కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 124. కోయిల
124. కోయిల
కూ యనుచు దీనముగ గూయు కోకిలమ్మ!
చింత నీకేలనే? యెంతో సంతసమున
సరసపల్లవ భాగ్యవసంతమందు
గున్నమావులపై నెక్కి కోర్కిదీర
లేజివుళ్ళను మెక్కుచు, లేతమనసు
గల పులుగ వౌట రాగంబు నిలుపలేక
హాయిచే సోల లోకంబు కూ యటంచు
కూయుదువు గాదె నెమ్మది కోర్కులూర!
    పరమసంతోషయుత గానపారవశ్య
    కలననొడ లెఱుంగకను జగంబు మరచి
    విస్ఫుటంబుగ బాడు నీ విమలగీతి
    నేడిటుల నింత దీనమౌనేమి చెపుమ?
    వెఱ్ఱిలోకంపు గోలను వెక్కిరింప
    మావి కడగొమ్మ గూర్చుని మధురఫణితి
    మనసు కరుగంగ 'నేల నో మనుజులార
    పోరు?' లని ప్రేమతత్వంబు బోధసేతె?
వెన్నెలల చంద్రుడెల్లెడ విరియజల్లి
వలపుకలిమిని మోమెల్ల చెలువుగుల్క
మోహమున మొగిలుకన్నియ మోము ముద్దు
గొనెడు చందము గాంచుమా కోకిలమ్మ!
అందరును సంతసమ్మున నలరువేళ
తాలవృక్షంపుటాకుల దాగి యేల
కో యనుచు విలపించెదు కోకిలంబ?
చెలియ నెడబాసినావె వెన్నెలవేళల?
    ఇల గల వియోగులందున నేనె కష్ట
    భాగ్యుడ నటంచు లోలోన వగచుచుండ,
    జత కుదిరినావె నావలె వెతల గుంద
    దుర్దశల వింతస్నేహితుల్‌ దొరుకుదురుగ!
    చెలియ నెడబాసి నెమ్మది చింత గుందు
    నేను పాల్గొనగల జుమీ నీదువెతల
    కష్టముల చవిజూచినగాని పరుల
    వెతలగాంచి కన్నీళ్ళను విడువగలమె?
మధురఫణితి కూ కూ యని మనసు కరుగ
సొదల జెప్పుచు చింతల సోలజేయ
గలవు నీ దీనమృదుగానకలన నదియె
నేరకుండిన వగతుమే నీదుగతికి?
అకట! నీ గానమహిమ నాకబ్బెనేని
మాటలం జెప్పగారాక మదిని పొంగి
పొరలెడు వియోగదుఃఖంపుతరగ లేచి
జగతి చింతల ముంపగా జాలదొక్కొ?
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 124. kOyila - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )