కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
ప్రభాత శోభ
సీ. యామినీ సమయంబు నాశా తట ప్రదే - శంబుఁ బ్రసన్నభావంబు నొందెఁ
బ్రియ చుంబితాంగనా బింబాధరంబులు - నుడురాజు నపరాగయుక్తిఁ దోఁచె,
నఖిలవస్తువులుఁ బ్రాగచల కూట విటంక - తలములు నతిరోహితంబు లయ్యె,
నుత్తుంగ పుర గోపురోపరి స్థలులు సా - రసములు నాత్తసౌరభము లయ్యెఁ,
 
తే. దరళ గోతర్ణకంబులు సుర పథాంత
రంబులును విచ్యుత ప్రగ్రహంబు లయ్యె,
నియమ పరతంత్ర భూదేవ చయముఁ గౌశి
కవ్రజంబు సమాధి యోగమునఁ బరఁగె.
68
మ. కమలాప్తోన్నమ దంశు జాలములు దిద్భాగంబులం గ్రమ్మినం
గుముదాంతఃస్థిత లక్ష్మి యెండవడ సోఁకుల్‌ సైఁపఁగా లేక ప
త్రముల న్మాటుగఁ జేసి కప్పుకొనియెం దత్కాల సంకోచన
క్రమ దంభంబున, రాజవల్లభ లసూర్యంపశ్య లౌదు ర్గదా!
69
చ. కొలకొల మంచు మేఁతలకు గూఁడులు వెల్వడు పక్షి రావముల్‌
కల మృదు వాక్య వైఖరులుగా నల వేకువ పూవుఁబోఁడి వే
డ్కలు దళుకొత్త దోహద మిడం దొలిగుబ్బలిఁ గొండగోఁగుపూ
గొల యలరించెనాఁ బొడిచెఁ గోకనదాప్తుఁడు పాటల ద్యుతి\న్‌.
70
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )