![]() |
కవితలు | బసవరాజు అప్పారావు గీతాలు | 004. నాగుల చవితి | ![]() |
04. నాగుల చవితి |
నీ పుట్టదరికి నాపాప లొచ్చేరు పాపపుణ్యమ్ముల వాసనే లేని బ్రహ్మస్వరూపులౌ పసికూనలోయి! కోపించి బుస్సలు కొట్టబోకోయి! నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి! |
చీకటిలోన నీ శిరసు తొక్కేము కసితీర మమ్మల్ని కాటేయబోకు కోవపుట్టలోని కోడెనాగన్న పగలు సాధించి మాప్రాణాలు దీకు నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి! |
అర్ధరాత్రీవేళ అపరాత్రీవేళ పాపమే యెఱగని పసులు తిరిగేని ధరణికి జీవనాధార మైనట్టి వాటిని రోషాన కాటేయబోకు నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి! |
అటు కొండ యిటు కొండ ఆ రెంటినడుమ నాగులకొండలో నాట్యమాడేటి దివ్యసుందరనాగ! దేహియన్నాము కనిపెట్టి మమ్మెపుడు కాపాడవోయి! నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి! |
పగలనక రేయనక పనిపాటలందు మునిగి తేలేటి నా మోహాలబరిణె కంచెలు కంపలూ గడచేటివేళ కంపచాటున వుండి కొంప దీకోయి! నాగులచవితికీ నాగేంద్ర! నీకు పొట్టనిండా పాలు పోసేము తండ్రి! |
![]() |
![]() |
![]() |