| కవితలు | ఆంధ్రప్రశస్తి: విశ్వనాథ సత్యనారాయణ |
నన్నయభట్టు |
7. నన్నయభట్టు
ఆంధ్ర భారతావతార ఘట్టము
|
శ్రీ గోదావరి నాంధ్రశైవలిని రాజీవమ్ము కించిత్స్మిత ప్రాగల్భమ్ములుచూపె నయ్యుదయమార్తాండాంశుసంస్పర్శఁబ త్రాగార మ్మను కార వెల్వడి స్వతంత్రమ్మైన గీతమ్ము నా శాగంధానిలవీచిఁ దేల్చినది గీస్సమ్రాట్టు భృంగ మ్మొగిన్. |
|
ప్రతివాదిప్రళయుల్ త్రయీనిధులు తత్ప్రాతర్వివస్వత్ప్రభా హృతకేశాంతనిమజ్జనాంబుచయు లుర్వీదేవతల్ త్ర్యంబక ప్రతిముల్ కుండలదీప్తకర్ణయుగళుల్ వస్త్రాద్యలంకారభూ షితులై బ్రహ్మలవోలికన్ నడచి రాస్తిక్యప్రధానాంగముల్. |
|
చనిచని రాజపట్టణవిశాలపు రథ్యల వెంబడిన్ సభా జనములు పెక్కురాజులును సైన్యపతుల్ సచివాదు లంతకున్ మునుపె ప్రవేశమై తమ సమున్నతపీఠము లాదరించి యుం డిన సభఁ జొచ్చి యందు తమ నిష్ఠితపీఠములందుఁ జేరఁగన్. |
|
ఆజానులంబమానాంభోజనాళ బా-హాదండముల నందమైన వాని భసిత త్రిపుండ్రాంక ఫాలభాగమునఁ జం-ద్రార్ధశేఖరు ప్రతియైన వాని నిత్య గోదావరీ నియమ వేళాకృత - స్నానమ్ములఁ బవిత్రుఁ డైనవాని ప్రౌఢాంధ్ర విజ్ఞానభాషా మహాదేవి - కావాసమైన యాస్యమ్మువాని |
|
వచ్చుకవి నన్నభట్టుని వాఙ్నియంత నెదురుగాఁ బోయి సచివాదు లెఱగి తేర సముచితాసనమున శబ్దశాసనుండు ఉదయశిఖరి మార్తాండుఁడై యొప్పుమెఱసె. |
|
ఆయన వేదవేదాంగ విద్యారాశి - సత్తపోజిత పయోజాతయోని ఆ యాఱుగురు వార లాఱుశాస్త్రములకు - మూలకంబములు గీర్ముఖరముఖులు అఖిలభాషా కవితానాథుండు నా-రాయణభట్టు తీవ్రమతి యతఁడు గణితశాస్త్రాంబోధి ఘనుఁ డాతఁడే పావు-లూరి మల్లన, కవిలోకగురువు |
|
అందఱను జూచి పరిచయ మందహాస చంద్రికలఁ జిమ్మె నాంధ్రభాషానియంత అంతలో వినవచ్చె రాజాగమనము తెలుపు మాగధసౌవిదల్లుల పొగడ్త |
|
"జయకుండవాంబాప్రజా! జయమార్తాండ! - త్రిభువనాంకుశ! జయశ్రీ మనోజ్ఞ! అమ్మంగ దేవీ హృదంభోజమార్తాండ! - రాజమహేంద్ర విభ్రాజబిరుద! పరగండభైరవ! బిరుదాంకభీమ! స-త్యాశ్రయ కులశేఖరా! సమస్త భువనాశ్రయ! త్రిలింగ భూమీ మహాభార-వహన బాహాదండ! పార్థివేంద్ర! |
|
జయజయ!" యటంచు బిరుదులు చదివినారు వందిమాగధ కంచుకుల్ సుందరంపు కంఠములఁ దేనెవాక లొల్కంగ, సభికు లందఱును లేచి నిల్వ బద్ధాంజలులయి |
|
సమదేభా స్తరణంబు డిగ్గిప్రణుతోత్సాహంబునన్ వచ్చె ను త్తమచాళుక్యుఁడు విష్ణువర్ధన ధరాతన్వీమనోహారి వి క్రమదంతావళసుందరమ్ముగ జయారావమ్ములన్ సల్ప మం దమృదుస్వాదువచోనిగుంభనల నందం బొప్పఁగా మాగధుల్. |
|
అరుగుదెంచి బృందారకేంద్రాభుఁడైన రాజరాజనరేంద్ర భూరమణుఁ డంత సకలఋషిసేవ్యుఁ డగు శచీజానివోలె ప్రౌఢి మెఱసె చింతామణీ భద్రపీఠి. |
|
ఆంధ్రచళుక్యవంశావనీనాథుల - రాజధానుల హజారములనుండి హరిదంత దంతావళానేకకర్ణని-ర్భేదచండము రణభేరి మ్రోఁగ ఘుర్ఘురించిన మహాక్రూరఘోణిప పతా-కాజృంభణమ్ములఁ గలఁతఁజెంది సప్తగోదావరాతృప్త భీకరఘోర - కుపి`తరావములకు గుండెపగిలి |
|
యున్న శాత్రవతతి చళుక్యోర్వినాథ కృత్తదండకారణ్యంబు స్మృతికిఁ దగిలి దాచుకొనుచోటు కనరామిఁ దల్లడిలిరి యింతలగు బాలకుల చంక కెత్తికొనుచు. |
|
అని కవిబట్టు సర్వకవితాధిపు నన్నయభట్టువంకఁ జూ చిన చిఱునవ్వు మెచ్చుదల చిన్నెలు నన్నయగారి యాననం బునఁ దళుకొత్త సంతసిలిపోయెను ద్వారమువద్దకున్ "బళీ" యని పొగడెన్ సభాస్థలి ధరాధిపు మోమున నవ్వురేగఁగన్. |
|
ఆహితాగ్నులు సమంత్రాక్షతలం బూని - యాశీస్త్రయీపాఠ మనిరి నోట విమలదేశాక్షి సావేర్యాదిసౌమ్యరా-గములు పాడిరి గాయకవ్రజంబు ఆఱుశాస్త్రముల వాక్యార్థమ్ము చేసిరి - శ్రవణపేయముగ దోషజ్ఞ వితతి భారతార్థమ్ముల బహుసంహితామర్మ - సిద్ధిఁజూపిరి విపశ్చిన్మఘవులు |
|
చంద్రవంశ్యుఁడౌ రాజరాజక్షితీంద్రు హృదయపద్మమ్ము ప్రహ్వీకరింపబడియె భారతార్థ గుంఫనములఁ బలికె నిట్లు క్షోణిపతి నన్నపార్యుపైఁ జూడ్కి నిల్పి. |
|
"ఇవియేనున్ సతతంబు నాయెడఁ గరం బిష్టంబులై యుండు పా యవు భూదేవకులాభితర్పణమహీయఃప్రీతియున్ భారత శ్రవణాసక్తియుఁ బార్వతీపతి పదాబ్జధ్యాన పూజా మహో త్సవమున్ సంతత దానశీలతయు శశ్వత్సాధు సాంగత్యమున్. |
|
హిమకరుదొట్టి పూరు భరతేశ కురుప్రభు పాండభూపతుల్ క్రమమున వంశకర్త లనఁగా మహి నొప్పిన యస్మదీయ వం శమునఁ బ్రసిద్ధులై విమలసద్గుణశోభితులైన పాండవో త్తముల చరిత్ర నాకు సతతంబు వినంగ నభీష్టమెంతయున్. |
|
ధారుణి నీకు మిన్న కవితానవపట్టము కట్టుకొన్నవా రే?" రని సాభిలాషములు దృక్కులు చాచినయంత వేదగం భీరవచోనిగుంభనల మేలిమిచేఁ జిఱుహొన్ను గంటలున్ బోరుకలంగ నన్నయ ప్రభున్ దగ దీవనచేసె నీగతిన్. |
|
ఆశ్రమసాధ్య మైన నిఖిలావని దేవహితంబుకోసమై ఆశ్రితపక్షు లైన భవదన్వయ పూర్వనృపాలు రేలి వ ర్ణాశ్రమ ధర్మముల్ నిలిపి రా కులమందునఁ బుట్టినట్టి నీ కశ్రమసాధ్యమైనయవి యాశశితారకకీర్తిచంద్రికల్! |
|
అనెనో నన్నయభట్టగీష్పతి సుధాస్యాంభోజరేఖాంతరం బున రాకానవశారదేందుకిరణంబున్ బోలె నైనట్టి! మిం చున సాహిత్య సరస్వతీ ప్రణుత తేజోలేశ మొక్కండు తోఁ చెను, వర్షించెను సర్వదైవత కరోత్సృష్టంబులై పుష్పముల్. |
|
"శ్రీవాణీగిరిజా శ్చిరాయ" యను నాశీఃపూర్వకారంభవా ణీవైదగ్ధ్యమునందు మ్రోగినది తంత్రీనిస్వనం బొండు గో దావర్యాపగలోని భంగములయం దావృతులం జూపి గీ తావేశంబునఁ దెన్గునేల తనుదానై ముక్తిచూఱాడగన్. |