కావ్యములు గంగాలహరి రామచంద్ర కౌండిన్య
(ఓరుగంటి రామచంద్రయ్య)
ఆలోకము - శ్రీ వెంపరాల సూర్యనారాయణశాస్త్రి
శ్రీ గురుమూర్తయే నమః

సంస్కృతమున జగన్నాథ పండితరాజ కృతమై "పీయూషలహరి" యను నామాంతరము గల "గంగాలహరి"ని శ్రీ ఓరుగంటి రామచంద్రయ్య, ఎమ్‌.ఏ.(ఆనర్సు), పిహెచ్‌.డి. గారు తెలిఁగించినారు. ఆబాల్యమాంగ్ల భాషాభ్యాస మొనర్చి, యం దుత్తమశ్రేణికిఁ జెంది, యాంధ్రవిశ్వకళాపరిషత్కళాశాల యందుఁ జారిత్రకాచార్యపద మధిష్ఠించిన వారయ్యు, సంస్కృతమునఁ గల పండితరాజ కావ్యమునఁ గలిగిన చమత్కారముల నవగాహన మొనర్చుకొని, కమ్మని తెలుఁగు పలుకులతోఁ దేటగీతులందుఁ బాడ నేర్చిన రామచంద్రయ్యగారి వంటి ప్రతిభావంతులఁ గూర్చి యట్టిట్టని యితరంబు తెలుప నెంచుట హాస్యాస్పదము కాకమానదు. 'రమణస్మరణ' మున్నగు పెక్కు ఖండకావ్యము లాంధ్రమున రచించి, కవిగాఁ దెలుఁగు వారి కెల్లఁ బరిచితులగు వారి యద్భుతశక్తికి నా పరిచయ వాక్యములు పునరుక్తము లగును. అయినను సరేయని నా యానందమును వెల్లడింపక మానఁజాల నైతిని.

కవియగుచో స్వతంత్రమగు నొక కావ్యము రచింపక, యెందఱో యాంధ్రీకరించిన "గంగాలహరి"నే వీరును బరివర్తన మొనరింపఁ బూను టెందులకు? అనిన - ఎన్నో గ్రంథములను వ్రాసి ప్రసిద్ధి కెక్కిన పెక్కుమంది పెద్ద లీ కావ్యమునే యేల తెలుఁగొనర్చిరో వీరు నందులకే తెనిఁగించి రనుకోఁదగును. వీ రందఱును గూడ, 'పండితరాజు మన యాంధ్రుఁడు. అతని ప్రతిభావ్యుత్పత్తు లద్వితీయములు. కవితారంగమున "నాస్తిధన్యో మదన్యః" అని కాసె కట్టి, మల్ల చఱచి నిలిచిన మహావీరాధివీరుఁడు. అతని వాక్కులు "మృద్వీకామధ్య నిర్య న్మసృణ మధుఝరీ మాధురీ భాగ్యభాక్కులు" అను' మమకార పురస్సరములైన భక్తిభావతాత్పర్యములకు వశులై తమతమ యానందము తెలుఁగు సోదరులకుఁ బంచిపెట్టఁ దలఁచిన వారే. వారిలో మన రామచంద్రయ్యగా రొకరు.

ఆంధ్రీకృత గంగాలహరులు నేఁటి కైదాఱు ముద్రితములై ప్రకటితము లైనవి. అముద్రితములుగా నెన్ని యున్నవో! రమారమి ముప్పదియేండ్ల నాఁడు నా బాల్యమిత్రులు (ప్రకృతమున కీర్తిశేషులు) శ్రీ పండితారాధ్యుల నాగభూషణకవి గారీ గంగాలహరి నాంధ్రీకరించి యుపోద్ఘాతము వ్రాయు మనిన సందర్భమున 'గంగాలహరి' మూలము ప్రత్యక్షరము చదువుభాగ్యము నాకుఁ గలిగినది. ఆ నాఁడు శ్రీ ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రులవారును, శ్రీ అల్లమరాజు రంగశాయి కవిగారును దెలిఁగించిరని విని యున్నాను. నేఁడు శ్రీ మోచర్ల రామకృష్ణయ్య గారు, శ్రీ పింగళి లక్ష్మీకాంతము గారు, డాక్టరు బూర్గుల రామకృష్ణారావు గారు రచించినవి చూడఁగల్గుట కెంతయు సంతసించితిని. ఇప్పటి కముద్రితముగా నాకంటఁ బడిన తుదిరచనము రామచంద్రయ్య గారిది.

వెనుకటి యాంధ్రీకరణములలో నే యొకటియో తక్క మిగిలిన వన్నియు మూలమునకుఁ బ్రతిబింబము లనవచ్చును. కాని యీ తుట్టతుది రచన యట్టిది కాదు. "ఏపాటి యాంధ్రభాషాజ్ఞానము గలవారైనను బండితరాజ హృదయ మెఱిఁగి యానందపరవశులు కావలె" నను నుత్కంఠతో నీ యనువాదకులు మూలశ్లోకముల భావమును మాత్రమే తేటగీతులలోను వానివంటి చిన్న పద్యములలోను, జక్కని యలఁతి యలఁతి తెలుఁగు పలుకులచే రచన గావించి యొక నవ్యతను జూపినారు.

పండితరాజ కృతమగు లహరీపంచకమును "పంచామృత" మనుపేర నాంధ్రీకరించిన వారు డాక్టరు బూర్గుల వారొక్కరే. తక్కిన వారందఱును నొక్క గంగాలహరినే తెనిఁగించుటలో నేదో విశేష మిందుండవలె ననిపించుచున్నది. జగత్పావని యగు గంగాభవాని యందలి భక్తియు, బండితరాజ రచన యందలి నిరుపమ భావనాశక్తియు, లవంగీకథ యందలి యనురక్తియుఁ బ్రేరకములు గావచ్చు ననిపించినది.

ఆపాత మధురమై యవిచారిత రమణీయమైన లవంగీకథకు సామాన్య మానవులు వివశులగుట లెక్క కాదు. పండితరాజునకు నూఱు, నూటయేఁబది యేండ్ల తరువాతి వాఁడును, గంగాలహరీ వ్యాఖ్యాతలలో నొక్కఁడునగు సదాశివుఁడను పండితుఁడు తన వ్యాఖ్య యందు "అత్ర ఇదం శ్రూయతే. కవి జగన్నాథో ఢిల్లీవల్లభాశ్రిత స్తద్యవనీ సంసర్గదోషభాక్‌ స\న్‌, గంగా సకాశాత్‌, ద్విపంచాశత్సోపానాంతరిత నిజగృహే వసన్‌, తత్రైవ జాహ్నవ్యాగమనస్పర్శేన ఆత్మశుద్ధిం కామయమాన స్స\న్‌ ... ప్రార్థయతే ..." (కవి జగన్నాథుఁడు ఢిల్లీవల్లభున కాశ్రితుఁడై, యవన కాంతా సంసర్గమున దోషియై, (కాశికివచ్చి) గంగ మొదలుకొని యేఁబది రెండు మెట్ల పైనున్న తన యింట నుండిన వాఁడై, గంగ వచ్చి స్పృశించినచో నాత్మశుద్ధి యగునని కోరుకున్న వాడై ...) యని వ్రాసినాడు. పండితరాజునకు సన్నిహితకాలము వాఁడే యా గాథను నమ్మి వ్రాయఁగా నీనాఁటి వారు వానిని నమ్మి రనుటలో వింతయేమున్నది? ఈ గాథల కుపష్టంభకములుగా "న యాచే గజాళిం" - "యవనీ నవనీతకోమలాంగీ ..." మున్నగు శ్లోకములు లోకమున బహుళప్రచారమున కెక్కినవి. ఈ శ్లోకము లందలి లవంగి యెవ్వతె? లవంగీ శబ్దము సంస్కృతము గదా! యవనికి అట్టి పేరుండునా? యని పరిశీలించి కొంద ఱామె యవనియే కాని తల్లి భారతీయవనితయై యుండునని కల్పనలో నింకొక చిత్రమైన కల్పన చేయుట హాస్యాస్పదము. ఏమియు లేకయే యిట్టి కల్పనలు పుట్టునా యని పరిశీలింప - జగన్నాథపండితుని వలెనే 'పండితరాజ' బిరుద మొందిన వారు పెక్కురు గలరనియు, వారిలో "లోలంబరాజు, దయావీరశర్మ" మున్నగు వారు యవనస్త్రీలను బెండ్లాడి రనియుఁ దెలియవచ్చు చున్నది. పై యవన కాంతాసంబంధి పద్యములా 'పండితరాజు'లవి కావచ్చును.

లవంగితోఁ గూడఁ పండితరాజు కాశికి రాఁగా, నచటి పండితులు వెలివేయ తన పవిత్రత్వమును, కవితామహత్త్వమును బ్రదర్శింప నెంచి, లవంగి నొడియందుఁ గూర్చుండఁ బెట్టుకొని, యాశుకవితచే గంగను నుతింప శ్లోకమున కొకమెట్టు చొప్పునఁ బొంగివచ్చి గంగ యా దంపతులను దన యందు లీన మొనర్చుకొనెనని కదా లోకమునఁగల వదంతి? ఆ కథయే నిజమగు నేని యంతకు మున్నె రచించిన రసగంగాధరమున నీ గంగాలహరిలోని శ్లోకము లుదాహరింపఁబడు టెట్లు? "రసగంగాధర రచనకుఁ బూర్వమే యా శ్లోకములు రచించి యుంచుకొన్నవి యప్పుడు చదివినాఁ" డనినచో కథాకల్పన మంతయు నిస్సారమై, వికృతరూపము నందును. అని భావించియే ముప్పదియేండ్ల క్రిందట పండితారాధ్యుల నాగభూషణకవి కృత గంగాలహరి పీఠికయందు "పండితరాయని గూర్చిన కింవదంతులు నిరాధారము"లని సూచించితిని. సరిగా నే ననుకొనినట్లే కాశీహరిదాస గ్రంథమాల యందు ముద్రితమైన గంగాలహరి భూమిక యందు రామచంద్ర పణశీకరు మహాశయులు - "యేతు వదంతి అంతకాలే గంగాలహరీం పఠన్‌, ప్రసన్నతయా స్వసమీపే స్థితాయాం గంగాయాం విలీనః, సయవనీకః పండితరాజ ఇతి, తే తు భ్రాంతా ఏవ. గంగాలహరీ నిర్మాణానంతరమేవ రసగంగాధరం నిర్మితవా నిత్యత్ర నాస్తి సందేహలేశః, యతస్తేన రసగంగాధరే తత్తదలంకారోదాహరణ ప్రదర్శనార్థం గంగాలహర్యా బహూని పద్యా న్యుద్ధృతాని." (అంతకాలమున గంగాలహరిని జదువుచు పండితరాజు యవనీసహితుఁడై తన చెంతకు వచ్చిన గంగయందు విలీనుఁ డయ్యెనని చెప్పువారు భ్రాంతులు. రసగంగాధరమునఁ దత్తదలంకారోదాహరణ ప్రదర్శనార్థము గంగాలహరి నుండి పెక్కు పద్యములు స్వీకరింపఁ బడుటచే గంగాలహరీ నిర్మాణానంతరమే రసగంగాధర రచనచేసినాఁ డనుటలో సందేహము లేదు.) అని వ్రాసినారు. దానివలన నా యూహ భ్రమ కాదనుకొన్నాను.

పండితరాజు తెలుగువాఁడగుటయే కాదు, గోదావరీసప్తశాఖలలో నొకటి యగు కౌశికీపూరముచే పావనమైన కోనసీమకు నలంకార మనఁ దగిన మునిఖండ (ముంగండ) యను నగ్రహారమునఁ జనించి, కాశి యందు నివాస మేర్పఱుకొనిన పేరుమభట్టు (పేరుభట్టు) నామక షట్ఛాస్త్ర పండితుని పుత్రుఁడై పుట్టి, తండ్రివద్ద తర్కవ్యాకరణ మీమాంసాది సకల శాస్త్రముల నధ్యయనించి, మనోరమాకుచమర్దన, రసగంగాధరాది బహుశాస్త్రగ్రంథనిర్మాతయై, యనర్గళ కవితాధారచే జగము నుఱ్ఱూఁత లూఁగించిన యలోక ప్రతిభాశాలి. చిత్రమీమాంసా ఖండనమున అప్పయ్యదీక్షితుల వంటి మహాలంకారికుని దూర్పార బట్టుటవలన, దాక్షిణాత్యులో, యితరులో యసంబద్ధములగు నపవాదముల నంటఁగట్టిరనుట నిజమని యమ్మహనీయకీర్తిమూర్తి కొక్కమాఱు చేయెత్తిఁ మ్రొక్కి ప్రకృత మనుసరింతును.

అనువాదములు:

శ్రీ రామచంద్రయ్య గారు భావప్రధానముగా నెట్లనువదించిరో తెలియుటకై తక్కినవారి యనువాదములతో మూలముతోఁ గూడ మచ్చున కొకటిరెండు పద్యములను మాత్ర ముదహరింతును.

శ్లో.
మరుల్లీలాలోలల్లహరి లులితాంభోజపటలీ
స్ఖలత్పాంసువ్రాతచ్ఛురణ విసరత్కౌంకుమ రుచి ।
సురస్త్రీవక్షోజక్షర దగురు జంబాల జటిలం
జలం తే జంబాలం మమ జననజాలం జరయతు ॥
- మూలము.
మ.
అనిలోద్ధూత తరంగసంఘ చలితాబ్జాతస్ఖల త్పాంసురా
జి నితాంతాప్తిని గుంకుమారుణ రుచిశ్రీకంబులై, యప్సరో
వనితా పీనకుచాగురుప్రథితజంబాలంబులౌ నీదు పా
వనతోయంబులు పాపు మామక జనివ్రాతంబుల\న్‌ దల్లిరో.
- శ్రీ పండితారాధ్యుల నాగభూషణకవి.
మ.
విలసన్మంద మరుద్విలాస విచలద్వీచీహతిన్‌ దమ్మి పూ
వుల మొత్తంబులు రాల్చు పుప్పొడుల ప్రోవుల్‌ నిండి, సిందూరపుం
గులుకు ల్గొల్పఁగ, వేల్పుతొయ్యలుల జిల్గుం గుబ్బపాలిండ్ల పూ
తల తోడై యడుసైన నీ జలము మజ్జన్మార్తి శోధించుతన్‌.
- శ్రీ మోచర్ల రామకృష్ణయ్య.
ఉ.
కేళివిలోల నిర్జరమృగీనయనా తనులేప గంధ జం
బాలితముల్‌ మరుల్లులిత పద్మరజః పటలీపిశంగముల్‌
బాలజలేజ బాంధవ విభాద్రవమూర్తులు నీ జలమ్ము లీ
బాలిశు భావిసంజనన బాధలకుం దొలఁగించు గావుత\న్‌.
- శ్రీ పింగళి లక్ష్మీకాంతకవి.
శా.
వాతోత్తుంగ తరంగసంగి కమలవ్రాతోచ్చలత్పాంసువుల్‌
శీతాంభః కణరాజిఁ గౌంకుమరుచిశ్రీ రాగముల్‌ నింప, నో
మాతా, దేవవధూకుచాగురు గలన్మాలిన్య జంబాలమౌ
నీ తోయమ్ము హరించుఁ గాక వృజినానీకార్తిజంబాలమున్‌.
- డాక్టరు బూర్గుల రామకృష్ణారావు.
గీ.
గాలిచేఁ దూఁగు తరఁగలఁ గదలు తమ్మి
పుప్పొడుల నొప్పి, యచ్చర పూవుబోండ్ల
గుబ్బలందలి యగరున గుబురుకొనెడి
నీ జలము నా జననబాధ నీఱు సేయు.
- శ్రీ తిరుపతి వేంకటకవులు.
గీ.
చలదనిలలోల లహరులఁ గలఁగు తమ్ము
లురలుచు పరాగ మొలసి సిందురము బలసి
యచ్చరల చన్నుగవ జాఱు నగురుటసలఁ
జిక్కనౌ గంగ నాదు సంసృతిని జదుపు.
- శ్రీ రామచంద్ర కౌండిన్య.

పై యనువాదములలో నాలుగు మూలమున కించుమించుగాఁ బ్రతిబింబము లనవచ్చును. శ్రీ తిరుపతి వేంకటకవుల యనువాదము వలెనే శ్రీరామచంద్రయ్యగారి యనువాదము భావ మొక్కటియే పొందుపడ గీతమునందు వెలసినది. ఈ పద్ధతి కవితయందలి "ప్రౌఢి" యగునని యాలంకారిక మతము.

శ్లో.
పదార్థే వాక్యరచనా వాక్యార్థేచ పదాభిధా
ప్రౌఢి ర్వ్యాస సమాసౌచ సాభిప్రాయత్వ మస్యచ ॥

ఒక్క పదముచేఁ జెప్పఁ దగిన యర్థమును బెక్కు పదములచేఁ జెప్పుటయు, పెక్కు పదములచేఁ జెప్పఁదగిన యర్థము నొక్క పదముచేఁ జెప్పుటయు, వాక్యార్థమును విస్తరించి చెప్పుటయు, సంక్షేపముచేసి చెప్పుటయు, సాభిప్రాయముగఁ జెప్పుటయుఁ బ్రౌఢి యను కావ్యగుణము అని వామనుఁ డనెను. ఈ లక్షణము ననుసరించి రామచంద్రయ్యగారి కావ్యము నందంతటను వాక్యార్థమును సంక్షేపించి చెప్పుటయను "ప్రౌఢి" కనవచ్చును.

మ్మచ్చున కింకొక పద్యము మాత్రము చూపెదను. స్రగ్ధరావృత్త మందలి భావము సామాన్యముగా సీసపద్యమం దైనచో సుఖముగ రచింప వచ్చును. శార్దూల మత్తేభములం దైనచో కొంచెము క్లిష్టముగ నుండ వచ్చును. అట్టియెడ రామచంద్రయ్యగారు స్రగ్ధరలోని భావ మంతయు సులభముగ నొక గీతపద్యమున జెప్పినా రనినచో వీరి కవితయందలి ప్రౌఢిని వేఱ చెప్పుటెందులకు? చూడుడు -

స్రగ్ధర.
ద్యూతే నాగేంద్రకృత్తి ప్రమథగణమణిశ్రేణి నందీందుముఖ్యం
సర్వస్వం హారయిత్వా, స్వ మథ పురభిది ద్రాక్‌ పణీకర్తుకామే
సాకూతం హైమవత్యా మృదులహసితయా వీక్షితాయాస్తవాంబ!
వ్యాలోలోల్లాసి వల్గల్లహరినటఘటీతాండవం నః పునాతు ॥
- మూలము.
మ.
కరిచర్మం, బహికోటి, నందిని, గణౌఘంబు\న్‌, హిమాంశు\న్‌, దురో
దరమం దోడి శివుండు సర్వ; మటుపైఁ దన్నొడ్డ నుంకింప శాం
కరి సాకూతముగా దరస్మితమునన్‌ గన్గో, సమాలోల సుం
దరమౌ నీదు ప్రవాహతాండవము న\న్‌ ధన్యాత్ముఁగా జేయుతన్‌.
- శ్రీ పండితారాధ్యుల నాగభూషణకవి.
మ.
కరిచర్మ ప్రమథాహినంది విధురేఖాముఖ్య సర్వస్వము\న్‌
బురవిద్వేషణుఁ డోడి జూదమునఁ దన్నుం బందె మొగ్గంగ, న
త్తఱి; సాకూతముగా గిరీంద్రసుత మందస్మేరయై చూడ దొం
తరలై పొర్లుచు దొర్లు నీ యలల నృత్యం బోము మమ్మెప్పుడున్‌.
- శ్రీ మోచర్ల రామకృష్ణకవి.
శా.
ద్యూతమ్మందు ఫణీంద్రకృత్తి ప్రమథాదుల్‌ నందిరత్నౌఘముల్‌
చేతం గల్గిన వెల్ల నోడి శివుఁ డుత్సేకించి తన్నొడ్డ సా
కూతశ్రీ నుమ యల్లనన్‌ నగుచు గన్గో; నీ చలద్వీచికా
ఘాతోల్లోల విలోల తాండవ శుభాకారమ్ము మమ్మోముత\న్‌.
- డాక్టరు బూర్గుల రామకృష్ణారావు.
సీ.
తననేర్పు తన సంపద యెఱింగి నీ తోడ నాదిభిక్షువు జూద మాడుటేల?
ఆడెఁబో; పైబట్ట తోడ సర్వస్వమ్ము నోడియుఁ బ్రమథుల నోడుటేల?
నోడెఁబో; యంతలో నూరకుండఁగలేక యిల్లాలి నొడ్డఁగా నెంచుటేల?
ఎంచెఁబో; యామెయొక్కింతలోఁ జకితయై క్రీగంట నిన్ను నీక్షించుటేల?
సవతియే యగుఁగాక నీ సాటి సతిని జిన్నఁబుచ్చఁగ లహరుల చిందులేల?
మనసు పట్టఁగ లేక యీ మాట లంటి జనని! మీ లీల లెఱుఁగ నెవ్వని తరమ్ము?
- శ్రీ పింగళి లక్ష్మీకాంతకవి.
గీ.
నెత్తమున నందినాగేంద్రుకృత్తిముఖుల
నోడి, తుదఁ దానె పణముగా నాడ శివుఁడు
గౌరి సాకూతమృదుహాసఁ గాంచు తావ
కోల్లసద్భంగ తాండవం బోము మమ్ము.
- శ్రీ రామచంద్ర కౌండిన్య.

మొదటి మూఁడు పద్యములు నించుమించుగ మూలమునఁ బ్రతిబింబము లనదగును. ఇఁక నాలుగవదానిలో శ్రీ లక్ష్మీకాంతకవిగారు 'వాక్యార్థమును విస్తరించి చెప్పుట' యనెడి ప్రౌఢిని జూపఁగా, రామచంద్రయ్యగారు 'సంక్షేపించి చెప్పుట' యనెడి ప్రౌఢిని జూపినారు.

ఇట్టి వైశిష్ట్యముతో నాకారమునఁ జిన్నదైనను భావమున గంభీరతమంబైన గంగాలహరి నాద్యంతము ననువదించి, యాంధ్రసరస్వతి కొక వినూత్నాలంకారము గూర్చిన నామిత్రులు రామచంద్రయ్యగా రింకను గవితా తపస్సున నాంధ్రలోకమున కుపకార మొనరింపఁ గలరని యాశాసించుచున్నాను.

AndhraBharati AMdhra bhArati - padya kAvyamulu - gaMgAlahari - rAmachaMdra kauMDinya - OrugaMTi rAmachaMdrayya - Ramachandra Kaundinya - Oruganti Ramachandrayya - jagannAtha paMDitarAya gangAlaharI - Jagannadha Pandita gangalahari Panditaraya Gangalahari ( telugu kAvyamulu andhra kAvyamulu)