కవితలు బసవరాజు అప్పారావు గీతాలు స్మృతులు, అభిప్రాయాలు

ఆంధ్రసారస్వతానికి 'కీట్సు'

బసవరాజు అప్పారావు - సన్నని మెత్తని దేహం. దేహం ఎంత మెత్తనో మనస్సు, భావం అంత మెత్తన. భావోన్మాది. మనస్సు పసిపిల్లవాడి దానివలె వంకర్లు లేనిది. ప్రేమపూరితమైంది. చిత్తవృత్తి ఎప్పుడూ సుఖమే కాని దుఃఖము లేదు మనిషిలో. నవ్వుతూ ఉండేది ఎప్పుడు మొగం. ఆశేగాని నిరాశ లేదు మనసులో. అతని మనస్సెంత ఉదారమో అందరూ అంతేననుకునేవాడు. అందుచేత కొందరు స్నేహితులు ఈయనను పిచ్చివాడనుకొనేవారు. మరికొందరు చిన్నతనమని నవ్వేవాళ్ళు. కాని నిజం చెప్పాలంటే తనకాలానికంటే పదిహేను సంవత్సరాలు ముందు పుట్టాడని చెప్పాలి. ఆయన కాలానికింకా ఆయన భావాలు కొత్తవి. అందుచేత కొందరికి హేళనగా ఉండేది. జీవించిన దినాలు కొద్ది అయినా సారస్వతంలో శాశ్వతస్థానం ఏర్పరచుకొని పోయినాడు. వేలపేజీలు చెత్త రాసిన వారికంటే చాలా సారస్వతసేవ చేశాడు.

ఆయన వాఙ్మయచరిత్ర కవిత్వాన్ని గూర్చిన ఒక భాష్యమనవచ్చు. అందులో చర్చించినన్ని విషయాలు యెందులోను చర్చించలేదు.

పాలమీద మీగడ వంటివాడు అప్పారావు. చిన్నతనంలోనే భావోన్మాదంతోనే తాను కోరుకొన్నట్లు పెదవులమీద కవిత్వంతో దిగులు, విచారం అనేది లేకుండా స్వర్గానికి ఆడుకోబోయినాడు అప్పారావు. 39 యేండ్లకే ఆయనకు నూరేండ్లు నిండినై.

ఈయనను ఆంధ్రసాహిత్యానికి 'కీట్సు' అని చెప్పవచ్చు.

- శ్రీ కురుగంటి సీతారామయ్య
("నవ్యాంధ్ర సాహిత్యవీధులు" నుండి)


Keats & Shelly rolled into one

(ఇదే అభిప్రాయం శ్రీ దువ్వూరి సాంబమూర్తిగారు తమ వ్యాసంలో ఇలా వ్యక్తం చేశారు. శ్రీ సాంబమూర్తిగారు కొంతకాలం మద్రాసు 'మెయిలు'లోనూ, కొంతకాలం బొంబాయి 'టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా'లోనూ, మరికొంతకాలం 'ఇండియను ఎక్స్‌ప్రెస్‌' విజయవాడ ఎడిషనులోను సంపాదకవర్గంలో పనిచేశారు.)

... ...

Appa Rao was a poet in his own right, Burns, Keats and Shelly rolled into one. To him a thing of beauty is a joy for ever and he held that beauty when unadorned, is adorned most. Song or verse came straight from his heart. There was not much of ornateness or unbelishment of his work.

Appa Rao belongs to a galaxy of modern poets - Gurazada, Abburi and Rayaprolu. Gurazada led the way but in my opinion he lacked the complete poetic temperement of both Abburi and Basavaraju. Gurazada was more a prophet than a poet. Barring a few verses in which he showed sparks of genius, most of his poetic work is didactic and bereft of colour and imagery. Appa Rao's latest songs spray from the saddist thoughts.

Burns, Keats and Shelly died when young. So also did Appa Rao. Though he is no more, he will live through his songs. He came into this world like a spring breeze and left it like a winter wind.

- Duvvuri Sambamurthy


నా కవిమిత్రుడు బసవరాజు అప్పారావు

బసవరాజు అప్పారావుకూ నాకూ తొలి సహచర్యం మద్రాస్‌లో కుదిరింది. తిరువళ్ళిక్కేణిలో కెల్లెటు హైస్కూలుకు ఎదురుగా మంచిమేడ వుండేది. అందులో "లా" కాలేజీలో, ప్రెసిడెన్సీ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు - పడుచువారు ఆరుగురు అద్దెకు ఉండేవారు. నేను విద్యార్థిని కాకపోయినా కలుపుకొన్నారు.

అప్పారావు - కురుగంటివారు - తిరువళ్ళిక్కేణిలోనే ఉండేవారు. నేనప్పుడు తృణకంకణ రచనలో ఉన్నాను. సాయంత్రం సముద్రం ఒడ్డున వ్రాసిన పద్యాలు వినిపిస్తూ వుండేవాడిని.

మైత్రి

తృణకంకణం అచ్చయి బయటకు వచ్చింది. అప్పారావుకు కూడా ఒక కాపీ ఇయ్యడానికి తెచ్చాను. ఆ సాయంత్రానికి ఆయన అప్పటికి ముందే తృణకంకణం కొని, చదివి చేతపట్టుకొని మా బసకు వచ్చాడు.

ఆనాడు అప్పారావు ముఖంలో కొంత విశేషం చాయలు దేరుతూ కనిపించింది. ఆనాడు సముద్రం ఒడ్డున అందులో గీతలు పెట్టుకొన్న పద్యాలన్నీ ఆయనే చదివాడు.

మరునాడు సూటిగా నా గదికి వచ్చాడు. ఏవో కొన్ని సంగతులు వెల్లడించాడు. ఆ ధోరణిలో మనసు విచ్చి స్వచ్ఛందంగా ప్రసరించే వాలకం కనబడ్డది. అప్పటినుండి మా పరిచయం స్నేహంగా చిగురువోసి, మైత్రిగా కొమ్మలు సాగింది.

అప్పారావులో ప్రధానంగా - ప్రస్ఫుటంగా ఒక గుణం కనిపించేది. విడుపు విరామమూ లేని ఒక చురుకుతనం ఆయనను ఆవహించి ఉండేది. పట్టుమని పదినిముషాలు కూర్చోలేడు. పెదవి కదిపితే ఆ ధార

అలా వెళ్ళుతూ బిరబిరలాడవలసిందే.

అప్పారావు చామనచాయ మనిషి. పలచని చెక్కిళ్ళు, కోలముఖం. కోణం తీర్చిన నాసిక - కండ్లు కొంచెము లోతుగా ఉండేవి. కాని చూపులో ఒకవాడీ - ఒక నిశితవర్చస్సూ కనబడేది. ఆయన బుద్ధి అతిసూక్ష్మము. చదువులో కూడా పాదరసంవలె ప్రవహించేదట. పాఠ్యపుస్తకాలే చదివితే, ఆయన ఏ ఫస్టుక్లాసులోనో రాక తప్పుతుందా అనేవారు మిత్రులు. ఎప్పుడూ ఏదో కూనిరాగం గొంతులో మెదులుతూనే ఉండేది. పద్యమైనా పాటైనా చదివితే చక్కగా వినిపించేది. పదాలలో ఉన్న పరుష సరళస్వభావం గమనించేవాడు. సంధులు త్రెంచేవాడు.

కన్యాశుల్కం

ఇంతలో గురజాడవారి కన్యాశుల్కం మా విడిదికి వచ్చింది. వసంతవాడ సోదరులు మాతోనే ఉండేవారు. వారిది విశాఖపట్టణం. వస్తూ వస్తూ అప్పుడే ప్రకటితమైన ద్వితీయ ముద్రణం కాపీ తెచ్చారు. అందరమూ చదివాము. అందరిలోనూ ఏదో అంతఃస్ఫురితం కలిగింది. అధికారికంగా మా అప్పారావులో ఉద్ధృతమైన ఉద్బోధం కనబడ్డది. రెండుమూడుసార్లు కన్యాశుల్క పాత్రలను గురించి నాతో చర్చకు దిగాడు. బాగా జ్ఞాపకమున్నది. గిరీశం ప్రవృత్తిభావాలు లోకంలో వున్నవి. వానిని లోకసిద్ధమైన భాషలో సుగమఘటితం చేయడమే కావ్యమని వాదించాడు. దానితో ఆయనలో, ఆయన రచనలో ఒకమార్పు, ఒక తీర్పు కనబడింది. 'కావ్యదేవత నోట కవిత విన్నానే' అని ఒక గీతం ఉండాలె. అది ఆ ప్రాంతాన వ్రాసిందే.

- రాయప్రోలు సుబ్బారావు
("వాణి" సంపుటం 13 సంచిక 4 నుండి)


భావకవిచంద్రుడు బసవరాజు అప్పారావు

ఆగ్రానగరంలో ఒకనాడు పత్నీసమేతముగా పండువెన్నెలలో అప్పారావుగారు తాజ్‌మహలును తిలకించి పరవశించిపోయారు. రసాప్లుతమైన ఆనాటి వారి హృదయస్పందనమే తాజ్‌మహల్‌ గేయముగ రూపొందింది.

    మామిడిచెట్టును అల్లుకొన్నదీ
    మాధవీ లతొకటీ
    యేమా రెండింటి ప్రేమసంపదా
    యింతింతనలేమూ

    చూడలేక పాపిష్టి తుపానూ
    ఊడబీకె లతనూ
    మోడయిపోయీ మామిడిచెట్టూ
    మొగము వేలవేసీ
    ... ... ...
    మామిడిచెట్టూ మాధవిలతతో
    మాయలో గలసింది
    కామితమిచ్చే మామిడిపండూ
    కవులకు మిగిలింది!

అకాలమృత్యువువాత ముంతాజ్‌ బేగము పడిపోయినదని కవిహృదయం ఆక్రోశించింది. షాజహాన్‌ చక్రవర్తి ప్రేమచిహ్నమే తాజ్‌మహలుగ రూపుగట్టి సాక్షాత్కరిస్తుంది కదా యని ఊరటజెందినది.

అప్పారావుగారి జీవితగాథకు ఈ గేయపంక్తులు భాష్యముగ వరలుచున్నవి. మామిడిచెట్టుకు చుట్టుకొన్న మాధవీలతను పాపిష్టి తుపాను పొట్టలో పెట్టుకుంటే, అప్పారావు జీవితగాథలో మామిడిచెట్టునే కూకటివ్రేళ్ళతో ఝుంఝామారుతము పెకలించివేసింది. ముప్పదితొమ్మిది సంవత్సరాలు నిండకనే కవి, విమర్శకుడునైన అప్పారావుగారు కన్నుమూశారు (10 జూను 1933). ఆంధ్రసాహిత్య లోకమునకు రసాలఫలసదృశములగు వారి గేయములు, కథలు, వ్యాసములు మాత్రము మిగిలిపోయినవి.

అప్పారావుగారు పుట్టుభోగి. "మేకపిల్ల తోడేలుతో మించి పోరినట్టి మేల్‌ పోతుగడ్డ మా పట్టణమ్ము" అని ధీమాతో చెప్పుకొన్న నూజివీడు కవిగరి జన్మభూమి. నూజివీడు సంస్థానములో దీవానులుగ, దానధర్మశీలురుగ పేరుమోసిన బసవరాజు వారి కుటుంబములో 13 డిశంబరు 1894 తేదీన అప్పారావుగారు జన్మించారు. పుట్టిన రెండు సంవత్సరములలో మాతృమూర్తి వెంకమ్మగారిని కోల్పోయినారు. తండ్రిగారైన పిచ్చయ్యగారు తిరిగి వివాహమును చేసికొనుటకు మనస్కరించక అప్పారావు, అతని అప్ప (నాలుగేండ్ల బాలిక)తో విజయవాడకు మూడు మైళ్ళలో నున్న పడమటగ్రామమందలి అత్తగారింటికి కాపురం మార్చారు.

అప్పారావుగారి మాతామహులు గోవిందరజువారు ఆగర్భశ్రీమంతులు. జమీందారీ కుటుంబము. తల్లిలేని లోటు కానరానీయక తాత, మేనమామగార్లు, అత్తలు మీదిమిక్కిలి అవ్వగారు అప్పారావుగారిని పెంచినారు. వీధిబడిలో విద్యాభ్యాసం జరిగింది. విద్యావంతులగు తాతగారు, మేనమామలు అప్పారావుగారి చదువుసంధ్యలలో అమితశ్రద్ధ వహించి చక్కని పునాదులు వేసినారు.

వీధిబడి చదువు ముగిసినంతనే విజయవాడ సి.యం.ఎస్‌. స్కూలులో స్కూలుఫైనల్‌ చదివి, తర్వాత ఇంటరు నుండి బి.యల్‌. వరకు మద్రాసులో చదివారు. పాఠ్యభాగముల శ్రద్ధ వహించి చదివినది లేదు. కాని సాహిత్యగోష్ఠులలో ప్రొద్దులు పుచ్చెడివారు. ప్రత్యేకించి విద్యాసంస్థగ పరిగణింపబడినారు. కురుగంటి సీతారామయ్య, రాయప్రోలు సుబ్బారావు, నండూరి సుబ్బారావు, పాటిబండ అప్పారావు, కోలవెన్ను రామకోటేశ్వరరావు, అడవి బాపిరాజుగారు మున్నగు సాహిత్య ప్రియులు గోష్ఠులలో పాల్గొనేవరు. ఇంటర్‌ చదివే రోజులలో గేయములు, విమర్శనవ్యాసములు వ్రాయ ప్రారంభించినారు, ఆంధ్రపత్రిక,గ్రంథాలయసర్వస్వము మున్నగు పత్రికలలో వీరి కృతులు ప్రచురితములయ్యెడివి. దేశోద్ధారక నాగేశ్వరరావుగారిచే స్థాపింపబడిన 'భారతి' మాసపత్రికలో బి.యల్‌. చదువుచు సహాయసంపాదకులుగ చేరి సమర్థవంతముగ సంపాదకతం నిర్వహించినారు. ఆ రోజులలో అరేబియన్‌ నైట్సు కథలను తెలుగులో అనువదించినారు. ఆంధ్రకవిత్వచరిత్రను రచించినారు.

- శ్రీ చేకూరి చెన్నకృష్ణయ్య


కీర్తిశేషులగు బసవరాజు వేంకట అప్పారావుగారు, బి.ఏ., బి.యల్‌.
(జననము 13-12-1894, నిర్యాణము 19-06-1933)

ఈ కవి ఆంధ్రనియోగి బ్రాహ్మణుడు, కౌశిక సగోత్రుడు. తండ్రి పిచ్చయ్యగారు. తల్లి వెంకమ్మగారు. కృష్ణాజిల్లాలో బెజవాడ దగ్గరున్న పటమట గ్రామమున మేనమామలగు గోవిందరాజులవారియింట పుట్టి పెరిగెను.

ఈతడు ఆరవఫారము వరకు బెజవాడ C.M.S.హైస్కూలులో చదివి 1912లో స్కూలుఫైనలు పరీక్షలో నుత్తీర్ణుడయ్యెను. తరువాత చెన్నపురిలొని ప్రెసిడెన్సీ కళాశాలలో చదివి 1916లో బి.ఏ. పట్టమునందినాడు. తదుపరి కొన్నాళ్ళు ఆంధ్రపత్రికకును, కొన్నాళ్ళు భారతికిని సహాయ సంపాదకుడుగ నుండెను. 1926లో బి.యల్‌. పట్టమునంది 1927లో బెజవాడలో న్యాయవాదవృత్తిలో బ్రవేశించెను. 1932 సంవత్సరాంతమున న్యాయవాదవృత్తి చాలించి పత్రికా నిర్వహణోద్యోగమున జేరదలచి ఢిల్లీకి వెళ్ళెను. అచ్చటనే మనోవైకల్యము గలిగి స్వగ్రామమునకు వచ్చి కొన్ని నెలలలోనే ఈశ్వరసాన్నిధ్యము జేరెను.

ఈతడు బి.ఏ. చదువుచుండగనే తన మేనమామ కొమార్తెయగు శ్రీ వేంకటరాజ్యలక్ష్మమ్మగారిని పరిణయమయ్యెను. ఈ దంపతులకొక కొమార్తెయు, నొక కొమారుడును గలిగిరి గాని బాల్యముననే మరణించిరి.

అప్పారావు వాయుసందేశమను పద్యకావ్యమును రచియించెను గాని దాని వ్రాతప్రతి కనబడలేదు. ఈతని వచనరచనలలో ఆంధ్రకవిత్వచరిత్ర మచ్చుపడినదిగాని, ఆంధ్రచరిత్రము, అరేబియ\న్‌ నైట్సుకథలు అచ్చుకాలేదు.

దేశాటనమన్నను, వినోదగోష్ఠియన్నను, కవిత్వమన్నను అప్పారావుకు ప్రీతి. ఈతడు దర్శించని మహానగరముగాని, పుణ్యక్షేత్రముగాని లేదు. ఈతడు చవిచూడని సారస్వతవిశేషమును గానరాదు. ఈతడు గొప్పవిద్వాంసుడు, విజ్ఞాని, రసికుడు. ఈతడు ప్రేమసాగరుడని చెప్పవచ్చును.

ఈతని గీతములందు కనబడు గొప్పలక్షణ మీ ప్రేమతరంగములే. ఈతని కవిత్వము భావగర్భితమై రసపూరితమై హృదయరంజకముగ నుండును. ఈతడు తన సుఖదుఃఖములను గాని, మనోభావములనుగాని యెంతమాత్రము దాచడు. ఈ కవి నిజముగా భావకవిసమ్రాట్టేయనుటకు సందియము లేదు.

- దిగవల్లి వేంకట శివరావు. B.A., B.L.


పీఠిక

'ఆనందో బ్రహ్మ యటన్న ప్రాబలుకు నంతర్బుద్ధి నూహింపుమా' యని శంఖారావము జేయు వరూధిని ప్రణయబోధ "ప్రాణములకన్న నెక్కుడు ప్రాణమైన" ప్రవరాఖ్యుడు పెడచెవింబెట్టి త్రోసివేయ, నా పొంతనే కైతలల్లుచున్న నా చెవులబడి, నిమేషమ్మున నదృష్టపూర్వ శోభాభాసమాన ప్రణయకవితారాజ్యమునకు నన్ను గొంపోయి, కొండొక 'మందార వనాంతరామృత సరఃప్రాంతేందుకాంతోపల వేదికపై' పారవశ్యావస్థను విడియించి యెటనో మాయమైపోయెను. నిద్దుర లేచునప్పుడు మాత్రము 'వత్సా! విశాల దృష్టి సర్వముం గాంచి యనుభవించి, మరువ కనుష్ఠింపుమా సమంజసబుద్ధిన్‌' అను పలుకులు చెవుల మ్రోగుచుండె. లేచి తత్సీమా సౌభాగ్యమెల్ల దనివిదీర ననుభవించి వికసిత హృదయుండనైతి. నాటగోలె నానందోపాసినై, సర్వమానందమయముగ భావించి దైవకృప నాకుదయించిన కవితాకన్య నానందాలయసేవనే నియోగించితిని.

మా కవితాకన్య చిన్నతనమున నుండియు రాగిణి. భావనోద్దీపిత గానలోల రసజీవిని. వెన్నవలె మెత్తనౌ కన్నెవలపులు కరగి కాలువల జాలువారకమున్నె, చుక్కలలోని చందురుకన్న నెక్కుడు బెట్టుసరియు, నపురూపుడును, లోకాతీతుండును నగు నా దేవదేవునిపై వెఱ్ఱిప్రేమ నించి ప్రణయసిద్ధి గాంచమి వేదన స్రుక్కుచు నాశల నల్లాడుచు, చింతాగానము జేయుచున్నది. "మండువేసవి విలపించు కొండసోన దీనగానమున కన్నను తీయనైన" యామె విరహిగీతముల కవితాపరిపాకము ననుభవరసికులే యెఱింగి గ్రహింతురుగాక. "పురాణమిత్యేవ న సాధు సర్వం, నచాపి కావ్యం నవమిత్యవద్యం. సంతః పరీక్షాన్యతరత్‌ భజంతే. మూఢః పరప్రత్యయనేయబుద్ధిః" అను మహాకవికాళిదాసు వచనముల రసహృదయులగు పాఠకులు పాటింతురు గాక.

-బసవరాజు వేంకట అప్పారావు
(ఇది కీ.శే. అప్పారావుగారు తన గీతముల వ్రాతప్రతిలో వ్రాసియుంచిన పీఠిక)

AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - smR^itulu, abhiprAyAlu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )