కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
శ్రీకృష్ణునకు వైతాళికుల మేల్కొలుపులు
మ. జయ గోవింద! ముకుంద! చక్రధర! కంసద్వేషి! సాత్రాజితీ
ప్రియ! నారాయణ! కౌస్తుభాభరణ! కుంభి త్రాణ పారీణ! కా
ళియ దర్పఘ్న! పతంగ వాహ! వనమాలీ! కృష్ణ! వైకుంఠ! శౌ
రి! యశోదాత్మజ! భక్తవత్సల! మురారీ! గోపికా వల్లభా!
56
మ. శరధి క్రోడ నివేశ! శార్ఙ్గ ధర! శిష్టధ్యేయ! శీతాంశు భా
స్కర నేత్రద్వయ! శుభ్రపంకరుహ భాస్వన్నాభ! శూరాన్వయా
భరణా! శేషశయాన! శైలధర! శోభా రమ్య సర్వాంగ! శౌ
ర్య రసోదంచిత! శంఖ చక్ర ధర! శర్వాణీ సహాయ ప్రియా!
57
క. మేల్కనుము దేవ! యివె రా
చిల్కలు కనుమొగిచియున్న చెలువలఁ దమకుం
బల్కులు నేర్పగఁ ముద్దులు
కుల్కెడు పల్కులను మేలుకొలిపెడుఁ గృష్ణా!
58
సీ. చర మాద్రి దావాగ్ని సంప్లుష్ట సురసౌర - భేయీ కరీషైక పిండ మనఁగఁ,
బహు చకోర దంశ పరిపీత చంద్రికా - క్షౌద్ర నీరస మధుచ్ఛత్ర మనఁగఁ,
బ్రత్యఙ్ముఖోచ్చల ద్రాత్రి వర్షీయసీ - పలిత పాండుర కేశ బంధ మనఁగ,
గగన సౌధాలేపకర కాలశిల్పి ని - ర్ముక్త సుధా వస్త్ర ముష్టి యనఁగ,
 
తే. సుమహిత జ్యోత్స్నికా లతా సుమగుళుచ్ఛ
మనఁగ నతిధూసర చ్ఛాయ నబ్జవైరి
చెలువు వోనాడి బింబావశిష్టుఁ డగుచు
నల్ల నల్లన వ్రాలెడు నంబుజాక్ష!
59
చ. జలరుహమిత్రుఁ డాత్మ రుచి సంపదఁ జీఁకటి బందెకానికిం
గలఁగుచు వీనిలోన నిడి కైకొన నమ్మికకాపు లంచుఁ జు
క్కలదొర యెండ దాడి విని గ్రక్కునఁ దానును గాంతి వీనిలో
పల నెలకొల్పె నాఁ బలుకఁబాఱె నిశాంత నిశాంతదీపముల్‌.
60
మ. దర మీల న్నయనంబులైగృహ బహిర్ద్వారంబుల న్యామకుం
జరము ల్గండ మద భ్రమ ద్భ్రమరికా ఝంకార సంగీత వి
స్ఫురణ ల్సూపుచుఁ గర్ణతాళ నినదంబు ల్మించఁగా మాగధో
త్కరముం బోలుచుఁ జూడనొప్పె నివె హస్త న్యాసముల్మీఱఁగ\న్‌.
61
మ. సమ యాభీర కుమారుఁ డేపునఁ దమిస్రా రూప నక్తంచరిం
గమలారిస్తన మండలాంక విష సంక్రాంత ప్రభా దుగ్ధపూ
రముతో రూపఱఁజేయ శోషిలుచుఁ దార ల్సోల నిట్టూర్పు సాం
ద్రముగా నూర్చె ననంగఁ బెల్లెసఁగెఁ బ్రాతఃకాల వాతూలముల్‌.
62
క. మంచునఁ దోఁగిన పల్లవ
సంచయము భవ ద్వియోగ సంతాప రుద
చ్చంచల నయనాబాష్ప క
ణాంచిత బింబోష్ఠలీల నలరె నుపేంద్రా!
63
తే. కమ్మ కస్తురి గుళికలు తమ్మిలేమ
నిదుర మంపునఁ బుక్కిట నించి మేలు
కాంచి వేకువ నుమిసె నాఁ గమల ముకుళ
కోటరంబుల నెలదేఁటి కొదమ లెగసె.
64
మ. విననయ్యెం గృకవాకు కూజితము లుద్వేలంబులై సూరసూ
త నవోద్యత్కర కుంచికా విఘటిత ధ్వాంతారర క్రక్రియా
స్వనము ల్కైరవిణీ ప్రసూన పృథుక స్వాప క్రియాలో లికల్‌
దినకృన్మార్గ నివారణ త్వరిత మందేహోగ్ర సింహధ్వనుల్‌.
65
తే. రాజు వీడెత్తి చనినఁ దారక భటాళి
యంబరాభోగ నిజ శిబిరాంగణమునఁ
గాలుకొల్పిన పావక జ్వాల లనఁగఁ
బ్రాచిఁ గనుపట్టె నవ సాంధ్యరాగ రుచులు.
66
తే. కమలినీ జృంభికలకు దిక్కాంత లెల్ల
హస్తతాళంబు లొనరించి రనఁగఁ జెలఁగె
లలిత కాసార కూల కులాయ చలిత
శకున పక్షజ పటపట స్వనము లధిప.
67
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )