| కవితలు | నవమి చిలుక | శిష్ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్ |
03. చిన్నమ్మాయి
అయిదేండ్ల చిన్నమ్మాయికి ఆర్నెల్ల పాపాయి చెల్లెలు!
ఇద్దరు పిల్లల సద్దుతో రద్దిగా ఉన్నా తల్లికీ తండ్రికీ తాతకూ అవ్వకూ చుట్టాలచూపుకూ ఇద్దరు పిల్లాయిల ముద్దుతో పొద్దుపోయేది! ఆర్నెల్ల చెల్లాయిని అయిదేండ్ల అక్కయ్య సముదాయించి తొడలపై జోలల్లు పాడితే జంధ్యాల తాతయ్యకు జంధ్యాలు సాగవు! వత్తులల్లే అవ్వ వత్తులను మూస్తుంది! వంట చేసే తల్లికి వంటసాగదు! జీలకర్ర అరువుకై పొరుగమ్మ వస్తే మాటలతో మరిచిపోయి పోతుంది!
కదురు బెండు దుండు చేరులాడుతూ చెల్లాయికీ తనకూ చిటపటాలంటూ చెల్లాయిని చిన్నగా కొట్టినా కీ మని యేడిస్తే కటిక్కిన చెల్లాయికి చన్నుకుడిపే పిల్లను పరుగెత్తుతూ వచ్చి తల్లి ఏమంటుంది?
నలుగు రమ్మలక్కలూ మాటాడుతుంటే చెంపకు చేతితో చోద్యాలుమాటాడే చిన్నమ్మాయి, నాపసాని చిన్నమ్మాయి, చిన్నదా పెద్దదా?
నలుగు రమ్మలక్కల కొప్పుల్లో పూలనన్నీ లాగి తన కొప్పులోనూ తల్లి కొప్పులోనూ ముడిచే చిన్నమ్మాయిని చూస్తే గొడ్రాలు కూడా నవ్వుతుంది!
బొమ్మల పెండ్లిలో లక్కబిందెల మధ్య తానొక ఇల్లాలుగా ఊహించి మరోపిల్లను భర్తగా కట్టుకుని తొడలపై కొయ్య బొమ్మను చిచ్చికొడుతూ చచ్చిపోయిందని ఉత్తుత్తరాగాలు తీసే చిన్నమ్మాయిని వెనకనుంచి చురుగ్గా చరిచే తల్లికి అందులో రహస్యం తెలియదా? తెలిసినా - ఏమో! తల్లి చరచటములోనూ అర్థముంది!
చందమామలావే జాబిల్లియేవే అని చంకలో పాపాయిని గిలికింత లాడించే చిన్నమ్మాయి నవ్వులకు చంద్రుడే కొండలను దాటుతూ గిలికింతలాడుతాడు!
తాతయ్య దేవతార్చన చేస్తే బుట్టనిండా పూలు తానే ఇస్తుంది. మధ్యాహ్నం తానూ దేవతార్చనచేస్తూ గంటవాయిస్తే లబలబలాడుతూ దేముడే మైలబడ్డాడనే అరవై యేండ్ల తాతయ్య కెందు కన్నేండ్లు?
అమ్మమ్మ వళ్ళో కట్టు కథలను వింటూ ఊ ఊ లను కొడుతూ అమ్మమ్మా అమ్మ పుత్తక మునుపు నేనెక్కలున్నా! అనే కట్టుకథకు అల్లీ బిల్లీ మాటలేగా అమ్మమ్మ విప్పుడు!
అమ్మ రహస్యాలు నాన్నకు నాన్న రహస్యాలమ్మకు తెల్ల మొఖం చిన్నమ్మాయి తిక్కెక్కి చెపితే నాన్నకూ అమ్మకూ తిక్కెక్కాలనుకుందా పాపం!
అమ్మ మడి తాకితే అమ్మ యేమన లేదు. మడి కట్టుకున్న చిన్నమ్మాయిని తాకండి చూతాం!
చీరకట్టే చిన్నమ్మాయిని రెవిక తొడిగే చిన్నమ్మాయిని రొండిన చేతులతో పేరంట మాడే చిన్నమ్మాయిని చూస్తే, నిజంగానే చూస్తే, భీష్ముడుగూడా, అంబను పెండ్లి చేసుకోకుండా పరశురాముడితో యుద్ధం చేసిన బ్రహ్మచారి భీష్ముడుగూడా ఉందాం చిన్నమ్మాయి పెద్దదయ్యేదాకా అని అనుకోవాలి మరి!
దాక్కున్నది చిన్ని చిన్నమ్మాయి ఓరాత్రి దాక్కున్నది రాత్రిలో కలిసింది!
బావురు మనే ఇంట్లో ఏడుపుకైనా మితిమీరి పోరుగా!
ఐనా, చెల్లాయి పాలుదాగుతూ దిక్కులను జూస్తూ, 'బాల్యాంకవిచేష్ట' కదురూ బెండూ ఆటాడే వేళ్ళతో గాలిలో పిలుస్తే తల్లి ప్రాణాలు...... గుడ్లల్లో నీళ్లు గుడ్లల్లోనే గిర్రుమనేవి!