కవితలు నవమి చిలుక శిష్‌ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్‌

02. పూల రంగడు

పురిటిలోనే పూలరంగడి పులిజూదపు పోకడలన్నీ పులకరిస్తే అతని తల్లి యశోదల్లే తాయత్తూ విభూదితో తయారయేది.

పూలరంగడి పురిటి నీటిలో పున్నాగ మొలిచింది. పూవు లేసింది. పున్నాగ పై కొమ్మగూడు పొన్నంగి కిరవు. పొన్నంగి పిల్లతో అతిబాల్య స్నేహం పూలరంగడికి.

ఐదేండ్ల పూలరంగడి కాటలో పాటలో చేదోడు వాదోడు చిన్ని పొన్నంగి పిల్ల. తల్లి పొన్నంగి పూలరంగడ్ని జూచి మేనత్త మురిపెముల చూపేది. మేనత్త పాటలను పాడేది.

పూలరంగడికీ పొన్నంగి పిల్లకూ పడమటి గాడ్పులోనైనా పాలుమారేలేదు. అలిస్తే ఆ చెట్టు నీడనో, మరిచి మఱ్ఱిచెట్టు నీడనో, పడమటి గాడ్పులోనైనా పరుండి నిద్రోయి మాపటికి మళ్ళీ ఇంట నుండేవారు.

దొంగభయం లేదు దయ్యాల భయం లేదు పురుగుభయం లేదు పుట్టభయం లేదు. చీకట్లోనైనా చిచింద్రీ తీరుగా, నేరుగా, పండ్రెండేండ్ల యీడుననే పూలరంగడు వెన్ను విరుచుకుని వెనక్కు తిరక్కుండా విసురుగా వెళ్ళితే విసిరేసి నట్లుండేది.

దారిలో ఓరోజు కర్రకాబూలీవాడు పరకాయించి చూస్తే చిలిపిగా పూలరంగడు వాని ముందు నుంచున్నాడు. కాబూలీవాడు కర్రెత్తి కళ్లు ఎర్రెత్తి దబాయిస్తే కాలిసందు దూరి వీపుమీద చరిచి పరుగెత్తి చెట్టెక్కి కోతికొమ్మంచి ఆడగా గగ్గోలు పడుతూ కాబూలీవాడు చూస్తే లాభమా?

పదారేండ్ల ప్రాయంలో పరికిముగ్గు లాళ్లను చూసి చిరతల్ను నేర్చాడు పూలరంగడు. సిరి సిరి మువ్వలకు చిరునవ్వు వచ్చేట్టు జుట్టులో పూలు జుట్టి ఉట్టికింది కృష్ణుడల్లే రంగడు రమ్యంగా చిరతల్ను వాయిస్తూ రంగైన పిల్లా రాణివాసం పిల్లా రత్నాల పిల్లా ముత్యాల ముద్దిదుగో సత్యలోకం పోదామా అన్నా, అన్నట్టు చూచినా విరగబడి వరగపడి విరులపడు మరులపడు మనసులతో ముద్దియలు చూచేవారు! ఓవేళ కటకటలబడుతూ ఏపిల్లఐనా చూచిందే అనుకో! వెంటనే వాడు "ఏతీరున దయ జూచెదవో" అని పాడితే తబ్బిబ్బులయ్యేవాళ్లు తరుణులంతా అని పూలరంగడి పులిజూదపు పోకడలకు పడతులే సాక్షి!

దిష్టికన్ను గాదు దిగులుకన్నుతో కన్నుబడ్డది పూలరంగడిమీద!

కంపెని దొర పెండ్లాము కలవరించేది రంగని జూచి పలవరించేది రంగనిజూచి పడరాని పాట్లు పడేది రంగనిజూచి రంగమెళ్లిపోయేదేమోగూడా!

సీమ పోదామోయి చిన్నపిల్లవాడా సీమ చిత్రాలలో సీమ దర్జాలలో మునిగిపోదామోయి తేలిపోదామోయి తెల్లవారు టనేదే లేదోయి మనిద్దరికి అని కబురు చేసింది!

కబురులో కస్తూరి ఉన్నదో మరి మాటలో మస్తు మందున్నదో మరి కబురుతో కదిలింది వానిగుండె! మాటతో మరిచిపోయాడు లోకాన్ని!

దొరసాని రంకులో దొర్లిపోయాడు రంగడు! ఇంటివద్ద లేడు రంగడు! ఇంటివద్ద తల్లి ఏడుపు, ఇగిరి ఇగిరి పోతున్నది!

తెల్లదాని వళ్ళో వడలిపోయాడు - తెల్ల తెల్లనై పోయాడు రంగడు!

తెల్లదీ దాని మొగుడూ తెల్లవారు గట్టునే ఒక తెల్లవారు గట్టునే పయనమై పోయారు సీమకు! గట్టునే గట్టునే పోయింది తెల్లది! ఊరు ఊరా వెతికినా రంగడేయూరా లేడు! ఏ వాడలోనూ కనబడ లేదు!

కొత్త దొరవచ్చి పాత ఇల్లు తాళముదీసి కాపురం పెడదా మనుకొని గది గదీ చూచాడు - ఆ గదీ ఈ గదీ చూచాడు. ఇల్లు వాస నేస్తోంది! పోనుపోను కుళ్ళుకంపు కమిలి పోతున్నది!

పడక గదిలో పగిలిపోతూ పిలుస్తూ కేక లేస్తున్నది ... ఆ వాసన!

పడకగది తలుపు తీయగానే ఏదో తేజస్సు బయటికి దూకింది! లోపల అస్థిపంజరము చుట్టూ వాడినపూలు! ఎండి పోయిన పూలు!

కిటికీ రెక్కలకు రెక్కలను కొట్టుతూ రెండు పొన్నంగి పిట్టలు పొద్దున్నుంచీ పొద్దాకా పొలపొలా ఏడ్చి ఏడ్చి రాగాలు పెట్టి పొద్దువాలగానే ప్రాణాలు వాల్చినవి! ఆ ఊరిలోనికి యీ రోజువరకూ ఏ పిట్టవచ్చినా పొన్నంగిపిట్ట మాత్రము రాదు! ఆ ఊరివాళ్ళకు పొన్నంగి అరుదై హంసయై పోయింది!

AndhraBharati AMdhra bhArati - kavitalu - navami chiluka - SiShTlA umA vijaya mahESvara vinAyak - Shishtla Umamaheswara Rao - Sishtla Umamaheswara Rao - kavitalu kavitvaM geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - telugu kavita - tenugu andhra ( telugu andhra andhrabharati telugu literature )