కవితలు నవమి చిలుక శిష్‌ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్‌

16. చిన్నతనం

చంటిలో స్తన్యపానము లేక కొంటినయ్య కంచిమేక అన్నమాదిరిగ మా అమ్మ చంటిలో స్తన్యపానము లేక మాఅమ్మ కమ్మమ్మ మా అవ్వ వాడవాడలకు నన్ను తిప్పుతూ మరదలా కోడలా మాణిక్యపు మా అబ్బాయికి పాలివ్వరుషే అని అడగగానే ఏవాడ తల్లీ ఎగిరెగిరి వచ్చేది నవ్వుతూ!

ఏనాది యెంకీ దొమ్మర్ల దృగ్గీ గొల్లగౌరమ్మా కమ్మ కామమ్మా రెడ్డి రోసెమ్మా తెలగ రత్తమ్మా పాలిచ్చి తలదువ్వి పూలిచ్చి తొడలపై జోలలిచ్చి పాటలను నేర్పారు ఆటలను నేర్పారు తెనుగు తేటల్లో!

ఏనాది ఎంకితో ఏటివడ్డుకు పోతే జోలలను పాడుతూ అలలతో చెప్పేది. ఇటుసూపి ఊపితే ఇంద్రూని సాయ అటుసూపి ఊపితే సెంద్రూని సాయా అని!

దొమ్మరుల దృగ్గితో దోబూచు లాడితే తందాన లాడుతూ బుజానవేసుకొని బలే బలే పల్టీలు కొట్టేది - కళ్ళు గిర్రుమనేట్టు! గొబ్బెమ్మ పెడుతున్న గొల్ల గౌరమ్మతో గోటుపోతే నన్జూచి తలదువ్వి పూలివ్వ గొబ్బెమ్మ సిగ్గుపడేది!

కమ్మ కామమ్మ రెడ్డి రోసెమ్మ తెలగ రత్తమ్మా కుణు కుణు అందెలపై కడియాల కాళ్లతో వరిబియ్యం దంచుతూ నావంక నవ్వుతూ వడ్లు దంచంగానె వచ్చె చుట్టమ్ము పొమ్మన్న పోడాయె వరికూటివాపి అని పాడుతూ బుగ్గ పొడుస్తూ చందలగ్నం పెళ్ళి కొడుక లేచి రావయ్యా చెల్లమ్మనిస్తాము పెండ్లాడ రావా అనగనే నవ్వుతూ గేలింత లాడే నాకోసం రొప్పుతున్న రోకళ్ళ నవతలకు తోసి ముగ్గురూ నేనిస్త నేనిస్త అనే పోటీలు పోతూ పరుగ్త్తి రాగా చిటికకో గుటకతో ముచ్చటగ గుటుకు గుటుకు మని వరస వరసగ తాగి వయ్యారముగ తాగి పారాడుతూ వార్ల చెర్లాడుతూ బైట పిల్లలతో పోరాడుతూ గంతేసి గంతుకో తంతుతో వంతేసి పిల్లలతో రోడ్డుపై నుంచున్న నాఠావు ఒకమనిషి చూసి ఎవడురా వీడు ఢిల్లీ కోటపై యుద్ధానికి పోయేవాడల్లే ఉన్నాడు అన్నాడేగాని నవమి చిలకల నాయకుడని ఎరుగడు!

ఎరగడని మా అవ్వ దిష్టి తీసేది. చీకటి పడగానే చిచ్చి కొట్టేది!

హరాము చేస్తూ నిద్ర పోకపోతే పాడేది అల్లడుగో బూచివాడూ నాతండ్రి వస్తాడు పవళించరా అని! అసలు గమ్మత్తు ఏమిటంటే - బైజోవ్‌ గమ్మత్తేంటి గమ్మత్తు: ఈ కథ ప్రేయసికి తెలిసిందంట తడవ తడవకు డ్యామ్‌ హర్‌! బూచని ఝడిపిస్తుంది! ఏంపిల్లోయి అది బావా ఎప్పుడూ చిన్నతన మేనా!

AndhraBharati AMdhra bhArati - kavitalu - navami chiluka - SiShTlA umA vijaya mahESvara vinAyak - Shishtla Umamaheswara Rao - Sishtla Umamaheswara Rao - kavitalu kavitvaM geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - telugu kavita - tenugu andhra ( telugu andhra andhrabharati telugu literature )