కవితలు బసవరాజు అప్పారావు గీతాలు మధుర స్మృతి

బసవరాజు అప్పారావు మధుర స్మృతి
         - దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి.

    "ఈ ప్రవాస యాత్రారతి ఇటులే నేను
     గదలిపోవుదు నాశావకాశములను,
     ఒక్కనిట్టూర్పు వోలిక, ఒక్క మౌన
     బాష్పకణమటు, ఒక గాఢవాంఛ పగిది."

కొన్నిస్మృతులు మంచులో కొండలలాగ కలిసిపోయి కంటికి దొరకవు. కొన్ని స్ఫుటంగా నిలిచి కనబడతూనే ఉంటాయి. వెనుకనున్న ఆకాశంమీద చిత్రింపబడ్డ తోపుల్లాగ. మరికొన్ని గాఢంగా స్ఫురిస్తూనూ ఉంటాయి స్థూలంగా దొరకనూ దొరకవు. వేసగి వేకువలో గాలితరగ లాగ, ఆ గాలితరగపైన కలిగొట్టు పూలవాసనలాగ. అప్పారావునకు సంబంధించిన స్మృతులు మూడవరకానివి.

నా కెప్పుడూ అప్పారావు ఎంతకూ చల్లారని కోరికలాగ కనబడతాడు. ఊరికే నిట్టూరుస్తూ ఉండే గుండె లాగ. అతన్ని తలచుకుంటే ఒకటి రెండు స్పష్ట సంఘటనలు గోచరించినా, ఎక్కువగా స్ఫురించేవి ఏవో ఆవేశాలూ, అలజడులూను. నలుగురమూ కలిసి కూర్చుని మాట్లాడుకునే టప్పుడు కూడా, ఒక్క నిముషము ఒక్కచోటునే కూర్చోలేక పోయేవాడు. అక్కడనుండి ఇక్కడికీ, ఇక్కడినుండి అక్కడికీ పచారుచేస్తూ, అంత సేపూ మాట్లాడుతూనూ, అప్పుడప్పుడు పాడుతూనూ, అడపా తడపా త్రుంచి త్రుంచి నవ్వుతూనూ.

దాదాపు నలభైఏళ్లక్రితం నాకూ బసవరాజుకూ నెయ్య మేర్పడింది యెంకిపాటల కవిద్వారా. సుబ్బారావూ నేనూ కాలేజీలో చదువుకునే వాళ్ళం. అప్పుడు అద్భుతరసంతో నిండిన మా మనస్సులకు అపరిచితమైన అమరలోకంలోనుండి అవతరించిన వాడులాగ కనపడేవాడు అప్పారావు.

ఏమిరోజులవి! అప్పటి మా మనస్సులు ఎప్పుడూ రెక్కముడుచు కోవడంలేదు. అప్పుడు మాకు గూడు లేర్పడలేదు. ఒకరి రెక్క అంచు మరొకరి రెక్క అంచుకు తగులుతూ ఉంటే, ఎగురుకుంటూ పోవడమే! నేలా, ధూళీ పిలుస్తుంటే మాకు వినబడేదికాదు. అంతేనా! ఒకరిగుండె మరొకరి గుండెలోనికి ఒలకబోసుకునేవారము ఆలపాలకడవల్లాగ. అప్పటికి గడసరితనంవచ్చి కాలుష్యమూ, కీర్తికామమూ మమ్మల్ని మనుష్యుల్ని చేయలేదు.

అప్పటికే బసవరాజు కవితాంగణములోనికి అడుగుపెట్టేశాడు. మే మిద్దరమూ, అంటే నండూరీ నేనూ, అప్పుడప్పుడు లోపలికి తలలు పోనిచ్చి తొంగిచూస్తుండేవారము.

మరి నాలుగేళ్ళయాక మరీ గొప్పరోజులు వచ్చాయి! తిరునాళ్ళ వంటివి. కాకినాడలో ఒక పదిమంది సాహితీపరులం చేరాము; ఒకటే కావ్యగోష్ఠి. పగలల్లా ఇంట్లోనూ, సాయంకాలమూ, మునిమాపూ, కొంత రాత్రీ ఊరివెలుపల ఇసుక బయలుమీద.

ఒకరికి "గుండె గొంతుకలోన కొట్లా" డింది. ఒక "రాకులో ఆక" యారు. ఒకరు చందమామను "పట్టి ముద్దా" డారు. ఒకరు "శిథిల వీణను నాపై త్రోయక నీవే పాడుకొ" మ్మన్నారు. బసవరాజు ఆ గోష్ఠికి ప్రాణం. ఊరకే మాట్లాడేవాడు, Wordsworth అనీ, Wattsdunton అనీ, పండితరాయలనీ, భవభూతిఅనీ, తిక్కన్నఅనీ, పోతన్నఅనీ! ఊరికే పాడేవాడు గురజాడవారి ముత్యాలసరాలూ, తన సెలయేటిగానములోని పద్యాలూనూ, వాటిలో ఈ పంక్తులు నాకు బాగా జ్ఞాపకం; అప్పుడు గుండెకు రగులుకుని కుతకుత మరిగేవి.

    "ప్రేమకుంగల్గు కారణం బేమనగల?
     మింతిరో నిన్నుజూడ ప్రేమించుట సుమి!
     ఇంతియేగాని వేర్వేర నెంచిచూచి
     అందపుం దళ్కులనె ప్రేమ మంద గలమె?
     తెలియ మాత్మను ఆత్మను కలిపి కుట్టు
     దారమే నాదుప్రేమకు కారణమని"

అప్పారావు అలా పాడుతుండగానే అందుకునేవాడు సుబ్బారావు; రివ్వుమని తారాజువ్వలాగా గొంతువిసిరేవాడు. అప్పుడు నండూరి గొంతు కొండవాగు. గలగలలూ గంతులూ, సుడులూ వడులూ - ఒకచోట పుట్టి, ఒకదారిని సాగి ప్రవహించి, ఒకచోట కలిసిపోయేది. సుబ్బారావు పాట నిభృతసుందరం; అప్పారావు పాట నిసర్గమనోహరం. బసవరావు పాటలో శక్తివేరు. చెప్పేనుకదా! అతను నిట్టూర్పు; అతని కావ్యం నిట్టూర్పు; అతని పాట కూడా వేడివేడి నిట్టూర్పు. కంఠం త్రుంపి త్రుంపి నాలుగుసార్లు మ్రోగించేవాడు. తునకలు తునకలుగా, అది మమ్మల్ని పిలిచి పిలిచి, దగ్గరగా వచ్చివచ్చి, మా గుండెలలోనికి ఒదిగిఒదిగి, తల నక్కడ ఆనించి, ఒక్కొక్కప్పుడు కుమిలికుమిలి, ఒక్కొక్కప్పుడు వెక్కివెక్కి ఏడుస్తూ కష్టసుఖాలు చెప్పుకునేది. అతని పాటకు నెత్తురుజీర అంటుకున్నట్టుండేది. బ్రతుకులోనుంచి బ్రద్దలుచేసుకొని ఒరుసుకొని వచ్చినప్పుడు అంటుకున్నట్టు. ఆ వేగమే, వేదనే అతని కవిత్వానికి ప్రాణం. కాస్త గాలి కదిలితే, తగిలితే, ఒక్కొక్క ఆకే కదిలి, అన్ని ఆకులూ కలిసి, అంతా నిలువునా ఒకపాటయైన రావిచెట్టులాగ ఉండేవాడు బసవరాజు.

అందుకనే ముప్పయి తొమ్మిదేళ్ళలో నూరేళ్ళబ్రతుకు అతనికి క్రిక్కిరిసిపోయింది. సుఖాలూ, దుఃఖాలూ, రాగద్వేషాలూ, ఆలింగనాలూ, అసూయలూ, శిఖరాలూ, అగాధాలూనూ. ఇంత అనుభూతివస్తే, ఇంత చిరుగీతి!

    "ఇంత చిరుగీతి యెద వేగిరించునేని
     పాడుకొనును, తాండవనృత్య మాడుకొనును."

అతను కవిత్వాన్నే బ్రతికాడంటారు కవిమిత్రులు కొందరు. అతని కావ్యాలలోకన్న అతని జీవితంలోనే కవిత్వం ఎక్కువ దొరుకుతుందని మరికొందరంటారు. అలాగనడంకన్న అతని కావ్యాలూ, అతని జీవితం ఒకటే నంటాను నేను. "సెలయేటిగానం", "గీతాలు" అతని రచనలన్నీ కలిసి అతని జీవితగాథ అయింది.

ఇంత అతనికి అనుభూతి రావడమేమిటి, పాటలోనో పద్యంలోనో అనెయ్యడమేమిటి! అందుకే అతని గీతాలలో అంతవేడి. పాటల్లో పల్లవి వచ్చేసరికే గుండెపట్టుకుంటుంది. వినేవాడిచేయి గట్టిగా పట్టుకుని ఎదురుగా కూర్చుండబెట్టుకుని, "నీవే, నీవే నా స్నేహితుడవు కనుక; మనమిద్దరమే ఉన్నాము గనుక చెపుతున్నాను సుమీ!" అన్నట్లు ఉంటుంది.

    "న న్నెవ్వరాపలే రీవేళ
     నా ధాటి కోపలే రీవేళ"

అని మొదలు పెట్టి

    "గుండె ఠాఠా మంటు కొట్టినట్టుగ నేటి
     పండితులు ఠారెత్తి పరుగుచ్చుకోవాలి"

అని అనడానికి సందేహింపడు. తన మనసులోనిదంతా ఆప్తుడితో చెప్పుతున్నాడుగదా! అతనికి లోకమంతా ఆప్తమిత్రమేకదా!

అలాగే ఏ గీతం తీసుకున్నానూ వేడిగా అనెయ్యడమూ, సూటిగా అనెయ్యడమూ, ఏమీ దాచకుండా అనెయ్యడమూను! ప్రేమగీతాలు, భక్తికీర్తనలు, కన్నబిడ్డలపై పాటలు - అన్నీ అంతే.

    "మంచిరోజు కాదోయి చందమామా
     మంచిది కాదోయి చందమామా!"

    "పాడదలచిన పాటలన్నీ నానోట
     పాడించ మనసాయెనయ్యా!"

    "మండిపోతున్న వండోయ్‌, లోకాలు
     మంటలార్పెయ్యంగ రండోయ్‌!"

    "ఎంతటి చపలుండనైతి
     ఎంతటి మందమతినైతి!"

    "కోయిలా కోయిలా కూయబోకే
     గుండెలూ బ్రద్దలూ చేయబోకే!"

    "లోకాని కుత్తుత్త దీపావళీ!
     నాకు మాత్రము దివ్యదీపావళీ!"

    "లేపనైనా లేపలేదే, మోము
     చూపనైనా చూపలేదే!"

ఈ గుణం వల్లనే, ఈ ఆప్యాయతవల్లనే ఇతని గీతాలు సామాన్య ప్రజకుకూడా అంత చనవైపోయాయి. దినదిన జీవితానకు, చలనచిత్ర లోకానకు అంత అవసరమైపోయాయి.

బసవరాజు మొట్టమొదటి భావకవి. అంటే భావకవిత్వానికి త్రోవ చూపినవాడనే కాదు; తరువాత వచ్చిన భావకావ్య జగత్తుకు ప్రవేశిక వంటివాడు. "ముందు ఇతని గీతాల శ్రేణిఎక్కు, తరువాత భావకావ్య లోకంలో పరిచితంగా విహరించవచ్చు" నన్నట్టు.

అయితే, అంతతొందరలో, అంతవేడిమిలో చీల్చుకువచ్చిన పాటను అంతనగ్నంగానూ, అలాగే, సరిగ్గా అలాగే, ఇవతలకి విసిరివేసినప్పుడు కల్పనకు అవకాశముండదు; శిల్పానికి స్థిమితముండదు.

అనుభూతిని నిదానంగా నెమరువేసుకుని - Recollection in Tranquility లోలాగ - అతను కావ్యంకట్టడు. అనుభూతి రావడమూ అనెయ్యడమూ ఒక్కమాటే జరుగుతాయి. మరొకవిశేషం. పాడుతూ వ్రాసేవాడేమో, బసవరాజు. అయితే కొంతవరకు అందరూ అలాగే వ్రాస్తారేమో; కాని అతనిపాట అంతర్వాహినికాదు; కేవలమూ అడుగున శ్రుతికాదు, పాటదే పైచెయ్యి. దానిబలం ఎక్కువై పోయేదేమో కూడా. మరి అతనికి కావలసింది "Relief which a timely utterance gives" అందువల్ల భావనా శిల్పాలులేని వెలితిని పాట భర్తీచేసేది. అందుకనే అతని రచనలు కొన్ని కావ్యాలలాగ కూర్చుని చదివేవికావు; గొంతెత్తి పాడేవి. అందుకనే పాడేటప్పుడు అతనిగీతాలకు ఉన్నశక్తి మరి ఏకవి గీతాలకూ లేదనిపిస్తుంది.

అందుకనే గూడా అతనెప్పుడోగాని మామూలుశబ్దాలను గాటి వెళ్లలేదు. ఎవరితోనైనా కష్టసుఖాలు వేగముతో వేదనతో చెప్పుకునేటప్పుడు ఆ పూర్వశబ్దాలకూ అల్లిక జిగిబిగికే పరుగెత్తుతామా? అతను రోజురోజూ నిముషనిముషమూ అల్లాగే చెప్పుకునేవాడాయెను. అతనికి కవిత్వమూ చెప్పుకోవడమూ ఒకటే ఆయెను. ఈ గుణంవల్లనే అతను గురజాడవారికి అనుచరుడు అయాడు; కొన్నికొన్నిచోట్ల అంతకన్న అధికుడయాడు. గురజాడవారిలో ఈ ఆప్తత, ఈ ఆర్ద్రత ఇంతగా లేవు. Wordsworth "సామాన్యభాషలో కవిత్వం చెప్పా"లని ఒకమతంగా అవలంబించి చేయాలని చేసినపని ఇత నింకొకలాగ చేయలేకచేసి ఊరుకున్నాడు. ఊరుకున్నాడా! పదిమందీ పరవశులై వినేటట్లు ఆలపించాడు.

దీనివల్ల ఒక్కొక్కప్పుడు Wordsworth లోలాగే పేలవమైన మాటలూ కాళ్ళుచాపేసి చతికిలపడే పంక్తులూ రావచ్చు. అయినా జీవద్భాషకు, వ్యవహారికభాషకు, ఇంతదగ్గిరగా కావ్యభాషను తీసుకువచ్చే ప్రయత్నం గొప్పపని కాదూ!

కవి మధురజీవితంలో, ఆ మబ్బు ఈ మబ్బు ఆకాశమధ్యాన అద్దుకున్నప్పుడు, చిట్టితల్లి బంగారపుబొమ్మ మంగళప్రదమ్మ అవతరించింది. అంతలో ఇతన్ని దేవుడు కత్తిపెట్టి పొడిచాడు. గాయం యింకా మానలేదు.

మంగళప్రద (కవి చిన్నపాప) మాయమయింది. "మరవలేదేనిన్ను మాకన్నతల్లీ" అని ఏడ్చాడు. "కోయి లొకసారొచ్చి కూసిపోయింది" అని పలవించాడు. ఇంతలో దీపావళి వచ్చింది. మనకందరికీలాగ ఉత్తుత్త దీపావళి కాదు. దివ్య దీపావళి! వేదాద్రి నరసింహదేవు డతనియింట దీపమైనాడు. పరమాత్ముడు వేంచేసి పటమటలంకలో ఉయ్యాలతొట్టిలో ఊగుతున్నాడు. కవి అమాయకుడూ, ఆశాజీవీని. పాపాయిరాకతో మళ్ళీ బ్రతుకు నందనమైపోయింది. ఇంతలో

    "వేదాద్రి శిఖరాన వెలిగిన్న జోతి
     మినుకు మని కాసేపు కునికిపోయింది!
     దేవలోకమునుంచి దిగినట్టి గంగ
     వచ్చిన్న దారినే పట్టి మళ్ళింది!
     పంజరం దూరిన బంగారుపిట్ట
     తలపు దీ సేవేపొ తర్లిపోయింది!
     కాపుర మొచ్చిన కన్ని పాపాయి
     యిల్లు కాళీచేసి వెళ్ళిపోయాడు!"

ఈ గీతం మా బసవరాజు పాటలన్నింటికీ కిరీటం. తుదిపంక్తి ఈ పాటకు తురాయి.

"ఇల్లు కాళీచేసి వెళ్ళిపోయాడు" ఎటువంటి మామూలు మాటలు! నిజానికి ఎంత పేలవమైన మాటలు! ఇక్కడమాత్రం మాటమనిషై ఎలాగ గుండెల్లో పొడిచింది! రోజూ ఎన్నిఇళ్ళో ఎందరో ఖాళీచేసి వెళ్ళి పోతున్నారు; మరికొందరు ఆ యిళ్ళల్లోకి వస్తూన్నారు. ఖాళీచేసినా ఖాళీగాని ఇళ్ళుఅవి. ఈ యిల్లువేరు. ఈ యిల్లు కిటికీతలుపులులేని అమాయకపు ఇల్లు. ఈ యిల్లు ఒక్కొక్కరు ఖాళీ చేసి వెళ్ళిపోయేదేగాని తిరిగిరాని యిల్లు. కొన్నియిళ్ళు బారుమని ఏడుస్తాయి; ఫరవాలేదు. ఈ యిల్లుశూన్యం; అబ్బ! దీన్ని పాపాయి ఖాళీచేశాడుగనక. ప్రపంచ కావ్యభాండాగారాల్లో గొప్పపంక్తుల్లో ఇదొకటి - "ఇల్లు కాళీచేసి వెళ్ళిపోయాడు!"

అప్పారావు కవిత్వంవల్ల ఏమిప్రయోజనంఅంటే, ఏమిచెప్పను? అతనికావ్యాలన్నీ చదివాక నిట్టూర్పు విడువకుండా కన్నీటితో చెక్కులు తడియకుండా ఉండలేము. ఆ కన్నీటి కెంతటిశక్తి ఉంది? ధూళీ దూసరా లేకుండా, శుభ్రంగా, శాంతంగా, సుందరంగా, వాన వెలిసిన తరువాత చెట్టులాగ చల్లని ఆవేశంతో రవంత ఊగుతూ నిలబడతాము!

అప్పారావుకు సంస్కృత సాహిత్యమన్నా, పురాణ భారత సంస్కారమన్నా వల్లమాలిన గౌరవమూ, అనురాగమూనూ. ఆంధ్రదేశమన్నా అంతే. వాయుపక్షాలమీద తెలుగునాడంతా తిరిగి సందేశమిచ్చినవాడు. భారత స్వాతంత్ర్యంకోసం పాటుపడినవాడు. కొల్లాయి కట్టుకున్న బోసినోటివానికి దాసుడైనాడు.

అయితే అతని దేశభక్తి సంకుచితమైనది కాదు. అతను యుగ లక్షణాలకూ, యుగధర్మాలకూ దూరుడుకాలేదు. రాగలయుగం ప్రజా బాహుళ్యానిదని తెలుసుకున్నాడు. ప్రాచ్యపాశ్చాత్య జగత్తునకు నడుమ కొండలూ గోడలూ లేవని తెలుసుకున్నాడు. ఆంధ్రకవిత్వచరిత్రలో వ్రాసిన తుదిపంక్తులివి -

"ప్రస్తుత మాంధ్రసాహితీ శ్రేయోభిలాషులకు ముఖ్యకర్తవ్యమేమన - తరతరములనుండియు శతశతాబ్దులనుండియు నిరంతరధారగా ప్రవహించుచున్న ఆంధ్రనాగరకతా స్రవంతిని ఆంధ్రసాహిత్యసీమను ప్రవహింపజేసి తత్ప్రవాహ సాహాయ్యమున ఆంధ్రసాహిత్యసీమను చక్కని వ్యవసాయము సాగించి, ఆంధ్రులకు పుష్టియు, తుష్టియు, శాంతియు, దాంతియు, వన్నెయు, వాసియు నిచ్చు కావ్యఫలముల కాయించుటయె యగును. ఆంధ్రసాహిత్యసీమను నాటుకుని, బెరిగి పెద్దదికాగల విజాతీయ కావ్యతరులతాదుల నాటించి వానిచే సజాతీయ, విజాతీయ సారసమృద్ధములగు కావ్యఫలముల కాయించుటయును మేలగును. ఇందులకు అన్యభాషా సంస్కారమును, అన్యసాహిత్య పరిచయమును అవసరములె యగును."

అప్పారావుది సమగ్రమైన గొప్పసంస్కృతి. దువ్వూరి రామిరెడ్డిగూడ ఇట్టివాడె.

1929లోనో, 30లోనో నేను మదరాసు నుండి పిఠాపురం వస్తున్నాను. పేసింజరులో తెల్లవారగట్ల కొవ్వూరుదాటి గోదావరిమీద పోతున్నాను. నాకు మెలుకువకాదు, నిద్దురకాదు. వంతెనమీద నడిచే ట్రెయిను హోరులో కలిసి ప్రక్క కంపార్టుమెంటులోనుంచి ఒకపాట వినబడింది.

    "ఈ మహా గహనాంతర సీమలోన
     నీవు శ్రీగిరి భ్రమరాంబ వేను మల్లికార్జునుడ"

ఈపాట పాడినవారు ఎవరు? మా బసవరాజా? అని సందేహము గలిగి గోదావరి స్టేషనులోదిగి ప్రక్క కంపార్టుమెంటులో తిలకించగా మా బసవరాజూ, అతని అర్ధాంగి రాజ్యలక్ష్మమ్మా - కవయిత్రి సౌదామనీదేవి - కూర్చున్నారు. ఎక్కడికి వెడుతున్నారన్నాను. ఉత్తరదేశయాత్రకు అన్నాడు. అతని దెప్పుడూ మజిలీలేని యాత్రే ఆయెను. అతని తత్త్వాన్నిబట్టి అతన్ని 'Gypsy' అనేవాళ్లం. ఒక పాట పాడమన్నాను.

    "బ్రతుకు బరువు మోయలేక
     చితికి చివికి డస్సివాడి
     పికరుపుట్టి పారిపోయి
     ఒకడనె ఏ తోటలోనొ
     పాటపాడుతుండగ నా ప్రాణిదాటి యేగేనా!
     ప్రాణిదాటి యేగుచుండ పాటనోట మ్రోగేనా!"

తరువాత మరి అతన్ని చూడలేదు. పాటపాడుతూపోయాడు. మా బసవరాజు. పోతూ పాటపాడాడు. రాగద్వేషాలుదాటి శ్రీశైల మల్లికార్జునస్వామి చరణ సన్నిధాన చివరకు మజిలీ దొరికింది. తానూ మంగళప్రదమ్మా, పాపాయీ ఉన్నారు అక్కడ. ఇక్కడ అతని ప్రాణానికి ప్రాణమైన రాజ్యలక్ష్మమ్మ, ప్రాణమిత్రులమైన నండూరీ నేనూ ఉన్నాము.

దే. వేం. కృష్ణశాస్త్రి.
సిమ్లాహౌస్‌,
త్యాగరాజనగరం.

AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - madhurasmR^iti - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )