కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
గరుత్మంతుని యాగమనము
సీ. వజ్రంబునకు నీఁక వైచిన బలశాలి, - గజ కచ్ఛ పాశన ఘాతుకుండు,
జనని దాస్యంబు నీఁగిన కులశ్రేష్ఠుండు, - దుర్ల భామృత పశ్యతోహరుండు,
కమలాప్తు సారథి గారాబుతమ్ముండు, - గశ్యప కృత పుణ్యకర్మ ఫలము,
సకల శకుం తౌఘ సామ్రాజ్య ధౌరేయుఁ, - డహి మృగయా వ్యస నాకులుండు,
 
తే. మింటిపాళెంబు లేర్చు ముక్కంటి తూపు - గఱి, నిపాతిత రోహిణ స్కంధుఁ, డనిల
మాన సాతీత వేగసంపద్ఘనుండు, తార్క్ష్యుఁ డేతెంచె దానవధ్వంసి కడకు.
72
క. మిన్నుననుండి భరంబునఁ
బన్నగ పతి తలలు చదియఁబడ ధారుణిమీఁ
ద న్నిలిచి వైనతేయుఁడు
వెన్నుని పదములకు వినయ వినతి యొనర్ప\న్‌.
73
చ. మునిపతి రాకయుం, గుసుమముం దన కిచ్చినలాగు, రుక్మిణీ
వనితకుఁ దా నొసంగుటయు, వంచనఁ బొంచిన బోటి సత్యకు\న్‌
మన మెరియంగఁ జెప్పుటయు, మానినికోపము, వేఁడుకొంటయుం
దనదు ప్రతిజ్ఞయుం దెలిపెఁ దార్క్ష్యున కెంతయు నాదరంబున\న్‌.
74
ఉ. సంతసమంది, జాదులు ప్రసాదము నయ్యె నటంచుఁ బొంగి, నా
గాంతకుఁ "డంబుజోదర! బలాసురవైరి మదీయ పక్షముం
బంతము గొన్నవాఁ డశనిపాతమున న్మును; నాఁటనుండియు
స్వంత మనంబులోఁ జనదు; నాపగ నీఁగెద నేఁడు నీకృప\న్‌."
75
చ. అనుటయు, నంతవాఁడవె కదా! యని మిక్కిలి గారవించి, య
వ్వనరుహలోచనుండు దగువారి సుహృజ్జన బంధుకోటి రాఁ
బనిచి, నిజ ప్రయాణమును బట్టణరక్షయుఁ జెప్పి, వారిచే
ననుమతి గాంచి యెక్కె విహగాధిపుఁ దానును సత్యభామయు\న్‌.
76
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )