కావ్యములు మను చరిత్రము షష్ఠాశ్వాసము
ఆశ్వాసాంత పద్యగద్యములు
శా. వ్యాయామ స్థిరసంధిబంధ! కటకాధ్యక్షానుగక్షోణి భృ
త్కాయ గ్రావభిదా విధా భిదురదోఃఖడ్గాగ్ర! యుగ్రాచల
జ్యాయః కీర్తి భర ప్రంచ! వరపంచారామ రామామణీ
గేయామేయజయాంక! పంకజదృగంగీకార ధీరాకృతీ!
124
క. కాంతా లతాంతశర! యే
కాంతిక భక్తి ప్రతోషితాంభోధిసుతా
కాంతా! ప్రతాప రవిశశి
కాంతాయిత విమతనృపతి కాంతాహృదయా!
125
వన
మయూరము.
రాజపరమేశ! ఫణిరాజబల! ఫుల్లాం
భోజముఖ! భోజముఖ భూప! విపులాంసో
త్తేజిత ధరాభరణ దీక్షితభుజా! ని
ర్వ్యాజభయదాజి విజితారి నృపరాజీ!
126
గద్యము. ఇది శ్రీ మదాంధ్రకవితాపితామహ సర్వతోముఖాంక పంకజాక్ష
పాదాంబుజాధీన మానసేందిందిర నందవరపుర వంశోత్తంస శఠకోప
తాపస ప్రసాదసమాసాదిత చతుర్విధ కవితామతల్లి కాల్లసానిచొక్కయామాత్య
పుత్త్ర పెద్దనార్య ప్రణీతంబైన స్వారోచిష మనుసంభవం బను మహా
ప్రబంధంబునందు సర్వంబును షష్ఠాశ్వాసము.
 
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - manu charitramu - shhashhThAshvAsamu ( telugu andhra )