కవితలు ఆంధ్రప్రశస్తి:
విశ్వనాథ సత్యనారాయణ
ప్రోలరాజు

8. ప్రోలరాజు
(క్రీ. శ. 1140)

కాకతిబేతరాజునకు ప్రోలరాజు కుమారుఁడు. ఇతఁడు రాజ్యతంత్రజ్ఞుడయిన మహాయోధుఁడు. ఈ కథలోఁ జెప్పబడిన యంశములన్నియు నితఁడు జరిపినవే.

కల్పన

శకయవన హూణుల దాడు లెక్కువ యయిన రోజులలో నాంధ్రదేశము చిన్న చిన్న రాజ్యములుగా నుండుటచేతఁ బరు లరుదెంచినప్పుడు తెనుఁగు రాజులందఱు తమ సైన్యములను గలిపి యుద్ధము చేసిన బాగుండునని ప్రోలరాజు సభ గావించెను. మంత్రకూట పురాధీశ్వరుఁడయిన గుండరాజు దీనిని భగ్నపరచెను. తరువాత ప్రోలరాజు వాని శిరస్సు తెచ్చి తన కోటగుమ్మమునఁ గట్టెను. కాకతిప్రోలు కాలములో చిన్నదైన కాకతి రాజ్యము విశాలమై భావిమహాదశకుఁ దగినంత వైశాల్యము గలది యయ్యెను.

అంసంబందున బారుటీటె నిడి నేత్రాంభోజముల్‌ భావ తీ
క్ష్ణాంశుల్‌ జిమ్మఁగ ధాత్రి పాదహతికన్‌ గంపింపఁగా క్షత్రియో
త్తంసుం డొక్కఁడు హన్మకొండ కెలనన్‌దారాడె తానొక్కసా
యంసంధ్యాసమయంబునందున లలాటాకుంచితవ్యగ్రుడై.
"నాఁడే మజ్జనకుండు వైరినృపకాంతారమ్ము ఛేదించుచో
గూడందీసెను గాని బాసటని, యాగొడ్డళ్ళచే నేమి రా
పాడంజాలఁడు మంత్రకూటపతి యౌరా! గుండరా జెంత యా
టాడెన్‌ దైలపదేవుఁడింతకును బాహాగర్వహీనుండగున్‌.
తైలపదేవుఁడైన నొకదారికి వచ్చెడువాఁడ యేమి? యె
వ్వీలుననైన నాహుతికి వేచినవారల యెల్ల, రెప్పు డే
నాళులనేమొ? కాలహరం బొనరింపమి యేల యౌను, చే
గాలినవెన్క నాకు లని గంతులువైచుట పాడిలేమికిన్‌.
తెలుఁగు చళుక్యరాజుల ప్రతిష్ఠలతో సరిగాఁగ వారి దో
ర్బలమును సన్నగిల్లినది వా రిఁక పూర్వపు బేరిసవ్వడిన్‌
నిలుపుకొనంగఁజాల రవనీస్థలి పంచుకుపోయి యింత ము
క్కలయిన వెన్క హూణులకుగాఁ గయికో లొనరింత్రొ యేమొకో.
ఉత్తరభూములన్‌ యవనహూణుల మందలు చెల్ల రేగి రా
యొత్తిడి వింధ్యదక్షిణపుటూరుల కల్గెనయేని, నేఁడిటన్‌
గత్తులగోడఁగట్టగల క్ష్మాపతి యెవ్వఁడు? సూర్యవంశ రా
హుత్తులమీఁద వచ్చిపడదో యపకీర్తి యెదుర్పకుండినన్‌.
పరులరుదెంచినన్‌ గల నృపాలురు నల్వురు కూడి వారిపై
నరుగఁగరాదొ? యెవ్వరికి నబ్బిన వారికె యంట! యెంత దోః
పరిణతశక్తి! రాజసభ భగ్నముసేయునొ గుండరాజు? త
చ్ఛిరమున మత్పదం బిడక చేవ యనన్‌ గలదే ధరాస్థలిన్‌!
అస లదికాదు లోనరయగలట్టి తలం పితడేమి? భూమిరా
డ్విసరమునంతయున్‌ సభకుఁ బిల్చుట యే మరుదెంచుటేమి? వా
ర్పొసగఁగఁ జేయుటా యనియు పుట్టెనుదొల్త, సదూహయే, బలే
యొసవరియూహ బాగుపడునూహయె! తెన్గులదేల్చునూహయే!
ఆయతమై ప్రశస్తమగు నాంధ్రచాళుక్యమహావనీరుహ
చ్ఛాయలలోన ఱెక్కగమిఁ జూచినవారమ వారిమీఁదనే
యాయితమా? యనంగ నిసుమంతయుఁ దైలపదేవుఁడెంచఁడా
కోయతలంపు గుండపతి గుండియఁ గ్రుచ్చక యీటెలనిల్చునే?
తనశౌర్యం బదియెంత? రాజులసభన్‌దానెంత? యెంతెంత యో
చనకున్‌ బారలుచాచె? తద్విపులవక్షంబున్‌ ప్రభేదింపకుం
డిన శ్రీకాకతిదేవి పాదములయం దే మోపలే దీ శిర
స్సును, ఱేపే శుభలగ్నమాంధ్రవిషయేశుం డెవ్వఁడో తేల్చెదన్‌.
తైలపదేవు బందిగొని తత్కులమందలి మా కృతజ్ఞతా
మూలముగా వెసన్‌ విడిచిపుచ్చెద నాపయి గుండరాజుపై
వ్రాలిన నాకు నడ్డమయి రాఁడఁతఁ డప్పుడుగాని కాకతి
ప్రోలుఁ డనంగ నేమొ తలపోఁతలు సాఁగవు గుండరాజులోన్‌.
అగు గోవిందుఁడు తైల పేశ్వరుని సైన్యాధీశ్వరుం డేటికిన్‌
బొగ రేగించెడు? రేగఁజేయు నెడలన్‌ భూమీశవిధ్వంసకం
బగు శ్రీకాకతివీరశౌర్య దహనాహంకారకీలన్‌ హవి
స్సగు, సాగించెదఁ గాకతీయ నవరాజ్య శ్రీవినిర్మాణముల్‌.
ఆ యుద్రేకము చేత భూమిపతి స్వీయాంగంబు లుష్ణంబులై,
సాయంకాలము లుప్తమై, తొలిదెసన్‌ చంద్రోదయంబైన న
వ్యాయోగంబునుబోలె తత్కిరణసాంద్రానంత శైతల్యరే
ఖాయోగంబునఁజేసి చల్లఁబడి సౌఖ్యంబయ్యె నొక్కింతలోన్‌.
అంతట రాజు దుర్గ సముపాంతముఁ జేరఁగ బంటు లొత్తికొం
చెంతయు నమ్రులై పథమునిచ్చిరి యెచ్చటకేఁగి యొంటిగా
నింతటి ప్రొద్దుపోవువఱ కేనియు రాకని కొంద ఱందులో
మంతనమాడినారు, పతి మందగతిన్‌ జన, వెన్కతట్టునన్‌.
కాకతి కన్నుదోయి తెలికల్వల కాంతులలోఁ బ్రసన్నతా
శ్రీకత దాల్చె నాఁటినిశి ఱేని సభక్తికమైన పూజలన్‌
ఱే కదముట్ట విన్బడె నరిందమమై దెసలందు జైత్రయా
తాకకుదంబు నిస్సహణరావము భీకర మన్మకొండపై.
AndhraBharati AMdhra bhArati - kavitalu - AMdhraprashasti - Andhra Prashasti - Viswanatha Satyanarayana - proolaraaju Viswanadha Satyanarayana kavi Samrat Kavisamrat gnanapeetha gnanapitha ( telugu andhra )