కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 005. చెవిటి మల్లయ్య పెళ్ళి
05. చెవిటి మల్లయ్య పెళ్ళి (శ్రీశైలయాత్ర)
హృదయమా! సంద్రముకన్న పది పదింత
లతివిశాలవు కమ్మ! దేవాధిదేవు
డగు మహాదేవు కరుణామృతంపు వాహి
నులను నీలోన కలుపుకోవలెను కాదె!
ఇది మహాదేవు సామ్రాజ్య మిచట నీకు
నీతిబాధల భయ మించుకేని లేదు
సకల శుభములు నొదవు నిస్సంశయమ్ము
శివునిపే రశుభాలకు చెంపపెట్టు!
పవను డనుకూలుడౌ దప్పి వాపికొనగ
కొండవాగులలో నీరు గ్రోలి తమిని
ఇటు నటులు జూడకే కాలు దిటముగాను
మెట్లపై నూని పైకెక్కు మృదులగాత్రి!
హరహరా, శంకరా, మల్లికార్జునుండ!
చేదుకో, చెవిటి మల్లయ్య చేదుకొమ్మ
టంచు, నుత్సాహమున పైకి నరుగుచుండ్రి
తోడి యాత్రికు లరుగోనె తోయజాక్షి!
మూట నెత్తినబెట్టుకా మూడుకాళ్ళ
ముసలిదే కర్ర బుచ్చుకు మోహరించి
యెక్కుచుండగ చెప్పెడి దేమికలదు?
పడుచు దంపతులము భయంపడగ దగునె?
పూలపాన్పులు బరచిన నేలపైన
గాలు బెట్టినతోడనే కందిపోవు
నవ్యనవనీతగాత్రి! నీ భవ్యమైన
భక్తియే ఊతగాగొని పైకి జనుమ!
పెళ్ళివేడుక జూచిపో బిలిచె నన్ను
చెవిటి మల్లయ్య, మాదె పైచేయి సుమ్ము
పెళ్ళికూతురు భ్రమరాంబ పిలిచె నంచు
పెంకితన మేలనే ఆడపెళ్ళిదాన!
ఈ మహాగహనాంతర సీమలోన
నీవు శ్రీగిరిభ్రమరాంబ, వేను మల్లి
కార్జునుడ, యాత్రికుల్‌ ప్రమథాదు లనుచు
సరస మాడుకొనుచు పైకి జనుద మబల!
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 005. cheviTi mallayya peLLi - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )