కవితలు ఆంధ్రప్రశస్తి:
విశ్వనాథ సత్యనారాయణ
శాతవాహనుఁడు

2. శాతవాహనుఁడు

ఆంధ్రచక్రవర్తుల వంశమునకు శాతవాహన వంశ మని పేరు. దీపకర్ణి యను రాజు భార్య పాము కఱచి చనిపోయినది. అతఁ డామె యెడ నెడఁదవలన మఱలఁ బెండ్లి యాడలేదు. ఒకనాడు దుఃఖించుచుండ రాజునకు స్వప్నమునఁ గుల దేవత మఱునాఁడు వేటకు వెళ్ళుమనియు వెళ్ళినచో నచట సింహముమీఁద నొక బాలుఁడు కనుబడుననియు వానిని దెచ్చుకొని పెంచుకొను మనియుఁ జెప్పెను. అట్లే రాజు వెళ్ళఁగా సింహము, దానిపైన స్వారీచేయు బాలుడు కనఁబడిరి. సింహము బాలుని దింపి నీరు త్రాగుటకుఁ పోగా రాజు దానిని జంపుటకు బాణము వేసెను. అది గంధర్వుఁడై యీ క్రింది కథ జెప్పెను.

"కాషాయరమ్యవల్కల హుతాశన శిఖా - సంపిహితాశ్వత్థ సామిధేని
భువనమోహనహేతు నవవయఃప్రత్యుష-స్సమయ రోచిఃపూర్ణ చంద్రరేఖ
కుపితశంకర నేత్రకుహరాగ్నిదగ్ధ మ-న్మథదేవునకును బ్రాణప్రతిష్ఠ
అమితలావణ్య నీలాకాశ పశ్చిమా-శాచరత్సిత నూత్నజలదశకల
        మొక్క ఋషికన్య జలకలశోజ్జ్వలాంస
        లలిత కృష్ణానదీ ముక్త పులినసీమఁ
        గలసికొనె నొక్క యక్షునిఁ, గలసె వారి
        యమృత లజ్జాతిమధురనేత్రాంచలములు.
ఆ మధురంపు దృక్కు ఫలమై యుదయించిన యీ కుమారు ది
వ్యామృతవాహినీ మధురమౌ పసినవ్వులె నన్ను నిల్పె నీ
భూమిపయిన్‌, లతాంగి సుతుపుట్టినతోనె గతించినన్‌ మునుల్‌
పో! మృగరాజరూపమును బొందుమటంచును శాపమిచ్చిన\న్‌.
నీ వాంధ్రేశ్వరుఁ డౌదు, శాపవిధ మంతే, శాతుఁడన్‌ నేను, నీ
కై వీనిం గని పెద్దఁ జేసితిని రాజా! వీఁడు కోదండ బా
హా విధ్వస్త దిగంతరాహిత ధరాప్రాణేశ చూడామణి
గ్రీవా మంజుల హారరత్నరుచిర శ్రీపాదకంజుం డగున్‌.
నీ నలినాక్షి శక్తిమతి నిద్రిత శయ్యను సర్పదష్టయై
ప్రాణములన్‌ ద్యజించుట శుభప్రతిపాదకమయ్యె నేఁటికిన్‌,
వీని సమస్త రాజ్యపదవీస్థితు జేయుము, జీవితాంత సం
ధ్యానవవేళ నీ ముసలియంసము కొంచెము విశ్రమించుతన్‌."
అంతర్ధానము పొందె యక్షుఁ డితు లం,చా దీపకర్ణిక్షితీ
శాంతర్దాహము కుఱ్ఱవాని నవగంగాంభోజపత్రాగ్రనే
త్రాంతమ్ముల్‌ గనుగొన్న యంతటన నీహారాంబుధారాపృషత్‌
సంతానప్రసరమ్మువోలె నయి హృత్పద్మంబు రాగిల్లినన్‌.
కనుఁ గొనలందు బాష్పములుగ్రమ్మఁగ, కంఠమురుద్ధమౌచు "నా
యన! చనుదెమ్ము నీ చిఱుతలైన కరమ్ములు నాగళమ్మునం
దున బిగియింపు! శక్తిమతి తొంగలిఱెప్పలఁ బోలియున్న నీ
కనులకు నాంధ్రదేశ మది కైవసమయ్యెనురా! కుమారకా!
నీ కర్పూరపు ఖండముల్‌ భుజము లందింపంగదోయీ! శిశూ!
నా కంఠంబునయందు, శక్తిమతియేనాఁ డట్టులయ్యెన్‌ భవ
న్మాకందప్రసవాతి మంజుల లసన్మందస్మితంబుల్‌ కనుం
దాఁకన్‌శూన్యమ యయ్యె నా బ్రతుకు సంధ్యామల్లికామోహనా!
నా తరువాత నాయకవినాకృత యౌటకు రాజ్యలక్ష్మియున్‌,
బ్రీతి జలాంజలిన్‌ విడువ బిడ్డలు లేమి పితృవ్రజంబు, శో
కాతివిషణ్ణులై మనెద రన్న! భవన్ముఖ చంద్రదర్శన
స్ఫీతులఁజేసి నాకులము పెంపు గడింపుము తండ్రి! రమ్మురా!
తెనుఁగున్‌ ఱేండ్లకునాదిపూరుషుఁడు దైతేయాంతకుండాంధ్రవి
ష్ణుని లక్ష్మీకుచకుంకుమారుణకరస్తోమంబు నీ విచ్చు త
ర్పణముల్‌ గైకొనఁ జాపఁగాఁబడును రారాకుఱ్ఱ! నీ మందహా
స నవజ్యోత్స్నలు చూడ శక్తిమతి నోచన్‌ లేదురా పుత్రకా!
ఈ నిఖిలాంధ్రరాజ్యరమ కేలిక వౌదువు, దీపకర్ణి సం
తానముగాఁగ ని న్గొలుచు ధాత్రిజనావళి, ప్రాక్సముద్రమం
దానిన నీరు పశ్చిమమహాంబుధిఁ ద్రావుము, గృష్ణనీరు గం
గానదిఁ జేర్పు మాంధ్రసతి కంఠలసన్నవహారమో యనన్‌.
నీ కోదండ వినిర్గతాశుగ మహాగ్నిజ్వాలలన్‌ దట్టమై
యే కోనల్‌ దహియింపఁగాఁ బడెడు తండ్రీ! యవ్వి శ్రీకృష్ణవే
ణీ కళ్యాణ పృషత్పరంపరల శాంతిన్‌ సస్యవంతంబులై
శ్రీ కేదారములై తగున్‌ విజయలక్ష్మీ కేశ బంధంబులై.
తెనుగున్‌ రాజుల వంగసం బిఁక భవద్దివ్యాంకమై శాలివా
హన వంశం బని పిల్వఁగాబడెడుగా, కౌ రాఘవుండున్‌ గడిం
చని దీ కీరితి, వంశకర్తగుట సామాన్యంబె! లే రెంద ఱ
య్యినవంశ్యుల్‌? రఘువంశమైనయదికాదే! యామహారాజుపై!"
అనుచును దీపకర్ణి పసియాతని జంకకు నెత్తుకొంచుఁ దె
ల్లని తన గడ్డ మక్షికొనలన్‌ జడివారిన మోదబాష్పవాః
కణములు జాఱి సిక్తమయి కన్నులు మూతవడంగ విల్లుచం
కను దగిలించి నెమ్మదిగఁ గాకుళమార్గము పట్టె నొంటిగన్‌.
ఆ రాజన్యుని మీఁద మందపవనవ్యాధూతపాధోలవ
శ్రీరమ్యాకృతి కృష్ణవేణి తఱిమెన్‌ స్వీయాంబుధారాప్లవ
న్నీరేజామృతవాసనాలహరి దిఙ్నిర్హాదమో నా వసం
తారామమ్ములలోఁ బికమ్ములొలికెన్‌ ద్రాక్షారసాంభోనిధుల్‌.
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhraprashasti - Andhra Prashasti - Viswanatha Satyanarayana - shaatavaahanu.rDu Viswanadha Satyanarayana kavi Samrat Kavisamrat gnanapeetha gnanapitha ( telugu andhra )