కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 011. లైలామజ్నూన్‌
11. లైలామజ్నూన్‌
"లైలనోయీ ప్రియా, కన్నులార గనవె!"
యనుచు పిలిచిన గొంతుక నానవాలు
బట్టినట్లుగ కనులిట్టె పైకినెత్తి
చటుకునను మూసి, మజ్నూను సంచలింప
కుండ జపమాలికం ద్రిప్పుచుండ జూచి,
లైల యనురాగ పవనసంచాల యౌచు
గద్గద క్లాంతి నిట్లను కరుణదోప,
"గట్టులను పుట్టలను దాటి కాననముల
గడచి యేళ్ళెన్నియో యీది, కట్టకడకు
సన్నిధిం జేర ఫల మిదా కన్నులకును?
మరచితో గాఢవైరాగ్య పరవశతను
లైలమున్నుండె నీ ప్రియురా లటంచు
లేక ద్రోహాత్మనౌ నాదు రాకచేత
భగ్న ప్రణయంపుగాథ జ్ఞాపకము వచ్చి
పాపినౌ నన్నుగాంచగా నోపలేవొ?
విధివశత చాపలమ్మున\న్‌, వేరొకనిని
పెండ్లియాడితినేగాని హృదయమెల్ల
నిండియుంటివి, నీవె నా నిశ్చలంపు
ప్రేమ, సర్వేశ్వరుండును నే మెఱుంగు?
నాథ! మన్నింపవే దయన్నాదు పాప
చయము, నెల్లప్పు డింక నీ చరణదాసి
నౌచు జీవమ్ము గడపెద నాథ, కనవె!
ప్రాణముల మరపించెడు ప్రాణమిచ్చి
దివ్య దివ్యామృతముకన్న దివ్యమైన
నీదు గానామృతము గ్రోలి, నిన్నుగూడి
నిభృత నికుంజ గృహముల నెల్లకాల
మీ నవోద్యానమున విహరింపనీవె?"
అనగ, మజ్నూను సూర్యునియట్లు వెలుగు
వదనమున గ్రమ్ము జడల నావలకు ద్రోసి,
కన్నులను విప్పి, లైలను గాంచి, నవ్వి
"లైలవా! కల్ల; నీ వెట్లు లైల వౌదు?
విశ్వమెల్లను దానయై వెలుగునామె
స్వచ్ఛ కాంతిదౌ సంఛిన్న శకలి వేమొ?
అంతియేగాని లైల వీవన్న నమ్మ
నిదిగో నాలైల నీకు జూపింతు గాంచు"
మంచు లైలా యనుచు గౌగిలించి లతల
పూవులను లైలా యంచు ముద్దుగొనుచు
పక్షులను లైలా యంచు పలుకరించి
పలుదిశల లైలా యంచు పరుగు లిడుచు
బోయె మజ్నూను ఆనందపురము జేర.
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 011. lailAmajnUn - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )