కవితలు విష్ణుధనువు (శిష్‌ట్లా ఉమా) విజయ మహేశ్వరము

పీఠిక

ఆధునిక కవిత్వం అనేక ముఖాల ప్రవహిస్తున్నది. కొంతమంది కవులు అప్రయత్నంగా నిరంకుశులై, నిజేచ్ఛానుసారంగా నడుస్తున్నారు. సంప్రదాయానికి సంబంధించినంత వరకూ దేనికైనా ఆదరము. మామూలు మార్గం మంచిగా కనబడినట్టు కొత్త మార్గం గోచరించదు. రంజన కోసం రాత్రింబగళ్ళు కష్టపడే కవులవలె కాకుండా నవీనులకు ఆదరం కావలె అనే అభిలాష కూడా లేనే లేదు. నిజాశయం వ్యక్తం చేసే కొద్దిమంది కవికుమారుల కృషి సఫలమయిందా లేదా అని చూస్తూ ఉంటే, కొంతవరకు ఫలవంతమయిందని తోస్తున్నది. గతానుగతికంగా కవితావాహినిని కదలనివ్వక పెడతోవల తొక్కినవారి వల్లనే కావ్యక్షేత్రాలు కళకళలాడుతున్నవి!

ఊరందరిదీ ఒక తోవ, ఉమామహేశ్వరానిది ఒక తోవ! నాకు తెలిసినంతలో అతి నవీన మార్గంలో మొదట నడచినవాడు ఇతనే. రమారమి ఏడు సంవత్సరాల క్రిందట ఇతని రచనలు చూచి చకితుణ్ణి అయినాను. కావ్య వస్తుసంగతి విడిచి కావ్య శరీరం సంగతి ఆలోచిస్తే ఈ ఒంటి తీరే వేరు. తరువాత కొన్నాళ్ళకు పూడిపెద్ది వెంకట రమణయ్య, శ్రీశ్రీ, నారాయణబాబు, పురిపండా అప్పలస్వామి, రుక్మిణీనాథ శాస్త్రి, కొడాలి ఆంజనేయులు మొదలయిన కవుల రచనలు బయలుదేరినవి. రమణయ్య Inter Rhyming కోసం యత్నించినట్టు కనబడుతుంది. శ్రీశ్రీ, నారాయణబాబూ Pattern verse పద్ధతిని వెళ్ళారు. కొంతమంది Verse libre వ్రాసారు. ఎలాగయినా వీటిలో ఎక్కువ భాగం Formalగా వుంటుంది. ఈ కవులకు సంగీతంలో అట్టె ప్రవేశం వున్నట్టు తోచదు. కొంత Ear for melody వుండటంచేత అల్లిక బాగానే సాగింది. 'ఉమా', మన సంగీతమూ తెల్లవారి సంగీతమూ తెలిసినవాడు కావటంచేత కొంత విపరీత మార్గంలో విహరించినాడు. రచనలో formal beauty ఇతనికి ఇష్టం కాదు. ఎంతసేపటికీ ఇతను వక్రగతులలో, ఊపులో, లయలో లాస్యం చేస్తాడు. ఆంధ్రభాషలో ప్రథమం నుంచీ పద్యము బందోబస్తుగా వస్తూన్నది. వెనకటి కవులు కావ్యశరీరం మీదనే కస్రత్‌ ఎక్కువ చేసినట్టు కనబడుతుంది. ఛందో విషయాలు కాని యతి ప్రాసలు తెచ్చిపెట్టారు. యతి ఒక పక్షాన తెనుగు భాషకు అనుగుణం అనవచ్చు; ప్రాసమాత్రం పరాయివాళ్ళదె. అక్షరరమ్యత అంటూ విరామస్థానంలో తరుచుగా విరుపు లేకుండా చేసి సదృశాక్షరాన్ని సంఘటించారు. అక్కిరాజు ఉమాకాంతం, అస్మదాదులం వీటిని శబ్దాలంకార విషయంగా ఎంచుతున్నాము. ఇంచుమించు వెయ్యి సంవత్సరాల నుంచీ జాతి చెవికి పట్టిపోయిన ఈ అభ్యాసం అసహజం కానట్టె అందరూ అనుకుంటున్నారు. కసరత్‌ చేసిన కాయంవలె పద్యం గట్టిపడిపోయింది. చిట్టెము కట్టి చెవులకు సిసలుగా కనపడినా కోమల కర్ణాలకు కొంత శ్రమ కలిగిస్తుంది. నిపుణులయిన కవులు సమవృత్తాలలో దాట్లు వేసి, విరుపులు తిప్పి విసుగు తగ్గించినా వాటి నైజం ఎక్కడికి పోతుంది? అందుకనే ఆధునిక కవులు సమవృత్తాలు మానివేసి దేశీయచ్ఛందస్సులు స్వీకరిస్తున్నారు. వీటిలోకూడా చాలావరకు సమత వుండటంచేత మరికొంతమంది ఇవికూడా మానేసి గేయగుణం ప్రధానంగా వుండే ప్రణాళిక అవలంబిస్తున్నారు. సమవృత్తాలలో స్తంభీభూతమై వుండే మాధుర్యం వీళ్ళు గ్రహించలేక కాదు. దేశికి మార్గానికి తేడా వుంది. దేశి తెలుగు హృదయాని తెలియపరుస్తుంది. ఈ ధోరణి గమనించి కవిత్వం చెపితే హృదయంగమంగా వుంటుంది. ప్రౌఢ కవుల పద్యసరళిలో కన్న దీంట్లో సారళ్యము మెండు. అతి - ఆధునిక కవులు దీన్ని గమనించారు.

నేటి కవులు సంస్కృతాంధ్రాలలో సాహిత్యమే కాకుండా తెల్ల జాతుల సాహిత్యాలు కూడా చవిచూస్తున్నారు. మనకు వచ్చినట్టే 1911 లో ఇంగ్లాండులో కూడా కవిత్వంలో కొత్త దృష్టి ఏర్పడ్డది. అదేం చిత్రమో గాని వారికీ మనకూ సమానంగా కవితాస్రవంతిలో గమన వైచిత్ర్యం కనపడుతుంది. 1914, 22, 29, 33 సంవత్సరాలల్లో అక్కడా ఇక్కడా ఒక మోస్తరు ప్రయత్నాలే జరిగినవి. దాని వివరణ అభియుక్తులకు విడిచిపెడుతున్నాను. తెలిసో తెలియకో, ప్రయత్నించో అప్రయత్నంగానో మన కవులూ ఆ మార్గాలు తొక్కారు. భావతరంగాలు ప్రదేశ భేదం లేకుండా ప్రపంచమంతా ప్రసరిస్తవి కాబోలు. Ezra Pound, T.S.Elliot, Sitwells, Stein మొదలయినవారి మతం మనవాళ్ళు కూడా పుచ్చుకున్నారు.

కర్ణాటక ఫణుతులకన్న ఈరోజుల్లో ఎక్కువమందికి హిందూస్తాని బాణి హృద్యంగా వుంటున్నది. వీటిలో Harmony ప్రధాన మయిన ఇంగ్లీషు గానగతులు కూడా మహేశ్వరం సంసృష్టి చేశాడు. అస్పృశ్యతాపరులకు ఆనందహేతువు కాకపోయినా సామాన్యులకు ఇది చమత్కారప్రదంగానే వుంటుంది. వంగ భాషలో రవీంద్రుడు కొంతవరకు ఇలా చేసినాడు.

"విష్ణుధనువు"లో ఉన్న గేయాలు పాడటం ఎలాగని బాధ కలుగుతుంది. పాడటంకంటె ఒక విధమయిన ఊపుతో ఉచ్చరిస్తే శ్రవణసౌఖ్యం కలుగుతుంది. మనకు వచనాలు, పదాలు, చూర్ణికలు, దండకాలు - ఇత్యాదులు వుండనే వున్నవి. ఈ కవిని ప్రశ్నిస్తే వైకల్పిక సమాధానం ఇస్తాడు.

కొంతకాలంనుంచీ మనభాషలో గ్రాంథిక వ్యావహారిక వివాదం ఏర్పడ్డది. అస్మదాదుల వ్యావహారికమతం. 'ఉమ' ఉభయపక్షాలలో వాడూ కానట్టు కనిపిస్తుంది. భాష విషయమై ఒకసారి అటు, ఒకసారి ఇటు, ఇంకోసారి ఇటూ అటూ, మరోసారి కూటు - ఇలా వుంటుంది. సమాసఘటనలో స్వాతంత్ర్యం ఇంతా అంతా కాదు. శబ్దరూపాలు చాలవరకు సన్యాసం పుచ్చుకుంటూ వుంటవి. రూపం చెడిపోయిందంటె, ఆకారం కొంత వుందికదా అంటాడు. అర్థం తెలుస్తున్నది కదా అని అంగీకరించ బుద్ధి పుడుతుంది. తరుచుగా శబ్దానికీ, శబ్దగ్రామానికీ నేయర్థమో లక్షణార్థమో ప్రధానం అవుతూ వుంటుంది. ఒక్కొక్కప్పుడు Stanzaలో విడివిడి మాటల కన్న తాత్పర్యార్థమే తాకుతుంది. కవిభావం కొంత క్లిష్టంగానే వుంటుంది.

వాచః కాఠిన్య మాయాంతి భంగశ్లేషవిశేషతః
నో ద్వేగః తత్ర కర్తవ్యః
అన్నాడు పూర్వం త్రివిక్రమభట్టు. నవీనుడికీ మనం న్యాయం కలిగించాలి. కవిహృదయం గ్రహించ తలుచుకున్నవారు శ్రమ లక్ష్యం చెయ్యరు. ఇతని భాషలో వైపరీత్యాలు వున్నా విచిత్రమయిన ఓజోగుణం వున్నది. కొన్నికొన్ని Stanzasలోనూ, కల్పించిన Patternsలోనూ, Songsలోనూ, Point Counter-pointలూ, Syncopation పొడకట్టుతూ వుంటవి. విసుగుపోయి వీటివల్ల వింతశోభ వస్తుంది.

ఈ కవి అనూచాన సంపద కల ఉత్తమ వైదిక కుటుంబంలో పుట్టాడు. పురాణగాథలు చాలా చదివాడు. folk-lore, folk songs మీద పెరిగాడు. దివ్యజ్ఞాన సమాజ తీర్థయాత్రలు చేశాడు. ఒకానొక యతివద్ద కొంత శుశ్రూష చేశాడు. జ్యోతిషంలో ప్రవేశం వుంది. ఆధ్యాత్మ రామాయణ కీర్తనలంటే అత్యంత ప్రీతి. వాగ్గేయ కారకుల కృతులు వల్లె వేశాడు. Rhythm అనేది ఇతనికి అభిమాన పదం. కాశీ, ప్రయాగ సకలకళాపరిషత్‌ పుస్తక భాండాగారాలలో బాగా దానా వేసుకున్నాడు. వయస్సు ఎక్కువ లేకపోయినా విచిత్రమయిన అనుభవాలు పొందాడు. కొన్ని సందర్భాలలో గుండె బిగుతు కలవాడు - తరచుగా గుండె జావ! ఒకప్పుడు ఇతనికి తర్కదృష్టి వుంటుంది. మరొకప్పుడు తన కేది తోస్తే అదే. ఇటువంటి వ్యక్తికి ఎటువంటి వ్యుత్పన్నత వుంటుందో ఈ కావ్య సముచ్చయంలో కనబడుతుంది.

ఇందులో వస్తువు ప్రేమ. ఈ రోజుల్లో కవిత్వం ఎక్కువ భాగం ఆత్మాశ్రయం. అంత మాత్రాన కవిచేసిన పనులు పొందిన అనుభవాలూ యథాతథంగా వర్ణించినాడని ఎంచకూడదు. కావ్య ప్రపంచం వేరు, లౌకిక ప్రపంచం వేరు.

ప్రేమ అనగా
మంత్రము కాదు
తంత్రము కాదు
ఆత్మనిర్వాణముచే
ఆరాధించుటయే!
అని కవి కథాపీఠంలో పలికినాడు. ప్రేమ్‌ నగర్‌ కీ రాహ్‌ కఠిన్‌ హై। అన్నాడు పూర్వకవి. కాముకులకూ భక్తులకూ బుద్ధి పరిపరివిధాల పోతుంది. ఒకప్పుడు కామి కొండెక్కి కూచుంటాడు, మరొకప్పుడు అఖాతం అడుగున పడివుంటాడు. సముద్రంలో వలెనే కామి హృదయంలో కల్లోలం బయలుదేరుతూ వుంటుంది. ఇందులో ప్రేమ ఉద్భ్రాంత ప్రేమ పాలపొంగువలె గాని ఏటివెల్లువవలె గాని చెలరేగే ప్రేమ వ్యావహారిక దృష్టినీ సంఘ నియమాలనూ సబబులనూ జాంతా నహి. చేపకువలె ఉష్ణరక్తం లేనివారికి ఉగ్వేగం ఎక్కడనుంచి వస్తుంది? కామి ఒకప్పుడు మిట్టమధ్యాహ్నవేళ మానసికంగా మరుభూమిలో వుంటాడు; కాస్సేపటికి పండు వెన్నెలలో పచారులు చేస్తాడు. చేసినా, త్రివిధ మాలిన్యాలూ తొలిగిపోయి దేదీప్యమాన వ్యక్తి అవుతాడు. అప్పుడే ఆత్మనిర్వాణం!

కొంత మందికి నిజంగా ప్రియురాలు వుంటుంది. మరికొంత మందికి మానసపుత్రికే. ఇందులో నాయికానాయకులు ఎటువంటివారో తెలియదు. ఈ కవికి సీతారాముల పేర్లూ లీలలూ చిత్తశాంతి ఇస్తవేమో. అయితే "విష్ణుధనువు"లో వైదేహి, జనకుడు, లక్ష్మణుడు, శివధనుస్సు - ఇత్యాది పదాలు ఉన్నప్పటికీ రామాయణగాథలకూ వీటికీ అట్టే సంబంధం లేదు.

మనవాళ్ళు అవతారవాదం అంగీకరిస్తారు. లక్ష్మి, సీత, రుక్మిణి, రాధ - అంతా ఒకటేనంటారు. ఈ కవికూడా -

సీత యనగా
చెంచీత యనగా
త్రేతాయుగపు
పరాశక్తి! ద్వాపరలక్ష్మి!
కలిలో నాలక్ష్మి!
అన్నాడు. కొన్ని చోట్ల నిశీధ సౌందర్య మూర్తి అన్నాడు. పరాశక్తే యుగయుగాల్లో ప్రత్యేకరూపం తాల్చేటప్పుడు కలికాలంలో కలికి ఇష్టం వచ్చినరూపం ధరించిందంటే తప్పులేదు. ఉద్దేశం ఉదాత్తమయితే సరి.

రామాయణంలో శివధనుర్భంగానంతరం కాని సీత దొరికింది కాదట. ఈ కవి కల్పనలో విష్ణుధనువు విరిగిన తరువాతనే శివకార్ముకం భగ్నమయింది. విష్ణుధనువు వెన్నెముకను అంటివుంటుందన్నాడు. మామూలుగా వెన్నెముక విరిగితే మారణమే! అదే అహంకారమయితే భంగం కావడంలో పస లేదా! అహం వదిలితేనే గాని అనురాగంలో గాని, ఆముష్మిక విషయంలో కాని ఫలితం రాదు. తత్త్వవేత్తలు ఇది అంగీకరించారు.

"విష్ణుధనువు" ప్రథమంలో పచ్చివెలక్కాయ గొంతున పడ్డట్టుంటుంది. ఓపిక పట్టి చదివితే ఉమా విజయ మహేశ్వరుని కావ్యహృదయం కనుక్కోవచ్చు.

ప్రతిభావంతుడికి వుండే లక్షణాలు ఇతనిలో కనబడుతున్నవి. ఇతని భావన బహుముఖాల పరుగెత్తి ఎక్కడెక్కడి విషయాలో ఏర్చి కూర్చుతుంది. ఇతని పంక్తులలో ఎన్ని ఉపమానాలు, ఎన్ని ఉత్ప్రేక్షలు, ఎన్ని రూపకాలు కిటకిటలాడుతున్నవి! కావ్యం మొత్తం మీద తాత్పర్యార్థం మనస్సుకు తాకుతుంది. ఒక విధంగా ఇది వింత సృష్టే. ఉపజ్ఞ, ఉద్రేకము, అభినవత్వమూ అభిలషించేవారికి ఈ కావ్య సముచ్చయము వల్ల కడుపు నిండితీరాలి.

తల్లావజ్ఝల శివశంకరశాస్త్రి
సాహితీసమితి, తెనాలి
జనవరి 26, 1938.

AndhraBharati AMdhra bhArati - kavitalu - viShNudhanuvu - (SiSh.hTlA umA) vijaya mahESvaramu Shishtla Umamaheswara Rao - Sishtla Umamaheswara Rao - kavitalu kavitvaM geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - telugu kavita - tenugu andhra ( telugu andhra andhrabharati telugu literature )