కావ్యములు ఆంధ్ర పురాణము సాతవాహన పర్వము

ఆంధ్ర పురాణము
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి

అవినాశిన మగ్రామ్య
మకరో త్సాతవాహనః
విశుద్ధ జాతిభిః కోశం
రత్నై రివ సుభాషితైః.
    ‘బాణభట్టు’

సాతవాహన పర్వము
క.శ్రీమన్మధునాపంతుల
భూమిసుధాంధోన్వయాబ్ధి పుష్పితసంతా
నా! మజ్జనికారణ! కా
వ్యామృత రసధారణా స్వయంగ్రాహ చణా!
1
గీ.సాతవాహన నరపాల శకవసంత
సంతతోదయమున వికాసమ్ము వడసి-
తనువుసెడి యాకురాల్చిన తెనుఁగుతోఁట
యమృతమయముగఁ జిగిరించి యందగించె.
2
ఉ.చెట్టున కొక్కఁడై విడి కృశించిన యాంధ్రుల నేకదృష్టిలోఁ
బెట్టుచు నొక్కత్రాట నడపింప వలంతులు సాతవాహనుల్
పట్టము గొన్ననాఁడు కఱవా? భరతోర్వర చెక్కుటద్దముల్
ముట్టి తెనుంగుఱేఁడు వలపుల్ మొలపించెఁ బ్రపంచకాంతకున్.
3
ఉ.రాపులు వెట్టి పైబడు గరాసుల మోసులతోఁ బెకల్చి లో
లోపలి చూపునం బ్రభుతలో నొక మెర్వడి మీఱఁగా శక
స్థాపన చేసినట్టి జగజాణలు తొల్లిటి శాలివాహనో
ర్వీపతు లెన్న నాంధ్రుల చరిత్రము నందలి ముఖ్యపాత్రముల్.
4
మ.తెనుఁగెల్లన్ బెఱఱేండ్ల యేల్బడిఁ బరాధీనత్వ దుర్వాగురా
కులితంబై వెలలేని యాత్మగుణ శక్తుల్ రక్తులున్ వంతమై
బలిగా నిచ్చిన దెన్నఁడో; యది సహింపన్గల్గునే? విక్రమో
జ్జ్వలుఁడౌ నాంధ్రుఁడు సాతవాహనమహీశఖ్యాతవంశీయుఁడున్.
5
గీ.మగధరాజ్యేందిరా మణిస్థగిత మకుట
మాత్మవశమున నుండ దేశాంతరములఁ
గీర్తివల్లీమతల్లిఁ బ్రాఁకించె - నాఁడు
సాతవాహన వంశవృక్ష ప్రశస్తి.
6
శా.ద్వీపద్వీపమునన్ యశోలతలు హత్తెన్ మౌర్యసామ్రాజ్య ల
క్ష్మీ పల్యంకిక నెత్తిమోసిన నృపశ్రేష్ఠుం డశోకుండు; త
ద్భూపాలోత్తము క్రిందిరాజులయి యాంధ్రుల్ శాత్రవానీకమున్
ఱాపాడించిరి యౌరసంబగు స్వతంత్రత్వమ్ముఁ గాపాడఁగన్.
7
క.పారాధీన్య పిశాచీ
దారుణ హుంకారములకుఁ దలఁగి మనములం
దూఱడి, పోయిన బ్రతుకుల్
చేరిచికొన్నటులు సంతసించిరి తెలుఁగుల్.
8
ఉ.ఆ మఱుఁగైన కాలమునయం - దనఁగా బహుపూర్వమందు దు
ర్దామ పరాక్రమంబునఁ బరధ్వజినీ భటపాళిఁ ద్రోసి రా
జై మనదేశమేలిన దయాళువు ‘శ్రీముఖ’ భూమిపాల సు
త్రామున కెల్లవేళలఁ గృతజ్ఞత దోసిలివెట్టి మ్రొక్కమే!
9
సీ.పశ్చిమాశా వీథిఁ బాఱు ‘నరేబియా’ । వారిధిదాఁక నిండారఁ దెలుఁగు
సామ్రాజ్యమును బెంచె; సరిలేని హైదరా । బాదు, బీరా రందు వచ్చి కలసె;
నొక్కఁ డొక్కఁడు నిట్లుదక్కి, చూచుచునుండఁ । జిక్కినసామ్రాజ్య మక్కజముగ
నొడలు చేసి శిరస్సు లూఁపించి పగటుగాఁ । బరఁగె శ్రీముఖ సార్వభౌమ విభుత;
 
గీ.అటులు రాష్ట్రప్రజావళి కమృతభిక్ష । నిడిన యా తెల్గుతొలిదొర యడుగుజాడ
లంది తరువాతి సాతవాహన నృపతులు । నాలు గైదు శతాబ్దము లేలి రవని.
10
దీపకర్ణి వృత్తము
వ.సాతవాహన వంశవృక్షమునకు స్కంధాయమానుండగు శ్రీముఖుండు పురాణాంధ్రులం దొలుత మెచ్చఁదగిన ఱేఁడు; ఏతత్సాతవాహన వంశీయులందుఁ బెక్కండ్రగాథలు మధుమాధురీ ధురీణమ్ములైనవి. అందు సాతవాహన నామోత్పత్తి హేతువగు ‘దీపకర్ణి’ చరిత్రము శ్రోతవ్యంబు.11
మ.తొలినాఁటన్ గల తెల్గునాఁట ననురక్తుల్ నించి పాలించి వె
న్నెల గాయించెను ‘దీపకర్ణి’ యను భూనేతృండు; తన్మానసో
జ్జ్వల లీలాప్రసవమ్ము ‘శక్తిమతి’ యన్ సమ్రాజ్ఞి చేపట్టి యి
మ్ములఁద్రిప్పున్ నిరతంబు క్రొవ్వలపుసొంపుల్ దిక్కులన్ నింపుచున్.
12
క.ఆరంగూరిన కూరుము
లేఱులుగాఁ బాఱ వార లిరువురు ప్రణయ
స్వారస్యోపాసన పెం
పార మెలంగిరి యలౌకికానందధులై.
13
శా.పాలున్నీరునుబోలె దంపతుల భావశ్రీలు భాస్వత్కళా
లాలస్యంబున నొక్కటై నిమిషకాలంబేని వేఱైనఁ - బ్రా
ణాలంబాయుదు రన్నటుల్ మెలఁగుచుండన్, సాగెఁ దజ్జీవయా
త్రాలక్ష్యంబు నిరత్యయ ప్రణయ సామ్రాజ్యాధిపత్యం బనన్.
14
గీ.ప్రాజ్యసామ్రాజ్య పాలనభార మొకఁడు
నొక్కయెత్తుగ - దేవీ ప్రియోపభోగ
భర మొకఁడు నొక్కయెత్తుగా జరిపె నృపతి
యట నిటఁ బరాకు వడనినే ర్పగ్గలింప.
15
వ.అట్టి మంగళవసంతములు కొన్ని కడచిన వెనుక -16
మ.పొరపొచ్చెమ్ములు లేని డెందమునఁ బూవుంబోని దేవేరితో
ధరణీంద్రుం డొకనాఁడు నందనవనీ దర్పాపహాస్పంద సుం
దరతా తుందిలమైన పౌర బహిరుద్యానంబునం గోరికల్
కరఁగన్ దీవకుఁ దీవకుం దిరిగి లోకం బాత్మలో నేమఱెన్.
17
శా.ఆతాదాత్మ్యముతో నొకింత తఱి యట్లాజంట తారాడిన
ట్లే తారాడి - వనీనిశాంతమునయం దెంతేని కైపంటఁగాఁ
జేతః ప్రీతిని మేనువాల్చి పవళించెన్ సంచితాంహో మహో
త్పాతంబుల్ విరిసెజ్జలై ప్రియత నాహ్వానింప మాయావృతిన్.
18
గీ.ఊహలేని సుషుప్తిలో నుండె రాణి;
కలల కలఁతల నిద్దురఁగనియె రాజు;
కాలపురుషుఁడు పొడియారు కనుల యెఱుపు
భయముగొలుపఁగ జాగ్రదవస్థ నుండె.
19
గీ.అపుడు కనిపట్టుకొనియున్న యట్టులొక్క
విసపుబరిత్రాఁచు బుసబుస ల్వెట్టు కొనుచు
వచ్చి, నిదురించియున్న భూపాలరమణిఁ
గొసరి జోకొట్టె మఱి మేలుకొనని కరణి.
20
ఉ.ఆదరణీయ దంపతుల యంగము లట్టులు వింగడించెఁ గ్ర
వ్యాదునిబోని సర్ప మకటా! వికటాశయవృత్తినూది; యే
చేఁదులు మేసె శక్తిమతిచే! - సహజంబుగ నద్ది పుత్ర పు
త్రాదిని యైన పాపినిగదా, యెదలో దయ తొల్కరించునే?
21
శా.లీలార్థంబుగ మేలిగాలిపట మోలిం జేసి యద్దానితో
బాలుం డాడెడిదాఁక నాడి గగనప్రాంతానఁ దారాడ, దా
రాలెన్నో ముడివైచి పట్టు విసువారన్ వీడి - యఱ్ఱెత్తి హే
లా లిప్సన్ బరికించి గంతులిడు లీలల్ - దైవలీలల్ గదా!
22
వ.ఒక్కింత తఱికి దీపకర్ణి మేలుకొని దేవేరి మరణంపుగుఱుతు లెఱింగి పిడుగుపడినయటులై గుండెయడలఁగూలి తన యపుత్రతకుఁ దో డీ యపత్నీకతయు దాపురించుటకు వాపోయి-23
ఉ.తల్లటపాటు వాటిల నెదన్ గొదవల్ గుదిబండలట్టులై
యల్లటపెట్టఁ గప్పిన రహస్యము విప్పెడిచోటు లేక, నా
శిల్లిన సంబరమ్మునకు జీవముపోసెడి వారు లేక యా
యల్లకవేదనా విధురితాంతరుఁ డాయె నృపాలుఁ డాయెడన్.
24
గీ.కనుల వెన్నెలవత్తిఁ బాసిన కొఱంత -
ప్రాణమూరించు తనయులు లేని వంత -
రెండును దురంత దుఃఖవారినిధు లగుచు
నా నృపునెడంద పాయపాయలుగఁ జీల్చె.
25
ఉ.లోకములోన నేకడ వెలుంగను శబ్దము లేదు; సర్వమున్
జీకటిముద్ద భూపతి కిసీ! మసిపాఁతలు గట్టి శోక భు
గ్నాకృతిఁ గన్ను మిన్ను నొకటై దురటిల్లు స్వరాజ్యలక్ష్మి యే
కాకినిగాఁ గనుంగవకుఁ గట్టు నభిన్న తమస్స్వరూపయై.
26
సీ.తనయనంతర మాదుకొని స్వరాజ్యేందిర । సుఖదుఃఖములు చూచు సుతునికొఱఁత
కన్నుఁగల్వలఁ బండువెన్నెల గుత్తియై । పాఱాడు ననుఁగు దేవేరి కొదవ
భావిజీవిత సరిత్పతియాత్రలో నెవో । పెను తుపానుల నెంచుకొనెడి వెలితి
యిహనిరీహత భగ్న హృదయముం జెయివెట్టి । మట్టంటఁ గలఁగించు నట్టి వగపు
 
గీ.నొకవగపు గాదు, లక్ష - లేవో కలంచి । దిరిసెనపుఁ బూవుఁ బోని యాదీపకర్ణి
యెడఁద వసివాళ్ళువాడ రాపిడి యొనర్చెఁ; । బడఁతి వీడిన బ్రతుకు లేబరముగాదె!
27
గీ.మిసిమి పస గల్గిన రసాల రసికరాజు
కొమ్మ కౌఁగిట వలపులఁ గులికియాడు
బండిగురివెంద లేఁదీఁగ యెండిపోయె;
దీపకర్ణి మిగిల్చి - శక్తిమతి చనియె.
28
చ.మిగిలినమేను తొంటిబలిమిన్ దొలివాసనకల్మి రాజ్యతం
త్రగతుల లోఁగిరాఁగ - నెడఁదన్ ముడివైచి కలంచి దూరమై
యగపడకున్న యాత్మ హృదయ ప్రియపై మది పాదుకోఁగ, ని
మ్ముగ నృపుఁ డోర్చెనో ప్రణయముక్తికి దగ్ధపట ప్రసక్తిగన్.
29
గీ.అతి విషాదాక్తమైన భూపతి తపస్సు
పరమ మోదాత్మకమ్ముగాఁ బండునేమొ!
బ్రతుకు కుతుకము లేని భూవరునిలోన
నొక్క మధురాశ యేది యేదో చిగిర్చె.
30
శా.మ్రోడైపోయిన జీవయష్టి యమృతంపుంజిల్కు పెన్‍వృష్టి దోఁ
గాడన్ ఱేనికి నొక్కనాఁ డెవియెవో కల్యాణ సంకల్పముల్
పాడంబాడఁగఁ గూడుకొన్న ఫలమై, భావ్యర్థముల్ పల్క జీ
రాడెన్ లోపలఁ జల్లగాలిపసివాఁ డానంద గూఢంబుగన్.
31
ఉ.అంచిత చందనాభమగు నా చిఱు చల్లని గాలినుండి తో
తెంచిన యొక్క భావము మదిం గదలింపఁగ - దీపకర్ణి నే
త్రాంచలముల్ చలచ్చల దుపాంతములై యఱమోడ్పువెట్ట నా
లించెను లోని కోరికి ఫలింపఁగఁ దీయనిపల్కు నీగతిన్.
32
గీ.‘కనఁగ - నీలోన గూఢమై గాఢమైన
వగపు మగమొల్కకొఱకె యౌనుగద ఱేఁడ!
వెతలు పడఁబోకు - నీ పురాకృతము దైవ
మారఁ బండెడి సమయ మభ్యర్ణగతము.
33
వ.దీపకర్ణీ! రేపాడి నీవు నాఁటనాఁట వేఁటకుంబోవు సమీప విపినవాటంబున కరిగినవాఁడ వట నొక్క సింగమ్ము నెక్కియున్న పసియీడు పిల్లవానిఁ బరమ తేజస్వంతుని గనువిందుగా నరయఁ గందు; వాకన్న బిడ్డండు నీకన్న బిడ్డండు వోలె భవత్తప్తహృదయంబును లిప్తచందనమై శీతలమ్ముఁ గావింపంగలవాఁడు.’34
క.అని మేనులేని లోపలి
మనసును గదలిచిన వాణి మధుమధురముగా
వినిచిన సందేశముతోఁ
గనులు తెఱచె ఱేఁడు వికచకమలముజాడన్.
35
గీ.నిలువుటద్దము మీఁది కశ్మలతఁ దొలఁచి
కుదురుగా సంతరింపఁ - గట్టెదుట నిలచి
తన్నుఁ దాఁ జూచుకొన్న ముదమ్ము వడసె
దివ్యబోధ బోధితుఁడైన దీపకర్ణి.
36
శా.ఓహో, యెంత ప్రశాంతి, యెంతటి మహాయోగంబు! కల్లోలపున్
బాహుల్ చాఁచెడి పాలవెల్లికి సుఖస్వాపంబు; తాపంబుచే
దేహం బేఁచెడి చిచ్చునన్ మలయజార్ద్రీభూత గంధోదయం
బోహో, యెంత ప్రశాంతి, యెంతటి మహాయోగంబు తూఁగాడెనో!
37
మ.అని భావించెడి డెందపుందమియుఁ జెల్వై దీపిలన్ ‘రేపు’ వ
చ్చెను; విచ్చెం గనుజంట; సేవకుఁడు తెచ్చెన్ విల్లునమ్ముల్; పురా
జను రానీతము పున్నెమే మహితవజ్రప్రౌఢవర్మంబుగాఁ
జని చొచ్చెన్ విపినావనిం దన యదృష్టశ్రీ గుబాళింపఁగన్.
38
చ.నునుచిఱుబుగ్గ మొగ్గలకు నూఁగులు దీర్చెడి కాకపక్షముల్
తొనఁకెడి చిట్టి నెన్నొసలితోఁ బసివాఁడు మృగేంద్రవాహుఁడై
వనమున దీపకర్ణి నరపాలున కెప్పుడొ మోచి దాఁచఁ బె
ట్టిన సిరియై తఱిం గనఁబడెం గనుఁదమ్ములఁదేనె చిమ్మఁగన్.
39
గీ.చుఱుకుఁజూపులఁ బదనైన చిఱుతనవ్వు
ముండ్లనిండిన పసిఁడి క్రొమ్మొగలిపువ్వు;
పూవుఁ బుడికిన విషసర్పమూర్తి ముట్టు
బాలుఁ దాఁకిన సింగంబు కాలి పెట్టు.
40
ఆ.వె.అపుడ ఱేని నరసి యగ్గియై దిగ్గన
మీఁది కుఱుకఁబోయి మెకము తొణఁకె;
దీపకర్ణి వాఁడి కోపుటమ్ము - మొగమ్ము
తొలవడంగ వచ్చి దూసికొనియె.
41
ఉ.దూసినదెబ్బతో - బ్రదుకుతోఁ బెనఁగొన్నముడుల్ పటుక్కనం
గోసికొనంగ సింగమునకున్ నెఱిపచ్చిక చేతు లూఁది పెన్
బాసటయిచ్చె మేదిని కృపాఖని; భూపతి బాణవేగుఁడై
మోసె ధరిత్రి ముద్దిడక ముందరఁ దొందర నాస్తనంధయున్.
42
ఉ.ఆ యమృతాదృతిం దనిసి యంగములెల్లను పొంగులై - రసా
ప్యాయత నిల్వునం గరడులై యురియాడఁగ యక్షుఁ డయ్వెడన్
దోయిలివట్టి కట్టెదుటఁ దోఁచెను; జూచెను దీపకర్ణి కం
దోయిని సంభ్రమాశ్రువులు తూలఁగ - నబ్బురపాటు చాలఁగన్.
43
వ.అట్టియెడఁ గృతజ్ఞతా విచక్షణుం డయ్యక్షుండు తన శాపమ్ముఁ బాపి - పాపనెత్తుకొనియున్న ‘దీపకర్ణి’ భూపాలునకు మేలుమఱవమి నాంగికంబుగా వెలిపుచ్చి వాచికం బిటులు విప్పె.44
చ.ఒక మునిశాప మిట్లు వడియుండి యధోగతిఁ గుందుచుండ దా
రికిఁ గొనివచ్చి నన్ గనికరించితి వెంత దయార్ద్రమోయి! నీ
యకృతకమౌనెడంద; కలదా, సరియెత్తునఁదూఁచి యిచ్చు మే
లొకఁడు; నృపాల! యెత్తుకొనియుంటి నిసుంగు నిఁకేమొసంగెదన్.
45
ఉ.ఎత్తిన పైఁడిముద్ద బరు వెంతయొ? నీ కృతమైన మేలునం
దొత్తినభారమెంతొ? తెలియుంగద నీ మది; రెండు నొక్కటే
యెత్తునఁ దూఁగెనో, యొకటిహెచ్చువడన్ ములు లాగెనో, నృపా
లోత్తమ! యంచు నాత్మతనయున్ మునివ్రేళులఁజెక్కు పుణ్కుచున్.
46
గీ.వీఁడు నా కన్నకడుపు; నా పేరు సాతుఁ;
డిపుడు నీ యమ్ముఁ దాఁకి శాపపు విముక్తి
కలిగెఁ గానఁ గృతజ్ఞతఁ దెలుప - వీని
నొసఁగెదను బెంచుకొమ్ము, నాకు సెల విమ్ము.
47
గీ.అని కృతమ్మును దడవు నాతని వచస్సు
హృదయ కుహరము వెలువడి పెదవికొసను
గదలియాడుట - యక్షుఁ డప్పదము విడుట -
మాయమగుటయు నొక క్షణప్రాయ మాయె.
48
ఉ.చేతులనుండు కొండికను జేతమునం బెనవైచుకొన్న య
న్నాతి పరాత్మశాంతికి ననంగ నురంబున కద్ది యద్ది భూ
నేతయు ముద్దు లేఱుకొని నెగ్గిన డెందములోఁ బురప్రయా
ణాతత కౌతుకమ్ము వొలయం బయనించె సపుత్రకమ్ముగన్.
49
గీ.సాతుఁ డనుపేరు గలుగు యక్షవరుఁ డొక్కఁ
డెక్కిరింతగ నుండిన హేతువుననె
సాతవాహనుఁ డనెడి ప్రశస్తి నందెఁ
దెలుఁగు దేశములోన నద్దివ్యశిశువు.
50
చ.అటుపయి నబ్దముల్ తిరుగ నాచిటిబాలుఁడు ప్రోడయై యశః
పటములు దిక్తటీతతులపై వెలయించుచుఁ దెల్గువారి బా
సట యయి నేలనేలె; దివిషత్పతి విం దగు దీపకర్ణి యూ
ఱటఁగొని దీవనల్ పువులు రాల్చుచు స్వర్గమునుండి చూడఁగన్.
51
గీ.దీపకర్ణి యేల్బడియు - శక్తిమతి మృతియు
యక్షసాక్షాత్కృతియు - శాపమోక్షణంబు
గాథలో, కాక కట్టిన కథలొ కాని
తనరె దైవాంశ సాతవాహనునిలోన.
52
వ.సాతవాహన మహీజానియే హాలుండు శాలివాహనుండు ననెడి యభిఖ్యాంతరమ్ముల పలుకుబడినుండి తానొక శకస్థాపకుండునై రాజ్యపరిపాలన సారస్వతపరిశీలనములం దనమది యేపెడ ములుమ్రొగ్గెనో యేర్పఱిచి యగ్గింప వీలుపడని తెఱంగున నేలుబడి సాగించె, నతని చరిత్రంబు ధీమంతులకు మంతవ్యం బైనయది.53
హాలనేత రసికత
సీ.మొఱవపోయిన శిల్పగరిమంబుఁ దీరిచి । పదనువెట్టించు మేల్పనులయందు
వెలరు వట్టిన కళావిభవంబు పగటుగాఁ । దిరుగఁ దోఁడించు తత్పరతయందు
తళుకు కగ్గిన కవిత్వశ్రీకి రసభాస్వ । రత సంతరించు కర్జములయందు
గాజువాఱిన శాస్త్రగర్భ రహస్యముల్‌ । వెలికిఁ దీయించు నుజ్జ్వలతయందు
 
గీ.సాతవాహన ధారిణీ జానిమణికి । బవలు రేలును - రేలును బవలు నగుచుఁ
గాల మొకతీరు కర్పూరఖండ మాయెఁ । దెనుఁగువారికి నవసుధాంజనము నాయె.
54
మ.ప్రతి జీవాణువునందుఁ బ్రాకృత సరస్వత్యంశ వీణా దర
శ్రుతులం జిందులువోయఁ గందెఱల యంచుల్ వంచకే చూచి యు
న్నతి నుల్ల మ్మొక పాలవెల్లియయి పొంగన్ హాలభూపాలుఁ డా
రతు లెత్తున్; సరియెత్తు లేదనుచుఁ దీర్పంజూచు నబ్బాసకున్.
55
చ.అనయము నేల యీనినటులై పఱతెంచు కవుల్ కళారతుల్
ధనకటకంబు వాఙ్మఠ పదంబుగఁ జేసిరి; హాలరాజు తీ
ర్చిన సభ దేవతాసభగఁ జేసిరి; దేశమునెల్ల నిత్య నూ
తన కవితార్థ సస్యములఁ దన్పుపొలమ్మునుజేసి రయ్యెడన్.
56
సీ.‘కృష్ణవేణీ’ తరంగిణి తీరభూముల । ప్రకృతిలో మూఁగవాచికము లెఱిఁగి
పసిఁడి పచ్చని వరిపైరు పంటపొలాల । పొలుపులో మెలపైన తలఁపు లేఱి
వలిగాలిలో గొంతువదలి పిట్టలఁ జోపు । పడుచుల పూపభావములు పట్టి
మాయమర్మముఁ దలంపని కృషీవల దంప । తుల పరియాచకమ్ములను ముట్టి
 
గీ.రసిక సుకవులు గాథలు వ్రాసితెచ్చి । పసదనం బిచ్చు హాలభూపాలు మెచ్చు
లందుకొందురు; కవి చారితార్థ్య మెపుడు? । రాగమున హాలు నౌదల యూఁగినపుడు.
57
ఉ.పాకృతవాణిపై నుసుఱుపందెము లొడ్డిన హాలరాజు చే
తాఁకునఁ గ్రొత్తకబ్బము లుదాత్తరసంబులు పుక్కిలించె; గా
థాకృతు లెన్నియో భువి శతమ్ములు సప్తశతమ్ములై రస
శ్లోకములై యిడెం దెలుఁగు లోకమునం దమృత ప్రపావళుల్.
58
చ.రసికత నామతించు నల రాజశిరోమణికిన్ గళంబునన్
బసిపసి మొగ్గలేఱి ‘కవిబాలిక’ లెత్తులు గ్రుచ్చివేసినన్
గుసుమితమై దెసల్ కొసరుకొం చవి తావులఁ గ్రుమ్మరించు వె
క్కసముగ నౌర! హాలు రసికత్వములో మధుమాసమాధురుల్.
59
మ.కలకాలంబును గీర్తిడిండిమము మ్రోఁగన్ దీఁగలై సాగు ను
జ్జ్వల సాహిత్యపిపాసతోఁ దెనుఁగురాజ్యశ్రీకి నెమ్మేనఁ బు
ల్కలు వాఱించుచు ‘హాల నేత’ కవితాకళ్యాణ ఘంటాపథం
బుల సర్వస్వముఁ బంచుచుం గవులనోమున్ గామధుగ్ధేనువై.
60
ఉ.తీయముఁ జూపుచున్ దలలుతీసి తలల్‌ తగిలించు నాలి వా
లాయపుఁదంత్ర మొత్తిలి కలంపని పల్లెలలో నమాయికా
ఖ్యాయిక లన్న నా నృపతి ప్రాణములిచ్చును; నవ్వి వువ్వులై
కాయలు పండ్లునై వెలయఁగాఁ గలగాంచును ఱేఁడు నిచ్చలున్.
61
గీ.“మానవుని జీవితమ్ము మేలైన కబ్బ;
మందు సత్కవి యేఱిన బిందు వొకటి
యొక మహాకావ్యమౌ; నది సుకవి జాలు;
కావ్యతాసిద్ధి కొక్క శ్లోకమ్మె చాలు.”
62
మ.అను సిద్ధాంతముఁబెంచి, గాథలను డాయంజేరి విద్వన్మణుల్
వినిపింపన్ క్షణశః ప్రతీక్షమెయి నాలించున్ మహారాజు; హా
లుని వీనుంగవ శంఖమై కవుల సుశ్లోకాళి తీర్థంబునై
తనరెంగావున నిల్చెఁ బ్రాకృతపుగాథల్ మాధురీ సాధువుల్.
63
ఆ.వె.ప్రాకృతమ్మె రాజభాష; ఱేఁ డద్దానఁ
గైత లల్లుఁ - గవుల గారవించు
శాసనముల నదియ బాసవాడుక - యిఁక
సాఁగె నమరవాణి మూఁగనోము.
64
గీ.దేవభారతియెడల భక్తి - యనురక్తి
తుఱఁగలించిన కవులు మంతురులుఁ బ్రజలు
నౌర్వశిఖి దాఁచుకొన్న క్షీరాబ్ధులగుచుఁ
గానవత్తురు హాలు నాస్థాన వీథి.
65
చ.ఎద సురభారతీపదము లెంచు కవీంద్రులు హాలుకొల్యునం
దొదుఁగులువోయి సంస్కృతపు టూపిరి పీల్చుట తప్పుగా, ననా
స్పదమును నస్వతంత్రమగు భావము దాల్చుట ముప్పుగాఁ దలం
చెద; రదియట్టి వాఁడిమినిఁ జెందెనె యాధరణీంద్రు పట్టునన్!
66
వ.సాతవాహన మహీపతికిఁ బాకృతవాక్కుపై నెంతమక్కువయో యతని యనుంగురాణికి లీలావతికి దేవభారతిపై నంతటి యాదరణం బగుటంజేసి-67
గీ.రాణి గీర్వాణవాణి సారస్య మేఱి
ఱేని చెవి నిల్లు గట్టి యూరింపనెంచు;
ఱేఁడు ప్రాకృతగాథ లేఱి వినిపించి
రాణి వలపించి గెలుపు పేర్వడఁ దలంచు.
68
క.ఆ దంపతులకు వేఱిమి
లే దెందును; వాఙ్మయంపు లీలల నెపుడో
వాదములు ముదురుఁ; బ్రణయ
స్వాదువులై మృదువులై పసందుగఁ జెదరున్.
69
ఆ.వె.ఉసురుపోక దాఁక నువ్వెత్తుగాఁ దాఁకి
యుబుసుపోకలోని కొదుఁగువడిన
రాచజంట సాహితీ చమత్కృతి జల్ప
మాలకింప రసికపాళి కింపు.
70
గీ.ప్రెగడయై కొల్వుకవియునై పేరు నెగడె
నార్ద్ర హృదయమ్మువాఁడు గుణాఢ్యసూరి
హాల నరపతిఁ గని ప్రాకృతాభిమాన
ఘనత తనలోన ముంచియెత్తి నటు లుండు.
71
చ.ఒడయని మాటకెల్లఁ దలయూఁపుల తాళము మేళవించు ప్రె
గ్గడయగు నగ్గుణాఢ్యకవి గర్వపుఁ దళ్కులు, వానిపల్కు, లా
కడుపున లేని కౌఁగిళులు గాంచి కదుష్ణముగాఁగ నూరుపుల్
విడుచును ‘శర్వవర్మ’ యను పేరిటిమంత్రి వచస్స్వతంత్రుఁడై.
72
గీ.వయసుముదిరిన శర్వవర్మ యొకమేలి
గడుసుపోకడ వోవు యుగంధరుండు-
ఎదుటిమానిసి పెదవిలో హృదయమూర్చి
పయికిఁ దేలఁడు - తేల్చిన పట్టు విడఁడు.
73
చ.కొలువున నప్పుడప్పు డనుకో ననువీయని వాగ్వివాదముల్
తలకొని హాలరాజు సమిధల్ వడి, రాఁజి, జ్వలించి, పెద్ద మం
టలగును శర్వవర్మకు గుణాఢ్యున; కయ్యెడ రాణి పాలపా
పలవలెఁ దేర్చుఁ దా నుభయభారతియై కడతీర్పు తీర్చుచున్.
74
గీ.హాలపతి యూఁతవడయు గుణాఢ్య కవికి
విసురుహెచ్చు; మహారాజ్ఞి వెనుకబలము
శర్వవర్మకు ధైర్యభిక్షమ్ము నిచ్చు;
నిరువురును దీసిపోనివా రెల్లయందు.
75
ఉ.రాణియు, శర్వవర్మయును - రాజు, గుణాఢ్యుఁడు నిర్వు రిర్వురై
ప్రాణమువోసి సంస్కృతముఁ బ్రాకృతముం బరికింప దేశభా
షాణువు పెద్దచూపులకు నానదు; సంస్కృతవాణికిం దను
త్రాణము రాణి తేనెలఁ గదల్చిన మిర్యపుటుండ ఱేనికిన్‌.
76
చ.ఎడనెడ ముచ్చటించునెడ నెప్పుడొ వేలుపు బాస లోఁతులం
దడవని సేగి సూదివలెఁ దాఁకును బట్టపుదేవి గ్రువ్వ; న
య్యెడల నెడంద డిందువడి యింతయిపోయి సహింపరాక దుం
దుడుకు వడున్ నృపాలకుఁడు; దొడ్డది రాణులదెప్పు చెడ్డదిన్.
77
ఆ.వె.ఆఁడుదానియెదుట - నదిగాక, యేలిన
రాణియెదుట నమరవాణి తనకు
ససిగ రానివెలితి సర్వంసహాపతి
యెదకు వాఁడికత్తి పదను కోఁత.
78
వ.వేల్పుబాస రామిఁ బెద్దకాలం బటులు సాతవాహన భూమిపతి పట్టంపుదేవిచే మెత్తమెత్తని యవమానంబులు వడుచు నవి తడిసి మోపై మోయరాని వగుటయు, మాటలు వేఱైన మనస్సులును మాఱునను వెఱపుతోడి దిగులు కుదియింప నబ్బాస సాధించితీరవలయునని పట్టె, నంత-79
ఉ.తొల్లిటివోలె వాదములదూఁకక యేకవి చూడ వచ్చినన్
మొల్లపు గారవంబు లిడు ముందర; మంతిరి శర్వవర్మతో
నుల్లసమాడుఁ; దద్గత మహోదయభావము లాకళించి యు
త్ఫుల్ల ముఖాబ్జుఁడై తనియుఁ; బ్రొద్దులువుచ్చును దేవవాగ్రతిన్.
80
గీ.శుక్లపక్షములోని రాజువలె హాల
రాజు పరిణతి పట్టపురాణి యెదకు
నమృతసేకము శర్వవర్మ మది కింత
కౌముదీలోకమును నౌచు గణుతిఁ గనియె.
81
గీ.అంత నొకనాఁడు కొలువు వెల్గైన తెలుఁగు
రాజు హాలుండు సింహాసనాజిరమున
నొక మణిజ్యోతివోలెఁ గూర్చుండ నరసి
సభ్యలోకము శాంత ప్రశాంత మయ్యె.
82
గీ.అపుడపుడు వచ్చి కోకిలాలపనములను
వంతునకుఁ బిల్చి మధుగళస్వరము పొరలఁ
దఱచి సాహిత్య చర్చలుజరపు రాణి
నాఁడు ప్రత్యేకమైన మంటప మహస్సు.
83
గీ.సార్వభౌముని కడకంటి చాయ లొరయ
శర్వవర్మ గుణాఢ్యులు స్వ స్వ విహిత
సచివ గౌరవ సముచితాసనములందు
సింగముల తీరుగా సమాసీను లైరి.
84
గీ.రసికరాజులు - సంస్కృత ప్రాకృతముల
పసలు రాశివోసిన కవీశ్వరులు - శాస్త్రు -
లన్ని కళలందుఁ జెవిగల యట్టివారు
వందలో, వేలొ; యా కొల్యునందుఁ గలరు.
85
వ.గుణాఢ్య శర్వవర్మాదు లొక్కరొకరుగా సాహిత్యగోష్ఠిఁ గొంతతడవు పూర్వరంగ ప్రసంగమ్ము నడపుటయు శర్వవర్మ గీర్వాణభాషాకావ్యంబులనుండి రసోత్తరంబులగు శ్లోకములు కొన్ని యేఱి పలికి వానియందలి మధురతోదర్కంబులగు పదములను హృదయస్పృశంబులగు భావములను నుగ్గడించుటయు, నది సందుగా రాణి యందుకొని తానును దద్వాఙ్మయమ్ము తీరు లగ్గించి యంతంబోక “యింతకును భాషాభిజ్ఞతంబట్టి కదా రసజ్ఞత” యని నర్మగర్భంబుగాఁ బతిం గని మందహాస శరంబు విసరె; నయ్యది చివుక్కున నుల్లంబుఁ దాఁకియు నప్పటికి సయిచి కొంతతఱి వారివారి ముచ్చటలయిన వెనుక-86
క.లోలోన రాణి వేళా
కోళమ్ములు రగిలి రాఁజి కుమిలింప, రస
శ్రీ లలితార్ద్రమ్మగు నా
హాలుని మన సిటులు తేలి యచ్చెరు వాయెన్.
87
గీ.బాసఁ బలుపల్కు లుండెడి పగిది నొక్క
దేశమున బహుభాష లొత్తికొనియుండుఁ;
బలుకు పలుకునఁ గ్రొత్తయుజ్జ్వలత లొలయ
బాసబాసను నూత్నసంపత్తి వెలయు.
88
మ.ప్రతిశబ్దంబున గాఢగూఢము సమర్థంబైన యేదో మహా
ద్భుతమౌశక్తితొలంకుచున్ హృదయతంత్రుల్ పట్టియూఁపున్ రసా
ర్ద్రతకుం బేర్వడినట్టి మానిసిని; శబ్దం బెట్టి సారస్వత
స్థితికిం జెందినఁ దత్ప్రయోజనము వాసించున్ సమానోన్నతిన్.
89
మ.పెఱబాసం గఱవైన మేలెఱుక యప్రీతిన్ వెలార్పం, గొఱల్
నెరసుల్ రాసులుచేసి చూచుకొని దానిం గొంచెపుం జూపునన్
బరికింపం దగదన్న భావ మది యుత్పాదిల్లె మాలో నిరం
తర మేధా మథనంబుచే; నిది యథార్థం బంచు గుర్తింపుఁడా!
90
వ.ఇత్తెఱంగునం బలికి హాలరాజు తనపజ్జం జిఱునవ్వు పువ్వుటెత్తులు గ్రుచ్చియెత్తు దేవేరి నొకమా ఱరసి, పదంపడి గుణాఢ్య శర్వవర్మలపై నెడమ కుడి కన్నుఁదమ్ములు యుగపత్ప్రసారితమ్ములుగాఁ జేసి మఱియు నివ్విధంబున వాఙ్మధువు లొలికించె.91
గీ.కడలిలోఁతు లాపాతాళ గర్భ మగ్న
మంథగిరివోలె దేవవాఙ్మయము ముట్టి
యుభయభాషా భుజంబుల నొడియు బలిమిఁ
బట్టవలయును రససుధాభాండ మిపుడు.
92
మ.శ్రుతి శాస్త్రాదుల పాలమీఁగడలయచ్చుల్ లోన మెచ్చూరఁ దే
ర్చి తినెన్; జీర్ణము నిండఁజేసికొని పెంచెన్ మేను గీర్వాణ సా
హితి; దానం గొనముట్టు శక్తిగొన మా కెట్లబ్బునో యానతి
చ్చితిరేనిన్ బుధులార! మెచ్చుకొని సుశ్రీలిత్తు మత్యాదృతిన్.
93
మ.మము దీవించుచు మాదు రాజ్యరమ నోమం బ్రేమఁ గాంక్షించుచు
న్న మిమున్ మీ యుపకారమున్ మఱవకుండన్ శాస్త్రవిద్యాపచే
ళిమమౌ సంస్కృత పాండితీ గరిమ మోలి న్మాకుఁ జేకూరు మా
ర్గముఁ జూపన్వలెఁ; బాపఁగావలెఁ గళంకం బోపి భాషాగతిన్.
94
చ.అని వచియించినంతనె మహామతి మంతిరి శర్వవర్మ నె
మ్మనమునఁ బట్టరాని పరిమాణములేని ముదంబు పొంగు మ్రిం
గెను గళ గుంభనమ్ముగ; నగెన్ మొగమోటమి వింతనవ్వు చెం
త నలరు రాణి; యాయెడ గుణాఢ్యునితొందర డెందమూఁపఁగన్.
95
ఆ.వె.ఇది మొయిళ్లు లేక పొదలారు వడగళ్ళ
వానజల్లువోలె నైన దనుచుఁ
దలఁచి మనసు మార్చి యెలుఁగు తొట్రిలఁబల్కె
ఱేనితోడ లోన లేనిమాట.
96
శా.మీ జిజ్ఞాసకుఁ బుల్కరించినది నెమ్మే నిప్పు డోహో, మహా
రాజా! యెంతటిమాట వింటిమి; కృతార్థంబయ్యె గీర్వాణ భా
షాజన్మంబు నిజమ్ము; వ్యాకరణశాస్త్రం బూఁతగా లేమి ని
స్తేజంబై తలవాల్చు వాఙ్మయలతాశ్రీ హాలభూపాలకా!
97
ఉ.కావున వ్యాకృతిం జదువఁగావలెఁ; బాండితి పెంపు చేసికోఁ
గావలెఁ; గాక వేఱొకవగన్ సమకూరుట వట్టిమాట; ధా
త్రీవర! శాస్త్రపాఠమనఁ దేలికగా; దది ‘పిక్కవేసి’ దీ
క్షావిధిమైఁ బఠించుకొనికాని కృతార్థత నంద రెవ్వరున్.
98
గీ.ఎదఁ గదించి యాచార్యుల పదము లెంచి
చదివి వల్లించి చింతనల్ సలిపికొనఁగఁ
బదియు రెండేండ్లు పూర్తిగాఁ బట్టునట్టి
చదువు పదశాస్త్ర మన మహీజానిమౌళి!
99
చ.మృదుమృదువైన క్రొందళుకు రేకుల పువ్వునఁ జివ్వరెక్కలం
గదలెడి తేఁటి వ్రాలవలెఁగాని జగా మగమోటు పుల్గు బె
ట్టిదముగ నల్గి కాలిడి నటింపఁగవచ్చునె, మెత్తనౌ కళా
హృదయము మీది వ్యాకృతి మహీధరభారము మోవనేర్చునే?
100
వ.ఒకపెడ సకలకాలమ్ము మ్రింగఁజూచు రాజ్యాంగ తంత్రములలో వ్యాకరణ తంత్రపాఠము కొసనెగ్గఁజేయుట కష్టం; బట్టులయ్యును దేవరవారికిఁ బండ్రెండు వర్షంబులంగాక యాఱు వత్సరంబుల సకీలకంబుగాఁ దచ్ఛాస్త్రం బుపదేశించువాఁడ ననుటయు-101
ఉ.అంతట హాలరాజు హృదయం బరచేతుల నొక్కిపట్టి ప్రా
ణాంతకమైన యూరు పొలయన్ దల యడ్డపుటూఁపులోన ధీ
మంతుఁడు శర్వవర్మదెస మాట పెకల్చెడి చూపు చూచె; నా
మంతిరి మెల్లఁగా మధురమంజులవాక్కుల నంజలించుచున్.
102
చ.పనుగొను రాజభక్తి - సురభారతిపై ననురక్తి రెండునున్
మునుకొన లేచుచున్, మునిఁగి మున్గని ద్వీపమువోని యగ్గుణా
ఢ్యునిదెసఁ జూచిచూడక యెదో యొక యూఁతముచూపురాణి వీ
క్షణములఁదోఁగి పల్కెఁ జలచల్లఁగ హాలుని యుల్లమూరఁగన్.
103
వ.“ప్రభూ! తాము సెలవిచ్చినమాటలు తెలుఁగునాట సంస్కృతసాహిత్యగతికి వెలుఁగుబాటలు; గుణాఢ్యపండితులు దేవరసన్నిధిని మనవిచేసినటులు పాండితీపరివృద్ధికి వ్యాకరణపాఠ మావశ్యకము. పండ్రెండేండ్ల నిండుదీక్షతో నధ్యయనించినంగాని పదశాస్త్రము తుదముట్టఁ బట్టువడదనుట యథార్థ మయ్యది సాధారణ మేధావుల విషయమ్ము; మతిమద్వరులగు తమవంటివారి కటులుగాక యైదాఱు మాసంబులన పట్టువడుననుటకు సందియము లే” దని-104
క.మఱి మాటాడక యాడిన
తెఱఁగున నొడుదొడుకు లేక తేఁకువతో మం
తిరి పలికిన యప్పలుకుల
కరణి విని గుణాఢ్యసూరి గరళం బుమిసెన్.
105
ఉ.ఈ మొగమిచ్చమాటలకు నీ వెలిమెచ్చులకుం గడంగి యు
ద్దామత నాఱుమాసములు దాఁటక శాబ్దము వచ్చునంచు నీ
వీమెయి ఱేనిముం దుఱిమెదే! అదికాదు పదాఱుమాసముల్‌
నేమము నిండఁ బ్రామికొని నేర్పిన నబ్బెడి యల్పశాస్త్రమే?
106
మ.ఎలబాసల్ - కలలోని యూసులుగదోయీ శర్వవర్మా! యెదో
పలుకం గొల్వునఁ జెల్లిపోవుటకు సభ్యశ్రేణి నిద్రాణమో!
వెలిమెచ్చుల్విని నమ్మివేయుటకు నుర్వీనేత సామాన్యుఁడో!
తల కొక్కొక్క తలంపుగాక పదశాస్త్రం బింత క్రిందాయెనే?
107
చ.తటుకున నిండుకొల్వునఁ బ్రతారణసేయఁగ లేనిబాస లా
డుట లివికాదు; శాస్త్రపుముడుల్ విడునట్టులు శాబ్దమున్ విశం
కటగతి నీవ యార్నెలలుగా నుపదేశము సేయఁగల్గినన్
జటులము నా ప్రతిజ్ఞ పరిషత్తున కీయెడ వెల్లడించెదన్.
108
గీ.“వదనపదమైన దేశీయభాష విడిచి
మద్గళ గ్రంధి సురవాణి మహిమ మఱచి
కేవలము ప్రాణమైన ప్రాకృతముఁ దుడిచి
మౌనినై యుందుఁ గాంతార మధ్యమందు.”
109
మ.అని మోముందమిపూవు జేవుఱున కన్యాదేశమై దుష్క్రుధా
కనదారుణ్యము చిందులాడఁ, గని భూకాంతుండు తోడన్ గుణా
ఢ్యుని బాసల్ మఱుసవ్వడు ల్వలుక - నేదో చెప్పఁగా రాని వే
దనతో - వాదముఁ బెంచినార మను వంతన్ గుందె స్వాంతంబునన్.
110
చ.కొలువున సభ్యులందుఁ దలఁకుల్ తొలఁకాడె గుణాఢ్యసూరి ప
ల్కుల వడగాలి సోఁకున; నిగూఢ సుదీర్ఘము శర్వవర్మయూ
ర్పుల కొలగోలలై చిఱునవుల్ మొలకెత్తెను దెల్గురాణి క
న్గొలఁకుల; నంత నెవ్వ రనుకో నెడగాఁ బ్రతివాది యిట్లనెన్.
111
ఆ.వె.ఓ గుణాఢ్యసూరి! యోరిమిఁ బోఁబుచ్చి
యూర కిటులు చిచ్చు నుమిసె దేల?
వెడఁగు ప్రతిన కెడఁద వెఱచి డాఁగఁగ మాకుఁ
గొండగుహలు లేక యుండునోటు!
112
ఉ.బాసలు-వీసమెత్తు విలువం గొననెత్తని వట్టి యీ యుప
న్యాసము-కంఠశోషముగదా! పదశాస్త్రము మేరముట్ట ష
ణ్మాసములన్ వచింతు మతిమన్మణి ఱేనికి; దీనఁ దప్పినన్
దాసుఁడనౌచు నీ యడుగుఁదామరపెండెరమౌచు నుండెదన్.
113
చ.అని వడఁకాడు కన్గవకు నందము దిద్దిన రాజభక్తితో
వినయముతోడ హాలపృథివీపతి సన్నిధి శర్వవర్మ యి
ట్లనియె; నిజాంతరాత్మ గురువై వెనుకాడని ధైర్యపాఠముల్
వినుపఁగ-భావియాత్ర గెలిపించెడి దీవనల న్వచింపఁగన్.
114
ఉ.“కాలముగాదు - దైవదయ కారణమై ఫలియించి యాఱుమా
సాలకు లోన సర్వపదశాస్త్రము తొల్లిటిబాము విద్దెయుం
బోలె నటించు నీ వదన పుష్కర రంగమునందు; హాలభూ
పాలకమౌళి! యీ ప్రతినపై జయరక్షలు నీదు దీక్షలే.”
115
వ.అని వచించి యంతట విరమించుటయు-116
ఉ.ఆయెడ దేవిమోమున నయత్నముగా విజయప్రశంస యే
దో యుదయించి సభ్యుల మదుల్ కదలించెను; హాలరాజులోఁ
గోయిల కూఁతకూయు తళుకుల్ వినిపించె; గుణాఢ్యసూరికిన్
గాయమురేఁగి కాయమునఁ గ్రమ్మెను జెమ్మట ముమ్మరంబుగన్.
117
ఆ.వె.శర్వవర్మ ప్రతిన సాతవాహనపతి
యెదకుఁ బ్రత్యయంబు కుదురుకొలిపెఁ;
గుదురుకొలుపలేదు కూడ; నప్పటి ఱేఁడు
డోల నూఁగు మూఁగబాలు జోడు.
118
కుమార సాక్షాత్కారము
వ.నాఁటి కొలు విటులు ముగియుటయు శర్వవర్మ దారుణ ప్రతిజ్ఞపై నవిశ్వాసవిశ్వాసములు వంతులాడ సభ్యులు గుసగుసలు వోవుచుఁ బోయి రంత -119
సీ.శర్వవర్మకు - శిలోచ్చయము లౌదల నున్న । బరువులో నొకమేలి తెరవు మెఱపు
అలగుణాఢ్యునకు - మూఁతలువడ్డ కనుల త్రో । వకు నడ్డముగ విషవల్లి మలఁపు
హాలభూమీపతి - కమరభారతి త్రోసి । వేఁతలో నొక క్రొత్తప్రేమ పొలుపు
రాణికి - వాఙ్మయ రస వైజయంతిక । చాయలోఁ దొలి తొలిసంజయెఱుపు
 
గీ.దేవభాషా కవీంద్రుల భావమణుల । లేత వెలుఁగుల కెక్కడలేని యొఱపు -
నాఁటి హాలభూపతి కొల్వుకూటమందు । జరిగిన యపూర్వ సన్నివేశంపుఁ దలఁపు.
120
మ.నిదురల్వోవఁడు; మందు మ్రింగినటు లెంతేఁ గుంది మందస్థితిం
గుదురుల్ మోవఁడు; రాజకీయపుఁదలంకు ల్వచ్చినం దాను బ
ల్లిదుఁడై కావఁడు; భావికార్యఘటనా లీలా మహాభార ఘో
ర దశాబద్ధుఁడు శర్వవర్మ యసిధారా తీవ్ర దీక్షా విధిన్.
121
ఉ.కాలముఁ గన్నులన్ బిగియఁగట్టి యొకానొకనాఁడు దీక్ష నూ
హాళి మథింపఁగాఁ బొడమె నచ్చెరువై యొక నిశ్చయామృతం
బేలినవేల్పు సత్కృప రహింపఁగ; నయ్యెడ శర్వవర్మకుం
దేలెను మానసంపు సుధతెట్టువ విజ్ఞులు ముచ్చటింపఁగన్.
122
చ.“ఇది విధి నన్నుఁ గత్తులపరీక్షకు దింపిన ఘోరకాల; మి
య్యదనునఁ గాలుద్రొక్కుకొని యాఁగితినా, యమరాపగా రసా
భ్యుదయము యావదాంధ్రమును ముంచును; లోఁగితినా, చరిత్రలో
నిదియొక ‘యాత్మహత్య’ వెలయించిన ఘట్టముగా రహించెడిన్.
123
ఉ.కొందలపాటొ! దేశమునఁ గొల్వున భారతి నిల్వరింపఁగాఁ
దొందరపాటొ! వ్యాకరణతోయధి గ్రుక్కిలిగొన్న యట్లుగా
ముందరి చేటుమాట తలపోయక బాసయొనర్చి వచ్చి - యీ
గందరగోళము ల్వడుట కార్యమె, కాలము దుర్వ్యయంబుగన్.
124
మ.ఒకమాసంబు గతించిపోయె నపుడే యుయ్యాల జంపాల యా
టకు లోనై; యిఁక నాఁగి నిశ్చయముజాడంబట్టి - తత్కార్య సా
ధకతం బ్రాణము లొడ్డఁగావలయు; మీఁదం బూర్వజన్మీయమౌ
సుకృతోచ్ఛ్రాయము సాయపాటొసఁగవచ్చున్ జేఁతకున్మెచ్చుచున్.
125
ఉ.కేవల పౌరుషంబు నొలికించిన లాభములేదు; నిండుగా
దైవము పండఁగావలెఁగదా, పదశాస్త్ర రహస్యసారముల్
ప్రోవులుచేసి పిండలిగఁ బొందువడం దినిపించి హాలధా
త్రీవరు నైదుమాసముల దిద్దుట పౌరుషసాధ్య మెట్లగున్.
126
చ.అలవు చలం బచంచలములై యలవడ్డ యుపాసనా మహా
బలమునఁగాని యీపనికిఁ బాల్పడ గెల్పు ఘటిల్ల దెన్నఁడున్;
దలకొనుదీక్షయున్ మనసుదప్పని శిక్షయు నూఁది షణ్ముఖున్
గొలిచెదఁగాక కోర్కి సమకూరఁగ నిల్చెదఁగాక వీఁకమై.”
127
క.అని తుదినిర్ణయమున నె
మ్మనము తనుపుసెంద మంత్రిమణి వెనువెంటం
దనసతి జయకాంక్షా వీ
క్షణములు సంబళముగాఁగ జనె నొంటరియై.
128
వ.చని యతం డొక కొండనెత్తమ్మునఁ గూర్చుండినవాఁడు కూరుచుండినటులు వేసినయాసనంబు వేసినయటు లుండి యార్షధర్మశ్రీలు తత్పరిసరమ్ములం దుఱంగలింపఁ గొమరుసామిని శ్రద్ధాళువై యుపాసింపం దొడంగె -129
చ.అతని యుపాసనా పటు మహస్సులు చాటుననుండి హాలభూ
పతియెదఁ జల్లె వ్యాకరణ వాఙ్మయ బీజములన్; గుణాఢ్యపం
డితునెడ నాఁటె గాటపువడిన్ విసపుం జిఱునారు; సస్య సం
తతికిఁ గుమార దివ్యకరుణా జలదాగమ మొండు గావలెన్.
130
చ.పరమతపస్వియై సడలువాఱని దీక్ష సమాధి నిష్ఠలోఁ
దిరపడ నీరు గాలియును దిండిగ నుండిన తత్తపస్సులో
గిరగిర నైదునెల్లు తిరిగెన్ - గరుణాఖనిశక్తిధారికిం
గెరలి యెడంద వెన్న కరఁగెన్ బుధమౌనికిఁ జూఱలీయఁగన్.
131
చ.నిలువున నొక్కటే యమృతనీరదమై పొదలారి, యాఱు త
ల్లుల హృదయాలు పిండుకొని లోకము లేలు కుమారమూర్తిఁ గ
న్నుల తొలివిందుగా నరయ నోఁచిన ధన్యుఁడు శర్వవర్మకుం
గల లయి పూర్వజీవితపు గాథలు సర్వము విస్మృతింబడెన్.
132
శా.ఆ తేజోనిధి కన్నులం బడఁగ మాయా వాసనం బాసి, వాం
ఛాతాత్పర్యము విస్మరించె బుధవంశస్వామి; షాణ్మాతురుం
డాతీరుం గనువాఁడు లేనగవు తీయం బారఁ జేయెత్తి సం
ప్రీతిం గోరికి పండఁగా నపుడు దీవించెన్ దలం పెంచుచున్.
133
క.నిను - నీ తలంపు నెఱిఁగితి;
ననుఁ జూచిన కనుల హాలనాయకుఁ గని, వా
నిని శబ్దశాస్త్ర సారపు
గనిగా నొనరింపఁగలవు కళ్యాణమతీ!
134
వ.అని నూతన వ్యాకరణసృష్టికిం గడంగి షడాననుండు “సిద్ధోవర్ణ సమామ్నాయ” యను తొలిసూత్రం బుచ్చరించి యుపదేశింప శర్వవర్మ నరజాతిసులభంబగు చాపలంబు విరియ నుత్తరసూత్రముం దాన యూహించి యందిచ్చె; నపుడు కార్తికేయుం డది యధ్యయన సంప్రదాయ విరుద్ధం బని కినిసియు, శర్వవర్మ తెలివి వాఁడిమికిం దనిసి సంపూర్ణంబుగా వ్యాకరణం బుపదేశించి మఱి యిట్లనియె -135
ఉ.“ఓరిమిమాలి మా యెదుట నుత్తరసూత్రము నుచ్చరించుటే
కారణమై, జగమ్మున నొకానొక వెల్గున నిల్వఁగల్గు నీ
తీరగు క్రొత్తవ్యాకృతి సుధీగణమం దొక ‘యల్పతంత్ర’ మై
పేరు గడించుఁగాక! యిటు వేగిరపాటున సేగి కల్గదే?
136
ఉ.పొ” మ్మని శర్వశర్మ మునుముంగలి మంగళదివ్యమూర్తి మా
య మ్మగుడున్, గనుల్ యుగయుగాంతర సంగత పుణ్యలాభ రం
గమ్ముల నిమ్ముగా యవనికల్ తొలఁగించిన తీరునన్ విశా
లమ్ములు విస్ఫుర న్నవ విలాసములై వికసించె మంత్రికిన్.
137
శా.దైవం బిచ్చిన నూత్నశక్తిఁ గొని యాతం డంతటన్ హాలధా
త్రీవర్యుం గన నేఁగి నిండుఁగనులన్ దీవించి గీర్వాణ వా
ణీవైదగ్ధ్యము శబ్దశాస్త్రమున రాణింపన్ సుబోధం బిడెన్
దైవాదేశము స్వోపదేశమును నోతప్రోతమై కూడఁగన్.
138
గీ.అమరభాషాబ్ధి లోఁతుల నందుకొన్న
ప్రియునిలో రాణి యొక నవోదయము నరసి
ముసలి చ్యవనుని జవ్వనపుం బెడంగుఁ
గని మురిసిపోవు నాఁటి ‘సుకన్య’ యయ్యె.
139
చ.కననిది - యెన్నఁడున్ వినని గాథ; విదగ్ధత నాఁటుకొన్న హా
లుని మఱునాఁటి కొల్వు రసలుబ్ధుల సంస్కృత వాగ్విదగ్ధులం
దొనఁకె సుధర్మయై; నృపతి తోరపుఁబాండితి మూదలించు చ
ర్చ నొకటి పెంచి విస్మయవశం బొనరించె సదస్యబృందమున్.
140
సీ.అద్దిరా! యీ వాఙ్మయామృత మిటు వెలి । సేయఁగా గడలి త్రచ్చినది యెవ్యఁ!
డరయలే - దరయలే - దవుర! హాలునినోట । సురవాణి యెపుడు కాఁపురము వెట్టె;
నిఁకఁ గొల్యులోనఁ బ్రాకృతమున కుద్యాప । నం బోహొ! కాల మెంత తలక్రిందు!
ఇది శర్వవర్మ తానెపుడు బోధించెను? - । పృథివీపతియుఁ జదివినది యెప్పు?
 
గీ.డకట! పండితమౌళి గుణాఢ్యమంత్రి । బాసమైఁ గొల్వు విడి వనవాసమునకుఁ
బాలుపడి గాసివడు నని పలువిధాల । నులివు లెసరేఁగె హాలుని కొలువు తేల.
141
గుణాఢ్య నిష్క్రమణము
మ.ఉచితజ్ఞుండు గుణాఢ్యుఁ డయ్యెడఁ జిరాయుశ్శ్రీలుగా ఱేని నెం
చుచు దీవించి యొకండునై సెలవుగొంచుంబోయె; సంసార తా
పచయం బోపనివాఁ డొకానొక కుటుంబస్వామి వీడ్కొలు ప
ల్కుచు సన్న్యాసమునందుకో నరుగురంగుల్ కొల్వునం బొంగఁగన్.
142
గీ.ప్రకృతి గంభీరమగు మహారాజు నెడఁద
స్నేహపాశముచేఁ దివిచెను గుణాఢ్యుఁ;
డపుడు దేవేరి సావిత్రియగుచుఁ బ్రియునిఁ
బ్రాణభిక్షగఁ బడసె గైర్వాణిఁ జూపి.
143
గీ.నాఁటినుండియును ధరణికోటలోనఁ
గొలువులో నేదొ కూడని వెలితిదోఁచెఁ;
జిన్నవోయె గుణాఢ్యసచివు మనోజ్ఞ
మసృణ మణిభాసురమ్మగు పసిఁడి గద్దె.
144
ఉ.ప్రాకృతగోష్ఠులం బ్రతిరవమ్ముల నిండిన రాజధానిలో
నేకడఁజూడ హాలపృథివీంద్రుఁడు మెచ్చెడి దేవభారతీ
శ్రీకవితా ప్రశంసలె రుచింప వచింతురు నేఁడు - ‘రాజుతో -
లోకము - వాఙ్మయమ్ము - కళలున్ -మతమున్ - సకల ప్రవృత్తియున్.’
145
చ.తెలియని తీరులోనఁ బఱతెంచిన వాఙ్మయ ఘర్షణంబునన్
నలఁగెను గొంతగాఁ దెలుఁగునాఁ డొక కొన్ని దినాలు; సంస్కృతం
బలమె జగంబునం బిదప; నంతట నాంధ్రపథంబు వేదఘో
షల - స్మృతిభాషలన్ - సవనసంపదఁ దాఁకెను బ్రహ్మలోకమున్.
146
మ.అనపాయస్థితి దేశపాలకుల సాయం బూఁతగాఁ దాండవిం
చిన యొయ్యారపు బౌద్ధనర్తకి కళాశ్రీ నజ్జుగా గజ్జె వి
ప్పెను; వేదానుమతంబు ధర్మ మదియున్ విప్పారి దేశంబుఁ గ
ప్పెను; మెల్లన్ సవన క్రియాభిరతి యొప్పెన్ నాల్గుదిగ్వీథులన్.
147
శా.తీరుం దీయము లూరు శిల్పకళరక్తిన్ దోసిళుల్ నిండఁగాఁ
జూఱల్వేసిన బౌద్ధచైత్యములతో సొంపారు కృష్ణానదీ
తీరంబుల్ క్రతుహోమధూమపటలీదివ్యప్రభన్ నూతన
ప్రారంభమ్ములు దిద్దుకొన్నయవి యార్ష శ్రౌత ధర్మావళిన్‌.
148
గీ.తొలుత శ్రీముఖపతి ‘నాంది’ పలుకు నొడువ
సాతవాహన పూర్వ వంశస్థు లెల్ల
నడప - సాగిన శ్రీబౌద్ధనాటకమున
హాల నరపతి భరతవాక్యమ్ము పలికె.
149
వ.తలంపని తలంపుగా దేశం బిట్టి పరిణామ దశకుం బాలుపడుననికాని, ఱేఁడు ప్రాకృతభాషా లౌల్యంబుఁ ద్రెంచుకొని దేవభాష నామతించుననికాని, పెంపుగన్న బౌద్ధధర్మలతిక లిటులు తలవాల్చుననికాని యూహింపని విషయము లయ్యె.150
ఉ.ఇంతటి మార్పు దేశమున నేర్పడి, మెల్లనఁ గ్రీష్మ - వర్ష - హే
మంతము లెన్నియో చని, క్రమంబుగ నాఁటి గుణాఢ్యుమాట జ
న్మాంతరగాథగా మఱచినట్టిది నేల కృతఘ్నమై; కటా!
యంతటివేకదా, కవుల యవ్యయ వాఙ్మయసేవ లెన్నఁడున్.
151
సీ.బ్రతుకెల్లఁ దనకుఁ బ్రాకృత సరస్వతిగాని । మించి లేదని విశ్వసించినాఁడు
నమ్మినఱేని యానను బూలసరముగా । నెంచి యౌదల సవరించినాఁడు
తన కవితామృతమ్మును రసజ్ఞశ్రేణిఁ । బంచి యుఱ్ఱూఁత లూఁగించినాఁడు
ఆడినబాసచే ననుబంధ బంధముల్ । త్రెంచి మునిత్వ మార్జించినాఁడు
 
గీ.నేఁ డతం డేడ - నే చెట్టునీడ నుండి । బ్రతుకు గడపుచు నుండెనో, ప్రభునియాత్మ
కా వగపు నా తలఁపు లేకపోవుఁగాక! । యల కవీంద్రునికళకు నే వెలితి లేదు.
152
ఉ.నాఁడు గుణాఢ్యుఁ డక్కొలువునన్ వినుచుండఁగ శర్వవర్మతో
నాడినబాస నిల్పుకొన - నాగతి నేర్చిన మూఁడు భాషలున్
వీడిన మూఁగయై దిగులుపెంచక గోరపుఁగాననంబునం
దూడనిఁబాడె నొంటితనయుల్ తనయాలియు నింట వందురన్.
153
మ.గతిలేకుండఁగ నొక్కి కారడవిఁ గ్రుక్కంజేసినం, దత్కవిన్‌
బ్రతికింపంగల చేతిలోనికళ దూరంబయ్యె - నాతండు జీ
వితగాథా వ్వథ లెట్టు లేపలుకులన్ విప్పారఁగాఁ బాడి దుః
ఖతతుల్ వీడునొ! మూఁగకైత కెటులింకన్ శాంతి పాఱాడునో.
154
గీ.పరిసరంబునఁ గల వనీ ప్రకృతి యెఱుఁగ
మూఁగ చదువులు గఱపు విరాగి యతఁడు
దక్షిణామూర్తి యవతార తత్త్వ జలధిఁ
జిందిలిన యొక్క యమృతపుఁజినుకుతునుక.
155
గీ.నోరు మాలిన మేలి జంతువులలోనఁ
నోరు తెఱచిన నాలి జంతువులలోనఁ
జదలఁ దారాడు పులుఁగుల కదుపులోనఁ
గారడవి యెల్లను గుణాఢ్యసూరి యొకఁడు.
156
చ.పుడమి సమస్తముం గనులముందరఁ గాంచెడి వాడిఁచూపు ని
చ్చెడిది, పరాత్మశ క్తి నరచేతికిఁ దెచ్చెడి దైన మౌనముం
బడసిన కారణమ్మునఁ గ్రమంబుగ భూతపిశాచ భాష లి
బ్బడి వినుచుండుటన్‌ మదికిఁ బట్టె గుణాఢ్యున కాత్మశిక్షతోన్.
157
వ.ఇటులు పట్టించుకొన్న క్రొత్తబాస పైశాచితో మూఁగతనమ్ము విడిచి మాటలాడ మొదలిడినవాఁడై, యావాఙ్మయపుఁ బొలుపులు మెలంకువలు తెలిసికొని కృతియై యాజానజంబగు కవితాధోరణి ప్రేరేప గ్రంథరచనా కుతూహలంబున నుండె, నంత -158
చ.అరమర యింతలేని హృదయంబున కత్తిన తియ్యమూరు నె
య్యరియగు కాణభూతి యను నాతఁడు బల్ నెఱవాది కల్పనా
భర కమనీయగాథలు శ్రవస్సుఖమీయ వచింపఁగా, బృహ
ద్విరచన సంతరించె సుకృతిన్ మెలమెల్లఁ బిశాచభాషలోన్.
159
ఉ.ఆకృతిగొన్న దీక్షవలె నాకవిరాజు గుణాఢ్యసూరి యం
బూకృతమైన బాసపొలుపుల్ మలఁపుల్ తులదూఁచి దివ్యకా
వ్యాకృతి నేడు వత్సరము లా పనిమీఁదనె నిల్చి తత్కథా
నీకము వ్రాసె భావరమణీయత గ్రంథము లక్ష లేడు గన్.
160
మ.పసినాఁటం గవితా ప్రసూ రుచిర దివ్యక్షీరముల్ జుఱ్ఱి వె
క్కసమై చక్కని కండదేఱుకొను నా గాత్రంబులో రక్తముల్
మసిగా, [భూర్జపలాశ][భూర్జరపత్త్ర]సంతతులు తేలన్ వ్రాసికొన్నట్టి యా
యసదౌ కబ్బపుఁదీరు లబ్బురము నీయన్ మెత్తు రెవ్వారలున్.
161
క.వంచిన తల యెత్తక రచి
యించిన విజ్ఞానమయ కృతీందిర గాథా
సంచయములోన డాఁగెఁ బ్ర
పంచము సాచల పయోధి వన మానవమై.
162
క.ఆ కృతిపేరు ‘బృహత్కథ’ -
యా కథల పొదుంగు, నా మహా మహితకృతి
శ్రీకల్పనముల చదురులు
నా కవితల యొదుగు శ్రుతుల కమృతపు వాఁగుల్.
163
క.పిచ్చుక గూఁడల్లిన బెడఁ
గచ్చు పడఁగఁ బెద్దకథలు నల్పపుఁగథలున్
గ్రుచ్చి యిడి చదువరులకుం
బిచ్చి గొలుపు సంవిధాన వీథు లయారే!
164
క.వేసిన పీఠమ్మును మఱి
తీసినయటు లేక నిత్యదీక్షామతితో
వ్రాసిన లక్షల గ్రంథం
బీ సర్వంసహకు వెలుఁగు నిచ్చుట యెపుడో.
165
క.కారడవిఁ బండువెన్నెల
కారా దీ నిబ్బరంపుఁ గబ్బమునకు దే
శారాధన పరిశీలన
గౌరవ సౌరభము లుబ్బఁగావలె నిలపై.
166
మ.అని యారణ్యకులైన నెయ్యరులు శిష్యశ్రేణియు న్మెచ్చి ప
ల్కిన పల్కుల్ చెవి నిల్లుకట్టుకొని పొంగింపన్ గుణాఢ్యర్షిలోఁ
దొనఁకాడెం దొలినాఁటి కొల్వుల పసందుల్- నాఁటి హాలప్రభుం
డనురాగంబున నిల్వునం గరఁగి తీయం బిచ్చుటల్ మెచ్చుటల్.
167
గీ.తలఁపుఁ ద్రేనుపులో నమృత స్రవంతి
వెలికివచ్చి పురానుభూతుల బెడంగు
నిలువు రూపమునకు జీవకళలువోయఁ
బలికె నాచార్యుఁ డనుఁగు శిష్యులను గుఱిచి.
168
ఉ.ఏ రుధిరమ్ము నిండుబలియిచ్చి ‘బృహత్కథ’ లక్ష లేడు గాఁ
బేరిచి కూర్చినాఁడనొ భువిన్ ధ్రువతారగ నిల్చియుండఁగా,
నా రుధిరమ్ము ప్రత్యణువునందున హాలునిరాగలక్ష్మి పొం
గారిన తత్పురాస్మృతులె యందినకాన్కలు నేఁటి మత్కృషిన్.
169
ఉ.ఊఁదినత్రోవలో నసువులొడ్డిన సత్కవి కార్చుతచ్ఛ్రమ
స్వేదపు బిందువుల్ పుడమిఁ జిందక దోయిట నందిపట్టి యా
ర్ద్రాదరభక్తి మేదుర కటాక్షములం గనకాభిషేక మ
ర్యాదలఁ దన్పు హాలు ననురక్తులు భుక్తులు నాఁటి కైతకున్.
170
ఉ.నేఁ డొకమెచ్చికోల్ పరిగణింపక వేడుక సంతరించుకొ
న్నాఁడను నేడులక్షల ఘనంబగు కబ్బము; చాలునింక వె
న్నాడిన నాలి మృత్యువున కగ్గముగాక సుయోగనిష్ఠమై
వీడెద దేహ; మీకృతి భువిన్ వెలయింపుఁడు భక్తిపెంపునన్.
171
గీ.అనుచు నాచార్య చరణులు వినుచు వాచి
కమున నిలువునఁ గరగి గద్గదిక గదుర
నదరు పెదవుల శిష్యుఁ డిట్లనియె నొకఁడు
తన సహాధ్యాయు చూపు నూఁతముగఁబట్టి.
172
వ.ఆచార్యా! యేడేండ్లు పరిశ్రమించి రచించిన యీ మహాగ్రంథము విశ్వవ్యాప్తము కావలయును. రాజావలంబనంబునంగాని కృతులు విలసిల్ల నేరవు. శ్రీమత్సాతవాహన మహీపాలుని కవితాభిరతి విని యున్నవార; మతండుగాక యేతత్‌కృతి గ్రహణంబున వేఱొక వలంతి కానరాఁడు. ఉచితజ్ఞుండగు హాలుఁ డిందుల కామతించి యౌదల ధరించును, మేము పోయి సమర్పించి వచ్చి మేలిమాట మీ చెవిని వైతు మని పలికి గుణాఢ్యగురువుల యురరీకారంబువడసి వెనువెంట గుణదేవ నందిదేవు లనెడి శిష్యయుగళమ్ము ‘బృహత్కథా’ గ్రంథపత్త్రంబులు కూడఁ బట్టించుకొని హాలభూపాలు దరిసింపంబోయి, తాము వచ్చిన కర్జంబు విన్నవించి కబ్బమ్ముఁ జూపుటయు నాయొడయండు తల పంకించి వంకరనవ్వు నవ్వి యిట్లనియె -173
ఉ.‘తోఁచినతీరు మెచ్చవలదో! వెలసేయక పెంచుకొన్న యీ
వాచవికైతకున్ మొగము వాఁచితిమే! కృతిలోని బాస - పై
శాచిగ, వ్రాఁత - రక్తముగ సాగిన భూర్జపలాశసంతతుల్
మా చవిగావు, మీ యటుకలం జెదపుర్వుల కిండు తిండిగన్.’
174
మ.అనుమాటల్ కొనసూదిపోటులయి డుయ్యన్ డెందముల్‌ వ్రయ్యఁగాఁ
డిన తోడ్తోనట నిల్వలేక వెనుకాడెం గాళ్ళు; మేనుల్ చెమ
ర్చె నితాంతంబు గుణాఢ్యశిష్యుల కయారే! యగ్నిశైలంబు ప్రే
లినదా, వ్రీలినదా సుధామధురకేళీభాండ మి ట్లింతలోన్‌.
175
క.ఒకనాఁ డందల మెత్తిన
యెకిమీఁడా, నేఁడు దేశికేంద్రుల నిటు గ
వ్యకుఁగాని యట్టు లాడిన;
దకటా! రాచఱిక మెట్టి యాంధ్యపు గుఱుతో!
176
క.ఈ చలిపిడుగును నేమని
మోచుకొని వెడలి వచింతుమో యను వంతన్
దోఁచక విహ్వలులై పై
శాచీకృతిఁ గొంచు గురుల సన్నిధి కరుగన్.
177
గీ.అరసె నాచార్యుఁ డంత శిష్యయుగళమ్ము
మొగము మొగ్గల మ్రొగ్గిన వగపువగరు;
తెలిసెఁ దెమలని పీఠికమలఁపులోన
హాలభూజాని యెద రాచు కాలరేఖ.
178
చ.పిదప సవిస్తరమ్ము వినిపించిన హాలు ననాదరంబునన్
హృదయము ప్రావృడంబరదరీచరదంబుదమయ్యె; మబ్బులన్
వదలిన వేఁడి వేసవి దివాకరతేజము నయ్యె; నంతలో
నుదిత పయోధిగర్భ కుహరోద్గతబాడబ మయ్యె మౌనికిన్‌.
179
వ.ఆ క్షణంబున నొక నిశ్చయంబు మెఱపుమెఱయికకరణి మనోంబరమ్మున విరియుటయు-180
కావ్యహోమము
ఉ.ధూర్జటివోలె పెన్‌‍జడలతో బెడఁగారు గుణాఢ్యుఁ డొక్కెడన్
నిర్జనమైన యద్రిధరణీస్థలి కేఁగి వెసన్‌ ‘బృహత్కథా’
భూర్జపలాశపాళి మునుముందర శిష్యులు చేర్ప, దుఃఖ బా
ష్పోర్జిత భుగ్నభావమున నుండి యిడెం గృతికిన్ జలాంజలిన్.
181
గీ.తెరతెరలుగాఁగఁ గన్నీరు తరఁగలాడి
తడిసిపోయిన కావ్యపత్త్రములు మరలఁ
జిచ్చువేఁడిమి వెచ్చ చేసికొను తలఁపు
కలిగెఁ గాఁబోలు గురుఁడు శిష్యులను గాంచి.
182
క.“ఇది యాచార్యుఁడు మీ కిడు
తుది యానగ నెంచి తోడుతోడుత నిచొటన్‌
సొదపేర్పుఁ” డనఁగ - నెందుల
కిది యను జిజ్ఞాస లేకయే యటు సేయన్.
183
చ.చిదుగుల నేర్చి పేరిచి రచించి రగిల్చిన యా చితాగ్ని బె
ట్టిదమగు నూర్పుగాడ్పుల వడిన్ వెడమంటల రాఁజుకొల్పుచున్
బొదిగిటఁ గప్పుకొన్న వగపుం బొగచీకటి కన్నుసందులం
బ్రిదిలిచి తొంగిచూచి బెదరింప గుణాఢ్యుఁడు కంపితాకృతిన్‌.
184
మ.వలగావచ్చి త్రివార వందనకృతిం బాటించి మ్రొక్కెన్‌ జితా
జ్వలన జ్వాలకు; శిష్యులిర్వురును నాచార్యాంఘ్రులం గన్నుఁగ
ల్వల నర్చించుచు వెంటనంటుకొని నిల్వన్ మువ్వురున్‌ మర్త్యమూ
ర్తులముచ్చిచ్చునుబోలెఁ బొల్చిరపుడెంతో ముచ్చటల్ గొల్పుచున్.
185
గీ.జగతి నమృతపు జోతి నిల్పఁగల కృతిని
బుగ్గిసేయు నవస్థకుఁ బోదు నన్న
వగపుతో నగ్నియెద మూఁడు వ్రక్కలయ్యె -
నవియె గురుశిష్య రూపము లవధరించె.
186
వ.అమ్మువ్వురును వహ్నియెదుటఁ గూరుచుండిన పదంపడి -187
గీ.తొనఁకి తొరఁగెడి కనుఱెప్ప దొప్ప నీరు
నిండు దోసిళ్ళ ముంచి మంత్రించి యగ్ని
కాజ్యహోమ మొనర్చె గుణాఢ్యయజ్వ
శిష్యయుగళము చూచి యచ్చెరువు నంద.
188
గీ.సమిధ లొండొండు నించి - కృశాను శిఖలు
పెంచి యక్కావ్యహోత పఠించుచున్న
‘సామిధేని’ మంత్రంబుల సార మిటులు
బయటఁ బడియెఁ గవిత్వరూపమ్మునంది.
189
ఉ.దాఁచితి, నేండ్లుగా బహువిధంబుల నోఁచితి, రక్తమాంసముల్
వేఁచితిఁ; గమ్మనై రుచులుపెల్లగు నీ యుపహారభుక్తి నీ
వాచవి తిండి కంచుఁ గొనివచ్చితిఁ బావక! వాఁడినాలుకల్
చాఁచుము! తృప్తవీక్షణములం దనియింపుము పేదపండితున్‌.
190
శా.సౌజన్యంబను మేఁకతోలు మెయి నాచ్ఛాదించుకొన్నట్టి యీ
రాజుల్ రాజులుకారు; బెబ్బులులు; వీరా, మాశ్రమస్వేద పా
థోజాలంబు హరించువారు! కృతియిత్తు న్మెచ్చి కైకోఁగదే
నీ జిహ్వాగ్రములన్‌ ధనంజయుఁడ! రాణింపం జిరస్థాయిగన్.
191
ఉ.మీసల తేనియల్, విసపు మెచ్చులు, నచ్చముగాని కౌఁగిళుల్
మోసపుఁగానుకల్, మొగము ముందరి నవ్వులు నొల్కఁబోసి వి
శ్వాస కృతజ్ఞతాహృదయ భావుకతల్ దిగఁద్రోసి జీవితో
ల్లాసముఁ దీర్చుకొన్న నృపులా! కవితాకళ నుద్ధరించుటల్.
192
ఉ.కా దటుకాదు; దోస మెటఁ గన్పడినన్ గబళించి వైచి పొ
ల్లూఁది యథార్థత న్నిలుపుచుండిన నీ రసికత్వ పావన
త్వాదరభావముల్ మనసునంటి నినుం గొనుమంటి నగ్నిదే
వా! దయచేసి యందుకొనవా, కృతిసుందరి పాణి పద్మమున్.
193
చ.విసివితి; దోసిళుల్ నలిపి వేసరితిన్; మునినయ్యు నేఁటికిన్
విసముల కాసగొంటిఁ బెను వీఱిఁడినై; యిఁక బాసచేసెదన్
గొసరిన నీ శిఖారసనకుం గవితాఘృతధారఁ జూఱఁగా
నొసఁగెద; బ్రహ్మవర్చసము నొందెదఁ; జెందెద నాత్మనిర్వృతిన్.
194
మ.వెతలొందన్‌ బని‍లేదు; వేలు కవులున్ వేవేలు కబ్బంబు లా
హుతియై పోయె హుతాశనా! జగతి నాయుశ్శ్రీలకుంబాసి - నా
కృతి వైదేహి పవిత్రదేహమున మూరింబోవ నీ జ్వాలికా
తతిఁ జల్లార్చునొ, పేర్చునో త్రిదివగాథా సాధుసంపన్నతన్.
195
మ.ఇది యేడేండ్ల తపస్సు పండిన ఫలం; బీ నా కృతిన్ జీవసం
పద నిండించితి; సాతవాహన మహీపాల ప్రథన్ భూమి ని
ల్పఁ దలంపారఁగ మేలు నెంచుకొని నేఁ బంపించితిన్; గావ్యశా
రద నాతండు తృణీకరించె నవురౌరా! వహ్నిభట్టారకా!
196
శా.నీలో నాకృతి నిల్చుయోగ మది యుండెన్; గానిచో, హాలభూ
పాలగ్రామణి భావనావివశుఁడున్ భాషాబహిర్వేషమే
యాలోకించి తిరస్కరించునె గుణాఢ్య గ్రంథ; మేలా! కృతి
శ్రీలున్ రాజుల గాజు చూపులఁ బిశాచీరూపముల్ తాల్చెనే?
197
గీ.అనుచుఁ జిత్యానిలజ్వాల లంబరమ్ము
నంట నెసకొల్పి యా గుణాఢ్య గురుమౌళి
తన బృహత్కథ పత్త్ర పత్త్రముఁ బఠింప
శిష్య యుగళమునకుఁ బ్రశాసించె నపుడు.
198
సీ.చినుకుఁ బూసలు కన్నుఁగొనలు కప్పుచుఁ బొంగఁ । దడవి గద్గదిక శిష్యుఁడు పఠించు;
నరవంచు మొగముఁ దామర మంచు మూయఁగాఁ । గృత గభీరత నాలకించు గురుఁడు;
కతలు కల్పనములు కరఁగింప నచ్చెరు । వడి మెచ్చి వినుఁ బశుపక్షి వితతి;
రసపిపాసను నాల్కకొసలు చాఁచుకొని, వే । చుకొని యుండును జితాప్రకటవహ్ని;
 
గీ.చట్టు చదివిన యాకు నాచార్యుఁ డంది
యాహుతి యొనర్చు నగ్నికుండాంతరమున;
నదియె శామిత్రవహ్ని! అల్లతఁడె శమిత!
యవుర, పశువగునేమొ కావ్యప్రతిష్ఠ!
199
చ.జరుగుచునుండె ఘోరము, రసజ్ఞుఁడు హాలుఁ డనాదరించి వా
క్పరిభవముం బొనర్చినది కారణమై; కవితా ఘృతాహుతిన్
మెఱపులవోలె వెల్గి మిఱుమిట్టులు గొల్పెను బత్త్రపత్త్ర, మ
గ్గురువుల పేద ప్రాణములకుం దలఁకుల్ చుఱుకుల్ తగుల్చుచున్.
200
గీ.చిమచిమారావ పావక శిఖలలోనఁ
గబ్బ మొక్కొక యాకుగాఁ గాలుచుండఁ
గవికి వేయిదళాల తమ్మివిరిఁబోని
హృదయ మొక్కొకరేకుగాఁ బ్రిదులుచుండె.
201
గీ.ఏడులక్షల యెత్తు కావ్యేందిర యిది
యనవశేషముగా దగ్ధమగుటె యిటులు
కటకటా! యని ప్రకృతి భగ్నహృదయమున
మొఱలువెట్టె మహీధరదరులు మ్రోఁగ.
202
చ.పులుఁగులకూనడెందములు పొక్కెఁ; జెమర్చెను జంతుపాళి క
న్నులు; శిలలుం గరంగినవి నూల్కొనిమ్రోడులునేడ్చె; నద్భుతో
జ్జ్వల నవకల్పనా మహిత చారు కథాకృతి యిట్లు గాలినె
చ్చెలి వెడయుచ్చులంబడి కృశించి నశించుచు నున్నయయ్యెడన్.
203
శా.నూఱుల్ వేలును గావు-లక్షలుగ దొంతుల్ దొంతులై పావక
క్రూరజ్వాలల మాసి, కైత కవటాకుల్ పుల్గులై కూసి - భూ
దారున్ హాలుఁ గళారతు న్నిదురమత్తానుండి మేల్కొల్పఁగా
నాఱేఁ డప్పుడు కన్నుల న్నులుముకొం చాలించె భుగ్నశ్రుతుల్.
204
మ.పనితోపాస్తి నెవండు చిందిన కవిత్వంబో, నిరాలంబమై
యనలజ్యాలలఁ గాలుచున్నయది యౌరా! యెవ్వఁడో యమ్మహా
ముని! యా చక్కటివార లెవ్వరు! వచోమూర్తిన్ దహింపంగఁగా
రణమేమో, యిటు దారుణంబు తలమీఱన్ ఱేఁడు సైరించుటే!
205
గీ.ఆకతల యల్లికకు హృదయమ్ము లిచ్చి
మెచ్చి వినుచున్నయవి వనీమృగములెల్లఁ;
గదల వటనుండి పులుఁగుల కదుపు లెప్పు;
డట్టి కబ్బము నిర్దగ్ధ మగుట యేమి?
206
వ.సాతవాహన ప్రభూ! దయచేసి యీ కీడుఁ దొలఁగింపవలయు లేకున్న లోకంబున నింకేమి నిలుచు నని సాంజలిబంధులై మనవిసేయు వేగరుల విన్నపంబు విన్నవాఁడు మహారాజు తటకాపడి కటకటంబడి తోడ్తోడఁ జారులు దారిఁ జూపం జని చని కబ్బంపువేలిమి జరుగు నక్కొండకొమ్ము దరిసి, యించుక దవ్వుల నుండఁగా మండుటగ్గి నరసి -207
చ.ఒలసిన యూరుపుల్ బిగియనూఁది చితాజ్యల దగ్ని నిండుఁ గ
న్నులఁ గని విన్నపాటు మది నూల్కొనఁ దానయి దారుణ క్రియం
దలకొని చేసినట్టులు కనారిలి, తొందర వ్రాలి - ముంగల
న్నిలచిన యంత హాలధరణీపతి యొం డమృతస్మృతిం గనెన్‌.
208
క.ఓహో గుణాఢ్య మంత్రులె!
ద్రోహము ద్రోహం బిదేమి దురితంబయ! కా
వ్యాహుతియే యేమీ! పూ
ర్ణాహుతియే? యనుచు నఱచి యతిసంభ్రమతన్.
209
గీ.కనదనలమందు సగము సగమ్ము కాలు
నాకు బయటికి లాగి చల్లారఁ బెట్టె;
శిఖల కందిచ్చు నాకు పుచ్చికొని వడఁకు
కవికరముఁ బట్టెఁ - జరణయుగమ్ము ముట్టె.
210
గీ.తెనుఁగురారాజు సాతవాహనుని రాక
నరసి మొగులంటు మంటల నణఁచుకొనియె
ననల భట్టారకుండు; కావ్యపఠనైక
రూఢు లగు శిష్యులకుఁ గొంత గ్రుక్క తిరిగె.
211
వ.అయ్యెడ గుణాఢ్యునిం గని హాలుం డిట్లనియె -212
ఉ.మొన్నటి కావ్యగాథ తలపోఁతకు వచ్చెడి; మా గురూత్తముల్
పన్నిన కబ్బమంచుఁ గొనివచ్చిరి యిర్వురు; దానితీరు మే
మెన్నక విశ్వసింపక యెదే ననియున్కియు హేతువేమొ యీ
క్రొన్నన తోఁటలో నిటు రగుల్కొను మ్రుక్కడి చిచ్చు వేల్మికిన్.
213
ఉ.ఏమి మహానుభావ! యిదియేమి కవిత్వవధూటి నీగతిన్
హోమ మొనర్తువే? యొకరుఁ డొప్పనిమాత్రన కబ్బముల్ బుధ
స్తోమము నాదృతుల్ కొని రుచుల్ వెలిగ్రక్కవె? చాలుఁజాలు న
య్యా! మము నీ కలంక విలయంబున నంకిలివెట్టి గుంజెదే?
214
గీ.అనుచు బతిమాలి కవిరాజు నాదరార్ద్ర
మసృణ మధుపూర్ణ వీక్షణ ప్రసవములకుఁ
గాలి మిగులు ‘బృహత్కథా’ కావ్యమునకుఁ
గేలుఁగవ దోయిలించె శ్రీహాలరాజు.
215
గీ.కవికి ఱేనికిఁ బుట్టు పుట్టువులఁ దొట్టి
వదలిపోని యనుస్యూత బంధవశత,
హాలదర్శనమందె గుణాఢ్వు నెడఁద
తనుపువడియెఁ జితా శిఖా తతికిఁ దోడు.
216
గీ.ఏమొ యాడినవాఁడు, నింకేమొ యాడఁ
దలఁచు కొన్నాఁడు కవి హాలధారుణీశు;
నేమి యాడఁడు నేఁడు; ముందేమి యాడఁ
దలఁచుకొనలేదు కౌగిలింతలకు నోడి.
217
చ.ఎద యెదతోడ రాచుకొని యిర్వురు లో నెడఁబాటుబర్వులన్
వదలిరి; దగ్ధ శేషకృతి పత్త్రములన్‌ నృపుఁ డంది కన్గవన్‌
గదియఁగ నద్దుకోఁ బ్రకృతికాంతకుఁ బువ్వుల పుల్కరింపు సం
పద పొదలారె; నంతఁ గవిమౌనము మూదలయయ్యె ఱేనికిన్.
218
సీ.శ్రీగుణాఢ్యుండు చేరెను యోగబలమున । మరల రాకలు లేని పరమ పదము;
కవిశిష్యులను దోడుగైకొని పైశాచ । భాషా విదగ్ధతఁ బడసి నట్టి
సాతవాహన ధరాజాని ‘బృహత్కథా’ । కృతికిఁ బీఠిక సంతరించెఁ బిదప
నది కథాకృతులకు నాదియై ప్రోదిగా । వెలసి దేశమున దీపికలు నిలిపి
 
గీ.కడకుఁ దత్కృతి కాలము కడుపులోన । నడఁగె; నది యాశ్రయంబయి పొడమినట్టి
యితర భాషా కథాకృతు లెన్నియేని । వాఙ్మయ జగమ్మునకు నవోజ్జ్వలత నొసఁగు.
219
సీ.ఇరులు వాఱిన కొండదరుల లోపలి ఱాల । జిలుఁగు శాసనపు వ్రాఁతలను నేర్చి
చిఱుమబ్బుసందుల మెఱపులై యొఱపు పెం । పఱు నాణెముల కొఱగుఱుతు లూర్చి
వాయు మత్స్యాదిక ప్రాక్పురాణములలోఁ । గలసి పాడిన కథావళు లమర్చి
సోమదేవాదిక సూరివర్యుల కైత । కల్పనమ్ముల సోయగమ్ముఁ దేర్చి
197
గీ.యయిదువందలయేండ్లపై పయిగ నవనిఁ
బాలనముచేసినట్టి భూపతులు సాత
వాహనాధిపుల చరిత్ర వైభవమ్ము
మసక మసకగ వెలసె వాఙ్మయములోన.
219
చ.చెదరిన ఱాతివ్రాఁతలును జెల్వము దక్కిననాఁటి నాణెపుం
జెదరులు నూఁతగాఁగొని రచించిన నేఁటి చరిత్రబంధ మం
దదుకులు వోవుచున్ శతశతాంశము చెప్పెనొ, లేదొ, తత్పురా
భ్యుదయము-తత్పురాసమధికోత్తమ ‘కర్ణి’ నృపాల సభ్యతల్.
220
గీ.పేరులే తప్ప, బ్రదుకుల పెంపు సొంపు
తీరుఁదీయము పసలు గుర్తింపరాక
యెంద ఱుండిరొ ముప్పది యిద్దఱైన
సాతవాహన రాజవంశజులలోన.
221
వ.శివశ్రీశాతకర్ణి, సుందరశాతకర్ణి, కుంతలశాతకర్ణి మున్నుగానున్న రాచపేళ్లు పెక్కు ‘శాతకర్ణి’ పదాంతములయి యుండుటంబట్టి సాతవాహన వంశీయులకుఁ గర్ణిరాజు లనియు వారి యేలుబడి క్రింది నేల కర్ణినాఁడనియు, నదియె కర్నాటకంబనియుఁ బేరు వడసె.222
గీ.విశ్వధారుణి వెలుఁగులవెల్లి నింపి
యేలుబడి సాగఁజేసిన హాల నృపతి
జరఠ మిత్రునివలె నలసటల నొవ్వి
పవ్వళించెను బడమటి పడకటింట.
223
ఉ.ఆ మునిమాపునం దసురులై యుసురుల్ కసిమీఱనొడ్డు సం
గ్రామ విశారదుల్ యవనరాజులు, పల్లవులున్‌, శకుల్, బలో
ద్దాములు మేలుకాంచి బలితంబుగ ముట్టిరి తెన్గునేలఁ; బే
రామున నెల్లెడన్ లయవిహార మొనర్చిరి పేర్చు పెంపునన్.
224
క.కడుకొని సంగరయాత్రలఁ
బడమటి భాగమ్ము ‘క్షత్రప’ ప్రభువులు లోఁ
బడఁ జేసికొనఁగఁ, దెలుఁగుం
బుడమిపడంతియు నశాంతి పొంతల నిలిచెన్.
225
ఉ.హాలునితోనె పోయిన దయా, మన శాంతి - మనఃప్రశాంతి; యా
కాలము రాదు; రా దిఁక సుగం బని దేశమునం గడింది క
ల్లోలము రేఁగె; క్షత్త్రపుల లోలత హద్దు లతిక్రమించి దు
శ్శీలతఁ దోఁగె; సేగి వొలిచెన్ నలుమూలలఁ దెల్గునాఁడునన్.
226
వ.క్షత్రపులయందు భూమక నహపానుల జైత్రయాత్రా విజృంభణములు ప్రసంగింపఁ దగ్గయవి వారిలో నహపానుని యోహటింపునకు మఱిమఱి తెలుంగునేల గుఱియయ్యె. నయ్యెడఁ బ్రజాసౌఖ్యంబు గొఱవడియె నంత -227
శా.ఆ కల్లోలపుఁ గారుచీకటులు వాయన్‌ గౌతమీ మాతృ గ
ర్భాకూపారము పొంగులై పొరలఁగా నావిర్భవించెన్‌ శర
ద్రాకాచంద్రుఁడు ‘శాతకర్ణి’; చవులూరం బెంచె నాంధ్రప్రజా
చాకోరమ్ముఁ; గలంచె ‘క్షత్త్రప’ నృప స్వైర ప్రతాపోద్ధతిన్‌.
228
సీ.సుకము మాసిన రాచఱికపు దందడిలోన । దివ్యప్రశాంతి సాధించుకొనియెఁ
దరఁగ లెత్తిన శత్రుగరళసాగరము పు । క్కిలిగొని గళవీథి నిలుపు కొనియె
బవరాన మడమఁ ద్రిప్పని వీరవరులకుఁ । బసిఁడి దోసిళ్ల సంబరము లొసఁగె
నొంటి యూర్పులఁ గాళులంటి వేఁడిన శాత్ర । వులపై దయాసుధ చిలుకరించెఁ
 
గీ.బలుకరించెను బేదసాదులను గన్న । కడుపులను బోలె; గౌతమీ గర్భశుక్తిఁ
బొటమరించిన కొసగల ముత్తియంబు । కారుణికమౌళి శ్రీశాతకర్ణిరాజు.
229
మ.కుహనా సాహస సంగరమ్ములఁ బరాకుల్లేని క్రొవ్వాఁడియౌ
నహపానుం బలుమాఱు లాహవములోనన్ ద్రోసి త్రోపాడి - తె
ల్గుహజారమ్మున గెల్పుఁగంబములు నెక్కో నిల్పె స్వోద్యద్యశో
బహుశో వేల్లిత వల్లికాతతి రహింపం బ్రాఁకులై పెంపఁగన్.
230
మ.వెడనీతిన్ బెఱజాతు లెత్తినపు డోపెన్ గెల్చి జాతీయ వీ
రుఁడుగా, ధీరుఁడుగాఁ, గుమారుఁడుగ; నాంధ్రుల్ గౌతమీపుత్రువెం
బడిఁ గ్రొంబూవులరాచబాటఁ బయనింపంజూచి, యీర్ష్యాగ్రహం
బెడగాఁ ద్రోచి నివాళులెత్తిరి స్వదేశీయుల్ విదేశీయులున్.
231
ఆ.వె.మధ్యపరగణాలు, మాళవము, సురాష్ట్ర
ముత్తరంబు కొంకణోర్వి, తూర్పు
రాజపుత్రధర, బిరారు నుత్తరమహా
రాష్ట్ర, మాంధ్ర లాభరమలు నాఁడు.
232
ఆ.వె.మఱవరాని వీరమణి యైన గౌతమీ
పుత్ర శాతకర్ణి పుణ్యగాథ
తెలుఁగునేల నిలిచి వెలుఁగు సన్నని తీఁగ
సోగ మెఱపురేక సొగసు కలది.
233
వ.శ్రీ శాతకర్ణి పిదప శకరాజులు మరల నెత్తి వచ్చిన కారణమున నంధ్రక్షోణి సంక్షోభించె, శకులు తొల్లి్టికంటె బలిసి యుజ్జయిని రాచవీడుగా నష్టరాజ్యమ్ములు మగుడ నాక్రమించుకొనుటయే గాక తెలుఁగునేల పడమటి భాగమ్ములు సైతము చేపట్టికొనియున్న తరుణంబున యజ్ఞశ్రీ శాతకర్ణి శకుల దర్పం బడంచి కొంత స్వతంత్రతను నిల్పుకొనియెం గాని -234
చ.కడపటి సాతవాహనుల కాలమునం గల తెల్గు నాఁటికిన్
బడమటినేల నేలుబడి భాగ్యము మాసెను; గేవలాంధ్రమే
కడకు స్వరాజ్యసంగతముగా మిగిలెన్‌; బగఱేండ్ల దుశ్శకం
బడరి క్రమంబు గాఁగ నదుకై చిదుకై చెడెఁ దొంటిపెంపులున్‌.
235
చ.తలఁచిన దారిలోఁ బసిఁడి తట్టల నేఱిన నాఁటి తెల్గుఱేఁ
డుల పరిపాలనంబునఁ గడుంగడు వర్తకరీతి తీవతీ
వలగుచు వేఱుదీవియలఁ - బశ్చిమభూముల - ‘రోము’ మున్నుగాఁ
గల నగరంబులన్‌ బలు‍మొగంబుల నల్లుకొనెం బసందుగన్‌.
236
గీ.నాఁడు తూరుపువైపు సంద్రమ్ము మీఁదఁ
దెలుఁగు ఱేండ్ల విభుత్వ ముద్రలు తనర్చి
యోడ యెగుమతి దిగుమతుల్ కూడు మేటి
రకపు వాణిజ్య సరణి నర్తన మొనర్చె.
237
గీ.సాతవాహన రాజ్యప్రశంసయందు
మనకు నాగార్జునాచార్యుమాట తలఁపు
తొలఁగునే? ‘యమరావతీ’ స్తూప శిల్ప
కల్పన మనోజ్ఞ విజయ శంఖముల రవళి.
238
మ.అవి యేనాఁటి పునాదులో, నిలిచె సంఘారామముల్ చెక్కుమా
యవు పెక్కబ్దము లిట్లు దాఁటినను; సప్రాణంబులౌ నాఁటి శి
ల్ప విలాసోదయ కల్పనంబులను స్తూపవ్రాత మీనాఁడు క
న్గవకు న్విందులు చూఱఁజూపు బహిరంత ర్మాధురీ ధుర్యమై.
239
శా.జీవచ్ఛిల్పకళా సరస్వతి విపంచిం గేలు సారించి యీ
యావద్భారత దిగ్దరుల్ ప్రతిరవ వ్యాప్తంబుగా నంధ్ర ల
క్ష్మీ వైశిష్ట్యము సాతవాహన కళా శ్రీబంధుర శ్రద్ధయున్
బ్రోవుల్ ప్రోవులు గూర్చి పాడుకొని త్రవ్వున్ నేఁడు ప్రాక్సంస్మృతుల్‌.
240
ఆ.వె.ఘంటసాల, ధాన్యకటకము, భట్టిప్రోల్
గుంటుపల్లి మొదలు కొన్ని యూళ్లఁ
బాలఱాల కట్టడాల మేల్ముసుఁగులోఁ
దెలుఁగు శిల్ప తరుణి వలపు లూర్చు.
241
గీ.చెదరు చెదరులు తచ్ఛిలా శిల్ప శకల
సమితి రతనాల జోతులై సాతవాహ
నాధిపుల పురా విజయగాథాంకములుగ
సాగు దీపావళీ మహోత్సవము లిపుడు.
242
గీ.అనుపమానము సాతవాహనుల రాచ
దనములో బౌద్ధ విశ్వవిద్యాలయములు
ధనకటకమందు నితర పత్తనములందుఁ
దనరి తనియించె నాంధ్రవిద్యార్థి గణము.
243
ఉ.ఆ పరిపాలనంబును- సదాశయు లా నరపాలపాళి తీ
రా పొలుపెట్టిదో! శ్రుతి మతాదృతి- బౌద్ధ మతాదరమ్ము, రా
రాపులుసేయ నేరు పడరం గుడి చే- యెడ చేయిగాఁ దలం
పూఁపఁగ రెండునుం గలిపి యొగ్గిరి చేతులు సాతవాహనుల్.
244
చ.మత సహనంబు. వాఙ్మయరమా పరమాదృతి, శిల్ప సత్కళా
రతి, కృతిగౌరవంబు, జనరంజన శాత్రవ భంజనాది సం
స్తుతగుణ భారముల్ గలుగు జోదులు రాజులు దాక్షిణాత్యసం
స్కృతికిఁ బునాది వేసి వెలయించిరి మాయని హేమసౌధముల్.
245
మ.అనపాయం బనురూప మప్రతిహతంబౌ పూజ్య సామ్రాజ్య పా
లన తంత్రంబున సాతవాహనుల కాలం బాదటం దెల్గువా
రిని విజ్ఞానపు వెల్గుబాటలకుఁ జేర్చెన్; బేర్చెఁ గ్రొంగొత్త సం
తనలన్‌ దేశము; వంతులై యలరె నానాశాస్త్ర విద్యల్ కళల్.
246
ఉ.రాచదనంపు దందడులు రాపిడులెవ్వియు లేక భోగ భా
గ్యోచిత సాధువృత్తి, బ్రజ లుండిరి; నిమ్మకు నీరువోసిన
ట్లౌచుఁ బ్రశాంతి దంతురితమై చివురెత్తెను; దెల్గునేల పు
ష్పాచిత భౌమ కల్పతరువై బెడఁగారె సమృద్ధ సంపదన్‌.
247
మ.ఒదిగిళ్లంబడి యొక్కయేలుబడిలో నోటాఱి యూఁగాడి దీ
నదశన్ దోయిళు లొగ్గి మ్రొగ్గుట దురంతంబైన సంతాప మే
లిదముం బెంచె; స్వతంత్రతారతి ప్రజాళిన్ ముంచె; విజ్ఞాన భా
గ్యదశా పాకము లెట్టివో! ప్రజ లధీకారైక వాంఛావశుల్.
248
గీ.తెగతెగలు గాఁగ విడి పలుతెఱఁగు లయిన
ప్రజల సామంత నృపతులు బలుపువడయఁ
గలుపుకొని నేల ముక్కముక్కలుగ విఱిచి
యెవరి యంతకు వారుగా నేలుకొనిరి.
249
చ.అదుకులు నంతరంబులును నంటక యూడలుదేఱి తీరుగా
నెదిగెఁ జతుశ్శతాబ్దముల కెక్కుడు కాలము; పుల్గుగూండ్లతో
గదలి కుదుళ్లతోఁ బ్రిదిలి కన్నులముందర మ్రోడువాఱె న
భ్యుదయమునెంచి శ్రీముఖవిభుం డిట నాటినమొక్క నేఁటికిన్.
250
మ.తొలి వంశీయులు దేశమాతృ హితభక్తుల్ శోణితస్నాతు లు
జ్జ్వల మూర్తుల్ గడియించిపెట్టిన ప్రశస్తంబైన పీఠంబుపైఁ
గొలువుల్ చేకొని జాగువోయిన యెదం గూర్చుండఁగా లేక చే
తులలోఁ బెట్టిరి సాతవాహను లరాతుల్ పొంగ సామ్రాజ్యమున్.
251
మ.పొడుపుంజూపుల వేచియున్న యరిగాపుల్ స్వాధికారంబు వెం
బడిఁ బ్రాంతీయులఁ గూడఁగల్పుకొని యాపైఁ గొంతభూభాగ మొ
క్కఁడుగా నేలిరి; శాలివాహన రమాగర్భంబు బైలై, బయ
ల్పడె సామంతుల భాగ్యరేఖల నపూర్వ స్పష్ట శోణప్రభల్.
252
గీ.ఒప్పుగాఁ గొంత పచ్చగా నున్నయపుడ
సాతవాహన సామ్రాజ్య చూత విటపి
నంటు ద్రొక్కిన మొక్కలై యచట నచటఁ
గొమరుగొనె నల్పరాజ్య ఖండములు కొన్ని.
253
వ.ఇటులు చిదురుపలయిన రాజ్యభాగముల నేలుబడి సాగించిన రాజవంశీయులందు నిక్ష్వాకులు శాలంకాయనులు బృహత్పలాయనులు విష్ణుకుండినులు పల్లవులు మున్నయిన వారెందఱో చరిత్రప్రథితులు; వారిలో నుదాత్త క్షాత్రసంపన్ను లిక్ష్వాకులు -254
మ.అదిగో, మబ్బుల మేలి నీలితెర చాయన్‌ రోచిరుచ్ఛ్రాయ సం
పద సొంపారెడి తారకాళి; రఘురామస్వామి సంతానపుం
గుదురౌ పూర్వ నరేంద్రమండలి కనుంగుల్ కాఁగ నా పంక్తి వె
ల్గుదు రిక్ష్వాకులు చూడుఁడీ మన తెలుంగుల్ క్షాత్త్రనక్షత్రముల్.
255
ఉ.ఉప్పరమెల్ల బంగరువు టూయెల నూఁపెడి వెల్గుఁజుక్కలౌ
ముప్పది యిర్వురైన నృపమూర్తులతో నమృతద్యుతిచ్ఛటల్
కప్పఁగ మూఁడుతార లవి కన్నులకున్ మిఱుమిట్లు గొల్పెడిన్
దెప్పరమౌచు; నీ తెలుఁగుదేశపురాజులు వార లారయన్.
256
ఉ.ప్రాఁబడియున్న శాసనపువ్రాతల చాటున రెండు హెచ్చుగా
నేఁబదియేండ్లుగాఁ బుడమి నేలిరి; వ్రాలిరి; వారియేల్బడుల్
పోబడులున్ పురానృపుల పోలికలై తగి విందు పంచె; గా
రాబము పెంచె వేదమతరాజము తెల్గుల కల్పభూజమై.
257
గీ.హైందవ మతాంబుజమ్మున కకరువయిన
వేదపథమున హృదయముల్ విరియ వ్రాలి
రాజసూయాశ్వమేధాధ్వరములఁ దేలి
పరిమళించిరి దెసల నిక్ష్వాకు నృపులు.
258
వ.ఇక్ష్వాకువంశకేదారమునం దొలిపంట క్షాంతిమూలుండు; అతండు వాసిష్ఠి కన్నచూలు. రెండవయతండు మాఢరీ గర్భశుక్తి ముక్తా్మణి వీరపురుషదత్తుండు. మూఁడవపంట యెహువుల క్షాంతిమూల మహారాజు. ఇటులు ముక్కారుంబండి యిక్ష్వాకువంశ సుక్షేత్రం బింతలో దైవవశంబునఁ జవుడువాఱె.259
మ.సదయుల్ దేశహిత ప్రశాంతి శుభరక్షాకాంక్షు లిక్ష్వాకు - లా
హృదయోదారత లెట్టివో, శ్రుతిమతం బేపారి నల్వైపులం
బొదలం జల్వలు వోసికో నవభృథంబుల్‌ సేసి, చేసేఁత నె
త్తెద రాంధ్రావని బౌద్ధధర్మమున కెంతే వైజయంతీచ్ఛటల్.
260
మ.మదులం బెల్లుగ వెల్లియై పొడుచు నామ్నాయార్థ విశ్వాస సం
పదతో ఱంపిలు పుణ్యకర్మరతు లిక్ష్వాకు ప్రభుల్ - లోకపుం
బదను ల్వట్టి కళారుచుల్ దెసల నిల్పన్‌ ముగ్ధులై శిల్ప శా
రదఁ బ్రేమింతురు; సంచరింతు రసిధారాదీక్ష పెంపొందఁగన్.
261
సీ.వేదపాథోరాశి వెల్లువఁ బుక్కిలిం । చిన బాడబాళి దోసిళులయందు
జీవన్మనోజ్ఞతఁ జిందించి చవులూర్చు । బౌద్ధవిహార శిల్పములయందు
వెల యింతయని చెప్పుకొలఁది గా కొసఁగెడి । తొనఁకని సవనదక్షిణలయందు
నది తపస్సుగ - నదే యధ్యాత్మముగ నమ్మి । శిల్పమ్ము నేలు కాసీలయందుఁ
 
గీ.బల్లవించెఁ; బువ్వుల నించెఁ; బరిమళించె;
నామెతల ముంచె సామిశతాబ్దకాల
పరిమిత వసంత కళ్యాణ పరమలీలఁ
దేలె ‘నిక్ష్వాకు’ వసుమతీపాల కమల.
262
గీ.క్షాంతిమూలుఁడు పుడమి దోస్సార సరణి
నొడిసికొని యశ్వమేధానఁ దడిసినాఁడు;
దారవోసినవాఁ డత్యుదార లీల
బాఁపలకు లక్షనాఁగళ్ల పంటనేల.
263
వ.సరసికయుఁ గుసుమలతయు ననువారు తన వలపుఁదీవలుగా, హమ్మశ్రీనిక క్షాంతిశ్రీ లిరువురును జెల్లెండ్రుగా, వీరపురుషదత్తుఁడు కుమారుండుగా క్షాంతిమూలుండు సంసారము సాగించిన మహాభోగి.264
మ.అమరావత్యుపగూఢమై వలపుఁదీయంబాని యిక్ష్వాకు రా
జ్యమునన్ మేలితెఱంగు బౌద్ధమత ధర్మాదర్శముల్ చూచి యం
దములుం బొందులు చక్కఁదీర్చుకొనె శ్రీనాగార్జునాచార్యు కొం
డ మనోమోహన శిల్ప కల్పన కరండంబై కళాఖండమై.
265
క.శ్రీపర్వత మిక్ష్వాకు ధ
రా పాలక కీర్తి సౌధరాజ మ్మగుచున్
దీపారు; నందు రతనపు
దీపికలై వెలుఁగు శిల్ప దివ్యశకలముల్.
266
క.ఆ వెలుఁగుముసుఁగులోఁ గృ
ష్ణావాహిని మంద మధుర సంచారములన్
గావించుచు లోలోఁతుల
భావనఁ గదలించు సుకవిపాళి రసించన్.
267
మ.మురువుల్ ముచ్చటలూర్చు వెల్లువల వంపుల్ వోవు నా ‘కృష్ణ’కు
త్తర తీరమ్ము ‘బృహత్పలాయనుల’ సంతానంబు సుక్షత్రియుల్
పరిపాలించిరి; వారి యేలుబడి శంపావల్లికాఖండ వి
స్ఫురణంబై మధురానుభూతి యిపు డూఁపున్ భావనాడోలికన్.
268
వ.బృహత్పలాయనులె కాక, శాలంకాయన గోత్రులు దేవవర్మ హస్తివర్మ నందవర్మ చండవర్మ స్కందవర్మ ప్రభృతులగు నెందఱ వీరగాథలు కాలము కడుపున మఱుంగుపడి యుండెనో!269
శా.శాలంకాయన గోత్ర ధన్యులగు రాజన్యుల్ శతాబ్దమ్మొ, పై
కాలమ్మో ‘పెదవేఁగి’ రాజనగరింగాఁ జేసి పాలించి రీ
నేలన్ గోల్తల నేర్పుఁదీర్పులు కడు న్నిండార గోదావరీ
లీలావత్యుపగూఢ పశ్చిమ తటీ కౢప్తాంధ్ర భూభాగమున్.
270
మ.ఇరులం ద్రోలి మొయిళ్లు దాఁటి వెలుఁగుల్ హేరాళమైచిమ్మి యె
ల్లర యుల్లంబులు విచ్చి విందు లిడ శాలంకాయనుల్ వేఁగి చి
త్రరథస్వామికి భక్తులై చరమ సంధ్యాశోణ తేజోరుచుల్
పొరలం బంచిరి “విష్ణుకుండి” ధరణీపుల్ పెంచు శౌర్యాగ్నికిన్.
271
క.శాలంకాయన రాజుల
పాలనమున వేంగి పల్లవములం దొడరెన్;
బూల నడరెఁ “బల్లవ” నృపు
లేలిన దక్షిణ ధరిత్రి ‘కృష్ణ’ చలువమై.
272
పర్వాంతము
మ.అనవద్యోదిత గద్యపద్య కృతిపద్యాస్వాద్య మీ సాతవా
హనపర్వంబు బృహత్కథాగ్రథన హోమారంభఘట్టప్రసా
ధనధౌరేయము నీకు విన్చితిని భద్రవ్యాపృతిన్ నీ తనూ
జుని యీకబ్బము సర్వ మక్షతమొనర్చుం ద్వత్కటాక్షద్యుతుల్.
 
మ.స్తవనీయంబు శిరఃకిరీటమునకున్ దత్తద్బహిర్వ్యంజన
ప్రవణత్వంబున కేమికాని కవితారాజ్యంబు భోగించువాఁ
డెవఁడో తొల్లిటి తెల్గుఱేఁడు వినిన ట్లీపర్వమున్ విన్నవాఁ
డవె తండ్రీ! భవదార్ద్రచిత్త ముపకంఠంబయ్యె నీబిడ్డకున్.
 
సాతవాహన పర్వము - ఆంధ్ర పురాణము - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి - ఆంధ్రభారతి - కావ్యములు - ఆంధ్రపురాణము - ఆంధ్రపురాణం - ఆంధ్ర పురాణం మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) Andhra Puranamu - AndhraPuranamu - Andhrapuranam - andhra puranam - Madhunapantula Satyanarayana Sastry- AndhraBharati AMdhra bhArati - kAvyamulu