కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 139. నోము
139. నోము (వాయుసందేశము నుండి)
పూతకృష్ణానదీజలస్నాత యౌచు
సగము తడియారుచున్న వస్త్రమ్ము దాల్చి
శ్రమ మటంచు భావింపకే సంతసమున
గిరిశిఖర మెక్కి రామలింగేశ్వరునకు
భక్తి నభిషేక మొనరించి ప్రముదితాంత
రంగయై వాసగృహము జేరంగబోవు
చేరి, పూజాగృహమ్మున గౌరిదేవి
పసుపు విగ్రహమును వేదిపై నమర్చి
పూల కుంకుమాక్షతలను బూజ చేసి
వానిలో కొంచెము శిరస్సుపైన దాల్చి,
మాతకు బ్రణామ మొనరించి మహితభక్తి
దేవి కారగింపుగ నిడ్డ తీయజామ
పండు గైకొని ప్రేమమ్ము నిండుమదిని
తేనె లొలుక "అక్కా" యని దీనముగను
పంజరమునుండి పిలిచెడు పంచెవన్నె
రామచిల్కకు దినిపించి, 'శ్యామవిభుడు
చేతితోడ బెట్టకయె భుజింపుచుంటి
గాదె' యని గద్గదిక బల్కుకాంత గనుమ!
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 139. nOmu - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )