కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన ద్వితీయాశ్వాసము
సత్యాకృష్ణులు గరుడ వాహనారూఢులై స్వర్గమునకుఁ బయనమగుట
ఉ. ఆ విహగావతంసము నిజాంసముపైఁ బ్రియభామతోడ నిం
ద్రావరజుండు నిల్చుటయు నాతత పక్ష మహానిలంబు లం
భోవహ పంక్తిఁ దూలముల పోలికఁ దూల్పఁగఁ దద్దిశా ముఖుం
డై వినువీథికి న్నెగసె నద్భుతకారి మనోజవంబున\న్‌.
77
క. ఇరు గ్రేవల నందక శా
ర్ఙ్గ రథాంగ గదాయుధములు రాఁ దొడఁగె ఖగే
శ్వర పక్ష జనిత వాతాం
కుర పూర్తిని శంఖ మపుడు ఘుమఘుమ మ్రోసె\న్‌.
78
తే. అంబుధర జాల ముక్తంబు లయిన జలక
ణములు సాత్రాజితీ కైశికమునఁ బొలిచె
గగనతల లక్ష్మి పోరచి గాఁగ నిడినఁ
జాల నొప్పారు మౌక్తిక స్తబక మనఁగ.
79
క. తళతళని మెఱుఁగుఁ దీఁగలు
గలుగు ఘనాఘన చయంబు గనుఁగొనఁగా నిం
పొలయించెఁ బసిడి కామల
నలరెడు నీలముల గొడుగు లనఁగా హరికి\న్‌.
80
క. కమలదళాక్షుని దేహో
ద్వమ దతి సాంద్ర చ్ఛవి ప్రవాహము వొలిచెం
దమతండ్రి భానుఁ గనుఁగొన
యమునానది గగనవీథి కరిగెడు ననఁగ\న్‌.
81
చ. ఖగకులనాథు పక్షముల గాడ్పు సహింపగ లేక రజ్జుప
న్నగములు దేరిక్రిందికిఁ జన న్సరసీరుహమిత్రురథ్యముల్‌
నొగలఁ దొరంగి నిల్వ నరుణుండు రయంబునఁ జక్కఁ గట్టుచు\న్‌
గగనపథంబున దఱిమెఁ గాలవిలంబన మందకుండఁగన్‌.
82
క. నతి సేసె వైనతేయుఁడు
గతిభేదములోన నన్నఁ గనుఁగొని, యతఁడు\న్‌
గతిలోనన దీవించినఁ,
జతురతకు న్మెచ్చి రపుడు సత్యయు హరియు\న్‌.
83
క. మురమర్దనుఁ డివ్విధమ్మున
గరుడునిపై గగన పథము గడచి యరుగుచుం
దరళాయతాక్షి కిట్లను
సరస స్మిత వచన రచన చాతురి మెఱయ\న్‌.
84
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )