కవితలు విష్ణుధనువు (శిష్‌ట్లా ఉమా) విజయ మహేశ్వరము
పల్లవి

అలివేలుమంగవైతే నాబాల, అందాల దేవివైతే
రావేల రావేల రావేలా!

అనుపల్లవి

ఆనందభైరవీవై నాబాల, అర్ధనారీశ్వరముగా!
రావేల రావేల రావేలా!

నివృత్తిపల్లవి

అనలముల పద్మాక్షివైతే ప్రణయముల పాలిండ్లతో
ఉయ్యాలఊపు లేవే, నాబాలా, జంపాల జోలలేవే!

ప్రవృత్తిపల్లవి

సౌందర్య నిశీధ మూర్తీ, నాజన్మయజ్ఞముల సోమరసధారా!
రావేల రావేలా! ఉజ్జ్వలన! ఆనందజ్యోత్స్నవై!

చరణము

విద్యున్మాలా జ్వాలా లావణ్యవై వజ్ర జ్వాలా వన్నె విరివై
స్వప్న సుధా ధారా పారావార మధనమందు
ప్రణయ కాలకూట విషము త్రాగే
నీలగళాధారికి, ఒసే!
గంధము పూయ రావే! ఒసే!
తిలకము తీర్చ రావే! ఒసే!
హారతి నివ్వ రావే!

చరణము

ప్రణయ గంధమాని విమానములో, ప్రేమవాయువుపై
తేలిపోదామా! కైలాసమున కై
వైభోగములతో
అల్లిబిల్లులతో
అల్ల నల్లన తేలి,
పొన్నమావి మీద పొద్దు పోదామా!

నీలోని జ్యోతియే నాలోని జ్యోతియై
    నా మనసులో బాల!
    నా యెడదలో
    దగ్ధమౌనే, నా మనసులో బాల!
    దహనమౌనే నాయెడదలో!
నాలోని జ్వాలయే నీలోన పొగబారి
    నీకళ్ళ కాటుక యెన్నడౌనో!
కాటుకకళ్ళు కరిగి కాల్వలై
    మానససరోవర మేలా గౌనో!
సరోవర తీరాన సాయంకాలాన
    సంధ్యావందనమందే,
'కాయేన వాచా మనసేంద్రియైర్వా'
    నీమీదనే ధ్యానమున్నదే!
అర్ఘ్యపానీయంలో ఆనందమూర్తి!
    నీముఖబింబమే గాంతునే
జ్యోతి పెరిగినా జ్వాల ఆరినా
    చీకటిలో చుక్కల్లె చూతునే!
నాలోని జ్వాలయే నీలోని జ్యోతియై
    నాలోని నేనే నీలోని నీవై
    నామనసులో బాల!
    నీమనసులో దగ్ధమౌనా?
    దహనమౌనా, నీమనసులో? ఇర్వురి మనసులో!

ప్రేమ లన్నిటిలోను
'స్వయం' ప్రేమ
మాయమై మనసులో
వైకుంఠ మిదే యని
వెన్నుననే విష్ణుధనువుగ నుండును!

వెన్నెముక చీల్చుచూ
భ్రమల పురికొల్పు
విష్ణుధను శ్శరములే
భావ తరంగాలు!
భావాంతమున గదా భవప్రభాతము!

మేనియం దణగి యణగి
మన సంత 'వయమ్‌'
అనే అహము చేయు
విష్ణు ధనువు వంచి
చేరవలె సీతదరికి! శివధనువు ఫెళ్ళుమనును!

జన్మతో జన్మించు నోయీ
    జన్మనక్షత్రము!
జన్మాంతము జాతకము జరగు నోయి!
AndhraBharati AMdhra bhArati - kavitalu - viShNudhanuvu - (SiSh.hTlA umA) vijaya mahESvaramu Shishtla Umamaheswara Rao - Sishtla Umamaheswara Rao - kavitalu kavitvaM geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - telugu kavita - tenugu andhra ( telugu andhra andhrabharati telugu literature )