కావ్యములు పారిజాతాపహరణము - ముక్కు తిమ్మన పంచమాశ్వాసము
ఆశ్వాసాంతము
శా. ఏకచ్ఛత్రిత సర్వభూతల! నృసింహేంద్రక్షమాభృత్తపః
పాక ద్యోతిత రూప! మౌక్తిక తులాభార ప్రదానోన్నతా!
కోకస్తన్యసమాస్త్ర సన్నిభ! హరి త్కూలంకషోద్యద్యశ
శ్శ్రీకర్ణాటమహీశ! వైరి కరిరా ట్సింహ ప్రతాపోదయా!
109
క. భువనవిజయాఖ్య సంస
న్నవరత్నవిభాప్రభాత నలినాప్త! రమా
ధవ చరణకమల సేవా
ప్రవణమతీ! వీరరుద్ర పర్వత వజ్రీ!
110
మంగళమహాశ్రీ. చిత్తజభిదంఘ్రియుగ చింతన కళాధిగత జిష్ణుసమ వైభవవిశేషా
విత్తరమణామరగవీ తరణిభూ జలద విశ్రుత కరాంబురుహ! గోష్ఠీ
నృత్త మణిరంగతల! నీతి మనురాజనిభ! నిర్భరదయారస పయోధీ!
మత్తగజ యూథ మదమగ్నసుఖి తాళి రవమాన్యగృహ! మంగళమహాశ్రీ!
111
గద్యము. ఇది శ్రీమదుమామహేశ్వర వర ప్రసాద లబ్ధ సార
సారస్వతాభినంది నంది సింగయామాత్య పుత్త్ర కౌశిక
గోత్ర పవిత్ర సుజన విధేయ తిమ్మయ నామధేయ ప్రణీతంబైన
పారిజాతాపహరణంబను మహా ప్రబంధమునందుఁ
సర్వంబునుం పంచమాశ్వాసము.
 
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - pArijAtApaharaNamu - mukku timmana ( telugu andhra )