కవితలు విష్ణుధనువు (శిష్‌ట్లా ఉమా) విజయ మహేశ్వరము

విష్ణుధనువు - సమీక్ష : విశ్వనాథ సత్యనారాయణ

ఒకసారి ఒక పండితుడన్నాడుగదా! వేదశాస్త్రాలు దేశంలో ఎందుకు ప్రవేశించటం లేదు అంటే దేశంలో పుట్టే మహా మేధావులందరు ఉద్యోగాలు వస్తవని ధనవాంఛచేత ఇంగ్లీషే చదువుతున్నారు కనక. వచ్చే గొప్పతనం ఇంగ్లీషుకే వస్తుంది కాని సంస్కృతాంధ్రాదులకు రావటంలేదు అని. అల్లాగే దేశంలో గొప్ప కవితాశక్తి కలవాళ్ళంతా తెలుగు దేశంలో క్రొత్తమార్గాలే పడుతున్నారంటే, వాళ్లందరూ ఇంగ్లీషు చదివారుకనుక. ఇంగ్లీషు భాష చదివి ఉద్యోగాలు చేయటంలో దేశానికి నష్టం ఉందో లేదో మాకక్కర్లేదు కాని ఇంగ్లీషు చదివి తెలుగు కవిత్వం వ్రాస్తేమాత్రం తెలుగుభాషకు నష్టం ఉంది. ఎందుచేతనంటే కవి తన భావాన్ని చెప్పటంలో క్రొత్తమార్గాన చెపుతాడు. ఆమార్గం అచ్చంగా క్రొత్తదని మాత్రమే నిరాదరించేవారు కొందరుండ వచ్చును. కాని దానియందు శబ్దం అర్థసంప్రదాయాది దోషము లుండటంచేత దానియందు క్రొత్తదనంకన్న దోషభూయస్త్వం ఎక్కువ ఉండటం మూలంగా రసజ్ఞులైన వాళ్ళుకూడా కొందరు కొంతకాకపోతే కొంత మనస్సు కష్టపడతారు. ఇందులో క్రొత్త కవులలో శబ్దస్వరూపం తెలియక పోవటం ఎక్కువగా ఉంటుంది. కొందరొక ప్రశ్న వేయవచ్చు. సరే! శబ్దస్వరూపం తెలిసిందీ అనుకున్నవారికి మాత్రం పూర్తిగా తెలిసిందా? వారూ తప్పులు చేస్తారు అని. నిజమే! వాళ్ళు చేసే తప్పులకి వీళ్ళు చేసే తప్పులకి చాలాభేదం ఉంటుంది. వాళ్ళుచేసే తప్పులు శబ్దము యొక్క అర్థాన్నే భంజిస్తవి. రెండవది. క్రొత్త కవిత్వంలో అర్థదోషాలు ఎక్కువగా ఉంటవి. ప్రాతమార్గమున పోయెడివారి కవిత్వములో నిరర్థకత్వం వుండవచ్చు. కాని క్రొత్తకవుల వాక్యాలలో అపార్థం వుంటోంది. మూడవది. సంప్రదాయము భిన్నమైపోవుట, పూర్వ సంప్రదాయము తెలియకపోవుట, తెలియకుండ తెలిసినట్లు వ్రాయుట, తెలిసియో తెలియకయో దానిని నిందించుత, పర సంప్రదాయములను చొప్పించుట. ఇవి సంప్రదాయగతమైన దోషాలు. సంప్రదాయమంటే మత సాంఘిక భాషాది సర్వ విషయాల్లోను.

ఇన్ని దోషాలున్నవి అని చెబితే ఈ దోషాలు అన్నీ ఒక కవిలో మూటకట్టుకొని పడివున్నవి అనికాదు. భిన్నకవులలో భిన్నభిన్న స్థలాలలో ఒక్కొక్కచోట కొంచెమెక్కువగా వున్నవని అర్థము. మేము గ్రాంథిక వాదులము అని అనుకునే వాళ్ళల్లో కూడా ఇందులోకొన్ని దోషాలు కుప్పతెప్పలుగా వున్నవి. కాని ఆదోషాలని అలంకారశాస్త్రం నిర్ణయించి చెపుతుంది. క్రొత్తకవులలో వున్న కొన్ని దోషాలు వ్యాకరణశాస్త్రమే చెబుతుంది. వ్యాకరణ శాస్త్రాన్ని కాదంటే తెలుగుదేశంలో శబ్దాన్ని ప్రయోగించే పద్ధతి తప్పని చెపుతుంది. వాడుకలో సమాసాలు కొద్దిగావేస్తాం. క్రొత్త కవులు వాడుకను దాటివేస్తారు. అప్పుడు వ్యాకరణం రాకతప్పదు. కాదనటానికి వీలులేదు. కనుక శబ్దమునందు అర్థమునందు దోషాలు వస్తున్నవి.

ఈదోషాలన్నీ వదలి పెడితే మరి, క్రొత్త కవులల్లో విష్ణుధనువు కర్త గొప్పకవి. ఈయనకు భాషవచ్చు. ఎట్లాగో ఒక అట్లాగ తన భావమును చెపుతాడు. కొన్నిచోట్ల ఆయన ఒక భావము అనుకుంటే చదివేవాడు మరి ఇంకొకటి అనుకోవచ్చు. ఇట్లా అనుకోటం వ్యంగ్యం కాదు. వ్యంగ్యం అయితే కావలసినదేమున్నది. అపార్థం గలిగిస్తాడు. ఇది క్రొత్త కవులందరూ చేస్తున్నారు. కాని ఇట్టి అపార్థాలు కాకుండా చాలా భాగాలల్లో కావ్యం జాగ్రత్తగా చదివితే అర్థమవుతుంది.

ఈకవికి అనంతమైన కవితాశక్తి వుంది.

"జనకుని గృహమున
నున్న సీత, నా
కలలో, వెన్నెలజర్తారు భూమిపై
నడువగా కాలి
గొలుసుల విలాస
రాసకళ లీలలు
నన్ను నిలువున చెంగుటుయ్యాలల
ఊచి మేల్కొల్పు!"

"చాయ చేమంతివిరుల వెదజల్లు లల్లుకొనురీతి
చంద్రికలు రాలినవి పచ్చికలనేలపై తుమ్మిపూవులపై"

" ... సేదకైవాలు నాశరీరము
మధ్యాహ్నపు వేడినిట్టూర్పుతో
రాట్నమై ఊహాపోహలను వడుకుతుంది!"

"విరిగిన పాలతరకల తీరు విచ్చుకొను చంద్రికలు"

" ... నిగనిగలాడు కురులు కురుల
నడుమ గల ఆ ముఖము గ్రహణాభ్యంగన
మాడిన జాబిల్లి బోలు! "

"ఇటు వెన్నెల అటు వెన్నెల
నడి శిరసుకు శ్రీవెన్నెల
ఇటువెన్నెల అటు వెన్నెల
ఈశ్వరునికి తల వెన్నెల"

ఈ కావ్యమున ఇట్టి మనోహర కవితాశక్తిగల వాక్యము లనేకములున్నవి. కవి గొప్ప ప్రతిభావంతుఁడు. మనస్సంచారములను ఇట్లు వర్ణించెను.

"దాగుడుమూత పడ వీ మనస్సంచారములు!
కత్తెర బెట్టినన్‌ తెగవు! ఎక్కడ కేగుచుంటి రని
పోవునపు డడిగిన నవి పకపక నవ్వు! అక్కడ
నేమి చేసితి రన సిగ్గుచే నోరుమోమున లోనికి
జొత్తురు వెంటనే యుప్పెన వచ్చినట్లు మహ
ర్నవమి పిల్లలవలె అల్లరి చేతురు"

మనస్సులో జరుగు కొన్ని వికారములు ఉన్మేషములు ఇంత చక్కగా ఆరోపించి చెప్పుట మిక్కిలి కష్టమైన పని. కాని ఈశక్తి క్రొత్తకవుల కెందఱకో కలదు. ఈ కవి పూర్వకవులను చదివెనో లేదో చెప్పలేము. కాని వారి యందు గాఢాభిమానము కలవాడు.

"మంచు బిందువుల ముసుగులో మల్లెపూవులవలె;
చిరులేత దుకూలముల జలతారు విరులవలె;
జలజలారాలిన వేవేల చేమంతి రెబ్బలవలే;

రావేయని వాపోవు గజప్రాణోత్సాహియై వేగ,
శ్రీపరిచేలాంచలము విడక, పరుగెత్తు వారివెనుక
శంఖమూ, చక్రమూ పరివారమూ గలసి శ్రీహరుల
వెన్నాడివచ్చు ఆపాలకడలి కెరటాల తరకలల్లే

పూర్ణిమాచంద్రికల తరంగాలుప్పొంగిపారగా,
రావేయని పిలువగనే పర్వెత్తివచ్చు నిన్జూచి ఉప్పొంగి
ఉయ్యాల వెన్నెల్లో నామనసు ఉబలాటలాడింది"

ఇది ఎంతని చక్కని కవిత్వమో చూడుడు. ఇందు పోతన్నగారి యందలి ప్రేమ యాయన శబ్దములు తెచ్చుకొనుటలో వున్నది. కాని ఆ శబ్దముల కర్థము తెలియక పోవుట కలదు. ప్రాణోవనోత్సాహి కాని ప్రాణోత్సాహి కాదు. ప్రాణోత్సాహి అనగా రక్షింపబోవువాడు అని కాక చంపబోవువాడు అని యర్థము పుట్టును. శ్రీకుచోపరి చేలాంచలములో "కుచో" పోయి "పరిచేలాంచలము" మిగిలినది. నేటి నాటకములలో పద్యము లిట్లే చదువుదురు.

పోతన్నగారి యెడల ఈయనకుగల భక్తి మఱి రెండుమూఁడుచోట్లకూడఁ గలదు. ఆయన "మందార మకరంద" "ఒక సూర్యుండు సమస్తజీవులకు" ఈ రెండును ఈకవి స్వీకరించి తనపంక్తులలో కలుపుకొన్నాడు.

వృత్తములు కావని క్రొత్తగా మాత్రలు బిగించి గురజాడ అప్పారావు పంతులుగారు ముత్యాలసరము మొదలువేసిరి. తరువాత చాలమంది కవులు లయ ననుసరించి మాత్రాప్రధానముగ కొద్దిభేదములతో కొన్ని రచనలు చేసిరి. ఈయన కవిత్వములో మాత్రాప్రస్తావనలేదు. పాదనియమము లేదు. క్రొత్తపాదము మొదలుపెట్టినపుడు సర్వత్ర విశేషార్థ ద్యోతకముగా మొదలు పెట్టబడిందని చెప్పుటకు వీలులేదు. కాని ప్రతి గీతంలోను ఒక ఊపు వుంటుంది. ఆవూపు మధ్యమధ్య విరిగిపోతూ వుంటుంది. కొన్నిచోట్ల పూర్వకవుల వృత్తములను తలపించే భాగాలు కూడ వుంటవి. చూడండి.

"లలనా వెన్నెలవేల తీయనిది" ఇది మత్తేభము యొక్క మొదలు. "ఝంఝామారుత ఝర్ఝరీధ్వనులు" ఇది శార్దూలముయొక్క మొదలు. "ఆ బ్రహ్మమున్నాదినే ఏలాగ వ్రాయగలేదు నిన్నుదుటిపై" ఇది శార్దూలము. ఒక పాదములో యతి దగ్గరనుండి రెండవపాదములో యతివరకు. "ఏ మహాటవిజొచ్చెనో నామనస్సు" ఇది తేటగీతి పాదము. ఈయన లక్షణమెరుగునో ఎరుగడో ఎరిగి తిరస్కరించెనో? ఎరుగక వీనిని సంస్కారముచేత పొదుగుకొన్నాడో!

ఈకవియొక్క భావనా పటిమ మిక్కిలి గొప్పది. ఒకచోట ఆకాశము కొప్పుగా వెన్నెలలు జాజిపువ్వులుగా రాముడు సీతాదేవిని ప్రకృతిలో చూచినట్లు వర్ణించెను. కవికి ముఖ్యముగా నుండవలసిన పరిశీలనాశక్తి ఈయనవద్ద నున్నది. "అల్లికలు దగ్గరిల్లి దగ్గరిల్లి కొప్పుకుదిరిన పిదప." ఇది కొప్పుముడుచుట యొక్క క్రియావస్థా రమణీయ పరిశీలనము. "నా రక్త నాళములో పసరెక్కి పేరుకొన్నది విపరీత వైతరణి." ఇట్టి యనేక స్థలముల యందితఁడు దివ్యమైన కవి. ఇదికాక ఇతనియందు ఉక్తి వైచిత్ర్యం కూడా వుంది. "నౌళించెందె నామనసు" (మెలికలు తిరుగుచున్నదని యర్థము.) "తెరచాపగ పడగను విప్పు శేషుడు" మొదలైన మనోహరోక్తులు పలుకఁగలడు. అన్నిటికన్న ఈయన మేధావిశేషము రాముని చిత్తము రావణునివలె దశముఖాల చూస్తుందనుటలో నున్నది. సీత తన చూపులనే బాణాలతో ఆ దశముఖాలని త్రుంచుతుందట! అవి మరల మరల మొలుచునట! సీత లక్ష్మీదేవి కాన వైకుంఠములో తనకున్న మూలబలముతో రాముని గర్వస్థమైన కుండలినీ నాడిపై బాణంవేస్తే ఆ మనస్సనే రావణుడు చచ్చిపోతాడట! ఇది వట్టి కవితాశక్తికాదు. వట్టి భావనాశక్తియు కాదు. దీనియందు మహార్థములు నిక్షేపింపఁబడి వున్నవి. అది వ్యాసము చివర వ్రాస్తాను.

కవిత్వానికి లయ ప్రధానంగా వుండాలి. లేకపోతే వచనమవుతుంది. లయచేత, ఆ లయ కనుసరించిన కూర్పుచేత పద్యానికి కాని పాటకి కాని ఒక కవితాత్వము పట్టుతుంది. అది భావానికనుగుణమైన ఛందస్సుకొద్దీ, సవరించకల కవిశక్తికొద్దీ. ఈ పుస్తకములో అంతా వచనమే. కాని కొన్నిచోట్ల పాట భ్రాంతి, కొన్నిచోట్ల పద్యభ్రాంతి, మఱికొన్నిచోట్ల గమనచమత్కృతి. అంతేకాని తీర్చిదిద్దిన పాతకాని పద్యము కానిలేదు. మొత్తముమీద అయిదారు గీతాలు మాత్రం పాటయొక్క పద్ధతిని రెండు మూడు మార్పులతో సవరించుకోఁగలవు. "ఆనదికి అద్దరిని ఇద్దరం కలుద్దాం", "ఇటువెన్నెల అటువెన్నెల", "నడిజాము వేళలో", "అలివేలుమంగవైతే" - ఇటువంటి వానిలోతప్ప పాట నడకకూడా సిద్ధించిన స్థలాలులేవు. ఒకచోట "పొన్నమావి మీద పొద్దుపోదామా" అని వ్రాసెను. ఇది సరిగా కొన్ని యేలపదములు జీర్ణించుకొనుటచేత వచ్చిన శక్తి. ఇది కొందఱు తప్పులనుకొనవచ్చును. ప్రొద్దు పోగొడదామా అని అర్థముకాదు. ప్రొద్దుతో అవినాభావత్వము పొంది నడచిపోదామా అని అర్థము. ఈయనకుఁగల సంస్కారమంతయు స్త్రీలపాటలు, యేలపాటలు తెలుగుదేశముల సంప్రదాయములు తెలియుటఁజేత, వానియందు మక్కువ యుండుటచేత కలిగినదేమో అనిపిస్తుంది. ఆసంస్కార బలంచేత తన మాతృభాష తెలుగు కనుక చదివి విని అనేకశబ్దాలు నేర్చాడు కనుక ఈయన కవితాశక్తి ఇల్లా బయటికి వచ్చింది.

"ఒప్పులకుప్పవై ఒయ్యారిభామవై"

"వేగూచుక్కా వెలగామొగ్గా"

"ఉత్తముని పేరేమి ఊరిపేరేమి
సత్యవనితను గన్న సాధ్విపేరేమి"

"గూటురెవికల పొంగుపీటుల మీద పోసేపూల మాదిరి"

ఇట్టివి 'యేల' పాటలనుండి, స్త్రీలపాటలనుండి సేకరించుకొన్నవి. వాని మీఁద నీయనకు మమకారము మెండు.

ఈ సంస్కారముతోపాటు తెలుగుదేశపు పండుగలు, ఇచటి యాచారములు ఈయన హృదయములో నత్తుకొన్నవి. మదనపంచమి, రథసప్తమి, నాగులచవితి, దేవీనవరాత్రులు, అన్నియు ఈయనకు కవితావస్తువులే. కవితావేశము కలిగించునవే. ఇవికాక పురాణగత సర్వకథలు ఇతనికి పోలికలు వస్తవి. నలదమయంతులు, అశ్వమేథయాత్రలు! అతని హృదయ గ్రంథము గీతారహిత భారతమువలె నీరసమయ్యెనట. సీతాప్రేమలేక రామునిజీవితము కృష్ణుడులేని అర్జునుని రథమువలె ఎక్కడకో లాగుకొని పోతోందట. సీతలేని రాముని హృదయము విష్ణువు లేని వైకుంఠమువలె నుందట.

ఈ కవికి భారతాంధ్రదేశముల సంప్రదాయములందు వైముఖ్యము లేదు. తిరస్కార మంతకు ముందే లేదు. గొప్ప ఆస్థికబుద్ధి కలవాడు. ఒక్క ఛందః పద్ధతియే క్రొత్తది. భాష యతని యిష్టము వచ్చినది. అంతకన్న అతనికిది చేతనైనది యనవచ్చును. కవితావేశము బలవంతపెట్టు. భాష చదువుటకు చిన్నతన ముపయోగించు కొనకపోవుట. దోషములున్నచో ఇవి రెండే దోషాలు. ఇతని యాంధ్రాభిమానము మచ్చుముక్క వంటిది. ఈయనకు తన యభిప్రాయములే ముఖ్యములుగాని తాను తీరుస్తూఉన్న పాత్రలో ఔచిత్యము భిన్న కాలికత్వము భిన్న దేశత్వములు ముఖ్యములుకావు. ఈయన కావ్యనాయకుడు శ్రీరామచంద్రుడు. నాయిక సీతాదేవి. వారిప్రేమ కథావస్తువు. వస్తు స్వీకరణంలో కూడా మూరెడుపోయి బారెడు క్రుంగటం లేదు. భారతీయునివలె, ఆంధ్రునివలెనే వస్తువును స్వీకరించాడు. ఈదేశాల సంప్రదాయ సంస్కారాలకు ఎదురు నడిచిందిలేదు. కాని ఆరాముడు సృష్ట్యాది మొదలు, కలిలో క్రీస్తుశకము 19 వందల ముప్పది యెనిమిది జనవరి వరకు కల భారతదేశపు దేవుళ్ళూ రాజులూ అందరూ ఆ రాముడిలో వున్నారు. అవన్నీ ఆ రాముడే. ఆ సీతే చెంచీత. ఆవిడే పరాశక్తి. ఆవిడే అలువేలుమంగ. ఆ రాముడే ఉదయనుడు, కృష్ణుడు, లక్ష్మీనరసింహమూర్తి, ప్రవరాఖ్యుడు, అభిమన్యుడు. వీరినికూడ ఆ రాముడు పోలిక తెచ్చుకొనును. ఆ రాముడే శివుడు. ఆ రాముడే తిరుపతి వేంకటేశ్వరుడు. ఆ వేంకటేశ్వరు డసలు శంకరుడు. సీత అలువేలుమంగ. ఆంధ్రదేవి. ఆంధ్రదేశములో క్రొత్తగా పుట్టుచున్న యుత్సాహము కూడను. ఇది ఈయన పరితోదృష్టి. ఇతని దేశభక్తి రామునిలోనుండి ఆంధ్రదేశమును మేల్కొమ్మనును.

"అవునవును అందాల అలివేలు మంగా
నీనయన నీరాజన ధవళ జ్వాలానల కణములే
ఆంధ్ర బీజానలములై నూతనోత్పత్తి కాగలదు."

"ఓహో సౌందర్య సామ్రాజ్య విరాడ్విశ్వేశ్వరార్ధాంగపత్నీ! నక్షత్ర
స్ఫటికముల నవనవలాడే వెలుగువై, తళుకువై, నిబిడాంధ
కారాంధ్ర దేశాకాశాన, వజ్రాయుధమువలె
ఏనాడు గన్పడెదవో దెల్పుము: త్రిపురాంతకుడనై
లేచెదను, ప్రళయకాలాభీల గర్జపర్జన్యములతో,
నిశీధ నిబిడాంధ కారాంతరాళాగ్ని నగునేను....!"

ఈ రాముడు ఆంధ్రుడు. స్వాతంత్ర్యము నుండి పతితుడైన యాంద్రుడు. స్వరాజ్యాపేక్షగల యాంధ్రుడు. ఉత్సాహియైన యాంధ్రుడు. ఇది దేశభక్తి. ఇతని దేశకాలావచ్ఛిన్నత్వం లేకపోవటం.

ఇతని ప్రేమసిద్ధాంత మొక చిత్రమైనది. ఆప్రేమ తొలుదొల్త సీతకై రాముడు విరాళిపొందుటగా మొదలుపెట్టెను. చివరకు సీతను మహాకాళిగా జూచెను. అప్పుడును ప్రేమించెను. ప్రేమయనగా "ఆత్మనిర్వాణముచే ఆరాధించుటయే." ఈ భావము నేటి కొందరాధునికుల ప్రేమ సిద్ధాంతము కాదు. కొంద రాధునిక ప్రేమసిద్ధాంతములో ప్రేమ "బ్రహ్మపదార్థ" పర్యాయవాచిగా కన్పిస్తుంది. ఇది ప్రకృతి యారాధన. రాముడు పరమ పురుషుడు. సీత ప్రకృతి. సీత ఈక్షితిని మోయుచున్నది. అష్టదిగ్గజము లామెకు సాయము చేయవలెను. లేనిచో రాముడు బాణములతో వానిని కొట్టి చంపును. ఈసీత మహాదేవి. నగ్నమూర్తి. కళాకృతి. భయంకరమూర్తి.

"నీ నిమ్న దృష్టి చిత్రకళలకు విపరీత పుష్టి!
వివస్త్రవై నీవు భుజంగాంగన వలె ఒయ్యారివై"

"శృంగార రసధారలను చినుకు నృత్యాలు జేయుచు
నీవు నవరాత్రి పండుగరోజులలో మైమరవ
నవలక్ష నక్షత్ర రాశి జీవులు గూడ నీ
నీల శరీరంపు నిగనిగల నిమజ్జనములు జేసి
కల్లు నీళ్ళం ద్రాగి కైపెక్కి
ఒళ్ళు విరగపడుచు మత్తెక్కి
దుఃఖాల దిగదుడిచి జీవించుచుందురు!"

ఆ సీతాదేవి "అనలముల కణకణల అందాలుచిందు"

ఆమె

"రక్తారుణప్రవాహ సమరకల్లోలములో ప్రజల
ప్రఫుల్ల సౌందర్యజీవితానందముగ్ధులం జేయు
అనంతముఖములుగల అందాల అనలము."

"కల్లోలమేఘాగ్నియై నడియెండలో మెరుపుతీగలపై
వసంతములాడు వివస్త్రమూర్తి."

ఇది అతని సీతసృష్టి. ప్రేమభావము. సృష్టినడకయే ఆయన ప్రేమభావముగా కనిపించుచున్నది.

ఈ కవి స్మార్తుడు. వెలనాటి. కాని ఈయన భావములు వీరశైవము, శివాద్వైతముఖముగా నున్నవి. ఈయనకు ద్వైతము మిథ్య. విశిష్టాద్వైతము మాయ. సంపూర్ణ వ్యక్తి శివుడు (The perfect man). ఈభావము అంగిలేయులనుండి వచ్చినది. శివుని నిట్లు చూచుటకూడ చిత్రమే. నిర్వాణమనగా వ్యక్త్యభావము. ఇది ఈయన సిద్ధాంతము. ద్వైత విశిష్టాద్వైతములు అద్వైతమతములోనుండి పుట్టినవి. ఆమతములో ఇమిడిఉన్నవి. ఈ భావములన్నియు సమంజసములుగానే వున్నవి.

ఈకవిలో సంగీతశాస్త్ర పరిభాషాభిలాష కూడ అక్కడక్కడ గోచరిస్తుంది. కాళీదేవి భయంకరాకారంలో ఇతనికి సౌందర్యం కనిపిస్తుంది. మఱి ఒకప్పుడు వెన్నెలలో ప్రేమ కన్పిస్తుంది. ప్రథమ దశలో ఇతని వెన్నెలకి ప్రేమకి అవినాభావ సంబంధం. వెన్నెలలో సీత కలధౌతపాత్ర పై కడియాలలో నృత్యాలు త్రొక్కిందట. వెన్నెలలో గాలి 'యేల' పదాలూదింది. ఆ 'యేలలు' "అట ఆటలనాడు దయ్యములు విశ్వమున ప్రణయములేమి? వెన్నెలలేమి యనిచేయు కరాళ హసనములా" అని ఇతని ప్రశ్న. ప్రణయము వెన్నెల ఒకటే. వెన్నెల ఆదేవి యొక్క ముగ్ధ ప్రసన్నరూపం. కాళీదేవి భయంకర నృత్యం ఆమెయొక్క ప్రౌఢ ప్రసన్నరూపం. ఇది ఇతని ప్రేమసిద్ధాంతం. ఇతనియందు మర్మకవిత్వము యొక్క లక్షణాలు చాలావున్నవి. మర్మ కవిత్వము అంటే యౌగికాధ్యాత్మిక విషయ పరామర్శ అని ఈమధ్య కొందరు పెద్దలు పలుకుతూ వచ్చారు. నేనూ ఆ అర్థాన్నే స్వీకరించాను. నౌళి, ఉడ్యాణము, కుండలినీ శక్తి మొదలైన యోగ సంబంధ పరిభాష లితడు వాడును. రాముడు తన మనస్సు రావణుని వలె దశముఖములు కలదనుచోట మహార్థమున్నదని వ్రాశాను. ఇది ఇతని ప్రేమ సిద్ధాంతముయొక్క పరమావధి. ఈ ప్రేమ యోగము కుండలినీశక్తి ప్రజ్వలింపఁజేసి ప్రకృతి కతీతుడూ, ప్రకృతిని తనలో లయింప చేసికొన్నవాడూ అవటం! దీని నే కవి ఇంకొక చోట చెబుతున్నాడు.

"నినుం జూచినదాది నిమీలిత నేత్రుడనౌ నాలో
కుండలినీయోగవిలాస ముల్లాసము జెందె!
షట్చక్రములు సక్రమములయ్యె! తెరచాపగ
పడగను విప్పు శేషుని శయ్యాతలమున నీవు"

ఇది ఇతని ప్రేమ సిద్ధాంతము. రాముడు యోగి. సీత రాముడు తన్నుతాను చూచుకొనడం ఈ ప్రేమయోగం.

ఇతనికి దయ్యాలు, దేవుళ్ళు, ఈ రెండు మాటలకు అర్థభేదం వుంది. దేవుడబద్ధం, దయ్యాలు సత్యం అని వ్రాశాడు. అంటే ఆత్మయందాత్మ గుర్తించటమే అవధి. తక్కినదంతా వట్టిలీల. ఆలీలలో అనేక భావాలు వానికి మూర్తులు. దయ్యాలు అని ఈయన భావము. సరిగా దారులేర్పడని అనేక మతసిద్ధాంతాలు ఈయనికి వున్నవి. వాని నన్నింటిని తీర్చిదిద్దటం కష్టం.

ఈయన భావములు, ఈయన సంస్కారం, ఈయన భావనాశక్తి, ఈయన కవితాశక్తి పరమోత్కృష్ట స్థితిలో వున్నవి. కాని వీని నన్నింటికి భాషాలోపము ఒకటి వున్నది. అది ప్రతియడుగున అడ్డం వస్తుంది. ఒక్కొక్కచోట మెలికలు తిరుగుతుంది. అర్థాన్ని పొసగనీయదు. ఒక భావము బయటికివస్తూ మనస్సులో పరిచితాలై వున్న అనేక శబ్దాలనీ భావాలనీ లాక్కువస్తుంది. ఒక్కొక్కప్పుడు అన్వయము లేని ఒక వరుసలో వస్తుంది. అర్థంలేని మాటల్లో వస్తుంది. వ్యాకరణానికి పట్టుకోరాని యెగుళ్లెగురుతుంది. క్రొత్తకవులలో చాలామందికీ దోషాలు వున్నవి. కొన్ని దోషాలు చూపిస్తాను. శబ్దదోషాలు. 'అత్రుతార్తి' 'వరుసగా వాయిగా' 'కేయూర వయ్యారివై' 'తందానతానుడై' 'నీ ధ్యాసునిగ చేసితివి' 'అర్ధాంగపత్ని' 'గర్జపర్జన్యములు'. ఇవి చ్యుత సంస్కారాలు. అర్థము పొసగని సమాసపు కూర్పులు చాల వున్నవి. కొన్ని వాక్యములు సంప్రదాయేతరంగా వున్నయ్యి. సీత చెమట వైకుంఠము దహిస్తుంది! ఇక్కడ అర్థం గౌణంగా పొసగించుకోవచ్చు. కొన్నింటిచోట్ల భావం అవిస్పష్టం. తెలియదు. మైథిలికి వ్యుత్పత్తి 'మేధామద విదళిత' అట! అనగా రాముడు తాను వూహించి మైథిలీమూర్తిని సృష్టించు కొన్నాడని అర్థం. ఆమె ఆత్మాంతరమున 'wit' దేశవాసిని కాన వైదేహి అందురు. ఈ 'wit' ఇంగ్లీషుమాట. ఈ వ్యుత్పత్తులు ఈ భావములు ఒకదారీ తెన్నూలేనివి.

'పురుషకారమే పరశురామమందు. నేనే రాముడ.' ఇందులో శబ్దమర్థమును అందీయదు. ఏదైనా కలిపించుకొంటే కలిపించుకోవచ్చు.

కొన్ని సమాసపు కూర్పులు బెంగాలీ మొదలైన భాషల్లోకి మల్లే చేయబడ్డవి. "వాసంతవుదయ", "ఈసుదిన యుదయాన", "సదనవుద్యాన". మిశ్ర సమాసాలు వదలి పెట్టినా ఈసంధులు భాషలో ఎల్లాకలుస్తవో! కొన్నిచోట్ల ఇంగ్లీషు భావాల సంపర్కం తప్పనిసరిగా వచ్చింది. "ప్రేయసీ నీచూపులో తోడుకలిగించునది అదేదో వున్నాదే" ఇది (Companionship) ఈయన ప్రేమసిద్ధాంతమునకు ఈభావానికి పొసగదు.

దోషాలకేమి? భావము వ్యక్తీకరించటానికి సాంకర్యం పొందిన భాష అడ్డం వస్తుంది. అచ్చమైన భాష అయితే ఆ భాషలో అర్థము ప్రసన్నమయ్యేట్లు చెప్పఁగలిగితే కావ్యం అందమిస్తుంది. ఆ భాష వాడుక భాష అయినా కావచ్చు. గ్రాంథికమైనా కావచ్చు. కాని తెల్గుభాష కావాలి. కొన్ని వాడుక భాషలో చెప్పఁదగిన భావాలు చెప్పఁదలచినచోట్ల - గ్రాంథికంలో చెపితే "దుహితా! మార్జాలములు క్షీరములు గ్రోలుచున్నవి. పశ్య! పశ్య!" యన్నట్లు హాస్యము పుట్టించును. లోకములో మనమెప్పుడూ మాట్లాడుకోని ఉదాత్త విషయాలు వాడుక భాషలో చెపితే వాడుకభాషలో శబ్దాలూ దొరకవు. ఆ రచనకు పేలవత్వమూ పడుతుంది. అటువంటి కావ్యానికి పూర్వులు చెప్పిన కావ్యత్వం సిద్ధించదు. అందుచేత సంస్కరింపఁబడిన భాష, వస్తువున కుచితమైన భాష సర్వకవి స్వీకరించాలి. వ్యక్తిగతమైన ఇష్టానిష్టాలతో సారస్వతం మీదికి దండెత్తరాదు.

ఈకవి గ్రాంథిక భాషవైపుకే మొగ్గు చూపిస్తాడు. మాటలలో మార్దవంకోసం సౌకుమార్యంకోసం ప్రయత్నిస్తాడు. ఉన్నదోషాలు, గుణాలు విస్తారంమీద చూపించాను. ఇతని కవితాశక్తి అఖండమైనది. అనేకమంది క్రొత్తకవులకు ఈయన దోషాలన్నీ వున్నా ఈయన కవితాశక్తి లేదు. ఈయన పద్యపు ఊపులలో మధ్యమధ్య విరిగినా ఒక నడకవుంది. ఇందులోకొన్ని ఆయన చదువుతోంటే మరీబాగా వుంటవి. ఎందుచేతనంటే ఒక జానపదగీతం యొక్కఫణితిలో చదువుతాడు. ఊపుగా చదువుతాడు!

AndhraBharati AMdhra bhArati - kavitalu - viShNudhanuvu - (SiSh.hTlA umA) vijaya mahESvaramu Shishtla Umamaheswara Rao - Sishtla Umamaheswara Rao - kavitalu kavitvaM geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - telugu kavita - tenugu andhra ( telugu andhra andhrabharati telugu literature )