కవితలు ఆంధ్రప్రశస్తి:
విశ్వనాథ సత్యనారాయణ
గోతమీపుత్రశాతకర్ణి

3. గోతమీపుత్రశాతకర్ణి

నాసికపట్టణములోని కొండ చివరియందలి యొక శాసనములో నితని గురించి యున్నది. ఇతని తల్లి గోతమి. ఇతఁడు రాజాధిరాజు. ధాన్యకటకము రాజధాని. మహేంద్ర వింధ్యావత పారియాత్ర సహ్య కృష్ణగిరి చకోరాది పర్వతము లితని రాజధానిలోనివి. విద్యానిధి. ఇతడొక్కడే ప్రజ్ఞావంతుఁడు. ధనుర్విద్యా విశారదుఁడు. ఇతని పరాక్రమము నాభాగ నహుష జనమేజయ సగర యయాతి రామాంబరీషాదులను మించియుండెను. ఇవి శాసనములోని కొన్ని మాటలు. శక యవన హూణులు పరదేశీయులు వచ్చి భారతదేశ మాక్రమించుకొనిరి. వారిలో క్షాత్రపు లనువా రొక తెగ; నహపానుఁ డను వాఁడు మహాక్షాత్రపు డను బిరుదుతో సౌరాష్ట్ర మాక్రమించుకొని కొంతవఱ కాంధ్రరాజ్య విజృంభణము నాపినాడు. ఈ గోతమీపుత్ర శాతకర్ణి శాతవాహనుఁడు. సౌరాష్ట్రము జయించి వారివంశమే నిర్మూలించి, యాంధ్ర చక్రవర్తిత్వము మఱల నిలిపినవాఁడు.

మునుముందు రణనిస్సహణభేరికా శంఖ - సకల వాద్యము లుష్ట్రసమితి మోయ
నా వెన్క వారకాంతాలి నాట్యమ్ములు - గీతికా మాధుర్యరీతిఁ జూప
పైన మేల్సరదార్లు బారులు తీరిచి - ఘనజవాశ్వంబుల ఖదను పోవ
వెనుక ధానుష్కులౌ వీరులు తెనుఁగురా - జ్యపుబొడ్డు లీ ధాత్రి యద్రువ నడువ
        నచట తురగపదాతులు, నచటి వెనుక
        సమదగజయూధికాసహస్రములు, మీఁద
        బల్లెపుం బోటుతో రిపుప్రాణహారు
        లుక్కుతున్క లాంధ్రభటాళి యొత్తినడువ.
ఆపైఁ గంచురధాలపై తెలుగువా రన్నన్న యొక్కక్కఁడే
మాపన్‌ గల్గును ముష్టిఘాతముల దిఙ్మత్తద్విపేంద్రమ్ములన్‌
చాపాచార్యులు వారిదోఃకలిత రక్షాశక్తి దుర్భేద్యుఁడై
వే పోవందొడఁగెన్‌ తెలుంగుపతి పృథ్వీచక్ర మల్లాడఁగన్‌.
"జయజయ గౌతమీ సాధ్వీ మహాగర్భ - జనితముక్తాఫల! జయము జయము
జయజయ ఆంధ్ర భూచక్రరక్షాదక్ష - సవ్యబాహాదండ! జయము జయము
జయజయ పార్థైక సామాన్యఘనధను - శ్శాస్త్ర ధిక్కృత రిపు! జయము జయము
జయజయ నల హరిశ్చంద్ర పురూరవ - శ్చక్రవర్తిసమాన! జయము జయము
        జయము జయ మాంధ్రనాయక జయము జయము
        బహు పరా" కంచు వెనువెంటఁ బైడిపొన్ను
        వెండికఱ్ఱల నెత్తి దీవెనలు చేసి
        బట్టువారు కైవారముల్‌ పట్టుచుండ.
లలితామోదభరప్రసూన నవమాలికాభూషితుం చేసి రు
జ్వల సౌధాగ్రము లెక్కి కుంకుమము లాజల్‌ చల్లి రంభోజనే
త్రలు క్రొంజీరచెఱంగు మాటువడి యర్ధవ్యక్తమౌ నాననం
బుల శృగారపు టోరచూపుల సుధాపూరంబు లూరించుచున్‌.
కాళ్ళకుఁ బారాణి కన్నులఁ గాటుక - చెలువొప్పు ముత్తైదువులు ముసళ్ళు
పసపుపూసిన మేని నొసలుపై వెడ - ల్పైన కుంకుమబొట్టు లంద మెసఁగ
ముడుతలువడి కొంచెముగ వంగినయొడళ్ళు - కనకాంబరమ్ముల కాంతి తఱుమ
లలిత మంజీర మంజులనాదములతోడ - పుంజీభవన్మహా పుణ్యరాసు
        లట్లు కదుపుగ త్రిపురసంహారకేళి
        పాటపాడుచు నెదురుగా వచ్చినారు
        ఆంధ్రధారుణీధవుని సైన్యముల కెల్ల
        విజయలక్ష్మీ ప్రసాదాంకవిధమువోలె.
అతఁడు కాదటవె ఓ అక్క! మాలవనాథు - కుత్తుక బల్లెమ్ము గ్రుచ్చినతఁడు
అంత వినమ్రుఁడమ్మా! వంగి మనకు న - మస్కార మొనరించు మధురరీతి
చూచితే! తండ్రి@ నీ శూరతారేఖా ప్ర - ధాన బాహువులు యుద్ధమునయందు
శత్రువక్షోభాగ జనితాసృగుదిత నీ - రావతారమ్ములై యమరుగాత
        యనుచు దీవించె ముసలి ముత్తైదు వోర్తు,
        గడచిపోవు సైన్యాగ్రభాగమునయందు
        నుత్తమాశ్వంబుసైఁ బోవు నొక్క యాంధ్ర
        తరుణతాసీము వీరావతారఁ జూచి.
తన యరదంబునుండి పతి ధాత్రికి డిగ్గి కృతప్రణాముఁ డ
య్యెను దల నేల దాఁకుగతి, వృద్ధసువాసిను లిచ్చు కుంకుమం
బును బ్రసవంబులున్‌గొని నమోనమయంచు రథంబు నెక్కినం
తన జయ మంత సిద్ధమ యనన్‌ దనసైన్యములెల్ల నార్వఁగన్‌.
కాఱియలేక ధాన్యకటకంబున రథ్యలు వెన్కఁగా బహి
ర్ద్వారము దాటి యాంధ్రవసుధాపతి యా పురివంకఁ జూచినన్‌
క్రూరత శత్రురక్తములు క్రోలఁగఁ జూచిన నాల్కలౌ పతా
కా రభనంబు ధాన్యకటకంబు వెలార్చెను రాజుకంటికిన్‌.
వేలయు లేని యంబునిధివేగమునన్‌ జను నాంధ్రసైన్య జం
ఘాలత మందగించె క్షణకాలముమాత్రమ యాంధ్ర విశ్వవి
ద్యాలయ మిచ్చు స్వాగతము నందుటకై యమరావతీపురిన్‌
బాలకవుల్‌ పఠించు జయపద్యములన్‌ విని మెచ్చుకొంటకున్‌.
మానిత గౌతమీసతికుమారుని సైన్యము లెల్ల దాటి కృ
ష్ణానది, పశ్చిమోత్తరదిశాముఖమై చనుచున్‌ తెలుంగు మా
గాణపుటెల్లదాఁటి చనఁగా నెదురయ్యెను వచ్చుచున్‌ బ్రతి
ష్ఠానపురంబునుండి తనసైన్యముతో 'పులమావి' దండుగా.
గౌతమీసుత శాతకర్ణి యీ శాతవా - హనుఁడు తా నసలు దావాగ్నికీల
శ్రీపులమావి వాసిష్ఠీకుమారకుం - డా యువరాజు ఝంఝానిలంబు
ఇంక నేమయ్యెసుమ్మీ నహపానుఁడు - సౌరాష్ట్ర మింక భూస్థాపితంబ
క్షాత్రపుఁ డేటికి గడియించుకొన్నాఁడు - శత్రుత గౌతమీపుత్రుతోడ
        ననుచు గుసగుసలాడినా రాంధ్రభటులు
        కొంద, ఱవి జయారావములందు మునిఁగె,
        రెండు సైన్యమ్ములును ధరిత్రీతలంబు
        పగిలిపోవఁగ సౌరాష్ట్రపథము నడిచె.
తెనుఁగుపొలాలఱేని గడిదేరినబంటుల కాలిదుమ్ము న
ల్లని పెనుభూతమై గగనలంబినియై పెనుగాలి రేఁగి ముం
దునకు వెలార్పగాఁబడుటతో నహపానుని రాజ్యలక్ష్మి తే
జునుదొరఁగెన్‌ పయిన్‌ తెనుగుశూరులు రాజ్యము చొచ్చినంతలో.
మూలచ్ఛిన్నములయ్యె దుర్గములు క్రమ్మున్‌ సైన్యముల్‌పేర్చి, కు
ద్దాలింపంబడె నశ్వసైన్య గజయూధంబుల్‌, హరింపంబడెన్‌
గాలింపంబడి యెల్ల మూలబల, ముగ్రం బాంధ్రసైన్యానల
జ్వాలాదగ్ధమయైన క్షాత్రపుని వంశజ్యోతి చల్లారఁగన్‌.
సౌరాష్ట్రేశ్వరు శేషదుర్గశిఖరాంచన్మౌళిభాగంబుపైఁ
దారామార్గ మలంకరింపఁబడియెన్‌ త్రైలింగరాజ్యధ్వజ
స్ఫారోదంచిత లోహితచ్ఛటల నా సాయంసమారంభ వే
ళారోచిస్సుల మందవాయు మృదులీలా వీచికాశ్రేణులన్‌.
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhraprashasti - Andhra Prashasti - Viswanatha Satyanarayana - gOtamIputrashAtakarNi Viswanadha Satyanarayana kavi Samrat Kavisamrat gnanapeetha gnanapitha ( telugu andhra )