కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 119. వరుస వావి
119. వరుస వావి (కల)
సకియ నేను గూడి సరస
సల్లాపము లాడుకొంచు
వాకిట నిలుచునియుండగ
వచ్చె నొక్క బేరగాడు
    సంతసరుకు లమ్మువాని
    చెంతజేరి సంతసమున
    వింతలెల్ల గాంచుచుండు
    నంతలోన నప్పుడటకు        సకియ...
చిన్ననాటి చెలిమితోడి
చెలులు వచ్చి మమ్ముగాంచి
వింతసంతసమ్ము జెలగ
"నింతి, యెవ్వరీత?" డనిరి.
    ముద్దుమోము నెల్లడ ముసి
    ముసి నగవులు మొలకలెత్త
    "నరరూపము దాల్చి దిగిన
    నారాయణమూర్తి" యనియె    సకియ...
"నరరూపము దాల్చి దిగిన
నారాయణమూర్తెగాని
అక్కరొ, మీ యిద్దరికిని
యెక్కడిదే చుట్టరికము?"
    వదనము వికసించి వెలుగ
    బదులుమాట జెప్పకుండ
    హృదయమునకు గట్టిగ న
    న్నదుముకొనుచు నవ్వె చెలియ    సకియ...
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 119. varusa vAvi - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )