కవితలు నవమి చిలుక శిష్‌ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్‌

నవమి చిలుక విమర్శ

గోపీచంద్‌, బి.ఏ., బి.యల్‌.,

"ఇది పూర్వకవిత్వం కాదు, భావకవిత్వం కాదు. నవ్యకవిత్వం కాదు" అంటున్నాడు వినాయక పండితుడు. ఏమిటిది?

కవితాసమాధిలోనో, కళాతన్మయత్వంలోనో ఉన్నప్పుడు "ఇది ఆహ్లాద కవిత్వం. ఇది ప్రాహ్లాదకవిత్వం. అదేమిటి? ఇదేమిటి? ఇదే కవిత్వం..." అంటాడు "వినాయక పండితుడు". అంటే ఏమిటి?

భావకవులు పురాణకవుల మీదికి విప్లవం చేసి, జమీందారులను ఆశ్రయించి వారి కనుసన్నలకు నృత్యంచేసే కవిత్వాన్ని కేపిటలిస్టుల రుచులకు అనుగుణంగా మార్చి, వారి అందుబాటులోకి తీసుకొనివచ్చారు. ఇప్పుడు ప్రజాసామాన్యం "మీ సాముగరిడీలు, మీ ప్రేయసీ సంబోధనలు మాకు అర్థమవటం లేదు. మీరు దివినుండి భువికి దిగిరావాలి" అని భావకవులమీదికి ప్రోలిటేరియన్‌ విప్లవం చెయ్యటానికి సిద్ధపడుతోంది.

నే నెరిగినంతమట్టుకు రాజమండ్రి వాస్తవ్యులైన కవికొండలవారు, ఏవాస్తవ్యుడూ కాని (ప్రోలిటేరియన్‌కి దేశమే లేదు అన్నాడు మార్క్సు) వినాయకపండితుడు ఈ విప్లవానికి దారితీస్తున్నారు.

వీరు ఈ విప్లవానికి వైతాళికులు.

వినాయకపండితుడు సాధారణంగా కథావస్తువును ప్రోలిటేరియన్‌ జీవితంలోనుంచి తీసుకుంటాడు. ప్రోలిటేరియన్‌ భాషను ఉపయోగిస్తాడు.

ఇతని కవిత్వం 'పైనం'లో పుట్టి "ఏనాది ఎంకి, దొమ్మరదృగ్గి" స్తన్యాలతో పెరిగినా బూర్జువాభాషలోని పాండిత్యం బూర్జువా భాషలోని అభిరుచి ఇతనిలో సంఘర్షణ రేపుతున్నాయి.

అందుకనే ఈకవిత్వంలో బూర్జువా వాసన, ప్రోలిటేరియన్‌ యాస కనుపిస్తూంటాయి.

ఈ పూర్వ వాసనలను పోగొట్టుకుంటే గాని సిసలైన ప్రోలిటేరియన్‌ కవిత్వం రాదు.

వినాయక పండితులను ఈవిషయం గమనించగోరుతాను.

AndhraBharati AMdhra bhArati - kavitalu - navami chiluka - SiShTlA umA vijaya mahESvara vinAyak - Shishtla Umamaheswara Rao - Sishtla Umamaheswara Rao - kavitalu kavitvaM geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - telugu kavita - tenugu andhra ( telugu andhra andhrabharati telugu literature )