కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన అవతారిక
కృతిపతి వంశ (కృష్ణ) ప్రశస్తి
ఉ. ఆ యమృతాంశునం దుదయమయ్యె బుధుం, డతఁ డార్తరక్షణో
పాయుఁ బురూరవుంగనియె, నాతని కాయువు పుత్త్రుఁ డయ్యె, న
య్యాయతకీర్తికి న్నహుషుఁ డాత్మజుఁడై యిలయేలెఁ, దత్సుతుం
డై యలరె న్యయాతి, యతఁడాహవదోహలుగాంచెఁ దుర్వసు\న్‌.
7
క. ఉర్వీశమౌళి యగు నా
తుర్వసు వంశంబునందు దుష్టారి భుజా
దుర్వార గర్వ రేఖా
నిర్వాపకుఁ డీశ్వరాఖ్య నృపతి జనించె\న్‌.
8
ఉ. తామసవృత్తి లేదు, సతతంబు నుగ్రుఁడు గాఁడు, పౌరుషం
బేమియు వెల్తి గాదు, తన కెందును బైమఱి రాజు లేఁడు, సం
గ్రామములోన నొక్క నరుగాసికి వాసి దొఱంగఁ, డీశ్వర
క్ష్మా మహిళా మనోహరుని సాటియె యీశ్వరుఁ డెన్ని భంగుల\న్‌.
9
ఉ. రాజులనెత్తుటం బరశురాముఁడు వ్రంతలు సేసె రెండుమూఁ
డీ జగతి\న్‌, గణింప నది యెంతటి విస్మయ! మబ్జినీ సుహృ
త్తేజుఁడు కందుకూరి కడఁ దిమ్మయ యీశ్వరుచే జనించె ఘో
రాజి బెడందకోట యవనాశ్విక రక్త నదీ సహస్రముల్‌.
10
క. శాశ్వత విజయుఁడు తిమ్మయ
యీశ్వర నృపతికిని గౌరి కెన యగు తత్ప్రా
ణేశ్వరి లక్కాంబికకు
న్విశ్వాతిగ యశుఁడు సరసవిభుఁ డుదయించె.
11
సీ. ఎవ్వాని విజయంబు లెఱిఁగించు శాసన - స్తంభంబుఁ లాశాంత శైల వితతు
లెవ్వాని యరిఁగాపు లేపారు కాళింగ - యవనాది వివిధ దేశాధినాథు
లెవ్వాని నిత్య దానైక విలాసంబు - లారూఢతర తులాపూరుషంబు
లెవ్వాని చిరకీర్తు లింద్రలోకాంగనా - భోగినీ గీతికాభోగ పదము
 
తే. వాఁడు వొగడొందు సర్వసర్వంసహాధి
దేవతా ముఖదర్పణ ద్విజయనగర
భద్ర సింహాసనస్థుఁ డున్నిద్ర తేజుఁ
డీశ్వరాధిపు నరస భూమీశ్వరుండు.
12
సీ. కుంతలేశ్వరుఁడు సిక్కు వడంగ విద్యాపు - రంబు గై కొని నిజప్రౌఢి నెఱపెఁ
బారసీకునకు దుర్భర మానవత్వంబుఁ - దొలఁగించె మానవదుర్గ సీమఁ
జోళ వల్లభునకు సురవధూ మధురాధ - రము లిచ్చి మధురాపురంబుఁ గొనియె
శ్రీరంగ పట్టణసీమ ఖడ్గనటీ వి - నోదంబు యావనేంద్రునకుఁ జూపె
 
తే. నతఁడు నుతికెక్కె రామసేత్వంతరాళ
కలిత షోడశదాన విఖ్యాత యశుఁడు,
మండలీకర మేఘ మార్తాండ బిరుదుఁ
డీశ్వరాధిపు నరస పృథ్వీశ్వరుండు.
13
క. ఆ నరస మహీమహిళా
జానికిఁ గులసతులు పుణ్యచరితలు తిప్పాం
బా నాగాంబిక లిరువురు
దానవ దమనునకు రమయు ధరయును బోలె\న్‌.
14
క. వారలలోఁ దిప్పాంబ కు
మారుఁడు పరిపంథి కంధి మంథాచలమై
వీరనరసింహరాయుఁడు
వారాశి పరీశ భూమి వలయం బేలె\న్‌.
15
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )