కావ్యములు గంగాలహరి రామచంద్ర కౌండిన్య
(ఓరుగంటి రామచంద్రయ్య)
ఆముఖము - శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రి
శివాయ గురవే నమః

జగత్ప్రసిద్ధి నందిన జగన్నాథ పండితరాయల లహరీపంచకము సంస్కృతవాఙ్మయ సుక్షేత్రమున అమృతంపుఁ బంటలు పండించి సాహితీ ప్రియులకు నూతన రుచుల నందించినది.

ఆంధ్రమున, అతిరథులు మహారథులు నగు రచయితలు కొందఱు ఆ లహరులలోఁ గొన్నిటిని దెనుఁగున ననువదించి పండితరాయల భావసంపదను రచనామాధురిని దెలుఁగువారికిఁ జవిచూపించినారు.

వారిలో భగీరథులు రామచంద్ర కౌండిన్యులు - విప్రకృష్టములు, సన్నిహితములు; పురాతనములు, అధునాతనములు నగు దేశచరిత్ర ప్రసంగములు వీరి యధ్యయ నాధ్యాపన వ్యాసంగ విషయములు కావుటంజేసి వీరి కవితా సంకల్పోదయమునకే కొందఱబ్బురపడుచుండురు. ఇట్టి సమ్మేళన మరు దగుటచే, ఆ యబ్బురపాటు సహజము - సంభావ్యము.

అయినను ప్రాక్తనవాసనా వశముననో, వంశపారంపరీ సంప్రదాయ మూలముననో, జననదేశ (నెల్లూరు) పరిసరకవితా ప్రచారప్రభావముననో, కోవిద కవిగోష్ఠీ నిరంతర సాంగత్యముననో, మూల మేదియయినఁ గానిండు వీరిలో సారస్వతరసానురక్తియు, నిర్మాణాసక్తియు, రచనాశక్తియు నొక ప్రక్క నెలవుకొనుట మిక్కిలి యామోదకరము.

చరిత్రోపన్యాసములందును, తద్రచన సందర్భము లందును సయితము వీరి సారస్వతాభిరుచిచ్ఛాయలు, అందచందములతోఁ బ్రతిబింబించుట పెక్కు రెఱింగిన ప్రసిద్ధాంశము.

సంస్కృతాంధ్రసారస్వత సమష్టిలోఁ దఱుచుగా వీరి నాకర్షించునవి భక్తిపూరితములు, పావనములు, పరమార్థబోధకములు నగు ప్రశాంత మధుర ఘట్టములు. రచనకయి విషయపరిగ్రహము నందలి యాసక్తిభేదములం బట్టి రచయితల హృదయరీతులు కొంతవఱకయిన కోవిదులకు గోచరింపక మానవు.

ఏతదీయ రచనలు: రమణస్మరణ, రమణలహరి, మీరాగీతులు, ఆంధ్రశ్రీ, ఈ గంగాలహరియు నా మాటలకుఁ దార్కాణలు.

రామచంద్రయ్యగారు పండితరాయల గంగాలహరిలో మునుకలు వెట్టి యా మహనీయుని గంభీరభావములను సాకల్యముగ నాకళించుకొని వాని సారమును జిన్నచిన్న పద్దెములలోఁ దెనుఁగున వెలయించినారు. సంస్కృత మందలివి విశాలకల్పనానిబద్ధము లయిన శిఖరిణ్యాది దీర్ఘ వృత్తములు. వానిని దెనుఁగున బరివర్తించుట పెద్ద వృత్తములతోఁ గాని చిన్నపద్దెములతో సుసాధము గానేరదు. ఇట్టియెడ, అద్దములోఁ గొండను జూపినటులు విశాలరమణీయములగు పండితరాయల పద్యభావములను నలఁతి యలఁతి తెనుగు పద్దెములలో నిమిడిచి, యతివ్యాప్తులకు, నవ్యాప్తులకుఁ దా వొసంగక సూటిగా సలక్షణమగు నాంధ్రములో వెలయించుట ప్రశంసకుఁ దగిన యంశము.

చిన్నపద్దెములలో విశాలభావము నమర్చుటయు, చిన్ని చిన్ని పదముల కూర్పుననే యర్థవిశేషము నావిష్కరించుటయు రామచంద్రుల రచనానిసర్గము.

కౌండిన్యు లగుటచేఁ గాఁబోలును ఋషిసంప్రదాయానురోధముగ వీరికి సూత్రప్రాయమగు కూర్పునందే మక్కువ మిక్కుటము.

సూత్రములలోని సొంపు లారయుచు నానందము నందుచుండు నభ్యాసముచేఁ గాఁబోలును నాకును నిట్టి కౢప్తరచనముల యెడ, ఆదర మధికము.

అది యటుండ నిండు. మఱియొక మాట.

సమకాలపు వారికి సంశయము కలుగదుగాని మఱొక్క శతాబ్ది గడచిన వెనుక, ఈ జిలిబిలి పదములు - చిన్ని చిన్ని పద్దెములు - చిట్టి పొట్టి సమాసములు - తెఱచాటు సమన్వయములు - తొంగిచూచు భావములు - పాఁతకాలపు రూపురేకలు - చూడంజూడ;

"ఈ కౌండిన్యుల కవిత యిరువదియవ శతాబ్దిది గాక పదుమూఁడు పదునాలుగుల పరిసర కాలమునకుఁ జెందునటు లున్నదే" అను సందియ ముదయించి భావికాలపుఁ జారిత్రికులలో వాదోపవాదములు రేకెత్తును గాఁబోలునని నా మదికిఁ బొడఁగట్టుచుండును.

ఏ కాలమున, ఏ నిమిత్తములచే, ఏ వాదములు రేఁగి ఎట్టి తీర్పులు తేలునో, ఎవరి కెఱుక?

సహాధ్యాపకులు, ఆప్తులు నగు రామచంద్రయ్యగారి రచనను గూర్చి స్వరూపకథనమాత్రంబ కాని యధికముగఁ బ్రశంసించుట యాత్మశ్లాఘ యగునను సంకోచముతో నా యభిప్రాయమును విపులీకరింపక నేనును సూత్రప్రాయముగనే సూచించి విడిచితిని.

మచ్చున కయి యొండురెండు పద్దెములు మాత్రము చూపి యూరకుందును.

ఝరు లవెన్ని లేవు, పురభేది తల నెక్కు
చనవు, పద్మజేశు చరణపద్మ
ములనె గడుగు పరువ మలఁతియే నెనయు వే
ఱొక్కటున్నఁ గవుల కెక్క దఁటవె?

అవును, దురితములన్న మక్కువయె నాకు;
ఈవు తలఁగితె తల్లి, నికృష్టవ్రాత్య
పతిత రక్షాప్రియత్వ మావంత యేని?
తరమె నైజమ్ము ద్రోయ నెవ్వరికి నేని?

తప్పులు మానుమని వెన్నుముదిరిన బిడ్డను మందలించు వెఱ్ఱి బాగుల తల్లియు, తప్పు లొప్పుకొనుచు, ఎదురుతప్పు లెంచి, మాఱుమాటాడకుండ, తల్లినోరు నొక్కుచున్న తనయరత్నమును కన్నుల యెదుటఁ గాన వత్తురు.

సహృదయు లీ రచనము నందలి సారస్యము నారసి సంతసింతురని ఆశింతును.

మన రామచంద్రయ్యగారు ఇంకను నిట్టి యుపాదేయములగు రచనములను వివేకానంద భరితములను విరివిగా వెలయించి యాంధ్రవాణి నారాధింపఁ గలరని ఆశంసింతును.

మాతృ పూజా తత్పరులకు మంగళ మాశాసింతును.

శివాయ గురవే నమః

AndhraBharati AMdhra bhArati - padya kAvyamulu - gaMgAlahari - rAmachaMdra kauMDinya - OrugaMTi rAmachaMdrayya - Ramachandra Kaundinya - Oruganti Ramachandrayya - jagannAtha paMDitarAya gangAlaharI - Jagannadha Pandita gangalahari Panditaraya Gangalahari ( telugu kAvyamulu andhra kAvyamulu)