కావ్యములు విజయ విలాసము పీఠిక
కృతిపతి వంశ ప్రశస్తి
క. ఆ రాజ శేఖర ప్రియ
వారిజముఖి తోడు గాఁగ వర్ధిలు విమల
శ్రీరుచిర వర్ణమున ధా
త్రీరంజన సుకృతి చెవ్వనృపతి జనించెన్‌.
9
క. ఆ చెవ్వ నృపాలాగ్రణి
యాచంద్రార్కముగఁ గాంచి, నరుణాచల వృ
ద్ధాచలములఁ గట్టించె, మ
హాచతుర సమీర గోపురావరణంబుల్‌.
10
తే. ఠీవి నచ్యుత రాయల దేవి యైన
తిరుమలాంబకు ననుజయై తేజరిల్లు
మూర్తమాంబను బెండ్లియై కీర్తి వెలయఁ
జెవ్వ విభుఁడు మహోన్నత శ్రీఁ జెలంగె.
11
క. ఆ మూర్తమాంబ కఖిల మ
హీ మండల నాథుఁ డచ్యుతేంద్రుఁడు, సుగుణో
ద్ధాముఁడు జన్మించెన్‌; ద
ద్భూమీపతి రంగధాము పూజన్‌ మించెన్‌.
12
శా. శ్రీ రంగేశుఁడె వచ్చి, యచ్యుత ధరిత్రీభర్త యై, భాగ్య రే
ఖారూఢిన్‌ విలసిల్లి, తానె తనకున్‌ గైంకర్యముల్‌ చేసెఁగా
కే రాజైనను జేయఁగాఁ గలిగెనే యిట్లీ విమానం బహో!
భూరి స్నిగ్ధముగా, మహామణిమయంబుల్‌గాఁ గిరీటాదులున్‌?
13
చ. గెలిచిన గెల్పు, లర్థితతికిన్‌ దిన మిచ్చిన యీవులన్‌ వహుల్‌
తలఁచిన విక్రమార్కు లొక లక్షయుఁ, గర్ణులు కోటియున్‌, గదా!
కలిగిన నీడు వత్తు రనఁగాఁ దగు సాహస దాన సద్గుణం
బులు ధర యందుఁ బుట్టఁగనె పుట్టిన వచ్యుత భూమి జానికిన్‌.
14
శా. వీరాగ్రేసరుఁ, డర్థి పోషణ గుణావిర్భూత భాస్వద్యశో
ధౌరేయుండు, మణీతులాదిక మహా దానావళుల్‌ సేయఁ దా
నౌరా! మార్గము వెట్టినట్టి ఘనుఁ, డాహా! లోకమం దచ్యుత
క్ష్మారాణ్మౌళి యొనర్చు పుణ్య మహిమల్‌ శక్యంబె లెక్కింపఁగన్‌?
15
AndhraBharati AMdhra bhArati - kAvyamulu - vijaya vilAsamu - pIThika - chEmakUra vEMkaTa kavi( telugu andhra )