కావ్యములు ఆంధ్ర పురాణము పునఃప్రతిష్ఠా పర్వము

ఆంధ్ర పురాణము
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి

పవన జవన వాజివ్రాత రంగత్తరంగే
యవనజలమహాబ్ధౌ భూతధాత్రీం నిమగ్నామ్
విపులవిజయధామా యస్సముద్ధృత్య చక్రే
నిజభుజమణిభూషాం వీరనారాయణాంకః
“శాసనము"

పునఃప్రతిష్ఠా పర్వము
క.శ్రీకలితాయుర్నిగమ క
ళాకౌశల సముపగత ఫలత్కేదారా!
స్వీకృత నిజమితభోగ
వ్యాకృత హిత మిత్త్ర బాంధవాద్యుపకారా!
1
ఆ.వె.కాకతీయ సవితృ కమనీయ తేజమ్ముఁ
బుణికికొన్న రెడ్డి భూమిపతుల
విక్రమానలమ్ము విమతాంధకారమ్ము
వెడలఁద్రోలెఁ; దెలుఁగుఁ బుడమి నేలె.
2
చ.ఎడమడువైన కాకతిమహీశులయేల్బడి నాదుకొన్న నా
థుఁ డొకఁడు లేకపోయెఁ; బగతోఁ బెఱఱేండ్లు తెనుంగుదుర్గముల్
కడుకొని చిక్కఁబట్టిరి; వికాసవిశేషముఁ దక్కి పెంపునె
ద్దడిఁగొనె నోరుఁగల్లు సులతానుపురంబను మాఱుపేరునన్‌.
3
గీ.కడలిగట్టునఁ దెనుఁగుదుర్గమ్ములైన
కొలనువీడును నెల్లూరు కొండవీడు
రాణ్మహేంద్రవరమ్ము తీవ్రతరమయిన
ముస్లిము వరూథినీధాటి మునుఁగనయ్యె.
4
సీ.సప్తతంతు క్రియాచరణవేళా కృత । ప్రత్యూహములను గప్పఁబడరాని
భగ్న భుగ్న మనోజ్ఞపరమాలయాంతర । దైవతప్రతిమల దాఁపరాని
యానువంశిక భుజ్యమానాగ్రహారాళి । విధ్వంసముల నిహ్నవింపరాని
ధేనుమాంసాదనోద్రిక్త శీధూత్సిక్త । వదనంబుల మఱుంగుపఱుపరాని
 
గీ.భారతీయ సతీజన స్వచ్ఛధర్మ । భూరిదూషణములఁ గప్పిపుచ్చరాని
యొక భయావహపరధర్మ ముదయమందెఁ । గాకతిమహేశ్వరుఁడు లేనికాలమందు.
5
సీ.అలనాఁడు కాకతీయుల యేలుబడిక్రిందఁ । బొదలె దుర్గములు డెబ్బదియురెండు
నొకనినాయకతచే నొకసీమ యరిభూప । దురవాప మగుసిరి నురవడించు
నటులు డెబ్బదియిర్వు రరిగాఁపులయుప్రాపు । తనకుఁ జేకుఱ ధరాతలము బెగడ
బల కోశ ముఖమహోజ్జ్వలిత రాజ్యాంగముల్ । పెంచి పెంపులు గడియించియుండి
 
గీ.కాకతీయసామ్రాజ్య దుర్గప్రబంధ । మంతలో నింతయయ్యె నాయకతకొఱఁత;
నాయపశ్రుతి ధార్మికస్వాంతములను । గలఁచె; మ్రుక్కడిసిరి మఱొక్కనిని వలచె.
6
గీ.బెండపూడన్న - కొలనిరుద్రుండు మఱియు
వెలమ సింగమనీడును దెలుఁగునేల
రక్షణమునకు వీరరుద్రక్షితీశ
దర్శితంబైన యోధనేత్రత్రయంబు.
7
గీ.ఓరుఁగలునందుఁ బాలనోద్యోగమునకు
“నలుగుఖానుఁడు” ముక్తియారులను నిలిపెఁ
దెలుఁగునాఁ డస్వతంత్రతానిల కరాళ
గరళశిఖి సోఁకినట్లు త్రొక్కటము వడఁగ.
8
ముసునూరి ప్రోలయ వీరోద్యమము
గీ.హైందవమతావలంబనం బైన బుద్ధి
కలిమి ముసునూరి కుల దీపకళికయైన
‘రేకపలి’పతి ప్రోలయాఖ్యాక సుకృతి
తనకుఁ దాన మనం బిటు త్రవ్వుకొనియె.
9
మ.అవురా! యిట్టియకాండపాతమఁటె! ద్రోహవ్యూహసన్నాహమై
యవనోద్వాహిని చుట్టవైచుకొనె నట్లయ్యోరుఁగల్కోట; వీ
ర విహారోద్ధతు రుద్రసింహమును గారాబంధితుం జేయు దు
ర్వ్యవసాయంబున నయ్యరాతిసమవాయం బింత మున్నాడునే!
10
మ.అతిసంధానము చండతాండవముసేయన్, హైందవమ్ముల్‌ లస
న్మతధర్మంబులు గౌరవంబుసెడి డిందన్, సాధువాక్కుల్‌ తిర
స్కృతి నందన్‌ మనధాత్రి నెన్నొసట వ్రాసెంబోలు దైవంబు; త
త్ప్రతికారం బొనరించు పౌరుషము నిర్వర్తింపగా నొప్పదే!
11
గీ.కాకతివిభుత్యమున నోరుఁగలు పతాక
యవని శాశ్వతముగ నిల్చు ననియెకాని
యల కళంకిత చంద్రధ్వజాంకురములు
నాటు ననుకొంటిమే! తెన్గుకోటమీఁద.
12
వ.కడచినజలమ్మున కానకట్ట కట్టి లాభ మేమి? కర్తవ్యమున విక్రమించెదంగాక! కాకతీయసామ్రాజ్యసామంతులైన దుర్గాధిపతుల మునుముందఱం గూడఁగలుపుకొని వారి నెల్లర నొక్కత్రాట నడపించి పరాక్రాంతమైన యోరుఁగంటికోటపై విక్రాంతిమెయిఁ దెనుంగుబావుటా పునఃప్రతిష్ఠితము సేఁత కావలయును -13
క.అని భావించుచు దర్పం
బును గిన్కయు వేడ్కయును గుబుర్కొన జాతీ
య నవోదయ పరిలిప్సా
ఘనుండు ప్రోలయ స్వకార్యకరణోన్ముఖుఁడై.
14
ఉ.కూటికి గుడ్డకుం గఱవుగొల్పి ‘ఖురాను’నకుం బ్రణామముల్
చాటనివారిఁ బట్టుకొని చట్టలుచీలిచి ధేను దేవతా
ఘాట మదల్చి హైందవులఁ గాఱియవెట్టెడివారికిం బరో
చ్చాటనమంత్ర మౌత మనిశమ్మును బ్రోలయపేరు ధారుణిన్‌.
15
ఉ.వాలిన పౌరుషంబుమెయి వాదరలెత్తి యరిచ్ఛటారుణ
క్షాళనసేయు నాంధ్రయువసంఘము తోడుగ సాఁగనున్న యీ
ప్రోలయనూతనోద్యమము పోఁడిమి లెస్సగఁ బండి తెల్గుజెం
డా లల యోరుఁగంటఁ బ్రకటస్ఫుటభంగిఁ దలిర్పఁగావలెన్‌.
16
క.అనునాత్మ ప్రత్యయమున
ననల్ప భవితవ్య రణజయారుణ విలసద్
ఘృణి యొకఁడు తోఁచి ప్రోలయ
కు నేదో యిరులతెరఁ దొలఁచికొన్న ట్లాయెన్‌.
17
వ.అతండు పెక్కురు తెలుఁగుజోదులం గలసికొని వారియెడల దేశభక్తి రక్తి కెక్కునట్లు చేయుచు నవిరతవ్యవసాయంబు నెఱుపుచుండె; మఱియు -18
సీ.తెలుఁగుధాత్రికి వీరకళ దిద్దిన ప్రతాప । రుద్రవల్లభునితీర్పుల నెఱింగి
పయి నేడుగడలేమిఁ బల్లటించెడి దుర్గ । పతులకు ధీరభావమ్ముఁ గఱపి
ప్రాపుండి నడప దర్పమున బెబ్బులిగొంతు । గుప్పిటంగొను యువకులను జేర్చి
తనపినతండ్రి సంతానరత్నములైన । కాపయప్రముఖులదాపు చూచి
 
గీ.యవనసేనాంబుధి మునింగి యంగలార్చు । నవని నెత్తు పురాణదంష్ట్రాంకురముగ
ధర్మసామ్రాజ్యహిత సముద్ధరణచణుఁడు । నాయకత మించెఁ బ్రోలయనాయకుండు.
19
క.ఊరూరఁ బ్రజాసేనలు
గూరిచి పరు లాక్రమించుకొన్నవి దుర్గ
ద్వారములు తెఱచి వీరవి
హార మ్మొనరించెఁ బ్రోలయ జయప్రియుఁడై.
20
క.ఒక యుత్సాహముతో నొ
క్కొకదుర్గము ముట్టడించి యుత్తేజితుఁడై
సకలస్వదేశమున నొరు
లకు నిలఁబడ నెలవులేనిలాగునఁ జేసెన్‌.
21
గీ.నడుమ విసరిన వడగాడ్పునకుఁ దొణంకి
తలలువాల్చు సనాతనధర్మలతలు
తేఱుకొని యప్పుడపుడె నర్తింపఁదొడఁగెఁ
బ్రోలయమనీషి కృషివర్షమునకుఁ దనిసి.
22
వ.దుర్గవిజయానంతరము ప్రోలయనాయకుం డీవఱ కెవం డేలుకొను చుండినదుర్గంబు వాఁడ పాలించుకొనున ట్లేర్పఱచి తోడిదుర్గనాయకులలోఁ దాను నొక్కండయి కలసిమెలసి “రేకపలి” రాచవీడుగ గోదావరీపరిసరవిశ్వంభర నేలుబడి సాగించుచుండె -23
గీ.తఱుగువట్టిన దేశీయధర్మమునకుఁ
బెరుగుదల నీయఁ బరుల నొవ్వించి తఱిమె;
నంతియేకాని, సర్వరాజ్యమ్ముఁ దానె
కరుడుగాఁజేసి మ్రింగెడి కాంక్షఁబోఁడు.
24
గీ.తనబరువుపడ్డ దొడ్డయత్నమ్ముకంటె
నాయకుల సాయమునకంటెఁ బ్రాయమిచ్చి
పోరుసలిపిన ప్రజల గెల్పునకు మురిసి
యది ప్రజారాజ్య మనుచుఁ బ్రోలయ తలంచు.
25
వ.ఎన్నిదుర్గంబుల నాక్రమించినను బ్రధాననగరంబైన యోరుఁగల్లు స్వాయత్తంబుఁ గావించుకొననివాఁ డగుట ప్రోలయ తనవార్ధకంబునకుఁ దలంకుచు - 26
గీ.“కడఁగి డెబ్బదిమించు దుర్గములయందుఁ
దెనుఁగునేల్బడి వైజయంతికల నెత్తి
యొక్క యోర్గలుకోటపై నున్నయట్టి
యబ్జవైరిధ్వజము దింప నయితి కాదొ!”
27
వ.అనుకొని యొకనాఁడు నిజపితృవ్యపుత్రుండును గార్యాకార్యపరిజ్ఞాతయు నింగితవేదియు నగు “కాపయ”ను గానిపించుకొని సముచితకృతజ్ఞతారచితశుభాశంసనుం డతని కిట్లనియె.28
గీ.తెనుఁగుధారుణి నొరులపెత్తనము దరల
ననుఁగుఁదమ్ముఁడు నీవు చేసినది సాయ
మమృతకాయముతో నుండుననుటకంటె
నోచిరంజీవి! యేమి చేయుటకుఁ గలదు.
29
ఉ.తీసినదారికిన్‌ గరుణదేఱినదైవము సంగడీఁడుగా
వేసినయంగకుం బ్రజలవేడుకపోఁడిమి తోడునీడగా
దూసినకత్తికిన్‌ బగఱతోరపునెత్తురు నిండుజోడుగాఁ
జేసిన యస్మదుద్యమము సిద్ధికివచ్చెఁ గొఱంత కొంతగన్‌.
30
మ.తలయేరుం బొడిదగ్గు నెక్కొనిన వృద్ధత్వమ్మునం జిక్కి దూ
పిలి కోఱల్‌ కఱపించు మృత్యువునకున్‌ భృత్యుండనై యున్న నా
కలనన్‌ గాఁగలకార్య మేమికల; దింకన్‌ గల్యకల్యాణరే
ఖలు నీ సాయుధపాణిపద్మమున వ్యక్తం బౌత! రక్తద్యుతిన్‌.
31
చ.సుఖపడుకోర్కివెంట మనసున్‌ మఱివేఱొకదారిఁ జేర్చి యు
న్ముఖనిజకర్మపాకఫలముం గొనఁబోయెద; సద్యశో ముహు
ర్ముఖరిత దిఙ్ముఖుండవయి ముందు స్వరాజ్యము నిల్పుకొంచుఁ ద
న్నిఖిలరమాకిరీటముగ నీవయి యోర్గలుకోటఁ బట్టుమీ!
32
క.అని యన్న యనుజునెడఁ దన
మనసు నిలిపి జయముపలికి మాటాడినఁ జి
క్కని వాక్కుల నెద తడియఁగ
విని కాపయ పలికె భక్తివినమత్తనుఁడై.
33
క.పొరపొచ్చెము లెఱుఁగని సో
దరభావోచ్చయము ప్రతిపదమ్మునఁ దొలఁకన్
గఱపిన నీ యుపదేశ
స్ఫురణమ్మున కేను గేలుమోడ్తుం గృతినై.
34
మ.అసహాయస్థితి నున్నయీప్రజకు దాపై పాపచర్యాత్ములన్‌
గసి రాపాడి పునాదివేసితివి చక్కన్‌ నేలమట్టంబు తా
రసిలంగా; నిఁకమీఁదఁ దద్‌భవననిర్మాణంబు నాబోటి యే
పసివాఁడైనను నిర్వహింపఁగలఁ డప్పా! యేల సందేహముల్‌.
35
శా.నీ సంకల్పముచేత నాటఁబడియుండెన్; నీ మహాశీస్సుధా
శ్రీసేకంబున మోసుదేఱి చివురించెన్; నీ దయాదాసుఁడౌ
నీ సోదర్యుఁడు సేయుదోహదముచే నేతన్నహారాజ్యలీ
లాసంతానము పండి నిండు నిఁక నేలన్‌ స్వర్ణభండారముల్‌.
36
క.శ్రీవిశ్వేశ్వరదేవ ద
యావీక్షణ మొప్పుగా సమారూఢమతిన్
భావుకవిజయపతాకను
నే వేసెద నాంధ్రపురమహీందిర మురియన్‌.
37
గీ.అని వచింపఁగ విని సోదరుని మనంబుఁ
గని మరల నొక్కతూరి జవ్వనము నెంచి
పటుతరం బగునిండుకౌఁగిట గదించి
యన్న తమ్మునిలో నభిన్నాత్ముఁ డయ్యె.
38
కాపయనాయని విక్రమము
క.ప్రోలయ యొరవడిలోఁ దన
శీలముఁ గౌశలముఁ దీరుచేసికొనిన వి
ద్యాలలితుఁ డతఁడు కృతియై
కాలము నెదురుకొనె నోరుఁగలు నార్జింపన్‌.
39
ఉ.కాపయవీర నాయకతకల్మిని సంగడికాఁడు వేమపృ
థ్వీపతిబల్మి సాగిన యదీన బలోద్ధత జైత్రయాత్రకున్
దాపయి దైవ ముజ్జ్వలవిధా పరిణద్ధ నిశాతహేతి వి
ద్యాపటుతన్‌ ఘటింప దురమయ్యెను బెల్లుగ నోరుఁగల్లునన్‌.
40
మ.చెడుగుంబోకడ మూఁక పైఁబడఁ గురుక్షేత్రంబునన్‌ నాఁటి క
వ్వడినిన్‌ గృష్ణుఁ దలంచి వేముఁడును గాపానాయఁ డోర్గల్లునన్
గడముట్టించిరి వైరివారము; నడంగంజేసి రవ్వారి సం
దడి; సాఁగెన్‌ నిజపక్షశంఖజయనాదస్ఫోట మాటోపమై.
41
చ.తనకనుసన్నకుం గడచిదాఁటిన సింగమునైనఁ బట్టి యూఁ
పిన పెనుజోదు; తన్ను వలపించిన యెవ్వనికేనిఁ బ్రాణమి
చ్చిన నెఱసాదు; తెల్గుసిరి చిందినఱేఁడు ప్రతాపరుద్రుఁ డె
క్కిన మహితాసనంబు చెలఁగెన్‌ విలసన్మతి కాపనేతకున్‌.
42
వ.ఓరుఁగల్లురాజ్యపీఠాధిష్ఠితుండగు నాఱేఁడు మఱియు విక్రమించి తెలుంగాణెమ్మునఁ బలుసీమలు స్వాయత్తము గావించుకొనియె; మెదుకుసీమ, కైలాసకోట, భువనగిరి మున్నగుప్రాంతము లెల్ల నాకాపావనీశ్వరు నేలుబడికి వచ్చి యందగించెఁ; దన రాజ్యమునకు దక్షిణమునఁ గృష్ణాతరంగిణియు నాగ్నేయమ్మున గుండ్లకమ్మయు సరిహద్దులుగనుండ నిర్ణిరోధంబుగా నాతండు పరిపాలనంబు నెఱపె.43
క.మును గాకతీశ్వరుల దొర
తనమునఁ గలనేలయెల్లఁ దనరాచఱిక
మ్మున లే దనుకొఱఁత యొకటి
వినా వెలితిలేదు కాపవిభునేలుబడిన్‌.
44
గీ.ఎడఁదపండిన యా తెన్గుపుడమిఱేఁడు
కడలికరడులఁబోనికాంక్షలకుఁ బోక
తాను బట్టినదానఁ బెత్తనము నెఱపి
ధరణినెల్ల స్వధర్మతీర్థము నొనర్చె.
45
వ.కాపభూపాలునేలుబడి యిట నిట్లు సాగుచుండుటయు నట దౌలతాబాదురాజ్యంబున ‘నలావుద్దీన్‌ హసన్‌సా గంగు బహమనీ’ పట్టాభిషిక్తుం డయ్యె; నాతండు -46
మ.తలఁపుల్‌ పెంపుగ నన్యరాజ్యముల కుద్దండించుచున్‌ దండయా
త్రలు సాఁగించి పరాళినొంచి వెరవారం బెంచె రాజ్యంబు; నం
తలు వీరుండును గాపనాయక సముద్యద్రక్షణోదగ్రమౌ
తెలుఁగాణెంబును దేఱిచూచుటకు సందేహించె భీ మందుఁడై.
47
వ.గడుసరియగు నబ్బహమనీ కాపయతో నెయ్యంబు నెఱపినట్లు మెలంగుచుఁ దూర్పుదెసనుండి యెప్పుడో ముట్టడించుటకు వయిపువాటములు కనిపట్టుచుండె; నంత -48
క.ఒకట నకస్మా దుద్ధృత
సకలాయుధకరులు రాజ్యసముపార్జన కౌ
తుకులు తెలుంగాణెముఁ బూ
నికి ముట్టడిగొనిరి బహమనీవిభునిభటుల్‌.
49
వ.ఆ ముట్టడిలో నిందూరు కైలాసకోట మున్నుగాఁ గొన్ని రాజ్యభాగములు తురుష్కరాజాక్రాంతము లగుటయుం గాపయనాయకుం డధీరుండుగాక యప్పటి కుచితంబగుపాడిమెయి యబ్బహమనీ సులతానుతోఁ బొందుఁగావించుకొనియె -50
గీ.ఎదిరి బలియైనఁ దాను నున్మదుఁడుగాక
పొందుగోరుట ధర్మువుపొలుపుగాదె!
పిదప నదనెంచి పరునొంచి పేర్మిఁగనుట
కాదె రాజులనీతి విక్రమమురీతి!
51
గీ.కెరలి సులతాను పట్టిలాఁగిన తెలుంగు
పుడమిపడఁతిచెఱంగుఁ గొప్పు విడిపించి
వీని దుశ్శాసనతఁ ద్రుంచివేయుదు నను
తలఁపు కాపయభీముండు నిలుపుకొనియె.
52
గీ.అచిరకాలములో సమయమ్ము నెఱిఁగి
పట్టినతలంపుఁ గార్యరూపమునఁ బెట్టెఁ
దొలఁగినధరిత్రి కలికిచూపులు తొలంకఁ
బోయి కాపయనేత కెంజేయిఁ బట్టె.
53
ఉ.నేరుపుపెంపునన్‌ బహమనీపతి పౌజులతోడఁ జేయు న
ప్పోరునఁ బద్మనాయకులు పోటరులై రణధీరులై పుర
స్కారపథంబునన్‌ విజయసాధనసేయుట ముచ్చటించి యిం
పారఁగనిల్పెఁ గాపయ శిలాక్షరవాసిత శాసనావళిన్‌.
54
చ.తఱిఁగిన హైందవమ్ములగు ధర్మనిబంధనముల్‌ పునఃపురా
పరిగతవైభవోదయ విభాశుభమూర్తులఁ గందళింప సుం
దరముగఁ బెంపుసెందె నమృతప్రతిరూపమనః ప్రవృత్తిభా
స్వరుఁ డగు కాపభూవరుని చల్లని చక్కని మేలియేల్బడిన్‌.
55
వ.అక్కాపమహీపాలు ననంతరము త్రిలింగసామ్రాజ్యకమలాగ్రైవేయకంబునం బ్రోలయవేమారెడ్డి యొక సముజ్జ్వల మణి.56
ప్రోలయవేముని పాకనాటిరాజ్యస్థాపనము
సీ.సకలాంధ్రమునకు నేలికవీరరుద్రుని । పరిపాలనమునాఁటి పాటవమ్ము
తొలియుద్యమమున దారులుచూపి నడపిన । ముసునూరిప్రోలయ్య మొక్కలమ్ము
నోరుగల్లున శాత్రవోద్ధతిఁ గెడపిన । కాపావనీపతి కత్తిపదను
పాషాణమందుఁ బీయూషమ్ముఁ బొంగించు । గంగదేవుని యంఘ్రికమలరజము
 
గీ.సత్త్వమసృణమ్ము శంభుదాసకవికవిత । కలయ నొక్కమనోహరాకార మెనయు
రెడ్డిప్రోలయవేము కీర్తి భవనమునఁ । తెలుఁగువారి కిహాముత్రఫలము విందు.
57
మ.గణరాత్రంబు లహర్దివంబులును దీక్షాలక్ష్మితుండైన వే
మునిడెందంబునఁ జేర దొండొకతలంపున్‌ నాఁడు; నిండారు ద
క్షిణదిగ్భాగము ‘పాకనాట’ ననురక్తిన్‌ రెడ్డిసామ్రాజ్యసం
స్థ నఖండస్థితి నిల్పఁజూచునభిలాష మ్మొక్కఁడే తక్కఁగన్‌.
58
చ.అకృతకభక్తిమైఁ బ్రభుజయార్థిత మేనులు దాఁచుకోని సై
నికులను వేనవేల నవనీపతి వేముఁడు సేకరించి వా
రి కొకకొఱంతలేక సవరించి యధీనతలోనఁ జేర్చియుం
చుకొనె భవిష్యదాహవరుచుల్‌ మదిఁ బెంపయి తీవరింపఁగన్‌.
59
చ.తన సమరోద్యమమ్మునకుఁ దమ్ములు నన్నయుఁ దోడునీడలై
కనఁబడ ధర్మవేమమహికాంతశిఖామణి దక్షిణాంధ్రమే
దినిపయి జైత్రయాత్రకు మదిందలఁపై యొకనాఁడు ఘోడెరా
యని గురుదేవుదర్శనము నందెఁ గృతాంజలిబంధుఁ డాదటన్‌.
60
సీ.దొరయౌచు సిరిమలతూర్పువాఁకిలి నేలు । త్రిపురాంతకుని కృపాశ్రీకి నెలవు
అంబదేవస్వాంతరంగ పంకజ కుట్మ । లోద్యానమునకు భానూదయంబు
పట్టిసపుర పాశుపతపీఠ నివసదం । తేవాసితతికి నాందీకరుండు
వేదశాస్త్రపురాణ విద్యావనీవీథి । కాంతర్విహారి పంచాస్యవిభుఁడు
 
గీ.రాజనీతికి ధర్మవర్తనము నేర్పి । జగము నలరించునట్టి యాచార్యమౌళి
యీడులేనిమహాయోధు ఘోడెరాయ । గంగదేవుఁడు కరుణాప్రసంగుఁ డపుడు.
61
వ.వేమేశ్వరు నాశీర్వదించి కూర్చుండ నభ్యనుజ్ఞ యిడుటయు నతండు వినీతుండు ఘోడెరాయదేశికోత్తమున కిట్లు విన్నవించె -62
క.“శ్రీగురుదేవ శుభాశీ
రాగమమంత్రాక్షతముల కౌదల నిడి యు
ద్యోగింప శిష్యవితతికి
లోఁగని కర్జంబు లవనిలో లే వెందున్‌.
215
ఉ.కూడినదానితోఁ దనియఁగూడదె! యెక్కడ లేనియాస ముం
దాడఁగ సర్వరాజ్య మొకఁడై భుజియించుతలంపు గల్గియు
న్నాఁడఁ; దదాశ నీదయవినా నశియింపఁగ దారిలేదు; కేల్
మోడిచి కొల్తు శాంతిసుఖముల్‌ దయసేయుము నాయెడందకున్‌.
64
వ.మహాత్మా! యిచ్చోటికి నావచ్చుటకుం గారణము దక్షిణదేశ విజయయాత్రారంభంబున నాచార్యునాశాస్యంబుఁ బడయు నభిలాషయ; కాని, యజిహ్మబ్రహ్మవర్చసప్రసన్నంబైన గురువదనారవింద మరసినపదంపడి నా వాఙ్ముఖంబు మఱియొకతీరుం బట్టుచున్నయది నాకుం గర్తవ్య మాదేశింపుఁ” డని వేఁడుకొనుటయు నాఘోడెరాయగంగదేవుండు ప్రోలయవేమభూవరునివంక వాత్సల్య సంపత్సమార్ద్రంబగు చూపు నిగిడించి జటిలహాస ప్రరోహపురస్సరంబుగా నిట్లు వచించె -65
మ.ఒకసేనాగణశక్తితోఁ గడఁగి యుద్యోగింప రాగించు భౌ
తికసామ్రాజ్యమె లోఁగఁజేసికొనవైతే నింక శ్రద్ధాతపో
ధిక నిష్ఠాభినివేశగమ్యమగు శాంతిశ్రీసుధా రమ్యకుం
డిక నీచేతికి నందునే! గడుసురెడ్డీ! దొడ్డయాశాగతుల్!
66
చ.అహితుల నుక్కడంచి రుధిరాన్నము మెక్కుతలంపులేని నీ
మహితమతంబుతో నిపుడు మాయెద యేకముకాదు; మాతృదే
శహితలసన్మతిన్‌ స్వమతసంగ్రహణమ్ము స్వజాతిధర్మసం
గ్రహణముగాఁ గడంగిన పరప్రతిహింస యహింసయే యగున్‌.
67
ఉ.ప్రోలయకాపయల్‌ మతినిరూఢులు ధీరతమై నరాతిజం
బాలపుగోతిలో గళముబంటిగఁ గ్రుంగి యొఱంగురాజ్యల
క్ష్మీలసమానధర్మగవిచిక్కులు వాపిరి; నీవు తత్పరీ
పాలనబద్ధకంకణ తపస్సుకృతంబున కుద్యమింపుమీ!
68
ఉ.అంగబలంబు నర్థబల మాధృతరాష్ట్రజనాభిమాన సం
సంగబలంబునున్‌ గదపఁజాలని కంబములై తగన్‌ జగ
త్రాంగణవీథి రెడ్డినృపరాజ్యరమాసతికి న్నివాస మె
న్నంగల యొక్కవజ్రభవనంబును నిల్పు మనల్పవైఖరిన్‌.
69
గీ.అనుచుఁ గోమటివేము హృదంతరమున
రవులు కాంక్షాగ్ని నివురూది రాఁజుకొలిపి
దేశకాలసంవేదియౌ దేశికుండు
వెండి యిట్లు వచించె నవ్విభునిఁ గాంచి.
70
వ.వేమా! రెడ్డిసామ్రాజ్యసంస్థాపనం బన్న ధర్మసామ్రాజ్యము నిలుపుటగాఁ దలంపు; మిట్టిసమయంబున నీ వంటివీరుల కేరడంబు ధర్మాఘాతమునకు హేతు వగును; నృపాలుండు యద్ధర్మావలంబి ప్రజలు తద్ధర్మావలంబు లగుదురు కావున -71
చ.అటు తెలుగాణముం బువులయం దిడి హైందవధర్మసింధు వు
త్కటగతిఁ బొంగులై పొరలఁ గాపయభూపతి రాజ్య మేలు; నీ
విటుదెసఁ బాకనాఁటిధరణీశత రెడ్డిమహాధిరాజ్య సం
ఘటన మొనర్పుమీ! బహుముఖప్రతిదారణ హేతినైపుణిన్‌.
72
వ.అని పలికి యూరకుండిన ఘోడియరాయమౌని కటాక్షంబున బద్ధుండై నిబద్ధాంజలిపుటుండగు వేమవిభుండు -73
క.ఇది యొకయుపదేశం బి
య్యది యొకయాదేశ మిదియు ననుశాసన మి
య్యదియగు నాచార్యులయెద
మొదలం గల యాశిషం బమోఘము నాకున్‌.
74
గీ.ఒక్కసంశయ మెడలించి, యొక దురాశ
మొదలు ఖండించి, శౌర్యంపుఁబదను పెంచి
ధర్మరక్షణదృష్టిఁ బ్రత్యగ్రమైన
యొక్కయుత్తేజ మొసఁగు గురూదితమ్ము.
75
వ.అని వచించి హర్ష బాష్పబిందూద్గమసుందరమ్మగు కన్నుంగవచే గంగదేవగురుచరణుల యడుగుఁదామరల నద్దుకొని తదనుజ్ఞాతుం డద్దంకిఁ జేరుకొన్నవాఁడు -76
శా.ప్రాణప్రాణములౌసహోదరు లుదారస్ఫారతేజోనిధుల్
నానాయుద్ధకళారహోవిదులు సైనాపత్యవైయాత్యముం
బూనన్‌ దక్షిణదేశముం గొను తలంపుల్‌ లోన ఱంపిల్ల వే
మానాయం డెదురొత్తె రాణువలఁ; గంపం బెత్తె దిగ్భిత్తికల్‌.
77
సీ.అవసన్న సమదశాత్రవుఁడు బాహాబల । శ్రీనిధి ‘యన్నసేనాని’ యొకఁడు
‘కురుమలూరి’ పురంబు పరిపాలకుండైన । ‘మల్ల’ సేనానేతృమణి యొకండు
తండ్రిచాటునను గుప్తమగు విక్రమదీప్తి । దృప్తుఁడౌ ‘ననపోతరెడ్డి’ యొకఁడు
తన మేనమామ పుత్రకుఁడు శౌర్యోజ్జ్వల । ద్రేఖాకుఁడగు ‘నూకరెడ్డి’ యొకఁడు
 
గీ.జైత్రయాత్రను దనకు బాసట యొసంగ । వేమభూమిబిడౌజుండు వీరమౌళి
యభినవంబగు రెడ్డిరాజ్యమ్ము నిలుప । దాడి వెడలించె నరినికృంతనమనీష.
78
సీ.దవుదౌల నుండి వేమవిభు నశ్యశ్రేణి । డెక్కచప్పుడుల గుండియలు వ్రస్సి
పోరితమ్ములఁ గాఁకదేఱిన రెడ్డివీ । రుల గాలితాఁకునఁ దలలు వ్రాలి
సకలాశలఁ గదల్చు సమరభీకరభేరి । యులివులఁ జెవుల డప్పులును బగిలి
చదలు రాఁచుకొను న మ్మదపుటేనిక చాలు । నరసినంతన యసూత్కరము లొరఁగి
 
గీ.సమరవీథిని హతశేషశత్రుతతికిఁ । గరుణ గదురంగ శరణమ్ముఁ గనికరించి
యసదృశపరాక్రమమునఁ బర్యాప్తుఁడైన । రెడ్డివేముండు పరపాళి నొడ్డి నిలిచె.
79
క.తనవేయుచున్న యనుపద
మునకున్‌ జయలక్ష్మి ముందుముందయి నీరా
జన భాజన హస్తాంభో
జనియై వేమునకుఁ జెప్పె స్వాగతవాణిన్‌.
80
క.తుఱఁగలిగొను గురుదేవుని
కరుణకు నిరవగుచు సమరకార్యము జయబం
ధురమై దేసటి వేమే
శ్వరు డెందంబునకుఁ జలువచందన మలఁదెన్‌.
81
మ.గిరిదుర్గంబుల నొక్కఁడొక్కఁడును లొంగెన్; బాకనాఁటన్‌ స్వతం
త్రరమాప్రాజ్యము రెడ్డిరాజ్యమును సంస్థాపించువేమావనీ
శ్వరుపైఁ గొల్వున సర్వపండితుల యాశాస్యప్రసూనాక్షతల్
కురిసెన్‌; ఘోడియరాయదేవఋషివాకుల్‌ గాఁగ సత్యార్థముల్‌.
82
వ.మ్లేచ్ఛాబ్ధికుంభోద్భవుండై దక్షిణదేశంబు సర్వం బాక్రమించి యేకరాయస్థాపనాచార్యుండు నేకసింహాసనాలంకారుండు నగు కోమటి వేమభూమీపతి తనచే నాక్రమింపఁబడిన దుర్గంబు లనుజ తనుజ బాంధవ సుహృజ్జనంబుల కిచ్చి వారిచేఁ బాలింపఁజేయుచుఁ దాను జుట్టపుమేరు వనుపేరు వడసె; నతం డాక్రమించినవి ధరణికోట, వినుకొండ, బెల్లముకొండ, కొండవీడు మున్నయిన యశీత్యధికదుర్గంబులు కలవు. ధర్మపతిష్ఠాగురుండు, నపరిమితభూదానపరశురాముండు, ననవరతపురోహితకృతసోమపానుండు, హేమాద్రిదాననిలయుండును, ఘోడెరాయగంగ గురుకృపాస్థాపితసామ్రాజ్య సముద్దీపితుండును, నియమవచ్చేతస్స్థ మృత్యుంజయుండు నగు ప్రోలయవేమారెడ్డి యసాధారణుండు -83
సీ.శ్రీమత్పరాక్రమక్షేత్రమ్ము పంటవం । శము కళ్ళమున రాజనములరాశి
యన్నమాంబా ప్రోలయాఖ్య దంపతి గర్భ । నీరనిధాన మణీశలాక
హరివంశకావ్యబంధుర కవిత్వోదాత్త । సత్త్వోపబృంహితోచ్చతరకీర్తి
శివపదద్వంద్వైక సేవాఫలాహూత । భూసురాశీఃపుష్ప పుణ్యమూర్తి
 
గీ.శ్రీశిలోచ్చయాహోబలక్షేత్ర విహర । దఖలయాత్రిక భక్తకోట్యంతరంగ
పట్టభంగపథారూఢ పరమసుగతి । విమలధర్మోల్లసత్కృతి వేమనృపతి.
84
క.హరివంశపు ముత్తెపునెఱి
సరిలో సూత్రమగు రెడ్డిచారిత్రం బీ
ధరణి గలయంతకాలము
తిరమై కొనసాఁగుఁ దెనుఁగుదేశపు వెలుఁగై.
85
అనపోతారెడ్డి : కొండవీటిరాజ్యము
మ.తనకున్‌ దత్తకుమారుఁడైన యనపోతారెడ్డి రాజ్యంబు పా
లనముం జేఁతకు నర్హుఁడౌటఁ గని యుల్లంబందు సంతృప్తిఁ జే
కొనె నాప్రోలయవేముఁ; డీతఁ డిఁక శక్తుండై వెసన్‌ స్వార్జితం
బున కత్యూర్జితమౌ ప్రతిష్ఠ కొకసొంపున్‌ దెచ్చునం చెంచుచున్‌.
86
మ.ఒకయెడ దుర్జయుల్‌ సమరయోధులదాడియు, నొక్కవైపు సు
ప్రకటిత శౌర్యులౌ విజయపట్టణవీరులు సేయుదాడి, వే
ఱొకదెస నక్కళింగవిమతోద్ధతయాత్రయు నొక్కఁ డొక్కఁడై
తికమకపెట్టఁజూచె రణధీరుని న య్యనపోతభూవరున్‌.
87
గీ.ఎత్తివచ్చినపరుల రాయిడికి నోర్చి
ప్రతిభటించెను సకలాహవమ్ములందు
విజయ మార్జించె ననపోతవిభువతంసుఁ
డరులు నిజవిక్రమమ్ముఁ గొండాటసేయ.
88
గీ.తఱచు శాత్రవదండయాత్రలకు లోఁగు
ననుచు ‘నద్దంకి’ వీడి యయ్యవనినేత
యరిదురాలోక గిరిదుర్గమైన ‘కొండ
వీడు’ దనరాచవీడుఁ గావించుకొనియె.
89
వ.నాటంగోలెఁ గొండవీటిరెడ్డిరాజ్యం బనుప్రసిద్ధి యేర్పడియె; నటు లన్నపోతారెడ్డి శూరుండుగా ధర్మవీరుండుగాఁ బేరు వడసె; నతనితరువాతఁ దత్సహోదరుం డనవేమారెడ్డి సింహాసనాసీనుం డయ్యె.90
అనవేముని వితరణము
మ.మనుశాస్త్రోదితరీతి నెంచి యనవేమారెడ్డి ‘ధర్మాన్న వే
మన’గాఁ గీర్తితుఁ డయ్యె దేశమున; సంపద్వైభవప్రీణితా
వనిదేవోత్తమకోవిదుండయిన భూపాలుం డతం డన్నకం
టెను దా మిన్నయనంగ నేలుబడి నూనెన్‌ దానతాత్పర్యుఁడై.
91
సీ.అనపోతవిభుమౌళి యనుఁగుసోదరియైన । దొడ్డాంబికకుఁ గన్నబిడ్డఁ డగుట
మేనమామకొమార్తె యౌనన్నమాంబను । బరిణయం బాడినవరుఁడు నగుట
మాతామహస్థాన మహితవైభవ భోగ । సుచిరానుభవకృతజ్ఞుండు నగుట
ధర్మానపేతరాట్తంత్ర విజ్ఞాన ని । ర్వహణకళా కుశాగ్రమతి యగుటఁ
 
గీ.దాను గాటయవేముండు - మేనమామ । యైన యనవేమునేల్బడియందు నింత
వెలితిరాకుండ వేయికన్నులను నరయ । వారి బాంధవ మది చక్కఁ బరిమళించె.
92
శా.శ్రీశైలంబుననుండి పెంపెసఁగి యాసింహాచలం బాంధ్రధా
త్రీశుం డయ్యనవేముఁ డేలెఁ గృతబుద్ధిన్‌ ధర్మయుద్ధక్రియా
వేశున్‌ బెద్దనమామిడన్నసుతు నుర్విన్‌ మంత్రిగాఁగొల్చె స
ర్వాశావాసిత కీర్తి కాశకుసుమారామాభిరామమ్ముగన్‌.
93
చ.అతఁడు వసంతరాయబిరుదాంచితుఁడై ప్రతివత్సరంబు నూ
ర్జితగతిమై మధూత్సవము సేఁతలఁ జల్లిన చంద్ర చందనా
తతమృగనాభికాగురుపదార్థపరంపరఁ బృథ్వియొండె కా
దతిశయరీతి ‘గంధవతి’ యయ్యె విహాయస మప్రతర్క్యమై.
94
కుమారిగిరి : వసంతరాజీయము
గీ.అన్నవేముని పాలనానంతరమ్ము
రాజ్యపదభోగి యగు కుమారగిరిరెడ్డి
రెడ్డిసామ్రాజ్యరమకు శరీరమైన
విమతభీముండు కాటయవేముఁ డాత్మ.
95
మ.అవనీనేతలలోఁ గుమారగిరి భాగ్యశ్రీగతిం జెప్పి చె
ప్పవలెన్‌ వేఱొకదాని; నుద్ధతరిపువ్రాతాసు వాతాశనో
త్సవసమ్మర్దఫణావిమర్దన గరుత్మన్మూర్తియౌ కాటవే
మవిభూత్తంసునితోడిబాంధవము సామాన్యంబె! యాఱేనికిన్‌.
96
మ.అకలంకార్థ సహస్రధాభినయ విద్యాకౌశలీధామ యౌ
‘లకుమాదేవి’ హరిప్రియాసదృశ లీలారూప నాస్థానలా
సికగాఁ గాంచుచు నక్కుమారగిరి సుశ్రీనాట్యవేదార్థ సా
రకళాచర్వణధూర్వహత్వ మెసలారంగా వినోదించెడిన్‌.
97
గీ.భరతముని భోజదేవాది పండితోక్తు
లరసి యభినయశాస్త్రంబుఁ దఱచి రచన
చేసె సుకృతి ‘వసంతరాజీయ’ మనఁగ
రాజసుందరుఁ డగు కుమారగిరిరెడ్డి.
98
మ.వినుతోదారత నక్కుమారగిరి యర్పించెన్‌ గృతం బెంచి య
మ్మనుతుల్యుండగు కాటయప్రభుని వేమారెడ్డి కత్యాప్తబం
ధునకున్‌ మంత్రికి రాణ్మహేంద్రనగరీ దుర్గాదిమత్ప్రాగ్ధరి
త్రిని తన్మిత్రకృతాపదాన చరితార్థీభూతచేతోగతిన్‌.
99
వ.కాటయవేముని రాజ్యతంత్రజ్ఞత యెంతటిదో యాతని సంస్కృతభాషావైదుష్యంబు నంతటి దంట కాతండు కాళిదాసమహాకవికృత నాటకత్రయంబునకు రచించిన కుమారగిరిరాజీయాఖ్య వ్యాఖ్యయే సాక్షి.100
పెదకోమటివేముఁడు
గీ.కొమరగిరిరెడ్డివెనుక నక్కొండవీటి
రాజ్యరత్నకిరీట ధారణచణుండు
పెద్దకోమటివేమ భూవిభుఁడు ప్రజలఁ
దనియఁ జేసె సమర్థపాలనముకలన.
101
శా.శ్రీనాథోదితకావ్యనైషధకృతిస్వీకర్తయై యర్థిసం
తానాభీప్సితకార్యనిర్వహణచింతారత్నమై రెడ్డిధా
త్రీనాథాభ్యుదయానుశీలనకళాతృప్తాత్ముఁడై వేమభూ
జానిన్‌ బెద్దయసింగధీసచివుఁ డిచ్చం గొల్చె నాసక్తిమై.
102
వ.అ ప్పెదకోమటివేమారెడ్డి కొల్వున నుండి వామనభట్టబాణుండు వేమభూపాలచరితాదిసంస్కృతగ్రంథంబులు రచించె; శ్రీనాథుండు తదాస్థానంబున విద్యాధికారిగా నర్చింపఁబడియె -103
క.దాత సమస్తకళాభి
జ్ఞాత మహేశ్వరపదాంబుజధ్యాత హిత
శ్రోత పెదవేమధరణీ
నేత యతం డేలె ధర్మనియతిరతుండై.
104
వ.కుమారగిరి యనంతరము కొండవీటి కొడయండగు పెదకోమటివేముండు కాటయవేముని రాజమహేంద్రవరరాజ్యమ్ము నాక్రమింపంజూచి చేసినజైత్రయాత్రలతోఁ గావలసిన యిరువురకును లోపలికలఁతలు పొడముటంజేసి యఖండంబగు రెడ్డిరాజ్యంబు రెండుచీలిక లయ్యెఁ; బెదకోమటివేమభూపతికి రాజమహేంద్రవరరాజ్యంబు దక్కలేదు; కాటవేముం డట వీరశయనంబునందుటయు నతనికుమారుని కుమారగిరిని రాజుగాఁ జేసి మహామల్లుం డల్లాడరెడ్డి కొంతకాల మేల్బడి నెఱపెఁ; అల్లాడరెడ్డికుమారుండు వీరభద్రారెడ్డి నిజాగ్రజుండగు నల్లయవేమారెడ్డి సాహాయ్యంబుఁ బడయుచు బెండపూడి అన్నామాత్యుండు తన కమాత్యుండుగా రాజమహేంద్రవర రాజ్యపాలనాధికారి యయ్యె; నచ్చట -105
ఆ.వె.కొండవీటి పెద్దకోమటివేముండు
నమరపతికి నతిథియైనపిదప
నట్టిపండితేంద్రు నాత్మజన్ముండైన
‘రాచవేముఁ’ డందె రాజపదము.
106
గీ.ప్రజల బాధించె వృద్ధగౌరవము నొంచెఁ
బురిటిమంచములకుఁ బన్ను పుచ్చుకొనియెఁ
జెఱకుతుద వెన్నువలెఁ బుట్టి చెఱచెఁ గొండ
వీటియేల్బడిపస రాచవేమరెడ్డి.
107
గీ.అతఁ డొకనిమిత్తమాత్రమ; యంతెకాని
విజయపురిఱేండ్ల బహమనీవిభుల బహుళ
సమరయాత్రలు జాతివైరములు పెరిఁగి
యచటిరడ్డులయేల్బడి యడలువడియె.
108
పోతురాజుకటారి
మ.అనుజన్ముండగు వీరభద్రవిభుచే నల్లాడవేముండు పా
లన సేయించెను రాణ్మహేంద్రవరలీలారాజ్య; మాపెంపు నెం
తనివర్ణించుట! వారి దిగ్విజయ సంధావ్యగ్ర శౌర్యాగ్ని కిం
ధనమైపోయె నరాతివీరఘటితోద్యన్ముష్కరారంభముల్‌.
109
శా.సారోదార తరంగశీకర సుధాసంబంధవద్గౌతమీ
తీరోత్సంగిత రాణ్మహేంద్రపురధాత్రీ దేవతామూర్తిఁ జె
ల్వారం గొల్వఁగఁ గొండవీడునకు దవ్వైవచ్చి శ్రీనాథుఁ డా
ధారంబయ్యెను వీరభద్రమహినాథ శ్రీయశోవల్లికిన్‌.
110
ఉ.తీవరమెంచి మున్‌ వెలమధీరుఁడు లింగమనీడు మించి యు
ద్ధావనిఁ గొండవీడు గెలుపంది తమిన్‌ విజయాంకదీర్ఘ శం
పావినిశాతమౌ నొకకృపాణము రెడ్లకుఁ బ్రాణభద్రమున్
దేవరకొండకుం గొని చనెన్‌ గనదూర్జిత శౌర్యమూర్తియై.
111
ఆ.వె.నాఁడు రెడ్లకొండవీడునఁ బరదురా
లోక ధాళధళ్య లోలదీప్తిఁ
బొలుచు ‘నందికంత పోతురాజు కటారి’
నేఁడు వెలమదొరలజాడఁ జేరె.
112
మ.ఉరుబాహాబలరెడ్డివంశభవ వీరోపార్జితంబైన త
త్కరవాలం బటు వెల్మజోదులకుఁ గాఁగా, లోన నల్లాడ భూ
వరపుత్త్రుల్‌ తలవంపుగాఁ దలఁచియున్‌ బాటించి సాధించు న
త్తఱికిన్‌ వేచిరి పద్మనాయకవిభుత్వం బప్రధృష్యంబుగన్‌.
113
క.లోకజ్ఞుఁడు శ్రీనాథ మ
హాకవి యారెడ్డిఱేండ్ల యాంతర్యమ్ముం
జేకొని కృతజ్ఞతన్‌ గా
ర్యాకలన కళా వినిర్వహణ తత్పరతన్‌.
114
గీ.పోయి దర్శించె నల పద్మనాయకాన్వ
వాయ కౌస్తుభమణిని సర్వజ్ఞసింగ
బుధునిఁ గవితారసార్ణవ పూర్ణవవిధుని
నఖిలశాస్త్రకళాప్రవేశాతిరథుని.
115
క.పరశివ కపర్ద నిపత
త్సురధుని కెనయైన దివ్యసుందర కవితా
స్ఫురణమ్మున శ్రీనాథుఁడు
సరసుం డవ్వెలమదొరకు సంతోష మిడెన్‌.
116
ఉ.దేవరకొండలో వెలమధీరుఁడు ‘లింగమనీడు’ రావు సిం
గావనినేతకుం జెలియు నాతనిపట్ల వినీతుఁడై తదా
జ్ఞావిధిలో మెలంగు నను చాయనెఱింగి నిజేప్సితంబు నా
భూవరుసన్నిధిన్‌ వినిచెఁ బొందికఁ గర్జముఁ జక్కఁబెట్టఁగన్‌.
117
గీ.సుకవితాస్నేహదీప్తి సూచికయుఁగాఁగఁ
బోతురాజుకృపాణముం బుచ్చుకొన్న
ధీరుఁ డల్ల శ్రీనాథుని తెల్వియందు
వెలమఱేండ్ల గుణజ్ఞత తొలకరించె.
118
ఆ.వె.రాణ్మహేంద్రవరపు రాజ్యంబు చెల్వారఁ
గత్తితెచ్చి యిచ్చెఁ గవివరుండు;
వేమధరణివిభుఁడు, వీరభద్రారెడ్డి
వీడుకొనిరి కొండవీటిఋణము.
119
ఉ.వైదికధర్మనిర్వహణవైభవగాథ త్రిలింగధాత్రి గా
ధోదకమత్స్యమై సడలుచుండిన కాలమునందు రెడ్డి భూ
మీదయితుల్‌ దయాగుణసమీహితచిత్తులు తత్పునః ప్రతి
ష్ఠాదరవృత్తులై సితయశోమృతనిర్ఝరి నింపి రెల్లెడన్‌.
120
రాచకొండ వెలమప్రభువులు
క.పరపరిపాలన మనువా
గురఁ దొఱఁగి స్వతంత్రదీప్తిఁ గొనిన త్రిలింగ
స్థిరపై వెలసిన పలు రా
చఱికమ్ముల రాచకొండసంపద యసదే!
121
క.కాకతిగణపతిదేవ మ
హీకాంతుని కొలువుచేరి యెసఁగిన మహిత
శ్రీకులలో రేచర్ల
ప్రాకటవంశమున కొక్కరాణ తనర్చున్‌.
122
మ.తిరమౌ రుద్రమదేవియేల్బడి నరాతివ్యూహ నీహారమున్
దెరలంజేసిన వెల్మవీరుఁడు ‘ప్రసాదిత్యుండు’ పెంపొంది యు
ర్వరపై నిండుగఁ బద్మనాయకలసద్వంశంబుఁ బండించె భా
స్వరుఁడై మించెను గాకతీయనృపరాజ్యస్థాపనాచార్యతన్‌.
123
గీ.అల్ల కాంచీపురీవిజయమ్ములోన
దాచనాయడు తాను బ్రతాపరుద్ర
పతికి రణవీథి మేటితోడ్పాటు నిచ్చె
వెలమవంగడమున కొక్కవిలువఁ దెచ్చె.
124
గీ.దారుణ తురుష్కరణవీథి ‘దాచనేని’
తనయుఁ డగు సింగముండు ప్రతాపరుద్ర
నేతకు సహాయుఁ డగుచు నశీతివరము
లందె; నాఱేని మెప్పుల నందుకొనియె.
125
ఉ.సంగరవీథులన్‌ నిజనిశాతకృపాణ వినోదఖేలనా
స్తంగమితారియై విజయసాహసుఁడై రహి సంచరించి శ్రీ
సింగమనీడు కాపవిభుసేఁతకు బాసటయై స్వతంత్రతా
రంగమునందుఁ దా నొక ధురంధరభూమిక నంది రాజిలెన్‌.
126
మ.అరినిష్కాసనవేళఁ గాపయకుఁ దోడై పోయి, యావెన్క రా
జ్యరమాభోగముపైఁ దలంపు సహజంబై యుండుటంజేసి సం
గరముల్‌ చేసి పరాక్రమించి బహుదుర్గశ్రేణి నార్జించెఁ ద
త్పరభావంబున వెల్మసింగముఁడు స్వాతంత్ర్యంబు నిండార్చుచున్‌.
127
గీ.తరముమీఱిన రాజ్యవిస్తరణ వాంఛ
జల్లిపలికోట ముట్టడి సాఁగునపుడు
సింగమవిభుండు సోమవంశీయులైన
క్షత్త్రియుల కత్తివాత విశ్రాంతుఁడయ్యె.
128
వ.సింగమనేనియుత్సంగంబునఁ బెరిగిన తనయద్వయంబున ‘అనవోతానేడును, మాదానేడును దండ్రిని మించిన జోదులై నిజపితృనిర్యాణమునకు నిమిత్తంబైన చంద్రాన్వయక్షత్త్రియసందోహమును మ్రందించి జల్లిపల్లిదుర్గంబు నాక్రమించి సోమకుల పరశురామ బిరుదాభిరాములై భాసిల్లిరి; వారిలో ననపోతానాయండు.129
ఆ.వె.‘అనుమగల్లు’ విడిచి యట రాజగిరిలోన
వెలమరాచఱికము వెలయఁ బెంచి
కెరలి యాక్రమించెఁ గృష్ణానదికి దక్షి
ణమునఁ గలుగుతెలుఁగునాఁ డదెల్ల.
130
మ.అనపోతావనినేత రాజగిరిరాజ్యంబెల్ల భోగించి త
న్పునకుం బోవక వంతులేనిబలవంతుం డౌట నోర్గల్లు కో
టను ముట్టన్‌ దమకించి కాపవిభు నొడ్డారించి యోడించె; జో
దునకున్‌ భోజ్యము రాజ్య మన్ననుడియందున్‌ లేవు స్నేహస్పృహల్‌.
131
మ.అటు లోరుంగలు పద్మనాయకనృపాలాధీన మయ్యెన్; శిరో
ఘటితాంజ ల్యుపరంజిత స్తుతివచఃకల్యాణులై వీరు లు
త్కటభక్తిన్‌ దనుఁ గొల్చుచుండఁగఁ దెలుంగా‍ణెంబు నేలెన్‌ సము
ద్భట శౌర్యోదయ దుష్ప్రధర్షుఁ డనపోతానాయఁ డూర్జస్వియై.
132
గీ.అతని తమ్ముఁడు మాదనాయఁ డను నృపతి
యన్నయానతిఁ బ్రాతినిధ్యమ్ముఁ బడసి
కోర్కి నిండార దేవరకొండ నేలె;
నటులు రేచెర్ల వెలమరాజ్యము తనర్చె.
133
వ.అనపోతానేని యనంతర మా వీరుని యాత్మజుండు ‘సింగమనేడు’ రాచకొండయేల్బడి కొడయం డయ్యెఁ; గుమారసింగభూపాలుం డనుపేరఁ బ్రసిద్ధుండైన యాతండు త్రిలింగదేశప్రభుత్వంబు నెఱపుటయకాక దేవభాషావైదుష్యంబున నఖండప్రాభవంబుఁ బ్రకటించె; కల్యాణ ధరణీపాలుండు సింగభూపాలుండు సర్వజ్ఞచూడామణియై ‘రసార్ణవసుధాకరం’బను నలంకారశాస్త్రగ్రంథంబును, ‘రత్నపాంచాలిక’యను రమణీయనాటికయును, శార్ఙ్గదేవుని సంగీతరత్నాకరమునకు సంగీతసుధాకరాభిధవ్యాఖ్యయు రచించిన విద్వత్కవియగుటయకాక, ‘చమత్కారచంద్రికా’ కృతిప్రణీత యగు విశ్వేశ్వరకవిని, నమరకోశవ్యాఖ్యాత యగు బొమ్మకంటి అప్పయార్యుని నిజాస్థానవిద్వాంసులుగా నుంచి సంభావించిన గుణజ్ఞుండు -134
గీ.రావుసింగమహీపాలు ధీవితాలు
దర్శనముచేసికొని శారదాస్తవంబుఁ
బలికె శ్రీనాథకవిసార్వభౌముఁ డతని
సాహితీప్రాభవమున కాశ్చర్యపడుచు.
135
ఆ.వె.రాచకొండ వెలమరాజ్యమ్ము సింగభూ
పాలుఁ డేలునాఁటి కాలమునకుఁ
బరమభక్తచక్రవర్తి పోతనకవి
రసకవిత్వసృష్టి ప్రాణయష్టి.
136
సీ.గోపాలశిశుమౌళి కుటిలకుంతలపాళి । వక్రోక్తిలీల రాఁబట్టినాఁడు
వ్రజబాలు సుషిరరావమున నవిచ్ఛిన్న । వాఙ్మహస్సులు గిలుబాడినాఁడు
వెన్నునితలనెమ్మిపించెమ్ములో వర్ణ । విన్యాసరుచిఁ గొల్లఁబెట్టినాఁడు
నవనీతదస్యువెన్నడి సమాసపువెన్న । పూసలు కొసరి కాఁజేసినాఁడు.
 
గీ.లేదుపో! తనకెక్కడి పేదతనము! । భాగవతరూప జాతరూపమ్ముధనము
నతఁడు రాసులువోసె సర్యాంధ్రజాతి । కారగింపుగ రసమయం బైనయాస్తి.
137
పర్వాంతము
క.వినిపించితిఁ బంచమ మీ
పునఃప్రతిష్ఠాఖ్య పర్వమును; సత్యముఁ జె
ప్పిన నబ్బా! యిది బిందువు
చినుకుట కదె! రెడ్డిరాజ్య సింధువునందున్‌.
 
శా.నాచే నీచరితప్రబంధ మిటు సందర్భింపఁగాఁ జేసి మై
త్త్రీచిహ్నంబుగఁ బద్మనాయక కులశ్రీవల్లభౌదార్య స
ధ్రీచీనంబుగ నిల్పనెంచితివి తండ్రీ! విక్రమోదాత్త శి
క్షాచండాశువు వెల్మవంగడ మనంగా నెయ్య మిట్లొప్పెడిన్‌.
 
పునఃప్రతిష్ఠా పర్వము - ఆంధ్ర పురాణము - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి - ఆంధ్రభారతి - కావ్యములు - ఆంధ్రపురాణము - ఆంధ్రపురాణం - ఆంధ్ర పురాణం మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) Andhra Puranamu - AndhraPuranamu - Andhrapuranam - andhra puranam - Madhunapantula Satyanarayana Sastry- AndhraBharati AMdhra bhArati - kAvyamulu