కవితలు ఆంధ్రప్రశస్తి:
విశ్వనాథ సత్యనారాయణ
దర్శిని:
మల్లంపల్లి శరభయ్య శర్మ

దర్శిని

మల్లంపల్లి శరభయ్య శర్మ

ఆంధ్రప్రశస్తి అన్నవెంటనే పూర్వమెన్నడో యీ తెనుఁగు తోటకు ప్రియాతిథియై వచ్చిన ఒక పుంస్కోకిల కషాయకంఠ వినిర్గతములై దిశాంతములెల్ల మార్మ్రోగిన ఆముహుఃకుహూరావములె నేటికిని తలఁపునకు వచ్చుచుండును.

ఏనాటి రచన యీ ఆంధ్రప్రశస్తి!

"కాషాయ రమ్య వల్కల హుతాశన శిఖాసంపిహితాశ్వత్థ సామిధేని"
"సేవింపఁబడి హిమక్షితి ధరకన్యకా సౌందర్యధనుఁడు శ్రీశైల రాజు"
"ఈ నా పదార్పిత క్షోణి నే రాజు ధర్మాసనంబుండి స్మృత్యర్థ మనెనొ!"
"ఈ కాశ్యపీ ఖండ మే శరజ్జ్యోత్స్నలో పులకించెనో! కీర్తి తెలుపు లూరె"
"ఆంధ్రపల్లవ నరేంద్ర శ్రీయశస్స్తంభము"
"చిటచిటచిట నినదోద్భటకనకము విజయవాటి వర్షము కురిసెన్‌"
"ఈ అతీంద్రియశక్తి నాకెట్టులబ్బె!"
"ఎన్నిజన్మమ్ములుగాఁగ ఈ తనువునన్‌ బ్రవహించునొ! ఆంధ్ర రక్తముల్‌!"
"నా ప్రాణములకును ఈ పొగమబ్బుల కేమి సంబంధమో!"

అప్పటికి నేటి తరము భావుకులలో చాలమంది పుట్టియుండరు. వీరుచూచినది 'రామాయణ కల్పవృక్ష కోకిలము'ను మాత్రమే.

కబళితాశాంతములైన యీ కల్పవృక్ష స్నిగ్ధ చ్ఛాయలలో తొలినాటి ఆ కల మధుర వ్యాహారములు విలీనములైనవి కాబోలును.

ఒక మహానది తానుపుట్టినచోట తొలిసారిగా జాలుకట్టి నప్పుడెట్లుండునో, ఒక మహావనస్పతి తాను బాలవృక్షమై తొలిసారిగా మ్రాను కట్టినప్పుడెట్లుండునో, ఆంధ్రప్రశస్తి వ్రాసినరోజులలో విశ్వనాథ ప్రతిభ అట్లుండి యుండును; అవిదిత శ్రోణీభరయైన అజ్ఞాత యౌవనవలె, అవ్యాకృతమైన సృష్టితొలినాఁడు హిరణ్య గర్భునివలె.

ప్రతిరెండు శబ్దముల కూర్పులోనుండి తొంగిచూచెడి విశ్వనాథ ప్రథమ ప్రతిభ, యిందు - సమాస గ్రథనములో పద్యబంధములో పలుకుబడిలో సంభాషణములో కథనములో ఊహావైభవములో - సర్వత్ర అభివ్యాప్తమైన తన రసాత్మ యొక్క ఆవిష్కారమునకై కవోష్ణముగ నిట్టూర్చు చున్నట్టులుండును.

ఇట్లు విశ్వనాథ కవితావ్యక్తిత్వము తొలిసారిగా ఆంధ్రప్రశస్తి యందే తన స్థిరధర్మమును ప్రతిష్ఠించికొని యున్నది.

ఈ రచనకు హేతువులుగ పేర్కొనఁబడుచున్న నాటి ఆంధ్రోద్యమాదులు బహిఃకారణములు మాత్రమే. వాస్తవమునకు - ఈ నేలతో, ఈ నేలపై ప్రవహించిన ఆయాకాలములతో, విశ్వనాథ జీవ చైతన్యమునకు గల అవినాభావమే ప్రబలమైన అంతఃకారణము.

అది ఆంధ్రప్రశస్తిలో పలుచోట్ల అభివ్యక్తమైనది. అనంతర రచనయైన కల్పవృక్షము మొదటి పద్యములో

"ఆత్మతో నాది మునులెట్టు లవనితోడ
ఆది నృపులైక కాలికులై చరింతురు..."

అని విశ్వనాథ తన దర్శనమును చెప్పెను. తన జీవ చైతన్యములో పై ముని, నృప లక్షణములు రెండును గర్భితములై యున్నవి. దిక్కాలా ద్యనవచ్ఛిన్నమైన ఆత్మ చైతన్యమునకు దేశకాలములతో నేర్పడిన అధ్యాసయే ఆంధ్రప్రశస్తివలె ఈ రస పరీవాహరూపమును దాల్చియుండును.

చరిత్రకందిన దేశ కాల ఖండములను ఆలంబనముగఁగొని విశ్వనాథ ప్రతిభ చరిత్రకందని దేశకాల వైభవములను శాశ్వతముగ మన కన్నులముందు నిలుపు చున్నది. రెండువేల సంవత్సరములకు పైఁబడిన యీ తెనుఁగునేల నాలుగు చెఱఁగులలో వెలసిన అనేకములైన పూర్వాంధ్ర మహాసామ్రాజ్యముల ఉదయాస్తమయములకు సంబంధించిన విషాదానంద శబలితమైన సంస్మృతిధారయే యిందలి కావ్యవస్తువు. ఆ చరిత్రస్థలములను మహాక్షేత్రముగ సందర్శించి - అభివర్ణించి - విశ్వనాథ ఆంధ్రజాతికెల్ల శాశ్వతముగ వానిని మహాక్షేత్రములుగ వెలయించెను. ప్రతిభ తనకు ప్రసాదించిన ఒకానొక అతీంద్రియ శక్తివలన విశ్వనాథ నేటి తన పరిచ్ఛిన్న చేతననుండి వెలువడి - వామనుడు త్రివిక్రమాకృతిగ విస్తరించినట్లు - ఈ కావ్యములో దేశకాలముల ఎల్లలనెల్ల నతిక్రమించి ఆంధ్రప్రశస్తి కెత్తిన యశస్స్తంభమువలె తాను నిట్టనిలచి యున్నట్లు తోచును.

ఆ రోజులలోనే శ్రీ విశ్వనాథకు మల్లంపల్లి సోమశేఖరశర్మగారితో స్నేహ మేర్పడినది. అది దశరథ జటాయువుల స్నేహమువంటిది. ఇరువురి హృదయములు మాతృదేశ పారతంత్ర్యదుఃఖదారితములై విషాదగీతికయందు శ్రుతికలిసినవి. ఆ స్నేహ మీనాటిదికాదు. ఎన్నిజన్మములనుండి వారి తనువులలో ఆంధ్రరక్తములు ప్రవహించు చున్నవో అంతపురాతనమైనది.

'మున్నేనాఁడొ ఘాసాగ్రములు పదునై ఆంధ్రవిరోధి కంఠదళన ప్రారంభ సంరంభము విజృంభించు దినములలో తోడిసైనికులమై చూఱాడిన ప్రేమలో - ఇది లేశమని చెప్పుటకైనను నాటి స్వాతంత్ర్యములు లేవే!' అని విశ్వనాథ ఆక్రోశించును.

'డిగ్రీలు' లేని పాండిత్యము వన్నెకురాని యీ కాలములో పుట్టిన దోషమువలన శర్మగారి చరిత్రజ్ఞాన నిర్మలాంభః పూరములు ఎడారిలో కురిసిన వానలైనవి. చాడీలకు ముఖప్రశంసలకు ఈర్ష్యకు స్థానమైన లోకములోనుండుట వలన ఆయన అచ్ఛతర కమనీయశీలజ్యోత్స్న యడవిలో గాసిన వెన్నెలయైనది. కాని - గౌరీశంకరశృంగతుంగమైన ఆమనీషి మనస్సు పొంగి తెనుఁగునాటి పూర్వచరిత్ర కాణాచియెల్ల త్రవ్వి ఆంధ్ర జనముల తలకెత్తెను.

ఆంధ్రప్రశస్తి కృతినాయకుఁ డిట్టివాఁడు! ఆయన అనుకోలేదు. ఈయన చెప్పను లేదు. 'అన్నా!' అని బాష్పస్ఖలితాక్షరములతో విశ్వనాథ తనకృతిని ఆయన కంకితముగ వెలయించెను. నాటి ఆ యుపదకన్న వెఱొకరీతిగా మఱియెన్నటికిని తెనుఁగుజాతి అయన ఋణమును తీర్చుకొనలేదు.

'ముఖలింగము'లో అన్యంక భీమేశ్వరాలయద్వార బంధములపై వ్రాయఁబడిన తొల్లింటి తెనుఁగులిపి పొల్చికొని కూడఁబలికి కొనుచున్న ఆ చరిత్ర తపస్వికి ఆంధ్రప్రశస్తితో అవినాభావ మేర్పఱచి ఆంధ్రవాఙ్మయ మున్నన్నినాళ్ళు విశ్వనాథ శాశ్వత స్థితి కల్పించెను. ఈ రీతిగ శ్రీకాకుళము మొదలైన పురాతనాంధ్ర చరిత్ర క్షేత్రములకు మునుముందుగ జంగమ చరిత్ర క్షేత్రమైన శ్రీసోమశేఖర యశస్సు ఆంధ్రప్రశస్తిలో గానముచేయబడినది.

ఆయీ ఆంధ్రప్రశస్తి -

"మాపూర్వాంధ్రధరాధినాయక కథామంజూషికారత్నగా
ధాపద్యావళి పేరి హారిసుమనోదామమ్ము! మాధ్వీకభా
షాపృక్తమ్ము, మహాప్రబంధరచనా సౌందర్యపున్‌ వాసనల్‌
తీపై క్రమ్ము" నది. ఆంధ్రసోదరులకు దీనిని విశ్వనాథ గళాంకముగ అందిచ్చెను.

అనఁగా పూర్వాంధ్ర ధరాధినాయక కథాభరితమైన ఒకానొక మంజూషిక (పెట్టె) కలదు. దానిలోనుండి రత్నములవంటి గాథలను వెలికిఁదీసి తాను పద్యావళుల పేర మనోహరమైన ఒక సుమనోదామమును గూర్చెను. అది మాధ్వీకమువంటి భాషతో ఆప్లావితమైన మాల! ఆమాలనుండి మహాప్రబంధరచనా సౌందర్య పరీమళములు స్వాదువులై క్రమ్ముకొనుచున్నవి. అది ఆంధ్రజాతి కంఠస్థము చేయఁదగిన రచన యన్నమాట!

ఇందు విశ్వనాథ తాను చరిత్రను కావ్యముగ చేయుటయెట్లో నిర్దేశించెను. చరిత్రయంతయును కావ్యమునకు వస్తువుగ పనికిరాదు. అందు పుట్టురత్నములవంటి గాథలు కొన్ని యుండును. వానిని ఎన్నికొని వెలికిఁ దీయవలయును. ఒక్కొక్క గాథ ఒక్కొక్క పద్యావళిగ పేటలు పేటలుగ పూల దండవలె కట్టవలయును. ఏగాథకు ఆగాథ ప్రత్యేక ప్రబంధమయ్యును అన్నియును గలిపి ఒక మహాప్రబంధముగ భాసించునట్లు నిర్మించవలయును. ఇదియే రచనయందలి సౌందర్యము. అవయవ ప్రబంధములయందువలె ఆమహాప్రబంధమునందును ప్రతీయమానార్థము నెత్తావివలె తెరలు తెరలుగా బుగులుకొను చుండవలయును.

ఆంధ్రప్రశస్తియందు పదిరెండు గాథలు కవవు.

 1. ఆంధ్రమహావిష్ణువు - 14 పద్యములు
 2. శాతవాహనుఁడు - 14 పద్యములు
 3. గోతమీపుత్రశాతకర్ణి - 14 పద్యములు
 4. మాధవవర్మ - 16 పద్యములు
 5. వేఁగిక్షేత్రము - 12 పద్యములు
 6. ముఖలింగము - 12 పద్యములు
 7. నన్నయభట్టు - 15 పద్యములు
 8. ప్రోలరాజు - 14 పద్యములు
 9. ప్రోలరాజు వధ - 14 పద్యములు
 10. చంద్రవంక యుద్ధము - 20 పద్యములు
 11. కొండవీటి పొగమబ్బులు - 10 పద్యములు
 12. యమదంష్ట్రిక - 22 పద్యములు

మొదటి ముగ్గురు శాతవాహనరాజులు
'మాధవవర్మ' పల్లవరాజు, వేఁగీ క్షేత్రమును పల్లవులదే.
'ముఖలింగము' కళింగగాంగ వంశజులది.
'నన్నయభట్టు' తూర్పు చాళుక్యులకు సంబంధించినది.
తరువాతి రెండును కాకతీయులకు సంబంధించినవి.
'కొండవీటి పొగమబ్బులు' రెడ్డిరాజులది.
'చంద్రవంకయుద్ధము' పలనాటి చరిత్రలోనిది.
'యమదంష్ట్రిక' విజయనగర రాజులది.

ప్రతికావ్యమునకు మొదట కథా సంగ్రహము కూర్చఁబడినది. ఒక్కొక్క గాథ ఒక్కొక్క కావ్యముగాఁ దీర్పఁబడినది. దేని నిర్మాణశిల్పము దానిదే. ప్రతి కావ్యాంతమునందు ఒక్కొక్క పద్యము జయ స్తంభమువలె ఆగాథయొక్క ప్రశస్తిని చాటుచుండును. ఒక కావ్యము సంభాషణతో మొదలగును. ఒకటి వర్ణనతో మొదలై నట్టులుండును. అది సంభాషణయని తరువాతి పద్యములలోగాని తెలియదు. ఒక్కొక్క కావ్యము కేవలము స్వగతముగానే యుండును. కొన్ని ఆద్యంతము వర్ణనా ప్రధానములుగా నుండును. కొన్ని లోకోత్తరమైన అనుభూతి లక్షణములై యుండును. కొన్ని అగాధమైన నిర్వేద లక్షణముతో నుండును. ఒకానొకటి ఉత్తాలమైన భావనా లక్షణముతో నుండును. ఇది యిట్లుండునని యూహించుటకు వీలు లేకుండ యుండును. పరిమిత పద్యములతో అపరిమిత శిల్ప రమణీయములైన యివి పైకి ఖండ కావ్యములవలె కనిపిమ్చును. వీని సౌందర్యమును సమగ్రముగ వివరించుటకు విడి విడి వ్యాసములు వ్రాయవలయును. ఒక్కొక్కటి ప్రత్యేక సమీక్ష నపేక్షించును. ఇంత చిన్న పరిధిలో ఇంత శిల్ప వైవిధ్యముగల కావ్యమింకొకటి కానరాదు. ఈ యాంధ్ర ప్రశస్తి మొదలైన కావ్యముల ప్రస్తావన వచ్చినప్పుడు విశ్వనాథ అవియన్నియు రామాయణ రచనకై తాముచేసిన సాధనలనుచుండెడివారు. ఆమాట యట్లుండ - అవివానియంతట గొప్ప కావ్యములై వాఙ్మయమునందు స్థిర ప్రతిష్ఠ నందియున్నవి. కల్పవృక్షము నందలి శిల్ప వైభవమును అందికొనుటకు - ఇవి అపరిహార్యములైన సోపానములు.

"జో! సామీ! మముగన్నయేలిక! యిదో! జోహారు జోహారు!" అని కోయల కోలాహలముతో మొదలగుచున్న 'ఆంధ్రవిష్ణు'వన్న మొదటి కావ్యము -

"శ్రీకృష్ణవేణీ గరిష్ఠపాధస్తరం - గాహతప్రాకార మైన యదియు
బురుజుల దితిజనసమూహరక్తముఁగ్రోలు - నాల్కవోలు పతాక నాటినదియు
ఆంధ్రవీరభటాళి కాత్మశౌర్యంబుల - యందు శాణోపలం బైనయదియు
ఘంటశాలాపురీకలిత పూర్వాంధ్ర శి - ల్పాచార్యులకుఁ దల్లియైన యదియు
    రాజరాజాంధ్రవిష్ణుని రాజధాని
    కలుషములకెల్ల పిడుగు శ్రీకాకుళంబు,
    కన్నులకుఁ గట్టినట్లుగఁ గానబడెడు
    వేదకాలమునాఁటి ముత్తైదువట్లు."

తరతరములనాటి శ్రీకాకుళ ప్రసన్న పుణ్యదర్శనముతో ముగియునని యూహించుట కష్టము. ఇట్లు ప్రతికావ్యమునందలి యుపక్రమమును ఉపసంహారమును గలిపి భావించినపుడు - ఆకావ్యమునందలి శిల్ప రామణీయకము నెమ్మది నెమ్మదిగ మనస్సునకు వచ్చుచుండును. ఎవనికి వానికి అనుభవ గోచరము కావలసిన కవితాతత్త్వమును పొడిపొడి మాటలతో ఇదమిత్థమని నిర్ణయించి చెప్పుట కష్టము. "కోవేత్తి కవితాతత్త్వ మీశ్వరోవేత్తివానవా!" కావ్యవిషయమునందు ఎంతచెప్పినను చెప్పవలసినది యెన్నటికిని మిగిలియున్నట్లే యనిపించు చుండును. కవితో సమానధర్ములైన సహృదయులకు - ఆ అనుభవ జగత్తునందు ప్రవేశము లభించును. ఆ సహృదయులు మేళవించిన వీణలవలె నుందురు. అలసాలసానిలస్పందమునకైనను ప్రతిస్పందింతురు. శిల్ప విషయము నట్లుంచి - విశ్వనాథయొక్క రసధర్మమైన వాక్కు అవ్యాజహృదయ బంధువువలె పలుకరించుచుండును. అది యొక క్షీరసముద్ర వేలానని!

"ఆరబ్ధేశ్వర తాండవ భ్రమణ పాదాంభోరుహస్రస్త మంజీరంబో!"

"తెలి లేవెన్నెల చాలులో తళతళైదీపించు వజ్రాల పచ్చల నీలాల హొరంగు వన్నెలసరుల్‌ చాయల్‌ తలారింపులై"

"ఆరాజన్యుని మీఁద మందపవనవ్యాధూత పాధోలవ శ్రీరమ్యాకృతి కృష్ణవేణి తఱిమెన్‌"

ఈరీతిగ ప్రతిక్షణము తరంగితమగుచునే యుండును. ఆయన మనస్సే విధాత! అది తలంచిన తలంపెల్ల రూపమును దాల్చుచుండును. ఆయన అహర్నిశము ఘూర్లమానమైన ఒక రసమయమైన మహార్ణవము!

రామాయణము దానినుండి వెలువడిన కల్పవృక్షమైనచో, ఆంధ్ర ప్రశస్తి కౌస్తుభము!

మల్లంపల్లి శరభయ్య శర్మ.

AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhraprashasti - Andhra Prashasti - Viswanatha Satyanarayana- darSini - mallaMpalli Sarabhayya Sarma Viswanadha Satyanarayana kavi Samrat Kavisamrat gnanapeetha gnanapitha ( telugu andhra )