాసము తగ్గక దేవరాజు వ్రే
ల్మిడి నల ఱాతికోటఁ గదలింపఁగఁ బౌఁజుల నెచ్చరింపఁగన్.
81
చ.ప్రభుఁ డటు లోరుఁగల్పురము బగ్గముపా డొనరింపఁగా మహా
రభసముఁ జూప సైన్యము కరళ్లు కరళ్లుగఁ బొంగివచ్చి ధై
ర్యభరము మీఱ “వచ్చెవిజయం” బనునార్పుల యాదవేశ్వర
ప్రభకు మఱింత తోడు నెఱపన్ వెఱపందిరి తెల్గుపోటరుల్.
82
ఆ.వె.“ఓరుఁగంటిదుర్గ మొడిసి పట్టినయట్లె
ఱాతికోట దాఁటి పోతిమేని”
యనుచు దేవరాజు ఘనతర సైన్యముల్
పొంగి యడ్డులేక పోవుచుండె.
83
చ.పది పదునైదునాళు లొకపట్టునఁ - బట్టినవిల్లు దింపకుం
డఁ దెగువఁ బోరుచుం గటకటంబడి రుద్రమ నాగ వీరు ల
య్యదనునఁ గొంత సేదవడి యాలము వీడిరి; దాన, రాణువల్
చెదరి యలంతమైఁ గళవళించెను యాదవనాథు ధాటికిన్.
84
గీ.చలము రెట్టించుకొని ప్రాణములఁ దెగించి
యమ్మహాదేవ భూపతి యనికి దిగియెఁ;
బయి నియంతలు లేక నెవ్వగలు సోఁకఁ
గోటలోఁ దెన్గుభటులు గగ్గోలు వడిరి.
85
వ.ఇటులు వెఱఁగంద నందు కొందఱు రుద్రమాంబ సన్నిధికిం బోయి దండపతుల పరోక్షమ్మున మహాదేవరాజు గావించు నాగడమ్ము సమస్తము విన్నవించుటయు నా వీరనారి చుఱుకువడిన త్రాఁచు వోలె రోఁజుచు-86
రుద్రమాంబ యుద్ధోత్సాహము
చ.కలిగియు నిన్నినాళు లోక కైవడిగా నిలుపోపియుండి యి
య్యలఁతిదురంబు నింతవఱకాఁపి దొసంగును గంటి మిట్లు; నేఁ
దలపడకున్నఁ గర్జము వితావితయై చెడు; గోరఁ దీయఁగా
నలవడుదాని గొడ్డటికినై కొని తెచ్చితి; మేల ముచ్చిరన్!
87
శా.కానీ, యా ‘నరకాసురుండు’ తన సంగ్రామ క్రియా క్రీడ మా
పై నెంతెంత వెలార్చునో కనెద; నిల్వన్ దిక్కు మ్రొక్కేది “మొ
ఱ్ఱో! నా దోసము సైఁపు తల్లి!” యని యఱ్ఱుం జాఁచి వేఁడంగ నా
దీనుం గాచెదఁ; జూచెదం గరుణ నర్తింపన్ క్షమామూర్తినై.
88
వ.అని యివ్విధంబున గర్జించి-89
క.తన బొమముడి వెంబడిఁ గన
కనమను నిప్పుకలు రాలఁగాఁ గాళికయై
యని దూఁక నుత్సహించిన
యనువునఁ గననయ్యె రుద్రమాంబ భటులకున్.
90
క.ఉరవడి నీ కరణిని సం
గరమునఁ దరితీపు పెరిఁగి కవచము దొడిగెన్
గరమునఁ గుంతముఁ గొని, శర
శరాసనాదులను బూని స్యందన మెక్కెన్.
91
చ.జవము బలంబునుం గొనలుసాగఁగ భావిజయాభిలాష క్రొం
జివురులు వెట్టఁగా సుఫల సిద్ధిఁ దలంచిన రుద్రమాంబ - తాఁ
బవతుల నోర్చునొక్క మగవానికి వెంబడిఁగాక యెక్కటిన్
బవరము సేఁతకున్ వలచి వచ్చెను నూతన సత్యభామయై.
92
గీ.చక్రవర్తిని - నిజ బలోత్సాహ రేఖ
నిలిచి పొలిచిన మెఱపుగా నెగడ, నెదిరి
కనులు మిఱుమిట్లు గొలిపి సంగ్రామసీమఁ
గెరలె దైతేయసేనఁ గైకేయివోలె.
93
ఉ.వచ్చిన రుద్రమాంబఁ బొదువన్ గమకించెను దెంపునన్ బలో
ద్యచ్చతురంగ వాహిని సహాయపడ న్వడి దేవరాజు; క్రో
ధోచ్చతరారుణాంబకము - లోహటమందని ధీరమానసం
బచ్చుపడంగ రుద్రమయు నాతనిఁ దాఁకె ననాకులోద్యతిన్.
94
గీ.“అబలల పదాంబుజాతము లంటి వెంట
నీడిగిలువాఁడ వీవు కాదేమి, వెడఁగ!
ప్రణయ దాసుండవో, కాక - ప్రళయ దాస
దాసుఁడవొ తేల్చుదాన సొంతముగ నేను.”
95
క.అని వాగ్విశిఖము విసరుచు
మొనదేఱిన చేతికుంతమున మునుకొని గ
ర్జనములతో మెఱుములతోఁ
దెనుఁగుమహారాజ్ఞి యనికి దిగి పొడువంగన్.
96
ఉ.ఆ విషకుంత ఘాతమున కార్తి మునింగి, యొకింత దేఱి, య
ద్దేవగిరీశుఁ డుద్భటగతిం బరగాత్రనికృంతన క్రియా
త్యావిలదారుణాసిఁ గొని యామెపయిం గవిసెన్; జయేందిరా
దేవిని గన్మొఱంగెడిమదిన్ దుది రాఁగల సేగి తోఁచునే!
97
మ.అటు లన్యోన్యము తీవరించి విజయాహంకారముల్ పెంచి యు
ఱ్ఱట లూఁగించిరి సంగరాంగణము; వీరవ్రాత మిందందుఁ గూ
లుటచే రాణువ డిల్లపాటువడి కోల్పోయెన్ బలౌద్ధత్య, మం
తటఁ బీనుంగులు తేలియాడినవి రక్త వ్యక్త వీచీతతిన్.
98
సీ.తేరులఁ గూర్చుండి తీవ్ర శరావళి । నడరించుకొని కొంతతడవు పెనఁగి
వారువంబుల నెక్కి వాదరవ్రేటులఁ । బఱచుకొంచు నొకింతవఱకుఁ బోరి
పుడమిపై నిలువంగఁబడుచు ఖడ్గాఖడ్గి । దందడిగొనఁ గొంతదాఁకఁ బెనఁగి
రౌద్రాకృతుల నంతరంబులు లేకుండఁ । గుంతమ్ము లలవోకఁ గొనుచుఁ బోరి
 
గీ.యసి ముసల తోమరాది సాహాయ్య మెనసి । నడుమ నడుమఁ బెనంగు విన్నాణ మడర
వింతతీరుల సమరమ్ము సంతరించి । రమ్మహాదేవరాజు - రుద్రాంబికయును.
99
సమర విరమణము - సంధి
గీ.అరయ సొంపగు నా మహాహవమునందు
నల జయేందిర తూఁగుటుయ్యాల విసరు
లేదెసకు వచ్చి యాఁగునో యెఱుకపడక
మ్రానువడి చూచుచుండెఁ దత్సైనికాళి.
100
వ.అంతఁ గొంత తఱికి -101
ఉ.మించిన పౌరుషమ్ముకడిమిన్ గడిదేరిన తెన్గురాణి నూ
ఱంచులకైదువుం గొనినయట్లు కలంచుచు స్వీయపక్షముం
ద్రెంచుట - తన్ను నొంచుట - భరింపఁగనేరక ‘ధర్మదార’ వ
ట్టించెను దేవరా జటమటించిన ధైర్యమునం బెనంకువన్.
102
వ.రుద్రమాంబయు, మడమ ద్రిప్పినవానిం బొడుచుట నయదవీయంబగు కార్యంబని శాంతించి తానును సమరమ్ముఁ జాలించి విజయశంఖం బొత్తి గెలుపువార్త నల్గడలఁ జాటం బంచె; వెన్నుఁ జూపిన మహాదేవరాజు సిగ్గునం జేతులొగ్గి -103
చ.“ఎఱుఁగమి నింత వచ్చె; భవదీయ బలోన్నతి యోరుఁగంటి దు
ర్గరమకు నిండు మైమఱువుగా విలసిల్లును; రుద్రదేవి! నీ
పరిచితి మాకు నెన్నఁడును బాయఁగరానిది; పొంతుమాటలన్
జరిగిన దంతయు న్మఱచి సంగడి సేయఁగ నిన్ను వేఁడెదన్.
104
సీ.పరువమ్ముఁ గొన్న యెవ్వని శౌర్య దీప్తికి । జేజేలు వెట్టెఁ గాంచీపురంబు
కనదస్రసిక్త మెవ్వని విచ్చు కత్తికిఁ । దలలు వంచిరి శత్రు ధరణివిభులు
కను లొత్తరించు నెవ్వని ప్రతాపజ్వాలఁ । బ్రస్తుతించిరి చోళ పాండ్యపతులు
మనసు పుట్టించు నెవ్వని వీరగాథలు । చర్చింపఁబడు సదస్స్థలులలోన
 
గీ.నట్టి గణపతిదేవ విశ్వావనీశు । నంకతలమునఁ బెరిఁగిన యాఁడుబిడ్డ;
వాంధ్రరాజ చరిత్రకావ్యమున నీదు । నమృతకృతి నిల్పెదరు సువర్ణాక్షరముల”
105
వ.అని కొనియాడి రుద్రమాంబకుఁ బసదనంబుగాఁ గోటి ధనంబు నొసంగి సంధిగావించుకొని యమ్మహాదేవరాజు పరిక్షీణసైన్యంబుతో దేవగిరికిం బయనించె; నా తెనుంగురాణియు విజయోత్సాహంబు కడలొత్త వెల్మ-కమ్మ దునేదారులకుం దనివారు సత్కారము లొనరించి యప్రతిహత పరిపాలనంబు నెఱపుచుండె.106
సీ.‘ముమ్మడాంబ’యును ‘రుయ్యమ్మ’యు నను నిర్వు । రాఁడుబిడ్డలఁ గడుపారఁ గాంచి
తల్లియుం దండ్రియుఁ దానయై పెంచి, పి । న్నటినాఁటఁ గోలె విన్ననువుకళలు
గఱపించి, కొలమును సిరియును గలవారి । కిచ్చి ముచ్చటగఁ బెండ్లిండ్లు చేసి
యల్లుండ్ర నిల్లటపల్లుండ్ర వలెఁ దన । చెప్పుచేఁతలలోనఁ ద్రిప్పుకొనుచు-
 
గీ.“నాఁడుపడుచు లయిన నాత్మజు లయినను । వార” యనఁగఁ దలఁపులూర నరసి -
మురిసి - రుద్రమాంబ సరిపెట్టుకొన్నను । మనసు నిలిచియుండ దనుట నిజము.
107
వ.అట్టులగుట నొక్కనాఁ డొంటిపాటునఁ గూరుచుండి -108
ఉ.“కొడుకులు లేమిఁ దండ్రి తలఁకుం గొని - పుట్టిన యాఁడుబిడ్డ నన్
గొడుకుగఁ బెంచి రాజ్యమునకుం బరిపాలకురాలిఁ జేసె ని
వ్వడువున; సంప్రదాయ మిటు వచ్చుట తప్పదొ గాక, మాదు వం
గడమున కింక దైవ మెటుగాఁ బరికల్పన సేసి యుంచెనో!
109
ఉ.కాంచిన యాఁడుబిడ్డల సుగం బయినన్ నెఱిఁ జూఱలాడి లా
లించుట నోఁచనట్టి కడు లేఁతవయస్సున నాశుభాంకముం
ద్రుంచెను దైవ; మీ బ్రతుకు రోఁతగదా! సకలాంధ్రభూమిఁ బా
లించిన నేమి, యించుక ఫలింప వమంగళ సౌఖ్య సంపదల్.
110
చ.ఒక మగకాయ కాచిన - నెదో యది యొండొక వెల్గు; నాదు తం
డ్రికి వలె నాకు నా సిరి చెడెన్ దొలిచేసిన కర్మ దోషముల్
మొకమున వ్రేలుచుండి; గతమున్ స్మరియింపఁగ నేల! కన్న పు
త్రిక కడుపేని పంట సవరించునొ! దైవము కంటగించునో!
111
వ.అని తడవు డెందంబున నలందురి దేవతానుగ్రహంబునఁగాని తన యభీష్టము పండదని నిశ్చయించుకొని రుద్రదేవి తత్క్షణంబ తన యుద్దేశం బెఱింగించి పెద్దకూఁతు ముమ్మడాంబను, నల్లువాని మహాదేవరాజుం జాళుక్య వంశాబ్ధిరాజుం దోడుకొని -112
సీ.భైరవేశ్వర పదాబ్జంబులు భజియించి । చమడేశ్వరీ మహాశక్తిఁ గాంచి
మైలారుదేవ దేవాలయంబున కేఁగి । దుగ్ధాబ్ధిశయను పొత్తులను దోఁగి
శ్రీ స్వయంభూదేవుఁ జేరి దోయిలికట్టి । పద్మాక్షి కెరఁగి సేవనము వెట్టి
‘మొగలిచర్ల’కు ముదంబునఁ దర్లి - యటనున్న । యేకవీరాంబకు మోఁకఱిల్లి
 
గీ.‘యొద్దిపల్లె’ వినాయకు నోలగించి । యేకశిల చుట్టు పట్టుల నెంద ఱుండి
రందఱను ముమ్మడాంబకు నల్లునకును । జూపి కొలిపించెఁ ద్రికరణశుద్ధి మించి.
113
చ.తొలఁకని భక్తిగౌరవముతో నిటు రుద్రమదేవి కోటి వే
ల్పులఁ గొలిపించి - కొల్చి - బరువుం దిగడించి భవిష్యదర్థముల్
తలఁపునఁ బెంచియున్నెడ, సుధామధురంబగు వార్త రెండు మూ
న్నెలలకు రుద్రమాంబ చెవినింబడె నోఁచిన నోము పంటగన్.
114
క.వినినంతన హృదయాబ్జము
తనుపారఁ దెనుంగురాణి దాసికిఁ జేతుల్
మునుఁగం బసదన మిడి మె
చ్చెను; వచ్చెను గూఁతు నరయఁ జిత్తము పొరయన్.
115
వ.వచ్చి, సిగ్గుపాటున నఱమోమువెట్టి దోయిలిఁబట్టు ముమ్మడాంబను లాలించి కౌఁగిలించుకొని రుద్రమాంబ తన యానందపు వెల్లి క్రందుకొన-116
చ.“కొలిచిన వేల్పు లొక్కటిగఁ గూడి దయామతి నామతించుచుం
బలికిన దీవనల్ కమియఁ బండక యుండునె, తల్లి! యింక నా
కలఁక తొలంగిపోయె; మగకానుపు నెత్తిన నీదు నిండు పొ
త్తిలి కనులారఁ గాంచిన - నదే పరమావధిగాదె జీవికన్!
117
ఉ.చిందఱ రేఁగి శాత్రవులఁ జివ్వ నెదుర్చుచు, వీరబృందమున్,
గ్రిందులుసేసి యాంధ్రమును గేవల మేలితి నింతదాఁకఁ; బే
రంది జగంబు లేలెడి కులాంకుర మొక్కనిఁ - గాకతీయ రా
జ్యేందిర నందువానిఁ గనుమీ! యిఁక నా బరువెల్ల దించెదన్.
118
గీ.అనుచు దీవించి చక్రవర్తిని- సతమ్ముఁ
దన కుమారిని బాయని యనుఁగుఁజెలుల
నందఱను బిల్వఁ బనిచి, చూలాలి వెన్క
నాదృతి మెఱుంగు వెట్టి యి ట్లాన వినిచె.
119
ఉ.“వేఁకటి గాన - మీ చెలికి వేఱిమిగాక యెవేని కోరికల్
సోఁక నవెల్లఁ దీర్పవలెఁజుండి! నిరంతర మీమె దౌహృద
శ్రీకమనీయతల్ పెనుపు సెందఁగ మీరలు సంతరించు న
ప్పోకడ లున్నరూపున మముం గని సెప్పుఁడు నిచ్చనిచ్చలున్.
120
సీ.భారతీయ చరిత్రఁ దేఱి సారములైన । వీరగాథలను విన్పింపవలయు
రాజకీయపు టెత్తురకము మెలంకువల్ । తెలియుకైవడిని బోధింపవలయు
సంస్కృతాంధ్రముల మెచ్చఁదగు చక్కని కబ్బ । ముల నేఱి యవి నూఱి పోయవలయు
నేది వాంఛించినఁ గాదన కదితెచ్చి । యఱలేక సంతృప్తి పఱుపవలయుఁ
 
గీ.బిఱికి పలుకుల నేవేళ వినుపరాదు; । పనికిరాదు పూవులఁ గోయుపాటి కూడఁ;
గందెఱ తెఱంగునన్ మీరు కాచి - మరల । వడ్డిలో బిడ్డ మాకుఁ జూపంగవలయు.”
121
వ.అని యానవెట్టి చెలికత్తియలకుం గూఁతు నంతర్వత్ని నప్పగించి దౌహిత్ర ముఖావలోకనాశ మోసులువాఱ నుండుటయు -122
ఉ.ముమ్మరమైన సంబరము మోసిన రుద్రమదేవి కంతలోఁ
దొమ్మిదిమాసముల్ గడచెఁ దొందరగాఁ; దొలిచూలు గావునన్‌
ముమ్మడదేవి కొంత భరముం గొని కొందల మందె; నింతకున్ -
చుమ్మలు హెచ్చవే మగనిసుంగును దాల్చిన నిండువేఁకటిన్!
123
క.ఊరిన కోరికలన్ నిం
డారిన డెందమున రుద్రమాంబ కొలువునం
దీరిచి యుండఁగ - నత్తఱిఁ
జేరి ముసలిదాసి ముదము చివురొత్తంగన్.
124
వ.“చక్రవర్తినికి దౌహిత్ర లాభం” బని తీయని యెలుంగెత్తి పలుకుటయు రుద్రమాంబ పరమానందంబునంబొంది యవ్వరవుడు దానికిఁ జేమునుంగ నుడుగర లొసంగెఁ; దెలుంగాణెమ్మునంగల యాటపిల్లల కెల్ల మధురపదార్థంబులు పంచిపెట్ట దురాయివెట్టెఁ; గొలువునం గల మౌహూర్తికుం జూచి బిడ్డ పుట్టినతఱి యెఱింగి చక్రమువేసి జాతకంబు తెఱంగు వచింపుఁడని యానతిచ్చె; నోరుఁగల్లు దుర్గంబు ప్రతిస్వనింప మంగళవాద్యఘోషంబులు హెచ్చె.125
చ.జరిపిరి యెల్లవేల్పులకు సంబరముల్; తఱి నమ్మవారి జా
తరలను జాటఁ బంచిరి; ప్రధానుల యానతి రాజధానిలో
నెఱి తులకింపఁగా సవరణించిరి పట్టగజంబు; నోరుఁగల్
పురిఁ గయిసేసి రెల్లెడ నపూర్వచమత్కృతిభాగలంకృతిన్.
126
వ.మఱియు రుద్రమాంబ పట్టలేని దౌహిత్రలాభోత్సవాతిరేకమ్మున న్ముట్టి యుత్తమద్విజులకు స్వర్ణాది సమస్తదానంబు లొనరించెఁ బండితులకు మహాకవులకు సకలకళాచతురులకుఁ బరితుష్టిగ మడులు మాన్యంబు లగ్రహారంబులు నసంఖ్యాక విత్తంబులు దారవోసి వానకారు మొయిలుంబోలెఁ దులకించె; నమ్మఱునాఁటి పేరోలగంబున -127
గీ.సింహపీఠస్థలీ సమాసీన యైన
చకవర్తిని తాను నిస్సంశయముగ
బరువుఁ బాసియు నానందభరము మోసి
చెంతఁగల జ్యౌతిషికుని వీక్షించుటయును
128
ఉ.ఆతఁడు లేచి భక్తి వినయంబులు పెంపుగఁ జేతనున్న యా
‘జాతకపత్రమున్’ బసపుచాయల నిండినదానిఁ దీసి, యు
ద్ద్యోతితమైన సంతసముతో నల రుద్రమ దోసిలింపఁగాఁ
జేతుల నుంచి - నిల్చి వినిచెన్ మఱి వేఱొకయాకుఁ దీయుచున్.
129
ఉ.“లక్షలు - కోట్లు జాతకములం బరికించితి; వానిలో ధరా
ధ్యక్షుల వెన్నియో తఱచి యారసినాఁడను గాని - యిట్టి వీ
రక్షితినేత కాఁదగు తెఱం గెటఁ గాంచి యెఱుంగఁ; గాకతీ
యాక్షత శక్తి కెల్ల గుఱుతై నెఱి మీఱిన యోగ మొప్పెడిన్.
130
సీ.తొలి తొలి తిలకింపవలసిన పురుటింటి । కీడు లేకడ నిందుఁ జూడ లేవు
అరయఁగా, నిద్ది మహారాజరాజయో । గముగాని సాధారణముగ లేదు
శాస్త్ర ప్రవేశము సర్వకళారక్తి । చలము డింపని సాహసమ్ముపెంపు
పెండ్లి కేఁగినయట్లు పెనఁకువం జొచ్చుట । బెబ్బులి పాల్పిండు నిబ్బరంబు
 
గీ.కలుగు గ్రహసంపుట మ్మిద్ది; కాని, యొకటి - । రాహు వపకారిగా నుండి యాహవముల
ముసరిన తురుష్క సైన్య సమూహములను । దఱచు తోలించి - కడసారి కుఱచపఱుచు.
131
క.ఇది - పీఠికపై నరసిన
మదభిప్రాయంబు; దీని మరల సకలముం
జదివి విశేషము లెల్లం
జెదరక యొకచో లిఖించి చేర్చెదఁ దమకున్.
132
మ.అని చాలించిన, రుద్రమాంబ మది నిండారంగ నారేక చె
ప్పిన విప్రోత్తము నామతించి తగ నంపెన్, బిడ్డతోనున్న బి
డ్డను గన్నారఁగఁ గాంచె వేడుకలు పండన్; భావి భాగ్యోదయం
బునకున్ బారలుచాఁచు లేమనుమని న్ముద్దాడె భద్రాదృతిన్.
133
వ.ఇటులు తెనుంగురాణికి ముద్దుమనుమండై ముమ్మడాంబా మహాదేవ రాజేంద్ర దంపతుల కాత్మజుండైన యా బిడ్డండు ‘ప్రతాపరుద్రుం’డను పేర వెలసి మురిపెంబునం బెరుగుచుండె.134
రాచబిడ్డపెంపు
సీ.పసినోట వ్రేల్వెట్టి కసుగందు కేల్దోయి । పొసఁగఁ బట్టుచు నుగ్గు వోయువేళఁ
బసుపు మెఱుం గద్ది పన్నీటితో బోరు । కాడించి వెసఁ దడియార్చువేళ
మిసిమిమైఁ దళుకొత్త నసలారు పువుదూళి । యలఁది క్రొందావి చూఱాడువేళఁ
బసిఁడితొట్టియలోనఁ బవళింపఁగాఁ బెట్టి । వేడుక జోలలు పాడువేళఁ
 
గీ.గనులకు సుధాంజనం బొడికముగ నద్ది । పెదవి చప్పుడుచేసి లేనుదుటి నడుమ
బొట్టు ముట్టించువేళ - నా ముమ్మడాంబ । కరఁగి కరడయి బిడ్డలోఁ గలసిపోవు.
135
సీ.దాది చన్గుడిపి మెత్తని పాలబుగ్గలు । మునిపంట ముద్దాడి మురియుచుండుఁ;
గన్నతండిరి - దాదిఁ గాదని కసరి య । ప్పసికూన నెగవైచి పట్టఁజూచుఁ;
“జాలు - నిప్పుడె బిడ్డ పాలు ద్రావె” నటంచు । జనని పుచ్చుకొని బుజ్జవము సేయు
“నా వరాలసరంబు నీవు ముట్టకు” మని । యమ్మమ్మగారు చేనందుకొనును;
 
గీ.గడియ కెన్నెన్నొ పొత్తిళుల్ గడచి కడకు । బిడ్డ - రుద్రాంబ పొత్తిటఁ బెనఁగు వడును;
చక్రవర్తిని బాహుపంజరములోని । రాచిలుక దాఁటి చనఁగ దుర్లభము గాదొ!
136
సీ.నడుమును మెడ నిల్పి యెడనెడఁ గుదురుగాఁ । గూర్చుండి చెలువమ్ము గూర్చునాఁడు
చిఱుబొజ్జఁ బుడమిపైఁ జేరిచి మెలమెల్ల । నానుచేతుల నీఁదులాడునాఁడు
జననివంజెఱఁగు నల్లనఁ బట్టుకొని లేచి । యవలంబనమునఁ జిట్టాడునాఁడు
నీడుబాలుర తోడఁ గూడి యాటలకునై । యెగచి యెల్లెడఁ బర్వులెత్తునాఁడు
 
గీ.చదురుగాఁ బుస్తకము పట్టి చదువునాఁడు । గంటమును బట్టునాఁడు - శ్రీ కాకతీయ
కిసలయంబును రుద్రాంబ కొసరియెత్తి । మురిసిపోవును సంతోషభరము విరియ.
137
ఉ.ఆటలయందు, మేల్చదువునందును, ముద్దుల వ్రాఁతయందుఁ; బో
రాటమునందుఁ, బౌరుషమునందుఁ బ్రతాపుఁ డొకండె ముందుగా
దాఁటుచుఁ దోడి వారలకుఁ దా నొరవళ్ళను బెట్టి వారి లోఁ
దీఁటలువుచ్చు; మాటలను దేలఁడు; తేలును గార్వవాదిగన్.
138
చ.తమికొని దండనీతుల విధంబులు లౌకిక రాజకీయ తం
త్రముల మెలంకువల్ సుఖకరంబుగఁ జూచి గ్రహించెఁ; గొన్ని జ
న్మములను దొట్టి వచ్చెడి ఘనంబగు స్వానుభవాప్తికిన్, గురు
త్వ మవసరంబె! యయ్యవియవచ్చెఁ బ్రతాపున కచ్చియుండుటన్.
139
ఉ.రుద్రమదేవి తా నది యెఱుంగనియట్లు నటించి యేల్బడిన్
‘ఛిద్రసమస్య’ మన్మనికిఁ జిక్కులు దీయఁగ నప్పగించు; ని
ర్ణిద్ర మనస్కుఁ డాతఁడు వినీవినినంతనె చిక్కువిప్పు; నా
రుద్రమ పొంగి కౌఁగిటను గ్రుచ్చును; మెచ్చును వీరరుద్రునిన్.
140
చ.తెలుఁగు - త్రిలింగ - మాంధ్ర మను తీయనిశబ్దము విన్నయంతనే
పులకలుదేఱి తొల్లిటి కవుల్ విహరించిన భవ్యకావ్య వీ
థుల నడయాడి తన్మయతతో నితరంబును విస్మరించు న
వ్వలఁతి ప్రతాపరుద్రుఁడు సెబాసని పండితు లండఁ జేరఁగన్.
141
మ.ఇటు సాహిత్య కళానుషక్తి - నటు లెన్నే రాజ్యతంత్రమ్ములన్
ఘటకుండై యిఁక నాంధ్రరాజ్యభరముం గైకోఁగ మాతామహీ!
దిట మబ్బెన్ సెలవిమ్ము నా నడుగురీతిం బొల్చె ధైర్యమ్ము సం
పుటమో నాఁగఁబ్రతాపుఁ డాంధ్రులతలంపుల్ ఱంపిలంజేయుచున్.
142
ఉ.ఎన్నఁడు బెండు ప ల్కొదవనీయఁడు; పాయఁడు నాత్మగౌరవా
భ్యున్నతి; రోయఁడెప్పుడు పరోన్నతిఁ; గోయఁడు పూలుమొగ్గలున్
మన్ననసేయుఁ బెద్దలను; మంచికి ముంగలిదారి తీయు; భా
వోన్నతిఁ గైతవ్రాయుఁ; గొదయున్నదె రాజకిశోరమూర్తికిన్!
143
గీ.రాజ్యతంత్రపు వేఁడి - సారస్వతమ్ము
చలువ - కనుఁగవ నూఁగాడ, జైన గత వి
రుద్ధ సిద్ధాంతముల యెడ రుద్రవిభుఁడు
కనికరము వీడి మూఁడవకన్నుఁ దెఱచు.
144
క.పదునాఱు శరత్కళలం
బొదలిన వీరప్రతాప పూర్ణసుధాంశుం
డెదిగించెఁ గాకతీయా
భ్యుదయ క్షీరోదరాశి పొంగులువాఱన్.
145
చ.అనుగలమై త్రయోదశ శతాబ్దము నంటిన తొంటిపున్నెముల్
తనర ఫలించి నాల్గవ పదంబున - మన్మఁడు సంతరించు పె
త్తనమును గంటఁ జూడ బలితంబగు వేడుక గల్గి చక్రవ
ర్తిని యొకనాఁడు వాని నెచరించెడి పల్కుల నిట్లు వాకొనెన్.
146
ఉ.“నేఁటికి బిడ్డ! నా వ్రతము నిండి ఫలశ్రుతిభాగ్య మబ్బెఁ; గొం
డాటకుఁ గాదు నీదు నెదుటన్; నినుబోఁటి సుపుత్రుఁ గన్న యా
బోటి యనేక కోటిభవముల్ తపియించి ననుం గృతార్థగాఁ
జాట - మదీయ గర్భమున జన్మమునందె ననుంగు బిడ్డగన్‌.
147
ఉ.క్రమ్మెఁ బదాఱు నిండిన శరత్తులయీడు; చెలంగె నూఁగు మీ
సమ్ముల క్రొత్తజవ్వనపు సవ్వడి; కావున బిడ్డ! నీదు నా
మమ్మిది సార్థతం గొనఁ గ్రమంబగు క్షాత్రపరాక్రమంబునం
గ్రుమ్మవలెం బరాళిని; నిరూఢమతిం దెలుఁ గేలఁగావలెన్.
148
చ.తరుణము నెంచి, నీ మనసుతత్త్వము నెంచి, భవత్పరాక్రమ
స్ఫురణము నెంచి, నీ బెడఁగు పోకడ లెంచి, నయప్రసక్తి నీ
యెఱుకువ నెంచి, నా భరము నెల్లను నీయెడ మోపనెంచితిన్
మురియు నెడంద రాచఱికముం గొను నిన్ గనుఁగోఁ దలంచితిన్.
149
గీ.తండ్రి గణపతివిభు ననంతరము పూని
యీ తెలుంగాణె మఖిలంబు నించుమించు
మూఁడు దశలుగ నేలితి; ముసలినైతి;
బలము కైవ్రాలె; మతి పాటవమ్ము తూలె.
150
ఆ.వె.రాచదనపు వగపు మోచి రేయింబవల్
తంత్ర మంత్రములను దండసిలక
యితరచింత దక్కి యీశ్వర చింతచేఁ
గడపఁ దగిన యీడు గాదె యిద్ది!
151
వ.అగుట నే నియ్యాంధ్ర సామ్రాజ్యమున ని న్నభిషిక్తుంజేసి విశ్రాంతి గొనం దలంచితి; నీ యభిప్రాయం బెఱింగి మఱి యాకార్యం బాచరణీయం బని యింత సెప్పితి”నని రుద్రమాంబ యూరకుండుటయు నా దౌహిత్రుండు -152
చ.వినయముతోడి చిర్నగవు వేడుక గొల్పఁగ - నిండుమోము వం
చిన యొక క్రొత్తభంగి తగఁ - జేతులు దోయిలికట్టి, మొగ్గవి
చ్చిన తమిపూవుఁ దేనెపెరచే నెఱివిందులు వెట్టి, చక్రవ
ర్తిని హృదయంబు కట్టి తరితీపుల వాతెఱ విప్పె నీగతిన్.
153
ఉ.“ఇంచుక పెద్దచేసి యిటు లీవు వచించుట తల్లిప్రేమ రె
ట్టించుట గాక యేనొక కడింది వలంతినె? చేరఁబెంచి దీ
వించిన పండుదీవనలపెం పొక యొజ్జనముం బొనర్ప నా
లించిన నాల్గు ముక్కలు ఫలించిన - నాది ప్రయోజకత్వమే!
154
శా.నీ యాదేశము కా దనం దగదుగానీ, యింకఁ గొన్నాళు లి
ట్లే యారాటము లేక నీవెనుక నా యీ బాల్యముం బండఁగాఁ
జేయ న్వేఁడెద దోయిలించి; భవదాశీరూప సామ్రాజ్య సే
వాయత్తంబగు నాదు చిత్త మిది యమ్మా! వేఱ పోనిత్తునే?
155
గీ.దవ్వు లరసిన యీ సమాధానమందు
నించుక యశక్తతయు ధ్వనియించుఁగాక
నాయెడల నన్యులకు నైన నాకుఁ గొదయె!
లేదు మాతల్లి కడుపున భేదబుద్ధి.
156
ఉ.ఈపయి నీ దురాయి యది యేమయినన్ శిరసావహించి నే
నాపని నిర్వహింపఁగ సమర్థుఁడ నయ్యెద; దేశమాతృ సే
వా పరతంత్రవృత్తి యని భావనచేసెద; మాతృమాత్రను
జ్ఞాపరిపాలనం బను ప్రసక్తిని భక్తిని స్వీకరించెదన్.”
157
వ.అని వెండియుఁ బలుకంజూచు నా ప్రతాపుం ‘గా’ దను చూపుల వారించుచు “బిడ్డా! నీ హృదయంబు గుర్తించితి; నీ వినయవాదంబునకు హర్షించితి; మహామండలేశ్వరి రుద్రమాంబ కాకతీయ సామ్రాజ్యమున ని న్నభిషిక్తుం జేయ ననుశాసించుచున్నయది దీని కొం డన రా”దనుటయు ధీరోదాత్తుండగు ప్రతాపుఁడు మాతామహి మధురశాసనంబునకు మనంబునం బొంగి సెల వని యూరకుండె; నా వెంబడి -158
గీ.ధర్మమయమూర్తి వీరప్రతాపరుద్ర
రాజపుత్రుని యభిషేక రమ్యవార్త
తెలుఁగురాజ్యము నలుచెఱంగులను జాటఁ
బంచె రుద్రాంబ మంగళాభ్యంచితముగ.
159
గీ.వీరరుద్రునియెడ భక్తి వెలసియుంట
నృపతి దైవాంశభవుఁడని యెఱిఁగియుంట
నందఱును బెద్దలై స్వకార్యముగ నెంచి
వేడ్క నరిగిరి దేవునిపెండ్లి కటులు.
160
వ.అయ్యభిషేకోత్సవమున కాహూతులై యనేకులు సామంతులు రాజబంధువులు పండితులు మహాకవులు గాయనులు విచ్చేసి తత్తదర్హ మర్యాదా పూర్వకమ్ముగా విడియింపంబడిరి; యభిషేక శుభంబు ఱే పనఁగా నేఁటిరేయి కోరుఁగల్లు నేల యీనినటులై ప్రజావ్రజంబున భాసిల్లె -161
మ.వఱువాతన్ బవమానపోతములతో వైతాళికస్తోత్ర గా
నరసాసంగి తరంగముల్ నెగచి వెంటన్ వీనులం దూఁది “భూ
వరపుత్రా! సుముహూర్తకాల” మని యొప్పన్ లేపి కాల్యక్రియల్
జరిపించెం జెలికార మారఁగ భవిష్యద్రాజ మార్తాండుచేన్.
162
చ.పలపల వేగునప్పటికిఁ బంకజబాంధవుఁ డోరుఁగంటి లో
పల విడిసెం బ్రతాపుని శుభంబును వేడుకఁ జూచిపోవ వే
వెలుఁగుల సేన తో డగుచు వెంట భజింపఁగఁ; ‘గర్మసాక్షికిన్
బిలువని పేరఁటం’ బని గణింపఁగ నప్పురి దక్షు లుందురే!
168
క.తొనఁకిన మంగళ తూర్య
ధ్వని తోడుగ - ‘దుర్గ శివుని’ తాండవకేళిన్
గనుఁగొనఁ జేరిన జనములు
తనరిరి ముక్కోటి దేవతల మాదిరిగన్.
164
చ.తల గడిగించి రైదువలు తల్లి స్వయమ్ముగఁ బువ్వునూనియం
దలపయిఁ బెట్టి దీవనలు దారలువోయఁగ; విల్వ పట్టు బ
ట్టలు ధరియింపఁ జేసి నుదుటన్ నెఱికుంకుము బొట్టు దిద్ది; రా
చెలువము చాలదొక్కొ, యభిషేకశుభంబున రాచబిడ్డకున్.
165
గీ.తల్లి ముమ్మక్క - పసుపునఁ దడిపి యొక్క
సూత్రమును గట్టె గళవీథి సొంపిలంగ
బిడ్డకును ‘దృష్టి’ బొరయని వెర వెఱింగి
యదియ, వానికి నాణిముత్యాలపేరు.
166
మ.“ఉడువీథిన్ శిఖరావలంబియగు నాంధ్రోర్వీశు మోసాలపై
గడియారంబునమ్రోసె రెండయిదులై ఘంటాఘణాత్కారముల్”
వడి నేతెంచిరి “వచ్చె మూర్త” మనుచున్ బట్టాభిషేకోత్సవం
బడరం గాంచఁగ వేడుకన్ మునిఁగి రా యా రాజసామాజికుల్.
167
చ.కనకమయాసనంబులఁ బ్రకాశ లసన్మణి విష్టరంబులన్
జినిచిని క్రొత్తజాతి కురిచీలను మేల్ బురుసాతివాసులన్
దనరఁగఁ దత్తదర్హణ విధంబు పురస్సర దాదరంబుగా
నునిచిరి వారి నెల్లర నిజోచిత భంగి నియుక్తపూరుషుల్.
168
సీ.ఒక్కింత ప్రక్కగా నొదిగి ముంగలులౌచు । హితము సూపెడి పురోహితులు సాగ
ప్రెగ్గడల్ శిరముల నొగ్గి చేతులు కట్టి । పింగలులై యంగవించి నడవ
నాస్థాన కవులు గాయన శిరోమణులును । నడుగడ్గునకు వెంట నంటి రాఁగ
వంది మాగధులు కైవారంపుఁగరముల । బారులై స్తుతిపాఠఫణితి నొడువఁ
 
గీ.గడఁక ముత్తైదువలు శుభాక్షతలు పూలు । విరియఁ జల్లంగ నేనుంగుపిల్ల వోలె
మెల్ల నడచుచుఁ బెంచిన తల్లితోడ । వచ్చెను బ్రతాపుఁ డభిషేకభవనమునకు.
169
మ.శుభ తూర్యస్వనముల్ చెలంగఁ, గడు హెచ్చుల్ వందిపాఠంబు లా
రభటిన్ మించఁగఁ బంచవాద్యకృత నిర్హ్రాదంబులున్ పెంపుగా
సభయెల్లన్ జయరావముల్ వలికి మెచ్చన్ వచ్చె రుద్రప్రభుం
డభిషేకోత్సవ వేదికాస్థలికి సోపాధ్యాయుఁ డుద్యద్గతిన్.
170
మ.చెలువారన్ సహజప్రసన్న మహదాశీస్సాధు వాదాయమా
న లసన్మూర్తి ప్రతాపరుద్రవరుఁ డాంధ్ర ప్రాజ్య రాజ్యేందిరా
లలనం బెండిలియాడ వేదికకు నుల్లాసంబుమై వచ్చె మం
గళ కోలాహల కాహళీరవ తరంగశ్రేణిఁ దోఁగాడుచున్.
171
వ.ఆయెడ శ్రీస్వయంభూదేవునకు మాతామహి రుద్రమాంబకుఁ గులవృద్ధులకు మనఃప్రణామంబులు గావించుకొని పురోహితుల ప్రార్థనంబున వీరరుద్రుండు భద్రాసనం బధిష్ఠించుటయు నతని యుత్తమాంగమున నవాంగుళాయామంబును నష్టాంగుళ విస్తృత మధ్యంబును జతురంగుళ విస్తారపార్శ్వంబునగు బంగారు పట్టంబు ప్రధాన పురోధ కైసేసె; నామేలి తరుణంబున -172
ఉ.ఆయత తూర్యధుర్య విజయధ్వనిలో సుముహూర్తవేళకున్
శ్రీయువరాజమూర్ధ మభిషేక మొనర్చిరి మూఁడుమాఱు లా
మ్నాయ మహాభిమంత్రిత సనాతన భారతఖండ పుణ్య నా
దేయజలంబులం గడఁగి తీయనిడెందములం బురోహితుల్.
178
వ.పదంపడి ప్రధానులు పేరఁటాండ్రు కవీంద్రులు కన్నియలు మున్నుగా వచ్చి యభిషిక్తుం గావించుటయు -179
గీ.వెలిగొడుగుక్రిందఁ - జామరంబులకు నడుమఁ
గనకపట్టము స్వోత్తమాంగమున మెఱయ
రాచఠీవికి నొక క్రొత్తరంగు పూసి
యొసఁగె రాజ్యేందిరకు ముద్దుపసదనంబు.
175
ఉ.వీరనృపాలగాథలఁ గవిత్వము నిండిన పాటఁ బాడి వి
స్తార విశిష్టభావములఁ దన్మయతం గొని పేరఁటాండ్రు నిం
డార నొసంగు కప్పురపుటారతి వెల్గులలోన రాజ్యల
క్ష్మీ రమణీలలామ వలచెన్ యువరాజుఁ బ్రతాపరుద్రునిన్.
176
వ.పట్టబంధోత్సవంబు నిర్విఘ్నబంధురంబుగా నెఱవేఱుటయు మంత్రులు మహారాజు నుపసర్పించి ప్రభూ! ప్రజావర్గంబు దేవర దర్శనభాగ్యంబు వడయ నపేక్షించియుండె -177
గీ.రాజ పట్టోత్సవానంతరమున వార్చి
కడిమి నిండార నొడ్డోలగంబు దీర్చి
జనుల సేమమ్ములను సమీక్షణముసేఁత
కాకతీయ కులక్రమాగతముగాదె!
178
చ.అనుటయు లేచి తెన్గునొడయండు ప్రతాపుఁడు మంత్రిసత్తముల్
గొనబుగ వెంట రాఁ గొలువుకూటము డగ్గఱె సర్వతః ప్రతి
స్వనిత జయోచ్చరావముల వందికదంబము బారుదీరి చెం
త నడవ, సంతసంబును గనంబడ నీని గభీరభావుఁడై.
179
గీ.శ్రీస్వయంభూ మహాదేవుఁ జిత్తగించి
తరతరంబుల కొలముపెద్దలఁ దలంచి
వృద్ధసభ్యుల కెఱఁగి మంత్రికర మూఁది
పొంకముగఁ గొల్వుగద్దె నలంకరించె.
180
ఉ.అంతఁ బ్రధానుఁ డక్కొలువునందలి సభ్యులఁ జూపి “వీరు దే
శాంతర రాజపుత్రులు - నిజాప్తులు వీరలు - వీరు మేటి సా
మంత మహీపతుల్ - నిరుపమానబలాధికులౌ వరూథినీ
కాంతులు వీరు - వీరొసఁగు కాన్కలు దేవర యాదరించుతన్.
181
సీ.వేదశాస్త్ర పురాణ విజ్ఞాన సర్వస్వ । మొదుగఁ బట్టిన భూసురోత్తములను
గవితలోన నలౌకికము రసానందము । ననుభవించెడి రసికావళులను
సత్యకాలముతీరుఁ బ్రత్యక్ష మొనరింపఁ । బూని యేతెంచిన జానపదులఁ
“దమతోడిదే సమస్త ప్రపంచం”బని । చెమ్మటలూర్చు కృషీవలులను
 
గీ.వారి వారిని జూపి వేర్వేఱఁ జెప్పి । ప్రభువరా! వీరు - వారి వైభవముకొలఁది
యుడుగరలతోడ విచ్చేసి యున్నవార । లవధరింపవె!” యని వేఁడ నాలకించి.
182
గీ.నిండు టెడఁదల దవ్వులనుండి వచ్చి
కాన్క లర్పించు సభ్యులఁ గనికరించి
కనులఁ దులకించు చిఱునవ్వు కళుకుతోడ
ననుమతిం జూపెఁ గాకతీయ ప్రభుండు.
183
సీ.సొరిది నొక్కొకరుగా నరుదెంచి తలలొగ్గి । యరిగాఁపు - లేన్గులఁ దురగములను
గాలుబలంగము వేల లెక్కగఁ గట్న । ములు సదివించిరి; ముట్టినటులు
వారిఁ గరస్పర్శఁ దేరిచె భూపతి; । యర్పించు రత్నాద్యుపాయనముల
మునివ్రేళ్ళఁ దాఁకె; సొమ్ములను లెంకలుదీసి । రాసులు వోసి; రీ రహి నొకింత
 
గీ.తడవు కొలువును దీర్చి ప్రతాపనృపుఁడు । హెచ్చుకుందులు వీడి - వా రిచ్చునట్టి
కాన్కలు గ్రహించి నవ్వుల గారవించె । మోస మెఱుఁగని వామనమూర్తి యగుచు.
184
చ.ఉడుగర లాదరించి - సమయోచితరీతి మతిం దలంచి - య
య్యొడయఁడు వేదవేత్తల ద్విజోత్తములం దొలి చిత్తగించి - మే
వడిమెయి నగ్రహారములు భవ్యసువర్ణము దారవోసె; వెం
బడి బహుశాస్త్ర పండితుల మన్ననసేసె వితీర్ణి పెంపునన్.
185
గీ.తెలుఁగులో దేవభాషలో వలఁతులైన
కవుల నందఱ నరసి బంధువులఁ బోలెఁ
బలుకరించుచు వారి కబ్బములు మెచ్చి
హృదయ మిచ్చెను బృథులసంపదలు నిచ్చె.
186
వ.శిల్ప గానకళాది కోవిదుల సత్కారంబు లయినవెనుకఁ గాకతీశ్వరుండు పారిషదుల నాలోకించి -187
చ.తరములనుండి వచ్చెడి విధానము వేరులు పాఱి యిట్టు లీ
గుఱుతుల నేర్పఱించెఁ బ్రజకు న్నరపాలునకున్‌; రహస్యముం
దఱచిన భేద మిందుఁ గలదా! మనమందఱ మొక్కభూమిలోఁ
బెరిఁగిన యన్నదమ్ములము; వేఱుగొనం బనిలేదు లేశమున్.
188
గీ.కాని, మీరెన్నుకొని మమ్ముఁ గాకతీయ
సింహపీఠి నధిష్ఠింపఁ జేసితి రన
మాకుఁగల మాతృదేశాభిమానమునకు
నొఱపుసేఁతయగాని వేఱొకటి కాదు.
189
ఉ.కాక - యథార్థ మొక్కటి; యొకండు ప్రభుండని వాని శాసన
స్వీకృతి తప్పఁ జెల్లదని చిత్తమునం దొక భీతి లేమి నీ
లోక మనర్థమూలమయి లోలుపమై చెడిపోయి వట్టి చా
ర్వాకములోనికిన్ దిగి పరస్పర మాగడముల్ చొఱంబడున్.
190
ఉ.కావున మీ రొనర్చు నృపగౌరవమున్ సయిరించినాఁడ నా
జ్ఞావిధి కల్మి రాజ నయినాఁడనుగాని త్రిలింగ రాజ్య సు
శ్రీవిభవోపభోగమునఁ జెల్లును మీకును మాకుఁ దుల్యసం
భావన; చూడఁగా ననుభవంబులు మీయవి; మావి భారముల్.
191
క.మా పూర్వనృపులయెడ మీ
చూపిన గౌరవము నేఁడు చూపినఁ దెలుఁగున్
గాపాడెద; శాత్రవులన్
రాపాడెదఁ; బాడెదం బరాక్రమగీతిన్.
192
గీ.అని పలికి కొల్వు సాలించు నవసరమునఁ
గాకతీయ నరేశ్వరుఁ గాంచి రెండు
నిముసము లనుజ్ఞ వడసి వర్ణించె నిట్లు
‘మారన’ కవీంద్రుఁ డకలంక మధురఫణితి.
193
గీ.“పలుకుపలుకునఁ బ్రజలతోఁ జెలిమిగలిపి
తెలుఁగుపై గల మమకార మలవరించి
మలఁపు మలఁపున దేశాభిమానపరతఁ
దేర్చి చూపిన నూత్న సందేశ మిద్ది.
194
గీ.ఇత్తెఱంగునఁ బాలు నీ రేకమైన
కరణి నాత్మీయభావబంధురత చిందు
కాకతీశ్వరు రాచఱికమ్మునందు
ముందు మన తెల్గు భూలోక నందనంబు.”
195
గీ.అను కవీంద్రాభినందనం బయిన పిదప
ముదముఁగూర్చు త్రిలింగేంద్రు మొదటికొలువు
ముగిసె జయ పూర్వ కరతాళముల రవమ్ము
లంబరం బంటి మఱుమ్రోఁగు సంబరమున.
196
వ.ఇట్లు విభవోత్తరంబుగ మూర్ధాభిషిక్తుండగు నవ్వీర ప్రతాపరుద్రుండు కాకతీయ రాజవంశ యశోమణికి మెఱుంగులు వెట్టుచుఁ దెనుంగాణెమ్మున ధర్మంబు తుఱంగలింప నేకాతపత్రంబుగ నేల్బడి నెఱపె.197
ఉ.సంగతమై తెలుంగునఁ బ్రజాతతి యేవిధమైన బాధయున్
భంగము నందకుండ, నొకపాటి దొసంగుఁ బొసంగకుండ, న
స్తంగతమైన ధర్మమును జక్కఁబడన్ బ్రతికింపఁజేసి రా
జ్యాంగవిధాన మేర్పఱిచె నా నృపమౌళి యనాహతస్థితిన్.
198
ఉ.సైనిక శిక్షణంబునఁ బ్రశస్త మహాయుధ రక్షణంబునన్
మానిత వీర పోషణమునం బరరాజ్యగత ప్రవృత్తి వి
జ్ఞానమునం గడుంగడు విశారదుఁడై కొదలేక రాష్ట్ర ర
క్షా నిరతిం బ్రతాపుఁ డెసకంబు వహించె నుదంచితస్థితిన్.
199
ఉ.రావులు - రైతు - లం చను పొరల్ తొలఁగించి తెలుంగువారలం
బూవుల నుంచి, యే యొకని పోఁడిమియున్ ససిదప్పి నేలలో
రావడి ముట్టకుండఁగఁ బరస్పర సఖ్యము తీవసాగ నాం
ధ్రావని నా ప్రతాపుఁడు జయధ్వజ మెత్తె శుభోత్తరంబుగన్.
200
చ.తెలుఁగుచరిత్రలో రసముఁ దేఱిచి చూచితిమేని జీవనా
డుల నుబికించి ధైర్యపుముడుల్ బిగియించి బలమ్ముఁ బెంచి యాం
ధ్రుల మనిపించి ముందడుగు త్రోసెడి శక్తులు కాకతీశునం
దలవడి యా శతాబ్దపు మహత్త కనుంగవ నొత్తియాడదే!
201
ఉ.తనివారం జుళికించె వాఙ్మయసముద్రం బెవ్వఁ; డెవ్వండు పా
యని దీక్షం గవితాతపస్సుగొనె విద్యానాథుఁ డాతం డగ
స్త్యుని పేర్గొన్న కవీంద్రుఁడున్ రసము రాసుల్వోసి శ్రీ వీరరు
ద్రుని లోకోత్తరకీర్తి పాడుకొనలేదో! భారతీగీతిగన్.
202
మ.అటు లైదాఱు వసంతముల్ గడచి రాజ్యశ్రీ చిగుర్పంగ వి
స్ఫుట ధర్మమ్ము విరాజిలన్ బ్రజల పెంపున్ సొంపు ఱంపిల్ల నం
తట వర్ణాశ్రమ పద్ధతుల్ నెగడ సత్యస్ఫూర్తి నిండార మా
రట శ్రీరాముఁడు వీరరుద్రపతి యాంధ్రం బేలుకాలంబునన్.
203
ఆ.వె.తెలుఁగునాటఁ గాదు - దేశాంతరములను
వీరరుద్రునాఁట నోరుఁగంటి
కోటఁ దేఱిచూడ గుండెలుండిన యొరుఁ
డుండఁ డనుట యతిశయోక్త మగునె!
204
ఆ.వె.కడలినడుమ నావగా రాజ్యతంత్రము
నడచినంతసేపు నడచిపోవు;
నడుమ నొక్క ఛిద్ర మడరినఁ గడదాఁక
వగపులెన్నొ వెంటఁ దగులుచుండు.
205
వ.ప్రతాపరుద్రభూపతి సమకాలికుండై రామచంద్రుండను యాదవరాజు దేవగిరి రాజధానిగా మహారాష్ట్ర కుంతల దేశమ్ములం బాలించుచుండువాఁడు-206
చ.తలఁగని పెంపు నెక్కొనిన ‘దక్కను’ దేశములో స్వతంత్ర రా
జుల తెగలోఁ బ్రతాపుఁ డొక శూరశిఖామణి; వెన్క వాకొనన్
వలఁతి యనంగ దేవగిరి వల్లభుఁడొక్కఁడు; లోనలోన వీ
రులయెడ వీరు లెన్నఁడును రోసము నీసును బాసియుందురే!
207
గీ.దేవగిరిరాజు - నోరుఁగల్ భూ విభుండు
సాటి పోటరు లగుటఁ బోరాటమునకు
దిగక లోలోన నిరువురు తీవరించి
యఱమరలు పెంచుకొనిరి యన్యోన్యముగను.
208
వ.ఇటులు కొన్నేండ్లు గడవ నట నుత్తర హైందవంబున రాజకీయపు టల్లకల్లోలములు పెల్లురేఁగి యా వడగాలి దక్షిణంబున సైతము వీచి వేఁచఁ దొడంగె-209
ఉ.ఓరువలేమి వైరముల నూని తురుష్కులు ‘రాజపుత్ర’ రే
ఖా రమణీయ జీవన వికాసము మోసులఁ బట్టి త్రుంచి పెం
పారిన సాహసంబున జయధ్వజ మెత్తిరి; నాఁటి నుండియున్
మాఱెఁ గ్రమక్రమంబుగ నమాయిక హైందవ బంధురోన్నతుల్.
210
శా.చేసేఁతం గొని యొక్కనిన్ మిగులు వాసిన్ వేఱొకం డూని పే
రాసల్ మోసులువాఱ నాల్గవయుపాయం బూఁది, సొంపేది - ఢి
ల్లీ సుల్తానులు సాధుభారతముఁ దూలింపన్ నిరాధారలై
గాసింగూరు పతివ్రతామణుల శోకశ్లోక మూఁకొట్టరే!
211
గీ.విఱుచుకొని మీఁది కుఱుకఁగా వేచియుండె
నడ్డ మాఁకయులేని మహమ్మదీయ
ఘోర శార్దూల; మద్దాని బారిఁ దొలఁగు
తలఁపు కలుగదు తెలుఁగువారలకు నాఁడు.
212
సీ.బల్లిదుండగుట దర్పోల్లాసమును బెంచు । కొని శత్రుభయము లేకునికి సతము
పండితగోష్ఠిలోఁ బడి దేవగిరిరాజు । రామచంద్రుండు పరాకుగొనియె
రాజ్యరక్షణమునఁ; బ్రకటభుజాస్ఫూర్తి । కాకతిరుద్ర భూకాంతమణియు
“మన కేమి!” యనునట్లు మౌనమ్ముగొనియె స్వ । రాజ్య సంరక్షణ క్రమమునెడల
 
గీ.వారి శాస్త్ర ప్రసక్తులు - వారి యోగ్య । తయును - వారి పండితజనాదరణ మరసి
దయ దలంతురె! వచ్చె నదాటుగాఁగఁ । జండతరమగు తౌరుష్క దండయాత్ర.
213
వ.నాఁడు ఢిల్లీరాజ్యంబు ఖిల్జీవంశీయుఁడు జలాలుద్దీను నేలుబడినుండె; జలాలుద్దీను వాంఛలుడిగిన ముదుసలి వ గ్గగుటంజేసి హింసావిధానమునుండి మనసు మరలించుకొని చిక్కిన నేలం దనివి గొనియెంగాని యాతని తమ్ముని కొమరుం ‘డల్లాయుద్దీ’ ననునతండు బెట్టిదుండగుటఁ బరరాజ్యకాంక్షం దవిలి మహారాష్ట్ర రాజ్యశ్రీ దెసఁ గన్నువైచిన వెనువెంట -214
ఉ.పట్టినపట్టుతో నెలుఁగుబంటులఁ బోలిన దంటజోదులై
గట్టులఁ బుట్టలం గడచి క్రన్నన నెన్బదివేల యాశ్వికుల్
ముట్టడిసేయ ‘దేవగిరి’ మూఁగిరి ‘యాదవరాజు లోఁగె ని
ప్పట్టున మా’ కటన్న గరువంబు మనంబుల దందడింపఁగన్.
215
క.ఢిల్లీసేనాధ్యక్షుం
డల్లాయుద్దీను దండయాత్రకు రాఁగా
మల్లడిగొను యాదవ నృప
తల్లజు పౌరుషము చెల్లె; ధైర్యము డొల్లెన్.
216
క.ఎదిరి నెదుర్కొని పొదువం
గుదురగు రాణువలు లేమిఁ గొందలపడియున్
బొదివెను యాదవపతి యా
కదనమునన్ నాల్గువేలుగల సైన్యమునన్.
217
వ.అశీతి సహస్ర సంఖ్యాకంబగు నమ్మహామహమ్మదీయ వాహినితోనున్న యల్లాయుద్దీనుని గద్దరించుచుఁ గొంతతడవు పోరుసలిపి యా రామచంద్రదేవుండు నిస్సహాయుండై, దిటవుమాలి దుర్గపాలనంబుఁ గావించుకొనం జాలమి వగచుచు విన్నాణి యగుట విప్రయాణంబునకుఁ బోక యా మహమ్మదీయపతి పొందు నర్థించుచు -218
సీ.ఆఱునూర్ల మణుంగులగు ముత్తియము లిచ్చె; । వెండినాణెమ్ములు వేలొసంగెఁ;
దగు వెలగల కొన్ని నగలు కానుకవెట్టెఁ; । గొమరారు పట్టుఁబుట్టములు నాల్గు
వేలు సమర్పించె; మేలిదేశముఁ గొంత । యిడెఁ; గొంతకప్ప మీ నొడఁబడియెను;
నింక మీయాన కే నెదురాడ నని పల్కెఁ; । గలయిక నెయ్యమ్ముఁ గలుపు మనియె;
 
గీ.నంత ‘ఉద్దీను’ సంతోష మవఘళింప । సందు దొరకిన దని యెంచి సంధి కొప్పె;
దండు మరలించి రామచంద్రపతి వీడు । కొనఁగ ఢిల్లీపురముఁ జేరుకొనె నతండు.
219
గీ.రమ్యతరము మహారాష్ట్ర రాజధాని
గజిబిజింప, నయ్యాదవకాంతుఁ డడలఁ
దీవరించి తురుష్క సేనావిభుండు
జగము బెగడందఁ జంద్రధ్వజమ్ము నెత్తె.
220
శా.మాయాతంత్రములందుఁ బేరువడి కొంపల్మట్టు మేధావి య
ల్లాయుద్దీను పితృవ్యునిం గడచి నిర్లక్ష్య ప్రభుత్వోద్ధతిన్
జేయం జాఁగెను ఢిల్లీరాజ్యమును; గస్తింగూర్చె నేపాపమున్
డాయం బోవని సాధుమానసుల; కొడ్డారించె హిందూరమన్.
221
సీ.‘ముల్తాను’ నకు సైన్యముం ద్రోలి యల ‘జలా । లుద్దీను’ తనయుల నోటు వఱిచె
మొనసి దిశాపట్టమును గట్టె సింధు దే । శమున మంగోలియా జాతి కెల్ల
ఘూర్జర రాజ్యంబు గుప్పిటఁగొని ‘మలి । క్కాపూరు’ బానిసగా నిడికొనె
ఢిల్లీరమ నటమటింపఁ దలంపూను । లోభులఁ బట్టి పరాభవించె
 
గీ.నిత్తెఱంగునఁ దలఁచిన దెల్ల గెలుపు - । పట్టినది బంగరువుగాఁగఁ బరిణమింప
నుబ్బి గడిమించి భరతమహోర్వి - సర్వ । మొక్కఁడై యేలుకొన నెంచి యొడుపువట్టె.
222
వ.ఆ ‘యుద్దీను’నకు దండనాయకుండు ‘మలిక్కాపూరు’ చలంబున బలంబున నేలిక కుద్దీఁడై యుండు; నాతని ధైర్యసాహసాదుల నెఱింగినవాఁడు ఢిల్లీపతి యొకనాఁడు సేనాధ్యక్షు రావించికొని -223
గీ.పాదుసాఠీవి నొడుపు సంపదలు చొనిపి
బవిరి గడ్డము కుడికేల నివురుకొనుచుఁ
బ్రాజ్యతర భారతీయ సామ్రాజ్యకాంక్ష
నూలుకొన నిట్లు వెచ్చనినోరు తెఱచె.
223
మ.“మన సామ్రాజ్యముఁగాంచి యోరువని యా ‘మంగోలియా’ జాతివా
రిని మట్టాడితి; మింక నుత్తరధరిత్రిన్ వీరు లేవారలున్
గనుఁగో నేరరు ఢిల్లివంక నిది నిక్కం; బింక నా వైపు ద
క్కనుపై ముందొకచూపు చూడవలయుంగాదే నిదానంబుగన్.
224
చ.తన కెదు రెవ్వ రన్న బిగిఁ దాలిచి కాకతి వీరరుద్ర భూ
జనపతి మత్తుఁగన్నుల నిశాంతమునందున నిద్రవోయి మా
యనువు దలంపఁ డౌర! తన యాంధ్రము - తానును శాశ్వతంబుగా
మనెదరె! చూతుఁ గాక! బతిమాలి మమున్ శరణంబు వేఁడినన్.
225
చ.అది యెఱుఁగండె! దేవగిరి యాదవరాజ పరాభవంబు; ను
న్మదమతి దుర్గరక్షనయినన్ ససిగాఁ బొనరింపలేమి నే
లిదమున నున్నవాఁడఁట! బలే తరుణం బిది; యోరుగంటిపై
వదలుము సేనలన్; విజయవైభవముం గొనితెమ్ము నీవయై.
227
చ.కడుకొనురక్తి రాణువలఁ గైకొని నీవు తెనుంగు కోటకున్
వెడలిన - మేము వీర వరవిక్రమ ధోరణిఁ దోడుతోఁ ‘జితో
డ్గడము’ను ముట్టడించి తమకమ్ము చెలంగఁగ భీమసింహు నె
వ్వడి తొలఁగించివైచి ‘జయపద్మిని’ బట్టఁగఁ బోదు మింతటన్.
228
గీ.ఓ చమూనాయకా! తుది నొక్కమాట;
తెలుఁగురాజును గెలిచివచ్చిన కటారి
నెత్తు నిన్నెట్లు మెత్తుమో! యేమి యేమి
యిత్తుమో! పాదుసాచేతి కెముకలేదు.”
229
చ.అని యిటు లుత్సహించు పలుకాడఁగ, రక్తపుఁబోటు గాటమై
పెనఁకువయందు సాహసముఁ బెంప నటద్భ్రుకుటీ సహస్రలో
చనుఁడు ‘మలిక్కపూరు’ తనసామికి సంతసమారఁ జేసి వా
కొనె నిటు గుప్పిటం బొడిచి కొండలు పిప్పి యొనర్చుధోరణిన్.
230
ఉ.దేవరపంపునన్ దెలుఁగుదేశము గాదు సమస్తభారతో
ర్వీవలయంబు నెత్తి మెలి వెట్టఁగఁ జాలినవాఁడు పాదుషా
సేవకుఁ; డా ప్రతాపుని గ్రసించి త్రిలింగపతాకఁ జించి ఢి
ల్లీ విజయంబుఁ జాటు నవలీలమెయిన్ జగమెల్ల మెచ్చఁగన్.
231
సీ.సతతంబు కవితాప్రసక్తిఁ బ్రొద్దులు పుచ్చి । పెఱ కర్జములను నేమఱినవాఁడు
తుదిలేని మతము పట్టుదలతో శైవమా । ర్గాసక్తి నావిష్టుఁడైనవాఁడు
వలచి ‘మాచల్దేవి’ వారాంగనామణి । కన్ను సన్నలఁ దగుల్కొన్నవాఁడు
రతనాల విలువ నేర్పఱచు నేర్పున మించి । నిరతంబు తద్గోష్ఠి మరఁగువాఁడు
 
గీ.చెంతఁగల దుర్గమును గాపు సేసికొనని । యలసమతి వీరరుద్రుఁడా, యస్మదఖిల
సైన్యధాటి నెదుర్కొను శక్తి గలఁడు? । పోయి దక్కను ముట్టి గెల్పుసిరిఁ దెత్తు.
232
వ.నా శక్తియుక్తులు చిత్తగింతురుగాక; యని యుఱిమి నలువదివేల కాలుబలంబును బదివేలు మించు గుఱ్ఱపుదడంబును నాయత్తపఱిచికొని తెలుంగాణెమ్ముపై దండు వెడలనెంచె నయ్యెడ -233
ఉ.ఆశ్వయుజంబు వచ్చి శరదంబుదముల్ వెలవెల్లఁ బాఱె “భూ
మీశ్వర దండయాత్రలకు నియ్యది మేలగు వేళగాని ఢి
ల్లీశ్వర! నీచమూవితతి కిప్డు పరాజయ మాంధ్రసైన్య ఝం
ఝాశ్వసనంబు గూర్చు” నని చాటుటకు న్మొగమోట నందుచున్.
234
సీ.వలయు నభ్యవహార వస్తు సంభారమ్ము । తో నసిముసలోరు తోమరాది
వివిధాయుధములతో విస్తృతసైన్యసం । పత్తితో నర్హసేవకుల తోడఁ
బదివేలపైనున్న వార్వంపు దడముతో । నలువదివేల కాల్బలముతోడ
జయ శంఖ సంహతి సవ్వడితోఁ దూర్య । రవముతో సాహసక్రమముతోడఁ
 
గీ.దీవ్రతరధాటిని మహమ్మదీయ సర్వ । సైన్యపతి ‘మలిక్కాఫరు’ చలము పొంగి
యేకశిలకోటఁ దాటించి యెగచి మ్రింగ । బెబ్బులి యనంగఁ బయనించె బొబ్బలిడుచు.
235
క.‘మలికాఫరు’ కావించిన
తొలి సంగరయాత్ర కతనఁ దుత్తునియలు గాఁ
దెలుఁగు చెడును - గాకతివిభు
తిలకము చెఱుగునని ముసరెఁ దేలికపలుకుల్.
236
సీ.క్రొత్తగాఁ బాల్వోసికొనుచున్న వరిపైరు । చేలెల్లఁ జెడి ధ్వంసధూళియయ్యె;
లంకనేలల నూతనాంకూరముల నున్న । మిరెపనారులు గడ్డికఱచిపోయెఁ;
గొబ్బెరల్ తాళ్లు సంగోరు బ్రుంగుడువడె । మావితోఁపులు నేలమట్టమయ్యెఁ;
జోళ్ళు - దుంపలు - జొన్న జొంపము - కొతిమిరి । సకలంబు మూలనాశనమునందె;
 
గీ.నీటి యెద్దడి, వఱదలపోటు లేక । కాల మనుకూలమైన ముక్కారుఁ బండు
తెలుఁగుమాగాణి యేగాని విలువసేయు । పంట నీయక హెచ్చె నిప్పచ్చరమ్ము.
237
సీ.అల ‘మలిక్కాపరు’ తొలిదండయాత్ర యాం । ధ్రుల చరిత్రంబునఁ దొలఁపరాని
విరసఘట్టము; నాఁడు సురిఁగిన పైరులు । తఱిఁగిన పైరముల్ - ధరణిఁ బడిన
దేవాలయంబులుఁ - దినఁ దిండి లేమిని । కుమిలి క్రుళ్లెడి పేదకూలివాండ్రు
నాఁటి ద్రోవది కైన పాటు ముందరఁ బెట్టి । పలవించెడి త్రిలింగకుల సతులును
 
గీ.దలఁపువాఱినఁ బ్రజలడెందములు వెక్కి । వ్రక్కలైపోవె! కాకతీశ్వరుని గెలుపు
వార్త మోదాంతమై కొంతవఱకు నాఁటి । తెలుఁగువారల గుండియల్ నిలిపియుండు.
238
ఉ.“బోరన నోరుఁగల్నగరి ముట్టఁగవచ్చెఁ దురుష్క వాహినీ
వార” మటంచు వేగరులు వచ్చి వచింపఁ బ్రతాపరాజు కం
గారునఁబోక సంగర వికాసము మోమునఁ దాండవింప గం
భీరపు వేఁడిన వ్వనుగమింప నిటు ల్వచియించె ధీరతన్.
239
ఉ.“క్రొవ్వి మహమ్మదీయ వనకుంజర మియ్యెడ వీరసింహమున్
జివ్వకుఁ గాలుద్రవ్వి పిలిచెం బెలుచన్; జడియంగ నేల! యీ
మవ్వపుఁదెల్గు కత్తికి సుమాళపు బంతుల యాటగాక యీ
చివ్వలు లెక్కయే! గజిబిజింపకుఁడీ చిఱుగాలి తాఁకునన్. ”
240
వ.అని తత్క్షణంబ యమాత్యవర్గంబుతో దండనాయకుండు, సోదరుండునగు నన్నమదేవునిం గానిపించుకొని దుర్గరక్షకుల నప్రమత్తులై యుండ నియమించి లక్షసైన్యంబుతో నన్నమదేవు నభిషేణనంబునకుఁ బురికొల్పుటయు నభ్యమిత్రీణుండగు నా సేనాని -241
క.అని వెన్నుఁజూపి యెఱుఁగని
కనలిన జమునైన సరకుగైకొనని భుజా
ఘన వీరులు వెలమలు త
న్ననుగమనింపంగ నడచె నాహవపరతన్.
242
క.పేరునఁ గమ్మఁదనంబును
వీరత్వము పోరునందు విరియఁ బెనఁకువం
దేఱిన కమ్మఁవజీరుల
తోరపుఁదోడ్పాటు వడసి దురమున కరిగెన్.
243
క.సాహసికులైన మారయ
సాహిణి మున్నయినవారు సంగరరంగో
త్సాహమున నోహటిల్లక
సాహాయ్య మొనర్ప రాఁగ సాగెఁ బగమెయిన్.
244
క.క్రమ శిక్షితమగు బలుబలఁ
గము లక్షయు వెంటవెంటఁ గయికొని యయ్య
న్నమదేవుండు కుమారుని
సముఁడై యెదురుకొన నడచె శాత్రవసమితిన్.
245
ఉ.“రామునియప్పు దీర్పఁగ నరణ్యములం బడి యేండ్లు లక్ష్మణ
స్వామి తపించెఁ గాని, యొకజామున భ్రాతృఋణంబు దీర సం
గ్రామమునం దురుష్కులను గండడఁగించు నితం” డనంగఁ బే
రామున నాంధ్రసైన్యపతి యన్నమదేవుఁడు పోయెఁ బోరికిన్.
246
వ.అట్లు పోయి “మహమ్మదీయసేన లెచ్చోట నెదురుపడు నచ్చొటన యెదిరించి కాందిశీకులం జేయవలయు; నోరుఁగల్లుఁ దేఱి యరయనీయరాదు; పొదఁడు పొదం”డని హెచ్చరించుచుండునంత నత్తురుష్కవాహిని గట్టుతెగిన వాహినీపతివోలె గోదావరీ తీరంబునం జేరి యట నెదురుకొనుటయు -247
చ.పగమెయి నొండొకం డెదురుపాటు వహించుచు సంభ్రమించుచున్
డిగుడిగు డిక్కులాటవలె డీకొని; రాతొలుతాఁకునందు “నీ
తెగ యిది” యంచు దేవునకుఁ దెల్ప నశక్యము; చూడఁజూడఁగా
నగపడి రాహవస్థలిని నందఱు ‘వాలులు’ - వాని సోదరుల్.
248
క.హైందవ తౌరుష్క చమూ
బృందమునం దెవనిచేతి కెవఁ డగ్గమగున్
మ్రందించె వాఁడు వాని; జ
యేందిర కలగలుపుఁబోర నేర్పడకుండన్.
249
గీ.కొంత తడ వటు ఘోరసంకుల సమరము
జరిగి యిరువాయగా ననంతరము విఱిగి
జోదు లితరేతర క్రుధా ప్రాదురుదిత
మద మహా సింహనాదక్రమంబు వొదల.
250
చ.ఎనుబదివేల సైన్య మది యెన్మిదివేలుగ సన్నగిల్లి వి
చ్చినదయి ఱిచ్చవోయి తనచెంత నొకింతయుఁ దోడుసూపమిన్
వనరి ‘మలిక్కఫూరు’ తల వంచియు వంచనివాని పోలికన్
గొనకొని కొంతసే పెదురుకోఁ గలిగెం జలమార నేర్పునన్.
251
ఉ.అన్నకుఁ దగ్గ తమ్ముఁ డయినట్టి త్రిలింగచమూకుమారుఁ డా
యన్నమదేవుఁడున్ వెలమ లాహవశూరులు కమ్మజోదులున్
మన్ననకెక్కు వీరమణి మారయసాహిణి మున్నుగా నవో
ద్యన్నరులో యనం దగిన యాంధ్రులు మంపులుదేఱి పోరఁగన్.
252
క.తాళంజాలక వెరవిఁడి
మాలిక్కాఫరు మనస్సు మార్చుకొని “యిటుల్
కాలము వుచ్చినచో మన
కే లాభము వచ్చు నుసుఱులే చెడవచ్చున్.
253
వ.కావునఁ బోవఁ దక్కిన మన బలంబుఁ జిక్కిఁ బట్టుకొని మరలి ఢిల్లీపురంబుదారిఁ బట్టుటయ లగ్గు; కానినాఁడు నొడువరాని యెగ్గు తటస్థింపవచ్చు; నిఁక ఖడ్గంబు దించెదంగాక” యని నిష్కర్షించుకొని సమరపరాఙ్ముఖతను సూచింప నించుక వెనుదిరిగి పలుచఁబాఱి కకావికలైన మహమ్మదీయ సేనలం జేయెత్తి పిలిచి మరలిపోకకు సన్న చేయుటయు -254
క.వెఱ చఱచి వెన్నుఁ జూపిన
యరిఁ బొడుచుట ధర్మదూర మని - యామలికా
ఫరు, నాతని వెన్నడిఁ బడు
తురుష్కసేనలను వెడలఁద్రోలిరి తెలుఁగుల్.
255
చ.అటులు తెలుంగునేల సరిహద్దులు దాఁటి మహమ్మదీయు లు
త్కటతర భీతిఁ బర్వు లిడఁగా జయసంభృతి సంభ్రమ ద్విశం
కట గతిఁ దెల్గుపోటరులు కాకతి వీర పతాకికాతతిం
బటు భుజశక్తిమై నెగురవైచిరి గాలిపటాల పోలికన్.
256
వ.పదంపడి యగ్గెలుపువార్త నాలించి వీరప్రతాపరుద్ర చక్రవర్తి పొంగి పరిపంథి రక్త నిర్భరంబగు సగర్భ్యుని గాత్రంబుఁ గ్రుచ్చి కవుంగిలించుకొని మెచ్చులాడె; వెల్మ కమ్మ జోదుల నాదరించె; నట డిల్లీపురంబున -257
చ.చొఱవఁ దెనుంగుపోటరుల సూటికి ధాటికి నిల్వలేక పెం
పఱి తనపాఱివచ్చుటకు నాత్మ నలందురి యెట్టులేనియుం
బరుల నడంతునంచుఁ బగవట్టెఁ దురుష్క చమూవిభుండు, తన్
బొరిగొనకుండఁగా విడిచిపుచ్చిన యాంధ్రుల మేల్ తలంపఁడో!
258
గీ.మరల దండెత్తి యోరుఁగల్ పురముకోట
దగ్ధ మొనరించి వీరప్రతాపరుద్రుఁ
బట్టి పాలార్తు నను చలపాదితనము
వెలయ నాతండు తరుణమ్ము వేచియుండె.
259
వ.ఢిల్లీపతి తన దండనాయకుం డటు లాత్తగంధుండై మరలంబడుటకు వగచియు; లోని వగపు బయలు కానీక మాలికాఫరును మరల దండెత్తి పోకకుం బ్రోత్సహించుచుండె; నిట -260
రెండవ దండయాత్ర
చ.అఱమరలేని యాంధ్ర విజయంబున కబ్బురపాటుతోడి సం
బరమునఁ బొంది దేవగిరివల్లభుఁ డామున ఢిల్లి పాదుసా
‘కరి’ యిడ మానె; దాన నతఁ డాగ్రహమూని మలిక్కఫూరు ముం
దరఁ బురికొల్పె దేవగిరి దక్కఁగొనన్ గనదుగ్రమూర్తియై.
261
క.తొలిగ్రుక్క దేవగిరినిన్
మలిగ్రుక్కం దెనుఁగుకోట మలకొని మ్రింగన్
దలపెట్టి దండు వెడలెన్
మలికాఫరు చలము బలము మల్లడిగొనఁగన్.
262
సీ.పదునాల్గవ శతాబ్ది పదము వెట్టెనొ, లేదొ । తొలి సంగరమునాఁడు తూలవడియు
నడచె మాలికఫూరు నాయకత్వమ్మున । రెండవ తౌరుష్క దండయాత్ర;
ముప్పదివే ల్గుఱ్ఱపుఁ బటాలమునఁ బేర్చి । కాల్బలఁగమ్ము లక్షయును జేర్చి
మొదట ‘దేవగిరి’ని ముట్టడిపట్టంగఁ । బరుల రాక నెఱింగి పల్లటిల్లి
 
గీ.యాదవ ధరావిభుండు మున్నాహవమున । నిబ్బడి మహమ్మదీయుల దెబ్బవడిన
వాఁడు గావున, ధైర్యమ్ము వీడుకొల్పి । సంధి కొడఁబడెఁ దప్పనిసరిగ నాఁడు.
263
మ.మును మూఁడేఁడులనాఁడు తెల్గుల బలమ్ముం గంఠదఘ్నంబుగాఁ
జనవారం జవిచూచి యోడిన తురుష్కశ్రేణి - యీనాఁడు హె
చ్చిన కిన్కన్ గడుఁబూన్కి వెండి దురముం జేయంగ నేతెంచె ‘ద
క్కను’పై; నాఁటి పరాభవంబును మలిక్కాఫూరు యోజింపఁడో!
264
ఉ.తీవలు సాఁగు పౌరుషపుఁ దీరులఁ జూపఱు బెగ్గడిల్ల గో
దావరి తీరమందు మును దాపురమైన దురమ్ముకంటె నేఁ
డీవిధ మగ్గలించెనని యీవల నావల నుగ్గడింపఁగా
లావునఁ బోరితం బది చెలంగెఁ ద్రిలింగ తురుష్క సేనలన్.
265
శా.ఆ యుద్ధంబున వీరరుద్రవిభు సైన్యశ్రేణిఁ బేరందు బా
హాయోధాళి ధటాధటీ లనఁగ ఘోరారంభులై యాంధ్రజా
తీయ ప్రాభవముల్ వెలార్పఁ బ్రభుభక్తిం దీర్పఁ బోరాడి, స్వీ
యాయుర్వాయువులం గదల్చి రల సౌరారామ మందారమున్.
266
ఉ.వేలకు వేలుగాఁ దెలుఁగువీరులు దోరిరి కాని ‘యోరుఁగల్’
నేల బలంబునం గడకు నెగ్గెను గాకతి వీరరుద్ర భూ
పాలుఁడు; మాలికాఫరుని పక్షము మిక్కిలి బక్కటిల్లి గ
గ్గోలువడెన్; జెడెన్; జయముఁ గోల్పడె రెండవసారి కోల్తలన్.
267
చ.అటులు పరాజయమ్ముఁగొని యా మాలికాఫరు దండయాత్ర నం
తట విరమించి పెన్వగపునన్ మరలంబడి పోరుసేఁతకున్
దిటవఱియున్న సేనఁగొని దీనత ఢిల్లికి దారిఁదీసె వెం
న్కటిదగు యాత్ర కిద్ది ప్రతిగా వితయై వెతఁగూర్చుచుండఁగన్.
268
దేవగిరిరాజు కుట్ర
వ.పాదుసాహి కరిగాఁపుగా నుండు దేవగిరి నరపాలుం డసహిష్ణుండు వీరరుద్రుని విజయోదంతంబు విని తన మనంబున -269
గీ.తెలుఁగురాజు స్వతంత్ర జాతీయమైన
యేలుబడికి జయధ్వజ మెత్తియుండ -
నేను బరతంత్ర వృత్తి సుల్తానుఁ గొలిచి
వంగి వంగి సలాము సేయంగ వలెనొ!
270
చ.“రగిలి దహించివైచెడి పురా పరిభూతి తురుష్కభర్తలో
నెగసనఁద్రోచి కాకతిమహీపతి పీఁచమడంచి యోరుఁగల్
నగరు సమూలనాశము నొనర్పకపోయిన యాదవుండ నే
నగుదునె” యంచు నెంచి యతఁ డాగ్రహ మీర్ష్యకుఁ దోడువెట్టుచున్.
271
చ.తెలుఁగు విభుత్యమందుఁ దరితీపులు పెంచుచు లేనిపోని కు
ట్రలు సులతాను మెప్పులువడ న్వచియించుచు యాదవేంద్రుఁ డె
త్తు లిడి మలిక్కఫూరు నకుతోభయు మూఁడవ దండయాత్రకు
న్నిలఁబడఁ బన్నెఁ; దాఁ - దన యనీకిని - బాసటరాకఁ జెప్పుచున్.
272
ఉ.ఓడితి; మాంధ్రపౌరుష మహోద్ధతి లోఁబడి రెండుమార్లు పో
రాడితి మింతకున్ మును పటన్న విషాదము దక్కి వెండియున్
మూఁడవతూరి యోరుఁగలు ముట్టడికిం దలపెట్టుకొన్న యు
క్కీఁడు మలిక్కఫూరుని జయేచ్ఛ సుఖంబునఁ బండనిత్తురే!
273
సీ.తెలుఁగుజోదుల కత్తి తెఱనోటిమెక మని । రెండుసారు లెఱింగియుండువాఁడు
మాలికాఫరు నేఁడు మగఁటిమి పగటుగా । మెఱుఁగువెట్టుచుఁ బెంపు నొఱపు మిగిలి
బలఁగమ్మునకు ధైర్యపాఠముల్ గఱపి, సు । ల్తాను డెందమున సంతసము నెఱపి
నలువదివే లాశ్వికులు - లక్ష పదగులు । గుదిగొని తన వెంటఁ గూడిరాఁగఁ
 
గీ.గడలు కదలాడఁగా - నోరుఁగల్లుకోట । కనులఁ దారాడఁగా - వహ్నికణము లుమిసి
దండు వెడలించి ‘బుందేలుఖండ’ మొరసి । పదపడి ప్రయాణములను దేవగిరి దరిసె.
274
వ.అట యాదవరాజు నాతిథ్యంబునఁ గతిపయదినంబు లుండి యతండు ససైన్యుండై యాంధ్రరాష్ట్రంబు మెట్టి యేకశిలా దుర్గంబు ముట్టఁ బోవుటయు -275
మ.“అకటా! యిట్లు మహమ్మదీయుల రణప్రారంభ దుర్వృత్తి వా
ర్షికమై పోయెఁ దెనుంగుదేశమున; మూరింబోవఁ బోరాడి, చా
లక యిన్మాఱు పరాభవింపఁబడి నిర్లజ్జన్ బునర్యాత్ర సేఁ
తకు విచ్చేసిరె! యాంధ్రభూప్రజకుఁ జింతల్ తప్పవో యెప్పుడున్!
276
శా.ఓరుంగల్లును ముట్టి యూఱడిలువారో కారు; క్రౌర్యంబు పెం
పారం బంటవలంతిసొంపులను మాయంజేసి యూరూరు దా
ర్మాఱై పోవఁగఁజేసి పేదకడు పోమం బట్టెఁ డన్నంబుఁ జే
యారం బెట్టుకొనంగ లేనియటు గార్హస్థ్యంబుఁ ద్రుంగింపరే!
277
ఉ.ఎంతటి శౌర్యవంతుఁ డగునేనియుఁ గాకతి రుద్రనేత క
ల్పాంత మహాసముద్రముల నడ్డునె! పెంచినజోదు లెందఱో
యింతకుమున్ను పోరుల లయించిరి దైవమ! యింకమీఁద నీ
వంతుగదా! జయంబు లొదవం గరుణింపుము తున్గుఱేనికిన్.”
278
క.అని యిటులు కలఁకవడు మన
మున దేశమ్మెల్ల దైవముం గొనియాడన్
బనిగొని తురుష్క వాహిని
తెనుఁగుఁబుడమి ముంచియెత్తెఁ దెగఁబాటుమెయిన్.
279
మ.రణశూరుల్ - పణమొడ్డి వేల్పులను బోరన్ మీఱు వీరుల్ - మహో
ల్బణ ధైర్యంబున నాంధ్రనాయకు దెసం బక్షంబు వాటించుచున్
ఋణ మీఁగంగ, మహమ్మదీయ బల మార్తిం గ్రుంగ, నర్తించి మా
రణయంత్రమ్ములువోలె శాత్రవుల దోరంజేసి రుద్రిక్తులై.
280
చ.బుజము బుజమ్మునుం గలిపి పోరుచు ముందర సాగనీక, య
క్కజముగ శత్రువారమును గాడ్పడఁ జేయుచుఁ దెల్గుపోటరుల్
గజిబిజి వెట్టి; రైననెసకంబు వహించి తురుష్కసేన బే
రజమున నోరుఁగల్ పరిసరస్థలి ముట్టెను నిర్ణిరోధతన్.
281
మ.ఒకఁడా, యిద్దఱ! వేనవేలు భటులా యోర్గల్లునన్ దుర్గ మా
తకు జీవమ్ములు దారవోసి సముదాత్త ప్రీతులై యాంధ్రజా
తికి నీరంధ్రము నిత్యనిర్మలము కీర్తిం దెచ్చి; రా నాఁటి వా
రికి నేఁ డీ కవితాకృతజ్ఞతల మూర్తిన్ దన్పు లింపారునే!
282
వ.మహమ్మదీయసేన లిట్టు లేకశిల మట్టికోట ముట్టి చుట్టును నెలవు లేర్పఱుచుకొని తమ్ముం బ్రతిఘటించు నాంధ్రవీరులం దలపడి పెనంగుచుండె, నవ్విధంబునం గొన్నాళ్లు కడచనుటయుం దెలుంగుఱేని పక్షీయులు తమ బలం బగ్గలింప నత్తురుష్కధ్వజినీ వ్రజంబుతో వెనుదీయక పోరి వెనుకటి యట్లపోలె నహితులం దఱిమివైచిరి.283
గీ.ఒకటికాదు, రెండునుగాదు, యోధువోలె
నిప్పటికి మూఁడు సార్లు దండెత్తి వచ్చె
‘మాలికాఫరు’ పూన్కి; ముమ్మాఱు కూడఁ
దెల్లపిల్లిని జంక నెత్తికొని వచ్చె.
284
క.అల కాకతీశ్వరునకున్
వెలగల బలఁగములు, పెక్కు విడిముడియుఁ జెడెన్
గెలిచిన నోడిన నొకటే
కలఁతగదా? తెలియనేరఁగా బవరములన్.
285
సీ.ఎప్పటి కప్పుడే యిఁక నెత్తిరారు మ । హమ్మదీయులను భావమ్ము గదుర
నలవోకమైనున్న తెలుఁగుఱేనికి నేఁడు । వేఁడిమి పుట్టె; నొవ్వెను మనంబు;
సిద్ధాన్నము చెడి గాసిఁబడి పొట్టలు మాఁడి । వనటఁ గూరు తెనుంగువారిఁ జూచి
చిందఱవందఱై చెదరిన తనయేలు । బడి నెంచి, కాకతీశ్వరుఁడు వగచి
 
గీ.మరల సామ్రాజ్యమును ససిపఱుప నెంచి । యందులకు విత్త మక్కఱయైన కతనఁ
దెనుఁగుమీఱిన సామంతమనుజపతుల । గరువ మడఁగింపఁదలఁచె వేడ్కలు చిగుర్ప.
286
వ.తలఁచి - సముచితంబగు చమూపరివారముతోఁ బయనించి విజయోదర్కంబుగాఁ దొలుతఁ ద్రిపురాంతక క్షేత్రమ్ము మెట్టి, యటనుండి శ్రీపర్వతంబున కేఁగి -287
వీరరుద్రుని మ్రొక్కు
ఉ.కామిత సంఘ సన్నిహిత కల్పమహీజము మల్లికార్జున
స్వామికి భక్తియుక్తి గరుపాఱినడెందము కాన్కవెట్టి నె
మ్మోమును వంచి, కేలుఁగవమోడ్చి త్రిలిఙ్గమహీశుఁ డద్వయ
శ్రీమహితంబుగా వెలువరించె మనం బిటు దైవసన్నిధిన్.
288
చ.“తొనఁకనిపట్టుతోఁ గినుకతో నహమించి మహమ్మదీయు లొ
డ్డినవల మూఁడుమాఱులు వడిన్ విడిపించుచు నాంధ్రరాజ్య సి
ద్ధిని గరుణించి, నా ప్రభుతఁ దీరిచి దిద్దిన నిన్నుఁగూర్చి యే
మని కొనియాటకుం దగుదునయ్య మహేశ్వర! మల్లికార్జునా!
289
చ.సిరిమలనుండి యీ తెలుఁగుసీమ సమస్తముఁ బ్రోచు నీ కృపా
పరతకుఁగాక, యేకశిలపైఁబడి యేచిన శత్రుసేనలం
బొరిగొన నస్మదాదులకుఁ బోలునె! చల్లనిచూపుచూచి, ముం
దర యిటులే జయంబులుగొనన్ దయనింపుము మల్లికేశ్వరా!
290
చ.కలిగినదానితోఁ దనిసి గౌరవజీవికఁబుచ్చు తెల్గువా
రలకడుపుల్ బుభుక్షమెయి రాఁజఁగ వంతలువెట్టు నా తురు
ష్కుల యకృతంబు నాదుమెడకున్ విషపన్నగ మయ్యెనయ్యొ! యీ
బలితపురాజ్యకాంక్ష యొకపాపము చూచునె! సర్పభూషణా!
291
ఉ.పోరులఁ దెల్గుక త్తి మొఱవోవనియట్టు లనుగ్రహించి, మా
వీరుల బాహులన్ బలము పేరిమిఁ దీర్చి యితోధికాధిక
శ్రీ రమణింప ‘నేలశిల’చే వరివస్యలు గొమ్ము దేవ! యొ
డ్డారములేని యేల్బడిఁ గటాక్షము సేయుము తెల్గుధారుణిన్.
292
గీ.సంతతము క్షణమేని విశ్రాంతి నిడని
కఱకురాచఱికమ్మునఁ బొరలు నాకు
నీదు చల్లనిచూపు వెన్నెలలు లేమి
నిహపరంబులయందు సంతృప్తి లేదు.
293
గీ.రెండువందల యేండ్లుపైనుండి వచ్చు
నౌరసత్వము కల్మి సంప్రాప్తమగుట
బుజమువట్టితి నీ రాజ్యమునకు నాఁడు;
‘పాలనవిధానమునకు నీవ’ యని తలఁచి.”
294
వ.అని వేఁడికొని యమ్మల్లికార్జునస్వామికి భూరి భూమి దానంబులు గావించి, తత్ప్రసాదంబు వడసి పరిశుద్ధహృదయుండు ప్రతాపరుద్రుం డటనుండి వెడలి కొచ్చెర్లకోట దుర్గంబుఁ జొచ్చి యచ్చోటం గతిపయ దివసంబులుండి, క్రమంబునం బల్లెలు నరణ్యంబులుం దిలకించుచు నాశ్రితుల కయ్యైసీమలొసంగి యరిగాఁపులం జేసికొని, ముందునకుం బయనించు నత్తఱి నత్తెనుంగుఱేఁడు గావించిన విశేషములు చిరస్పృహణీయంబులు -295
సీ.‘అనుమకొండ’ నివాసియైన శ్రీనాథ భూ । పాలున కిడియె ‘దూపాడుసీమ’
సిరిసింగళునకు నాశ్రితునకు ననుకంపఁ । గొసర నిచ్చెను ‘నందికోటకూరు’
విడెము కొమ్మావనీ విభునకుఁ గరుణమై । నేలుకోనిడెఁ ‘గందనోలిసీమ’
తద్వనీప్రాంతమందలి పల్లెప్రజలకుఁ । గొఱఁతరాకుండఁ గోర్కులను దీర్చె
 
గీ.తెనుఁగు మన్నీఁడు పాలుఁద్రావిన ప్రదేశ । మునకుఁ ‘బాల్మారి’ యనఁగ, నమ్మనుజనాథుఁ
డలుగులఁ బెనంగి నట్టిచో ‘టలుగులూ’ ర । నఁగ జనశ్రుతి యలరు నీ నాఁడు కూడ.
296
వ.పరమకరుణాళుండగు నా ప్రతాపరుద్రభూవరుండు పర్యటనమ్ము గావించుచు నాయానాళ్ళ కధిపతులైయున్న తన యరిగాఁపులు పన్ను కుచ్చితపుం బన్నుగడలు బయలులాఁగి, వారలం దగునట్లు శిక్షించి వినీతులై వా రొసంగు రత్నవిత్తాద్యుపహారముల స్వీకరించుచు ససైన్యుఁడై కతిపయ ప్రయాణంబులఁ గాంచీపురంబుం జేరె, నట నంతకు మున్న -297
క.చలమున బలమునఁ బాండ్యే
శులు, కాంచీనగరమేలు చోళప్రభువుం
దొలఁగించి తామ యేలం
దలపెట్టిరి తత్పురంబు ధార్ష్ట్యము బలిమిన్.
298
గీ.కంచి యొడయఁడు, తన కరిగాఁపునైన
చోళపతి మన్మగండ గోపాలుఁ డిటులు
పాండ్య పంచకమునఁ బడ్డపాటు నెఱిఁగి
వీరరుద్రుండు రుద్రావతార రేఖ.
299
వ.కోపించి, పరాక్రమభాసురులు దండపతుల రావించి ముప్పిడినాయకుండను కమ్మవీరుని, పద్మనాయక వంశనాయకుండు రేచెర్ల యెఱ్ఱదాచానాయనిం బాండ్యుల మీఁదికిం బంపి పట్టితెమ్మని యానవెట్టె నంత వెలమపోటరి దాచానాయండు. పాండ్యులతో వెనుదీయని పెనంకువ మించి జయించి, తదీయ సర్వసంపదలు కొల్లగొట్టి వీరరుద్రున కర్పించుటయు నతండు పరమానందభరితుండై యతనిఁ దగుతెఱంగున నామతించె నివ్విధంబున దర్పించి తల మీఱిన యనేకరాజులకుఁ దెలుంగుజోదులచే శృంగభంగమ్ము జరిపించి, యంత యక్కఱయైనచోఁ దాన వీరత్వముం జూపుచు -300
క.దక్షిణ దిగ్విజయ కళా
దక్షుఁడు వీరప్రతాప ధరణీనాథా
ధ్యక్షుఁడు బల హర్యక్షుం
డక్షతయశ మార మోసె నాంధ్ర వసుమతిన్.
301
సీ.ఆ కాకతీశ్వరుఁ డాంధ్రసామ్రాజ్యంబు । వెలయ రాష్ట్రములును, విషయములును
నాడులు, సీమలు నాఁగ వేర్వేఱగు । తరగతులుగ నేరుపఱుపఁ జేసి,
యొక్కొక్క యధికారి నుంచి వారలకెల్లఁ । బయి నధికృతియుండు పగిదిఁ జేసి,
పరిపాలనమున డెబ్బదిరెండు రకముల । నెసఁగు నియోగము లేరుపఱిచి
 
గీ.రాజకీయాధికారి వర్గంబునందు । నాంతరంగికములు పొర లంటకుండ
వేయికన్నుల నేలెఁ బృథ్వీపతులకుఁ । దన దురాయి తురాయి చందమ్ము గాఁగ.
302
గీ.భరతఖండము జల్లించి పట్టి తేర్చి
పొల్లు తొలఁగింప మిగిలిన పోటరులను
వాటముగఁ బెంచు కాకతీశ్వరుని పెంపు
ఢిల్లి రాజుల ప్రక్కలో బల్లెమయ్యె.
303
చ.పురికొను సాహసంబున నభోభువనంబులు కత్తిరించు పో
టరులను బెంచి, వారలయెడాటమునం గడుఁ బేర్మినుంచి, దు
స్తరమగు శత్రుసాగరము దాఁటఁదలంచు ప్రతాపుకీర్తియుం
బరువము భారతావని ధ్రువంబుగ నిల్వవె క్రొత్త చెల్వునన్.
304
గీ.నాఁడు పోరాటముల నాంధ్రనాయకునకు
వెలమ లొకకన్ను, కమ్మవీరు లొకకన్ను
కాకతీశుండు మూఁడవకన్నుఁ దెఱచు
తఱి తటస్థింప లే దంతదాఁక నెపుడు.
305
వ.మహావీరవరులం జేరిచి యప్రతిహతంబుగ నాంధ్రసామ్రాజ్య పరిపాలనమ్ముఁ గావించుచుం బ్రజల చిత్తంబులు చల్లనగునటులు చేసి “అద్దిరా! రుద్రుని రామరాజ్యం” బనిపించుకొని యవ్వీరప్రతాపరుద్రుం డుండుతఱి, నట ఢిల్లీపాదుసాహి యల్లాయుద్దీను కారణాంతరముల దారపుత్రాదులతో వైరముం దెచ్చుకొని, బెంగటిల్లి క్రుంగె, నదియుంగాక -306
సీ.రాజపుత్రులు స్వతంత్రపతాక నెత్తిరి । కడుకొని చిత్తూరుగడమునందు
సులతాను శాసనంబులకు బద్ధముగాక । ఘూర్జరదేశంబు కొక్కరించె
హరిపాలదేవ భూవరుఁడు ‘దేవగిరి’లో । నొడయఁడై యరులు బెగ్గడిలమెలఁగెఁ
దెనుఁగు ధరిత్రిఁ బాడినది పాటగ నుండి । జయలక్ష్మి మధురలాస్యమ్ము నెఱపె
 
గీ.నింకఁ బాదుషా యదుపులో నెవ్వఁ డుండి । వంక దండాలు పెట్టు? నెవ్వరికి వారె
తల కడచి స్వస్వతంత్రపుదారి నడచి । ప్రభువులై యుండి రలవోక భరతధాత్రి.
307
చ.అగుటయు, శక్తి చాలమికి - నాత్మకుటుంబమునందు రేఁగు న
ప్పగలు తొలంప నేరమికి వందురు చుండఁగ లోనలోన నె
వ్వగ పరిపక్వమై కడకుఁ బాదుషహా కది వ్యాధిలోనికిం
దిగి తెగఁజూచుబాధ నిడెఁ దేఱికొనన్ మఱి వీలుకానిదై.
308
వ.అట్టు లతం డాధివ్యాధులం దపించి యుసుఱులఁ బాయుటయుఁ బదంపడి ‘మలిక్కాఫురు’ నిరంకుశుండై యుద్దీనుతనయుల బెదరించి, తాన ఢిల్లీప్రభుత్వమ్మున కొడయం డయ్యె.309
క.‘అల్లాయుద్దిను’ చనుటయు
ఢిల్లీరాజ్యమునఁ బస చెడెన్, గలహమ్ముల్
పెల్లయ్యె, నెల్లవారల
యుల్లమ్ముల రాజ్యకాంక్ష యుఱ్ఱట లూఁగెన్.
310
గీ.అట్టితఱి ‘అల్లయుద్దీను’ నాత్మభవుల
వరుస నాల్గవవాఁడు ‘ముబారి’ కనెడి
వాఁడు - తోఁబుట్టువులఁబట్టి గాడుపఱిచి
పరువు నిండిన పాదుషాబిరుదు వడసె.
311
మ.కొమరుంబ్రాయపుఁదీఁట గాటమున నెక్కోఁగా, మహారాష్ట్ర దే
శముపై నా సులతాను దండువెడలెన్; సాధించెఁ బ్రాంచన్మణీ
రమణీయంబయి యున్న ‘దేవగిరి’ దుర్గశ్రీ విరాజ త్కిరీ
టము కాలం బడఁ దన్నెఁ బౌరుషము నొడ్డారము గోరమ్ముగన్.
312
ఆ.వె.అంతతోడఁ బోక హరిపాలదేవుని
బ్రదికియుండఁ బట్టి బ్రద్దచేసి
చంపి చర్మమొలిచి సాధించి కసిదీర్చు
కొనియె నా తురుష్క కుతలభర్త.
313
వ.అతం డటులు విజయోత్సాహమ్మున ఢిల్లిఁ జేరుటయు ‘ఖుస్రూ’ నామధేయుండగు దండనాయకుం డొకండు పాదుసాహిని మాయోపాయంబునం బొరిగొని తాన రాచగద్దె నధిరోహించె.314
సీ.అతఁడు తురుష్క వేషాంతరితుండగు । హైందవుం డగుట సహజవిశుద్ధ
భావుఁడై స్వమతమ్ము పట్టున నెనలేని । యభిరతి కలిగి పెంపారుచుండు;
నక్కతమ్మున విగ్రహములతో విలసిల్లఁ । దొడఁగెఁ దుర్కలమసీదు లవియెల్ల;
నది సైఁపలేమి మహమ్మదీయులు పెల్లు । రేఁగి యల్లరిసేయఁ జాఁగి; రట్టి
 
గీ.తఱిని పంజాబులో ‘సుబేదారు’ పదవిఁ । గల ‘ఘియాజుఉద్దీను తుగ్‌లక్కు’ వచ్చి
దారుణముగ ‘ఖుస్రూ’ సులతానుఁ బొదివి । తాన ఢిల్లీ మహారాజ్య మూనెఁ బూని
315
చ.ఒక యెకిమీనిపై నిలిచియుండక, యంచెలమీఁద మూఁడు నా
ళ్ల కొకప్రభుండు చొప్పునఁ దొలంగుచు, నొక్కరిపాలనంబు వే
ఱొకనికి నచ్చకుండ నిటులుండెఁ దురుష్కవిభుత్వ తత్త్వ; మే
రకముగ నింకమీఁదఁ జెదరంగలదో? యని సంశయింపఁగన్.
316
శా.ఆసల్ ముందర గెంట, గంట కొకరాజై యేలు నా ఢిల్లిలో
వాసిన్వన్నెయు నంది యిప్పటికిఁ జేవంగాంచి పెంపొందె నా
‘గ్యాసుద్దీన్ తుగలక్కు’ నేలుబడి చొక్కంబౌచుఁ; దొల్లింటి ఢి
ల్లీ సుల్తానులమీఁదిచేయివలెఁ జెల్లెన్ బెక్కునా ళ్లేపునన్.
317
ఉ.మోగలుజాతిచే డగరముల్ వడకుండఁగ ఢిల్లి రాజ్యమున్‌
బాగుగ దిద్ది దిట్టపఱుపన్ సరిహద్దుల సైనికాళి ర
క్షాగతి నుంచె; శాత్రవులకన్నులు క్రిందికి వంచె; సంపదం
దోఁగిన దర్పదుర్దముఁడు ‘తుగ్లకు’ పాదుషహా మహోద్ధతిన్.
318
గీ.ఔత్తరాహులవలని భయమ్ము తొలఁగి
యరులకు నరుంతుదమ్మగు నతని దృష్టి
పథము మెల్లమెల్ల ‘దక్షిణాపథము’ వంకఁ
బట్టి పయనించె నాస లవారి పెరుఁగ.
319
వ.అంత నతం డొక్కనాఁడు.320
ఉ.కావరుఁడై తెగించి “మముఁ గాదనువాఁ డెవఁడన్న ప్రశ్న నాం
ధ్రావనిఁ గాకతీశుఁ డొకఁ డామున నిల్వున నుత్తరింపఁగాఁ
జేవగలండు; వానిని గ్రసించితిమే నిఁక దేశమందు మా
తో వికటించువాఁ డొకఁడు తోఁపఁడు మచ్చునకేని యెచ్చటన్.
321
సీ.కాకతీశ్వరు పరాక్రమ ధాటి సైఁపక । పెఱనరేంద్రు లసూయ బెరసియుండి;
రతనికొల్వునఁ జమూపతులైన వెలమల । నన్యశాఖీయుల నఱలు పెరిఁగె;
నిఁకఁ దురుష్కులు దాడియెత్తరు మనమీఁద । నని యహంభావించె నాంధ్రనృపతి;
యగుట - నియ్యనుకూల మగుతఱి శత్రుప । ట్టణము కణంక ముట్టణముసేఁత
 
గీ.కర్జమగు; నీ యమోఘావకాశ మిపుడు । దాఁటఁ బెట్టితిమేని ప్రతాపరుద్ర
రౌద్రవహ్నిఁ జల్లార్పంగరాదు మనకు । మనలఁ బుట్టించినట్టి దేవునకుఁగూడ.
322
క.కావునఁ దఱిలో నేకశి
లావప్రము ముట్టి - తెలుఁగుల న్మట్టి - ప్రతా
పావని విభుఁ జెఱఁబెట్టి ధ
రావలయము నేలెదం బరాక్రమ కేళిన్.
323
ఉ.సానలుదేఱు వీరులు వశంబున నుంటఁ దెలుంగుఱేఁడు మ
త్తానిగుడార నిందనుక దంటతనంబున ‘మాల్కిఫూరు’ సే
నానిఁ బరాభవించుట ఘనమ్మగు గర్వము పెంపునం బర
ధ్యానమున న్మెలంగి యెడఁదం దలపోయఁడు మా విశేషమున్.”
324
చ.అని తన తీవ్ర మానసమునం దొక దారుణభావవీచి మీ
ఱిన సులతానుఁడుం గరకరించి నిజాత్మజు నయ్యలూఫుఖా
నునిఁ బిలిపించి పౌరుషము నూల్కొనఁబల్కి తెనుంగుకోటపై
నని వెడల న్వచించె; విజయంబు గొనన్ బచరించె దీవనల్.
325
వ.అత్తఱి దండయాత్రోన్ముఖుం డయ్యలూఫుఖానుఁడు గ్రీష్మాదిత్యునిం బోలె తీవ్రప్రతాపోష్మ భాసురుం డయ్యె.326
చ.కడుకొను నెండవేఁడిమిని గ్రాఁగి సమస్త ధరాతలంబు న
ట్టుడికిన యట్టుగా నుడుకుచుండెను! వెచ్చని మంగలంబులోఁ
బడి జను లంగలార్చి యిలు వాఁకిలి వీడక మూఁడుచుండి; రె
ల్లెడలఁ బ్రభాకరప్రభుని యేల్బడి చెల్లె నిరంకుశమ్ముగన్.
327
గీ.ఈ వఱకుఁ దెల్గువారిపై నెత్తికొనిన
‘మలికఫూరుని’ దండయాత్రల చరిత్ర
‘నలుఫుఖానుఁడు’ వినియుండఁడా! వినియును
మోహరించుట యవివేకమునకు గుఱుతు.
328
ఉ.ప్రాణముతీపి నాక బవరంబున కేఁగఁదలంచు నయ్వలూఫ్‌
ఖానునివెంటఁ గాలుబలఁగం బొకలక్షయు నాశ్వికోజ్జ్వల
త్సేనలు సంతతోద్భటగతిం బదివే లరుదేర సాఁగెఁ బ్ర
స్థానముగాఁగఁ దెల్గుసరదారుల మాదిరి మచ్చుచూడఁగన్.
329
సీ.‘మాల్వా,’ ‘బుదావూను,’ మఱియుఁ ‘జెందేరి’ ము । న్నగు ప్రదేశమ్ములయందుఁ బేరు
గనియున్న జగజెట్టులను సైనికుల వెంట । నిడికొని “తన కెదు రెవ్వ” రనిన
తమకంబుమెయి సులతాను పెద్దకొడుకు । నడచె నాంధ్రమ్ము ముట్టడియొనర్ప;
మును ‘మాలికాఫురు’ చనిన దారులలోన । మెలమెల్లఁగా గడ్డి మొలచుచుండ
 
గీ.వెండియును నేఁడు చిచ్చుఱపిడుగుపాటు । కరణిని మహమ్మదీయుల కచ్చెవచ్చె
నాంధ్రరాష్ట్రపు భావిభాగ్య మది యెటులు । సాఁగునో యని ప్రజకు విషాద మొదవె.
330
శా.ఓరుంగంటికి - వీరరుద్రునకు నాంధ్రోర్వీ శచీభర్తకున్
హేరాళంబు జయమ్ము చేకుఱుట కెంతే సంతసంబూరఁగా
నూరూరం బ్రతిపట్టణంబున శుభోద్యోగంబునన్ దైవపూ
జారంభం బొనరించి రాంధ్రులు మహీయః ప్రీతి భక్త్యున్నతిన్.
331
ఉ.“వచ్చినవారు వచ్చి, యొకపట్టున ‘నోర్గలుకోట’ ముట్టి పో
వచ్చును! లేనిపోని చొఱవం గొఱమాలి యకారణంబుగా
మచ్చరికించి ధేనువుల మానినుల న్నిఱుపేద సాదులన్‌
వ్రచ్చెద రత్తురుష్కు”లని వందురి రందఱు నాంధ్రభూజనుల్.
332
ఆ.వె.కడువులోని చల్ల కదలాడకుండఁగఁ
గాఁపురములు సేయఁ గలుగువారు
పడి రదాటు గొప్ప బెడఁదలో; శాత్రవుల్
దాడి వెడలి రన్న వేఁడి తగిలి.
333
వ.కాకతీశ్వరుండు వీరప్రతాపరుద్రుండును వేగరులవలన ముందే మహమ్మదీయులు తెనుంగుకోటపై దాడివెడలి రాక విని యునికిం, గినుక నిగుడ మంతురుల రప్పించి, చమూకాంతులఁ గానిపించుకొని వారివారి నయ్యై తెఱంగులం బురికొలిపి కోటకాఁపరుల మెలంకువల నుండ నాదేశించి, మరియును -334
సీ.బాలెంతసింగపుజూలు వట్టి యుయేల । లూఁగు సాహసము వఱ్ఱోడుచుండఁ
దఱి వచ్చిన సమస్త ధరణి ముట్టడిగొను । శౌర్యసంపత్తి లాస్యమ్ము నెఱప
నాముటేనికకోఱ లందిపుచ్చుకొని ‘బ । ళ్లన’ విర్చి వేయు ధైర్యమ్ము మెఱయ
కులమహీధరముల గుప్పెట గ్రుద్ది పి । ప్పిగఁ జేయఁగల బల్మిపెంపు తనరఁ
 
గీ.జెలువమగు నఱ నరవెండ్రుకలఁ దొలంకు । కనుబొమలు ద్రిప్పి పెద్దహుంకార మిచ్చు
నమ్ముసలి తెన్గురాజు జీవమ్ములేపె । వెన్ను చూపని దేశీయ వీరులందు.
335
గీ.“వయసు తలమీఱి యేడవపడిని దాఁటె;
బెడఁగు దక్కదు - సుంతయు ముడుత వడదు
లగువు బిగువులు సెడదు - చెల్వమ్ముగులుకు
తెలుఁగు రారాజు శారీరదీప్తి యౌర!”
336
క.అని కొనియాటకుఁ దగి య
త్తెనుంగుమన్నీఁడు వాలుఁదీసి యహితులన్‌
దునిమి తునిమి తూఁటాడెడి
కినుకఁ గడుపునిండఁ ద్రావి కెరలె నురవడిన్.
337
శా.దేవా! యొక్కకొఱంత రానిగతి రక్తిన్ భుక్తిఁ జేకూర్చి స్కం
ధావారమ్మున మమ్ము మేపితివి వేదండంబుల ట్లీవు; మా
లావుం జేవయుఁ జూపి నీ ఋణము చెల్ల న్నేఁడు ‘ఢిల్లీ’ చమూ
గ్రావంబుల్ పగిలింపకున్న నది వీరత్వమ్మె! యాంధ్రత్వమే!
338
గీ.అని, యనికి ముందు దూఁకుచు నాంధ్రవీరు
లేలికయెడంద నానంద మెదిగి పొంగ
జయజయోచ్చైరవమ్ములు సందడింప
నరుల నెదురంగ నడచి రుద్ధురపు భంగి.
339
వ.అట మహమ్మదీయ బలం బలూఫుఖాను వెంటఁదగిలి, మిగిలిన సాహసంబుమెయిం దెనుంగుకోట ముట్టికో లెప్పు డెప్పుడని కరకర వొడమం బఱతెంచునది నడుమ నడ్డుపడిన జనపదంబుల చెలువమ్ముం జెఱచి, సాధువుల బాధించి, సాధ్వీమణుల మానభంగముఁ గావించి, గోమాతల హింసించి యథేచ్ఛంబున హింసాత్మకంబగు దండయాత్ర సాగించె, నంత మొక్కలంబగు నా దాడిం గని జానపదు లోడి పాఱి రపుడు.340
ఉ.క్రొవ్వున నుబ్బి బెబ్బులులకున్ బెనుక్రూరతనేర్పు జోదులై
జివ్యకుఁజేరు నయ్యహితసేనల సందడి కొంతకొంత దౌ
దవ్వులఁ జూచి తెల్గుసరదారు లుదాయుధపాణులై మదిన్
ద్రవ్వి యెలర్చు పౌరుషమునన్ మునుముందర సాఁగి రడ్డఁగన్.
341
ఉ.ఒత్తడిమై నెదుర్కొనుచు నొండొరుఁ బండితులట్లు పూర్వప
క్షోత్తర పక్షముల్ పెనఁగి రుద్దవిడిన్; మఱికొంతసేపు పే
రెత్తుగడల్ చెలంగఁ గడునేడ్తెఱ సంకులయుద్ధమయ్యె; న
మ్మొత్తపుఁబోరున న్విజయముల్ బుజమెత్తెఁ దురుష్కవాహినిన్.
342
ఉ.అప్రతిమాన బాహుబల మంటిన దంటలు వీరు - వారు - వీ
రప్రథనంబు పేరునఁ బరంపరఁ గుప్పనఁగూర దోరి, తీ
ర్థప్రజ వోలె వేల్పుల పురంబునకుం గళదెచ్చి; రోరుఁగల్
వప్రములోన రాణువలు పల్చపడెన్, జెడె శత్రుసేనలున్.
343
గీ.తీసిపోవని యాంధ్రజాతీయశక్తి
మాసిపోవని ప్రభుభక్తి మల్లడింప
వీరసంపద పెంపార వెల్లడించి
పరుల నెదిరించెఁ గాకతీశ్వరుని బలము.
344
గీ.ఒకటి రెండు మాసమ్ము లీయోజఁ బెనఁగి
తెనుఁగువీరుల సమరనర్తనపుఁ దీరు
తెలిసి - సొలసి మహమ్మదీయులు దిగాలు
వడిరి; దిటవఱి యెదురంగ వనటవడిరి.
345
గీ.కాలమా! యనుకూలము గాకయుండె;
దేశమా? పరదేశము; తెగులువడియెఁ
బోమిగిలియున్న సైన్యము; లేమిసేయుఁ
గుఱుచవడిపోవక నవాబుకొడుకు డాబు!
346
గీ.ఆంధ్రవీరమహాప్రతాపాగ్ని యొకఁడు
కాల్చి తిను మండువేసవి కాల మొకఁడు
కడుపు లుడికించు నీటియెద్దడి యొకండు
పాప! మా ఢిల్లిసేనలఁ బట్టి యూఁపె.
347
వ.అట్టితఱిఁ జేరువకాఁడగు నయ్యలూపుఖానుండు కావించునదిలేమిం గుమారిలి శేషించిన బలంగముం బురికొల్పి యావచ్ఛక్తి మట్టికోటనేని ముట్టిపోవం దలపెట్టెంగాని, యక్కోట నొక్క బెత్తికయేని యూడి పడమి నుత్తలపడి యిఁక ముట్టడి కట్టి మరలిపోవ మానసించుచుండె;348
సీ.అది యటులుండ, నయ్యదన మహమ్మదీ । యులలోనఁ గింవదంతులు చెలంగెఁ
దెలుఁగువారల లంచముల కాసపడి యలూప్‌ । ఖానుని సంగడికాండ్రు కొంద
ఱది రాజవిద్రోహ మనక “గ్యాసుద్దీను । తుగ్లకు ఢిల్లిలో దోరె” ననుచు
లేనిపోని వదంతిలేపి; రంతఁ దలంకి । తత్సేన ఢిల్లీకి దారితీసె;
 
గీ.వేఁడిసోఁ కోరువమిఁ బుయిలోడి, పౌరు । షమునకుఁ బెనంగు పాదుషాకొమరునకును
వెనుదిరుగకుండ నపుడు తప్పినది కాద; । యెగ్గులో నెగ్గుగాక లగ్గేల వచ్చు!
349
వ.అంత నసహాయుం డలూఫుఖాను తెలుఁగువీరుల తాఁకునం బెగ్గడిల్లి భావికర్తవ్యం బెఱుంగమి దురటిల్లి, నిలువం దావులేమిఁ దిరుగుడువడి, దేవగిరింజేరి యుసుఱు దాఁచుకొనియుండి, జరిగినది తమవారు పన్నినపన్నుగడగా నెఱింగి వగచి మృతశేషంబగు త్రిసహస్ర తౌరంగిక బలంబు బలమఱి వెంటరా ఢిల్లీకిఁ బయనించి పోయె.350
ఉ.ఇట్టి పరాజయం బొదవ దెన్నఁడు మున్ను మహమ్మదీయులం
దిట్టి పరాభవంబుగని యెప్పు డెఱుంగరు పాదుసాహియుం
బట్టియు; నాంధ్రవీరుల యమానుషశక్తివిశేషమెల్ల న
ప్పట్టున గట్టిగాఁ దెలియవచ్చెఁ దురుష్కుల చిత్తవృత్తులన్.
351
చ.తలకొనియున్న యవ్విజయదర్పము తీవలువెట్టగాఁ దెలుం
గుల యొడయుండు పొంగి మనకున్ మనకోటకు నింక నత్తురు
ష్కులవలనన్ ఘటిల్లు సిలుగుల్ తొలఁగెన్, మఱి వార లెత్తిరాఁ
దలఁపని తీరునం దఱిమి తన్నితి మంచు దలంచె నాత్మలోన్.
352
ఉ.పాయని స్వీయవీరతకు భారతజాతి నివాళియెత్త దే
శీయులు పోరులం దుడికి చిందిన నెత్తురుఁగత్తులం దృణ
ప్రాయముగా నరివ్రజ శిరస్సుల నేఱి యశస్సునంది గ
ర్వాయతి నుండి రింక నెదురాడెడివారలు లేకయుండుటన్.
353
దేశక్షోభము
మ.అదిరా! యుద్ధముపేరు చెప్పికొని మాయావుల్ తురుష్కుల్ మహో
న్మదులై పాడికిఁ బంటకుం గఱవు గ్రమ్మంజేసి దేశంబు చ
క్కదమున్ ధ్వంసమొనర్చిపోయిరి; తెలుంగాణెమ్ము నల్మూలలం
దదలించెన్ వికటాట్టహాసముల యుద్ధానంతర క్షామముల్.
354
ఉ.కీడు ఘటిల్ల నొక్కవరిగింజ లభింపదు గింజుకొన్న; నా
యేఁ డపరాలు కూడఁ గఱవే యయిపోయెను, జిత్రమక్కటా!
మేడలు మిద్దెలున్ బసిఁడిమెత్తిన గోడలు తీసి తిందురే?
పైఁడికిఁ గోటికిం బడగవట్టిన యెంతటి భాగ్యవంతులున్.
355
ఉ.దారుణభంగిమైఁ దెనుఁగు ధారుణి మీఱుచుఁ దేల్పరాని యా
హారపు టెద్దడిం దలఁచి యాత్మ నలందురి వీరరుద్ర భూ
దారుఁడు పెక్కుచోట్ల నుచితస్థితి నిల్పె మహాన్నసత్రముల్;
కూరిమిఁ జేర్చి పేదలకుఁ గొల్చు నిడ న్నియమించె బంటులన్.
356
శా.“నాయీ దేశములోనఁ బ్రాణి యొకఁ డన్నంబింత లేకుంటచే
నాయుర్వాయువు వీడెనన్న నుడి యే ప్రాంతమ్మునం బుట్టఁగాఁ
జేయన్ రా” దని రాజశాసనముఁ జేసెన్ వీరరుద్రేశుఁ డా
యాయుద్యోగులకున్ గృపాగుణముతోడై తన్నుఁ బ్రేరేపఁగన్‌.
357
చ.నలుదెసలందునం దెలుఁగునాటఁ గలట్టివి యెల్ల రాచ గా
దెలు తెఱపించి, నిండినమదిన్ గొలుచుం గొలిపించియిచ్చె; బీ
దల కవి చాలమిం గని వెతంబడి తోడనె కోట నున్న గా
దెలఁగల కొల్చుసైతమును దీయఁగ భూపతి యిచ్చె నానతిన్.
358
ఉ.ఆఁకలిమంటచే గడుపులంటుచు నాయువుఁ బాయు స్వప్రజా
నీకముఁజూచి ఱేఁడు కరుణింపక స్వార్థము తీఁడిరింపఁ బే
రాఁకటఁ బంచభక్ష్య పరమాన్నములం దిని త్రేన్పగల్గునే?
యేకడఁజాడ హైందవ నరేంద్రుల నట్టిఁడు కానవచ్చునే!
359
ఉ.“రాచదనం బనంగ నదిరా; యిదిగాదె! తెలుంగుఱేని ధ
ర్మాచరణంబు శాశ్వత మహాస్థితిపీఠ మలంకరించు నో
హో! చతురర్ణవావృత మహోర్విని నీతనిఁబోని సత్కృపా
శ్రీచణు లెందఱుందు”రని చేతులుమోడిచి రాంధ్రభూప్రజల్‌.
360
గీ.ఇటులు కఱవును గికురించి, యెల్లప్రజలఁ
గనికరము మీఱఁ బెంచు శ్రీకాకతీయ
సార్వభౌముండు దేశీయజను లొసంగు
మనసు నిండిన దీవనల్ గొని తనర్చె.
361
గీ.తపన సదృశుండు వీరప్రతాపరుద్రు
సమరతాపంబు కొంత ప్రశాంతి వడయ
నంతలోఁ దొల్కరించె; నీలాంబుదములు
తెలుఁగు రైతునెమళ్ళ నర్తింపఁజేసె.
362
సీ.అంతటఁ దొలుకారునందు సంతసమార । నాంధ్రభూపతి సైనికాళిఁ బంచె
“ధారుణి దున్ని సేద్యములు సేయుం” డని । వలసిన విత్తనంబుల నొసంగెఁ
గర్షకతతికి; మాగాని జేనెఁడు కూడఁ । గొఱలేక యూడుచుకో వచించెఁ;
బన్ను వసూలు సాఁబాలు సేయుదుమని । వక్కణించెను గృషీవలులు వేఁడఁ
 
గీ.బెట్టుబడు లిచ్చెఁ; గోరినయట్టి దిచ్చెఁ । దాను సమ్రాట్టునాఁ బట్టుదలయె లేక
ప్రజలలోఁ బ్రజయగుచు నా రాజమౌళి । యఖిలభారతధరణి విఖ్యాతినందె.
363
గీ.మురిపెము చెలంగ వరిచేలు మూనదిరిగి
మూరెఁ డెదిగెను; నేల నల్మొనలఁ గలుపు
దీసి, రెల్లెడఁ జేలు పాల్వోసికొనియెఁ
బసరు విడి పైఁడిరంగులోఁ బడియెఁ గ్రమత.
364
చ.వసుధ సమస్తముం గనులపండువుగా వరిచేల నిండి, వె
క్కసమగు సంతసంబిడియెఁ గర్షకపాళికి; ధాన్యలక్ష్మికిం
గొసరిన స్వాగతంపుఁబలుకుల్ పలికె న్నెఱిమీఱఁ గళ్లముల్
వెసఁ గొడవళ్లు నోర్తెఱచి వేచెను; వేచిరి కోఁతకత్తియల్.
365
క.పొలముల పొలుపుఁ బగలు క
న్నులారఁ జూచుకొని ముదము నూల్కొన రేయిం
దెలుఁగాణెపు రైతులు గుం
డెలపైఁ జెయివైచుకొనుచు నిదురింతు రొగిన్.
366
గీ.పైరులు ఫలోన్ముఖములౌటఁ దీరుపాటు
దనరె, సేద్యపుఁబనుల తొందరలు ముగిసెఁ
గృషికులకుఁ గూలివాండ్రకు; నెల్లవారి
చిత్తములు భావిఫలముఁ గాంక్షించుచుండె.
367
వ.ఆంధ్రప్రజలు తీరుబడిసమయం బగుట నీశ్వరభజనంబునఁ గాలంబు పుచ్చుచుఁ గాకతీశ్వరకరుణ జీవములు వోసికొనుచుండి ధాన్యమ్ము పంటకుఁ గ్రుక్కిళ్లు మ్రింగుచుండి, రట్టి తరుణమున -368
మహమ్మదీయుల పునర్దండయాత్ర
సీ.తెలుఁగురాష్ట్రమ్మునఁ మెల్ల మెల్లఁ గాలస । ర్పమువోలె నొకవార్త ప్రాఁకుదెంచెఁ;
గడు నశాంతిని గీడుపడి, యప్పుడే యాద । మఱచి కన్మూసి రందఱును బ్రజలు;
తద్వార్త వినినయంతనె యుల్కిపడిలేచి; । రవుర! ఢిల్లీరాజునాజ్ఞ మిగిలి
తగుదునంచును వెండి దండెత్త నా ‘యలూప్ । ఖానుండు’ తానయి పూనెనంట
 
గీ.తలఁపఁడో గాక! తెల్గుజోదుల కటారి । మఱచెనో గాక మొన్నటి పరిభవంబు!
వెడలెనఁట నేఁడు పాదుషా పెద్దకొడుకు । వ్రేటువడి పగ వట్టిన విసపుఁ ద్రాఁచు.
369
చ.తెలుఁగులనోము పండినది, దేవుఁడు చల్లనిచూపు చూచినన్
బళిర, మఱింతకాల మిఁకఁ బట్టదు; వచ్చును ధాన్యలక్ష్మి గా
దెల కని మోదమందఁ బఱతెంచెను దోడనె తోఁకచుక్క; యాం
ధ్రుల యెదలం గలంతలు దరుల్ తెగఁద్రెంచి, జగమ్ము ముంపఁగన్‌.
370
చ.అలము విషాదనీరదము నాఁపఁగ లేమిఁ గలంగు తెల్గు రై
తుల కవి దుర్దినంబులుగఁ దోఁచెఁ; బ్రజాతతి పెంచుకొన్న యా
సలు మొదలూడిలేచె; వ్యవసాయపుఁ దొందర నున్న యాంధ్ర సే
నలు కలగుండు మోచె, జననాయకుఁ డెట్టులు నోఁచియుండెనో?
371
సీ.అరిసేనలు త్రిలింగధరణిలోఁ జొఱఁబడి । పచ్చనిపైరు చెల్వమ్ము చెఱచి,
పల్లెటూళ్ళ ప్రశాంతి భంజించి, పట్టణం । బులరూపు మాపి, గోవుల నదల్చి
విగ్రహాళిఁ దెరల్చి వెనుకటికంటె వే । మడుఁగుల ధౌర్త్యమ్ము గడుకొనంగ
రాక నాలించి వీరప్రతాప మహీశుఁ । డెడఁద నే యెడ భయంపడని యతఁడు
 
గీ.“వాలు చేపట్టఁగల యెల్లవాఁడు వచ్చి । సైనికుండయి సంగరస్థలికి నుఱికి
పరులఁ దలపడి వేఁటాడవలయు” ననుచుఁ । దెనుఁగువారికిఁ దీవ్రశాసనముఁ జేసె.
372
మ.ఇఁక నేమున్నది! యంతలో నుడికిపోయెన్ సర్వదేశంబు; వీ
రకుమారుల్ శిరసావహించిరి మహారాజాజ్ఞ, వాలూని పో
రికి దూఁకన్ గమకించి రుద్ధత యువశ్రేణుల్; విషోద్గారి రో
షకరాళోద్భటమృత్యునాట్యగతి నుత్సాహించెఁ బ్రత్యాంధ్రుఁడున్‌.
373
గీ.రాజ్యసంరక్షణము - దుర్గరక్షణంబు
ధర్మరక్షణమును - మేనుదాల్చినటులు
తెనుఁగువీరులు వీరచందనముఁ బూసి
కత్తులుఁ గటారులును దీసి కదలి రనికి.
374
చ.పెరిఁగిన కోపతీవ్రతను ‘బీడరు’ దుర్గము ముట్టి, దాని పెం
పఱఁ బడఁగొట్టి ‘యేకశిల’ నాహుతిసేయుతలంపు కల్మిఁ దొం
దరగొని వచ్చు శాత్రవఘనజ్వలనంబున వేఁడియార్ప సం
బరమున వీర వారిధరపాళి రణాంబరవీథి ముంచుచున్.
375
గీ.ఉడుకురక్తపు వెల్లి యుద్ధోర్వి నిండ
బలియొసఁగి యేఱులేఱులు పాఱఁజేసి
బ్రతి రుధిరబిందువున దేశభక్తి యురలఁ
బోరుసలిపిరి దేశీయ వీరవరులు.
376
మ.కరడుల్‍ గట్టి, పరాళిఁ బట్టి, తనమున్కల్ గూర్చు నిర్వార్య శౌ
ర్యరసోత్సేకము హద్దులం గడవఁ; బ్రత్యాంధ్రుండు దక్షాధ్వరో
ద్ధుర సంరంభుఁడు వీరభద్రుఁడనఁగాఁ దోఁపించి, కోపించి సం
గరవీథిం బరిపంథి యూధములఁ జక్కాడెన్ మహాధైర్యుఁడై.
377
ఉ.దారుణసంగర ప్రళయ తాండవరంగమునందు సర్వసం
హార కరుల్ మహేశు లనునట్టులు మీఱి తురుష్కసేనతోఁ
బోరి - శిరమ్ము లేఱి - ప్రభువుం దలపెట్టుచు వీరనాకముం
జేరిన తెల్గుపోటరులచేత ఋణంపడె ఱేఁడు మిక్కిలిన్.
378
వ.కాకతీశ్వరాశ్రితులు తెలుఁగుజోదు లవ్వడువున నోరుగల్లుదుర్గంబు ముట్టడించు మహమ్మదీయ వాహిని నెదురుకొని ఘోరాయోధనంబు గావించుతఱి రెండు తెగల ననేకులు వీరశయనంబు లందుచుండి, రప్పు డప్పొలికలను మృత్యుదేవీ నృత్యశాలవోలె వెఱపు గొలుపుచుండె; నంత నొకరేయి -379
ఉ.ఘోరపుమోసమై తెలుఁగు కోటను రాసులురాసులైన యా
హారపదార్థ మక్కటకటా! యొకవీసము కానరాద; యే
తీరున దోఁపువోయినది దేవుఁ డెఱుంగు; నపాండవాస్త్ర చ
ర్యారసికుండు ద్రోణసుతుఁ డాతఁ డెఱుంగును లోఁతుపాఁతులన్.
380
క.అని యిట్టు లార్తరావము
తెనుంగు దుర్గమ్మునన్ బ్రతిధ్వనియించెం;
దిన నా పూఁటకు దొరకమి
వనరెను గడుపంటి తెలుఁగు పక్షపుసేనల్.
381
గీ.హెచ్చువెల పెట్టి యెంతకునేని విలిచి
దేశమంతయు గాలించి తెచ్చి కోట
నిలువఁ జేసిరి ధాన్యరాసులను దెలుఁగు
సైనికులతిండి కుద్యోగిజనులు కడఁగి.
382
గీ.అట్లగుట, శూన్యమయ్యె ధాన్యమ్ము ధరణి
కోటలో నిల్వ యీ రీతిఁ గొల్లవడియె;
నుల్లముల నాంధ్రసైనికుల్ తల్లడిలిరి;
కోటకాపుల పిల్లలు గొల్లుమనిరి.
383
చ.కడుపులమంటచే నకనకంబడి కీడ్పడి తెచ్చికోలు మె
ర్వడిమెయి నాంధ్రసైన్య మొకపట్టున నొండును రెండునాళు ల
బ్బెడిదపు శాత్రవధ్వజిని వేఁడికిఁ దాళఁగలేక డస్సి మ్రా
న్వడె; నట నత్తురుష్కపృతనావని నామని వచ్చెఁ జేరువన్.
384
గీ.రాజులును, వీరులును, దుర్గరక్షకులును
సైనికులు నిట్లు నిట్రుపాసమ్ము వడుచు
నోర్చి నిలుపోపి దురమున నుండఁగలరె?
తెలుఁగువాహిని కపు డరుదెంచెఁ బాటు.
385
గీ.కడిమి ముందేఁగి, పట్టఁబగ్గములు లేక
కొట్టికొనివచ్చి, యోర్గల్లుకోట వ్రచ్చి
మొఱకుతురకల పెనుదాడి యురవడించి
పరువునన్ ‘రాజమహలు’ చేపట్టఁ బోవ.
386
సీ.తన చండశాసనత్వము తగ్గుదలఁ బట్టి । వేవెల్గు పడమటివీదిఁ బట్టె
సమరభూమీపరాగము గ్రమ్మి కళమాసి । కగ్గిపోయెను దివాకరుని వెలుఁగు
నటరాజరాజ సంధ్యాతాండవాడంబ । రమ్మునఁ గడభంగి రవళి తోఁచె
దొంగపోటున దిగుత్తుంగాద్రిఘనదరుల్ । కడచి దేశము ముట్టెఁ గారుటిరులు
 
గీ.నాఁ డమావాస్యరాత్రి యాంధ్రధరకెల్ల - । మినుకుమినుకన మబ్బుసందును బగిల్చి
కానఁబడు చుండె నక్షత్రకాంతి కొంత; । యోరుఁగలు వేఁడి వేఁడి నిట్టూర్పు వుచ్చె.
387
వీరరుద్రుని యభినివేశము
చ.అది పరమేశ్వరాజ్ఞ; యెవఁడాఁపును దానిని! కాకతీంద్రుఁ డు
న్మదరిపుకంఠ లుంఠన కనన్నిశితాసికరుండు తన్మహా
కదనమునందుఁ జిక్కువడుకాలము చేరువయయ్యె; నాంధ్రదే
శదశ తురుష్కరాజుల వశంబగు కర్మము గజ్జెకట్టెడిన్.
388
చ.తెలుఁగువజీరు లెల్ల వడదేఱిరి; దోరిరి పోరిపోరి; వె
న్నెల వెనుకాడి చీకటులు నృత్యముచేసిడి కాలమయ్యె నాం
ధ్రులకును గాకతీశునకునున్; బరదుర్గమమైన యట్టి యో
ర్గలుపుర దుర్గలక్ష్మి తిలకంబున వెల్వెలపాటు వాటిలెన్.
389
శా.వాలుంగేలికిఁ దెచ్చి రుద్రుగతిఁ దీవ్రక్రోధుఁడై యాంధ్ర భూ
పాలుం డంతట జవ్వనంబుపస రూపంబంద, బాలెంతయై
వాలారుంగొనగోళ్ళతోడి పులిఠేవం దూఁకి, తౌరుష్క సే
నాళి న్నేలకుఁ దెచ్చి భీకరగతిన్ వ్యాపించె గాఢోద్ధతిన్.
390
ఉ.వేలకొలందిగాఁ దెలుఁగువీరులు బారులుదీర్చియుండ ను
ద్వేలముదంబునం గొలువుదీరెడి యాంధ్రుల సార్వభౌముఁ డా
కాల మహానిశీథిని నొకండయి యాలము సేయనయ్యె, న
య్యో! లఘువృత్తిఁ; దెల్గుల కయోమయకాలము ముల్లుసూపెడిన్‌.
391
గీ.ఒంటి నుండియు నెల్లెడ నున్న కరణిఁ
బొలుపు గదురంగ నా మ్రుచ్చు ప్రొద్దునందు
నాంధ్ర సమ్రాట్టు పరులఁ దూఁటాడి యెసఁగె
ముసలి యభిమన్యువోలె నమ్మొగ్గరమున.
392
చ.సరసవు రాణివాసమును సాఁకెడిభారము మీఁదనుండ నీ
దుర మిటు రాకకున్ - దనకుఁ దోడుపడం గలవారిపోకకున్
వెఱపరి గాక యాంధ్ర పృథివీపతి జవ్వనపుంబసందు నె
త్తురు వెరవారఁ దెచ్చుకొని తోరపుటాల మొనర్చె నెక్కటిన్.
393
చ.అమలినకాంతిదంతురిత మాంధ్రరమారమణీ మణీ కిరీ
టముపయి మాసిపోవని బెడంగున వెల్గుల నీను జాతి ర
త్నము దిగజారిపోయెడి వినాశపుఁగాలము డగ్గఱించె దే
శమునఁ; దురుష్కపంజరము జాడల మ్రొగ్గెను వీరరుద్రుఁడున్.
394
గీ.ఓరుఁగలు దుర్గ రక్షణోద్యోగ నిష్ఠ
మాంధ్రనాయకుహేతి నేఁ డక్కటకట!
కాలవశతఁ దురుష్కుల పాలఁ బడియె;
ఘోరకలి వెల్గు నించు తెల్గుసిరి చెడియె.
395
ఉ.నాఁటి విభావరిం దెనుఁగునాడు సమస్తము కాడువాఱె; ఘో
రాటవిఁ దావుగానక భయంపడి రాంధ్రు; లరాజకమ్ము గీ
డ్పాటున బ్రుంగెఁ దత్ ప్రకృతి; పాటిలె నేకశిలాపురీ నిరా
ఘాట కవాట దుర్గమునఁ గష్టముపాటు పురాకృతంబునన్.
396
గీ.పతి తురుష్కులచేతిలోఁ బడుటకతన
బారుమని పలవించి య య్యోరుఁగల్లు
సంపదిందిర ప్రియునితో సహగమించి
వాసిగల పట్టణము దిబ్బచేసి విడిచె.
397
సీ.కవికోకిలముల చొక్కపు టెలుంగుల నెత్తి । పలికించు మధుమాసకళ తొలంగె;
శాస్త్రార్థములఁ బ్రతిస్వనియించు కొల్యుకూ । టము నేఁడు బిక్కుబిక్కుమనుచుండె;
వీరసింహముల గర్జారవంబుల మాఱు । మ్రోయు తెల్గులకోట మొరడువోయెఁ;
బొడిచిన నెత్తురు బొట్టు చిందనియట్లు । ప్రకృతి యపేత జీవముగ మాసె;
 
ఆ.వె.మగఁడులేని మగువ - తొగఱేఁడు తొలఁగిన । రేయి - కప్పులేని గృహము - తోర
ణమ్ములేని శుభము నా నుండె నలనాఁటి । యోరుఁగంటికోట యొంటిపాటు.
398
వ.ఆంధ్ర సామ్రాజ్యలక్ష్మి నిత్తెఱంగునఁ జేవలంతి గావించుకొని యలూపుఖానుఁ డోరుగల్లుకోటపై చంద్రధ్వజమ్మునాఁటి వీరప్రతాపరుద్రు బందిగొని ఢిల్లీకిఁ గొంపోవఁ దలంచి సాగుటయు నతండు -399
సీ.కవిశిరోమణుల వాఙ్మయ విమర్శనముల । యెడఁబాటునకు దిగుల్వడుచునుండు;
బుధశేఖరులు తలంపునఁబాఱ వాక్యార్థ । ములకు డెందమున గ్రుక్కిళులు మ్రింగుఁ;
దనమూలమున నాలమున నిండుప్రాణముల్ । దొఱఁగిన తెనుఁగుజోదులకు వగచుఁ;
దనజాతిని స్వదేశమును నెంచి తద్భావి । దౌర్గత్యమునకు నుత్తలమునందు;
 
గీ.భర్గసతిఁబోని యోర్గలు దుర్గరమణి । రూపధేయము నెంచి యశ్రువులు రాల్చుఁ;
దలఁపుపైఁ దలఁ పేదొ చిత్తమున మించి । యాంధ్ర భూజాని లోలోన నారటించు.
400
వ.తన పూర్వోత్తర జీవితమ్ములు భావించుకొని వానప్రస్థత నెఱప వలసిన యిట్టివయస్సున నపుణ్యనిలయంబున నునికి భయంకరమ్ముగా నూహించి యాత్మగతంబున -401
శా.“మున్నూఱేఁడులనుండి యొక్కగతిఁ బెంపుంగాంచి తోడ్తో నవి
చ్ఛిన్నంబై పఱతెంచు రాజ్యరమ నాచే నేఁటి కీపాటునన్
ఛిన్నచ్ఛిన్నమునై తురుష్కుల వరించెన్; గాకతీయాన్వయం
బన్నా! యింతటితో సమాప్తమగుఁగాదా! మత్కథాశేషమై.
402
శా.ఓ సర్వేశ్వర! కాకతీశ్వరుని యాయుస్సూత్రముం బట్టి ఢి
ల్లీ సుల్తానుల చేతఁబెట్టి యిటు నీ లీలం బ్రదర్శింతె! నీ
తో సాయుజ్యము నంద నాసగొను భక్తుంబట్టి యీ రీతిఁ గా
రా సంబంధముఁ గట్టెదే! మనసు కారాకూరమై క్రుంగిలన్.
403
ఉ.పావన చిత్తవృత్తిని దపఃపరతన్ గదియించి పుణ్య గో
దావరితీరభూమి నిరతంబు నివాసమొనర్చి యీశ్వరా
జ్ఞావిధి వేచియుండఁదగు నా కిటువచ్చె; విషాదపక్వ మీ
జీవితగాథలోఁ జరమశేషకథల్ సుకవుల్ తొలంపుఁడీ!
404
చ.కుతుకములేని దాస్యమునఁ గుందెడి దేశసవిత్రి యిక్కటుల్!
జతనమునం దొలంపుఁడి ప్రజల్! విజయధ్వజమున్ బునఃప్రతి
ష్ఠిత మొనరింపుఁడీ! తెలుఁగుసీమ స్వతంత్రపుజోతిఁ బెంపుఁడీ!
తతభుజశౌర్యుఁడైన వినతాసుతు వీరకృతుల్ తలంపుఁడీ!”
405
వ.అని ముచ్చిరిలి యెఱుకగలవాఁడగుట దైవికమునకు వగవఁ గాదని సరిపెట్టుకొని శాత్రవులవెంటఁ బోవుచు నర్మదానదీతీరమున నొకనాఁటి రాత్రియునికి విషయబంధవిరక్తుం డవ్వీరరుద్రుండు -406
ఉ.ఆఱడివోవనీక నిరపాయ ముపాయము నూఁది ‘గ్రుడ్డి ద
ర్బారు’ దురాయిఁగన్మొఱఁగి బ్రాహ్మముహూర్తము లేచి యొంటిమై
గారఁ దొలంగి దైవసహకారము పెంపుగ సోమజా ఝరీ
పూరమునందు స్నానపరిపూతుఁడు - ధ్యానకళా వినీతుఁడై
407
గీ.ఆత్మయోగముకలన శివాజ్ఞ నంది
యారముగ్గిన గాంగేయుఁ డమ్మహీశుఁ
డపునరావృత్తి మృత్యుంజయానువర్తి
సుఖముఁ జూఱాడె; దేశ మశ్రువులు విడిచె.
408
గీ.అనవధి చరిత్రకాల చక్రారపంక్తి
నొకఁడు వెనుకాడ మున్నాడు నొకఁడు వచ్చి;
ధరణి గ్రహరాట్ ప్రతాపంబు తరలి, తాన
కలువఱేనికి నొండొక్క వెలుఁగు దెచ్చు.
409
పర్వాంతము
చ.అమృత యశోమహ స్సురభిళాత్ములు కాకతినేతలందు న
చ్చమగు తెనుంగుపౌరుషము చక్కనిపోడిమి చిక్కనైన జా
త్యముఁ గని నీకునున్ శ్రుతిరసాయన మౌనని విన్చితిన్ జతు
ర్థ మిదియు నర్థిమై జనయితా! దయతో నిటు చిత్తగించితో!
 
మ.మనసున్ నా దెస నిల్వఁగా నునిచి ప్రేమస్విన్నతన్ విన్నయం
తన నీ చూపు పురాజనుఃప్రభృతి మద్భావస్థిరంబైన తి
క్కన ధీరస్మితదీప్తిధారఁ బునరుక్తప్రాయముం జేసిన
ట్లనిపించెన్; గృతికీర్తి కేతననిభం బౌనా! భవద్వీక్షలన్.
 
కాకతీయ పర్వము - ఆంధ్ర పురాణము - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి - ఆంధ్రభారతి - కావ్యములు - ఆంధ్రపురాణము - ఆంధ్రపురాణం - ఆంధ్ర పురాణం మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) Andhra Puranamu - AndhraPuranamu - Andhrapuranam - andhra puranam - Madhunapantula Satyanarayana Sastry- AndhraBharati AMdhra bhArati - kAvyamulu