కావ్యములు ఆంధ్ర పురాణము శ్రీకృష్ణదేవరాయ పర్వము

ఆంధ్ర పురాణము
మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి

ఆంధ్రత్వ మాంధ్రభాషా చా
ప్యాంధ్రదేశ స్వజన్మ భూః
తత్రాపి యాజుషీ శాఖా
నాల్పస్య తపసః ఫలమ్‌.
“అప్పయ దీక్షితులు”

శ్రీకృష్ణదేవరాయ పర్వము
క.శ్రీరసిత మందహసిత
ప్రారంభవిధా నిరాదృతాద్యతనాంధ్ర
స్వైర చర త్కతిపయ కవి
ధోరణి! రసభరిత వాఙ్మధువ్రత సరణీ!
1
శా.శ్రీమన్మంగళ రంగనాథ పదరాజీవార్చన ధ్యాన రే
ఖా మాధుర్య మహావిభూతిమయ యోగస్రస్తుఁ డౌ జీవుఁ డు
ర్వీమాంగళ్యము ధర్మసౌరభముఁ బేర్మిన్‌ నిల్ప సర్వాంధ్ర ధా
త్రీ మందారము పూలపొత్తిళులు దిద్దెన్‌ కృష్ణరాయాభిధన్‌.
2
మ.కమనీయాకృతిమన్ముఖాంబుజ దళాగ్రం బద్ది ముద్దాడి, శం
ఖము చక్రంబును వ్యక్తమౌ చరణరేఖల్‌ కన్నులన్‌ దిద్ది, వ
త్సమునం దోఁచిన పుట్టుమచ్చఁ గని యాశ్చర్యమ్మునం గృష్ణులో
నమృతార్ద్రంబగు తల్లిడెందము యశోదానందముం బొందెడిన్‌.
3
చ.పెనుపు గడించుచున్‌ సవతిబిడ్డలు నల్వురిలోనఁ గొట్టవ
చ్చినయటు వచ్చు తద్భుజరుచిం గని పొంగుచు నాగమాంబ పు
త్త్రునకుఁ జిరాయురభ్యుదయరోచి రభంగ జయానుషంగముల్
తనుకఁగ నాసగూరిన యెదన్‌ నెఱపున్‌ గురుదైవతార్చనల్‌.
4
చ.తటమట సేయఁగా సవతితల్లి ప్రియోక్త్యనుపానపూర్వ ము
ద్భట విషపాత్ర చేతికి నెపం బిడి యిచ్చిన నందుకొంచు నాఁ
కట శితికంఠభావమును గల్గిన వేలుపువోలెఁ జేఁదు గ్రు
క్కిటఁ గొను వర్ధమానుఁ గవుఁగింట గణించె సవిత్రి పుత్త్రునిన్‌.
5
గీ.జనని నాగాంబ తనకూర్మి తనయు మనిచి
కనులు చెవు లొక్కడుగఁ జేసికొనుచుఁ బెనిచి
కీడుఁ దొలఁగించి సతము కాపాడ నతఁడు
ఫణిఫణాగ్రోజ్జ్వల న్మణీఘృణిగ వెలిఁగె.
6
మ.కనదిందీవరబంధు దీప్తు లొలయన్‌ గర్ణాంత విశ్రాంత లో
చనముల్‌ పూచిన తత్కుమారముఖ మాస్వాదింప నాగాంబ నె
మ్మన మాశించినవేళఁ గోరికి ఫలింపం జూచునో! మాతృ పా
వన పాదావనతోత్తమాంగుఁడగు నబ్బాలుండు శీలోన్నతిన్‌.
7
శైష్యోపాధ్యాయిక
సీ.నయనాంచలముల సన్నగఁ దోఁచు తామ్రరే । ఖలఁ జక్రవర్తి లక్షణముచెలువు
పరదార చరణ నూపుర నిక్వణము నెంచి । మాతృభావమ్మున మసలుతెఱవు
నాజానులంబి బాహాయుగ్మమున మాంస । లత పెంపు లొరయు చెల్వపుఁబసందు
నెవఁ డెద్ది యాసించి యేతెంచినను జేతి । కెముక లేకుండఁగా నిచ్చువిందు
 
గీ.తమ్మి విరిమొగ్గ విచ్చిన దళము లటులు । గొనము లీరీతి నాత్మశిష్యునకు విరియ
వేయి కరములతోఁ గృష్ణరాయు నొత్తి । మిత్త్రుఁడై తిమ్మరసు మంత్రి మెచ్చు నతని.
8
సీ.సువిశాల దీర్ఘ విస్ఫూర్తి నేత్రములకుఁ । జూపులలో సూక్ష్మ సూక్ష్మగతులు
వజ్ర కాఠిన్యమ్ము వక్షస్స్థలమ్మునఁ । జిత్తమ్ములోఁ బువ్వుమెత్తఁదనము
విగ్రహమ్మునఁ బ్రాంశు విశదభావంబును । గురువులయెడ వంగి కొలుచు భంగి
నడకలో స్వరములోఁ బొడము గాంభీర్యము । పేదవారలఁ జూచి ఖేదపాటు
 
గీ.పడుగుఁ బేకయుఁగా నేయఁబడిన యట్టు । లలరి దేహాత్మ గుణము లన్యోన్య మైత్రిఁ
గృష్ణరాయలలో నందగించుచుండ । నరసి యాశీర్వదించుఁ దిమ్మరసు గురుఁడు.
9
సీ.చదివినట్టులె యుండు సాహిత్య పాఠమ్ము; । సంగీతకళకు నాసక్తి నెఱపుఁ
జేసినట్టులె యుండుఁ జెలఁగి గుఱ్ఱపుస్వారి; । చిత్తమ్మునకు వచ్చుఁ గత్తిసాము
వినినట్టులే యుండు వేదాంతవాదముల్; । దండనీతులకు వార్తలకు మురియు
నలిగినట్లేయుండు నన్యాయముల యెడఁ; । జిఱునవ్వు మల్లియల్‌ కురియుచుండు
 
గీ.నరయుచున్నట్లె యుండు సుందరతరమ్ము । ప్రకృతి మంథరమైన శోభావిలాస;
మంతలోఁ దనలోనఁ దా నరసి మురియు; । నపుడు రాయలలోనఁ దిమ్మరసు మెఱయు.
10
సీ.దవుదౌల నిలఁబడి తగులమ్ము దిగనాడి । వ్యసనంబు లేడింటిపస లెఱింగి
మన మనాసక్తమై తనరఁ జతుర్విధ । మదనమార్గముల సంపదలు తెలిసి
యనభిషంగతఁ దంత్రమునెఱింగి శృంగార । యువతీయువకరీతు లవధరించి
యంతరంగముఁ బరార్థాభిలాషల నిల్పి । యష్టభోగముల తియ్యములు పట్టి
 
గీ.మెలఁగు నారాచబిడ్డ రాయలవయస్సుఁ । దెలిసి యాచట్టు సిగ్గువో దిటవుగొలిపి
వేడ్క డెందము పుష్పింప వీఁపుతట్టు । మంత్రిమాధవుఁ డల్ల తిమ్మరసుబుధుఁడు.
11
సీ.తలగ్రుచ్చుకొన్న ఱెక్కలనంటి పంటకా । లువఁ బవ్వళించు బాతువుల నరసి
మొనసి కళ్లానఁబోసిన కొల్చుఁ జేటల । విసరఁబాఱిన పొల్లువెంటఁ గాంచి
యొకకన్ను నిద్రవో నొకకంట మేల్కొను । నెలుఁగు సాలాగ్రమం దెసఁగఁ జూచి
వరిగింజనొకటఁ బల్వరుసఁ దోమెడు కుంద । రదన కెంబెదవి హొరంగుఁ దెలిసి
 
గీ.యవి వినూత్నకవిత్వ వర్ణ్యాంశములుగఁ । గృష్ణరాయ లెడందఁ బొంగినపు డతని
యభినవంబగు ప్రతిభఁ దిమ్మరసువిబుధుఁ । డరసి మోదాశ్రుకుందమాల్యములు విడుచు.
12
సీ.అతఁ డుచ్చరించు మహావాక్యములలోన । భావధ్వని వ్యంగ్యపరత మెఱసి
అతఁడు చూచిన చూపునందు హైందవధర్మ । మర్మజ్ఞతా రమ్యమహము తొనఁకి
అతఁడు వేసినయట్టి యడుగులో గజపతి । గతిఁ గ్రిందుసేయుపద్ధతి చిగిర్చి
అతఁడు నవ్విన నవ్వునందు నమ్లేచ్ఛమౌ । స్వచ్ఛపతాకికాచ్ఛవి తనర్చి
 
గీ.యతఁడు తన కౌఁగిటం జేరినపుడు చిటిలు । జాతిముత్తెపుసరులలో శైత్య మెంచి
తిమ్మరసుమంత్రి యంతరంగమ్ములోనఁ । గృష్ణరాయలదశ లపేక్షించుకొనును.
13
గీ.రాజనీతులు నర్థశాస్త్రమ్ములోఁతు
లరయఁ గఱపిన చిట్టిగంగన్నగురుని
యప్పుదీర్చినయటులు తిమ్మరసుగురుఁడు
రాయలసుబుద్ధి బోధవర్షమునఁ దడిపె.
14
గీ.మహితవిజ్ఞానతరణి యమ్మంత్రిమౌళి
నిజకరస్పర్శ హృదయనీరజము విచ్చెఁ;
గృష్ణరాయల కెలదేఁటిఱెక్కనల్పు
మీసములపొల్పువయసు క్రమ్మికొనివచ్చె.
15
వ.కృష్ణరాయ లటులు శుక్లపక్ష జైవాతృకుండుగాఁ బెంపునందుచుఁ బ్రజాహృదయవీథుల జ్యోత్స్నామహోత్సవంబుఁ గావించు చుండుటయు-16
మహామంత్రి గోవిందరాజుతో నేకాంతగోష్ఠి
ఉ.అంతట నొక్కనాఁడు సదనాంతరవేదికనుండి భోజనా
నంతరగోష్ఠిఁ దమ్ముని కరాంబుజ మిచ్చిన పచ్చకప్పురం
బింత గ్రహించి నోట ఫలియించుచు వీచినతమ్మితావి నే
కాంతము చూఁచి తిమ్మరసు కమ్రవచఃక్రమరంజితాస్యుఁడై.
17
మ.కులుకుం జిత్తముతోడ నిట్లు పలికెన్‌ “గోవిందరాజా! మహో
జ్జ్వల కర్ణాటధరిత్రి నేలుబడి దైవంబిచ్చు నూఁతన్‌ నిరా
కులమై నిమ్మకు నీరువోసినటు సాఁగున్; గాని, లోలో నెదో
తెలియంగాక యతృప్తియొండొకఁడు బాధించున్‌ నిదానించినన్‌.
18
మ.పరధర్మంబుల యొత్తిడిం గెడపి కాపాడన్‌ స్వధర్మైక త
త్పరమౌ నీ సకలప్రజావళి సమర్థంబై యిహాముత్ర భో
గ రసాభోగము లందుకోఁగలుగు; నీ కర్ణాటరాజ్యంబుఁ ద
త్పరమోదార నిదానసూత్రమునఁ గాదా నిల్పి రమ్మాధవుల్!
19
చ.ఎఱుఁగమిఁజేసి తా నొరున కేర్పడియుండిన ధర్మమందు మా
ధురి కల దంచు దానిదెస దూఁకిన రెంటికిఁ గాని చేటునం
బొరయదె! యీ ప్రజాతతి; ప్రభుత్వము దీనిని గుర్తెఱింగి తొం
దరఁ గొనకుండ స్వ స్వ విహితస్థిరధర్మము నోమఁగావలెన్‌.
20
చ.తలఁప ననంతముల్‌ భువనధర్మము; లొండుగఁ దోఁచి పాపపం
కిలమొనరించుతీరు పరికింతుము; లౌకికధర్మసంతతిన్‌
గలయికసేఁతకున్‌ నడుముకట్టుట చూడఁగఁ బాంచభౌతిక
ప్రళయమెకాని యభ్యుదయపాత్రము కా దది లోకయాత్రకున్!
21
గీ.భిన్నరుచికమగుచుఁ బెరుఁగు సాధారణ
ప్రజకు విహిత ధర్మ పాలనమున
మదులు తిరముగాక చెదరుట సహజ; మ
య్యదన రాచఱికపుఁ బదను వలయు.
22
చ.మతిగురులై మహాభ్యుదయ మంగళ సారథులై జగత్ప్రజా
ప్రతినిధులౌ మహర్షుల కృపావనధుల్‌ మన ధర్మశాస్త్ర సం
తతు; లవి చూపు శాసన పథంబున నెల్లరు సాఁగఁబోమి నే
తృతఁ గదలించు సత్ప్రభుతయేకద! తత్ప్రజకున్‌ శుభంబిడున్‌.
23
గీ.ప్రభుత ధర్మమునెడలఁ బ్రవక్తకమ్ము;
మఱి నివర్తక మగు నధర్మమ్ముపట్ల;
నా యెడలఁ జండమౌ నెండ కాయుఁగాక!
చూడఁగా, నది పరిణామ సుందరమ్ము.
24
ఉ.ఇంతకు నా వచించునది యేమనఁగా మన ఱేని కిట్టి సి
ద్ధాంతము లెవ్వియున్‌ దలకుఁ దట్టవు; చెప్పినఁ గిట్ట; వింక రా
ష్ట్రాంతర లబ్ధకీర్తి విభవాధికమౌ మన యేల్బడిన్‌ బ్రజా
సంతతి కీ యుపేక్ష యపచారముగా కుపకార మెట్లగున్‌.
25
గీ.తొంటి త్రోవకు సంస్కార ధూర్తమైన
కోవ కల్పింపఁ గూడని కోర్కి యేదొ
వీర నరసింహపతికి నావిర్భవించు
తీరు కనిపించు; నిది మేలి తెఱఁగు కాదు.”
26
మ.అనుచున్‌ సర్వశిరఃప్రధానుఁ డటు తానై యగ్రజుం డిట్లు చూ
పిన యాంతర్య మెఱింగి, సోదరుఁడు గోవిందుండు వందారు వ
ల్లన నీరీతి వినీతధీర మధురాలాపానురూప స్వరం
బున నారంభ మొనర్చె లోఁగల తలంపుందావు లూవాడఁగన్‌.
27
గీ.అన్న! సాగర గంభీరమౌ నెడందఁ
దొనఁకి వచ్చిన రత్నముల్‌ దొరకె నేఁడు
ధన్యమగు నీ సహోదరత్వమ్ము చనవు
కలిమి నీయెడఁ జెప్పుకోవలయు నొకఁడు.
28
గీ.అభిజన జ్ఞాన శౌచ శౌర్యానురాగ
మహితమై యొప్పు మీ మహామాత్యపదము
ననుపదము మెచ్చు రాష్ట్రప్రజాళి హృదయ
మధిపునెడల నవిశ్వాసవిధుర మయ్యె.
29
మ.పుయిలోటం గొని నేఁటిదాఁక నిటు మీ ముం దెప్పుడుం జెప్ప నా
రయనైతిన్; మఱి యీప్రభుత్వమునఁ బూర్వంబున్న సౌభాగ్యమీ
యయిదాఱేఁడులఁదొట్టి డిందువడు తీ రందందుఁ గన్పట్టు; నిం
త యథార్థంబును జెప్పుచోఁ బ్రజ లనుత్సాహుల్‌ విభుత్వంబునన్‌.
30
ఆ.వె.సారవంతమైన సచివత్వము - విభుత్వ
వృక్షమునకు స్కంధరక్ష యగును;
గాని, తల్లివేరుగా నున్న యేలిక
తీరు చెడుట చేటుఁ దెచ్చి పోదె!
31
ఉ.మీ గురుతామహత్త్వమున మేల్కొనుచున్న సహోదరుండనై
యేగతి ముచ్చటించుటకు నేని భయం బగుదెంచు; నాగతా
నాగత రాజ్యతంత్ర నిచయజ్ఞత పెట్టని కోటయైన ప్ర
జ్ఞా గరిమంబు సన్నిధి కొసంగెద నొక్క వచః పరాణువున్‌.
32
గీ.“సార కర్ణాట రాజ్య కేదారవీథి
మీరు నాటిన ధర్మపునారు పెరిఁగి
నలువురును బైరు లందుకోవలయు ననఁగఁ
దొలకరింపఁగవలెఁ గృష్ణతోయదమ్ము.”
33
వ.అని యతండు దేశకాల సహజోచితంబగు స్వధర్మ వ్యవసాయంబున కుపశ్రుతికంబుగా నమృతబిందుప్రాయంబగు నభిప్రాయం బావిష్కరించుటయు నద్దానిం గుండె కద్దుకొని పులకితంబగు కాయంబున గోవిందుం గలసికొని యొక్కక్షణంబు తిమ్మరసు మహీసురమణి మహేంద్రానందవర్ధనుండై మసృణ స్పర్శన మర్దనంబుల సోదరునిఁ గరం బాదరించుచు-34
ఆ.వె.“కృష్ణదేవ నామ కీర్తనం బొనరించి
నన్ను నాకుఁ జూపినాఁడ వన్న!
సరియకాని, యెదియొ మఱి పల్కఁబోయెద
వనుడుఁ బుష్పితాస్యుఁ డనుజుఁ డనియె.
35
చ.మన మలరింపఁగాని యసమంజసతన్‌ వెస నెంచి త్రోసి రా
జని లస దంశుమత్ప్రభల కాదట స్వాగతమిచ్చి భద్ర పా
లనమునఁ బెట్టుకొన్న ప్రజలం బ్రభులన్‌ నృపనీతివేదులన్
గనుఁగొనమే! పురాణకథనంబున; నేఁ డటు లందగింపదే!
36
చ.అని తలపోసికొందు హృదయంబున నాఁడును నాఁడు కృష్ణరా
యని వదనంబునన్‌ బృథుమహాధిప లక్షిత చక్రవర్తి ల
క్షణములు చూచి; మీ కతని జాడలు నేను వచింప వచ్చునే!
కనుఁగొన సర్వతంత్ర గజగర్భవిధానము మీకుఁ గ్రొత్తయే!
37
సీ.ఎపు డేమి చదివెనో! యీ ధర్మములు నీతు । లతఁడె సేయవలె సమన్వయంబు
నెపు డింత చూచెనో! యీ భారతోర్వర । నతఁ డెఱుంగని చెఱం గనుచు లేదు
నెపు డెట్లు పడసెనో యీ బల్మి! యాతని । యఱచేత మదగజం బాటబొమ్మ
యెపు డిట్టి చాతుర్య మెనసెనో! యాతండు । దూసినకత్తి నెత్తురుల మిత్తి
 
గీ.యెపుడు నేర్చెనొ! మెదలిననృపతినోటఁ । బుట్టతేనియ లవి పల్కు కట్టుకొనును;
మీ యమోఘాశిషమ్ముతో రాయలయెడఁ । జనవుఁ గొనె నిట్లు ప్రాక్తన జన్మ కళలు.
38
మ.అసమోదార సుశీల సంపదమృత ఖ్యాతంబుగా సాగి వం
గస ముప్పొంగఁగ మెట్టినిల్లు వెలయంగాఁ జేసి సుక్షాత్త్రపుం
బస నాగాంబిక గర్భశుక్తిక తలిర్పన్‌ సర్వదేశ ప్రజా
విసరాశాలతికల్‌ చిగుర్ప నిటు చూపెన్‌ గృష్ణరాయప్రభున్‌.
39
క.ఆ రాయల రత్న మకుట
ధారణ మీ భారతీయ ధర్మము పునరు
ద్ధారణ మగుఁగదె! మీ రిడు
చేరిక నిందనుక సాహసించితినేమో!
40
గీ.అనుచు విరమించుటయును దమ్ముని మనమ్ముఁ
దిమ్మరసు మంత్రి లెస్స గుర్తించుకొనుచు
నతని యుద్ఘాటనమ్మున కాత్మ నలరి
మరల నేకత మరసి యిక్కరణిఁ బలికె.
41
క.సాహసము కాదు నీ యు
త్సాహం బిటు లుండె; నిదియు సహజమ యగు; ని
ర్మోహమునఁ గాదె! నీతి
వ్యూహంబులు ధర్మనియతి నొదిగి ఫలించున్‌.
42
గీ.అవును నీ వన్న దింత సత్యమ్మె యగుత!
మన్మనోవీథిలో రహోమంత్రితమ్ము
విషయ మిట్లు నీ నోటఁ జెప్పించినాఁడ;
దేనికేనియుఁ గాల ప్రతీక్ష వలయు.
43
మ.ప్రభునం దీయెడ వెల్లడించెడు నవిశ్వాసంబు విశ్వాస మీ
యుభయంబున్‌ గడు జాగరూకతమెయిన్‌ యోజింపనొప్పున్; దటి
న్నిభముల్‌ కావె! ప్రజోహ; లొక్కదెసగా నిల్పోపఁగాఁజూడ దు
ర్లభ, మీ నిర్ణయ మిట్లు చేసికొన సౌలభ్యంబు లే దెన్నఁడున్‌.
44
చ.పరగతమైన ధర్మమునఁ బట్టిన క్రొందళుకుం బసందు చె
చ్చెరఁ బొరుగింటికూరగ రుచించును ముందర; మీఁద మీఁదఁ ద
త్పరిణతి చేఁదుగాక! యమృతం బని దానిన్‌ పంచియిచ్చు ఱేఁ
డరయక మ్రింగఁ జొచ్చుప్రజ లన్నియుగంబుల నుండకుందురే!
45
గీ.ప్రజకు మనఱేనియెడ నవిశ్వాస మనుచుఁ
బలికితివి; దానితో నేను గలియఁజాల;
నదియు సార్వజనీనమౌ హృదయ మగునె!
కాదు - తమ్ముఁడ! బ్రహ్మలోక మిది కాదు.
46
చ.అనియతమైనత్రోవ నడయాడ నిజేచ్ఛకుఁ దా వొసంగు ఱే
నినిబడి మెచ్చువార లవనిం గడుఁ దక్కువలెక్కనుండ; రెం
చినఁ బదిమంది కేరికొ రుచింపకయుండును; గాన వాని పా
లనముఁ దొలంప భౌతికబలం బిటు చాలదు కాలసన్నిధిన్‌.
47
ఉ.ఈవు పురాణగాథ స్మరియించితి వించుక; పట్టిచూడ నీ
తావున దానికిన్‌ సముచితత్వము పట్టదు; పూర్ణధర్మ సం
ప్లావితముల్‌ పురాయుగములం బ్రజ మెచ్చెను దానఁ గల్గు స
ద్భావరహస్య; మీ యడుగు ధర్మపుఁగాలము మెచ్చ దీక్రియన్‌.
48
గీ.తరణి యుదయాంశువులు పెంపులొరయుకొలఁది
మాసిపోవదె! చీకటిమంచు పెల్లు
రాజ్యతంత్రము లేల! యీ క్రమము నడప -
నరయుదువులెమ్ము రాయల దొరతనమ్ము.
49
గీ.ఆంధ్ర కర్ణాట నిఖిలరాజ్య ప్రధాన
మంత్రిగాఁ గాక, యొండు సామాన్యరీతి
నేఁడు బాహిరపఱిచి మాటాడినాఁడ;
నైన నిది యాంతరంగికం బగునుగాక!”
50
వ.అని యిత్తోయంబున నారేయి సోదరయుగంబు సౌభ్రాత్ర సముచితంబుగా ననేక విశేషంబులు ముచ్చటించుకొని ప్రొద్దుపోవుటయు నిద్దురకుం బోయి; రది యాది ప్రాయికంబుగా వారి సాయంసమావేశములయందుఁ గర్ణాటరాజ్య పరిపాలన వ్యవహారంబులును వీరనరసింహరాయల ధర్మేతర ప్రవృత్తియుఁ గృష్ణరాయల దినదినప్రవృద్ధియు మున్నుగా నెన్నియో ముచ్చటలు వచ్చి సాగుచుండె; నంతఁ గొంతకాలంబున కొకనాఁడు హేమంతసాయముపాసనానంతరమ్మున-51
ఉమ్మత్తూరు విజయము
మ.రమణీయోజ్జ్వల పావక ప్రకట వర్చస్స్ఫారమౌ ఫాలదే
శమునన్‌ దోసిలి నించి, యన్నకుఁ బురస్కారంబుఁ గావించి త
త్సుమహాశీర్వచనంబు లందుకొని విందుల్‌ కాఁగ గోవిందుఁ డు
ద్యమగాథా సమరప్రసంగ రణితోత్సాహంబుమై నిట్లనెన్‌.
52
శా.“అన్నా వింటిరికాదె నేఁటి విజయోదంతంబు; దుర్దాంతసం
పన్నంబైన వరూథినీవితతి ‘నుమ్మత్తూరు’ వీరాళి పై
కొన్నన్‌ రాయలు సింగపుంగొదమగా క్రొవ్వాఁడిమిం బొంగె; ధీ
రౌన్నత్యం బది కంటఁ గట్టినటులై యానంద మూటాడెడిన్‌.
53
శా.ఉత్తాలోద్భటమైన రాణువల నుద్యోజించుచో, వీరసం
పత్తిం గత్తిఁ గదల్చుచో, నెదిరి పైపై రాఁగఁ దీండ్రించి పై
యెత్తుల్‌ వెట్టెడిచోఁ గనన్‌ నరసరాజే తాండవంబాడి యు
మ్మత్తూరున్‌ గెలుపందె నాఁగ నభిరామం బయ్యె సంగ్రామమున్‌.
54
చ.తఱుగని వీరవిస్ఫురణధర్మము పెంపుగ మూఁడుమాసముల్
జరిగినముట్టడిన్‌ విమతసంతతి గొంతులు బంతులాటగా
నఱకిన కృష్ణరాయలఁ గనన్‌ గనువిందుగఁ దోఁచె; వాని సం
గర చతురత్వముల్‌ తెలియఁగల్గెను నాకిటు నేఁటి కగ్రజా!
55
చ.పరిణతసూక్ష్మమై తగు భవద్గురుమేధకుఁ గృష్ణరాయలం
బొరసిన మేలిజాతిమెఱపుల్‌ పొడఁగట్టకపోవు; సైనికో
ద్ధురమగు ‘నుమ్మతూరు’ పడఁద్రోచుట మాటలె! మీ తలంపులో
శరదుదయోత్సవం బిటులు సాగెను రాయలగెల్పు వెన్నెలన్‌.
56
సీ.భయదవాహినుల నుద్భటమైన “శివసము । ద్రపుఁగోట యన్యదుర్గమముకాదె!
యాకోట కేలికయగు గంగరాజు బె । బ్బులిఁబోని దర్పదుర్లలితమూర్తి;
యతనిపైఁ గృష్ణరాయలు దాడివెడలె మీ । యాశీరనుజ్ఞ తియ్యమ్మునెంచి;
పాలెగాండ్రు సహాయపడ రాజపుత్రుండు । రాయలు మేటిభూధ్రములు దాఁటి
 
గీ.దండుదిగి గౌరికొండలదారి నడుమ । నడచి కావేరికనుమపొంతలను గడచి
యలఘుతరభంగిఁ బండ్రెండునెలలు పోరి । శివసముద్రము ముట్టడించికొనఁ జొచ్చె.
57
చ.ఇరువదియేండ్ల లోఁబడిన యీడున రాయలు వీరవిక్రమ
స్ఫురణము పెంపుగా శివసముద్రము ముట్టడివైచి తన్నుఁ గ
ట్టెఱ కనువిచ్చిచూచుట సహింపఁగఁ జాలని గంగరాజు రూ
పఱగఁ దటాలునన్‌ మడువునందుఁ బడెన్‌ దనువుం దొఱంగుచున్‌.
58
ఆ.వె.బాలకృష్ణ రుచిర లీలగాఁ బగఱతోఁ
బోరు సలిపి గెలుపు పొందు గొలిపి
శివసముద్ర లక్ష్మిఁ జేపట్టి మన భర్తృ
దారకుండు జయపతాక నెత్తె.
59
వ.ఈ చందంబున విజయసుందరుండైన కృష్ణరాయలు శ్రీరంగపట్టణం బాధికారికస్థానంబుగాఁ జేసికొని శంఖ చక్ర చిహ్నితంబైన నిజనూతన ధ్వజమ్ము నెలకొల్పె; నింతటి రాయల భవిష్య దభ్యుదయార్థం బెల్ల లౌకిక సాధువైన మీ యాశీర్వాక్కునందుండి యందగించు ననుకొందు ననుటయు.60
గీ.వినుచు నెఱినవ్వుఁగన్నులవెంట నురలు
నార్ద్రతం దమ్ముఁ జూచి తిమ్మరసు పలికె:
“నోయి! నీ కింతగాఁ గృష్ణరాయలయెడఁ
దలఁపు నిలుపంగ నేల కావలయుఁ జెపుమ!
61
శా.పోనీ, నేనె వచింతు నీదు హృదయంబున్; జూడు మోయీ, నిజం
బౌనో కాదొ తలంపు; మియ్యెడల నిర్వ్యాజంబు నీ ప్రేమకున్
స్థానంబైనది యాత్మధర్మ మగుఁగాదా! దానిపైఁ దీపితోఁ
బ్రాణం బిత్తువు కృష్ణరాయలకు నప్పా! నీవు నానాఁడునున్‌.
62
చ.తగు నిటు లింతకున్‌ బరమధర్మము రాయలయందుఁ జాలఁ బెం
పుగఁ గనిపించి నీ కతని పోఁడిమి నచ్చెను; వాని యేల్బడిన్
బగఱు నశించి నేల విరివాకిలిగాఁ దులకించు నంచు నిం
తగ నొక స్వార్థకాంక్షకతనన్‌ గణియింతువు కృష్ణరాయలన్‌.
63
ఉ.మానితభంగిమై భువన మంగళకారణ మిట్టి స్వార్థ సం
ధానము మేలుసేఁతగ మనంబున నెంతువు; దాన దేశ క
ల్యాణము సంఘటిల్లు ననునంతటి లోపలి మేలిచూపుతోఁ
బ్రాణము లిచ్చి రాయల కనారత మిట్టిప్రశంస లిత్తువున్‌.
64
గీ.ఇంత నీ స్వాంతమైనచో సంతసంబె
యలఘుపీఠమ్ము దరియు రాయలకు నస్మ
దాశిషమ్ము లిటుండెఁగా! కాద్యఋషుల
యక్షయాశీస్సు కల్మిఁ గృతార్థుఁ డతఁడు.
65
క.అని పలుకఁ బరమ హర్షా
వనతుఁడు గోవిందరాజు భ్రాతృ స్నేహాం
జనముఁ గొని కృష్ణరాయల
ఘనమూర్తిన్‌ లోనలోనఁ గని తనివోయెన్‌.
66
వీరనరసింహరాయలు : కృష్ణనేత్ర వాంఛ
వ.పదంపడి కొంతకాలంబునకుఁ గర్ణాట సామ్రాజ్య భూదారుండగు వీరనరసింహదేవరాయలు కాలవశంబున వ్యాధిగ్రస్తుం డగుట నిరస్తజీవనాశుండై యొండొకనాఁడు ప్రధాన సచివుండగు తిమ్మరసును గాన్పించుకొనియె; నయ్యెడఁ బాన్పుపైఁ బరుండి లేవఁజాలకయున్న యమ్మన్నుఱేఁ డభ్యర్ణ స్వర్ణపీఠస్థుండైన యా ప్రెగ్గడపాణియుగం బందుకొని గుండెపై నుంచుకొని పరిసరంబు నిర్మక్షికంబుం గావించుకొని పేదవడుచున్న గొంతు నించుక సంతరించు కొనుచు నిత్తెఱంగునం బలికె :67
ఆ.వె.ఓ యమాత్యవర్య! ప్రాయమ్ము పెద్దది
కాదు కాని, వ్యాధికతన మాకు
నాయు వింక నిలువ దనుచు నిశ్చయమయ్యె;
విధి విధానమునకు వెఱపుగొనము.
68
గీ.నీవు మా తండ్రియాన మన్నించి మమ్ముఁ
జేర్చి యేల్బడి గద్దె నుంచితివికాదె!
యా కృతజ్ఞత మాసిపో; దాయు వింత
కాయముఁ దొఱంగి పోవునుగాక యెపుడొ!
69
ఆ.వె.మాదు జనకునాజ్ఞ మరియాద నిలిపితి;
విపుడు మా యభీష్ట మేల విడిచె!
దొకటి చెప్పువార; మోయి సంగడికాఁడ!
డెందమందె దాఁచుకొందు కాదె!
70
చ.పరిణతబుద్ధి నేలుబడి పట్టు లెఱింగిన నీవు మంత్రిగా
గురుఁడుగ దీవనల్‌ నొడివి కోరికి దిద్దఁగ ముద్దుఁగుఱ్ఱ మా
తిరుమలదేవరాయ లరుదేరవలెన్‌ మదనంతరంబు ని
బ్బరముగ రాచగద్దె; కది పండువు మాదెస నాత్మశాంతికిన్‌.
71
చ.ఎఱుఁగుదు కృష్ణరాయలపయిం జెలికారము నీకు; మాకు సో
దరుఁడగుఁగాక! యాత్నజుఁడె ధారుణి కింతట నిస్సపత్న వై
ఖరి నొడయండు కావలయుఁ; గావున రాయల కన్నుదోయి నా
కరముల నుంచినం బడయఁగాంతు ననామయ జీవితాంతమున్‌.
72
గీ.అని పలికి శ్లేష్మమంథరంబైన గళము
దగ్గువడుచుండ నరసింహధరణిజాని
కరయుగము వీడుకొనుచుఁ దిమ్మరసువిబుధుఁ
“డేమి యవరవాంఛిత మిది రామరామ!”
73
మ.అని లోలోపల నూర్చి కొంతవడి మ్రానై విద్యుదాఘాతమున్
గనినట్లై మఱియంతలో నొక సుమంత్రప్రౌఢ బోధంబు తోఁ
చిన, ధీరత్వము నూని ఱేనిదెసఁ జూచెన్; జూపులోఁ గృష్ణవ
ర్త్మనితాంతోజ్జ్వల రోచిరుప్త నవగుప్తశ్రీ కరాళింపఁగన్‌.
74
గీ.చూచి యిటు పల్కె : “నో ప్రభూ! చూడు మిటులు
ప్రాణములు నీవి కృష్ణనేత్రములలోన
నుండెనే! పుట్టువునఁ గృతార్థుండ వగుదు;
వెంతపని! దీనికా నియమింతు నన్ను.
75
వ.ఱేఁడా! రేపాడి నీ యభీష్టంబు నెఱవేఱఁ బుండరీక శోభా జిష్ణువులగు కృష్ణుని కందమ్ము లట్లె చూతు వని యోదార్పుం బలికి మతివాచస్పతి తిమ్మరసు మహామంత్రి యాఱేని విడిచివచ్చి యాతని పాషాణ కఠోరాభిలాషంబునకుఁ జిత్తంబున నుత్తలం పడుచు.76
తిమ్మరసు నరసింహరాయలఁ దృప్తిపఱిచిన తీరు
చ.అనితర నిర్జితోర్జిత భుజాత్త యశోర్జునమూర్తి సింహసం
హననునిఁ గృష్ణరాయల మనోంబరవీథినిఁ బట్టి - పట్టుచే
రని నరపాల పాణిధృతరాష్ట్రముపైఁ గనుదోయిఁ బెట్టి - యొ
య్యన ననిమేష ధీరనయనాంతరదృష్టిఁ దలంచె నీగతిన్‌.
77
గీ.అకట! పోఁగాలపుం దలం పావహించె
నిటులు కర్ణాటపతికిఁ గానిమ్ము - నేను
గలలుగనుచున్న పరమలక్ష్యంబు జాడ
నడచుచున్నది దైవనిర్ణయముకూడ.
78
గీ.కొడుకు నభిషిక్తుఁజేయ వాకొనఁగవచ్చు;
రామనిర్వాసనంబుఁ గోరంగనగునె!
యదిర! యాఁడుది నడపె రామాయణంబు
నడపుచున్నాఁడు కృష్ణాయణంబు ఱేఁడు.
79
గీ.చెలఁగుకడిమి ‘నుమ్మత్తూరు’ - ‘శివసముద్ర’
దుర్గములు ముట్టడించి శత్రువుల నొంచి
గెలుపుటెక్కెమ్ము రాయలు నిలుపుకొన్న
కతన నరసింహవిభునకుఁ గన్నుకుట్టె.
80
చ.పనివడి మోయఁగా నవనిభార మలంతియె! ముక్కుపచ్చలా
ఱని తనబిడ్డ దిక్కెవఁడు! రాజ్యము వీరభుజానుభోజ్య మం
చు నెఱుఁగకాడె నాతఁ డలసుండయి, యియ్యెడ లేచి కృష్ణుఁ డె
త్తిన మలక్రిందికిం బ్రజలఁ దెచ్చెద; నాకళ నిర్వహించెదన్‌.
81
చ.అలసుఁడు - లోభమోహ జనుషాంధుఁడు - ఱేనికి నేఁడు కృష్ణరా
యల కనుగ్రుడ్లు కావలయునా! తలసూపినకోర్కిఁ దీర్తు; దు
శ్చలితుఁడు వానికిం దెలిసిచచ్చునె! యొండొక యాఁడుమేఁక క
న్నులఁ గొనిపోయి చూపెద; మనోరథ మారటదీఱఁ బాపెదన్‌.
82
చ.మెరమెరలేక యీ గజనిమీలన మీగతి సంతరించుటన్‌
నరపతి కన్ను మూఁతవడు నమ్మికమై; నటమీఁద రాయలన్‌
దొరతనమందు నిల్పుకొనఁ దొట్రువడం బనిలేదు: ధర్మ త
త్పరమగు నిట్టిసేఁత దురితం బిసుమంతయుఁ గాదు చూడఁగన్‌.
88
చ.ఇరువదియేండ్లు పైఁబడిన నెన్నఁడు పెద్దల కడ్డుపల్కఁ; డం
తరము నెఱింగి మాదుగురుతన్‌ జవదాఁటఁడు; విక్రమక్రమ
స్థిరతఁ దనర్చియున్‌ మనసుతేలిచి యేల్బడి కాసగొల్పఁ; డీ
పరిణతి పుట్టువిద్దియగఁ బట్టెను రాయల భాగధేయమై.
84
చ.చదువున నేర్పు - పల్కునెడఁ జక్కనితీరుపు - సంగరస్థలిం
బొదలెడిపెంపు - రాచదనపున్‌ వెడయెత్తుల తెల్విసొంపు - కా;
దదనుగణించి క్లిష్టసమయంబుల నేలిక రాష్ట్రసేవలో
బ్రదుకునుగూడఁ గప్రపునివాళిగ నిచ్చెడి త్యాగి కావలెన్‌.
85
గీ.అట్టి యాత్మార్పణమున రాయలు వెలార్చు
ధీరతను లోక మింక గుర్తించుపొంటె
నొక పరీక్షకుఁడుగఁ బోదు; నోర్మినందు
విందుగొను రాయ లభిషేక విజయఫలము.”
86
రాయల కృష్ణజన్మస్థానలీల
చ.అని తలపోసికొన్న హృదయంబునఁ దోడనె కృష్ణరాయలం
గనుఁగొన నేఁగెఁ దిమ్మరసు; క్రమ్మిన సంభ్రమమార, మోదమున్‌
వినయమువాఱ రాయ లతనిన్‌ దరిసించి నమస్కరించి యా
సనమున నుంచి దీవనలచాయకు దోయిలిఁబట్టి నిల్చినన్‌.
87
శా.శ్రీవిద్యోతిత కాంచనాచల పురశ్చీనుండు తానైన మో
దావిర్భూతిఁ దలిర్చి తిమ్మరసు తియ్యంబార రోచిఃప్రవా
హావర్తంబులు కృష్ణలోచనములం దాప్లావితుం డౌచు, నె
త్తావుల్‌ ప్రోవుగఁ జేసె నాతనిఁ బురస్తా త్పీఠికాలంకృతున్‌.
88
క.ఆయెడ నాచార్యునిదెస
రాయలు కనుఁగొనుచు స్మితపురస్సర మితభా
షాయత భావోదయ గో
పాయన సుందరుఁడు పలికె బహుమానముగన్.
89
మ.“అనఘా! యొక్కఁడ విట్లు వచ్చితివె! ధన్యత్వమ్ముఁ జేకూర్ప; నె
వ్యనిచే నేనియు నింతలోఁ బిలువనంపన్‌ వచ్చి దర్శించుకొం
దునుగాదే! యిటు రేయి రాక కొకఁడేదో కారణంబుండు; నీ
కనులం దాదరకంపితం బమృతసేకం బేదొ పొంగారెడిన్‌.
90
మ.అనుడున్, రాయలఁజూచి “నాయన! నిజం బాడంగ నీలో నొకం
డనుగానే యరుదెంచినాఁడ నిటు వెంటం బిల్చి కొంపోవ నె
మ్మన మాసించెను; గొన్నినాళ్ళ దనుకన్‌ మాయింటికిన్‌ విందవై
కనువిందుం బొనరింపు; ముండు నటఁ బ్రక్కన్‌ దోడు గోవిందుఁడున్‌.
91
వ.అని సాదరంబుగాఁ బిలుచుటయు నద్దేశికు నాహ్వానమ్ము నాదేశంబుగా నెంచి యప్రశ్నమ్ముగా నామతించి సప్రశ్రయుండైన కృష్ణరాయలు మహామంత్రి గేహంబున కతిథిగా నరిగె; నట్లు తిమ్మరసు రాయలం దోడుకొని తన నిశాంతముం జేర్చి సోదరుండగు గోవిందుని తద్రక్షణంబున నియోగించి తన యింట రాజపుత్త్రు నునికి యషడక్షీణంబుగా నుండు నేర్పాటుం జేయఁబలికి సహస్రాక్షుండై తానును బరికించుకొనుచుండె నయ్యెడ.92
ఆ.వె.గురులయింట విందు గోవిందరాజుతోఁ
దియ్యమైన పొందు తేనె చిందు
సాధుగోష్ఠియందు సాహిత్య నిష్ఠయం
దితర మెదియు రాయ లెఱుఁగ కుండె.
93
వ.కతిపయ దివసంబు లటు లుండఁగా నొక్కనాఁడు.94
ఉ.రాయలవైపు చూచి యనురాగము చిందఁగ “నెట్టు లుండెనో
నాయన! వీనివిందు లివి నచ్చునె!” యంచు గురుం డనంగ “న
ప్పా! యిది పుట్టినిల్లగుఁగదా” యని రాయలు పల్కె: “నౌను దం
డ్రీ!” యని యూర్చి మంత్రి “యిది కృష్ణుఁడు పుట్టినచోటె చూడఁగన్‌”.
95
చ.అనుచు నమాయికార్ద్ర శిశుహాస లసన్ముఖుఁ డైన రాయలం
గనుఁగొని “రాజపుత్ర! యటు కా దిటు చూడుము లోకతంత్ర వ
ర్తనములయందు డెందముఁ గదల్చుచు మేల్కనువేళలో నెఱుం
గనియటు లుంట కా; దిపు డొకానొక ఘట్టము దాఁటఁగావలెన్‌.
96
ఉ.వీరనృసింహరాయ పృథివీపతి వ్యాధితుఁడై యపేత జీ
వోరుతరాశ నుంటఁ గనియుందువు నీవును; నన్ను నాతఁ డే
పారఁగఁ గానిపించుకొని యాదృతి నేదియొ ముచ్చటించి లోఁ
గోరిక నుచ్చరించెఁ దలఁకుం గొనఁబోక యసహ్యభావతన్‌.
97
క.అది యెద్ది యందు వేనీ!
యెద లోఁతులు కలఁగిపోవు; నీ పెదవులు బె
ట్టిద మా విసపుం బూఁతన
కుదియున్; మఱి యేమి చెప్పుకొందును గృష్ణా!
98
ఉ.చెప్పకపోదునే! ప్రభువు చేసిన యాజ్ఞయు నిట్టు లుండఁగాఁ
దప్పుట యెందు మా సచివ ధర్మము కాదుకదా, నృపుండు తా
నొప్పమి నెంచి యాత్మ తనయుం డభిషిక్తుఁడు గాఁ దలంచి, నీ
యొప్పు సహింపఁజాల కెదియో కనుఁబ్రామ వచించె నింతటన్‌.
99
రాయలు గురుపరీక్షలో నుత్తీర్ణుఁ డగుట
గీ.అనఁగ ధైర్యమేరు వాలించి రాయలు
గురుని హృదయవీథి మెఱయు విందు
నందు వ్యక్తపఱుచు నాందోళనమ్మును
వెనుక ముందు నెంచుకొనుచుఁ బలికె.
100
శా.“సాజంబౌ గురుధీరభావమున నస్మాదృక్ప్రియచ్ఛాత్రులం
దోజోదాన మొనర్చి యెల్ల దెసలం దుత్తేజనం బిచ్చి య
ప్పాజీ! యిప్పుడు క్రొత్తతీరుఁ గొని నాపై ని ట్లవిశ్వాసి వౌ
దే! జాత్యంబగు ధర్మమున్‌ మఱచు నంతేవాసి నే నౌదునే!
101
ఉ.అన్న విభుండు నాకు; జనకాభుఁడు గాఁ డొకొ! నేఁడు జీవనా
పన్నదశావశుం; డతని భావగతక్షతి యింత పాపలే
కున్న నిఁకేల! యద్ది యటు లుండెనుగాక! ప్రభుండుగా నతం
డన్నది శాసనం బగుఁగదా! యది దాఁటుట పాడిగా దెటన్‌.
102
మ.గురువాక్యంబును భ్రాతృవాంఛితము నాకుం దీర్చిన ట్లౌను; భూ
వరునానన్‌ జవదాఁటనట్టి ఫలముం బ్రాపించుఁ గానన్, బరా
వర విజ్ఞానము నొజ్జబంతియిడు నీపై నెల్లఁజూ పుంచి, చె
చ్చెర ఱొమ్మిచ్చితి; వ్రచ్చికొమ్ము చరమాశీశ్శాత ఖడ్గాహతిన్‌.
103
క.అని శ్రవణభీష్మముగఁ బ
ల్కిన రాయల పలుకు లాలకించుచు డెందం
బున మోదోష్మలతం గొని
తనుపారఁగ నొక్కసారి తద్వత్సమునన్‌.
104
మ.తన ఱొమ్మానిచి చొక్కమౌ కవుఁగిలింతన్‌ మోచి “యోబిడ్డ! నే
ననుకొన్నంతకు మించి చూపితివి; శ్రేయశ్శ్రీలు నీపాలు; శి
ష్యునిచేనైన పరాజయంబునకు మెచ్చుల్‌గొందు; నీ నా పరీ
క్షను నీ వింతట స్నాతకవ్రతముదీక్షం గొంటి వుత్తీర్ణతన్‌.
105
శా.ఈపైఁ జేపడుఁగాక నీకు నదిగో! నేతన్మహారాష్ట్రల
క్ష్మీపాణిగ్రహణోదయక్షణము; పుష్పించున్‌ భవద్ధర్మశి
క్షాపారీణత నాఁడు; నీయెడల విశ్వాసమ్ము నోరాజపు
త్త్రా! పేర్కో నిపు డేల! యేలెద వుదాత్తక్షాత్త్ర మగ్గింపఁగన్!
106
మ.జనకుం డంటివి ఱేని; వానిదెసఁ దచ్ఛాయల్‌ విలోకింప మ
చ్చునకుం దోఁపవు నాకుఁ; బెంపుగొన నిచ్చోఁ బాడి నాఁగేటిచా
లున దేశం బభిరామ సస్యరమఁ బొల్చుంగాక! యీ నీయెడన్‌
జనకత్వం బది పండ నొండొక శుభాశాస్ఫూర్తి దీవించెదన్.
107
మ.గురువాక్యంబునఁ జూపునిల్పితివి నాకున్‌ సంతసంబయ్యె; నం
దఱు నిందుండి రటన్న నమ్మకము నూనన్‌ గాని దే ముండు! ను
ర్వరకున్‌ శాసన ధూర్వహత్వమున భావస్థైర్యముం గొల్ప, భా
గ్య రమాశ్లేషముచిక్క నీ విపుల వక్షఃపీఠమున్‌ నిల్పుమీ!
108
శా.అస్థానంబున నున్కి యింకఁ దగదన్నా! నేఁటికే కృష్ణజ
న్మస్థానంబను పేరుపెంపుఁ బడయున్‌ మాగేహ; మోరాజ! దే
శస్థుల్‌ వెన్నెలపుల్గులౌచుఁ గడునాసన్‌ వేచియున్నార; లు
చ్చస్థం బయ్యె గ్రహప్రపంచము సితచ్ఛత్త్రాకృతి స్వచ్ఛతన్‌.
109
గీ.దైవ మనుకూలపడెడి యిత్తరుణమందుఁ
దోఁచి నావంతు నడచె నెత్తుగడ యొక్కఁ;
డది విశేషమె యైనఁ గాలాంతరమునఁ
దెలిసికొందువు; కాదేనిఁ దెలిసికొనవు.
110
గీ.తల్లి నాగాంబ సుప్రజాధన్య యయ్యెఁ
బురుషశార్దూలమా! లెమ్ము పోద మింక
రాజమందిరమునకుఁ; గర్తవ్య మెంతొ
కలదు నీమీఁద వేఁగ మేల్కనుము కృష్ణ!
111
చ.అని సువిశాలసుందరములౌ నల రాయల కన్నుఁదమ్ములం
దున మధుజీవబిందువులు తోఁపఁగఁ దిమ్మరసయ్య పల్కినన్‌
విని, వినుకెంపుఁబోని యతనిం గని తత్పటు వాగ్విశేష మం
డన రుచిమండలాంతరమునం గరఁగెన్‌ వెసఁ గృష్ణదేవుఁడున్.
112
వ.అయ్యనంతరంబ శుక్లశరన్మాఘ సితపక్షచతుర్దశీ శుభదివసంబున శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకోత్సవంబునకు సుముహూర్తంబు నిర్ణయించి ప్రధానామాత్యుండు తిమ్మరసు కర్ణాటాంధ్రాది సకల భారతీయరాష్ట్రంబుల మంగళాహ్వానమ్ముఁ జాటింపఁ జేయుటయు-113
శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకము - నగరాలంకరణము
మ.అలవేడ్కం గనులారఁ జూచెడి తలంపై కన్నులన్‌ మూయులో
పల మిన్నుల్‌ పడుచోటునుండి పులకింపన్‌ హవ్యవాహప్రభా
వ లసత్ఫాలతలుల్‌ బుధప్రవరు లొప్పన్‌ రాఁగ నారాచవీ
డలరారెం గవితాస్పదం బనఁగ నార్యాశ్చర్య ధౌరేయమై.
114
మ.తనివోవం బ్రణయాభిమానఖని సత్యాదేవి కౌతూహలం
బునకుం గృష్ణునిగుప్పెటన్‌ మొలచి సొంపుల్‌ తేటగా నారఁబూ
చిన నెత్తావుల పారిజాతమటు పొల్చెన్‌ రాచవీడెల్ల లో
చన పర్వోదయ మంగళోత్సవ ఫలోత్సాహ త్వరానందియై.
115
మ.వినుతం బయ్యభిషేకవార్త విని యుర్వీనేతఁ గీర్తింప వ
చ్చిన విద్వత్కవిపాళి మంజుకవితాశ్రీ వాహినుల్‌ రాజభూ
షణ కోలాహలవీథి నడ్డుకొని యుచ్చైస్సంగ శృంగార భం
గి నినాదింప నెలర్చె నయ్యెడల రక్తిన్‌ రాచవీ డెల్లెడన్‌.
116
గీ.పుడమిబరు వింక రాయలు మోయుననుచుఁ
దీరుబడి చూచుకొని యష్టదిగ్గజములు
చుట్టె శ్రీకారముల్‌ రసజ్ఞుల శ్రవస్సు
లలర భవ్యమహాకావ్యములకు నాఁడు.
117
మ.మును వజ్రాహతిపాతభీతిమెయి సొంపుం బాసి సోత్కంపతన్‌
వనధిన్‌ డాఁగిన పక్షవచ్ఛిఖరి మైనాకుండు వజ్రాసనం
బున శ్రీరాయలు కాలువెట్టు నను సమ్మోదంబుతోఁ గాన్కఁదె
చ్చిన రత్నచ్ఛవిమత్కిరీట మనఁ దోఁచెన్‌‌ రాచవీ డయ్యెడన్.
118
వ.తెలుంగురాయని యభిషేకమహోత్సవాభ్యుదయం బరయువేడ్క నార్వీటిబుక్కరాజు సాళువమేకరాజు నౌకువారు నంద్యాలవారు వెల్గోటివారు పెమ్మసానివారు బూదహలివారు కమ్మదొరలు తుళువదొరలు రెడ్డిఱేండ్లు సపరివారంబు సబహూకారంబు ససంభ్రమంబు విజయం చేయుచుండ నవ్విజయనగరమ్ము పుష్పితోద్యానంబు కరణిం బరిమళించె; మఱియు నయ్యమరసు కొండమరసు బాచమరసు రామచంద్రయ్య భాస్కరయ్య మున్నగు వరూథినీ నాయకుల ప్రాయశస్సంచారంబుల నా రాజధాని గంధర్వలోక సుందరంబై యురవడించె; మఱియు సంస్థాన విచక్షణస్థానాభరణము చతుర్వేది రామాదీక్షితులు, నధిగతాష్టభాషాకవితా విశేషుండగు కృష్ణావధానియు శబ్దశాస్త్రాపరపతంజలియగు వేంకటరామశాస్త్రియు సహస్రావధాననిపుణుండు ప్రభాకరశాస్త్రియు మున్నుగాఁగల సూరివరుల యితరేతర మంగళప్రసంగంబుల నవ్విద్యానగరము దేవసభారంగమ్ము భంగి నందగించె-119
చ.పొలపమునెత్తు ముత్తియపు మ్రుగ్గుల జగ్గులతో ననంటిబో
దెల రమణించు ద్వారముల దీప్తులతో నెఱిపూఁత జీడిపిం
దె లలరు మావిరెమ్మలఁ గుదించి వెలార్చిన తోరణాళితో
విలసితమై వసంతకృతివీథికిఁ దత్పురి తీర్చెఁ బీఠికన్‌.
120
చ.పొరిఁబొరి వగ్గులై వయసుముగ్గిన ముత్తెపు మ్రుగ్గుబుట్టలౌ
శిరములతోడఁ బున్నెముల చేరికలై తగు రాచయైదువల్‌
తిరుమలదేవి ఫాలమున దిద్దిన కుంకుముసోగరేకలోఁ
దెరమఱుఁ గింతలేక గుఱుతింతురు రాయల పట్టబంధమున్‌.
121
మ.అరయంగా నెటఁజూచినం దనకుఁ దానై యున్నయట్లుండి యం
దఱిడెందంబుల కాతిథేయ పరమానందంబు నిండార్చు తి
మ్మరసయ్యం గనుఁగొంచుఁ దద్రుచిర నేత్రాంతంబులన్‌ వింతదొం
తరలై తోఁచిన కృష్ణమూర్తులకు జోతల్‌తీర్తు రభ్యాగతుల్‌.
122
మ.ఒకచో, వచ్చినరాచవారి కుచితోద్యోగంబునం దీర్చు లౌ
కిక మర్యాదలకున్‌ - మఱొక్కయెడ భక్తిన్‌ సక్తిఁ బాటించి వై
దిక మార్గంబునకున్‌ గనుల్‌ పనిచి, మంత్రిశ్రేష్ఠుఁ డాతండు కౌ
తుకియై నిల్పెను భ్రూయుగాంతరమునందున్‌ గృష్ణకల్యాణమున్‌.
123
సీ.ఆది విష్వక్సేనునర్చకై తెచ్చిన । పసపులోఁ జాయ నేర్పఱిచి చూచు
నింద్రశాంతికి వెలయించు మహావేది । కల కట్టడంబుల కొలత లెన్ను
నరపాలుకొఱకు స్నానమొనర్పఁ దెచ్చిన । సకల మృత్స్నావిశేషంబు లరయు
నకలంకగతిఁ బట్టముకుట నిర్మాణ ప్ర । మాణానుగుణ్యమ్ము మదిఁ దలంచు
 
గీ.హరిసమర్చనోపక్రాంతమగుచు నృపగ । జాధిరోహాంతమైన పట్టాభిషేక
కర్మకాండము “శుష్కేష్టి” గాఁగ నడపుఁ । దిమ్మరసుమంత్రి భావనాదీప్తవీథి.
124
గీ.చేరి రాంధ్రావనికి సర్వభారతీయు;
లాంధ్రు లెల్లరుఁ గర్ణాటమందుఁ జేరి;
రఖిలకర్ణాటజనులు తిమ్మరసుఁ జేరి;
రతఁడు శ్రీకృష్ణదేవరాయలను జేరె.
125
శా.రాశీభూత పురాణ భారత సుధర్మ క్షేత్ర సంచార లీ
లా శుంభజ్జయపాణి రాయలకుఁ గల్యాణాభిషేకంబు స
ర్వాశల్‌ పండఁగ రేపనంగఁ దొలినాఁ డాదిక్షితీశాన ది
వ్యాశీఃకల్పకసూనసౌరభము నాంద్యాహ్వానమై సొంపిలెన్‌.
126
మ.పొలుపుల్‌ పొంగిన మంగళస్వనముతోఁ బుప్పోదయంబైన రా
య లొగిన్‌ దిర్మలదేవి నిర్మల కపోలాదర్శముం గాంచె; నం
ఘ్రులకున్‌ మ్రొక్కినఁ దచ్ఛిఖామణిహొరంగుల్‌ చూచె; నద్దేవి దీ
పిలఁగాఁ బల్కిన పల్కులందుఁ గనియెన్‌ వీణాస్వనత్తంత్రులన్‌.
127
శా.ఆలించెన్‌ దధివామనస్తుతులతో నారాధ్య నామామృతం
బాలించెన్‌ గజరాజమోక్ష కథతో నధ్యాత్మ సంకీర్తనం
బాలించెన్‌ విదురాది నీతినిచయం బాశంసితంబౌ నుషః
కాలీనశ్రవణ ప్రసంగము చెలంగన్‌ లేచె నిర్ణిద్రతన్‌.
128
ఆ.వె.తుంగభద్రలోనఁ దోచిఁన నీలోత్ప
లములరేకు లేఱి లలితరీతి
మేను దుడిచి కపిలధేనువుఁ దోడ్తేర
రాయ లరసి కేలుదోయి మొగిచె.
129
చ.మొగిచిన పాణిగర్భదళముల్‌ విరియింపఁగ సాంగవేద పా
రగుఁడు పురోధ యెట్టయెదురన్‌ బొడసూపె సహస్రరశ్మియై;
యగపడినంత నాతనికి నర్ఘ్యము నెత్తిన కృష్ణరాయలం
దగ దరిసించి తిమ్మరసు తత్కరణీయత కెచ్చరింపఁగన్‌.
130
ఇంద్రశాంతి
వ.అవ్వెనువెంట సర్వకర్ణాటాంధ్ర సామ్రాజ్యాభిషేచనీయుండగు శ్రీకృష్ణదేవరాయలు తిరుమలదేవీ సహయోగంబున విష్వక్సేనస్మరణ నిజేష్ట దేవతాస్మరణ పురస్సరంబు దేశకాల సంకీర్తనం బొనరించి యఖండాయురారోగ్యాభివృద్ధిపూర్వక నిష్కంటక నిఖిలావనీతల స్వామిసిద్ధిం దలంచి మనోభిలషిత ధర్మ ప్రతిష్ఠాపన కామనాపూర్తికాభ్యుదయంబుం గాంక్షించి భువనవ్యాపి యశఃకీర్తి ప్రభావాతిశయంబు నామతించి స్వరాజ్య భోగాధికార స్వీకారంబుఁ గామించి పరంపరా పరిభుక్త వజ్రసింహాసనాధిరోహణసిద్ధి సంభావించి పట్టాభిషేకాఖ్యకర్మమునకు సంకల్పించె; మఱియు నాచార్యాదిక విప్రవరణంబును బుణ్యాహవాచనంబు నెఱపి గ్రహశాంతియు నింద్రశాంతియు బ్రహ్మవిష్ణుమహేశ్వరాశ్వినీకుమార దేవవైద్య సమర్చనంబుం గావించె; నవ్వెంట నాచార్యుండును ఋత్విజులును లేచి నిలంబడి.131
గీ.కలశ సలిలమ్ముఁ గొని శాంతిజలముఁ దీసి
చిలుకరించిరి గఱికపోఁచల చివుళ్ళ;
నపుడు సగపాల దేవి తోడైన రాయ
లలరె మూర్ధనటద్గాంగయంత్రుఁ డటులు.
132
గీ.క్రొత్తపుడమి నావర్జింపఁ గోరు ఱేని
తలఁపు జలసేకమునఁ జిఱుమొలక లొలసె;
నరసి యానందమున శతాంకుర సహస్ర
పరమ దుర్వాసవిత్రి బాష్పములు కురిసె.
133
శా.సర్వోర్వీవిభుతా పురస్కృత బిడౌజశ్శాంతి కృన్మూర్తిపై
దూర్వాపల్లవ నిస్సరత్సలిల బిందుక్రాంతి ప్రావృట్కళా
పర్వభ్రాంతి యొనర్ప నొప్పెసఁగు విద్వల్లోక కేకిత్రపాం
తర్విక్రీడిత మెంచి మెచ్చిరి తదౌదాత్త్యంబు సభ్యప్రజల్‌.
134
మ.ఋషికల్పుండు పురోహితుండు సకలర్త్విఙ్మండలీ ముఖ్య పా
రిషదుం డెత్తిన మంత్రకంఠ మమృతోర్మిం దోఁగఁ దన్నాద వి
ప్రుషముల్‌ రాలిన పారిజాతకుసుమంబుల్‌ గాఁగ దూర్వాపయ
స్సుషమన్‌ జాదులునుం బ్రసాదముగనెంచున్‌ గృష్ణుఁడాశిష్ఠుఁడై.
135
చ.అరయమిఁ బెక్కు పుట్టువులయందు నెడందను బట్టుకొన్న ని
ద్దుర వెడమత్తు మబ్బుగమిఁ దుత్తునియల్‌ వడ నుత్తరించుచున్‌
గఱిక చివుళ్ళగాలి చినుకన్‌ వినమచ్ఛిరుఁడైన రాయ ల
చ్చెరువుగ నాత్మమౌక్తిక రుచిం గనె నంజలిబంధ శుక్తికన్‌.
136
గీ.స్వాతిశయమును వీడి నాయకుఁడు పట్టు
పాణిపద్మయుగీ నిగుంభనమునందు
విడిదిసేయంగ నవనిధుల్‌ వెడలిరాఁగ
గఱిక చినుకులు ముత్తెపుసరు లొసంగె.
137
శా.సాలంకార సశార చారుతర వాసస్సజ్జితాకారలై
మేలుంగన్నుల ‘నింద్రశాంతి’ఁగన నెమ్మిన్‌ గన్నియల్‌ చుట్టుకోఁ
గా, లీలాధృత శక్రచాపరుచి ధిక్కారించు నా శోభలోఁ
బౌలోమీవిభుసన్నిభుం గన గగుర్పాటయ్యె నా రాణికిన్‌.
138
చ.తిరుమలదేవి క్రీఁగనుల తీఁగ మెఱుంగున దర్ప గర్భ సుం
దర లఘురేఖ నెంచి ప్రమదంబున ఱేఁడు గభీరభావుఁ డాం
తరముగ నవ్వుకో, నది శతాంకురమై శతమూలమై మహ
స్సురభిళమౌచుఁ గ్రొవ్విరుల సోనల వానలుచల్లె నౌదలన్‌.
139
మ.కొమరుంబ్రాయపుటందగాఁడు సవధూకుండైన యాఱేని వి
క్రమరోచిన్‌ మదిదాఁచి తిమ్మరసు సామ్రాజ్యాభిషేకాంగ ర
మ్యము నేతత్కృతికై కలల్‌ గనుచు నేఁ డస్వప్న గుప్తానుభా
వ మహానంద సర స్తటస్థుఁడయి నిల్వన్‌ మెచ్చి రాస్థానికుల్‌.
140
గీ.ఉత్తరపు దిక్కు మోమయి యున్నవాఁడు
సాంగవేదవిదుండు బ్రాహ్మణుఁడు పలుకు
ప్రాఁబలుకు దీవెనల నాని ప్రాఙ్ముఖుండు
రాయ లింద్రాశ కాదట దోయిలించె.
141
వ.ప్రాయశ్చిత్తాది సకలాహుత్యనంతరం బింద్రశాంతి క్రత్వంగంబుగా జరుపవలసిన దూర్వాకిసలయాభిషేకం బటులు నిర్వర్తింపఁబడుటయుం దోడ్తోడ.142
మ.లలితోదాత్త పటిష్ఠ విగ్రహున కుల్లాసించి సర్వౌషధుల్‌
నలుగుల్‌ వెట్ట, విశుద్ధమౌజలము స్నానంబార్ప, హొంబట్టు వ
ల్వలు కట్టింపఁగఁ, బూఁతవెట్ట, సితమాలల్‌ కట్ట శ్రీకృష్ణరా
యలు దేవీసహయోగియై నెఱపె రాజాచార్యపూజావిధిన్‌.
143
చ.అణఁకువ సిగ్గుఁ దెల్వియు సమాదరణంబును శ్రద్ధ మున్నుగా
గుణముల ప్రాపు శ్రోత్రియులకుం బెనుప్రోపు యథోక్త దక్షిణా
ర్పణ చణుఁడైన రాయలు సభక్తికుఁడై యొనరించె ఋత్విగ
ర్హణమును దత్తదర్హముగ నందఱి డెందములున్‌ ఫలింపఁగన్‌.
144
గీ.దేశ మెంచి కాలమ్ముఁ గీర్తించి మించి
యింద్రశాంతి క్రియా ప్రతిష్ఠేచ్ఛ కలిమి
నిచ్చు దక్షిణ లా శిశిరర్తువేళఁ
గల్పతరు వాకు రాల్చిన కరణి నుండె.
145
గీ.అంతలో భూసురాశీర్వసంత వల్లి
విరులు తొడిగిన రాయల కరమునుండి
దాన జలధార తేనియసోనగాఁగ
వెల్లిగొన జుఱ్ఱుకొనిరి ఋత్విజులు ద్విజులు.
146
వ.ఆ ప్రభువు రుద్రదైవత్యంబులగు నేకాదశ ధేనువులను వృషభంబును గ్రామభూమీ సామజసైంధవ రథ రత్నాదులను దానం బొసంగి వెండియు-147
గీ.తుంగభద్రా తరంగిణి తూర తగిలి
విత్తు విసరిన బంగారుగుత్తు లొసఁగు
నమృత కేదారములు విరూపాక్ష విభున
కర్పణ మొనర్చి చరితార్థుఁ డయ్యె ఱేఁడు.
148
గీ.పవి పయోరుహ విలసితపాణియుగుఁడు
మఘవుఁ డావాహితుండు ప్రేమమున వచ్చి
కృష్ణవిభునకు సోదరప్రీతి తొనఁకఁ
గైదువును గంట మిడె నన్న కరణి తోఁచె.
149
మ.ప్రతిమావాహిత మైంద్రతేజము శచీప్రాణమ్ము ప్రాచీదిగ
ర్చిత కల్యాణము పుండరీక సితరోచిశ్ఛత్ర మైరావతో
ర్జిత కుంభస్థల హారివేత్ర మసురాద్రివ్రాతపక్షచ్ఛిదో
ద్ధత వజ్రధ్వనితంబు రాయలయెడందం దోఁచెఁ బ్రత్యక్షమై.
150
సీ.దివిషదాఘ్రేయమ్ము దివ్యధూపమునందు । ఘృతవర్తి యుద్గీపకీలయందు
సాభిఘార సభక్ష్య సరస శాల్యోదన । విరచిత హృద్య నైవేద్యమందు
ఘనరసోశీరాదిక ద్రవ్యసురభిళ । స్వర్ణ కుంభోంభిత సలిలమందు
తత సుగంధిల దివ్య తాంబూలమందును । రత్నదండాతపత్రంబునందు
 
గీ.విసరు వీచోపునందుఁ జూపించినట్టి । దర్పణమునందు నర్పించు దక్షిణలను
నెత్తిన నివాళి రాయల చిత్తశుద్ధి । నొత్తుకొనె వేల్పుదొర లోచనోత్సవముగ.
151
గీ.కప్పురపుటారతి వెలుంగు కడుపులోన
లూన దురితౌఘముల్‌ శచీలోచనములు
భావన యొనర్చు తిరుమలదేవిఁ గనఁగఁ
గనులు చాల వటంచుఁ గృష్ణునకుఁ దోఁచె.
152
గీ.శుభముహూర్త ముహుశ్శ్లాఘ్య శుక్ల వర్ష
మాఘ శుక్ల చతుర్దశీ మహము వచ్చి
యింద్రశాంతి క్రతూత్తర కృతికి నిచ్చె
స్వాగతమ్ము నృపాభిషేకాధికృతికి.
153
వ.త్రయోదశి నింద్రశాంతిహోమమ్ము లొనరింపఁబడుటయుం గరిష్యమాణ సామ్రాజ్యాభిషేక సమర్హణంబున కర్హుండైన శ్రీకృష్ణదేవరాయులు మఱునాఁడు కృతనిత్యక్రియుండు దేశకాలములు సంకీర్తించుకొని సకలరాష్ట్ర వశ్యతాకాముండై జగద్ధితమ్ము భావించి సాంవత్సర పురోహిత వేదశాస్త్ర విద్వన్మహాకవి రాజ సచివ సామంత ప్రజాసమక్షంబున విష్వక్సేనపూజయు స్వస్తివాచన మాతృకార్చనాభ్యుదయిక క్రియాదికంబు నొనరించి యవ్వెంట నయ్యైవారలం గనకకుండల కేయూరకటక కంఠాభరణాంగుళీయక కౌశేయాద్యుపాయనంబుల నభ్యర్చనంబుఁ గావించె; నాయెడఁ బూర్వదివసంబున నాచరితోపవాసుండు పురోహితుం డుషర్బుధప్రతిముం డరుదెంచి హోమదేశమ్ముఁ బరికల్పించి దాని కుత్తరంబున నామ్రతోరణ గుంఫ కదళీస్తంభ శోభనంబైన స్నానశాలయందు వ్రీహీపుంజంబు పఱపుచేసి సౌవర్ణకలశంబు సంస్థాపించె; సంపాదిత సర్వభారత తీర్థోదకంబుల నాపూరించి సమస్తౌషధీ గంధ రత్నంబులు నిఖిలబీజ ఫలవృక్ష లతాపల్లవాదులు కలశంబున నిక్షేపించి యక్కలశంబు బహుళ ధవళ వస్త్రంబున వేష్టనం బొనరించె; దత్కలశమ్ముచెంతం బంచగవ్య పూర్ణంబొండు మృన్మయకుంభంబును, ఘృతసహితంబు శాతకుంభ పాత్రంబును, గోక్షీరపూరితంబు వెండికుండయు; దధిసనాథంబు తామ్రకలశంబును; మధుభరితంబు మార్తికభాజనంబును, గుశోదకవాసితంబు శతచ్ఛిద్రమ్మునగు నొండొక్క సువర్ణ కలశంబును నూటయెనిమిది తిరుపతులనుండి కొనిరాఁబడిన తీర్థోదకంబులచే గంగా యమునా గౌతమీ కృష్ణా కావేరీ తుంగభద్రాది సమస్త నదీజలంబులచే సకల సరఃకూపోదకంబులచే సముద్ర సలిలంబులచేఁ బరిపూరితంబులగు బహుకలశంబులును సంస్థాపింపం జేసె నయ్యెడ మంగళహృద్యవాద్యారవంబులలో-154
శ్రీ రాయల మృత్తికాస్నానము - కలశాభిషేకము
ఉ.భారత ధర్మసారమును బట్టి సమస్తముఁ బ్రోవుపెట్టి యు
ర్వీరమణుండు మీకొఱకు బిందెలకెత్తెను రండటంచు నా
కారణసేసె స్నానపుటగారము సర్వనదీ నదామృతో
ద్ధార చకచ్చకత్కలశ దర్శిత గౌరవభంగి నెల్లరన్‌ :
155
శా.దీప్రౌజః పరికీర్తితుల్‌ సకలధాత్రీనేతృ పీఠాభిషే
క ప్రావృడ్జలదాయితుల్‌ దురిత శిక్షాదీక్షితుల్‌ వేదవి
ద్విప్రుల్‌ డెందములందుఁ బండువుగ నెంతేఁ జూచి రాఱేని స్నా
నప్రారంభ సమర్పితం బురము నంతస్సార సర్వస్వమున్‌.
156
చ.పరమ మనోహరార్థ విభవస్థిర కావ్యకళా యశోధురం
ధరులు కవుల్‌ పురాపరిచితంబగు కృష్ణుని వక్షమందు నిం
దిరయలికమ్ముపైఁ గురులు తెచ్చిన సోయగమేదొ వేడ్కమై
నరసిరి ఱేనిస్నానసమయం బొక లోఁగిన భాగధేయమై.
157
మ.పటువక్షస్స్థలి నిబ్బరించుకొనుచున్‌ బాహాద్వయం బెత్తి యు
ద్భటమౌలీల విదిర్చి రొండులను నిల్పన్‌ స్నానవేళాదిఁ జె
మ్మటగుత్తుల్‌ చిటిముత్తెముల్‌ పొటమరింపన్‌ ఱేని కక్షాపుటీ
తట రోచిం గుటిలాలకల్‌ కనిరి డెందమ్ముల్‌ కృతార్థమ్ముగన్‌.
158
మ.పొడుగుం బొట్టియుఁ గాని రాట్తనువు నిల్వున్; జానువుల్‌ వ్రేలము
ట్టెడు బాహార్గళ భద్రదీప్తి కనుఁగొంటే చాలునన్పించి మేల్‌
వడువుల్‌ మించు తదూరువుల్‌ కనినసాఫల్యంబు సాధింప న
ల్గుడు వెట్టించిరి స్నానశాల నఖిలక్షోణీ వణిఙ్నాయకుల్‌.
159
చ.అరయఁగ వచ్చినట్టి ప్రజ లందఱు రాయలవారి స్నానసుం
దరతకు ముగ్ధులై కనుఁగొనన్‌ మునుముందు సరస్తటంబుపై
విరిసిన మెట్టతామరలఁ బెంచెడి తచ్చరణద్వయీ మనో
హరతకు భక్తరేణువులునై భజియించిరి చారితార్థ్యమున్‌.
160
వ.ఆసనోపవిష్టుండైన రాజపుత్రునకు సుగంధ తైలాదికంబున మర్దనం బొనరించి మంత్రపురస్సరంబుగా మృత్తికా స్నానంబున కుపక్రమించి వల్మీకాగ్ర బిల్వాలయ సరోవర గోష్ఠాశ్వస్థాన రాజాంగణ నదీకూలద్వయమ్ములనుండి యుద్ధరింపఁబడిన సర్వమృత్తికలచే సర్వావయవస్నాన మాచరింపంజేసి, పంచగవ్యస్నానము నిర్వర్తింపఁజేసి శుద్ధోదకంబున జలకంబార్చి, రంత శ్రీకృష్ణదేవరాయలను నూతన వాసోభూషాలంకృతుని వజ్రభద్రాసనంబునఁ గూర్చుండఁ జేసిన తోడ్తోడ - 161
చ.తొలితొలి వేదవాగమృతతోయధిఁ బూచిన ధర్మనైచికిన్‌
గళమునఁ గన్నెత్రాడు గొనికట్టిన యన్వయమందుఁ బాలబు
గ్గల మృదుహాసముల్‌ విరియఁగాఁ గరుణించిన లోని తన్పుతో
వెలుఁ గొకఁడేదొ రాయలకు వేడుక నించుచుఁ జేరెఁ జేరువన్‌.
162
చ.అది ప్రథమాభిషేక కరణార్హము రాజపద ప్రతిష్ఠకున్‌
మొదలగు తేజమై వెలలి ముంగలఁ దిమ్మరసయ్యమూర్తి యా
భ్యుదయిక మౌచుఁ బూర్వకలశోద్ధృతమౌ ఘృతధార మంత్రశా
రద గళహారయై యెసఁగ రాయలకుం దొలితన్పు నీయఁగన్‌.
163
మ.వరుసన్‌ మంత్రులు వచ్చి దక్షిణమునన్‌ బశ్చాద్దిశన్‌ క్షీరముల్‌
పెరుగుల్‌ చిందఁగ నుత్తరమ్ముదెస మాధ్వీబిందుసందోహముల్‌
తొరఁగంబోయఁ గుశోదసేకమును వంతుల్వోవఁ బంచామృతో
దర సామ్రాజ్య మహాభిషేక సుముహూర్తం బేలె శోభార్ద్రతన్.
164
గీ.నాగమాంబా నృసింహ భూనాయకులకు
నాత్మజుఁడు కృష్ణదేవరాయలకు నపుడు
రాజసూయాభిషేక మంత్రములు చెప్పి
చేసెను బురోహితుం డభిషేక మహము.
165
గీ.వేదశాస్త్రము లచ్ఛిద్రవిధిఁ బఠించి
పండితుండగు నొకనైష్ఠికుండు వచ్చి
చేసె నభిషేకమును శతచ్ఛిద్ర కనక
కలశమున సకలౌషధీజలము కలన.
166
వ.అష్టోత్తరశతసంఖ్యాక తిరుపతిక్షేత్ర సమానీత దివ్యతీర్థవారిపూరితములు గంగా యమునా ద్యనేక నదీ సరఃకూప సముద్ర నిర్ఝరోదకపూర్ణంబులును బూర్యాసాదితంబులు నగు స్వస్వవిహిత కలశంబులనుండి పరిగృహీతంబులగు సలిలంబులచే నభిషేకింపఁబడి యా రాచకొమరుండు ప్రభుత్వంబు నామతించుటయు-167
ఆ.వె.వెల్లగొడుగు మోవ వెలిచామరలు వైవ
వేత్ర మూన శ్రోత్రపేయ వాద్య
నాదవీథి మాగధాది కృతస్తోత్ర
పాఠవీథి నుత్సవంబు నెగడె.
168
మ.అనపాయ ధ్రువమార్గ మెంచి మను దక్షాది ప్రజాధ్యక్షు లే
లిన యీ భారతధర్మ మాసమెయి నేలెన్‌ మాధవస్వామి త
త్పనితాశీస్సునుబోని తిమ్మరసు భద్రప్రేమ మీ ధాత్రి మే
ల్కన నిద్రం దొలఁగించునంచు విభుఁ డాకాంక్షించె లోలోపలన్‌.
169
వ.ఆరీతి నభిషేకింపఁబడిన మఱునాఁడు మంగళలగ్నంబున సకల మంత్రిమాండలిక ప్రజాధ్యక్ష సమక్షంబున శ్రీ రాయలకు లలాటమ్మునఁ బట్టబంధంబును మూర్ధంబున ముకుటంబు నలంకరించి యాస్థానస్థిత వజ్రాసనోపరితలంబు నుత్తరోత్తరక్రమంబున వృషవన మార్జార తరక్షు సింహ వ్యాఘ్రచర్మంబుల నాచ్ఛాదించి దానిపై వెలగలుగు పసిఁడి జరీయంచు కుట్టిన కౌశేయంబు పఱచి సపత్నీకంబుగా ఱేని నుపవేశింపఁజేసి; రంత సకల ప్రజాపరిచయదక్షుండు ద్వారపాలాధ్యక్షుండు వచ్చి సవినయంబుగా నొక్కొక్కరినే యంజలిబంధంబునం జూపించుచు నిదిగో, వీరు మంత్రులు, వీరు దళనాయకులు, వీరు పౌరులు, వీరు వణిఙ్మణులు, వీరు వీరని, వారి వారిం బేరుకొని పరిచయింపఁజేయుటయు నా కృష్ణప్రభుం డొక్క రొక్కరినిం గాంచి-170
గీ.కౌఁగిటం గ్రుచ్చె; మెచ్చెఁ; గ్రీఁగంటఁ గాంచె;
నవ్వు నొలికించెఁ; దలయూఁపునం దలంచె;
భద్రమడిగెఁ; గరాబ్జ సంస్పర్శ మొసఁగెఁ;
గొలువునం దెల్ల నాత్మలీలలను నెఱపె.
171
గీ.పట్టబంధోత్సవానంద ఘట్టమందుఁ
గృష్ణరాయలలో నందగించు కరుణ
బంధనాలయ లోహకవాటపాళి
నలమి కరఁగించివైచె ననర్గళముగ.
172
గీ.ప్రకట సకలాంధ్ర కర్ణాట మకుటధరణ
వేళ శ్రీకృష్ణరాయల విభుతలోన
ఋణవిమోచన ఘోషముల్‌ వినిన ప్రజకుఁ
దలలపై బర్వుదిగిన మోదమ్ము తొనఁకె.
173
గీ.అగ్రహారమొ! రత్నాలహారమో! గ
జమ్మొ! గుఱ్ఱమో! గోవొ! యజమ్మొ! కనక
మో! ధనమ్మొ! వస్త్రమ్మొ! యేదో యొకండు
నాఁడు విభుచెయ్యి తగులనివాఁడు లేఁడు.
174
గీ.పట్ట మకుట ప్రసాధనోద్భాసి నృపతి
గందపుంబూఁత కేల్మోడ్పు నందుకొనియె
వృషభరాజ మ్మొకండు; వెన్వెంట నెలమి
విభుఁ డొనర్చె సవత్సగోపృష్ఠ వృష్టి.
175
గీ.పసిఁడికై సేఁతమిసిమి యొప్పెసఁగుదాని
నొండు జాత్యశ్వమును నమాత్యుండు తెచ్చి
నిలుపఁ దిలకించి భక్తిమైఁ బులకరించి
తెలుఁగు నరపతి యీరీతిఁ బలుకరించె.
176
ఉ.“సంగరవీథిలో నహితసంహతిఁ జెండెడివేళ ఱేని స
ర్వాంగము రక్షసేయు సదయాకృతి నిన్‌ గనుఁగొంట - భూమిభృ
న్మంగళదేవతారథము మార్గము ముంగలిగాఁగ సాఁగు ని
న్నుం గనుఁగొంట తొల్లిటి జనుస్సుల పంటసుమా, తురంగమా!
177
మ.తరమా! నీ మహిమమ్ముఁ బేర్కొనఁగ నాంధ్రప్రాజ్య కర్ణాటరా
జ్య రమాధర్మము నేలుకోఁ దలఁచి ప్రస్థానింపఁగా నెంచు నా
సరణిన్‌ నీకరుణాపురః ప్రసరణోత్సాహమ్ము నాసింతు; భా
స్వరతేజోంబుధిగన్న మానికమ! యాజానేయ సంతానమా!
178
గీ.అబ్ధిమథన సముద్భూతమైన హయము
నన్వయములోన సంభవమైనవాఁడ
వశ్వపతి పట్టమున కీవె యర్హుఁడగుదు
తత్పతిత జాతి యితరమ్ము తాఁకలేదు.”
179
క.అని మ్రొక్కి యేనుఁగెక్కిన
యనువున నా తెనుఁగురాయఁ డానందముతోఁ
గనె నెదుటఁ దిమ్మరసుమం
త్రిని హితునిం దండ్రినిన్‌ సుధీగీష్పతినిన్;
180
గీ.కని యతనిదోయిటన్‌ భద్రగజముఁ జూపు
వడువు రాయలముదము నిన్మడి నొనర్చె
మంత్రి దక్షిణకర్ణాభిమంత్రితమ్ము
దంతిరాజమ్ము నిట్లు ప్రార్థన మొనర్చె.
181
మ.నిజబాహా స్పృహణీయ విక్రమ కృపాణీ క్షేపణీ కూలము
ద్రుజ శౌర్యోద్ధతి యుద్ధవీథి నరులం దున్మాడువేళన్‌ మతం
గజరాజా! విజయోదయోత్సవ కటాక్షం బిమ్ము కర్ణాట రా
ష్ట్ర జనాధ్యక్షున కారురుక్షువున కాశాస్య ప్రదానంబునన్‌.
182
మ.ద్విపసంఘమ్మున నీకు నాయకత నర్పింపం గటాక్షించు మా
నృపచింతామణి పాలనీయుఁ డగు నోయీ యౌపవాహ్యమ్మ! ది
వ్యపరాక్రాంతి ననుస్మరించుకొని దిర్యగ్భావమున్‌ వీడి రా
జ పురస్కారముఁ గొమ్ము శ్రీపరిణతోచ్చై ర్దర్శనీయాకృతీ!
183
శా.నీకంటెన్‌ మఱివేఱుగా గజపతుల్‌ నిల్వంగరా; దీవె లో
కైకానేకప సార్వభౌముఁడవు తోడై రాఁగ రాష్ట్రంబు నే
కాకారస్థితి నిల్పు రాయలకు శ్రేయస్సుల్‌ త్వదారోహణ
శ్రీకల్యాణ మహస్సు లి మ్మితఁడె నిల్చెన్‌ నీ సమక్షంబునన్‌.
184
క.అని మంత్రి గజారోహణ
మున కనుపఁగ నుచిత వినయ మోహనుఁడగు నా
జనవిభుఁడు శుభాది గజా
ననపూజా దీక్షితుండు నా నెసలారెన్‌.
185
క.శివసంకల్పుఁడు మంత్రి
ప్రవరుఁడు తా నొక్క యేన్గుపై నెక్కి మహీ
ధవ దంతావళ పార్శ్వము
తవులం గూర్చుండ నది సుధాదర్శనమై.
186
గీ.వెలసె నమరావతీ పురీవీథిలోన
గురునిఁ దన పజ్జనే నిల్పుకొన్నవాఁడు
వేల్పుదొర నాల్గు కోఱల వెల్లయేన్గు
పయి నధిష్ఠించి పురియేగు భవ్యమహము.
187
మ.వరుసన్‌ మంత్రులు భూపతుల్‌ హితులు విద్వాంసుల్‌ గజారూఢులై
తురగారూఢులునై తలిర్పఁగఁ బదాతుల్‌ వెంట రాఁగాఁ బుర
స్సర దశ్వోరస లక్ష్మిగా నడచెఁ దత్సమ్రాడ్గజారోహణ
స్ఫురదుత్సాహ మహంబు మాంగళిక మంజుస్వాన సప్రాణమై.
188
భద్రగజాధిష్ఠుతుఁడైన రాయలు - రాజధానీసందర్శనము
గీ.రాజుగా మంత్రిగా శరీరమ్ము లొరయ
దంతియుగి ముందడుగువేయఁ దత్పురాణ
నగరవర్ణనఫక్కి నూత్నత గడించు
తిమ్మరసువాక్కు రాయ లర్థిమెయి వినియె.
189
ఉ.శ్రీనిబిడమ్ము భారతధరిత్రి ముహుర్ముహు రాత్మ ధర్మ ని
ష్ఠా నియతాత్ముఁడై యమృతసంపద కాసలుగొన్న వాసనా
ధీనుఁడు క్షీణపుణ్యుఁడగు దేవత యింద్రపురమ్ము నేఁటి వి
ద్యానగరమ్ముపేర నవతారమునెత్తె జగద్ధితార్థమై.
190
మ.ప్రియభక్తిద్రుత తుంగభద్ర విపిన శ్రీఖండవాటీ శిలో
చ్చయ సంఘాటతటీ నటత్పరిలఘు స్వాదూదక శ్రేణితో
నయసంపాదకమైన యీ పుర విరూపాక్షేశలింగంబు న
వ్యయదీక్షం బొనరించు నిత్యము మహాన్యాసాభిషిక్తంబుగన్‌.
191
మ.నరనాధాగ్రణి వజ్రపీఠమునకున్‌ దాసానుదాసత్వవై
ఖరి యూరీకృతిఁ దత్పురాక్రుధఁ దొలంగంజేసికోనెంచి యి
ప్పురిచుట్టన్‌ బహుళావనీధ్రముల గుంపుల్‌ మండలాకారమై
పరివేష్టించిన తీ రయత్నకృత వప్రం బయ్యె నీ వీటికిన్.
192
మ.పురి కడ్డంబుగ నున్నతాద్రినిచయంబుం జూడవే! లోని కె
వ్వరి రానీయక తన్మహీధరకృత ద్వారాళి చెంతన్‌ గుహా
ళి రహోదేశములందుఁ గావలిగ నిల్చెన్‌ వీరబృందంబు జా
గరితంబై; యిటు తేఱి చూచుట కశక్యంబౌ నరిశ్రేణికిన్‌.
193
చ.అటు నిటు నున్న సౌధములయందము వీథులు సూత్రపట్టి తీ
ర్చుట గమనింప వాస్తుపురుషుం డిటు దేవర నామతించి కౌఁ
గిటఁ గొనఁ జాఁచు నభ్భుజయుగింబలె ముందఱి కేఁగుదెంచున
న్నటు లనిపింపదే! యభినవార్చిత రాజగజాధ్వగాగ్రణీ!
194
మ.అదె చూడంగదె రాజవీథిదెస బాహావాహితానంత! య
ష్ట దశాసింధురబృంద మొక్క వరుసన్‌ సంచారలీలం బొన
ర్పఁ దగుం గాదొకొ! వీథికిం గొనగ నభ్రస్పర్శి హర్మ్యాళి న
ల్లదె! భావించినఁ బర్ణశాలలటు సూక్ష్మాకారతం దోఁచెడిన్.
195
మ.కడుఁ బెంపుంగొని రాచబాట కిరుప్రక్కన్‌ లేచి యీ వృక్షముల్‌
తొడవుల్‌దాల్చు వసంతసుందరుఁడవై తోఁతెంచు నీ కింపుమై
నిడఁ బత్త్రంబును లేని కాలగతి కెంతేఁ గ్రుంగి లజ్జాళువుల్‌
గొడుగుం గొమ్మల వెల్లనీడ లిడు నీకున్‌ రాజమర్యాదగన్‌.
196
శా.మోదాంకూరిత హాసమాఘ్య ముకుళంబుల్‌ తోడుగాఁ జేసి ప్రా
సాదాగ్రస్థిత రాజకన్యకలు లాజల్వోసి సాలాగ్ర శా
ఖా దండంబులఁ జిక్కుకొన్నవి పడంగాఁ గొమ్మలన్‌ దుల్పుచో
స్వేదంపుం గొస చిన్కు రాల్తు రదిగో! శ్రీకృష్ణరాడ్భావజా!
197
ఉ.చిత్తము పల్లవింప నటుచెంతకుఁ జూడుము తెల్గుఱేఁడ! లో
కోత్తర రమ్వశిల్పముకదో! యిది యాలయ మండపాగ్ర; మిం
దెత్తిన రాలకున్‌ బ్రతుకులిచ్చిరి సత్కవులట్లు వ్యంజనా
వృత్తియెకాని యొం డితరవృత్తి నెఱుంగని శిల్పకోవిదుల్‌.
198
గీ.అదె! విరూపాక్ష దేవదేవాలయమున
మ్రోఁగు ఘంటా మహానాదమునఁ గరంగి
తల్లి భువనేశ్వరీదేవి దయ తరంగ
తుంగయై భద్రగతుల ముందునకు వచ్చు.
199
గీ.అనఘుఁడైన విద్యారణ్యముని కుపాస్య
దేవతామూర్తి యీతల్లి దివ్యకరుణఁ
గురిసిన యపూర్వ సౌవర్ణ కుంభవృష్టి
నిండిన సరోవరం బిది నీ పురంబు.
200
గీ.అరసి మెచ్చెడివాఁడు సహస్రశీర్ష
పురుషుఁడఁటె! నీటికొలఁది తామర యనంగ
శ్రీవిరూపాక్షవిభు సాంధ్య నృత్యకేళి
విజయపురి వేయిమడుఁగులై వేడ్క నింపు.
201
గీ.ఈవణిగ్వీథి ముత్యాలప్రోవుఁ జూచి
రత్నముల రాశిఁ గాంచి వజ్రముల నెంచి
పవడములు నీలములును జేపట్టి విలుచు
సందడిఁ గనంగవలదె రసాతలేంద్ర!
202
గీ.విజయపురి యేలుబడి ముద్రవేసి యుంచి
యందుఁ గల రత్నములు తానె యాహరించు
కొనుటఁ గడలికి నాఁడు చేసిన ‘సముద్ర’
నామకరణము నేఁటి కన్వర్థమయ్యె.
203
గీ.అన్యదేశీయులగు వణిగగ్రసరులు
కొనుటకై వచ్చి దుగ్ధదోహనముగాఁగఁ
బిండుకొనుచున్నఁ దన పొదుఁగెండనీని
నైచికీమణి యిచటి రత్నాల విపణి.
204
గీ.రాజమందారమా! చైత్రరథముఁ బోని
యిచటి యారామవిభవమ్ము నెల్లదేశ
మునకు నెగుమతిసేఁతకై పోవుచున్న
యీ సమీరణ వణిజున కి మ్మనుజ్ఞ.
205
చ.అసదృశ రమ్యతావనధు లామ్రవణంబు లవే! చివుళ్లునున్‌
గుసుమములున్‌ శలాటువులునున్‌ మఱి దోరలు మాఁగుపండ్లు వె
క్కసముగ నేకకాలమునఁ గాన్కలు నీ కిడఁగాఁ బునఃపున
ర్వసువులు కాఁపుచేసికొనివచ్చిన వాదెసఁ జూపుపెట్టవే!
206
మ.పనసల్‌ జాము లనంట్లు పోఁకలును దబ్బల్‌ జీడిమామిళ్లు - నె
న్నని పేర్కొందు ననంతకోటి ఫలసాలారామముల్‌ చూడు; మి
వ్వనముల్‌ పార్థివ వైభవధ్వజములై పల్మాఱు నీ పట్టణం
బునకున్‌ గెల్పులు పల్కు శాకున గళంబుల్‌ వీఁకమై నెత్తుచున్‌.
207
మ.అరయన్‌ రాదొకొ! కృష్ణరాయ ధరణీంద్రా! యిద్దెసన్‌ శ్యామసుం
దరముల్‌ పచ్చికబీళ్ళకున్‌ మొలచె నిద్దాపొన్నుఁ గొమ్ముల్‌ సమృ
ద్ధిరమాలాభము కల్మి; లోఁతరయు వృత్తిన్‌ మేఁతకుం బోవ శా
క్వర సంఘంబుల శృంగభంగమగుటం గన్గొంటివే! యద్దెసన్‌.
208
వ.ఇక్కరణిం దృణకాష్ఠ జలసమృద్ధంబు నమిత్రజన దుర్నిరీక్ష్యంబును బహురత్నాది సంపన్మనోజ్ఞ విపణివీథీ సనాథంబును గజసహస్ర సంచారసమున్మత్తంబును బరస్సహస్రహయ సైన్యభరితంబును దశలక్షాధిక పదాతియుతంబును సామంతభూప సోపాయన పాణిబంధప్రార్థిత నిత్యసందర్శన కలకలంబును గుప్తద్వార దుష్ప్రవేశ సప్తప్రాకార వప్ర సంయుతంబును యావత్ప్రపంచ నగరీ శిఖరాయమాణంబు నగు నివ్విజయనగరమ్ము నెంతని వర్ణింతు నింతకుం గవిని గానుగదా! యని పలుకుటయు.209
గీ.మకుట శిఖరావలంబి మౌక్తిక సరంబు
కదలికలలోన గండభాగమ్ము విరియఁ
జిఱునగవుఁ గాన్క లొసఁగి తిమ్మరసుముందు
రాజసుందరు బింబాధరమ్ము తొనఁకె.
210
గీ.అప్ప! యేమని పల్కితి విప్పు డీవు
కవివికావయ్య? పోనిమ్ము కాకయుండె;
అతిశయవిధా విడంబనాన్వితము కాని
యకృతకము మితవాణి నీయందుఁ గలదు.
211
క.అనుటయు నా వాగ్వైఖరి
విని యానందమునఁ గృష్ణవిభు సంశ్లేషం
బునఁ దెచ్చుకొన్న యట్టులు
తనివోయెం దిమ్మరసు ప్రధానుం డెడఁదన్‌.
212
వ.అట్లు సాగిన గజారోహణ మహోత్సవంబున సకల ప్రాకారాంతరంబులం గల్గు ప్రధాన దర్శనీయ స్థలంబులం జొచ్చి వచ్చి యుచ్ఛ్రాయసుందరమ్ము నిందిరావిహరణయోగ్యంబు నగు రాజప్రాసాదమ్మునఁ బ్రాంగణస్థలి నాఁగుటయు నంతఁ బ్రధానుల ప్రార్థనంబున.213
శా.శ్రీ రాజన్యక దత్త రత్న నిచయార్చీ రూప నిశ్రేణికా
ధారోచ్ఛ్రాయ గజావరోహణ కళాధౌరేయుఁ డా రాయ లెం
తే రమ్యాకృతి ధాత్రికిన్‌ దిగుచు నన్వీక్షించె మున్ముందు క
ర్పూరారాత్రికపాత్రపాణులమొగంబుల్‌ లోచనాపూర్ణముల్‌.
214
గీ.హితులు మంత్రులు కవులు పండితులు కలయఁ
గేలుఁదమ్ముల పుప్పొడుల్‌ రాలునట్లు
కరముల స్పృశించి మఱి యంతిపురికి నరిగె
రాణి కనుఁగల్వలకును రేరాయఁ డగుచు.
215
మాతృపాదాభివందనము
వ.అంత సతీసహితుండు శ్రీకృష్ణదేవరాయ సార్వభౌముండు భక్తినిబిరీసంబగు చిత్తంబున మాతృపాదాభివందనం బొనరింపం బరిచారికా దర్శితంబైన మందిరపథంబునఁ బోవుటయు నవ్వీరమాత నాగమాంబ వాత్సల్య సంపత్పరికంపమాన కరయుగంబున నాత్మచరణావనతులైన యా కోడలిం గొడుకును లేవనెత్తి యానందబాష్ప సేకంబునఁ గుమారుని శిరంబుఁ బునరభిషిక్తంబుఁ గావించు నది పోలె నిలిచి యంజలివట్టిన యాత్మజుం గని-216
క.“నీ పితృపాదులు నిన్నుం
జూపి చనిరి నాకు; నేను జూపించితి నీ
ప్రాపుగఁ దిమ్మరసును నా
కీపుట్టు గతార్థ మింక నెటులయిన సరే!
217
గీ.పరదురాచరణమ్ములఁ బల్లటిల్లు
భారతీయ ధర్మంబుఁ గాపాడుపొంటెఁ
జికిలిచేసిన నీతండ్రి చేతిహేతి
కదను రావచ్చు; రాదు నీ కపజయంబు.”
218
వ.అనిన వీరజనయిత్రి దీవనలం దలఁదాల్చి యామె యనుజ్ఞం గొనిన రాజశిరోమణి జాయాసహితుండు రాజప్రాసాదంబుఁ జేరి-219
సీ.తన తల్లిపేరు సదాతనమ్ముగ నిల్పు । రమణీయనగర నిర్మాణమునకు
హంపీ విరూపాక్ష పంపామహాస్వామి । రంగమంటప వినిర్మాణమునకు
రుచిర శిల్పకళానిరూఢభంగి హజారు । రామాలయమ్ము నిర్మాణమునకుఁ
దిరుపతి వేంకటేశ్వర సన్నిధిని సహ । స్రస్తంభ సదన నిర్మాణమునకుఁ
 
గీ.దలఁపు లాత్మఁ జిగుర్ప నంతఃపురమ్ముఁ । జేరె శ్రీకృష్ణవిభుఁడు దేవేరివలపుఁ
బాలవెల్లి తరంగల డోలఁ దేలి । యాటగా రాత్రి శేషశయానుఁ డయ్యె.
220
వ.ప్రబోధితుండు శ్రీకృష్ణదేవ ధరావిభుండు విజయనగర సామ్రాజ్యపీఠాధిష్ఠితుండు ప్రధానమంత్రితో రహస్సమాలోచనంబులు నెఱపుచు సామ్రాజ్య పటిష్ఠతం గాంక్షించి వర్షద్వయంబు తత్పరుం డయ్యె; సేనాంగ రక్షణ పోషణంబులు తొలిపనులుగా శ్రద్ధ వహించె; సర్వసామ్రాజ్యమును ‘నాయంకరములు’గా విభక్తము గావించి యొక్కొక్కనాయఁకరమున కొక్కొక్క యేలికగా నియమించి తత్తన్నాయకులకుఁ గొన్నియధికారము లొసంగె. మఱియు సేనాంగంబుపై సర్వాధికారంబు ప్రభుత్వాయత్తంబుఁ జేసికొనియె; శత్రుదండయాత్రలయెడ జాగర్య వహించి యసంఖ్యాకంబై న కాల్బలంబును గజాశ్వవరూథినిం బోషించుచుండె; మఱియు రాచగద్దియలఁ గైసేసినకొలందికాలంబునకె యాఱేఁడు ‘కొడగు’ను ‘మళయాళంబు’ను దంజనగర మధురాది నగరంబులును స్వాధీనపఱుచుకొనియె; దక్షిణదేశంబు మూఁడు చెఱఁగులుగా విభజించి జింజిపురంబునఁ గృష్ణప్పనాయకుండును, దంజాపురంబున రఘునాథనాయకుండును, గొడగు మళయాళంబుల వెంకటప్ప నాయకుండును నాయకులుగా నుండం బట్టమ్ము లనుగ్రహించి వారివలనం గప్పంబులు వడయుచుండ నాల్గు చైత్రంబులు గడచె.221
పర్వాంతము
మ.నవనీతప్రతిబింబ చిక్కణ నిజాంతఃపుష్పితాంభోజ! భా
ర్గవ గోత్రాంకిత వేంకటాచలపతి ప్రఖ్యాక ధీమత్తనూ
భవ! నీ విప్పుడు విన్న పర్వ మిది యప్పా! సప్తమం బాంధ్రవై
భవధామంబును గృష్ణదేవమహిరా ట్పట్టాభిరామం బగున్‌.
 
ఉ.నీ మృదుశయ్యమీఁద శయనింపఁగరాఁగఁ బురామహాకవి
స్వాముల వ్యంగ్యభావ రససంపద లెంచుచు మేలుకొల్పుగా
నా మది నెచ్చరించితి వనా! చిననాఁట; గురుండటన్న నీ
వే మఱి నాకు; నీ వెనుక వేంకటరామ శతావధానియౌ.
 
శ్రీకృష్ణదేవరాయ పర్వము - ఆంధ్ర పురాణము - మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి - ఆంధ్రభారతి - కావ్యములు - ఆంధ్రపురాణము - ఆంధ్రపురాణం - ఆంధ్ర పురాణం మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి ( తెలుగు కావ్యములు ఆంధ్ర కావ్యములు) Andhra Puranamu - AndhraPuranamu - Andhrapuranam - andhra puranam - Madhunapantula Satyanarayana Sastry- AndhraBharati AMdhra bhArati - kAvyamulu