కవితలు విష్ణుధనువు (శిష్‌ట్లా ఉమా) విజయ మహేశ్వరము
ప్రేమయనగా
    చూచుటగాదు,
    పలుకుటగాదు,
విహ్వల చిత్తముతో
    వాపోవుటగాదు!

ప్రేమయనగా
    మంత్రముగాదు,
    తంత్రముగాదు,
ఆత్మనిర్వాణముచే
    ఆరాధించుటయే!

అనగనంగా
    ప్రేమయనంగ
    అపూర్వగాథ!
పూర్వకర్మపరిపక్వ
    మహాగూఢ గాథ!

సీతయనగా
    చెంచీతయనగ
    త్రేతాయుగపు
పరాశక్తి! ద్వాపరలక్ష్మి!
    కలిలో నాలక్ష్మి!

జన్మతో జన్మించునోయీ
    జీవేచ్ఛలన్నీ
జన్మాంతము జీవించునోయి!

జనకుని గృహమున
    నున్న సీత, నా
కలలో, వెన్నెలజర్తారు భూమిపై
    నడువగా కాలి
గొలుసుల విలాస
    రాసకళ లీలలు
నన్ను నిలువున చెంగుటుయ్యాలల
    ఊచి మేల్కొల్పు!

ధరణిని వహించి
    మందగమనయౌ
జగశ్శక్తి, శ్రీశక్తి! సీతను
    చూచి సహించలేను!

ఎంత భారమో
    కనుమూయక మోయు
క్షేత్రవతి, సీత స్వేదవనము
    వైకుంఠము దహించు!

చెమట బిందువుల
    చెదిరించి రాల్చు
పయ్యట వీవగా రాలు ముత్యాల
    తలంబ్రాలెన్నడో!

ఎన్నడో పడతి
    కీనీడ వెనుక
వెనుకగా, వెనుకగా, వెనుకగా వెన్నాడి
    కవ్వించి, నవ్వించి

సీతా! మైథిలీ!
    వైదేహీయని
పేర్లతోకూర్చి కౌగిటజేర్చి వైకుంఠమును
    భూమికి దెచ్చుటెపుడొ!

చెమటలన్‌ చిమ్ముచు
    ముత్యాలబిందు
వుల ఒడలు, భారమున కృంగిన
    ఒడలు, నడువగా, నా
గుండె దడదడ యని
    జగద్భారమును
ధరించు ధరణిజయే తొట్రుపడిన
    జగతి యేమౌనంచు
మూడుకోట్ల కండ్లు గలవాడనై, ముజ్జగముల
    వీక్షించుచూ
    ఆత్రుతార్తి
    హృదయుడనై
        క్రుంగుచుంటి!
AndhraBharati AMdhra bhArati - kavitalu - viShNudhanuvu - (SiSh.hTlA umA) vijaya mahESvaramu Shishtla Umamaheswara Rao - Sishtla Umamaheswara Rao - kavitalu kavitvaM geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - telugu kavita - tenugu andhra ( telugu andhra andhrabharati telugu literature )