| కవితలు | ఆంధ్రప్రశస్తి: విశ్వనాథ సత్యనారాయణ |
అంకితము |
| అంకితము మల్లంపల్లి సోమశేఖరశర్మకు |
|
నీ వనుకోలేదు మఱి నే నిది చెప్పనులేదు కాని అ న్నా! వినవయ్య నేఁటి కిది నా చిఱుపొత్తము నీకు నంకితం బై వెలయింపఁజేతు హృదయంబులు నీకును నాకు మాతృ దే శావిల దుఃఖదారితములై శ్రుతి గల్పె విషాదగీతికన్. |
|
'డిగ్రీలు' లేని పాండిత్యంబు వన్నెకు - రాని యీ పాడుకాలానఁ బుట్టి నీ చరిత్రజ్ఞాన నిర్మలాంభఃపూర - మూషరక్షేత్ర వర్షోదక మయి చాడీలకు ముఖప్రశంసల కీర్ష్యకు - స్థానమైనట్టి లోకాన నుండి నీ యచ్ఛతర కమనీయశీల జ్యోత్స్న - అడవి గాసిన వెన్నెలగుచుఁ జెలఁగి |
|
అంతె కాని గౌరీశంకరాచ్ఛశృంగ తుంగము త్వదీయము మనస్సు పొంగి తెలుఁగు నాఁటి పూర్వచరిత్ర కాణాచి యెల్ల త్రవ్వి తల కెత్తలేదె యాంధ్రజనములకు. |
|
కొదమతుమ్మెద ఱెక్కలఁ గుస్తరించు మీసముల నీ ప్రసన్న గంభీర ముఖము కన్నులంటగఁ గట్టినట్లున్న నిన్ను మఱచి పోలేను జన్మజన్మములకైన |
|
ఇది నీకై యిడినట్టి నా యుపద, మున్నేనాఁడొ ఘాసాగ్రముల్ పదనై యాంధ్రవిరోధికంఠ దళన ప్రారంభిసంరంభ మే చు దినాలన్ మఱి తోడిసైనికులమై చూఱాడు ప్రేమంబులో నిది లేశం బని యైనఁ జెప్పుటకు లేవే నాఁటి స్వాతంత్ర్యముల్. |