కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన అవతారిక
పారిజాతాపహరణము - అవతారిక
ఇష్టదేవతా స్తుతి
ఉ. శ్రీమదికిం బ్రియం బెసఁగఁ జేర్చిన యుయ్యెల లీల వైజయం
తీ మిళితాచ్ఛ కౌస్తుభము నిద్దపుఁ గాంతిఁ దనర్చి యాత్మ వ
క్షోమణి వేదిఁ బొల్పెసఁగఁ జూడ్కుల పండువు సేయు వేంకట
స్వామి కృతార్థుఁ జేయు నరస క్షితినాథుని కృష్ణరాయనిన్‌.
1
మ. పొలఁతుల్‌ కౌఁగిటఁ గ్రుచ్చి యెత్తి తలఁబ్రా ల్వోయించు నవ్వేళ నౌఁ
దల గంగం దన నీడఁ దాన కని మౌగ్ధ్యం బొప్ప వేఱొక్క తొ
య్యలి యంచున్మది నెంచు పార్వతి యసూయావాప్తికిన్నవ్వు క్రొ
న్నెలపూఁ దాలుపు కృష్ణరాయనికి సంధించు న్మహైశ్వర్యముల్‌.
2
మ. తన దంతాగ్రముచేతఁ దీక్ష్ణమతి, నుద్య త్కుంభయుగ్మంబుచే
త నితాంతోన్నతి, దాన విస్ఫురణ నుత్సాహంబు, శుండా ముఖం
బున దీర్ఘాయువు నిచ్చుఁ గావుత గుణాంభోరాశికిం గృష్ణరా
యనికి న్వారణ రాజ వక్త్రుఁడు కృపాయత్తైక చిత్తాబ్జుఁడై.
3
చ. సరసపు టల్కఁ దీర్చుతఱి శార్ఙ్గ సుదర్శన నంద కాబ్జ సం
భరణ గుణాప్తి నెన్నడుముపైఁ గటిపై జడపై గళంబుపై
హరి నలుగేలుఁ బైకొన సుఖాంబుధి నిచ్చలు నోలలాడు నిం
దిర కృపఁ జూచుఁ గాత నరదేవ శిఖామణిఁ గృష్ణరాయనిన్‌.
4
చ. తన మృదు గీతికా పరిణత ధ్వని వైఖరిఁ బల్కు మంచు నిం
చిన రహిఁ జేతివీణియకుఁ జెక్కులు గీఁటుచు నేర్పుచున్నదో
యన నఖరాంకురంబుల నయమ్మునఁ దంత్రులు మీటి గాన మిం
పొనరఁగఁ జేయు వాణి ప్రతిభోన్నతుఁ జేయుతఁ గృష్ణరాయనిన్‌.
5
చ. వలిమల యల్లువాఁడు తలవాఁక ధరించిన పూవుగుత్తి, వే
ల్పులగమి జీవగఱ్ఱ, యుడివోవని చల్వల టెంకి, వెన్నెల
ల్మొలచిన పాదు, పాల్కడలి ముద్దులపట్టి నృసింహ కృష్ణరా
యలఁ గరుణారసంబు నినుపారెడి చూపులఁ జూచుఁ గావుతన్‌
6
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )