కావ్యములు మను చరిత్రము అవతారిక
ఇష్టదేవతా వందనము
ఉ. శ్రీ వక్షోజ కురంగనాభ మెదపైఁ జెన్నొంద విశ్వంభరా
దేవిన్‌ దత్కమలా సమీపమునఁ బ్రీతిన్‌ నిల్పినాఁడో యనం
గా వందారు సనందనాది నిజభక్త శ్రేణికిం దోఁచు రా
జీవాక్షుండు గృతార్థుఁజేయు శుభదృష్టిన్‌ గృష్ణరాయాధిపు\న్‌.
1
ఉ. ఉల్లమునందు నక్కటిక మూనుట మీకులమందుఁ గంటి మం
చల్లన మేలమాడు నచలాత్మజ మాటకు లేఁతనవ్వు సం
ధిల్లఁ గిరీటిఁ బాశుపత దివ్యశరాఢ్యునిఁ జేయు శాంబరీ
భిల్లుఁడు గృష్ణరాయల కభీష్టశుభ ప్రతిపాది గావుతన్‌.
2
ఉ. నాలుగు మోముల\న్‌ నిగమ నాదము లుప్పతిలం బ్రచండవా
తూలహతి\న్‌ జనించు రొదతోడి గుహావళి నొప్పు మేరువుం
బోలి పయోజపీఠి మునిముఖ్యులు గొల్వఁగ వాణిఁ గూడి పే
రోలగ మున్న ధాత విభవోజ్జ్వలుఁ జేయుతఁ గృష్ణరాయని\న్‌.
3
ఉ. అంకముఁ జేరి శైలతనయాస్తన దుగ్ధము లానువేళ బా
ల్యాంక విచేష్టఁ దొండమున నవ్వలి చ\న్‌ కబళింపఁబోయి యా
వంకఁ గుచంబు గాన కహివల్లభహారముఁ గాంచి వే మృణా
ళాంకురశంక నంటెడు గజాస్యునిఁ గొల్తు నభీష్టసిద్ధికి\న్‌.
4
సీ. చేర్చుక్కగా నిడ్డ చిన్నిజాబిల్లిచే, సిందూరతిలకంబు చెమ్మగిల్ల
నవతంసకుసుమంబు నందున్న యెలదేఁటి, రుతి కించిదంచిత శ్రుతుల నీన
ఘనమైన రారాపు చనుదోయి రాయిడిఁ, దుంబీఫలంబు తుందుడుకుఁ జెందఁ
దరుణాంగుళిచ్ఛాయ దంతపుసరకట్టు, లింగిలీకపు వింతరంగు లీన
 
తే. నుపనిషత్తులు బోటులై యోలగింపఁ
బుండరీకాసనమునఁ గూర్చుండి మదికి
నించువేడుక వీణ వాయించు చెలువ
నలువరాణి మదాత్మలో వెలయుఁగాత!
5
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - avatArika ( telugu andhra )