కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 118. కామిని
118. కామిని (కల)
మల్లికలారా, యేటికి మీకీ
యుల్లాసము నా కెఱుగంజెపుడీ
ఉల్లమ యేటికి నిట్టులు దడ దడ
    నూరక కొట్టుకొనంగన్‌.
అది యేమో నా కనులకు గన్పడు
నతివ యొకో లే కచ్చరయో?
పస దిలకించగ నీ చెలి యప్సర
    భామలనుం దలదన్నున్‌.
వనిత సొగసు నా హృదయరాజ్యమును
వశము గొనియె బలవంతముగా, నీ
సతిప్రేమ గాంచుకంటెను మేలౌ
    సౌఖ్యము కలదే జగతిన్‌?
ఇంతీ! నీవేలోకముదానవొ
యెరుగ నొకించుక యైననుగానీ
నిను గన్న నిముసమందె నామది
    నీయందే తగిలెన్‌.
పున్నమచందురు సాక్షిగ నిపుడో
పొలతీ నను చేపట్టంగదవే
నిన్నే వలచితి నిజము నమ్ముమో
    కన్నెరొ నామాటల్‌.
మిన్నున చుక్కలు మినుకుమినుకు మని
మివులన్‌ కులుకుచు చోద్యము జూచెడు
కనుమా, పూదావుల గొని చల్లని
    గాలి వీచు మది యలరన్‌.
చందమామ యా పిల్లమబ్బు జొఱు
చందము నూఱక చూచెదవేలే?
అందకత్తెరో అటు జూడకుమీ
    ఆలకించు నా పలుకుల్‌.
తెలియనిబాసల నడ్డు జెప్పెదవు
నిలువం గలదే ప్రాణము చెలియా?
మాటలతో జాగేల చేసెదే
    మంచిది ముద్దొక టీవే.
ఆహాహా! యీ ముద్దు తీపి కల
యమృతమైనను సరియౌనే
సకియా, యిన్నాళ్లకు నాజన్మము
    సార్థక మయ్యెంగాదె?
అది యేమే, ఒక ముద్దు తోడనే
అంతమొందెనే మననెయ్యము చెలి?
దయమాలి యెచటి కొంటిగ నను వీడి
    దాటి పోయినావే?
చందమామ యా నల్లమబ్బుజారు
సందున నెచటికి మాయమైతివే?
సుందరి, నిముసము మెఱపు మెఱసి కను
    లందు దుమ్మునిడిపోతే!
అదియేమే నా జనకురూపు గొని
యడలించె దొడలు నీరై పోవగ
ముదిత వింత దుష్టచరిత వెవతెవె?
    మోహినివా? అల కామినివా?
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 118. kAmini - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )