కావ్యములు గంగాలహరి రామచంద్ర కౌండిన్య
(ఓరుగంటి రామచంద్రయ్య)
అంకితము

ముప్పదేండ్లకు మునుపు
భరత జాతీయసమర సంబంధి
రాజకీయములఁ జిక్కి
అడఁగు నా యాధునికోన్నతవిద్యను
వీతాతంకముగఁ దీర్చిన ధీరోదాత్తులు,
నాఁటి యాంధ్రవిశ్వకళా పరిషదుపాధ్యక్షులు
స్వతంత్రభారతమున నీనాఁడు రాష్ట్రపతి,
వేదాంతవిదులు, వాగ్విదాంవరులు
రాజయోగి
శ్రీసర్వేపల్లి రాధాకృష్ణ పండితులకు
సవినయముగ సాభిమానముగ
మత్కృతజ్ఞతా చిహ్నముగ.
"జగ మెఱుఁగు నిన్ను, నీ కీ
జగమె కుటుంబమును, సర్వ జగతీతతులన్‌
మిగిలి వెలుఁగు పరతత్త్వా
ర్థ గభీర వచోవిలాస, రాధాకృష్ణా."
- రామచంద్ర కౌండిన్య, 1961.

ఆముఖము - శ్రీ దువ్వూరి వేంకటరమణశాస్త్రి

ఆలోకము - శ్రీ వెంపరాల సూర్యనారాయణశాస్త్రి

లోచనము - శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ

ఆమోదము - శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

అంజలి - రామచంద్ర కౌండిన్య
శ్రీ
గంగాలహరి
వసుధ కెల్ల సమృద్ధ సౌభాగ్య గరిమ,
జగ మెవని లీల యా మహేశ్వరు విభూతి,
శ్రుతుల సారము, సుమనస్సుకృతము రూపు,
అశివ మడఁచుత నీజల మమృతరోచి.
సమృద్ధం సౌభాగ్యం సకలవసుధాయాః కిమపి తన్‌
మహైశ్వర్యం లీలాజనితజగతః ఖండపరశోః ।
శ్రుతీనాం సర్వస్వం సుకృతమథ మూర్తం సుమనసాం
సుధాసౌందర్యం తే సలిలమశివం నః శమయతు ॥ 1॥
చెడుగుల యఘమ్ము, నిరుపేదబడుగు దైన్య
మింత కనినంత నిట్టె హరింప వలఁతి,
నా యవిద్యాద్రు దళనావధాయి గురువు
నీ ప్రవాహ మపార మందించు శుభము.
దరిద్రాణాం దైన్యం దురితమథ దుర్వాసనహృదాం
ద్రుతం దూరీకుర్వన్‌ సకృదపి గతో దృష్టిసరణిమ్‌ ।
అపి ద్రాగావిద్యా ద్రుమదళనదీక్షాగురురిహ
ప్రవాహ స్తే వారాం శ్రియమయ మపారాం దిశతు నః ॥ 2॥
ఉదయరవి కైతవమునఁ దన్నోర, కోర
చూపుల సపత్ని గన, గుడుసుళ్ళు వడుచుఁ
బె ల్లెగయు భంగములను విశ్వేశుసిగలఁ
జిందులిడు గంగ యఘభయోత్సేక ముడుపు.
ఉదంచన్మార్తాండ స్ఫుటకపటహేరంబజననీ
కటాక్షవ్యాక్షేప క్షణజనిత సంక్షోభనివహాః ।
భవంతు త్వంగంతో హరశిరసి గంగాతనుభువః
తరంగాః ప్రోత్తుంగా దురితభయభంగాయ భవతామ్‌ ॥ 3॥
అంబ నీ వూత వన్న గర్వంబు పెంచి
తఱిమితి నవజ్ఞ మెయికొన సురలనెల్ల;
ఇపు డుదాసీన, వనదనే నిఁక వచింపు
మేమిగతిఁ బరిదేవింతు నెవరి మ్రోల?
తవాలంబాదంబ స్ఫురదలఘుగర్వేణ సహసా
మయా సర్వేఽవజ్ఞాసరణిమథ నీతాః సురగణాః ।
ఇదానీమౌదాస్యం భజసి యది భాగీరథి! తదా
నిరాధారో హా రోదిమి కథయ కేషామిహ పురః ॥ 4॥
పున్నె మెఱుఁగదు, ఆమదిఁ బొదలి, లోని
తమము నెడలింతు విరులఁ జంద్రాంశు సరణి;
అఖిలసురవేద్య రసమూర్తి! అస్మదాత్మ
పాప మడఁపుము, త్రివిధతాపములఁ జెఱుపు.
స్మృతిం యాతా పుంసామకృతసుకృతానామపి చ యా
హరత్యంత స్తంద్రాం తిమిరమివ చంద్రాంశుసరణిః ।
ఇయం సా తే మూర్తిః సకలసురసంసేవ్య సలిలా
మమాంతః సంతాపం త్రివిధమపి పాపం చ హరతామ్‌ ॥ 5॥
తృణముగాఁ బ్రాజ్యరాజ్యమ్ముఁ దెగడి, వేగ
ప్రబ్బలుల నుబ్బు తటిఁ జేరఁబారి యుష్మ
దమృతమధురాంబువులఁ దనివారఁ గ్రోలు
ముద మపహసించు నిర్వాణపదవి నేని.
అపి ప్రాజ్యం రాజ్యం తృణమివ పరిత్యజ్య సహసా
విలోలద్వానీరం తవ జనని తీరం శ్రితవతామ్‌ ।
సుధాతః స్వాదీయస్సలిలభరమాతృప్తి పిబతాం
జనానామానందః పరిహసతి నిర్వాణపదవీమ్‌ ॥ 6॥
రేప నీరాడు నృపరమణీ పయోధ
రముల మృగమద మంబ తోయములఁ గలయు
నంత మృగములు స్వేచ్ఛమై నందనవని
మసలు విమలాంగముల దివౌకసులు గొలువ.
ప్రభాతే స్నాతీనాం నృపతిరమణీనాం కుచతటీ
గతో యావన్మాతర్మిలతి తవ తోయైర్మృగమదః ।
మృగా స్తావద్వైమానిక శతసహస్రైః పరివృతా
విశంతి స్వచ్ఛందం విమలవపుషో నందనవనమ్‌ ॥ 7॥
తలఁచిననె చాలు, తోన శాంతిలును మనసు,
పాడిననె పాయు భవతాపపాపనిచయ,
మది శ్రవోమంజులము 'గంగ' యను పదంబు
ప్రాణపదమున నాముఖాబ్జమున వఱలు.
స్మృతం సద్యః స్వాంతం విరచయతి శాంతం సకృదపి
ప్రగీతం యత్పాపం ఝటితి భవతాపం చ హరతి ।
ఇదం తద్గంగేతి శ్రవణరమణీయం ఖలు పదం
మమ ప్రాణప్రాంతర్వదన కమలాంత ర్విలసతు ॥ 8॥
దరుల నాడెడి ముదము ముప్పిరులు గొనఁగ
నమరపురి నైన నచటి కాకములు గొనవు,
జని మరణ తాపహర నివాసము త్వదీయ
తీర మది మామకార్తి నివారకంబు.
యదంతః ఖేలంతో బహుళతర సంతోషభరితా
న కాకా నాకాధీశ్వరనగర సాకాంక్షమనసః ।
నివాసాల్లోకానాం జని మరణశోకాపహరణం
యదేతత్తే తీరం శ్రమశమనధీరం భవతు నః ॥ 9॥
ఏకవాక్కులు శ్రుతులకే నెఱుఁగ రాని
దెది యవాఙ్మానసము, నిత్య, మెది యరూప,
మాత్మమహిమాస్తమిత తమ, మ్మమల, మట్టి
యతివిషయ తత్త్వ పరతత్త్వ మంబ, నీవు.
న యత్సాక్షాద్వేదైరపి గళితభేదై రవసితం
న యస్మిన్‌ జీవానాం ప్రసరతి మనోవాగవసరః ।
నిరాకారం నిత్యం నిజమహిమ నిర్వాసిత తమో
విశుద్ధం యత్తత్త్వం సురతటిని! తత్త్వం న విషయః ॥ 10॥
ధ్యాన దానాల, వివిధ వితానములను
విమల ఘోర తపాల లభింపనిది, య
చింత్యమౌ విష్ణుపదము పంచెదవు సర్వ
సులభముగ, నిన్ను సరితూఁగఁ గలరె యొరులు.
మహాదానై ర్ధ్యానై ర్బహువిధవితానై రపి చ యత్‌
న లభ్యం ఘోరాభిః సువిమల తపోరాశిభి రపి ।
అచింత్యం తద్విష్ణోః పదమఖిలసాధారణతయా
దదానా కేనాసి త్వమిహ తులనీయా కథయ నః ॥ 11॥
అలఁతి చూపున భవభయ మ్మపహరించు
నీ శివామూర్తి మహిమ వర్ణింతు రెవరు?
ఈసునను బ్రుంగి, కర మడ్డగింప గిరిజ
కొనక ని\న్‌ దాల్చు నియతి మౌళిని శివుండు.
నృణామీక్షామాత్రాదపి పరిహరంత్యా భవభయం
శివాయా స్తే మూర్తేః క ఇహ మహిమానం నిగదతు ।
అమర్షమ్లానాయాః పరమమనురోధం గిరిభువో
విహాయ శ్రీకంఠః శిరసి నియతం ధారయతి యామ్‌ ॥ 12॥
వెఱ్ఱియును దూఱు, పతితుఁడు వీడు; వ్రాత్యుఁ
డుచ్చరింపఁడు; గగురుపా టొదవి పిశునుఁ
డొల్లఁడును; ఇట్టి చెట్టల నుడుప, నలఁత
విరతి లేక మెలంగె దొక్కరిత నిలను.
వినింద్యాన్యున్మత్తై రపి చ పరిహార్యాణి పతితై
రవాచ్యాని వ్రాత్యైః సపులకమపాస్యాని పిశునైః ।
హరంతీ లోకానా మనవరత మేనాంసి కియతాం
కదా ప్యశ్రాంతా త్వం జగతి పునరేకా విజయసే ॥ 13॥
అవనివెతఁ దీర్ప దివినుండి భువికిఁ బఱచు
నిన్‌ బునుకదాల్చు జడముడి నిలుపు నఁటవె!
మహిత నిర్మోహులనె లోభమతులఁ జేయు
నీ గుణము పంట దోసమై నెగడె నంబ.
స్ఖలంతీ స్వర్లోకా దవనితల శోకాపహృతయే
జటాజూటగ్రంథౌ యదసి వినిబద్ధా పురభిదా ।
అయే నిర్లోభానా మపి మనసి లోభం జనయతాం
గుణానామేవాయం తవ జనని! దోషః పరిణతః ॥ 14॥
అంధులము, మూగ మొఱడుల, నవిటిఁ జెవిటి
దుర్గ్రహగ్రస్తుల, నఘాళిఁ దోర్చు వెరవు
కరవగుచు దేవతలు వీడ నరకగతులఁ
దేర్చు పరమౌషధమవు నదీమతల్లి.
జడా నంధాన్‌ పంగూన్‌ ప్రకృతిబధిరా నుక్తివికలాన్‌
గ్రహగ్రస్తా నస్తాఖిల దురితనిస్తార సరణీన్‌ ।
నిలింపై ర్నిర్ముక్తా నపి చ నిరయాంత ర్నిపతతో
నరానంబ! త్రాతుం త్వమిహ పరమం భేషజమసి ॥ 15॥
పుట్టుచల్వలు తేట లంబువుల మహిమ
లగణితంబులు, ముదముమై సగరగతులు
దివ్య తనుకాంతు లెనసి నుతింప రెందు
నాఁడు నేఁడును బులకరింతల వెలార్చి.
స్వభావస్వచ్ఛానాం సహజ శిశిరాణామయ మపా
మపారస్తే మాతర్జయతి మహిమా కోఽపి జగతి ।
ముదా యం గాయంతి ద్యుతల మనవద్యద్యుతిభృతః
సమాసాద్యాద్యాపి స్ఫుటపులకసాంద్రాః సగరజాః ॥ 16॥
వ్యథితహృదయ, నీచుఁ బాపి సత్వరము గావ
ముజ్జగమ్ములఁ దీర్ఘముల్‌ మొనయ వెన్ని?
పాప మాపక విధుల కవ్వలి కుశీలుఁ
బ్రోవ విలసిల్లు నీవలె నీవ తల్లి.
కృతక్షుద్రైనస్కా నథ ఝటితి సంతప్తమనసః
సముద్ధర్తుం సంతి త్రిభువనతలే తీర్థనివహాః ।
అపి ప్రాయశ్చిత్తప్రసరణ పథాతీతచరితాన్‌
నరానూరీకర్తుం త్వమివ జనని! త్వం విజయసే ॥ 17॥
ధర్మముల లిబ్బి, నూత్న మోదముల యుబ్బు,
మొదలి తీర్థము, త్రిభువనమ్ముల దుకూల
మజ్ఞుల హుళక్కి, విబుధజనాదృతంబు
సిరుల యుంకువ నీమేను చెఱుచు వ్యథల.
నిధానం ధర్మాణాం కిమపి చ విధానం నవముదాం
ప్రధానం తీర్థానా మమలపరిధానం త్రిజగతః ।
సమాధానం బుద్ధే రథ ఖలు తిరోధానమధియాం
శ్రియామాధానం నః పరిహరతు తాపం తవ వపుః ॥ 18॥
కల్లు విత్తము గావిరుల్‌ గన్న నృపుల
సరసఁ బరువులఁ దరుణదోషముల వనరి
తలఁతు నీవిధి యాత్మాహితమ్ము జడిమ
క్షణము నీ కృప కే వెలి చనుట నంచు.
పురో ధావం ధావం ద్రవిణమదిరా ఘూర్ణితదృశాం
మహీపానాం నానాతరుణతర ఖేదస్య నియతమ్‌ ।
మమైవాయం మంతుః స్వహితశతహంతు ర్జడధియో
వియోగ స్తే మాత ర్యదిహ కరుణాతః క్షణమపి ॥ 19॥
చలదనిలలోల లహరులఁ గలఁగు తమ్ము
లురలుచు పరాగ మొలసి, సిందురము బలసి,
అచ్చరల చన్నుగవ జారు నగురు టసలఁ
జిక్కనౌ గంగ నాదు సంసృతిని జదుపు.
మరుల్లీలాలోలల్లహరి లులితాంభోజపటలీ
స్ఖలత్పాంసువ్రాతచ్ఛురణ విసరత్కౌంకుమరుచి ।
సురస్త్రీవక్షోజ క్షర దగురుజంబాల జటిలం
జలం తే జంబాలం మమ జననజాలం జరయతు ॥ 20॥
మా రమణ పాదపద్మ సంభవము భవము,
మార పరిపంథి ఘన జటా మౌళి గృహము,
తనరు వ్యాసంగ మతి పతితావనమ్ము,
కలవఁటే, యంబ, సాటి యుత్కర్ష లెందు?
సముత్పత్తిః పద్మారమణ పదపద్మామలనఖాత్‌
నివాసః కందర్పప్రతిభట జటాజూటభవనే ।
అథాఽయం వ్యాసంగో హతపతిత నిస్తారణవిధౌ
న కస్మాదుత్కర్ష స్తవ జనని! జాగర్తు జగతః ॥ 21॥
ఝరు ల వెన్ని లేవు, పురభేది తల నెక్కు
చనవు, పద్మజేశు చరణపద్మ
ములనె గడుగు పరువ మలఁతియే నెనయు వే
ఱొక్కటున్నఁ గవుల కెక్క దఁటవె?
నగేభ్యో యాంతీనాం కథయ తటినీనాం కతమయా
పురాణాం సంహర్తుః సురధుని! కపర్దోఽధిరురుహే ।
కయా వా శ్రీభర్తుః పదకమలమక్షాళి సలిలై
స్తులాలేశో యస్యాం తవ జనని! దీయేత కవిభిః ॥ 22॥
అహిశయానత హరికి, నయ్యజు సమాధి,
హరుని తాండవ మిఁక నిరంతరము నెగడు,
వితయ దురితాపహృ త్తపః క్రతువు లింకఁ
గోర్కు లొసఁగు సవిత్రివి కొల్వు దీర.
విధత్తాం నిశ్శంకం నిరవధిసమాధిం విధిరహో!
సుఖం శేషే శేతాం హరిరవిరతం నృత్యతు హరః ।
కృతం ప్రాయశ్చిత్తై రలమథ తపోదానయజనైః
సవిత్రీ కామానాం యది జగతి జాగర్తి జననీ! ॥ 23॥
కరుణార్ద్ర ననద, యగతికుఁడు పుణ్య
గతిని, విశ్వోద్ధర్త్రి నతిపతితుండు,
తృష్ణార్తుఁ డమృతోదధిని, సిద్ధఘుటిని
బెనురోగి, యీ పసిబిడ్డ ని న్నంబ!
చేరినాఁడమ్మ, యౌచిత్యంబు నెఱపు.
అనాథః స్నేహార్ద్రాం విగళితగతిః పుణ్యగతిదాం
పత న్విశ్వోద్ధర్త్రీం గదవిదళితః సిద్ధభిషజమ్‌ ।
సుధాసింధుం తృష్ణాకులితహృదయో మాతరమయం
శిశుః సంప్రాప్త స్త్వా మహమిహ విదధ్యాః సముచితమ్‌ ॥ 24॥
సడి యడంగెను యమపురిఁ, జనిరి దవ్వు
ప్రేత వేఁటాడ దూతలు, త్రిదివవీథి
డిగు విమానాళి కెడ లేదు, జగతి నీదు
కథలు పర్వినమేర మాంగళ్యమూర్తి.
విలీనో వై వైవస్వతనగరకోలాహలభరో
గతా దూతా దూరం క్వచిదపి పరేతాన్‌ మృగయితుమ్‌ ।
విమానానాం వ్రాతో విదళయతి వీథి ర్దివిషదాం
కథా తే కల్యాణీ యదవధి మహీమండలమగాత్‌ ॥ 25॥
బలసెడి కామక్రోధం
బుల నెగసెడి సెగల దినముఁ బొగిలెడి మమ్మున్‌
దెలుచు మరుల్లాలిత త్వ
త్సలిల శిశిర శీకరముల సరణి సురధునీ.
స్ఫురత్కామక్రోధప్రబలతరసంజాతజటిల
జ్వరజ్వాలాజాలజ్వలితవపుషాం నః ప్రతిదినమ్‌ ।
హరంతాం సంతాపం కమపి మరుదుల్లాసలహరీ
ఛటాచంచత్పాథఃకణసరణయో దివ్యసరితః ॥ 26॥
అఖిల భువనాల భవన మజాండ మెగిచి
దొరలు తరఁగలు వేన తిందుకము వోలె,
హర విశాల జటాకీర్ణ మా త్వదీయ
వారి సంహతి మత్తాపహారి యౌత.
ఇదం హి బ్రహ్మాండం సకలభువనాభోగభవనం
తరంగై ర్యస్యాంతర్లుఠతి పరితస్తిందుకమివ ।
స ఏష శ్రీకంఠప్రవితత జటాజూటజటిలో
జలానాం సంఘాతస్తవ జనని! తాపం హరతు నః ॥ 27॥
వడి నెవనిఁ గాచుతమి లజ్జ ముడుఁగు తీర్థ
పాళి, పాణులు చెవిఁ జేరు భవ ముఖులకు,
అట్టి న న్నెదమెత్తనియమ్మ, ప్రోవు
వలఁతి వఖిలాఘ మథన దర్పములఁ దూల్ప.
త్రపంతే తీర్థాని త్వరితమిహ యస్యోద్ధృతివిధౌ
కరం కర్ణే కుర్వంత్యపి కిల కపాలిప్రభృతయః ।
ఇమం త్వం మామంబ త్వ మియ మనుకంపార్ద్రహృదయే
పునానా సర్వేషామఘమథనదర్పం దలయసి ॥ 28॥
శ్వపచులును సేయఁగా గొంకు పాపములకు
నేకనిలయుని న న్నుద్ధరించు వేడ్కఁ
దల్లి, సమకూర్తు వఖిల సాధనము లీవు;
నిను నుతింపఁగ నరపశువునకుఁ దరమె?
శ్వపాకానాం వ్రాతై రమితవిచికిత్సా విచలితై
ర్విముక్తానామేకం కిల సదనమేనఃపరిషదామ్‌ ।
అహో! మాముద్ధర్తుం జనని ఘటయంత్యాః పరికరం
తవ శ్లాఘాం కర్తుం కథమివ సమర్థో నరపశుః ॥ 29॥
కాలమాదిగఁ గనవె యొక్కరుని, వేనిఁ
బ్రోవఁగల్గుట జగతి కబ్బురముసేఁతఁ?
ఏండ్లుపూం డ్లిట్టు లేల చింతిలుదు వమ్మ,
ఇదిగొ వచ్చితిఁ గోర్కి పండింప వమ్మ.
న కోఽప్యేతావంతం ఖలు సమయమారభ్య మిళితో
యదుద్ధారాదారాద్భవతి జగతో విస్మయభరః ।
ఇతీమామీహాం తే మనసి చిరకాలం స్థితవతీ
మయం సంప్రాప్తోఽహం సఫలయితు మంబ! ప్రణయ నః ॥ 30॥
వరవుడమ్ము, కల్ల, పరపాప చింతన,
కపటవాద నిరతి, కలుష గుణము
లిన్ని వినుచు వినుచు, ఈ మొగ మ్మీ మొద్దు
లెవరు చూతు రమ్మ, యీవు దక్క?
శ్వవృత్తిర్వ్యాసంగో నియత మథ మిథ్యాప్రలపనం
కుతర్కేష్వభ్యాసః సతతపర పైశున్యమననమ్‌ ।
అపి శ్రావం శ్రావం మమ తు పునరేవం గుణగుణా
నృతే త్వత్కో నామ క్షణమపి నిరీక్షేత వదనమ్‌ ॥ 31॥
ఇంత లంతలు గనులున్న నేమి ఫలము,
పరమరమణీయ, కమనీయ వపువు నిన్నుఁ
గనుట లేదేని; చెవులున్న పెను పదేమి,
నీ లహరి మర్మరముల స్పందింప వేని?
విశాలాభ్యామాభ్యాం కిమిహ నయనాభ్యాం ఖలు ఫలం
న యాభ్యామాలీఢా పరమరమణీయా తవ తనుః ।
అయం హి న్యక్కారో జనని! మనుజస్య శ్రవణయో
ర్యయోర్నాంతర్యాతస్తవ లహరిలీలాకలకలః ॥ 32॥
ఎసఁగ దా పంపకము, పుణ్యకృతికి స్వేచ్ఛ
సురపురి విమానయానము, నరకపాత
మవశపాపికి; నీ లీల లఖిలకలుష
దలనములు వోని యశుభభూములనె గాని.
విమానైః స్వచ్ఛందం సురపురమయంతే సుకృతినః
పతంతి ద్రాక్‌ పాపా జనని నరకాంతః పరవశాః ।
విభాగోఽయం తస్మిన్నశుభమూర్తౌ జనపదే
న యత్ర త్వల్లీలా దళిత మనుజాశేషకలుషా ॥ 33॥
పసిడి మ్రుచ్చిలింత, పానంబు, గురుసతి
పొందు, విప్రఘాత లందుఁ బెరిగి,
సురుగ నీ జలాన, దొరకు సురార్చిత
పదవి యజన దాన పరుల కుపరి.
అపి ఘ్నంతో విప్రానవిరతముశంతో గురుసతీః
పిబంతో మైరేయం పునరపి హరంతశ్చ కనకమ్‌ ।
విహాయ త్వయ్యంతే తనుమతనుదానాధ్వరజుషా
ముపర్యంబ! క్రీడంత్యఖిలసురసంభావితపదాః ॥ 34॥
అరిది విరితావి, విరహజర్జరత యుసురు
లాహరించెడి పవమానుఁ డఖిలజగము
బావనము సేయు నెట్లు, లీలావిలోల
త్వ ల్లహరిమేలనముల వాసిల్ల కున్న?
అలభ్యం సౌరభ్యం హరతి సతతం యః సుమనసాం
క్షణాదేవ ప్రాణానపి విరహశస్త్రక్షతహృదామ్‌ ।
త్వదీయానాం లీలాచలితలహరీణాం వ్యతికరాత్‌
పునీతే సోఽపి ద్రాగహహ! పవమానస్త్రిభువనమ్‌ ॥ 35॥
ఎందును నిహార్థఘటకులె యుందు రరుదు
పరమె గోరు పునీతులు; పరము నిహము
నీ జగన్నాథునకు నీవ; నీదు కరుణ
నెనయుటను గాదె సుఖము నిద్రింతు నంబ.
కియంతః సంత్యేకే నియతమిహలోకార్థఘటకాః
పరే పూతాత్మానః కతి చ పరలోకప్రణయినః ।
సుఖం శేతే మాతస్తవ ఖలు కృపాతః పునరయం
జగన్నాథః శశ్వత్త్వయి నిహితలోకద్వయభరః ॥ 36॥
అవును, దురితములన్న మక్కువయె నాకు;
ఈవు తలఁగితె తల్లి, నికృష్టవ్రాత్య
పతిత రక్షాప్రియత్వ మావంత యేని?
తరమె నైజమ్ము ద్రోయ నెవ్వరికి నేని?
భవత్యా హి వ్రాత్యాధమపతిత పాఖండపరిషత్‌
పరిత్రాణస్నేహః శ్లథయితు మశక్యః ఖలు యథా ।
మమాప్యేవం ప్రేమా దురితనివహేష్వంబ! జగతి
స్వభావోఽయం సర్వైరపి ఖలు యతో దుష్పరిహరః ॥ 37॥
సంజ శివుఁ డాడ నూగాడు జడల దరుల
నడచు తరఁగల త్రుళ్ళింత హస్తచాల
నముగ, బిలముల జలఘట్టనమ్ము డమరు
టంకృతిగఁ దీర్చు గంగతాండవము రుచులఁ
దిరుగుమొగ మౌత సంతాపభరము మాకు.
ప్రదోషాంత ర్నృత్యత్పురమథనలీలోద్ధృతజటా
తటాభోగ ప్రేంఖల్లహరి భుజసంతానవిధుతిః ।
బిలక్రోడక్రీడజ్జల డమరుటంకార సుభగ
స్తిరోధత్తాం తాపం త్రిదశతటినీ తాండవవిధిః ॥ 38॥
సతము నీ యంద కుశలయోజనము నిల్పు
నన్‌ విషమవేళ యిపుడు పోనాడె దేని,
సకల జగముల సమయు విశ్వాస మెల్ల,
అగు నిరాధార మదియు నిర్వ్యాజకరుణ.
సదైవ త్వయ్యేవార్పిత కుశలచింతాభరమిమం
యది త్వం మామంబ త్యజసి సమయేఽస్మిన్సువిషమే ।
తదా విశ్వాసోఽయం త్రిభువనతలాదస్తమయ తే
నిరాధారా చేయం భవతి ఖలు నిర్వ్యాజకరుణా ॥ 39॥
ప్రణయినికి మేనుపంచు పురారి కబరి
దొరఁగి, నిద్దంపు సీమంత సరణిఁ జింద,
సవతిచూపుల నినిచి శాంభవి మనోజ్ఞ
కరమునఁ దెరల్చు త్వ త్తరంగములు గెలుచు.
కపర్దాదుల్లస్య ప్రణయమిలదర్ధాంగయువతేః
పురారేః ప్రేంఖంత్యో మృదులతర సీమంతసరణౌ ।
భవాన్యా సాపత్న్యస్ఫురితనయనం కోమలరుచా
కరేణాక్షిప్తాస్తే జనని విజయంతాం లహరయః ॥ 40॥
కామితఫలదాయిని వని కలజగాల
నెందఱో నీవ శరణందు రిల మదంబ!
అయిన నా నైజ మిద్ది, నీ యంద నిలుచు
నాన మెఱుఁగని ప్రేమ, నీ యాన సుమ్ము.
ప్రపద్యంతే లోకాః కతి న భవతీమత్రభవతీ
ముపాధిస్తత్రాయం స్ఫురతి యదభీష్టం వితరసి ।
శపే తుభ్యం మాతర్మమ తు పునరాత్మా సురధుని!
స్వభావాదేవ త్వయ్యమితమనురాగం విధృతవాన్‌ ॥ 41॥
మురిపెముల చుక్క జనులమోములను, తరుణ
తరణి పురు డంధకార నిస్తరణములను,
చెడగు విధివ్రాతఁ చెఱుపు, సంచితపుఁ దుడుపు,
గాంగమృత్తిక సర్వశోకముల మలుపు.
లలాటే యా లోకైరిహ ఖలు సలీలం తిలకితా
తమో హంతుం ధత్తే తరుణతరమార్తాండతులనామ్‌ ।
విలుంపంతీ సద్యో విధిలిఖితదుర్వర్ణసరణిం
త్వదీయా సా మృత్స్నా మమ హరతు కృత్స్నామపి శుచమ్‌ ॥ 42॥
ఊరిప్రేముడి విడివోని మోఱకులకు
విరియు పూవుల నవ్వుల వెక్కిరింత,
కమ్మతావుల నళికోటి కప్పు విప్పు
లొలయు నీ తీరతరువులు చెలులు మాకు.
నరాన్‌ మూఢాంస్తత్త జ్జనపదసమాసక్త మనసో
హసంతః సోల్లాసం వికచకుసుమవ్రాత మిషతః ।
పునానాః సౌరభ్యైః సతతమలినో నిత్యమలినాన్‌
సఖాయో నః సంతు త్రిదశతటినీతీర తరవః ॥ 43॥
యమ నియమరక్తి, కఠిన సేవానువృత్తి,
సవనసక్తి భజింత్రు నిర్జరుల జనులు;
ఏనొ, త్రిపథగ! నిన్నెంచి, యెనసి కోర్కి,
తలఁతు దృణజాలముగ జగజ్జాల మంబ.
యజంత్యేకే దేవాన్‌ కఠినతరసేవాంస్తదపరే
వితానవ్యాసక్తా యమనియమరక్తాః కతిపయే ।
అహం తు త్వన్నామస్మరణకృతకామ స్త్రిపథగే!
జగజ్జాలం జానే జనని తృణజాలేన సదృశమ్‌ ॥ 44॥
పుట్టినదె తోడు పున్నెమ్ముఁ బ్రోది సేయు
జనుల సేమమ్ము దడవ లక్షలు విబుధులు;
పట్టు కరవైన చెనఁటి జేపట్టి హితము
నెన్న లోకాల నీ కన్య లెవరె తల్లి?
అవిశ్రాంతం జన్మావధి సుకృతజన్మార్జనకృతాం
సతాం శ్రేయః కర్తుం కతి న కృతినః సంతి విబుధాః ।
నిరస్తాలంబానామకృతసుకృతానాం తు భవతీం
వినాఽముష్మింల్లోకే న పరమవలోకే హితకరమ్‌ ॥ 45॥
నీ సలిల మాని దుడుకు సావాసగాండ్ర
సంగతి నెఱుంగ సుంత విశ్రాంతి, సుఖము
కూర్కి యెఱుఁగను, కరుణ జోకొట్టు చిరము
పిల్లగాలులఁ చలువలఁ జల్లి యొడిని.
పయః పీత్వా మాతస్తవ సపది యాతః సహచరై
ర్విమూఢైః సంరంతుం క్వచిదపి న విశ్రాంతిమగమమ్‌ ।
ఇదానీముత్సంగే మృదుపవనసంచారశిశిరే
చిరాదున్నిద్రం మాం సదయహృదయే! శాయయ చిరమ్‌ ॥ 46॥
వడి ఘటింపుము దృఢశోభఁ బరికరముల
ఫణులనే నిల్పు మకుటాన బాలశశిని,
అలఁతి ననుకోకు, మిది నవ్వులాట గాదు
సుమి, జగన్నాథుఁ నుద్ధార సమయ మంబ.
బధాన ద్రాగేవ ద్రఢిమరమణీయం పరికరం
కిరీటే బాలేందుం నియమయ పునః పన్నగగణైః ।
న కుర్యాస్త్వం హేలామితర జనసాధారణతయా
జగన్నాథస్యాయం సురధుని! సముద్ధార సమయః ॥ 47॥
శశికలోత్తంస, శారదచంద్రధవల,
వరభయాపోహనాబ్జకుంభాంచితకర,
అమృతరుచిరాంబరవిభూష, యచ్ఛమకర
వాహనను గొల్చి పరిభవంపడు నెవండు?
శరచ్చంద్రశ్వేతాం శశిశకలశ్వేతాలముకుటాం
కరైః కుంభాంభోజే వరభయనిరాసౌ చ దధతీమ్‌ ।
సుధాధారాకారాభరణవసనాం శుభ్రమకర
స్థితాం త్వాం యే ధ్యాయంత్యుదయతి న తేషాం పరిభవః ॥ 48॥
సతము భవతాపభర్జిత జనుల మనుచు
దరహసన్ముఖకాంతి సుధాస్రవంతి,
చిత్కలాచంద్రికాకృతచిత్ర, నాదు
తనువు నోముత వేగ శంతనుని తన్వి.
దరస్మిత సముల్లసద్వదనకాంతిపూరామృతై
ర్భవజ్వలనభర్జితా ననిశమూర్జయంతీ నరాన్‌ ।
చిదేకమయచంద్రికాచయచమత్కృతిం తన్వతీ
తనోతు మమ శం తనోః సపది శంతనోరంగనా ॥ 49॥
అడఁగె మంత్రము, లోషధుల్‌ ముడిఁగె, సురలు
వెఱగొనిరి, సాంద్ర మమృతంబు పఱచె, గరుడ
మణులు చెదరెను, భవవహ్ని మలుచు నన్ను,
కరుణ నిఁకఁ దాప మార్పవె, కాళియాహి
యహితు పదములఁ గడిగిన యమరగంగ.
మంత్రైర్మీలితమౌషధైర్ముకుళితం త్రస్తం సురాణాం గణైః
స్రస్తం సాంద్రసుధారసైర్విదళితం గారుత్మతైర్గ్రావభిః ।
వీచిక్షాళితకాళియాహితపదే స్వర్లోకకల్లోలిని!
త్వం తాపం నిరయాధునా మమ భవజ్వాలావలీఢాత్మనః ॥ 50॥
నెత్తమున నంది నాగేందు కృత్తిముఖుల
నోడి, తుదఁ దానె పణముగా నాడ శివుఁడు,
గౌరి సాకూత మృదుహాసఁ గాంచు తావ
కోల్లసద్భంగ తాండవం బోము మమ్ము.
ద్యూతే నాగేంద్రకృత్తిప్రమథగణమణిశ్రేణినందీందుముఖ్యం
సర్వస్వం హారయిత్వా స్వమథ పురభిది ద్రాక్‌ పణీకర్తుకామే ।
సాకూతం హైమవత్యా మృదులహసితయా వీక్షితాయాస్తవాంబ!
వ్యాలోలోల్లాసివల్గల్లహరినటఘటీతాండవం నః పునాతు ॥ 51॥
అంగజారి యుత్తమాంగావతంసమ్ము,
ప్రణతభంగ శీఘ్రభంజకమ్ము,
చలితతుంగభంగచారువునౌ గంగ,
ననుచు నిర్మలాంగ మెనయ నన్ను.
విభూషితానంగరిపూత్తమాంగా
సద్యఃకృతానేకజనార్తిభంగా ।
మనోహరోత్తుంగ చలత్తరంగా
గంగా మమాంగాన్యమలీకరోతు ॥ 52॥
ఇదియు జగన్నాథోదిత
సదమల పీయూషలహరి, సాంధ్రము; దీనిన్‌
జదివిన చదురులు సుఖసం
పదలఁ బొదలి గాంగపద నిభంబులె యౌతన్‌.
ఇమాం పీయూషలహరీం
జగన్నాథేన నిర్మితామ్‌ ।
యః పఠేత్తస్య సర్వత్ర
జాయతే సుఖసంపదః ॥
AndhraBharati AMdhra bhArati - padya kAvyamulu - gaMgAlahari - rAmachaMdra kauMDinya - OrugaMTi rAmachaMdrayya - Ramachandra Kaundinya - Oruganti Ramachandrayya - jagannAtha paMDitarAya gangAlaharI - Jagannadha Pandita gangalahari Panditaraya Gangalahari ( telugu kAvyamulu andhra kAvyamulu)