| కావ్యములు | విజయ విలాసము | పీఠిక |
| ఇష్టదేవతా స్తుతి | ||
| శా. |
శ్రీ లెల్లప్పుడొసంగ నీ సకల ధాత్రీ చక్రమున్ బాహు పీ- ఠీ లగ్నంబుగఁ జేయ, దిగ్విజయ మీ డీకొన్న చందాన నే వేళ\న్ సీతయు, లక్ష్మణుండుఁ దను సేవింపంగ విల్ పూని చె- ల్వౌ లీల\న్ దగు రామమూర్తి రఘునాథాధీశ్వరుం బ్రోవుతన్. |
1 |
| ఉ. |
శ్రీ కలకంఠకంఠియు, ధరిత్రియు దక్షిణ వామ భాగముల్ గైకొని కొల్వ, వారిఁ గడఁక\న్ గడకన్నుల కాంతిఁ దేల్చి, తా నా కమలాప్తతం గువలయాప్తతఁ దెల్పెడు రంగ భర్త లో కైక విభుత్వ మిచ్చు దయ నచ్యుతు శ్రీ రఘునాథ శౌరికిన్. |
2 |
| ఉ. |
'శ్రీ రుచిరాంగి నీ భవన సీమ ధ్రువంబుగ నిల్చు; నేలు దీ ధారుణి నీవ' యన్న క్రియ దక్షిణపాణి నెఱుంగఁజేయు శృం గార రసాబ్ధి వేంకటనగ స్థిరవాసుఁడు పూర్ణదృష్టి నెం తే రఘునాథ భూరమణదేవు గుణంబుల ప్రోవుఁ బ్రోవుతన్. |
3 |
| తే. |
ధీయుతుఁ డటంచు నలువ దీర్ఘాయు వొసఁగి కాయు రఘునాథ విభు వజ్రకాయుఁ గాఁగ; వీరవరుఁ డని హరుఁ డత్యుదార కరుణఁ జేయు నెప్పుడు విజయు నజేయుఁ గాఁగ. |
4 |
| మ. |
మొగుడుం దమ్ముల విప్పునప్పుడు రజంబున్, జక్రవాళంపుఁ గొం డగడిన్ దేఱుగ డైన పట్లఁ దమమున్, మందేహులన్ దోలి వా సి గడల్కొన్ తఱియందు సత్త్వముఁ ప్రకాశింపన్ ద్రిమూర్త్యాత్మకుం డగు తేజోనిధి వేడ్కఁ జేయు రఘునాథాధీశుఁ దేజోనిధిన్. |
5 |
| శా. |
మాద్యద్దంతి ముఖార్చనా నియమముం బాటించు నెల్లప్పుడున్; సద్యఃపూర్ణ ఫలాప్తిచే మనుచు నంతర్వాణులన్ మామనో హృద్యుం డౌ రఘునాథశౌరి యని కూర్మిన్ సాటికిన్ బోటికిన్ విద్యా బుద్ధు లొసంగి ప్రోతు రతనిన్ విఘ్నేశుఁడున్, వాణియున్. |
6 |
| శా. |
ప్రాగల్భ్యంబున విష్ణు శంభు మతముల్ పాటించి, సర్వంసహా భాగం బందు సమప్రధాన గతి యొప్పన్ రాజలోకంబులోఁ దా గణ్యుం డని యచ్యుతేంద్ర రఘునాథ క్షోణిభృన్మౌళికిన్ శ్రీ గౌరుల్ సమకూర్తు రాహవజయ శ్రీ గౌరులన్ నిత్యమున్. |
7 |
| మ. |
ప్రకట శ్రీహరి యంఘ్రిఁ బుట్టి, హరు మూర్ధం బెక్కి యాపాద మ స్తకమున్ వర్ణన కెక్కు దేవి సహజోదంచత్కులోత్పన్న నా యక రత్నం బని యచ్యుతేంద్ర రఘునాథాధీశ్వర స్వామికిన్ సకలైశ్వర్యములున్ నిజేశువలనన్ దాఁ గల్గఁగాఁ జేయుతన్! |
8 |